Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


అదిగో పుతిన్‌ సేనలను తరిమి కొడుతున్నాం ఇదిగో రష్యా ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతాలను తిరిగి తెచ్చుకుంటున్నాం అని గడచిన 658 రోజులుగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ, అమెరికా, పశ్చిమదేశాల నేతలు చెబుతూనే ఉన్నారు.పరిస్థితిలో మార్పు లేదు, రష్యా సైనిక చర్య కొనసాగుతూనే ఉంది. తమ ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలతో సహా త్వరలో ఎన్నికలు జరపబోతున్నామని ప్రకటించింది. దీంతో పశ్చిమ దేశాలు మరోసారి ఉక్రెయిన్‌ మీద దృష్టి సారించాయి.పోతున్న పరువును నిలుపుకొనేందుకు కొత్త ఎత్తుగడల గురించి మల్లగుల్లాలు పడుతున్నాయి.దాన్లో భాగంగానే హడావుడిగా జెలెనెస్కీని సోమవారం నాడు వాషింగ్టన్‌ రప్పించారు.ప్రారంభంలో తగిలిన ఎదురుదెబ్బల తరువాత రష్యా మిలిటరీ కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నది. గతం కంటే ఎక్కువగా సైనికులు, క్షిపణులు, మందుగుండును సమకూర్చుకుంది. ఇరాన్‌ నుంచి పెద్ద సంఖ్యలో యుద్ధరంగంలో వినియోగించే డ్రోన్లను సమీకరించింది. పశ్చిమ దేశాలు మిలిటరీ, ఆర్థికసాయం ఎంతచేసినా ఫలితం లేకపోవటంతో అమెరికా యంత్రాంగంలో ఆందోళన మొదలైంది. సైనిక చర్య వచ్చే ఏడాది కూడా కొనసాగితే అది జో బైడెన్‌ ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. ఓడిపోతున్న ఉక్రెయిన్‌కు మనమెందుకు సాయం చేయాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు ప్రశ్నిస్తున్నారు. దిక్కుతోచని జో బైడెన్‌ గత వారంలో పార్లమెంటులో మాట్లాడుతూ పుతిన్ను గెలవనివ్వకూడదు, అది మన జాతీయ, మన స్నేహితుల అంతర్జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఉక్రెయిన్‌కు మన సాయంలో అంతరాయం ఏర్పడితే పుతిన్‌ స్థానం బలపడుతుందని వాపోయాడు. వచ్చే ఏడాది జర్మనీలో జరిపే యుద్ధ విన్యాసాల తరువాత కొత్త ఎత్తుగడలకు ఒక రూపం వస్తుందని భావిస్తున్నారు. కొత్త వ్యూహంతో ముందుకు పోనట్లయితే ఓడే అవకాశం ఉందని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే 111బిలియన్‌ డాలర్ల సాయం చేశామని, అదంతా బూడిదలో పోసిన పన్నీరైనందున ఇంక సాయం అనవసరమని రిపబ్లికన్లు పెదవి విరుస్తున్నారు.ఇచ్చినదానితో సర్దుకొని పోరుసాగించాలి తప్ప ఎక్కువగా ఆశించవద్దని కూడా పరోక్షంగా సందేశాలిస్తున్నారు. ఎంత ఇస్తామనేది పక్కన పెడితే రానున్న సంవత్సరంలో గత రెండు సంవత్సరాలలో చేసిన మాదిరి సాయం చేసే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.


రానున్న రోజుల్లో గట్టి ప్రతిఘటన ఇస్తే వచ్చే ఏడాది చివరికి లేదా 2025లో రష్యాతో సంప్రదింపులకు అర్ధం ఉంటుందని, భారం మొత్తం ఉక్రెయిన్‌ మీద పెట్టే విధంగా అమెరికన్లు మాట్లాడుతున్నారు. ఎత్తుగడలను మార్చకపోతే మొదటి ప్రపంచ యుద్ధంలో 1916లో పెద్ద సంఖ్యలో సైనికులను పోగొట్టుకున్నా సాధించిందేమీ లేనట్లుగా ఉక్రెయిన్‌ పరిస్థితి ఉంటుందని హెచ్చరించినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రాసింది. ఎదురుదాడుల పేరుతో ఉక్రెయిన్‌ ప్రారంభించిన చర్యల్లో పెద్ద సంఖ్యలో మరణించిన, గాయపడిన సైనికులు ఉన్నట్లుగా కూడా పేర్కొన్నది.వియత్నాం, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వైఫల్యం మాదిరి 2023లో ఉక్రెయిన్‌ పరిస్థితి ఉందని విమర్శకులు పేర్కొన్నారు. చివరి యత్నంగా అమెరికా స్వయంగా తన సీనియర్‌ కమాండర్లు ఆంటోనియో అగుటో జూనియర్‌ వంటి వారు ఎక్కువ సమయం కీవ్‌లో, జర్మనీలో ఉండి సమన్వయం చేసేందుకు పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్‌ ఎదురుదాడుల్లో సాధించిందేమీ లేకపోగా అమెరికా అంచనావేసినదాని కంటే రష్యా సేనలు బలంగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు రష్యా ఎంతగా తన సేనలను బలపరుచుకుంటున్నదన్న అంచనాలో కూడా అమెరికా విఫలమైంది. ప్రస్తుతం ఇరవై శాతం ఉక్రెయిన్‌ ప్రాంతం రష్యా ఆధీనంలో ఉంది. అక్కడ రష్యా పాతిన మందుపాతరలు 1950 దశకంలో కొరియా యుద్ధం తరువాత మరెక్కడా లేని విధంగా ఉన్నందున ఉక్రెయిన్‌ సేనలు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. వాటిని తొలగించేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌ సేనలపై రష్యా హెలికాప్టర్లతో దాడులు చేస్తూ ఊపిరి సలుపుకోనివ్వటం లేదు. ఇరాన్‌, చైనాల నుంచి సేకరించిన రకరకాల డ్రోన్లను రష్యా ఉపయోగిస్తుండటంతో యాంత్రిక యుద్ధ స్వభావంలోనే మార్పు వచ్చిందని అమెరికా నిర్ధారణకు వచ్చింది.రష్యా ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలలో దేనిమీద కేంద్రీకరించాలనే అంశపై అమెరికా-ఉక్రెయిన్‌ నిపుణుల మధ్య ఏకాభిప్రాయం లేదని వెల్లడైంది. కోల్పోయిన ప్రాంతాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవాలని చూడవద్దని అమెరికా అంటోంది. యుద్ధం ముగియాలంటే ఉక్రెయిన్‌ కొంత భాగాన్ని రష్యాకు కోల్పోవాల్సి ఉంటుందని జెలెనెస్కీ రాక సందర్భంగా అమెరికా రిపబ్లికన్‌ సెనెటర్‌ జెడి వాన్స్‌ చెప్పాడు.


త్వరగా ముగియాలని మేము ఎంతగా కోరుకుంటున్నప్పటికీ సమీప కాలంలో ఉక్రెయిన్‌ పోరు ముగిసేట్లు లేదని, అందుకే వత్తిడిని మరింత పెంచాల్సి ఉంటుదని జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ అధికార సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ సమావేశంలో చెప్పాడు. మేం వూరికే వదలి పెడతామని పుతిన్‌ అనుకోవద్దని కూడా అన్నాడు. అమెరికా తరువాత ఉక్రెయిన్‌కు అతిపెద్ద మద్దతుదారుగా జర్మనీ ఉంది, భారీ మొత్తంలో ఆయుధాలను అందిస్తున్నది.పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నందున ఉక్రెయిన్‌కు అమెరికా అదనపు సాయం అందకపోతే ఉక్రెయిన్‌ గతి ఏమిటని అనేక మంది పశ్చిమ దేశాల విశ్లేషకులు ఆందోళన వెల్లడిస్తున్నారు.మార్చి నాటికి పదిలక్షల ఫిరంగి గుండ్లను అందించాలన్న లక్ష్యం నెరవేరేట్లు కనిపించటం లేదని, మరోవైపు ఉత్తర కొరియా నుంచి అంతకంటే ఎక్కువగా రష్యా పొందవచ్చని చెబుతున్నారు. తమ కంటే పది నుంచి 30 రెట్ల వరకు ఫిరంగి గుండ్లు రష్యన్ల వద్ద ఉన్నాయని ఒక ఉక్రెయిన్‌ సైనికుడు చెప్పినట్లు జర్మన్‌ పత్రిక డెర్‌ స్పీగల్‌ రాసింది. పశ్చిమ దేశాలను మించి రష్యా ఫిరంగి గుండ్లను ఉత్పత్తి చేస్తుండగా ఉత్తరకొరియా నుంచి వస్తున్నవి అదనమని, పశ్చిమ దేశాల రాజకీయాల్లో ఉన్న అనిశ్చితి కారణంగా ఉక్రెయిన్‌ నిలబడగలదా అంటూ, అమెరికా సాయం లేకుంటే ఐరోపా మద్దతు కుప్పకూలిపోతుందని ఎకానమిస్ట్‌ పత్రిక రాసింది.


ఆంక్షలతో పశ్చిమ దేశాలు తమ బాంకుల్లో ఉన్న రష్యా సొమ్ము 300బిలియన్‌ యూరోలను స్థంభింప చేసినా, అనేక ఆంక్షలను విధించి అమలు జరుపుతున్నా ఇప్పటి వరకు పుతిన్‌ తట్టుకొని నిలిచాడు. పశ్చిమ దేశాలు వేసిన అంచనాలన్నీ తప్పాయి.చైనాతో సంబంధాలను పెంచుకొని పశ్చిమ దేశాల ఆంక్షలను నిర్వీర్యం చేశాడు. ఆంక్షల కారణంగా గతేడాది ఆర్థిక ఉత్పత్తి 2.1శాతం తగ్గినా ఈ ఏడాది 2.8శాతం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. జనాభాలో 80శాతం మంది పుతిన్‌కు మద్దతు పలుకుతున్నట్లు సర్వేలు తెలిపాయి. అయితే రానున్న రోజుల్లో ఆర్థిక సవాళ్లను కూడా తక్కువగా అంచనా వేయనవసరం లేదు. తొలిదశలో మాదిరి దూకుడుగా ముందుకు పోకుండా మధ్యలో గట్టిదెబ్బలు కొడుతూ ఉక్రెయిన్‌కు ఊపిరి సలపకుండా రష్యా చూస్తున్నది.అలసిపోయి దారికి రాకతప్పదనే అంచనాలో ఉంది.వచ్చే ఏడాది మార్చినెల 17వ తేదీన జరిగే ఎన్నికల్లో మరోసారి పుతిన్‌ పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.


సరిగ్గా జెలెనెస్కీ వాషింగ్టన్‌ పర్యటనకు వెళ్లినపుడే తాము నిర్మిస్తున్న అణు జలాంతర్గాములలో రెండింటిని మిలిటరికీ అప్పగించినట్లు ప్రకటించారు.మొత్తం ఎనిమిదింటిని రష్యా నిర్మిస్తున్నది.రాజధాని కీవ్‌ నగరం మీద మంగళవారం తెల్లవారు ఝామున డ్రోన్లు, క్రూయిజ్‌ క్షిపణుల కంటే వేగంగా ప్రయాణించే ఎనిమిది ఖండాంతర దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా ప్రయోగించింది. వాటిని మధ్యలోనే కూల్చివేయటం ఎంతో కష్టం. ఉక్రెయిన్‌కు మద్దతుగా బ్రిటన్‌ రెండు నౌకలను నల్లసముద్రంలోకి పంపుతున్నట్లు ప్రకటించింది. సముద్రంలోనూ భూమి మీద ప్రయాణించే సాయుధశకటాలను కూడా అది పంపుతున్నది. ఇటీవలి కాలంలో పుతిన్‌ రక్షణ ఖర్చును భారీగా పెంచుతున్నట్లు ఎకానమిస్ట్‌ పత్రిక పేర్కొన్నది. వచ్చే ఏడాది జిడిపిలో ఆరుశాతానికి పెంచనున్నారని, ఇది సోవియట్‌ యూనియన్‌ కూలిన తరువాత ఎక్కువ అని పేర్కొన్నది. రష్యా వృద్ధిరేటు ఈ ఏడాది ప్రారంభంలో ఒక ఒకశాతం ఉండగా మూడుశాతానికి పెరుగుతుందని రేటింగ్‌ సంస్థలు పేర్కొన్నాయి.


ఉక్రెయిన్‌ పోరు ప్రారంభంలో పశ్చిమదేశాల ఆర్థికవేత్తలు వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి.విధించిన ఆంక్షలు పని చేయటం లేదు, ఈ స్థితిలో రష్యాను ఎలా దారికి తేవాలా అన్నది పశ్చిమ దేశాలకు తోచటం లేదు. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన ఐరోపా యూనియన్‌ సమావేశంలో జరిగిన సమీక్షలో డజనుకుపైగా చైనా కంపెనీలు రష్యా మిలిటరీకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. చైనాను వారేమీ అదుపు చేయలేరు. తొలి రోజుల్లో ఆంక్షలు పని చేసినట్లు కనిపించినా తరువాత కాలంలో వాటిని అధిగమించినట్లు నిర్ధారణకు వచ్చారు.నాటో సభ్యురాలు టర్కీ, కజకస్తాన్‌, ఇరాన్‌, ఉత్తర కొరియా వంటి దేశాలు రష్యాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి. అమెరికా తయారీ మందుగుండు కూడా రష్యాకు చేరుతున్నట్లు సమావేశంలో వెల్లడైంది.కజకస్తాన్‌ వంటి దేశాల దిగుమతులు పెరిగిన తీరు చూస్తే మూడవ దేశాల ద్వారా ఐరోపా కంపెనీల యంత్రాలు, విడిభాగాలు రష్యాకు చేరుతున్నట్లు అనుమానిస్తున్నారు.హంగరీ, ఎస్తోనియా వంటి ఐరోపా దేశాలు రష్యాతో సంబంధాలను కలిగి ఉన్నట్లు సమీక్షలో పేర్కొన్నారు.గతంలో సోవియట్‌ మాదిరి ఇప్పుడు రష్యా తనకు అవసరమైన మిలిటరీ పరికరాలను నూటికి నూరుశాతం సమకూర్చుకోగలిగిన స్థితిలో ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఆంక్షలను ఉల్లంఘించినట్లు ఒకవైపు చెబుతూనే అలాంటి కంపెనీలపై తీసుకున్న చర్యలేమిటో చెప్పలేని స్థితిలో ఐరోపా సమాఖ్య ఉంది.దాదాపు పదహారు వందల ఐరోపా కంపెనీలు రష్యాలో లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. కొన్ని మద్యం కంపెనీలు రష్యా నుంచి వెలువలికి వచ్చినట్లు ప్రకటించినా వాటి ఉత్పత్తులు అక్కడ దొరుకుతున్నాయని ఐరోపా సమాఖ్య అధికారులు వాపోతున్నారు.