Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళలో రాజ్యాంగ యంత్రం విఫలమౌతోందంటూ కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది రాష్ట్రంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేస్తానని బహిరంగంగా బెదిరించటం తప్పమరొకటి కాదని భావిస్తున్నారు. సాధారణంగా రాష్ట్రపతి పాలనకు నాలుగు ప్రధాన కారణాలతో గవర్నర్లు సిఫార్సు చేస్తారు, వాటిలో రాజ్యాంగబద్ద యంత్రాంగం విఫలమైందన్నది ఒకటి. తనకు వ్యతిరేకంగా కాలికట్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన బానర్లను తొలగించాలని గవర్నర్‌ పోలీసులను ఆదేశించి ఒక వివాహానికి వెళ్లారు. తిరిగి ఏడు గంటలకు వచ్చిన సమయంలో బానర్లు అలాగే ఉండటాన్ని చూసి గవర్నర్‌ ఆగ్రహించారు. సిగ్గులేని జనాలు అంటూ పోలీసుల మీద నోరుపారవేసుకున్నారు.ఆగ్రహంతో అటూ ఇటూ తిరుగుతూ ఎస్‌ఎఫ్‌ఐ విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్నది, వారు బానర్లు కడుతుంటే మీరు చూస్తున్నారు అంటూ చిందులు వేశారు.కాలికట్‌ విశ్వవిద్యాలయంలో తనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బానర్లను వైస్‌ ఛాన్సలర్‌ ఎలా ఆమోదించారో సంజాయిషీ అడగాలని గవర్నర్‌ రాజభవన్‌ కార్యదర్శిని ఫోన్లో ఆదేశించారు. తరువాత బానర్లను తొలగించారు. ఈ పరిణామం తరువాత రాజభవన్‌ ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే బ్యానర్లను ఏర్పాటు చేశారని, అది గవర్నర్‌ను అవమానించటమేనని, దీన్ని గవర్నర్‌ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు దానిలో పేర్కొన్నారు. తన మీద కుట్ర జరిగిందని, ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా బానర్ల ఏర్పాటు జరగదని, కావాలని ముఖ్యమంత్రి చేయిస్తున్న ఇలాంటి చర్యలు రాజ్యాంగ యంత్రాంగం విఫలం కావటానికి దారి తీస్తుందని హెచ్చరించింది. కాగా తెల్లవారే సరికి వందలాది బానర్లను ఏర్పాటు చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ ప్రకటించింది. గవర్నర్‌కు మద్దతుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన బానర్‌ను విద్యార్ధులు తగులబెట్టారు.


” మీ క్రూరమైన నోటిని మూసుకోమని మేమూ చెప్పగలం…. కానీ గవర్నర్‌ పదవికి గౌరవం ఇస్తున్నాం గనుక ఆ మాట అనటం లేదు.” అని కేరళ టూరిజం శాఖ మంత్రి పిఏ మహమ్మద్‌ రియాజ్‌ ఆదివారం నాడు చెప్పారు. శనివారం నాడు కాలికట్‌ విశ్వవిద్యాలయ సందర్శనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కన్నూరు రక్తసిక్త చరిత్ర గురించి తనకు తెలుసునంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సమాధానంగా పత్తానంతిట్ట జిల్లా కొన్నిలో జరిగిన నవకేరళ సదస్సులో రియాజ్‌ స్పందించారు. ఇటీవల గవర్నర్‌ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పూనుకున్న తీరు మీద గవర్నర్‌ వెళ్లిన ప్రతి చోటా విద్యార్ధులు, యువకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని మరింతగా రెచ్చగొట్టే విధంగా గవర్నర్‌ మాట్లాడుతున్నారు.నవ కేరళ సదస్సులతో రాష్ట్ర సిఎం, మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సదస్సులతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఆ సదస్సులను కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు బహిష్కరిస్తున్నారు. గవర్నర్‌ రాజభవన్ను బిజెపి భవన్‌గా మార్చటమే కాదు, ఆ పార్టీ నేతల భాషను కూడా ఉపయోగిస్తున్నారు. మూడు రోజుల కాలికట్‌ పర్యటనకు వచ్చిన గవర్నర్‌కు శనివారం సాయంత్రం నిరసన ఎదురైంది. అంతకు ఐదు రోజుల ముందు నిరసన సందర్భంగా ముఖ్యమంత్రి విజయన్‌ తనపై దాడి చేయించేందుకు పూనుకున్నారని గవర్నర్‌ ఆరోపించారు.


ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల నిరసనల మధ్య కాలికట్‌ విశ్వవిద్యాలయానికి వచ్చిన గవర్నర్‌ శనివారం నాడు మాట్లాడుతూ వారు కోతుల వంటి వారు. వాటిని చూసి మనం భయపడితే అవి మన వెంటపడతాయి. నేను ఆ విధంగా పారిపోను, నన్ను ఏ విధంగానూ వేధించలేరు, నన్నెవరూ భయపెట్టలేరు.కానీ ముఖ్యమంత్రి అలా చేస్తున్నారు, ఎందుకంటే కన్నూరు నుంచి వచ్చారు గనుక, కన్నూరుకు రక్త చరిత్ర ఉంది, అక్కడ ఒకరినొకరు చంపుకుంటున్నారని అన్నారు. గవర్నర్‌ సంఘపరివార్‌ పనిముట్టుగా పని చేస్తున్నారని, విద్యా రంగాన్ని కాషాయీకరణ చేస్తున్నారని వివిధ సందర్భాలలో విజయన్‌ విమర్శిస్తున్నారు. సంఘపరివార్‌కు చెందిన వారిని తన అధికారంతో విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో చేరుస్తున్నారని చెబుతున్నారు. గవర్నర్‌ మతిమాలిన మాటలతో ఎస్‌ఎఫ్‌ఐ నిరసనకారులను రెచ్చగొడుతున్నారని విజయన్‌ విమర్శించారు. కాలికట్‌ విశ్వవిద్యాలయంలో సంఘీ ఛాన్సలర్‌ వెనక్కు పో అంటూ హిందీలో ” సంఘీ ఛాన్సలర్‌ వాపస్‌ జావో – ఎస్‌ఎఫ్‌ఐ ” అన్న ఒక బానర్‌ను ఏర్పాటు చేశారు. దీని గురించి విలేకరుల ప్రశ్నకు స్పందనగా అవును నేను కాషాయమయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఏ రాష్ట్రంలోనూ లేనన్ని దేవాయలయాలు కేరళలో ఉన్నాయి. అవి కాషాయ చిహ్నాలు కావా, దమ్ముంటే వాటిని తొలగించండి అన్నారు. అవును నేను కాషాయీకరణకు పూనుకున్నాను. పురాతన భారత సంస్కృతి రక్షకురాలు కేరళ. పురాతన ఆలయాలు, పురాతన నృత్య రీతులను మీరు ఉత్తర ప్రదేశ్‌లో చూడలేరు, బీహార్‌లో చూడలేరు. వాటిని కేరళలోనే మీరు చూస్తారు.కేరళలో ప్రతిదీ కాషాయమయమే.పురాణాల ప్రకారం కంటికి ఆహ్లాదంగా కనిపించే రంగు కాషాయమే అని చెబుతున్నా. ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని నియమిస్తున్నానని అనటానికి వారెవరు ? వివిధ మార్గాల ద్వారా తన వద్దకు వచ్చిన పేర్ల నుంచి కొందరిని సిఫార్సు చేశాను. అది నా విచక్షణ అధికారానికి సంబంధించిన అంశం. వారికి నేనెందుకు సమాధానం చెప్పాలి, రాష్ట్రపతికి తప్ప ఎవరికీ జవాబు చెప్పాల్సినపని లేదు.వారు క్రిమినల్స్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కిరాయికి ఏర్పాటు చేశారు. ఇలా ఎందుకు చేశారంటే అతను కన్నూరు నుంచి వచ్చారు. కన్నూరుకు రక్తసిక్త చరిత్ర ఉందని నాకు తెలుసు, అక్కడ ఒకరిని ఒకరు చంపుకుంటారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి దారి మళ్లించాలని సిఎం కోరుకుంటున్నారు. రాష్ట్రంలో సంపదలను సృష్టించకుండా సంక్షేమ పధకాలను ప్రకటిస్తున్నారు, డబ్బంతా విదేశాల నుంచి వస్తున్నది. అన్నారు.


సిఫార్సులను పక్కన పెట్టి తమను కాకుండా గవర్నర్‌ తమ కంటే తక్కువ అర్హతలు కలవారిని కేరళ విశ్వవిద్యాలయ సెనెట్‌కు నలుగురు విద్యార్ధులను నియమించినట్లు దాఖలైన పిటీషన్‌ స్వీకరించి నియామకాల మీద హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన ఇద్దరు విద్యార్ధులను పక్కన పెట్టి గవర్నర్‌ తన ఇష్టం వచ్చిన వారిని నియమించారు. ఆదివారం నాడు పత్తానంతిట్ట జిల్లాలో నవకేరళ సదస్సు సందర్భంగా సిఎం పినరయి విజయన్‌ విలేకర్లతో మాట్లాడుతూ గవర్నర్‌ మతిమాలిన చర్యల ద్వారా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. గవర్నర్‌ చర్యలు నిరసనలకు పురికొల్పుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నిరసన తెలుపుతున్నది.వారి మీద గవర్నర్‌ తీవ్ర పదజాలాన్ని వినియోగించారు.చురుకైన రాజకీయాల్లో పాల్గొన్న ఒక వ్యక్తి వారిని రక్తం మరిగిన నేరగాళ్లు అని ఎలా మాట్లాడారో నాకు ఆశ్చర్యం వేస్తున్నది. ఇది మతిమాలిన చర్య. ఒక ఉన్నత స్థానంలో ఉన్న వారు ఇలాంటి దిగజారుడు పదజాలంతో మాట్లాడకూడదు. ఖాన్‌ గారు ఈ రాష్ట్ర గవర్నర్‌ అని మరిచిపోయినట్లున్నది. తన చర్యల ద్వారా రాష్ట్రంలో శాంతిని విచ్చిన్నం చేసేందుకు కావాలనే మాట్లాడుతున్నారని గతంలో కూడా నేను చెప్పాను. ప్రతి సమస్య మీద గరిష్టంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు ” అని విజయన్‌ చెప్పారు.


కన్నూరు చరిత్ర మీద నిందలు వేసిన గవర్నర్‌ వ్యాఖ్యల గురించి మంత్రి రియాజ్‌ మాట్లాడుతూ ” కన్నూరు చరిత్ర అంత చెడ్డదా ?వలస పాలకులకు వ్యతిరేకంగా కన్నూరు గడ్డ మీద పోరాడిన అనేక మంది అమరజీవులయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కన్నూరు ముఖ్య పాత్రను పోషించింది. కన్నూరు, కేరళ పట్ల గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌కు అంత కోపమెందుకు ? 1970 డిసెంబరులో ఆర్‌ఎస్‌ఎస్‌ మతహింసాకాండ వ్యాప్తికి కన్నూరులోని తలసెరిని ఎంచుకుందని గౌరవనీయ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తెలుసుకోవాలి. వారు ఒక మసీదు మీద డాడికి యత్నించారు. మసీదును కాపాడేందుకు ఇతర కమ్యూనిస్టులతో కలసి యుకె కున్హిరామన్‌ ప్రయత్నించారు. మలబార్‌ ముస్లిం బిడ్డ అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ వారు దాడి చేశారు. ఆ ప్రాంతంలో కొట్లాటలను నివారించేందుకు ఎర్రజెండా కట్టుకున్న ఒక నల్లరంగు జీపు తిరుగుతూ శాంతిని పాటించాలని ప్రచారం చేసింది. శాంతికోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని దానిలో ఉన్నవారు చెప్పారు. ఆ జీపు ముందుభాగంలో కూర్చున్న ఒక యువకుడే నేటి ముఖ్యమంత్రి విజయన్‌. ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కన్నూరు చరిత్రను తెలుసుకోవాలి. కన్నూరు, కేరళ చరిత్రను వక్రీకరిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పద్దతుల్లో ముఖ్యమంత్రిని, ఆయన జిల్లాను అవమానపరుస్తున్నారు.” అని రియాజ్‌ చెప్పారు. తాము ఆందోళనను విరమించటం లేదని మలప్పురం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ ప్రకటించింది. అయితే గవర్నర్‌ పాల్గొనే ప్రైవేటు కార్యక్రమాల వద్ద ఎలాంటి నిరసన తెలపటం లేదని స్పష్టం చేసింది.