Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


రాజకీయాలు అవి స్థానికం, జాతీయం, అంతర్జాతీయం ఏవైనా వైరం పెరిగినపుడు ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయటం ఒక ప్రధాన ధోరణిగా కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిణామాల్లో అది జరిగితే సంభవించే నష్టం ఎంతో ఎక్కువ. ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటి. ఆసియాలో రెండవది. కేవలం ఐదు లక్షల 21వేల జనాభా మాత్రమే కలిగిన మాల్దీవులతో ఇప్పుడు ప్రపంచంలో జనాభాలో అతి పెద్ద స్థానంలో ఉన్న మన దేశంలో కొందరి వైఖరి దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను అంటున్నట్లుగా ఉంది. సున్నితమైన అనేక అంశాలను విస్మరిస్తున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరి మాల్దీవులతో సంబంధాల అంశం ఇప్పుడు మన సామాజిక మాధ్యమం, మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. మన ప్రధాని నరేంద్రమోడీని అవమానించినందుకుగాను దానికి తగిన బుద్ది చెప్పాలని, మన విహార యాత్రీకులు వెళ్లరాదని పిలుపు ఇస్తున్నారు. ఒక విమానయాన సంస్థ ఇప్పటికే నిరవధికంగా ప్రయాణాలను నిలిపివేసినట్లు ప్రకటించింది, హౌటల్‌ బుకింగులను కూడా మన వారు రద్దు చేసుకున్నట్లు వార్తలు. మాల్దీవుల ప్రయాణం, అక్కడి హౌటళ్ల రేట్లు సగానికి సగం తగ్గినట్లు ప్రచారం. కొందరు క్రీడాకారులు, సినీతారలు కూడా స్పందించారు. గరిష్టంగా విహార యాత్రీకులను పంపుతున్న మన దేశాన్ని, ఫ్రధానిని కూడా అలా కించపరుస్తారా అని మండిపడ్డారు.


సామాజిక మాధ్యమంలో కించపరుస్తూ వ్యాఖ్యానించినందుకు మల్షా షరీఫ్‌, మరియం షిహునా, అబ్దుల్లా మఝూన్‌ మజీద్‌ అనే ముగ్గురు ఉప మంత్రులను మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు సస్పెండ్‌ చేశారు. మోడీని వారు హాస్యగాడు, ఉగ్రవాది, ఇజ్రాయెల్‌ తొత్తు అని, మన దేశంలో పరిశుభ్రత తక్కువ అని పేర్కొన్నారు. ఇది బాధ్యతా రాహిత్యం తప్ప మరొకటి కాదు.అరేబియా సముద్రంలోని మన లక్షద్వీప్‌లో విహార యాత్రలను ప్రోత్సహించేందుకు గాను మోడీ ఒక బీచ్‌లో కూర్చున్న వీడియోను పోస్టు చేసిన తరువాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.తమ దేశానికి యాత్రీకులు రాకుండా చేసేందుకే ఇలా చేశారని అక్కడి కొందరు భావించారు. కించపరచటం గురించి మాలే లోని మన రాయబారి అక్కడి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మాల్దీవుల ప్రతిపక్ష నేతలు అధ్యక్షుడి మీద అవిశ్వాస తీర్మానం పెడతామనేవరకు వెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలను తాము గమనించామని, అవి వారి వ్యక్తిగతం తప్ప అధికారిక వైఖరి కాదని అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. జరిగినదాని మీద విచారణకు ఆదేశించారని రాయిటర్స్‌ పేర్కొన్నది. మాల్దీవుల్లో ఎవరు అధికారానికి వచ్చినా గతంలో తొలి విదేశీ పర్యటన భారత్‌తోనే ప్రారంభమయ్యేది. అలాంటిది ముయిజ్జు తొలుత టర్కీ, తరువాత యుఏయి, ఈనెల 8 నుంచి 12వరకు చైనా పర్యటించారు. ఇది మన అహాన్ని దెబ్బతీసిందా ?


ప్రపంచమంతటా సంకుచిత జాతీయ వాదం పెరిగింది. ఎవరికి వారు తమ దేశానికే అగ్రస్థానం ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవైపు వసుధైక కుటుంబం, ప్రపంచమంతా నేడు ఒక కుగ్రామం అని చెప్పేవారు కూడా సంకుచితంగా గిరిగీసుకొంటున్నారు. ఇప్పుడు మాల్దీవులను దారికి తెచ్చుకోవాలంటే అక్కడికి మన యాత్రీకులు వెళ్లకూడదని చెబుతున్నవారు ప్రతికూల ఫలితాల నిచ్చే ఆర్థిక జాతీయవాదానికి లోనైనట్లు చెప్పవచ్చు. మన దేశంలో ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలోనే చైనా పర్యటనలో అధ్యక్షుడు ముయిజ్జు 20 ఒప్పందాలు చేసుకున్నట్లు, పెద్ద ఎత్తున యాత్రీకులను తమ దేశానికి పంపాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. లడక్‌ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఉదంతాల తరువాత చైనాకు బుద్ది చెప్పాలని, దాని వస్తువులను బహిష్కరించాలని, అక్కడి నుంచి దిగుమతులను మానుకొని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు, దిగుమతులను రికార్డు స్థాయిలో చేసుకుంటున్నాము. 2022-23లో మన దేశం 9,850 కోట్ల డాలర్ల మేర వస్తువులను దిగుమతి చేసుకుంటే మన ఎగుమతులు 1,530 కోట్లు, అవి పోను నిఖరంగా 8,320కోట్ల డాలర్లను డ్రాగన్‌ దేశానికి సమర్పించున్నాము. మన దేశాన్ని, ప్రధానిని విమర్శించినా మౌనంగా ఉండాలా అంటే తగిన పద్దతుల్లో దానికి నిరసన తెపాల్సిందే, ఏదైనా ఒక దేశాన్ని ఏ రూపంలోనైనా మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలన్న దురహంకార ఆలోచనే ఎవరినైనా తప్పుదారి పట్టిస్తుంది. ఇతరులను మరోపక్కకు నెడుతుంది. ఇప్పుడు మాల్దీవుల విషయంలో అదే జరుగుతోందా ?

మాల్దీవులకు వెళ్ల వద్దన్న దాన్ని ఎంత మేరకు ఎంత మంది పాటించారు. చైనా వస్తువు బహిష్కరణ పిలుపు మాదిరే ఉన్నట్లు ఇప్పటికే సమాచారం వస్తోంది. అక్కడికి బదులు లక్షద్వీపాలకు వెళ్లాలని చెబుతున్నారు. ఎక్కడకు వెళ్లాలనేది ఎవరికి వారు నిర్ణయించుకొనేది తప్ప మరొకటి కాదు. గతంతో పోలిస్తే లక్షద్వీప్‌ గురించి గత కొద్ది రోజులుగా సమాచారం అడుగుతున్నవారు 50శాతం పెరిగారు తప్ప ఆచరణలోకి రావటం లేదని టూరిజం రంగంలో ఉన్నవారు చెప్పారు. ప్రస్తుతం కేరళలోని కోచి నుంచి రోజూ లక్షద్వీప్‌కు తిరుగుతున్న విమానం ఒకటి.దానిలో ఉన్న సీట్లు 72, మార్చి నెలాఖరు వరకు సీట్లన్ని నిండినట్లు ఇండియా టుడే పేర్కొన్నది. ఇదే సమయంలో మాల్దీవులకు చెడు వార్తలేమీ లేవని కూడా చెప్పింది. ఇప్పటికే బుక్‌ చేసుకున్న వారు రద్దు చేసుకుంటే చెల్లించిన సొమ్ము వెనక్కి రాదన్న సంగతి తెలిసిందే. లక్షద్వీపాలకు యాత్రీకులను ఆకర్షించేందుకే మన ప్రధాని నరేంద్రమోడీ అక్కడికి వెళ్లి బీచ్‌ ఫొటోలను ప్రపంచానికి విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. దాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు.తాజాగా వచ్చిన వార్తల ప్రకారం గోవాకు వచ్చే విదేశీ యాత్రీకుల సంఖ్య పడిపోయినట్లు టూరిజం శాఖా మంత్రి రోహన్‌ కౌంతే ప్రకటించారు. గోవాకు రష్యా, ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌ నుంచి వచ్చే యాత్రీకులు గణనీయంగా ఉంటారని ప్రస్తుతం ఆ దేశాలు సంక్షోభంలో ఉన్నందున రాక తగ్గినట్లు చెప్పారు. సౌదీ అరేబియా చేపట్టిన ఎర్ర సముద్ర ప్రాజెక్టు నిర్ణీత గడువుకంటే ముందుగానే పూర్తి కానుండటం, దీనికి తోడు బహరెయిన్‌ క్రమంగా వివాహాలకు కేంద్రంగా మారుతుండటంతో గోవా టూరిజానికి సవాలు పెరుగుతున్నట్లు కూడా మంత్రి చెప్పారు. రష్యా, బ్రిటన్ల మీద ఎక్కువగా ఆధారపడటాన్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం కూడా వచ్చిందన్నారు.


రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు చిన్న దేశం కావచ్చుగాని కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది. ఈ కారణంగానే బ్రిటీషు వారు ఆక్రమించిన మారిషస్‌కు చెందిన డిగోగార్సియా దీవులను అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఖాళీ చేసేందుకు మొరాయిస్తున్నది. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించింది. మనదేశంలోని కన్యాకుమారికి ఆ దీవులు 1,796కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అది మనదేశంతో పాటు పరిసరాల్లోని అన్ని దేశాలకూ ఆందోళన కలిగించే అంశమే. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా అనుసరిస్తున్న విధానాల కారణంగా దాని పట్టునుంచి విడివడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఆ వరుసలో మాల్దీవులు కూడా చేరితే ఏమిటన్నదే వారి ఆందోళన. ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా 1965లో బ్రిటన్‌ ఆక్రమణ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత మన దేశం అన్ని రంగాలలో దగ్గరయ్యేందుకు చూసింది. అనేక విధాలుగా సాయం చేసింది. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. తమను అదుకోవాలని అనేక దేశాలను కోరినా ఎవరూ ముందుకు రాలేదు. భారత్‌ స్పందించింది, ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో ఆగ్రా వైమానిక దళ కేంద్రం నుంచి ఐదు వందల మంది పారా ట్రూపర్లను దించి కుట్రను విఫలం గావించింది. అప్పటి నుంచి సంబంధాలు మరింతగా బలపడ్డాయి. గతేడాది ఎన్నికల ప్రచారంలో ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరిని ప్రకటించినప్పటికీ ఎన్నికైన తరువాత స్వరాన్ని తగ్గించారు. ఈ పూర్వరంగంలో ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను దిగజారేట్లు చేశాయి. మరింత గట్టి సంబంధాలను పెట్టుకుంటామని, నుంచి పర్యాటకులను మరింతగా పంపాలనిఐదురోజుల పర్యటనలో ముయిజ్జు చైనా నేతలను కోరినట్లు వార్తలు వచ్చాయి. మాల్దీవులకు పెద్ద సంఖ్యలో భారత్‌ నుంచి పర్యాటకులు ప్రస్తుతం పదకొండు శాతం వెళుతున్నమాట వాస్తవం,90శాతం ఇతర దేశాల నుంచి ఉన్నారని మరచిపోకూడదు..


2019లో మనదేశంతో కుదుర్చుకున్న జలవాతావరణ(హైడ్రాలజీ) పరిశీలన పధకం నుంచి తాము వైదొలుగుతున్నట్లు మాల్దీవుల అధికారులు 2023 డిసెంబరు 14న తెలిపారు. తమ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు తప్ప చైనాకు దగ్గరవుతున్నందున ఈ నిర్ణయం తీసుకోలేదని మాల్దీవుల అధికారులు చెప్పారు. సాధారణంగా మాల్దీవుల్లో ఎవరు అధికారానికి వచ్చినా తొలి అధికారిక పర్యటన మనదేశంలో జరపటం సాంప్రదాయంగా వస్తోంది. దానికి కూడా నూతన అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు స్వస్తి పలికి టర్కీ వెళ్లాడు. దీంతో మన నేతల అహం దెబ్బతిన్నదా ? అంతే గాక మాల్దీవుల్లో ఉన్న మన సైనికులు కూడా వెనక్కు వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఇదే సమయంలో హిందూ మహాసముద్రంలో అట్టడుగు జలాల్లో పరిశోధనలు చేసేందుకు తమ యువాన్‌ వాంగ్‌ నౌక లంగరు వేసేందుకు అనుమతించాలని మాల్దీవులను కోరటం గమనించాల్సిన అంశం. మాల్దీవుల మొగ్గు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణాలు ఏమిటన్నది తీవ్రంగా ఆలోచించాలి.


మాల్దీవులకు చైనా నుంచి విమాన మార్గం 4,900 కిలోమీటర్ల దూరం ఉంది. సముద్ర మార్గంలో 4,682 నాటికల్‌ మైళ్లు లేదా 8,670 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రాంతీయ, ప్రపంచ యుద్దాలు తలెత్తితే సముద్రాల్లోని ఒక చిన్న దీవి, దాని మీద పెత్తనం లేదా ఎవరి ప్రభావం ఉంది అన్నది కూడా ఎంతో కీలకమైనదే. ఈ కారణంగానే మిలిటరీ వ్యూహకర్తలు రూపొందించిన ప్రణాళికలు, ఎత్తుగడల ప్రకారం ఇరుగు పొరుగు, దూరంగా ఉన్న దేశాలు కూడా సంబంధాలను నిర్వహిస్తుంటాయి. 2023 సెప్టెంబరు 30న జరిగిన ఎన్నికలు చైనా – భారత్‌ మధ్య పోటీగా జరిగాయి. ఇంత బాహాటంగా ఏ దేశంలోనూ రాజకీయ పార్టీలు పోటీ చేసి ఉండవు. తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. 2020లో ప్రతిపక్షాలుగా ఉన్న మాల్దీవుల ప్రోగ్రెసివ్‌ పార్టీ, పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఒక కూటమిగా ఏర్పడి ” భారత్‌ను బయటకు పంపాలి( భారత్‌ అవుట్‌) ” అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించాయి. మనదేశానికి చెందిన జిఎంఆర్‌ కంపెనీ మాలెలోని విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.విదేశీ ప్రయాణీకులతో పాటు మాల్దీవుల పౌరుల మీద అభివృద్ధి పన్ను విధించటంతో అక్కడ వ్యతిరేకత వెల్లడైంది. దాని వెనుక అధ్యక్షుడు నషీద్‌ మద్దతు కూడా ఉందని చెబుతారు. అదే పెద్ద మనిషి మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తటంతో జనంలో నిరసన తలెత్తి చివరకు 2012లో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నాడు. జనం ఛీకొట్టిన నషీద్‌ మనదేశంతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. అది కూడా జనంలో మనదేశం మీద వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది. ఇప్పుడు మన దేశం నుంచి యాత్రీకులు వెళ్లనందున మాల్దీవుల్లో ఆర్థిక సంక్షోభమేమీ రాదు. ఈ పూర్వరంగంలో దూరమౌతున్న దాన్ని దగ్గరకు ఎలా తెచ్చుకోవాలా, మన ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలా అని చూడాలి తప్ప నీ సంగతి చూస్తా అన్నట్లుగా ఉంటే నడిచే రోజులు కావివి.