Tags
Aatmanirbhar Bharat, america first, Amritkal, BJP, China, China–United States trade war, Donald trump, Eric Garcetti, Indo_US Trade, IPEF, Joe Biden, Narendra Modi Failures
ఎం కోటేశ్వరరావు
ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడి తింటూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారంటూ తమ రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలను విమర్శించిన వారి మీద కాషాయ దళాలు విరుచుకుపడుతున్నది తెలిసిందే. పన్నెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాలోని వాషింగ్టన్ నుంచి ఢిల్లీ వచ్చి అమెరికా రాయబారిగా ఉన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత కాలం, ఆత్మనిర్భర భారత్ పధకాలను పూచికపుల్ల తీసివేసినట్లుగా మాట్లాడితే ఎలాంటి స్పందనలూ లేవు. ఎవరూ నోరెత్తరు ! అమృతకాలం, ఆత్మనిర్భర (స్వావలంబన) భారత్ వాగాడంబరాన్ని కట్టిపెట్టండిి, మేం చెబుతున్న మార్పులు చేస్తేనే మీకూ మాకూ మంచిది ఆపైన మీ ఇష్టం అన్నట్లుగా మన దేశంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ నిర్మొహమాటంగా చెప్పాడు. జనవరి 30వ తేదీన ఢిల్లీలో ” అమృత కాలం, ఆత్మనిర్భర భారత్‌లో భారత-అమెరికా సంబంధాలు ” అనే అంశం గురించి ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఉత్తర భారత కౌన్సిల్ మహాసభలో గార్సెటీ ప్రసంగించాడు. దురాక్రమణదారులు వచ్చి గుంజుకు పోతారనే పాతకాలం కాదిది, స్వావలంబన అన్నది దుర్భేధ్యమైన కోటగా భావించరాదని తమ దేశం కోరుతున్నదని గార్సెటీ అన్నాడు. పెట్టుబడులు, మేథోసంపత్తి హక్కులు, ఎగుమతి-దిగుమతులు, పన్నుల వ్యవస్థలో భారత్ మార్పులు చేయాలి. ప్రభుత్వం స్వావలంబన వైపు మొగ్గు చూపితే వాణిజ్యం, ఆర్థిక వృద్ధి వేగం తగ్గుతుంది. ప్రస్తుతం రక్షణ, ఆధునిక సాంకేతికతలు, ముఖ్యమైన ఖనిజాలు, సెమికండక్టర్ల వంటి అంశాలలో రెండు దేశాలూ వేగంగా ముందుకు పోతున్నప్పటికీ వాణిజ్యం, పెట్టుబడుల అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే ఇవి చాలవు. ఎగుమతి ఆంక్షలు, విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్ పన్ను వంటి అంశాలు పారదర్శకంగా లేవు, భారత్‌లో పెట్టుబడులు పెట్టే అమెరికా కంపెనీలకు ఆటంకాలను తొలగించాలి, వీటి గురించి మరింత నిర్మొహమాటంగా ఇద్దరం మాట్లాడుకోవాలి అన్నాడు.
చైనా నుంచి విదేశీ పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) భారత్‌కు రావాలని అమెరికా కోరుకుంటున్నది, కానీ వాస్తవ అంకెలను చూస్తే రావాల్సినంత వేగంగా ఎఫ్‌డిఐ భారత్‌కు రావటం లేదు, ఆగేయాసియాలోని వియత్నాం వంటి దేశాలకు పోతున్నది. భారత్ స్వావలంబనతో ఉండాలని అమెరికా కూడా వాంఛిస్తున్నది, దాన్నొక దుర్భేధ్యమైన కోటగా చూడకూడదని కూడా కోరుకుంటున్నది.ఎందుకంటే భారత కంపెనీలు కూడా ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడుతున్నాయి, ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి గనుక పాతకాలపు ఆలోచనలను వదలి పెట్టాలి. ఏ ఒక్క దేశమూ ఇంకేమాత్రమూ స్వావలంబనతో ఉండలేదు. భారత్ నుంచి సరఫరా గొలుసులు అమెరికాకు కీలకంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం, ప్రతిదీ భారత్‌లోనే తయారు చేయాలని వాక్పటిమను ప్రదర్శిస్తే వేగం తగ్గుతుంది. ఉత్పత్తి మీద మీరు పన్నులు వేస్తే మా మీద వేసినట్లు కాదు, మార్కెట్‌ను రక్షించినట్లు కాదు, మేం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటుంటే మీరు దానికి పరిమితులు విధిస్తున్నట్లు. కార్పొరేట్ల పన్నుల్లో పారదర్శకత ఉండాలని మేం కోరుకుంటాం. ఇక్కడ ఉండాలని కోరుకుంటున్న మా కంపెనీలకు అదొక ఆటంకంగా ఉంది. ఒక అమెరికా కంపెనీ భారత్‌లో అడుగుపెట్టేందుకుగాను రెండు కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. అదే కంపెనీ వియత్నాంలో ఇరవై కోట్ల డాలర్లు పెట్టింది, ఎందుకంటే దిగుమతి చేసుకున్న వాటి మీద అక్కడ పన్నులు లేవు అని ఉదాహరణగా గార్సెటీ చెప్పాడు. కోర్టులు తరచూ మేథోసంపత్తి హక్కుల ఉల్లంఘన జరిగిందని తీర్పులు ఇస్తాయి. తరువాత దాని కొనసాగింపేమీ ఉండదు అన్నాడు.
అమెరికా రాయబారి ప్రసంగమంతా ఇలానే కొనసాగింది. ప్రపంచీకరణ, స్వేచ్చా వాణిజ్యం అంటూ కబుర్లు చెప్పిన అమెరికా, తదితర ధనిక దేశాలు దాన్ని పక్కన పెట్టి రక్షణాత్మక చర్యలు తీసుకుంటూ దేశాలతో విడివిడిగా ఒప్పందాలు చేసుకొనేందుకు వత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి ఒప్పందాలు గతంలో మనకు పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదని తేలింది. తమ షరతులను మన మీద రుద్దుతున్న కారణంగా అమెరికాతో తలపెట్టిన సమగ్ర వాణిజ్య ఒప్పంద ప్రక్రియ ముందుకు పోవటం లేదు. ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికాకే అగ్రతాంబూలం అనే విధానాన్ని యాంకీలు బలంగా ముందుకు తీసుకుపోతున్నారు. దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్-నరేంద్రమోడీ ఇద్దరూ కావిలించుకొని, చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పరస్పరం పొగడ్తలను గుప్పించుకున్నారు. అదే ట్రంప్ మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే కొన్ని వస్తువులపై ఎన్నో ఏండ్లుగా ఇస్తున్న (జిఎస్‌పి ) రాయితీలను 2019లోనే రద్దు చేసిన తరువాతే ఇద్దరూ విడదీయరాని బంధంతో ఉన్నట్లు ప్రదర్శించారు.జిఎస్‌పి కింద మనదేశం 2017లో ఎలాంటి దిగుమతి పన్నులు లేకుండా అమెరికాకు ఎగుమతి చేసిన సరకులు విలువ 570 కోట్ల డాలర్లు. ఆ రాయితీని పునరుద్దరించాలని మన దేశం వినతులు మీద వినతులు చేయటమేతప్ప ఇప్పటి వరకు బైడెన్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు.మనకున్న పలుకుబడికి ఇది నిదర్శనం. దీనికి బదులు చైనాను చూపి మనల్ని భయపెట్టటం, వారి ఆయుధాలను మనకు అమ్మి సొమ్ము చేసుకోవటం విపరీతంగా పెరిగింది. చిత్రం ఏమిటంటే మనతో సహా మిగతా ప్రపంచాన్ని భయపెట్టేందుకు చూస్తున్న అమెరికా తాను మాత్రం అదే చైనాతో వాణిజ్య లావాదేవీలను జరపటానికి ముందుకు సాగుతూనే ఉంది.
అమెరికాలో ఎవరిని కదలించినా చైనా నుంచి మనకు ముప్పు ఉందని చెప్పేవారే, ఎందుకంటే అది వారికి లాభసాటిగా ఉంది. రిపబ్లికన్ పార్టీలో పలుకుబడి కలిగిన కాలిఫోర్నియా ఎంపీ డారెల్ ఇసా జనవరి 30 అమెరికాలోని హడ్సన్ సంస్థలో పరిశోధకురాలిగా ఉన్న అపర్ణా పాండేతో మాట్లాడుతూ చైనా నుంచి తలెత్తిన ముప్పు కారణంగా పద్దతైన స్వేచ్చావాణిజ్య ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలను అమెరికా-భారత్ కుదుర్చుకోవాల్సి ఉందన్నాడు.ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై చైనా ముప్పు ప్రభావం చూపతున్నదన్నాడు.చైనాలో తయారు చేస్తున్న వస్తువులనే అదే ధరలకు భారత్‌లో కూడా తయారు చేయవచ్చు, కానీ దానికిగాను బలమైన ఒప్పందాలు కావాలి అన్నాడు. అమెరికాలో ఇది ఎన్నికల సంవత్సరం రెండు పార్టీలూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా గడ్డీ కరుస్తున్నాయి.తాను గనుక మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే పన్నుల యుద్ధాన్ని ప్రారంభిస్తానని, తద్వారా అమెరికా ప్రయోజనాలను కాపాడతానని, విదేశాలకు తరలిన ఆటోమొబైల్ పరిశ్రమను తిరిగి వెనక్కు తీసుకువస్తానని రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు. గతేడాది జూన్‌లో ఒక సందర్భంగా మాట్లాడుతూ ” అమెరికా తయారీ వస్తువులపై భారత్, చైనా లేదా మరో ఏదేశమైనా వంద లేదా రెండువందల శాతం దిగుమతి పన్నులు విధిస్తే మేం కూడా అదే విధంగా బదులు తీర్చుకుంటాం.మరో మాటలో చెప్పాలంటే వందశాతమంటే వందశాతమే. వారు గనుక అమెరికా మీద విధిస్తే మనం కూడా విధిస్తాము.కంటికి కన్ను, పన్నుకు పన్ను, ఎంతైతే అంత ” అన్నాడు. అమెరికన్లనే శాసించుతున్నారని చెప్పుకుంటున్న విశ్వగురువుకు ఎలాంటి మినహాయింపులు లేవన్నది స్పష్టం.” ఇప్పటికే 55శాతం ఆటోమొబైల్ పరిశ్రమ అమెరికా నుంచి వెళ్లిపోయింది.నేను గనుక అధ్యక్షుడిగా ఎన్నిక కాకుంటే మిగిలింది కూడా అదే దారిలో ఉంటుంది. చైనా లేదా ఇతర దేశాలన్నీ అమెరికాలో అమ్ముకోవాలంటే ఇక్కడే తయారు చేయాలి, మా కార్మికులతోనే పని చేయించాలి. ఇప్పుడు వారు మెక్సికోలో పెద్ద కర్మాగారాలను నిర్మిస్తున్నారు, పన్నులు లేకుండా అమెరికాలో కార్లు అమ్ముకుంటున్నారు.” అని ట్రంప్ పేర్కొన్నాడు. తాను గనుక ఎన్నికైతే అమెరికా దిగుమతి చేసుకుంటున్న మూడులక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులపై పదిశాతం, చైనా వస్తువులపై 60శాతం పన్ను విధించే అవకాశాలను పరిశీలించాలని తన సలహాదారులను కోరినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక రాసింది.
డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిలో చైనా వస్తువులపై విధించిన పన్నులు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్దం. అది చివరికి అమెరికాకే నష్టమని తేలటంతో ట్రంప్ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పన్నులు విధిస్తానని చెబుతున్నాడు అంటే జనం, కార్పొరేట్స్ ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. అమెరికా ప్రారంభించిన క్రీడలో భాగస్వాములయ్యేందుకు ఐరోపా యూనియన్ దేశాలు సిద్దంగా లేవు. అందుకే ఫిబ్రవరి మొదటి వారంలో బ్రసెల్స్‌లో జరిగిన మూడవ ఇండో-పసిఫిక్ వేదిక సమావేశానికి అమెరికా, చైనా రెండు దేశాలనూ ఆహ్వానించలేదు. గతేడాది అమెరికా పొల్గొన్నది. అసలు ఏ సమావేశానికీ చైనాను ఆహ్వానించలేదు. దీని అర్ధం ఏమిటంటే ఈ రెండింటిలో ఏదో ఒక దేశం వెనుక చేరటం గాకుండా ఎవరి ప్రయోజనాల మేరకు వారు వ్యవహరించాలని చెప్పటమే అని విశ్లేషకులు భాష్యం చెప్పారు. రెండింటి నుంచి వీలైన మేరకు ఎక్కువ రాయితీలు పొందే ఎత్తుగడ కూడా కావచ్చు. దీన్నుంచి మన దేశం పాఠాలు నేర్చుకుంటుందా ? పెరుగుతున్న చైనా పలుకుబడిని అడ్డుకునేందుకు అమెరికా ముందుకు తెచ్చిన ఐపిఇఎఫ్ (ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ ) పట్ల అమెరికా నేతలే ఆసక్తి చూపటం లేదని తాజాగా విశ్లేషణలు వెలువడ్డాయి.ఈ కూటమిలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, బ్రూనే,భారత్, ఇండోనేషియా, మలేసియా, ఫిజీ, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థారులాండ్, వియత్నాం ఉన్నాయి. వాణిజ్యం మీద ఒప్పందం కుదుర్చుకోవాలని గతేడాది నవంబరులో జరిగిన సమావేశంలో చూసినప్పటికీ అమెరికాలోని పలువురు ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా కుదరలేదు. ఇది ఆలస్యం కాదు, పూర్తిగా వెనక్కుపోయినట్లే అని బ్రౌన్ అనే ఎంపీ మీడియాతో చెప్పాడు.చైనాను దెబ్బతీసేందుకు పన్నెండు పసిఫిక్ ప్రాంత దేశాలతో కూడిన టిపిపి కూటమిని అమెరికా ముందుకు తెచ్చింది. అయితే దాన్నుంచి తాము వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా ఐపిఇఎఫ్‌ను ముందుకు తెచ్చింది. దీన్లో కూడా తమకు పెద్దగా ప్రయోజనం లేదనే భావనతో అమెరికా ఉంది. ఈ ఒప్పందానికి ట్రంప్ పెద్దగా ఆసక్తి చూపటం లేదు. విదేశాల నుంచి వస్తున్న దిగుమతులతో అమెరికా పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది, కార్మికులకు ఉపాధి పోయింది. జనంలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు మరోసారి అమెరికాను గొప్పగా తయారు చేయాలనే పిలుపుతో డోనాల్డ్ ట్రంప్ ప్రచారంతో ముందుకు పోతున్నాడు. ఒక వేళ జో బైడెన్ గెలిచినప్పటికీ ఐపిఇఎఫ్‌లో వాణిజ్యం అనే నాలుగువ స్థంభాన్ని నిర్మించటం సాధ్యం కాదని జపాన్-ఆసియా ట్రేడ్ నిపుణుడు డేవిడ్ బోలింగ్ చెప్పాడు.ఈ పూర్వరంగంలో మన మార్కెట్లో తన వస్తువులను గుమ్మరించటానికి, పెట్టుబడులకు రాయితీలు పొందటానికి అమెరికా తెస్తున్న వత్తిడికి రాయబారి ప్రసంగం తీరు నిదర్శనం. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి విదేశీ సంస్థలకు పెద్ద పీట వేస్తామంటే మన కార్పొరేట్ సంస్థలు అంగీకరిస్తాయా ? వీలైతే వాటితో చేతులు కలిపి లబ్ది పొందుతాయి లేకుంటే ప్రతిఘటిస్తాయి.

సార్, మనం కొంచెం ఇంగ్లిష్ వీకా? ఆయన చెప్పిందేంట్? మీరు ఇక్కడ బనాయించిందేంటి? 2001 లో 12 బిలియన్ల డాలర్లు ఉన్న వాణిజ్యం ఇప్పుడు 200 బిలియన్లు అయింది , భారత్ కి US నెంబర్ 1 వాణిజ్య భాగస్వామి అయింది అని ఆయన కొన్ని విజయాలు ప్రస్తావించాడు. తర్వాత, ఈ విజయాల గురించి గొప్పగా చెప్పుకుంటూ (brag about) ఆగిపోకుండా వాణిజ్యాన్ని 500 బిలియన్ల కి తీసుకెళ్ళాలి – అని ఆయన చెప్పేడు. ఆలాగే పెట్టుబడులు కూడా.
ఈ దేశానికి పట్టిన మీ లాంటి కమ్యూనిస్ట్ భావజాలపు చెద ఇంతకాలం పొద్దున్న లేస్తే భారత్ ను కేవలం నెగిటివ్ గా చూపించడమే పెట్టుకున్నారు. ఇక చెల్లవు ఈ ఆటలు. ఈ వ్యాసంలొ రయబడిన ఏరిక్ గార్సెటీ అన్న మాటల లింక్ ఇక్కడ ఇస్తున్నా..పాఠకులే డైరెక్ట్ గా చూసుకోవచ్చి ఆయన అసలు ఏమన్నాడో
LikeLike