Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎన్నికలు చివరిదశకు చేరాయి, 2024జూన్‌ నాలుగున ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. అది సక్రమంగా ఉంటుందా అంటూ ” దేవుడు లేదా దేవుడి ప్రతినిధి ” గురించి అనేక మంది ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి నరేంద్రమోడీ తిరిగి అధికారానికి వస్తే లేదా కోల్పోతే ఏం జరుగుతుంది. మొదటిదాని గురించి ఇండియా కూటమి ఇప్పటికే ప్రచారంలో పేర్కొన్నట్లు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగం, సామాజిక న్యాయానికి ముప్పు ఏర్పడుతుందని నమ్ముతున్నవారు ఉన్నారు.మోడీని ఒక వైపు కాంగ్రెస్‌కు గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావంటారు, ఇండియా కూటమి వస్తే ఏడాదికొకరు ప్రధాని పదవి చేపడతారంటారు. అదే నోటితో కాంగ్రెస్‌ అధికారానికి వస్తే మెజారిటీ భారతీయులు రెండవ తరగతి పౌరులుగా మారిపోతారని, మహిళల మెడల్లో ఉన్న పుస్తెలతో సహా ఆభరణాలన్నీ తీసుకొని చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలు కలవారికి పంపిణీ చేస్తారని,క్రికెట్‌ జట్లలో ఎక్కువ మంది ముస్లింలను చేర్చుతారని, అయోధ్యలో రామాలయాన్ని కూల్చేందుకు బుల్డోజర్లు పంపుతారని ఆరోపిస్తారు. పరుచూరి బ్రదర్స్‌ చెప్పినట్లు ఒక జేబులో ఒకటి, మరోజేబులో మరో ప్రకటన పెట్టుకుతిరిగే రాజకీయనేతగా మోడీ కనిపించటం లేదూ ! ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని సంఘపరివారం నిరంతరం చేస్తున్న ప్రచారం తెలిసిందే. తాను వారి గురించి కాదు అని తరువాత మోడీ మార్చారు. మరి ఎవరిని అన్నట్లు ? సమాజంలో ధనికులుగా ఉన్నవారు, ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసీ సామాజిక తరగతులతో పోల్చితే ఇతరులు పిల్లలను ఎక్కువగా కనటం లేదన్నది తెలిసిందే. అంటే ఆ మూడు సామాజిక తరగతుల మీదనే మోడీ ధ్వజమెత్తారని అనుకోవాలి మరి.లేకపోతే నరం లేని నాలుక అనుకోవాలి. ఇక రెండవ దృశ్యానికి వస్తే మోడీ జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఫలితాన్ని గుర్తించను అంటూ అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌ మీదకు తన మద్దతుదార్లను ఉసిగొల్పిన ఉదంతం ఇక్కడ ప్రతిబింబిస్తుందా ? అన్నది చూడాల్సి ఉంది.


నరేంద్రమోడీ నోటి వెంట ప్రమాదాన్ని సూచించే మరో మాట వెలువడింది. రాజులు దైవాంశ సంభూతులని వంది మాగధులు వర్ణించారు, పొగిడారు. ఏకంగా తామే దైవాంశ అని, దేవుళ్లమని చెప్పుకున్న వారిని చరిత్ర ఎందరినో చూసింది. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా మా నమో లీలలు వర్ణించతరమా అన్న పూనకంతో బిజెపి నేత సంబిత్‌ పాత్ర ఏకంగా పూరీ జగన్నాధుడే నరేంద్రమోడీ భక్తుడుగా మారినట్లు ”వెల్లడించిన” సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ పూరీలో రోడ్‌ షో జరిపిన తరువాత అక్కడ పోటీ చేస్తున్న సంబిత్‌ పాత్ర ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ” ప్రభువు పూరీ జగన్నాధుడు నరేంద్రమోడీ భక్తుడు, మేమంతా మోడీ కుటుంబసభ్యులం.ఇలాంటి మహత్తర క్షణాలను చూసిన తరువాత నా భావావేశాలను ఆపుకోలేను, ఒరియా వారందరికీ ఇది ఒక ప్రత్యేకమైన రోజు ” అని మాట్లాడారు.దీని మీద ప్రతికూల స్పందనలు తలెత్తటంతో క్షమించమని వేడికోళ్లకు పూనుకున్నారు.ఈ తప్పుకు గాను ఉపవాసం ఉండి ప్రాయచిత్తం చేసుకుంటానని చెప్పిన ఈ పెద్దమనిషిని ఎన్నికల్లో పూరీ జగన్నాధుడు ఏం చేస్తాడో చూడాలి.


దేవుడు దేశానికి ఇచ్చిన బహుమతి నరేంద్రమోడీ అని కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఎం వెంకయ్యనాయుడు 2016 మార్చి నెలలో సెలవిచ్చారు.బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ పేదల పాలిట దైవాంశగల ఒక మహా పురుషుడు(మేషయ) అని కూడా వర్ణించారు. తరువాత విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మరో కేంద్ర మంత్రి రాజనాధ్‌ సింగ్‌ను విలేకర్లు ప్రశ్నించగా వెంకయ్యనాయుడి వ్యాఖ్యలను తాను వినలేదని, ఆ ప్రసంగాన్ని అంతగా ఆలకించలేదని చెప్పారు.(బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక 2016 మార్చి 21వ తేదీ) ఇంతగా వ్యక్తి పూజ తలకెక్కిన తరువాత నిజంగానే తాను దేవుడు పంపిన దూతను అని నరేంద్రమోడీ నమ్మటంలో ఆశ్చర్యం ఏముంది. ఇతరులు మాట్లాడితే విమర్శలు తలెత్తటం, రభస ఎందుకు ఏకంగా తానే రంగంలోకి దిగి మాట్లాడితే నోరెత్తే మీడియా ఉండదు కదా అనుకున్నారేమో ! ” కారణ జన్ములు ” అనే శీర్షికతో సంపాదకీయం రాసిన ఒక ప్రముఖ తెలుగు పత్రిక నరేంద్రమోడీ పేరెత్తటానికి భయపడిందంటే గోడీ మీడియా అని ఎవరైనా అంటే తప్పేముంది. అత్యవసర పరిస్థితి సమయంలో దేవకాంత బారువా అనే కాంగ్రెస్‌ నేత ఇందిరే ఇండియా-ఇండియాయే ఇందిర అని పొగడ్తలకు దిగి అభాసుపాలైన సంగతి తెలిసిందే.óఅప్పుడు కూడా మీడియా నోరెత్తలేదు, ఎత్తిన వాటిని ఎలా సెన్సార్‌ చేశారో తెలిసిందే.


తన పుట్టుక అందరి మాదిరి కాదని, తనను దేవుడు పంపినట్లు నమ్మకం కలిగిందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.న్యూస్‌ 18 అనే ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడారు.” నా తల్లి జీవించి ఉన్నంత వరకు నేను జీవసంబంధం (అందరి మాదిరే అమ్మా నాన్నలకు పుట్టినట్లు)గా పుట్టినట్లు భావించేవాడినని, ఆమె మరణం తరువాత నా అనుభవాలను చూస్తే నన్ను దేవుడు పంపినట్లు నిర్ధారించుకున్నాను. అందుకే దేవుడు నాకు సామర్ధ్యం, శక్తి, స్వచ్చమైన హృదయం, ఈ పనులు చేసేందుకు దైవావేశం కూడా ఇచ్చినట్లు భావిస్తున్నాను. దేవుడు పంపిన ఒక సాధనాన్ని తప్ప నేను మరొకటి కాదు ” అని చెప్పారు. కల్యాణమొచ్చినా కక్కొచ్చినా(వాంతి) ఆగదంటారు, ఇప్పుడు దీనికి మోడీ మనసులోకి ఏది వచ్చినా అనే దాన్ని కూడా జతచేసుకొని నవీకరించాలి. చివరి దశ ఎన్నికల్లోగా లేదా తరువాత అయినా తన జన్మ ఏ దేవుడి అంశో అన్న రహస్యాన్ని వెల్లడించినా ఆశ్చర్యం లేదు. అప్పటి వరకు గుజరాత్‌ ద్వారక కృష్ణుడా, అయోధ్య రాముడా, వారణాసి శివుడా ఎవరు పంపారన్నది జనాలు జుట్టుపీక్కోవాల్సిందే. జర్మన్‌ నాజీ హిట్లర్‌ స్వచ్చమైన ఆర్య సంతతి అని భావించిన సావిత్రీదేవి ముఖర్జీ అనే ఫ్రాన్సులో పుట్టిన గ్రీకు ఫాసిస్టు రాసిన పుస్తకంలో హిట్లర్‌ను విష్ణువు అవతారమని చెప్పింది. సదరు అవతారి ఒక మారణహౌమానికి ఎలా కారకుడయ్యాడో తెలిసిందే. అజిత్‌ కృష్ణ ముఖర్జీ అనే బెంగాలీని వివాహం చేసుకొన్న సావిత్రిదేవీ కొల్‌కతాలో జీవించి రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రదేశాలకు వ్యతిరేకంగా జర్మన్‌ గూఢచారిగా పనిచేసి తరువాత నాజీగా జీవించింది.


ముందే చెప్పుకున్నట్లు చరిత్రను చూస్తే ఈజిప్టులో ఫారోలుగా వర్ణితమైన పురాతన రాజులు తమను దేవుళ్లుగా భావించుకోవటమే కాదు, పేర్లు కూడా అలాగే పెట్టుకొనే వారు. తదుపరి జన్మ కొనసాగింపుకోసం చచ్చిన రాజుల శవాలను మమ్మీలుగా మార్చి పిరమిడ్‌లను నిర్మించిన సంగతి తెలిసిందే. కొందరు చైనా రాజులు కూడా తమను స్వర్గ పుత్రులని వర్ణించుకున్నారు. చరిత్రలో అలెగ్జాండర్‌ ది గ్రేట్‌గా పిలిచే గ్రీకు చక్రవర్తి ఈజిప్టు ఫారోల మాదిరే తాను కూడా దైవాంశ సంభూతుడిగానే భావించుకున్నాడు.తన నిజమైన తండ్రి జీయస్‌ అమన్‌ అనే ఈజిప్టు పురాతన దేవుడని భావించాడు.ఇండోనేషియాలో అనేక మంది పురాతన రాజులు తాము హిందూ దేవుళ్ల అంశగా చెప్పుకున్నారని చరిత్ర చెబుతోంది.ఆగేయాసియా దేశాలలో దేవరాజ అని పిలుచుకున్న అనేక మంది శివుడు లేదా విష్ణువు అవతారాలు లేదా వారసుల మని చెప్పుకున్నారు. సూర్య, చంద్ర వంశీకులమని చెప్పుకున్న వారి సంగతి తెలిసిందే.టిబెట్‌లో దలైలామాలు ఇప్పటికీ తాము బుద్దుని అవతారమని చెప్పుకుంటున్నారు. నేపాల్లో షా వంశ రాజులు కూడా తమను విష్టు అవతారాలుగా వర్ణించుకున్నారు. సత్యసాయి బాబాను దత్తాత్రేయ అవతారంగా భావించే భక్తులు సరేసరి. చరిత్రలో తమను తాము దేవుళ్లుగా, దేవదూతలుగా వర్ణించుకున్నవారు, మతాన్ని కాపాడతామని చెప్పేవారు, కలుషితమైన జాతిని పరిశుద్ధం చేయాలనే వారు చేయించిన లేదా చేసిన దుర్మార్గాలు ఎన్నో. ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం పేరుతో అధికారానికి వచ్చిన మతశక్తులు ప్రత్యర్ధులను ముఖ్యంగా కమ్యూనిస్టులు, వామపక్ష వాదులు ”దేవుని శత్రువు ”లు అనే సాకుతో వేలాది మందిని బూటకపు విచారణలతో ఉరితీశారు. జపాన్‌లో షోకో అసహరా అనే వాడు తనను క్రీస్తుగా చెప్పుకున్నాడు. తరువాత బౌద్దం-హిందూ విశ్వాసాలలను కలగలిపి ప్రచారం చేశాడు. యుగాంతం ముంచుకువస్తుందని తన భక్తులను నమ్మించాడు.టోక్యోలో 1995లో శరీన్‌ గాస్‌ను ప్రయోగించి వేలాది మందిని గాయపరచి 13 మంది ప్రాణాలు తీశారు. చివరకు మరో ఏడుగురితో కలిపి అసహరాను అక్కడి ప్రభుత్వం విచారించి ఉరితీసింది. అమెరికాలో ఆస్కార్‌ రామిరో ఓర్టేగా హెర్నాండెస్‌ అనే పెద్ద నేరగాడు తనను దేవదూతగా, ఏసుక్రీస్తుగా వర్ణించుకున్నాడు.అమెరికా అధ్యక్ష భవనం మీద దాడికి దేవుడు తనను ఆదేశించినట్లు చెప్పుకున్నాడు.


తనను దేవుడు ఆవహించినట్లు చెప్పుకున్నా, కొన్ని పనులు చేసేందుకు పంపినట్లు భావించినా, వంది మాగధులు అలాంటి వాతావరణం కల్పించినా చరిత్రలో జరిగిన నష్టాలు ఎన్నో. అనేక మంది ఎలాంటి ఆలోచన లేకుండా వారేం చేసినా సమర్ధించే ఉన్మాదానికి ఎందుకు లోనవుతారు అన్నది అంతుచిక్కని ప్రశ్న. జర్మనీలో జరిగింది అదే.జర్మన్‌ జాతికి యూదుల నుంచి ముప్పు ఏర్పడిందని, వారు జర్మనీకి ద్రోహం చేశారనే ప్రచారాన్ని సామాన్య జనం నిజంగా నమ్మబట్టే హిట్లర్‌ ఆటలు సాగాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తాను చెప్పిన వక్రీకరణలు, అవాస్తవాలను జనాలు నిజాలుగా భావిస్తారన్న గట్టి విశ్వాసం ఉన్నకారణంగానే నరేంద్రమోడీ ప్రసంగాలు చేశారు. తన జన్మ మామూలుది కాదని చెప్పుకున్నారు. హిట్లర్‌ను దేవుడే పంపాడని జర్మనీ పిల్లలకు నూరిపోశారు, దాంతో వాడిని ఒక సాధారణ రాజకీయవేత్తగా చూడటానికి బదులు దేవుడు పంపిన దూతగా చూశారు. మతాన్ని రాజకీయాలను జోడిస్తే జరిగేది ఇదే. జర్మనీ పూర్వపు ఔన్నత్యాన్ని నిలపాలంటే యూదులను అంతం చేయాలని చెబితే నిజమే అని నమ్మారు.ఇప్పుడు మనదేశంలో కూడా అన్ని రకాల అనర్ధాలకు ముస్లిం పాలకుల దండయాత్రలు, ఆక్రమణ, హిందువుల జనాభా తగ్గుతూ ముస్లింల జనాభాను పెంచుతూ ఒక నాటికి హిందువులను మైనారిటీలుగా మార్చే కుట్ర జరుగుతోందన్న ప్రచారాన్ని నమ్ముతున్న వారు ఉన్నారు. దాన్ని అడ్డుకోవాలంటే మెజారిటీ హిందూత్వ పాలన రావాలన్నదానికి మద్దతు పెరుగుతోంది. మంచి చెడుల ఆలోచన లేదు. ప్రజాస్వామ్యం ఎక్కువ కావటం కూడా మంచిది కాదంటూ అనాలోచితంగా మాట్లాడుతున్న జనాలు రోజు రోజుకూ పెరుగుతున్నారు.


ఇందిరా గాంధీ ఉపన్యాసాలు, విన్యాసాలు చూసిన జనం ఆకర్షితులయ్యారు.గరీబీహటావో అంటే నిజమే అని నమ్మారు. చివరకు అత్యవసర పరిస్థితిని ప్రకటించి దేశాన్ని ప్రమాదపు అంచుల్లోకి నెట్టారు. ఇప్పుడు నరేంద్రమోడీ అద్భుతాలు చేస్తారని, తమ జీవితాలను మార్చివేస్తారని అనేక మంది నమ్ముతున్నారు. ఒక వైపు సంపదలన్నీ కొంత మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంటే అలాంటి వారిని మోడీ వెనకేసుకు వస్తుంటే మార్పు సాధ్యం కాదనే ఆలోచనకు తావివ్వటం లేదు.గోవులను వధిస్తున్నారనే పేరుతో రోజూ తమ కళ్ల ముందు తిరిగే వారి మీద మూకదాడులకు పాల్పడుతుంటే చూస్తూ ఏమీ చేయలేని వారిని చూశాం.” నాజీ అంతరాత్మ ” పేరుతో 2003లో వెలువరించిన ఒక పుస్తకంలో క్లాడియా కూంజ్‌ అనే చరిత్రకారిణి ఒక ఉదంతాన్ని వివరించారు.ఆల్ఫోన్స్‌ హెక్‌ అనే యువకుడు హిట్లర్‌ యూత్‌లో ఉన్నాడు. (ఇప్పుడు మనదేశంలో ”దళ్‌ ” పేరుతో ఉన్న సంస్థల మాదిరి.) తన గ్రామంలో నాజీ పోలీసులు యూదులను నరహంతక శిబిరాలకు తరలించేందుకు ఒక దగ్గర పోగుచేస్తూ ఉంటే వారిలో హెయినిజ్‌ అనే తన మంచి స్నేహితుడు ఉన్నప్పటికీ ఎంత అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని తనలో తాను కూడా అనుకోలేకపోయాడట. యూదుల నుంచి ముప్పు ఉందనే అంశాన్ని బుర్రకు ఎక్కించుకొని ఉండటంతో హెయినిజ్‌ దురదృష్టం ఏమిటంటే అతను యూదుగా పుట్టటమే అని, వారిని తరలించటం సమంజసమే అని అనుకున్నట్లు తరువాత గుర్తు చేసుకున్నాడట. ఒక ఉన్మాదం తలెత్తినపుడు మనుషుల ఆలోచనల్లో వచ్చే మార్పును కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.” నా భాష జర్మన్‌, నా సంస్కృతి, అనుబంధాలు అన్నీ కూడా జర్మనే.జర్మనీ, జర్మనీ ఆస్ట్రియాలో యూదు వ్యతిరేకత పెరుగుతున్నదని గుర్తించేవరకు నేను కూడా జర్మన్‌ మేథావినే అనుకున్నాను. కానీ యూదు వ్యతిరేకత పెరిగిన తరువాత ఒక యూదును అని నన్ను నేను అనుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చాను” అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది కూడా అదే. హిట్లర్‌ పుట్టుకతోనే నాజీ కాదు. కేవలం జర్మన్‌ జాతి ఒక్కటే నాగరికతకు తగినది అనే భావజాలం విస్తరిస్తున్న సమయంలో అనేక మంది దానికి ఆకర్షితులయ్యారు. అదే భావజాలం మరింత ముదిరి హిట్లర్‌ను నియంత, నరహంతకుడిగా మార్చాయి. అందుకే నేడు కావాల్సింది నిరంకుశత్వానికి దారితీసే మితవాద భావజాలం వైపు ఆకర్షితులౌతున్నవారిని నిందిస్తూ కూర్చోవటం కాదు, ఆ భావజాలాన్ని ఎదుర్కొనే పోరును మరింత ముందుకు తీసుకుపోవటం, దీనికి అధ్యయనం తప్ప దగ్గరదారి లేదు.