Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


నేతిబీరలో నెయ్యి, మైసూరు పాక్‌లో మైసూరు – పాకిస్తాన్‌, మమకారంలో కారం ! ఇలాంటివి పిల్లల ఆటల్లో చూస్తాం. నరేంద్రమోడీ ఆకర్షణ కూడా అలాంటిదే అని సంఘపరివారం భావిస్తోందా ? వాజ్‌పాయి, అద్వానీలనే పక్కన పెట్టిన వారికి మోడీ ఒక లెక్కా ? ఒక ప్రకటన చేయటం, దాని మీద స్పందన చూసి సానుకూలంగా ఉంటే కొనసాగింపు లేకుంటే వెంటనే మాట మార్చటం తెలిసిందే. మోడీ కూడా పరివారంలో ఇతరుల మాదిరే తప్ప ప్రత్యేకతేమీ లేదనే సందేశాన్ని లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చేసిన ఉపన్యాసంలో వెల్లడించారు. ఈ సందర్భంగా దానితో పాటు కలగలిపి చెప్పిన సుభాషితాల్లో విశ్వసనీయత,చిత్తశుద్ధి, నిజాయితీ గురించి అనేక మంది ప్రశ్నిస్తున్నారు.రచ్చ కూడా మొదలైంది. మోడీ ఎలా స్పందిస్తారో, తన మద్దతుదార్లను ఎలా సమీకరిస్తారో చూడాల్సి ఉంది. గందరగోళం సృష్టించటానికి తమ నేత మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలకు తప్పుడు భాష్యం చెప్పారని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు చెప్పినట్లు పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. సంఫ్‌ు-బిజెపి మధ్య ఎలాంటి వివాదాలు లేవని, భగవత్‌ వ్యాఖ్యలను అసందర్భంగా పేర్కొన్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. 2014,2019 ఎన్నికల తరువాత చేసిన ఉపన్యాసాలకు, తాజా ఎన్నికల తరువాత చేసిన దానికి పెద్దగా తేడాలేదని. నరేంద్రమోడీ లేదా ఏ బిజెపి నేతను ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పుకుంది.తమ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం తప్ప సంస్థ అధికారిక వైఖరికి ప్రతిబింబం కాదన్నది.


నిజమైన సంఘసేవకులు పొగరుబోతులుగా ఉండరని మోహన్‌ భగవత్‌ తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ నాగపూర్‌ శిక్షణా సమావేశంలో సెలవిచ్చారు. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పారంటే మోడీనే అని మీడియాలో కొందరు వ్యాఖ్యానించారు. మోడీని హెచ్చరించే ధైర్యం పరివార్‌కు ఉందా, తమకు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు అవసరం లేదని చెప్పిన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను ఉద్దేశించి అని కొందరన్నారు. తన జన్మ మామూలుది కాదని, దైవాంశ సంభూతుడనని నరేంద్రమోడీ చెప్పుకున్నపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి చప్పుడు చేయలేదు. 2018 నుంచి ఎన్‌డిఏ కూటమి కన్వీనర్‌ లేరు, సమావేశాలు జరిపింది లేదు, మిత్రపక్షాలను ముఖ్యమైన అంశాల మీద సంప్రదించిన దాఖలాలు లేవు. అహంకారం, ఏకపక్ష ధోరణే. రైతుల ఆందోళన పట్ల అనుసరించిన వైఖరిని చెప్పనవసరం లేదు. చివరికి అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వంటి పెద్దలతో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసి దానితో ఒక్క సమావేశం జరపకపోయినా, రామమందిర ప్రారంభోత్సవానికి అద్వానీ రావద్దని చెప్పినపుడు గానీ ఆర్‌ఎస్‌ఎస్‌ స్పందించలేదు, సుద్దులు-బుద్దులు చెప్పలేదు. పదేండ్ల పాలన తరువాత సంపూర్ణ మెజారిటీ రాకపోవటం, అయోధ్య రామాలయం ఉన్న చోట బిజెపి మట్టికరవటం, మణిపూర్‌లో పరాభవం వంటి పరిణామాల తరువాత మోడీని కాపాడేందుకే భగవత్‌ రంగంలోకి దిగారనే అభిప్రాయం కూడా ఉంది. గతంలో కూడా అలాగే జరిగిందని కొందరు గుర్తు చేస్తున్నారు. కాదు తమ హిందూత్వ అజెండాకు మొదటికే మోసం వచ్చినందున మోడీని మందలించటం, తరువాత తప్పించేందుకు ముందుగానే పావులు కదిపారన్న అభిప్రాయాలూ ఉన్నాయి.


రెండు నాలుకలతో మాట్లాడటం, ఆ జేబులో ఒక స్టేట్‌మెంటు ఈ జేబులో మరో స్టేట్‌మెంటు పెట్టుకొని తిరిగే వారిలో సంఘపరివార్‌ దళం కూడా ఉంది. ఉదాహరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ మాట్లాడుతూ అహంకారం కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సీట్లను భగవంతుడు రాముడు 241 సీట్ల దగ్గరనే నిలిపివేసినట్లు, సంపూర్ణ మెజారిటీకి దూరంగా పెట్టినట్లు ధ్వజమెత్తారు. జైపూర్‌ సమీపంలోని కనోటా వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో జూన్‌ 13వ తేదీన మాట్లాడుతూ రామభక్తులు క్రమంగా అహంకారులుగా మారారు. ఆ కారణంగానే రాముడు ఆ పార్టీని అతిపెద్దపార్టీగా 241 సీట్ల వద్ద నిలిపాడని అన్నారు. ఇదంతా మోహన భగవత్‌ వ్యాఖ్యల తరువాతే జరిగింది. ఇంద్రేష్‌ కుమార్‌ వ్యాఖ్యలపై బిజెపి నుంచి నిరసన వెల్లడికావటంతో నష్టనివారణ చర్యగా ఆ సేవక్‌ మాటమార్చారు. రాముడిని వ్యతిరేకించిన వారు అధికారానికి దూరంగా ఉన్నారు. అనుసరించిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మరుసటి రోజు చెప్పారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వం రాత్రి పగలు పనిచేస్తుందని,దేశం ఎంతో పురోగతి సాధిస్తుందన్న నమ్మకంతో జనం ఉన్నారని ఆకాశానికి ఎత్తారు.మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలపై తలెత్తిన రచ్చ గురించి ప్రశ్నించగా దాని గురించి సంఫ్‌ు అధికారిక ప్రతినిధులను అడిగితే మంచిదని పిటిఐ వార్తా సంస్థతో అన్నారు.
మోహన్‌ భగవత్‌ చెప్పిన హితవులో మణిపూర్‌ హింసాకాండ అంశం కూడా ఉంది. ” ఈ ఈశాన్య రాష్ట్రంలో చూస్తుంటే ఎట్టకేలకు తుపాకి సంస్కృతి అంతమైనట్లుగా కనిపించింది, అయినప్పటికీ ”ఆకస్మికంగా” హింసాకాండ చెలరేగింది. ఎలాంటి ఆలశ్యం లేకుండా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది ” అని మోహన్‌ భగవత్‌ చెప్పారు.” గత పది సంవత్సరాల్లో మణిపూర్‌లో హింసాకాండ లేదు. కానీ పరిస్థితి దిగజారింది.శాంతియుత పరిస్థితి కోసం గత ఏడాదిగా ఆ రాష్ట్రం ఎదురుచూస్తోంది.” అన్నారు. మణిపూర్‌, కేంద్రంలోనూ రెండు చోట్లా స్వయం సేవకులే పాలకులుగా ఉన్నారు. హింసాకాండ చెలరేగి వందలాది మంది మరణించారు, వేలాది మంది నెలవులు తప్పారు. గిరిజన మహిళలను వివస్త్రలుగా ఊరేగించిన ఉదంతం వెలుగుచూడకుండా చేసేందుకు అదే సేవకులు పాటుపడ్డారు. అది బయటకు వచ్చిం తరువాత అక్కడకు వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పిరావాల్సిన కేంద్ర సేవక్‌ కదలేదు, మెదల్లేదు. ఇదేం పని అంటూ ప్రధాన సేవక్‌ ప్రశ్నించిన దాఖల్లాలేవు.చెంపదెబ్బ మాదిరి లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లోని రెండు స్థానాల్లో బిజెపి ఓడిపోయిన తరువాత మోహన్‌ భగవత్‌ సుభాషితాలకు పూనుకున్నారు. అక్కడ హిందువులైన మెయితీలు, క్రైస్తవులైన గిరిజన కుకీలు బిజెపిని మట్టికరిపించారు. రెండింజన్లు పనికిరానివిగా తేల్చారు. గుజరాత్‌ మారణకాండ సందర్భంగా రాజధర్మం పాటించాలని చెప్పిన అతల్‌ బిహారీ వాజ్‌పేయి మాటలనే పూచికపుల్లగా తీసిపారేసిన, మార్గదర్శక మండల్‌ పేరుతో సీనియర్ల కమిటీ అంటూ వేసి దాన్ని విస్మరించిన మోడీ గురించి జనానికి తెలిసినా మోహన్‌ భగవత్‌కు తెలియదంటే నమ్మలేము. స్వయం సేవకుల మీద ఎలాంటి నియంత్రణ ఉండదు అని చెప్పారు.


మణిపూర్‌ గురించి మోహన్‌ భగవత్‌ స్పందించటం ఇదే తొలిసారి కాదు. అక్కడ ఉన్న సామాజిక తరగతులైన మెయితీ-కుకీల మధ్య దీర్ఘకాలంగా ఉన్న పరస్పర అనుమానాలు, విబేధాల పూర్వరంగంలో బిజెపి మత అజండాతో మెయితీలను దగ్గరకు తీసి అధికారాన్ని పొందింది.హిందువుల సంతుష్టీకరణ, ఓటుబ్యాంకు రాజకీయాలకు తెరలేపింది. మెయితీలను కూడా గిరిజనులుగా పరిగణిస్తూ వారికి రిజర్వేషన్లను వర్తింప చేయాలంటూ తనకు లేని అధికారంతో హైకోర్టు సిఫార్సు చేసింది. దానికి నిరసన తెలిపిన గిరిజనులను అణచివేసేందుకు పూనుకోవటంతో హింసాకాండ తలెత్తింది.దారుణాలు చోటు చేసుకున్నాయి.ఈ వాస్తవాన్ని మూసిపెట్టేందుకు హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ గతేడాది అక్టోబరు 24న విజయదశమి సందేశంలో మోహన్‌ భగవత్‌ బిజెపి పాటను పాడారు. 2023 మే నెల మూడవ తేదీ నుంచి హింసాకాండ జరుగుతుంటే అక్టోబరు వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ స్పందించలేదు. విదేశీ హస్తమే వాస్తవం అనుకుంటే విదేశీ సరిహద్దులు ఉన్న ఆ రాష్ట్రంలో స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు సదరు హస్తాన్ని ఖండించకుండా, కట్టడి చేయకుండా ఏ గుడ్డిగుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? అప్పటి వరకు మాట్లాడని మాదక ద్రవ్యాల ఉగ్రవాదం, అక్రమంగా ప్రవేశించిన కుకీలు అంటూ కొత్త కతలను చెప్పారు. ఒక మాదక ద్రవ్య మాఫియా నేత (కుకీ) పట్ల నిదానంగా వ్యవహరించాలని ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌(మెయితీ) హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు ఒక పోలీసు అధికారి చెప్పిన మాటలను మరచిపోరాదు.మెయితీ-కుకీల మధ్య సంబంధాలకు ఎవరో మతం రంగు పులిమేందుకు చూశారని కూడా విజయదశమి ఉపన్యాసంలో భగవత్‌ ఆరోపించటం దొంగేదొంగని అరిచినట్లుగా ఉంది. అందువలన మణిపూర్‌ సమస్యను పట్టించుకోవాలని ఇప్పుడు మోహన్‌ భగవత్‌ చెప్పటంలో చిత్తశుద్ది ఉందా ? మణిపూర్‌ను సందర్శించటానికి నరేంద్రమోడీకి తీరిక దొరకలేదు, వెళ్లి సమీక్ష జరపాలని చెప్పటానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆలోచన తట్టలేదంటే నమ్మే అమాయకులు కాదు జనం.


ఎన్నికలలో నరేంద్రమోడీ, బిజెపి పెద్దల దిగజారుడు ప్రసంగాల తీరు తెలిసిందే. దాన్ని తక్కువ చేసి చూపేందుకు అందరూ అలాగే నోరుపారవేసుకున్నారంటూ భగవత్‌ మాట్లాడారు. నిజమైన ” సేవక్‌ ” ఎల్లవేళలా గౌరవం, వినయాన్ని ప్రదర్శించాలన్నారు. మోడీ ఎన్నికల ప్రసంగాల్లో అలాంటివి మచ్చుకైనా కనిపించాయా ? అడుగడుగునా అహంకార ప్రదర్శన, అబద్దాలు, వక్రీకరణలు, స్వంతడబ్బా, ప్రతిపక్షాలపై వ్యంగ్యాలు తప్ప ఒక ప్రధాని స్థాయిలో మాట్లాడింది లేదు. మోడీ గ్యారంటీలంటూ పెద్ద ఎత్తున వ్యక్తిపూజకు తెరలేపారు. దాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ మేథావులు అంగీకరించబట్టే కొనసాగింది. తీరా ఎదురుతన్నిన తరువాత ఇప్పుడు దానికి బాధ్యత తమది కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు.తమకు ఆర్‌ఎస్‌ఎస్‌తో అవసరం లేదని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన వ్యాఖ్య యధాలాపంగా చేసిందనుకుంటే పొరపాటు.రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత నరేంద్రమోడీ చుట్టూ ఉన్నవారిలో అంతర్లీనంగా పెరుగుతున్న అభిప్రాయమే ఇది. సంఘపరివార్‌కు బదులు మోడీ పరివారాన్ని రూపొందించే క్రమంలో వ్యక్తిపూజను ముందుకు తెచ్చారు. గతంలో చౌకీదార్‌ అన్నట్లుగానే కేంద్ర మంత్రులతో సహా అందరూ మోడీకాపరివార్‌ అని తమ సామాజిక మాధ్యమాల్లో పేర్లకు తగిలించుకున్నారు. భజనబృందంలో చేరారు. ప్రతి విజయం వెనుక ఉన్నది మోడీ మాత్రమే అని చెప్పటమే కాదు, తాజా ఎన్నికల్లో మోడీ హామీల పేరుతో జనాన్ని ఊదరగొట్టటం దాని కొనసాగింపే. దీనికి గోడీ మీడియా ఎంతగానో సహకరించింది. తాను మామూలుగా జన్మించలేదని మోడీ చెప్పుకోవటం దానికి పరాకాష్ట. దీన్ని సంఘసేవక్‌లు కొందరు జీర్ణించుకోలేదని, వారిని సంతుష్టీకరించేందుకు మోడీ కూడా సంఘసేవకుల్లో ఒకరే అన్న సందేశమిస్తూ మోహన్‌ భగవత్‌ పరోక్షంగా వ్యాఖ్యానించారని చెప్పవచ్చు. నరేంద్రమోడీ మాదిరి మాజీ ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పాయి కూడా సంఘసేకుడే, దాని తిరోగామి భావజాల ప్రతినిధే అన్నది నిస్సందేహం. అయితే మోడీ మాదిరి దిగజారిన ప్రసంగాలు చేయలేదు.అద్వానీ మాదిరి కరడుగట్టిన హిందూత్వవాదిగా బయటకు కనిపించేందుకు చూడలేదు.


ప్రపంచంలో అనేక తిరోగామి, ఫాసిస్టు, నాజీ లక్షణాల సంస్థల వంటిదే ఆర్‌ఎస్‌ఎస్‌. అది మత తీవ్రవాద పులిని ఎక్కింది. దాని మీద నుంచి దిగితే మింగివేస్తుంది, ప్రాణాలు నిలుపుకోవాలంటేే స్వారీ చేయాల్సిందే. దేశం, సమాజం మీద పట్టు సాధించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక మందిని జనసంఘం, బిజెపి వంటి రాజకీయ పార్టీ, మత సంస్థల రూపంలో మరికొందరిని ముందుకు తెచ్చింది. ఉపయోగించుకోవటం, పనికిరారు,అజెండాను అమలు జరపలేరు అనుకుంటే పక్కన పెట్టేయటం అనేక మందిని చూశాము. అద్వానీ, వాజ్‌పాయిలను కూడా అది సహించలేదు.నరేంద్రమోడీని కూడా ఉపయోగపడినంత వరకు పల్లెత్తుమాట అనలేదు, మద్దతు ఇచ్చింది, తన అజెండాను అమలు చేయించింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో అది వికటించిన తీరు గమనించిన తరువాత మరో బొమ్మను తెచ్చేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. తన అజెండాను ముందుకు తీసుకుపోయే సాధనంగా పనికి వస్తారా లేదా అన్నదే దానికి గీటురాయి. అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో ఓడిపోవటం, వారణాసిలో గతంలో వచ్చిన మెజారిటీతో పోలిస్తే గణనీయంగా తగ్గటంతో నరేంద్రమోడీ బలహీనత ఏమిటో వెల్లడైంది. ఇంకేమాత్రం తమ అజెండాను ముందుకు తీసుకుపోయే అవకాశం లేదన్న సంశయం మొదలై ఉండాలి. నరేంద్రమోడీని ఒకందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు తెస్తే మరొకందుకు కార్పొరేట్‌ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. అందువలన మోడీని సేవక్‌ల గుంపులో ఒకరిగా ఆర్‌ఎస్‌ఎస్‌ చూస్తే పప్పులో కాలేసినట్లే. సంఘపరివారం మెచ్చిన నేతలు ఉండవచ్చు తప్ప కార్పొరేట్లకు నచ్చిన వ్యక్తిని వెంటనే ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయటం అంత తేలికకాదు. ఇది సంఫ్‌ు బలహీనత. ఈ పూర్వరంగంలో మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు టీకప్పులో తుపానులా సమసిపోతాయా ? 75సంవత్సరాల వయస్సు వచ్చిన వారు పదవుల నుంచి తప్పుకోవాలనే పేరుతో 73 సంవత్సరాల మోడీని కొన్ని రాష్ట్రాల ఎన్నికల తరువాత 2026లో గౌరవంగా సాగనంపుతారా ? దానికి కార్పొరేట్లు అంగీకరిస్తాయా ? చూద్దాం !