Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మూడవ సారి నరేంద్రమోడీ ప్రధాని పదవి చేపట్టారు. ఎంతో వేగంగా పని చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. దానికి పక్కా నిదర్శనం జమ్మూ-కాశ్మీరుకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 370ని ఎంత వేగంగా రద్దు చేశారో దేశం చూసింది. 2019 జూలై చివరి వారంలో అసాధారణ రీతిలో కాశ్మీరులో భద్రతా దళాలను మోహరించారు.ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం నాడు అమరనాధ్‌ యాత్రీకులకు ముప్పు ఉందంటూ యాత్ర నిలిపివేయాలని భద్రతా హెచ్చరిక కాశ్మీరు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.ఆదివారం నాడు రాష్ట్ర మంతటా 144సెక్షన్‌ ప్రకటించారు, ఇంటర్నెట్‌ నిలిపివేశారు. సోమవారం నాడు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ముందు అదేరోజు రాష్ట్రపతి ఉత్తరువు వెలువడింది. వెంటనే మంత్రివర్గ సమావేశం, అనంతరం అదే రోజు దాని మీద రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు.సభ్యులకు దాని కాపీలు ఇవ్వలేదు. ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశమైతే గంటన్నరలో అంటే 12.30లోగా 57పేజీల పత్రం మీద కావాలంటే సవరణలు ప్రవేశపెట్టవచ్చంటూ చెప్పారు. వాటిని చదివేందుకు కూడా ఆ సమయం చాలదు. అదే రోజు సభలో ఆమోదం కూడా పొందారు.మరుసటి ఏడాది కరోనాను అవకాశంగా తీసుకొని మూడు సాగు చట్టాలనూ అంతే వేగంగా ఆమోదించి అమలు చేసేందుకు పూనుకున్నారు.వేగంగా పనిచేసే నాయకత్వ ఘనత గురించి నరేంద్రమోడీ భక్తులు, గోడీ మీడియా పండితులను అడిగితే కొండవీటి చాంతాడంత జాబితాను మన ముందుంచుతారు. రైతుల మహత్తర ఉద్యమం కారణంగా స్వాతంత్య్రానంతరం దేశంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను క్షమాపణ చెప్పి మరీ 2021లో వెనక్కు తీసుకోవటం కూడా వేగంగా జరిగినట్లే !


ఈ వేగం కోట్లాది మంది కోట్లాది మంది రైతులు కోరుతున్న, గతంలో నరేంద్రమోడీ కూడా డిమాండ్‌ చేసిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేందుకు ఎందుకు లేదు ? రెండు సంవత్సరాల క్రితం ఎంఎస్‌పితో సహా రైతాంగ సమస్యలపై నియమించిన కమిటీ నుంచి ఇంతవరకు తాత్కాలిక నివేదికను కూడా ఎందుకు తెప్పించుకోలేదు ? ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ప్రభుత్వ తీరు ఉంది. మూడు సాగు చట్టాలను 2021నవంబరులో రద్దుచేసినపుడు వెంటనే ఒక కమిటీని వేస్తామన్నారు. వెంటనే అంటే ఎనిమిది నెలలు, 2022 జూలై 12న కమిటీని వేశారు. ఆలస్యం ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని, సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) నుంచి స్పందన కోసం ఎదురుచూడాల్సి రావటం అని వ్యవసాయ మంత్రి సాకులు చెప్పారు. ఆ కమిటీకి నివేదించిన అంశాలు, కమిటీలో ప్రతిపాదించిన వ్యక్తుల పట్ల అభ్యంతరాలు తెలుపుతూ మోర్చా తన ప్రతినిధులను పంపేందుకు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం-ఎన్నికల కమిషన్‌ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను అందించాలని సమాచార హక్కు కింద కోరగా అలాంటి రికార్డులు లేవని సమాధానం ఇవ్వటాన్ని బట్టి అసలు బండారం వెల్లడైంది.అంతే కాదు రైతు సంఘాలతో సంప్రదింపుల సమాచారం కూడా లేదని 2023 డిసెంబరు నాలుగవ తేదీన మరో సమాచార హక్కు ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఇక ప్రభుత్వం నియమించిన కమిటీ తీరుతెన్నులను చూస్తే ఎస్‌కెఎం ఎందుకు బహిష్కరించిందో వివరణ అవసరం లేదు. మొత్తం 29 మంది సభ్యులలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు, కాలేజీల్లో పనిచేసే వారే 18 మంది ఉన్నారు. మిగిలిన పదకొండు మంది అధికారేతర సభ్యులలో ఎస్‌కెఎం నుంచి ముగ్గురిని నియమిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. మరో ఎనిమిది మంది అధికారపార్టీ కనుసన్నలలో వ్యవహరించే రైతు ప్రతినిధులే ఉన్నారు. ఈ కమిటీకి అధ్యక్షుడు సంజరు అగర్వాల్‌. వివాదాస్పద మూడు సాగు చట్టాలను ప్రతిపాదించినపుడు వ్యవసాయశాఖ కార్యదర్శి. మరో సభ్యుడు ఇఫ్‌కో చైర్మన్‌ దిలీప్‌, ఇతగాడు గుజరాత్‌ బిజెపి మాజీ ఎంపీ. మరొకరు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ బికెఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడైన ప్రమోద్‌ చౌదరి, ఐదవ సభ్యుడు సయ్యద్‌ పాషా పటేల్‌ మహారాష్ట్ర బిజెపి మాజీ ఎంఎల్‌సి, ఇలా అందరూ గత సాగు చట్టాలను అడ్డంగా సమర్దించిన వారితోనే నింపిన తరువాత ఎస్‌కెఎం గళానికి అవకాశం ఎక్కడ ఉంటుంది.


ఇక ఈ కమిటీ తొలి పద్దెనిమిది నెలల కాలంలో 35 సమావేశాలు జరిపినట్లు, ఎప్పుడు నివేదిక సమర్పిస్తుందో చెప్పకుండా పార్లమెంటుకు ప్రభుత్వం జవాబిచ్చింది.ఫిబ్రవరి తరువాత మరో రెండు సార్లు సమావేశమైనట్లు వార్తలు.ఈ కమిటీ అనేక ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. వాటి నివేదికలు ఇవ్వాలని కోరినా అందుబాటులో లేవన్నదే ప్రభుత్వ సమాధానం. గతంలో స్వామినాధన్‌ కమిషన్‌, తరువాత నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన 2016కమిటీ కూడా అనేక అంశాలను చర్చించింది. అందువలన కొత్త కమిటీ చర్చల పేరుతో కాలయాపన తప్ప మరొకటి కాదు. వాటి సిఫార్సులకు వ్యతిరేకంగా మూడు సాగు చట్టాల్లోని అంశాలు ఉన్నాయి. అయినా మోడీ వాటిని రద్దు చేస్తూ 2021లో చేసిన ప్రసంగంలో రైతులకు కొత్త ఆశలను రేకెత్తించారు.2014 ఎన్నికల సమయంలో బిజెపి చేసిన వాగ్దానానికి వ్యతిరేకంగా మోడీ సర్కార్‌ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దేశ 75వ స్వాతంత్య్రదినోత్సవం (2022) నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని 2016 ఫిబ్రవరి 28 బడ్జెట్‌ సందర్బంగా మోడీ చెప్పారు. అదే ఏడాది ఏర్పాటు చేసిన అశోక్‌ దలవాయి కమిటీ 2012-13 ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అంచనా ప్రాతిపదికన 2015-2016లో ఒక రైతు రాబడి ఏడాదికి రు.96,703, నెలకు రు.8,058 ఉంటుందని అంచనా వేసి 2022-23నాటికి అది రు.2,71,378- రు.22,610 ఉండాలని, దాన్ని సాధించాలంటే ఏటా 10.4శాతం పెరుగుదల ఉండాలని చెప్పింది. ఇప్పుడు ఎంత ఉందో ఎక్కడా ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే 2018-19లో 77వ రైతు కుటుంబాల పరిస్థితి అంచనా సర్వే ప్రకారం రాబడుల మొత్తాలు రు.1,22,616-రు.10,218 ఉన్నట్లు తేలింది. ఈ నివేదికను 2021లో విడుదల చేశారు. దీని ప్రకారం చూస్తే వార్షిక పెరుగుదల కేవలం 2.8శాతమే ఉంది. పదేండ్ల యూపిఏ పాలన సగటు మూడు శాతం కంటే తక్కువ. అయితే ఏ ప్రాతిపదిక లెక్కించారో చెప్పకుండా కొన్ని పంటలకు 2022 ఆర్థిక సంవత్సరంలో రాబడి రెట్టింపు ఉన్నట్లు ఎస్‌బిఐ పరిశోధనా విభాగం చెప్పిన అంకెలను బిజెపి పెద్దలు ఊరూవాడా ప్రచారం చేశారు. గోడీ మీడియా దాన్ని ఇంకా ఎక్కువ చేసింది. నిజంగా అంత పెరిగి ఉంటే రైతాంగం ఈ ఎన్నికల్లో అనేక చోట్ల బిజెపి, దాని మిత్రపక్షాలను ఎందుకు మట్టికరిపించినట్లు ? అనేక చోట్ల రైతులు కనీస మద్దతు ధరలకంటే తక్కువకే అమ్ముకుంటున్నారు. రైతుల రాబడి రెట్టింపు ఎంతవరకు వచ్చిందన్న ప్రశ్నకు 2023 డిసెంబరులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్పందిస్తూ వ్యవసాయం రాష్ట్రాల అంశం గనుక అవి చూసుకుంటాయని దాట వేశారు. మూడు సాగు చట్టాలను రాష్ట్రాలతో సంప్రదించకుండా వాటి ఆమోదం లేకుండా అమలుకు పూనుకున్నపుడు ఈ అంశం గుర్తులేదా ? రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తిని గమనించి గత ఎన్నికలకు ముందు కొంత మంది రైతులకు నెలకు రు.500 ఏడాదికి ఆరువేల చొప్పున పిఎం కిసాన్‌ నిధిపేరుతో ఇస్తున్నారు. ఐదేండ్లలో పెరిగిన వ్యవసాయ ఖర్చులతో పోల్చితే ఇది ఏమూలకూ రాదు. ఈ మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచనుందనే లీకులను వదిలి రైతాంగాన్ని మభ్యపెట్టేందుకు చూసింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు.


తాజాగా వర్తమాన ఖరీఫ్‌ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గతేడాది ఏడుశాతం పెంచగా ఇప్పుడు ఓట్లతో నిమిత్తం లేదు గనుక 5.4శాతం మాత్రమే పెంచారు. తాజా ఎన్నికల్లో 159 గ్రామీణ నియోజకవర్గాలలో ఓడిపోయిన బిజెపి దాన్నుంచి ఎలాంటి పాఠం నేర్చుకోలేదన్న సంయుక్త కిసాన్‌ మోర్చా వ్యాఖ్యను గమనించాలి.ఈ సందర్భంగా పదేండ్ల యుపిఏ పాలనలో పెరిగింది ఎంత, రాబడిని రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ ఎంత పెంచారు అన్నది మీడియాలో చర్చకు వచ్చింది. దీన్ని గోడీ మీడియా మూసిపెట్టేందుకు చూసింది.ప్రభుత్వ సమాచారం ప్రకారమే మచ్చుకు సోయాబీన్‌కు గత పాలకులు, 175, పత్తికి 115శాతం పెంచగా మోడీ పదేండ్లలో 80,79శాతాల చొప్పునే పెంచారు. అనేక పంటల ధరల పెరుగుదల శాతాల తీరు తెన్నులు దిగువ విధంగా ఉన్నాయి. దీనికి ఆధారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారం.ఈ కనీస మద్దతు ధరలు కూడా రైతాంగంలో కేవలం పద్నాలుగుశాతం మాత్రమే పొందుతున్నారన్నది అంచనా.


పంట××××× యుపిఏ ×× మోడీ ఏలుబడి

వరి ముతక×× 138.2 ×× 66.7
గోధుమ ×× 122.2 ×× 62.5
చెరకు ×× 187.7 ×× 50.0
ఆవాలు ×× 90.6 ×× 85.3
పత్తి ××114.5 ×× 78.9
మొక్క జొన్న ××1594 ×× 59.5
శనగలు ×× 121.4×× 75.5
కందులు ×× 216.2×× 62.8
నరేంద్రమోడీ సర్కార్‌ రైతులకు చేసిన మేలు ఇలా ఉంది గనుకనే అనేక చోట్ల బిజెపి ఎదురుదెబ్బలు తిన్నది, గత ఎన్నికల కంటే సీట్లు, ఓట్ల శాతాన్ని కూడా కోల్పోయింది. దేశాన్ని ఊపివేస్తున్న నీట్‌ పరీక్షా పత్రాల కుంభకోణం ఎన్నికలకు ముందే వెలువడి ఉంటే దాని పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. దేశం కోసం-ధర్మం కోసమంటూ కబుర్లు చెప్పిన కాషాయదళం తీరుతెన్నులు వచ్చే ఐదు సంవత్సరాలూ వ్యవసాయ రంగంలో ఇదే విధంగా ఉండకూడని అనేక మంది కోరుతున్నారు.పెడచెవిన పెడితే రైతాంగ ఉద్యమాలు వెల్లువెత్తుతాయి. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 15-16శాతమే ఉన్నప్పటికీ జనాభాలో 45శాతం మందికి ఉపాధి చూపుతున్నది. ఇది కూడా కుదేలైతే గ్రామీణా ప్రాంతాలలో అలజడి రేగుతుంది. జూలై పదవ తేదీన సంయుక్త కిసాన్‌మోర్చా జనరల్‌ బాడీ సమావేశం ఎన్నికల అనంతర పరిస్థితి గురించి సమీక్ష, కార్యాచరణ గురించి చర్చించనుంది.