Tags
BJP, CHANDRABABU, Janasena, Narendra Modi Failures, Pawan kalyan, Polavaram Irrigation Project, YS jagan
ఎం కోటేశ్వరరావు
రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఒకటి. అప్పులు చేయటంలో నరేంద్రమోడీ అంతకు ముందున్న ప్రధానుల రికార్డులను తునాతునకలు చేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్ పత్రాల్లో ఉంది. వర్తమానంలో మరో 16-17లక్షల కోట్లు అప్పు చేయనున్నారు. అందువలన పోలవరానికి నిధుల సమస్య ఉండదని, చంద్రబాబు అడగాలే గానీ ఎంత కావాలంటే అంత ఇస్తారని అందరూ భావిస్తున్నారు.అది సాకారం కావాలని కోరుకుందాం. గడచిన పది సంవత్సరాలలో జరిగిన పోలవరం ప్రాజక్టు నిర్మాణం-సంభవించిన నష్టం, ప్రస్తుత పరిస్థితి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 28న శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. గడిచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి చెప్పాయి. పునరుద్దరణే కాదు, సంక్షేమ పధకాలను మరింతగా అమలు చేస్తామని వాగ్దానం చేశాయి. అలవిగాని హామీలు ఇచ్చిన తెలంగాణా కాంగ్రెస్ వాటిని ఎలా అమలు చేయనుందో చెప్పాలని ఆ రాష్ట్ర బిజెపి డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మీ కూటమి కూడా అంతకంటే ఎక్కువే వాగ్దానాలు చేసింది, వాటి సంగతేమిటంటే ఆ ఎన్నికల ప్రణాళికతో బిజెపికి సంబంధం లేదని నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతలకు కంటిచూపే తప్ప నోటమాట ఉండటం లేదు. మరీ గట్టిగా అడిగితే చంద్రబాబుకు ఉన్న అనుభవంతో అన్నింటినీ అమలు చేస్తారంటూ ఆయన మీద నెడుతున్నారు. ఇక్కడ పోలవరం ప్రాజక్టు శ్వేత పత్రంలోని అంశాలను చూద్దాం.
గోదావరి నదిపై రాజమండ్రి కాటన్ బారేజ్‌కు ఎగువన 42కిలో మీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లా రామయ్య పేట సమీపంలో బహుళార్ధసాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం జాతీయ హౌదా ఇవ్వక ముందే దీనికి అనుమతులతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని పనులు జరిగాయి. సముద్ర మట్టానికి 45.72 మీటర్ల ఎత్తున ఆనకట్ట నిర్మిస్తే 194.6టిఎంసిల నీటిని నిలువ చేయవచ్చని అంచనా. ఈ నీటితో 3.2లక్షల ఎకరాలు కుడి, నాలుగు లక్షల ఎకరాలకు ఎడమ కాలువ ప్రాంతంలో కొత్తగా సాగునీరు, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతంలోని 23.5లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణ, 80టిఎంసి నీటిని ప్రకాశం బారేజ్‌కు ఎగువన కృష్ణా నదికి మళ్లింపు, 960మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలు, పరిసరాల్లో ఉన్న జనావాసాలకు 23.44 టీఎంసీల నీటి సరఫరా, కాలువలు వెళ్లే ప్రాంతాలలోని 540 గ్రామాలకు మంచి నీటి సరఫరా కలుగుతుంది. అందుకే దీన్ని జీవనాడిగా పరిగణిస్తున్నారు. పైన చెప్పుకున్న 80టిఎంసిల మళ్లింపు జలాలు వాడుకున్నందుకు గాను కృష్ణా నదీ జలాల్లో ఆంధ్ర ప్రదేశ్ వాటా తగ్గుతుంది. ఈ నీటిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు 45,కర్ణాటకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసిలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోయినందున దానికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంది.పోలవరంపై బ్రిటీష్ వారి హయాంలో తొలిసారిగా 1941లో ప్రతిపాదన రాగా 1942-44 సంవత్సరాలలో ప్రాధమిక పరిశీలన జరిగింది. ఆనకట్ట ఎత్తు 170 నుంచి 208 అడుగులు ఉంటే 340 నుంచి 700 టిఎంసిల వరకు నీటిని నిల్వచేయవచ్చని చెప్పారు.ఇపుడు అంత ఎత్తుకు ఎగువ రాష్ట్రాలు అంగీకరించే ప్రసక్తే లేదు గనుక ఆ ప్రతిపాదన చరిత్రగా మిగిలింది. ప్రస్తుతం 150 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రంలో ఉన్న సంగతులు, వాటిని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రానున్న ఐదేండ్లలో సాకారం గురించి, ఇతర అంశాల గురించి చెప్పుకుందాం.
ఒక ప్రధాన సమస్య కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించినపుడే మొదలైంది, అదే పునరావాసం.ముందే చెప్పుకున్నట్లుగా ప్రాజక్టు నిర్మాణం ముందే ప్రారంభమైన కారణంగాగా 2014 ఏప్రిల్ ఒకటి నుంచి అప్పటి అంచనా ప్రకారం నీటి పారుదల(ఆనకట్ట, కాలువలు) నిమిత్తమయ్యే ఖర్చు నూటికి నూరుశాతం భరిస్తామని కేంద్రం చెప్పింది. దానిలో ప్రధానమైన ముంపు బాధితుల పునరావాసం, విద్యుత్ ప్రాజక్టు ఖర్చు లేదు. విద్యుత్ ప్రాజక్టుకు అయ్యే వ్యవయం రు.4,560 కోట్లే గనుక తామే భరిస్తామని నాటి తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించింది. పునరావాసానికి అయ్యే ఖర్చు తామే భరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితి శాతాల గురించి శ్వేత పత్రంలో దిగువ విధంగా పేర్కొన్నారు.
అంశం×××× 2019 మే××× 2024 మే
సివిల్ పని ×× 71.93 ××× 75.77
హెడ్ వర్క్స్ × 65.67 ××× 72.63
కాంక్రీటు ×× 91.14 ××× 92.75
ఎల్‌ఎంసి ×× 70.99 ××× 73.07
పునరావాసం× 18.66 ××× 22.55
ఖర్చురు.కోట్లు×16493.18××21489.71
దీని ప్రకారం రానున్న రోజుల్లో ప్రధానమైన సమస్యగా పునరావాసం ముందుకు రానుంది.ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసిన తరువాత రిజర్యాయర్లో మునిగే ప్రాంతం, అక్కడి వారి పునరావాసం గురించి మాట్లాడకుండా శ్వేత పత్రంలోనూ, విడిగా చంద్రబాబు నాయుడు అశ్వద్ధామ కుంజరహ అన్నట్లుగా గత ఐదేండ్ల జగన్‌మోహన రెడ్డి పాలనలో జరిగిన తప్పిదాల గురించే పెద్ద ఎత్తున చర్చలోకి తీసుకువస్తున్నారు. శ్వేత పత్రంలో పునరావాసం గురించి ప్రస్తావించినప్పటికీ అందుకు అవసరమైన మొత్తాలను కేంద్రం నుంచి తెస్తారా, రాష్ట్రమే భరిస్తుందా అన్న ప్రస్తావన లేదా వివరణ లేదు.మొదటి దశ అంటే ఆనకట్ట ఎత్తు 41.15 మీటర్లు లేదా 130 అడుగుల వరకు నిర్మిస్తే లక్షా 98 ఎకరాల భూసేకరణకు గాను 83,659 ఎకరాలను స్వాధీనం చేసుకోగా మిగిలిన మొత్తాన్ని 2025 జనవరి నాటికి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలోని 38,060కు గాను 12,797 కుటుంబాలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. మిగిలిన వారిని 2026 మార్చి నాటికి తరలిస్తారు. రెండవ దశ 150 అడుగుల ఎత్తుకు ఆనకట్ట నిర్మాణం జరిపితే మునిగే మరో 67,665 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 29,465ఎకరాలను స్వాధీనం చేసుకోగా మిగతా ప్రాంతాన్ని రెండవ దశలో చేపడతారు. ఈ ప్రాంతంలో 2017-18 సంవత్సరంలో చేసిన సర్వే ప్రకారం 1,06,006 కుటుంబాలను తరలించాల్సి ఉంటుంది.అయితే సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం 96,660 కుటుంబాలను మాత్రమే గుర్తించారు. ఈ లెక్క ప్రకారమైనా రెండు దశల్లో ఇప్పటికి తరలించిన 12,797పోను మరో 83,863 కుటుంబాలను ఇంకా తరలించాల్సి ఉంది. తొలి సర్వే ప్రకారమైతే 93,209 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. దీనికి గాను తొలి దశ భూసేకరణ-పునరావాసానికి రు.7,116, రెండవ దశకు రు.18,801 కోట్లు, మొత్తం రు.25.917 కోట్లు కావాల్సి ఉన్నట్లు శ్వేత పత్రం తెలిపింది. ఇతర వ్యయం పెరిగినట్లే దీనికి కూడా కచ్చితంగా పెరుగుతుంది. ఈ మొత్తం రు.35వేల కోట్ల వరకు ఉండవచ్చని చెబుతున్నారు.దీని గురించి శ్వేత పత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదు. బాధితులకు చెల్లించాల్సిన మొత్తాల గురించి కూడా ఒక స్పష్టత లేదు.
ప్రాజెక్టు పూర్తి చేయటం, నీటి విడుదల గురించి గతంలో, ప్రస్తుతం తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాల సిఎంలు చెప్పిన కబుర్లు మొదటి దశ గురించే అన్నది గమనించాలి.ఏజన్సీని మార్చకుండా, పథకం ప్రకారం పనులు జరిగి ఉంటే 2020 నాటికే నీటిని సరఫరా చేసి ఉండేవారని చెప్పారు, తరువాత వాయిదాలు వేసి 2023జూన్‌కు పొడిగించారు, ఇప్పుడు మరో ఏడాది గడచింది. ఇది ఎప్పుడు పూర్తవుతుందంటే సిఎం చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు అని చెబుతున్నారు.కుడి, ఎడమ కాలవల్లో మిగతా భాగాలు పూర్తి కావాలి. పంట కాలువల తవ్వకం ఇంతవరకు చేపట్టలేదు. అందువలన రెండవ దశ ఎప్పటికి అన్నది అసలు చర్చకే రాలేదు. ఇక ప్రాజెక్టు వ్యయం ఇబ్బడి ముబ్బడి అయింది. దాన్ని ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు.గతంలో నిర్మాణ వ్యయానికి సంబంధించిన వివరాలు దిగువ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కోట్ల రూపాయల్లో అని గమనించాలి.టిఏసి-టెక్నికల్ అసిస్టెస్స్ కమిటి, సిడబ్ల్యుసి-కేంద్ర జల కమిషన్, ఆర్‌సిసి-సవరించిన ధరల కమిటీ
అంశం ××××××××× 2010-11××××××2013-14××××××××2017-18
అంశం ××××××××× టిఏసి ××× టిఏసి × సిడబ్ల్యుసి × ఆర్‌సిసి × సిడబ్ల్యుసి
నీటిపారుదల ×××××× 12,944 ×××24,467 × 26,158ి × 43,165 × 51,096
విద్యుత్ ఉత్పత్తి×××××× 3,716 ××× 4,561 × 4,561ి × 4,561 × 4,561
మొత్తం ఖర్చు ×××××× 16,010 ×××29,028 × 30.719 × 47,725 × 55,657
పైన పేర్కొన్న వివరాలలో 2013-14 సంవత్సర సిఫార్సులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.ఇక 2017-18 సంవత్సరాల సవరించిన అంచనాలను 2019 ఫిబ్రవరి 11న చంద్రబాబు నాయుడు సిఎంగా ఉండగానే టెక్నికల్ అసిస్టెన్స్ కమిటీ రు.55,657 కోట్లకు ఆమోదం తెలిపింది. జగన్‌మోహన రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో అనేక సార్లు మోడీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వినతి పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందటానికి ఏం చేసిందీ తెలియదు. లేఖలు రాశారా, కేంద్రం ఏం సమాధానమిచ్చిందీ తెలియదు. ఆమోదం లభించలేదని తాజా శ్వేతపత్రం తెలిపింది. ఈ అంచనా సవరణ జరిగి ఆరు సంవత్సరాలైంది. అప్పటి నుంచి ధరలు మరింత పెరిగాయి.పైన పేర్కొన్నట్లుగా కేవలం మూడు సంవత్సరాల్లోనే వ్యయం 30 నుంచి 55వేల కోట్లకు పెరిగితే తరువాత ఆరు సంవత్సరాల్లో పెరుగుదల అంచనా వేయాల్సి ఉంది. ఆరేండ్ల నాటి దానికే మోడీ సర్కార్ ఆమోదం తెలపలేదు, ఇప్పుడు తాజా అంచనాలు ఇంకా వేయలేదు, వాటికి ఎప్పుడు ఆమోదం లభించేదీ అగమ్యగోచరమే.
అందువలన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడి వర్తమాన హయాంలో మొదటి దశ పూర్తి కావటం కూడా ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పవచ్చు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే అదేమీ అసాధ్యం కాదు. ఎన్నికలకు ముందు పోలవరం బాధితుల పునరావాసానికి అయ్యే 30వేల కోట్లను విరాళాల ద్వారా సేకరించి ఇవ్వవచ్చని దానికి గాను తన వంతు వాటాగా కోటి రూపాయలు ఇస్తానని పవన్ కల్యాణ్ ఒక సందర్భంగా చెప్పారు.దేశ విదేశాల్లో చంద్రబాబు-పవన్ కల్యాణ్‌కు ఎంతో పలుకుబడి ఉందని చెబుతున్నారు గనుక కేంద్రం ఇవ్వకపోతే ఆమొత్తాన్ని వారు సేకరించి బాధితులకు న్యాయం చేయాలి. కావాల్సింది పునరావాసం తప్ప నిధులు ఎక్కడి నుంచి తెచ్చారన్నదానితో బాధితులకు సంబంధం ఉండదు.పోలవరం సత్వర నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు, పునరావాస ఖర్చు భరింపుకు ఆమోదం పొందటం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తమ ప్రతిష్ట, పలుకుబడిని ఉపయోగించగలరని జనం గట్టిగా నమ్ముతున్నారు.అయితే ఆంధ్రప్రదేశ్ పట్ల బిజెపి చిత్తశుద్దితో ఉన్నదా అన్న అనుమానాలు ఇప్పటికీ జనంలో ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రణాళికకు అది దూరంగా ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలు సర్దుకుపోయాయి. వాగ్దానాలకే ముందుకు రాని బిజెపి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు భారీ మొత్తంలో నిధులను కేటాయిస్తారా ? చంద్రబాబు చెప్పినట్లు ఏపి అంటే అమరావతి, పోలవరం కాదు. అవి రెండు ప్రధాన సమస్యలు మాత్రమే. మొత్తం రాష్ట్ర సమగ్రవృద్దికి పని చేస్తున్నారనే అభిప్రాయం జనంలో కలగకపోతే రాజకీయంగా పెద్ద ప్రమాదం పొంచి ఉంది.
