Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


జూలై 22 నుంచి ఆగస్టు ఆరు వరకు జరిపే కన్వర్‌-కావడి యాత్రల సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌ ప్రభుత్వాలు జారీ చేసిన వివాదాస్పద ఉత్తరువు అమలును సోమవారం నాడు సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది బిజెపి హిందూత్వ అజెండాకు ఎదురు దెబ్బ యాత్రలు జరిగే దారిలో ఉన్న దుకాణాలు,హౌటళ్ల, పానీయాల దుకాణాల యజమానుల పేర్లను సంస్థల ముందు ప్రదర్శించాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. వాటిలో హలాల్‌ ధృవీకరణ పత్రం ఉన్న పదార్థాలను విక్రయించరాదని కూడా పేర్కొన్నారు. యాత్రల పవిత్రతను కాపాడేందుకు అని చెబుతున్నప్పటికీ అధికారిక ఉత్తరువుల్లో శాంతి భద్రతలను సాకుగా చూపారు. ఈ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం పేర్ల ప్రదర్శనకు బ్రేకు పడింది. అయితే ఆహార పదార్ధాల స్వభావాన్ని వినియోగదారులకు ప్రదర్శించాలని కోర్టు పేర్కొన్నది. పోలీసులు తీసుకున్న చర్యలతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని, సామాజికంగా వెనుకబడిన తరగతులు, మైనారిటీలను ఆర్థికంగా విడదీస్తుందని పిటీషనర్ల తరఫున వాదించిన సియు సింగ్‌ చెప్పారు. మరో న్యాయవాది అభిషేక్‌ షింఘ్వి తన వాదనలను వినిపిస్తూ ” నేను గనుక పేరును ప్రదర్శించకపోతే నన్ను మినహాయిస్తారు, నేను పేరును ప్రదర్శించినా మినహాయిస్తారని ” చెప్పారు. అయ్యప్ప, భవానీ వంటి దీక్షలు, కన్వర్‌(కావడి) యాత్ర వంటివి జనాల వ్యక్తిగత అంశాలు. ఇష్టమైన వారు పాటిస్తారు, కాని వారు దూరంగా ఉంటారు. వీరంతా నాస్తికులని గానీ పాటించేవారే పరమ ఆస్తికులని గానీ నిర్ధారించటానికి, ముద్రవేసేందుకు ఎవరికీ హక్కులేదు.పౌరహక్కుల పరిరక్షణ సంస్థ(ఎపిసిఆర్‌) పేరుతో ఉన్న ఒక స్వచ్చంద సంస్థ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టు తలుపుతట్టింది.న్యాయమూర్తులు హృషికేష్‌ రారు, ఎస్‌విఎన్‌ భట్‌ ధర్మాసనం సోమవారం నాడు విచారించింది. ప్రభుత్వ ఉత్తరువుల కారణంగా దుకాణాల యజమానుల మతపరమైన గుర్తింపు వెల్లడి కావటమేగాక ముస్లిం మతానికి చెందిన దుకాణాల యజమానుల పట్ల వివక్ష ప్రదర్శించటమే అని పిటీషన్‌లో పేర్కొన్నారు.ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంటూ, తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని అధికారపక్షానికి స్పష్టం చేశాయి. కోర్టు ఆదేశాలతో దీని మీద చర్చ జరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.


బిజెపి మిత్రపక్షాలుగా ఉన్న జెడియు, ఎల్‌జెపి, ఆర్‌ఎల్‌డి పార్టీలు ఇలాంటి ఉత్తరువులు తగవని వ్యతిరేకతను వెల్లడించినా బిజెపి ఖాతరు చేయ లేదు. జనాలను మత ప్రాతిపదికన చీల్చే, ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అజండాను అమలు జరిపేందుకే పూనుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు తాజా పరిణామాల వెనుక ఉన్న కుట్రలేమిటి, ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా, ఆందోళనకరంగా మారింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఆయోధ్యతో సహా అనేక చోట్ల చావుదెబ్బతిన్నది. దీనికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కారణమంటూ కేంద్ర పెద్దల మద్దతుతో బిజెపి స్థానిక నేతలు ధ్వజమెత్తటమే కాదు, నాయకత్వ మార్పు జరగాలని కోరుతున్నారు. మరోవైపున దానికి ప్రతిగా యోగి కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వాటిలో కన్వర్‌ యాత్రల ఆదేశం ఒకటి. శివలింగం మీద తేలును చెప్పుతో కొట్టలేరు, చేతితో తొలగించలేరు అన్నట్లుగా కేంద్ర బిజెపి నాయకత్వం ముందు పరిస్థితి ఉంది. ఇంతకూ ఈ యాత్రీకులు చేసేదేమిటి ? శ్రావణమాసంలో పవిత్ర జలం పేరుతో గంగా నది నుంచి నీరు తెచ్చి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో అభిషేకం చేసి శివుని కృపకు పాత్రులౌతామనే నమ్మకాన్ని వెల్లడిస్తారు. జూలై 22 నుంచి ఆగస్టు ఆరవ తేదీ మధ్య హరిద్వార్‌ వద్ద ఉన్న గంగానది నుంచి తెచ్చే నీటి పాత్రలను కావళ్లలో పెట్టి తీసుకువస్తారు గనుక దీనికి కావడి యాత్ర అనే పేరు వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి వేర్వేరు మార్గాల్లో భక్తులు హరిద్వార్‌ వస్తారు. ఈ మార్గాల్లో యాత్రీకుల కోసం వస్తువుల దుకాణాలు, ఆహార పదార్దాల హౌటళ్లు. దాబాలు, బండ్లు ఏర్పాటు చేస్తారు. కాలినడకన, మోటారు వాహనాలు ఇలా ఎవరికి వీలైన పద్దతుల్లో వారు ఈ యాత్రలో పాల్గొంటారు. 1980దశకం వరకు చాలా పరిమితంగా జరిగే ఈ క్రతువును క్రమంగా పెద్ద కార్యక్రమంగా మార్చారు. అయ్యప్ప దీక్షలకు పోటీగా అనేక దీక్షలను తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా అలాంటిదే.


దుకాణాలు, హౌటళ్ల ముందు యజమానుల పేర్లకు బదులు ” మానవత్వం ” అని ప్రదర్శించాలని ప్రముఖ నటుడు సోనూ సూద్‌ ఎక్స్‌లో సూచన చేశారు.దీని మీద బాలీవుడ్‌ హీరోయిన్‌, బిజెపి లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్‌ స్పందిస్తూ ఉమ్మిన ఆహారం, ఆపని చేసేవారిని సమర్ధించటమే ఇదంటూ ధ్వజమెత్తారు. ముస్లింలు తయారు చేసే ఆహారం, విక్రయించే పండ్లు మొదలైన వాటి మీద ఉమ్ముతారని, హలాల్‌ చేస్తారని,అపవిత్రమైన వాటిని హిందువులు బహిష్కరించాలని, హిందువుల పవిత్ర స్థలాలు, గుడులు గోపురాలు ఉన్న ప్రాంతాలలో ముస్లింల దుకాణాలను అనుమతించరాదని, ఇప్పటికే ఉంటే ఎత్తివేయాలని హిందూత్వ సంస్థలు ఎప్పటి నుంచో రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. సాధారణ పౌరులెవరూ వాటిని పట్టించుకోవటం లేదన్నది కూడా ఎరిగిందే. అయోధ్యలో రామాలయం పేరుతో యోగి సర్కార్‌ బుల్డోజర్లతో కూలదోయించిన కట్టడాల్లో హిందువులవి కూడా ఉన్నాయి. అందుకే అక్కడ బిజెపికి వ్యతిరేకంగా ఓటువేయటం, అభ్యర్థి ఓటమి తెలిసిందే. పాలస్తీనాలో అరబ్బులపై దాడులు, మారణకాండ, స్వతంత్ర దేశ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్‌ ఉత్పత్తులను బహిష్కరించాలని ముస్లిం, అరబ్బుదేశాలలో పలు సంస్థలు గతంలో పిలుపునిచ్చాయి. వాటిని కాపీకొట్టిన కాషాయ దళాలు మనదేశంలో ముస్లింల వ్యాపారాలను దెబ్బతీసేందుకు వినియోగిస్తున్నాయి. అరబ్బు దేశాల చమురును బహిష్కరించమని చెప్పేందుకు వారికి నోరురాదు, ఎందుకంటే వారి యాత్రల వాహనాలు నడవాలంటే అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న ఇంథనమే దిక్కు. అక్కడ పవిత్రత గుర్తుకు రాదు.


ఉమ్ముతారని చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. నిజమే అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అనేక బిర్యానీ హౌటళ్లకు, రంజాన్‌ మాసం సందర్భంగా హలీం కోసం ఎగబడేవారిలో ఎక్కువ మంది ముస్లిమేతరులే ఎందుకు ఉంటున్నారు.దుకాణాలలో విక్రయించే వస్తువులు నాణ్యమైనవా కాదా, హౌటళ్లలో వడ్డించే ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది గీటురాయిగా ఉండాలి తప్ప యజమానుల వివరాలు ఎందుకు ? ఒకవేళ ముస్లిం మతానికి చెందిన వారు యజమానులుగా ఉంటే వాటిని బహిష్కరించాలని పరోక్షంగా చెప్పటమే ఇది. పేర్ల ప్రదర్శన ఒక్క ముస్లింలనే దెబ్బతీస్తుందా ? హిందువులను కూడా నష్టపరుస్తుంది.మన సమాజంలో మత విద్వేషమే కాదు, కుల వివక్ష, విద్వేషం కూడా ఎక్కువే, అందునా దేశ ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలలో మరీ ఎక్కువ.దళితులు వివాహాల సందర్భంగా గుర్రాల మీద, ఇతరత్రా ఊరేగింపులు జరపకూడదని, ఎక్క కూడదని దాడులు చేసిన ఉదంతాలు ఎన్ని లేవు.దుకాణాలపై దళితులు, గిరిజనులు, వెనుకబడిన సామాజిక తరగతులకు చెందిన యజమానుల పేర్లను ప్రదర్శిస్తే ముస్లిం దుకాణాల పట్ల అనుసరించే వైఖరినే మనువాద కులాల వారు పాటిస్తారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే అనేక చోట్ల గతంలో ఆర్యవైశ్య బ్రాహ్మణ హౌటల్‌ అని రాసుకొనే వారు. ఇప్పుడు ఇంకా ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో ఉండి ఉండవచ్చు. వాటి స్థానలో రెడ్డి, చౌదరి హౌటల్స్‌ పేరుతో ఎక్కడ చూసినా మనకు దర్శనమిస్తున్నాయి తప్ప ఇతర కులాలను సూచించే హౌటళ్లు ఎక్కడా కనిపించకపోవటానికి సమాజంలో ఇప్పటికీ ఉన్న చిన్న చూపు, వివక్షే కారణం. అదే ముస్లింల విషయానికి వస్తే మతవిద్వేషం. రాఘవేంద్ర,రామా, కృష్ణా, వెంకటేశ్వర విలాస్‌లు తప్ప ఎక్కడైనా అబ్రహాం, ఇబ్రహీం, ఏసుక్రీస్తు,మహమ్మద్‌ ప్రవక్త విలాస్‌లను చూడగలమా ?


ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ యుపి ప్రభుత్వ చర్యను తప్పు పట్టారు. ఒక మతపరమైన యాత్ర సందర్భంగా పోలీసులు జారీ చేసిన ఆదేశాలు దుకాణాలు, హౌటళ్ల యజమానుల పేర్లను ప్రముఖంగా వాటి ముందు రాసి ఉంచాలని చెప్పారు. సమీప భవిష్యత్‌లో ఇది వాహనాలకు సైతం వర్తింప చేస్తారని, గతంలో నాజీ జర్మనీలో కొన్ని దుకాణాలు, ఇండ్లకు ఇలాంటి గుర్తింపును అమలు చేశారని జావేద్‌ అక్తర్‌ ఎక్స్‌లో స్పందించారు.బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ కూడా తప్పు పట్టారు. ఇది అంటరానితనాన్ని ప్రోత్సహించటం తప్పవేరు కాదన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను నేరుగా విమర్శించలేని నక్వీ దీనికి అధికారయంత్రాంగం కారణమని విరుచుకుపడ్డారు. అత్యుత్సాహపరులైన అధికారులే ఇది చేశారన్నారు.సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌, బిఎస్‌పి నాయకురాలు మాయావతి, మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా విమర్శించారు. ఇది సామాజిక నేరమని, కోర్టులు కలగచేసుకొని నివారించాలన్నారు. తొలుత యజమానుల పేర్లను ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు. దాని మీద విమర్శలు రావటంతో కాదు స్వచ్చందంగా చేయాలన్నారు, చివరికి విధిగా ప్రదర్శించాలని నిర్ణయించారు.స్వచ్చందంగా అన్నప్పటికీ అంతిమంగా ఫలితం మతపరమైన గుర్తింపును విధిగా వెల్లడించేట్లు చేయటమే. పేర్లు ప్రదర్శించని హిందువులను కూడా ముస్లింలుగానే భావించేందుకు ఆస్కారం ఉంటుంది. ముస్లింలు పేర్లు రాసుకొని ప్రదర్శిస్తే వారి దగ్గర కొనవద్దని చెప్పేందుకు తప్ప దీనిలో శాంతి భద్రతల సమస్య ఎక్కడుంది. యాత్రికులకు ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకంటూ ముజఫర్‌ నగర్‌ ఎస్‌పి ప్రకటన సాకు మాత్రమే. కావాల్సిన వస్తువు లేదా ఆహారం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తేనేం, దానిలో యాత్రీకులు పడే గందరగోళం ఏమిటి ? దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్లను వేరు చేసేందుకు సృష్టించిన బంటూస్తాన్‌లకు, మనదేశంలో వెలిగా ఉంచిన దళిత వాడలకు, వీటికీ తేడా ఏముంది? దళితవాడల్లో నివశించేందుకు ఎంత మంది దళితేతరులు సిద్దపడుతున్నారు ? ముస్లింలు మెజారిటీగా ఉన్న అనేక ప్రాంతాల్లో ఇతరులు ఇండ్లు కొనేందుకు జంకే ఇతరుల గురించి తెలియని వారెవరు ?


చరిత్రలో మతపరమైన గుర్తింపు చాలా ప్రమాదకరం అని రుజువు చేసింది.మనతో సహా ఆసియా ఉపఖండంలోని దేశాల్లో మతంతో పాటు ఎక్కడా లేని కులపరమైన గుర్తింపు బోనస్‌.మధ్య యుగాల్లో, తరువాత ఇస్లామిక్‌, క్రైస్తవమతాల ఉన్మాదంతో ఇతర మతాల వారు ప్రత్యేక గుర్తులు ధరించాలని ఆదేశించారు. మౌఢ్యం లేదా నిరంకుశత్వం చోటు చేసుకుంది. నాజీ జర్మనీలో యూదు వ్యతిరేకతలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. మహమ్మద్‌ ప్రవక్త మరణం తరువాత అరేబియాలో అధికారానికి వచ్చిన ఖలీఫా రెండవ ఉమర్‌ 717-20 సంవత్సరాలలో ముస్లిమేతరులు ప్రత్యేక చిహ్నాలను ధరించాలని తొలిసారిగా ఆదేశించినట్లు వికీపీడియా సమాచారం తెలుపుతోంది. నేటి ఇటలీలోని సిసిలీ ప్రాంతంలో రాజ్యాధికారం చలాయించిన అరబ్‌ రాజవంశం అగలాబిద్‌ 887-88లో యూదులు తమ ఇండ్లకు గాడిదలను చిత్రించిన వస్త్రాలను వేలాడదీయాలని, పసుపు పచ్చ బెల్టులు, టోపీలు ధరించాలని ఆదేశించింది. తరువాత 1,212లో మూడవ పోప్‌ ఇన్నోసెంట్‌ ప్రతి క్రైస్తవ ప్రాంతంలో గుర్తించేందుకు వీలుగా యూదులు ప్రత్యేక చిహ్నాలను ధరించాలని ఆదేశించాడు. ప్రష్యాలో 1,710లో అధికారంలో ఉన్న ఒకటవ ఫెడరిక్‌ విలియమ్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం యూదులు ప్రత్యేక చిహ్నాలను ధరించనవసరం లేదు.అయితే అలా ఉండాలంటే ఎనిమిదివేల వెండి నాణాల నగదు చెల్లించాలని షరతు పెట్టాడు. తరువాత రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా జర్మనీలో నాజీ పాలకులు యూదులను గుర్తించేందుకు డేవిడ్‌ బొమ్మ ఉన్న ఏదో ఒక రంగు గుర్తును ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.హిట్లర్‌ యంత్రాంగం కొత్త ఆదేశాలను జారీచేసి యూదుల ఇండ్ల ముఖద్వారాలకు గుర్తులు వేయాలని ఆదేశించింది. అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఇలాంటి గుర్తింపు ఆదేశాలను అమలు చేశారు. హంగరీ ఆక్రమణ తరువాత యూదుల పౌరసత్వాలను రద్దు చేసి వారంతా ప్రత్యేక గుర్తులను ధరించాలని ఆదేశించారు.ఇక వర్తమానంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు 1996-2001 మధ్య తమదేశంలో ఉండే హిందువులు పసుపుపచ్చ గుర్తున్న బాడ్జ్‌లను ధరించాలని, వేధింపులకు గురికాకుండా ఉండేందుకు హిందూ మహిళలు బురఖాలు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కన్వర్‌ యాత్రీకులు గందరగోళపడకుండా ఉండేందుకు, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అనే పేరుతో దుకాణాల యజమానులు తమ పేర్లను ప్రముఖంగా రాసి ప్రదర్శించాలని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఆకుపచ్చ తాలిబాన్లకు కాషాయ తాలిబాన్లకు పద్దతి తప్ప ఇతరంగా తేడా ఏమిటి ? యోగి సర్కార్‌ ఉత్తరువులు ముస్లింల కోసమేనని,మనకేంటి అని ఇతరులు ఎవరైనా భావిస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. చరిత్రను చూసినపుడు సనాతనం లేదా మనువాదం కారణంగా దళితులకు ఇతరుల వాడల్లో ప్రవేశం నిషేధించారు, ఒకవేళ అనుమతిస్తే ఉమ్మివేయకుండా మెడలో ముంత ధరించాలని, వీపులకు చీపుర్లు కట్టుకొని ఊడ్చుకుంటూ నడిపించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. ఇప్పుడు కన్వర్‌ మరోపేరుతో మతవిద్వేషం రెచ్చగొడుతున్నవారు మనువాదుల వారసులే. సనాతనాన్ని అమలు జరపాలని కోరేశక్తులకు ప్రతిఘటన లేకపోతే దళితులకు ముంతలు, చీపుర్లే గతి, వెనుకబడిన తరగతులు తిరిగి కులవృత్తులకు పోవాల్సిందే ! కాదంటారా !