Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


పశ్చిమాసియాలో తలెత్తిన తాజా పరిస్థితి కారణంగా ముడి చమురు ధరలు పెరిగితే మన ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. బ్రెంట్‌ రకం ముడి చమురు ధర అక్టోబరు ఒకటి నాలుగువ తేదీన ఈ విశ్లేషణ రాస్తున్న సమయానికి 70.40 నుంచి 78.66 డాలర్లకు పెరిగింది. ఒక్క మనమీదే కాదు, చమురు దిగుమతి చేసుకొనే అందరి పరిస్థితి అదే. అయితే పెరుగుదల లేకపోగా తగ్గినప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా మన జేబులను కొల్లగొడుతున్నది.ఎదుటి వారి జేబులో పర్సు కొట్టేసినపుడు దాన్లో ఎంత డబ్బు ఉంది అని అడుగుతాం, కానీ 912 రోజులుగా ప్రతి రోజూ పెట్రోలు బంకులో కొల్లగొడుతుంటే ఎంత అని ఎవరూ పట్టించుకోవటం లేదు. అఫ్‌ కోర్స్‌ అది కష్టపడిన సొమ్ము కాదనుకుంటే వదిలేద్దాం ! నరేంద్రమోడీని వ్యతిరేకించేవారికి అలా కావాల్సిందే అని ఎవరైనా అంటే సరే, దేశంకోసంధర్మం కోసం అంటూ మోడీని కొలిచేవారికి, ఆరాధించేవారికి కూడా ఎలాంటి మినహాయింపులు లేకుండా క్షవరం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం రష్యా నుంచి మనం చమురు దిగుమతుల కారణంగా 202223 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి 2,500 కోట్ల డాలర్లు (తాజా రూపాయి మారకపు విలువలో చూస్తే రెండు లక్షల కోట్ల మేరకు) కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు తగ్గింది. పోనీ ఈ మేరకు వినియోగదారులకు ఒక్క పైసా అయినా మోడీ తగ్గించారా ? 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఈ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన మేరకు సవరించకుండా కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అంటూ అంతకు ముందు ప్రతిరోజూ సవరించిన ధరల విధానాన్ని ఎందుకు పక్కన పెట్టారో జవాబుదారీ తనం గురించి తమ భుజాలను తామే చరచుకొనే పెద్దలు ఎవరైనా చెబుతారా ? మోడీ అలాంటి పెద్దలను, గద్దలను పక్కన పెడదాం, అసలు జనంలో ప్రశ్నించే గుణం ఎందుకు అంతరించినట్లు ? ఆక్రమిత కాశ్మీరులో పాక్‌ ప్రభుత్వం భారాలు పెంచితే వాటిని భరించలేక అక్కడి జనం మనదేశంలో విలీనం కావాలని కోరుకుంటున్నట్లు వస్తున్న వీడియోలను చూపి కొందరు వీరంగం వేస్తుంటారు. ఇక్కడి జనం మీద మోడీ మోపుతున్న భారాలను తప్పించుకొనేందుకు ఎక్కడికి పోవాలి ? పాకిస్తాన్‌ సుత్తి ఇనుపదైనా భారత్‌ది బంగారపుదైనా తల పగులుతుంది.


పశ్చిమ దేశాల ఆంక్షలను పక్కకు నెట్టి రష్యా నుంచి చమురు కొనుగోలు ద్వారా కలుగుతున్న ఆర్థిక లబ్ది పూర్తిగా జనానికి దక్కుతున్నదా ? లేదు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు మన అవసరాల్లో కేవలం రెండు శాతం మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే ఇప్పుడు 40శాతం దాటింది. ఈ మొత్తాన్ని ఎవరు దిగుమతి చేసుకుంటున్నారు. ఉదాహరణకు 2024ఏప్రిల్‌ నెలలో మూడు ప్రభుత్వ రంగ సంస్థలు రోజుకు పదిన్నరలక్షల పీపాలు దిగుమతి చేసుకుంటే అంబానీ రిలయన్స్‌, నయారా అనే మరో ప్రైవేటు సంస్థ ఎనిమిది లక్షల పీపాలు దిగుమతి చేసుకున్నాయి. ఈ దామాషా ప్రతి నెలా స్వల్పంగా మారుతున్నది. దీని అర్ధం ఏమిటి ? ప్రభుత్వ రంగ సంస్థలు దిగుమతి చేసుకుంటే ఆ రాయితీ సొమ్ము జనానికి దక్కుతుంది, ప్రైవేటు వారిని అనుమతిస్తే వారి జేబుల్లోకి పోతుంది. నరేంద్రమోడీ అనుసరిస్తున్న విధానం ఇప్పుడు జనం కంటే అంబానీ, నయారా కంపెనీలకు లబ్ది చేకూర్చటమే ప్రధాన కర్తవ్యంగా ఉంది. రవాణా ఖర్చుతో సహా రష్యా నుంచి మనదేశం చేరటానికి ఒక పీపా ధర 2024లో 76.39 డాలర్లు కాగా, ఇతర దేశాల చమురు ధర 85.32 డాలర్లు ఉంది.(ఇండియన్‌ బాస్కెట్‌ రష్యన్‌ క్రూడ్‌ ఆయిల్‌ ప్రైస్‌ అని గూగుల్‌ తల్లిని అడిగితే బిడ్డా కృత్రిమ మేధ వీక్షణం ఇలా ఉంది అంటూ ఆంగ్లంలో సమాచారం అందిస్తుంది. వినిపిస్తుంది, అడిగిన సమయాన్ని బట్టి ధరలు మారుతుంటాయి). ప్రైవేటు కంపెనీలు ఇలా తక్కువ ధరకు కొని ఏం చేస్తున్నాయంటే శుద్ధి చేసి డీజిల్‌, పెట్రోల్‌ ఇతర ఉత్పత్తులను పోటీ ధరలకు ఐరోపా దేశాలకు ఎగుమతులు చేసి అక్కడా లాభాలు పిండుతున్నాయి. ఈ విషయాలేవీ మన్‌కి బాత్‌లోనో ఎన్నికల ప్రచారంలోనో మోడీ మనకు చెప్పరు, గోడీ మీడియా ఇలాంటి వాటి మీద చర్చ పెట్టదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత డీజిలు, పెట్రోలు మీద సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు,గ్యాస్‌ మీద ముష్టి మాదిరి విదుల్చుతున్నారు. ఇది గోడదెబ్బ అనుకుంటే చెంపదెబ్బ ఎలా కాడుతున్నారో తెలుసా ? మోడీ అధికారానికి వచ్చిన 201415 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ (పిపిఏసి) సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 202021 నాటికి సెస్‌ల పేరుతో రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 202324 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచుతామంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకం ఎలా ఉందో తెలుసా ? 201415లో ప్రభుత్వప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 202324నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. ఇలాంటి పాలనతో 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు.


ప్రారంభంలోనే చెప్పుకున్నట్లు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఒకటి రెండు సార్లు తప్పితే రోజువారీ ధరలను సవరించటం నిలిపివేశారు. మోడీ మీద ఎంత మోజున్నా ఇలా చావబాదుతుంటే భరించటం ఏమిటో అర్ధం కావటం లేదు. చమురు బిల్లు మన రూపాయల్లో 12.6లక్షల కోట్ల నుంచి 10.97లక్షల కోట్లకు తగ్గింది, కేంద్ర సర్కార్‌కు రు.1.64 కోట్లు మిగిలింది. పోనీ ఈ మేరకైనా వినియోగదారులకు తగ్గించారా అంటే లేదు. వంట గ్యాస్‌ వంటి ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరలన్నీ ఇదే విధంగా తగ్గాయి. దిగుమతుల మొత్తం స్వల్పంగా పెరిగినప్పటికీ కేంద్రానికి భారం తగ్గింది. బిజెపి, తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు కానీ దోపిడీ కూడా చేయకూడదు కదా ! చమురు కొనుగోలులో తగ్గిన మేరకు వినియోగదారులకు అందించకుండా మిగిలిన సొమ్మును దేనికి ఖర్చు చేస్తున్నది ? పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రాయితీలు, సబ్సిడీల కోసం, వారు తీసుకున్న రుణాలు ఎగవేసినపుడు బాంకులకు నిధులు సమకూర్చటం కోసం వాటిని మళ్లిస్తున్నది. దీన్ని ఎవరైనా కాదనగలరా ? గతంలో సెస్‌లను భారీగా ఎందుకు అలా పెంచారంటే దేశ రక్షణకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని బిజెపి పెద్దలు దబాయించేవారు. ఆ భారాలను తగ్గించలేదు, ధర తగ్గినా రేట్లు అలాగే ఉంచారు. మన దేశం 202223లో 15,750 కోట్ల డాలర్లు చెల్లించి చమురు దిగుమతి చేసుకుంది. మరుసటి ఏడాది చమురు బిల్లు 13,240 కోట్ల డాలర్లకు తగ్గింది.ఈ మేరకు మోడీ సర్కార్‌ వినియోగదారులకు ధరలు తగ్గించిందా ?ఎందుకు తగ్గించ లేదు. చమురు బిల్లు తగ్గటానికి కారణం ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గటం, రష్యా నుంచి 40శాతం దిగుమతులను రాయితీ ధరలకు పొందటం. తాజాగా బాంక్‌ ఆఫ్‌ అమెరికా నివేదికలో చెప్పినదాని ప్రకారం 2022 ఏప్రిల్‌ మొదటి వారంలో ఇంథన ధరలను చివరి సారిగా సవరించిన తరువాత ముడి చమురు ధరలు 20శాతం తగ్గాయి.2023 సెప్టెంబరు నుంచి 2024 మార్చినెల మధ్య లీటరు డీజిలు ధర రు.9 తగ్గింది.దీని వలన ఏటా లక్షకోట్ల రూపాయలు లేదా జిడిపిలో 0.3శాతం కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం లేదా లాభం సమకూరుతున్నట్లు దానిలో పేర్కొన్నారు. గతంలో రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీని ఈ విధంగా పూడ్చుకున్నట్లయిందని కూడా అది అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పింది. ఇంథన ధరలను తగ్గిస్తే ద్రవ్యోల్బణం తగ్గుతుందని కూడా పేర్కొన్నది. పీపాకు పది డాలర్లు తగ్గితే ఏటా 1,300 కోట్ల డాలర్ల మేర ప్రభుత్వానికి మిగులుతాయి. ఇప్పుడున్న డాలరు మారకం (రు.84) ప్రకారం లక్షా తొమ్మిది వేల కోట్లు మిగులుతాయి. యుపిఏ పాలన చివరి ఏడాది నుంచి ఇప్పటి వరకు మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా సగటు ధరలు ఇలా ఉన్నాయి.

2013-14—-105.52
2014-15--- 84.16 2015-16—– 46.17
2016-17--- 47.56 2017-18—– 56.43
2018-19----69.88 2019-20—– 60.47
2020-21----44.82 2021-22—–79.18
2022-23----93.15 2023-24—– 82.58
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 81.95 డాలర్లు ఉంది. దీనికి అనుగుణంగా ధరలు తగ్గించకుండా గడచిన రెండున్నర సంవత్సరాలుగా వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నది కేంద్ర ప్రభుత్వం.2022 ఏప్రిల్‌ ఆరున ఢల్లీిలో లీటరు పెట్రోలు రు.105.41, డీజిల్‌ రు.96.67గా సవరించిన వాటిని మే 22వ తేదీన రు.96.72, 89.62 చొప్పున సవరించారు. ఈ ధరలను 2024 మార్చి నెల 21వరకు కొనసాగించి మరుసటి రోజు నుంచి రెండేసి రూపాయల చొప్పున తగ్గించారు.తరువాత ధరలలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. వివిధ రాష్ట్రాలలో ఉన్న వాట్‌ ప్రకారం ధరలలో తేడాలు ఉంటాయి. ఉదా రెండు తెలుగు రాష్ట్రాలలో లీటరు పెట్రోలు రు.109 ఉంది. ప్రకటించిన విధానం ప్రకారమైతే ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అనేక సార్లు సవరించి ఉండాల్సింది.ఏప్రిల్‌ నెలలో 89.44 డాలర్లు ఉన్నది కాస్తా సెప్టెంబరుకు 73.69కి తగ్గింది, పదహారు డాలర్లు తగ్గినా పదహారు పైసలు కూడా తగ్గించలేదు.


ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీస్తాం, తాటవలుస్తాం అందుకే పార్టీని పెట్టాం అని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ గతంలో ప్రకటించారు. కమ్యూనిస్టులు తెల్లారిలేస్తే ఇలాంటి పిలుపులే ఇస్తుంటారు వారికి అలవాటైపోయింది అని పట్టించుకోని జనం నిజమే కదా కొత్త హీరో వచ్చాడు అనుకున్నారు.(జనం స్పందించనంత మాత్రాన కమ్యూనిస్టులు పిలుపులు ఇవ్వటం, కార్యకర్తలతో నిరసన తెలపటం మానుకోలేదు) 2019కి ముందు నరేంద్రమోడీని, చంద్రబాబు నాయుడిని అదే మాదిరి నిలదీశారు. తరువాత నరేంద్రమోడీతో చేతులు కలిపారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని 2024 ఎన్నికల వరకు నిలదీశారు, తాటవలిచారు. కేంద్రానికి చెందిన సమస్యలపై నిలదీయరేమి అన్నపుడు మేము అధికారంలోలేము కదా అని తప్పుకున్నారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి. వందశాతం స్ట్రైక్‌ రేటు ఉంది. జనం సమస్యలను వదలి సనాతన ధర్మ పరిరక్షకుడి అవతారమెత్తారు. తనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మానవత్వం అంటూ కబుర్లు చెప్పిన మీరు ఇదేమిటి స్వామీ అంటే ముందునేను సనాతన హిందువును అంటున్నారు, ఆ ముక్క ఎన్నికల ముందు చెప్పలేదు. సినిమా స్క్రిప్ట్‌ మారిపోయింది. పోనీ హిందువులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నారా ? రాష్ట్రంలో తొంభై శాతం హిందువులే ఉన్నారు. ధరలు, దరిద్రం, నిరుద్యోగాలను భరించటం కూడా అదే శాతం ఉంది. కేంద్రం, రాష్ట్రం మోపుతున్న భారాలను కూడా భరిస్తున్నారు. వారికేమీ రాయితీలు లేవు. నాలుగువేల మంది విశాఖ ఉక్కు కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు పూనుకుంటే మొత్తం సిబ్బందికి అలవెన్సులు కోత పెడుతుంట ఇదేం అన్యాయం అనటానికి హీరోకు నోరు రాలేదు. పెడుతుంటే నిలదీయలేదు. వరదలతో భారీగా నష్టపోయిన విజయవాడ, ఇతర ప్రాంతాల్లో జనాలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం ఒక్క పైసా విదల్చకపోయినా అడిగింది లేదు. అమరావతి నిర్మాణానికి పెద్ద మొత్తంలో గ్రాంట్లు తెస్తామంటూ ప్రగల్భాలు పలికి పదిహేనువేల కోట్ల అప్పు ఇప్పిస్తామంటే అబ్బో ఇదే మహాభాగ్యం అన్నట్లు భజన చేస్తున్నారు. పోలవరం బాధితులకు నష్టపరిహారం సంగతి తేల్చకున్నా నోరు విప్పరు. ఇంథన ధరలు కేవలం రాష్ట్ర సమస్య కానప్పటికీ వినియోగించే పెద్ద రాష్ట్రాలలో ఒకటి గనుక మిగతా అంశాలతో పాటు చమురు ధరల తగ్గింపును పవన్‌ కల్యాణ్‌ నిలదీస్తారా ? ఇంథన కొనుగోలు సర్దుబాటు చార్జీల పేరుతో 2022`23 సంవత్సరానికే రు.8,113 కోట్లు చెల్లించాలని మూడు డిస్కామ్‌లు కోరాయి. ఇది గాక మరుసటి సంవత్సర మొత్తం మరో పదకొండువేల కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. దీన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా, జగన్‌ చేసిన పాపం అంటూ జనం నెత్తిన బాదుతారా ? సమస్యలను పక్కదారి పట్టించేందుకు సనాతన ధర్మ కబుర్లతో కాలక్షేపం చేస్తారా ? చంద్రబాబు ఎలాగూ నోరువిప్పరు. పవన్‌ కల్యాణ్‌ హీరో అని నిరూపించుకుంటారా ?