Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీగారి మాటలను చూస్తే దేశం వెలిగిపోతోంది. భజన బృందాన్ని చూస్తే మోడీ విశ్వగురువు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే లెక్కలను చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నది. ఎవరి మాటలను నమ్మాలి ? తమ అనుభవంలోకి వచ్చిన విషయాలను బట్టి జనమే తేల్చుకోవాలి. దేశంలో మాకు తిరుగులేదు అని బిజెపి చెబుతుంది. దాన్ని గుడ్డిగా నమ్మేవారున్నారు, చేసేదేముంది ! ఆ గోమాతే కనువిప్పు కలిగించాలి. వారికి వివరాలు తెలియకనా ? 2014లో బిజెపికి స్వంతంగా వచ్చిన ఓట్లు 31శాతం, ఎన్‌డిఏ కూటమి మొత్తానికి 38.5శాతం, 2019లో బిజెపికి 37.36శాతం, కూటమికి 45.3శాతం, 2024లో బిజెపికి 36.56శాతం కాగా కూటమికి 42.5శాతం వచ్చాయి. గత ఎన్నికల తరువాత తెలుగుదేశం, జనసేన ఓట్లు కొత్తగా కలిసినా బిజెపికి, మొత్తంగా కూటమి ఓట్లశాతం తగ్గింది. దీన్ని చూస్తేమోడీ ప్రభావం పెరుగుతున్నట్లా తరుగుతున్నట్లా ? ఇవి సాధారణ అంకెలు, ఆల్జిబ్రాకాదు గనుక అర్ధంగాకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. లేకపోతే వేద గణికులను సంప్రదించవచ్చు.


ఇక్కడ ఒక పొట్టి పిట్టకత చెప్పాలి. ఊరంతా ఎప్పుడో వెళ్లిపోయిన కావమ్మ మొగుడులా ఉన్నావంటే కామోసు కామోసనుకొని కాపురం చేశాను, ఇప్పుడు కాదంటున్నారు గనుక నా కర్రా బుర్ర ఇస్తే నాదారిన నేపోతా అన్నాడట సన్యాసివేషంలో వచ్చిన ఒక పెద్దమనిషి. ప్రధాని నరేంద్రమోడీ దగ్గర అద్భుత శక్తులు ఉన్నట్లు ఇంతకాలం నమ్మిన ఊరూవాడా ఇప్పుడు అనుమానంగా చూస్తోంది.‘‘ నరేంద్రమోడీ తన అద్భుత శక్తి కోల్పోయారా ?’’ అంటూ ప్రశ్నార్ధక శీర్షికతో అంతర్జాతీయ పత్రిక ‘‘ఎకానమిస్టు ’’ 2024అక్టోబరు పదవ తేదీ సంచికలో ఒక విశ్లేషణను ప్రచురించింది. ప్రపంచ ఆర్థిక అంశాలను ప్రచురించే ఆ పత్రికే అనుమానాన్ని వ్యక్తం చేసిన తరువాత అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని వేరే చెప్పనవసరం లేదు. తరువాత కథ ఎలా ఉంటుంందో తెలియదు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాని వరకు ఏండ్ల తరబడి జరిగిన ప్రచారాన్ని చూసిన నరేంద్రమోడీ నిజంగా తాను దేవదూతననే నమ్మారు. నమ్మటం ఏమిటి ! చరిత్రలో అనేక మంది మాదిరి స్వయంగా ప్రకటించుకున్నారు. 2024 మే పదవ తేదీన వారణాసి పర్యటన సందర్భంగా న్యూస్‌ 18 అనే టీవీ ఛానల్‌తో మోడీ మాట్లాడారు. దాన్లో ఏం చెప్పారు ‘‘ నా మాతృమూర్తి బతికి ఉన్నపుడు నేను దేహసంబంధంగానే(సాధారణ మానవుల్లా) పుట్టానని అనుకొనేవాడిని. ఆమె మరణించిన తరువాత నా అనుభవాలన్నింటినీ అవలోకించుకుంటే దేవుడు తనను పంపాడని నిర్ధారణకు వచ్చాను. కేవలం నా భౌతికదేహం నుంచైతే ఈ శక్తి వెలువడదు, దేవుడు నాకు ప్రసాదించాడు.నేను ఎప్పుడే పనిచేసినా దేవుడే నన్ను అలా నడిపిస్తున్నాడని నమ్ముతున్నాను.’’ అని చెప్పారు. ఇదంతా లోక్‌సభ ఎన్నికలకు ముందు, తరువాత అనేక మందిలో మోడీ అద్భుత శక్తుల గురించి అనుమానాలు తలెత్తుతున్నాయి.


తొలిసారి అధికారానికి వచ్చినపుడు నరేంద్రమోడీ క్షణం తీరిక లేకుండా విదేశాలన్నీ తిరిగారు.ఎక్కువ సమయం విమానాల్లోనే గడిపారు. ఎందుకంటే యుపిఏ హయాంలో ప్రపంచంలో కోల్పోయిన భారత ప్రతిష్టను తిరిగి తీసుకురావటంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు అని చెప్పారు. జనం నిజమే కామోసనుకున్నారు. కానీ వాస్తవాలను చూస్తే వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో వచ్చిన విదేశీ పెట్టుబడులు 16 సంవత్సరాల కనిష్టానికి తగ్గిపోయాయి. పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏమైంది, విదేశాల్లో పెరిగిన ప్రతిష్ట ఎందుకు తగ్గినట్లు, విశ్వగురువుగా భుజకీర్తులు తప్ప పెట్టుబడులు ఎందుకు రావటం లేదు. వెనుదిరిగి చూస్తే జరిగిన ప్రచారం అంతా మాయ, కనికట్ట్లు అనిపిస్తోంది. విదేశీ పెట్టుబడులు ఎందుకు తగ్గుతున్నాయంటే మన దేశానికే కాదు, ప్రపంచమంతా తగ్గటం లేదా అని దబాయించారు. ఇది నిజమా ? ఒక దగ్గర తగ్గితే మరో దగ్గర పెరుగుతున్నాయి. డబ్బునెవరూ మురగపెట్టుకోవటం లేదు. ఐరాస విడుదల చేసిన 2024 ప్రపంచ పెట్టుబడుల నివేదిక ఏం చెబుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 2022లో ఎనిమిదవ స్థానంలో ఉన్న మనదేశం 2023లో ఒక్కసారిగా 15వ స్థానానికి దిగజారింది. స్వల్పంగా తగ్గినప్పటికీ అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలను కొనసాగించాయి. అమెరికాకు వచ్చిన పెట్టుడులు 332 నుంచి 311 బిలియన్‌ డాలర్లకు(6.32శాతం) తగ్గగా చైనాకు వచ్చినవి 189 నుంచి 163కు(13.75శాతం) తగ్గాయి, కానీ మనదేశానికి 49 నుంచి 28 బిలియన్‌ డాలర్లకు(42.85శాతం) తగ్గాయి. ఎఫ్‌డిఐల రాకపోకలు వివిధ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఎక్కడ లాభం ఎక్కువగా ఉంటే అక్కడకు పోతాయి.ద్రవ్య పెట్టుబడికి ఒక ప్రాంతమంటూ ఉండదు. లాభం ఉందా లేదా అని చూసుకొని ఉదయం ఆస్ట్రేలియాలో ఉంటే మధ్యాహ్నం భారత్‌, సాయంత్రానికి అమెరికా వెళ్లిపోతుంది. పరిశ్రమలకు అలా కుదరదు.


గాల్వన్‌లోయ సరిహద్దు ఉదంతం తరువాత చైనా నుంచి పరిశ్రమలు, పెట్టుబడులన్నీ భారత్‌కు మూకుమ్మడిగా తరలి వస్తున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మీడియాలో కతలు కతలుగా కబుర్లు చెప్పారు. ఆమేరకు మన ఎఫ్‌డిఐలు పెరిగిన దాఖలాలు లేవు.‘‘ చైనా, భారత్‌ల నుంచి బయటకు వెళుతున్న పెట్టుబడులతో ఇతర దేశాలు లబ్దిపొందుతున్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి సుభాస్‌ చంద్ర గార్గ్‌ (డెక్కన్‌ హెరాల్డ్‌ 2024,ఏప్రిల్‌ 23) రాశారు. అంతే కాదు, చైనా వద్ద ఆపార సాంకేతిక సత్తా, అరుదైన మెటీరియల్‌, పారిశ్రామిక పునాది ఉన్నదని, దానికి ఎఫ్‌డిఐలు నిలిచిపోవచ్చు కూడా, అక్కడి నుంచే భారీ మొత్తాలలో పెట్టుబడులు బయటకు వెళుతున్నాయి,దానికి ఎఫ్‌డిఐ అవసరం లేకపోవచ్చు, భవిష్యత్‌ ఉన్న పరిశ్రమలను స్వంతంగా నిర్మించుకోగలదని కూడా రాశారు. మనదేశంలో నైపుణ్యం తప్ప సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడి, ఉత్పాదక వ్యవస్థలు లేవని, మన దగ్గర నుంచి పెట్టుబడులు బయటకు వెళితే ఎక్కువ నష్టం మనకే ’’ అని కూడా గార్గ్‌ పేర్కొన్నారు. ఆయనేమీ మోడీ వ్యతిరేకి కాదు.


చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దశలో ఉందని సోషల్‌ మీడియాలో సంచలనాత్మక శీర్షికలతో కతలు చెప్పేవారు మనకు కొల్లలుగా ఉన్నారు. అఫ్‌కోర్సు గుడ్డిగా వాటిని నమ్మేవారు ఉండబట్టే పదే పదే అలా చెబుతున్నారు. మన ఆర్థిక వ్యవస్థ గురించి ఇష్టం లేకపోయినా ప్రభుత్వం సమాచారం వెల్లడిరచకతప్పటం లేదు. సమాచారం కొత్తగా ఉన్నప్పటికీ మోడీ అభిమానులను ఇబ్బంది పెట్టే పాత సమస్యలనే అది జనం ముందుంచుతున్నది. వాటికి ఇంకే మాత్రం నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌లే కారణం అనటానికి అవకాశం లేదు. జనం గడ్డిపెడతారు. ఇది చైనా కాదు భారత యుగం అని భజన చేసేందుకు కుదరదు. రానున్న రోజుల్లో ఇబ్బందులకు ఆరంభ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా చెప్పక తప్పలేదు. ఈ కారణంగానే వడ్డీరేట్ల తగ్గింపు మీద ఆర్‌బిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది.అయితే ఎన్ని ఇబ్బందులున్నా వర్తమాన సంవత్సర వృద్ధి రేటు 7.2శాతం ఉంటుందని చెబుతోంది. కరోనా తరువాత గొప్పగా ముందుకు పోతోందన్న వృద్ధి రేటు వడిదుడుకులకు లోనవుతున్నది. జనవరిమార్చి నెలల్లో వృద్ధి రేటు 7.8శాతం ఉండగా ఏప్రిల్‌జూన్‌లో 6.7కు పడిపోయింది. బొగ్గు,ముడిచమురు, విద్యుత్‌ వంటి ఎనిమిది కీలక రంగాల తీరును చూస్తే మూడు సంవత్సరాల్లో మొదటి సారిగా ఆగస్టులో దిగజారింది. పారిశ్రామిక, సేవారంగాలలో ఎదుగుదల లేని కారణంగా ఉపాధి కోసం జనాలు తిరిగి వ్యవసాయం వైపు మరలు తున్నారు. మోడీ గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ది అన్నది ఎండమావి అన్నది ఈ పరిణామం తెలుపుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం 201819లో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నవారు శ్రామికశక్తిలో 43శాతం ఉండగా అది 202324నాటికి 46శాతానికి పెరిగింది. ఇదే కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా జిడిపిలో 12 నుంచి 11శాతానికి తగ్గింది. సెప్టెంబరు నెలలో నిరుద్యోగుల శాతం 7.8గా సిఎంఐఇ పేర్కొన్నది. ఏటా రెండు కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన గురించి మోడీ చెప్పిన కబుర్లన్నీ వంచన తప్ప మరొకటి కాదు.ఉన్న ఉపాధి కోల్పోయి 6.8కోట్ల మంది వ్యవసాయ రంగానికి మరలినట్లే. పరిశ్రమలు, సేవారంగాల్లో యాంత్రీకరణతో పాటు వ్యవసాయంలో కూడా రోజు రోజుకూ యంత్రాల వినియోగం పెరుగుతున్నది. ఉదాహరణకు గతంలో పురుగు మందులను మనుషులే చల్లేవారు, ఇప్పుడు డ్రోన్లు ఆపని చేస్తున్నాయి. వాటిని ఇతర అవసరాల కోసం కూడా వినియోగిస్తున్నారు. డ్రోన్‌ దీదీ తదితర పథకాల పేరుతో డ్రోన్ల కొనుగోలుకు ప్రభుత్వం 75శాతం సబ్సిడీ ఇస్తున్నది, అవింకా పెరిగితే ఉపాధి ఇంకా తగ్గుతుంది. డ్రోన్‌ పరిశ్రమలు పెరిగితే ఐదు లక్షల మందికి కొత్తగా ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు తప్ప అంతకంటే ఎన్నో రెట్లు వ్యవసాయ కూలీలకు తగ్గే పని రోజులు, ఆదాయం గురించి మాత్రం మాట్లాడరు. మరోవైపు పారిశ్రామిక రంగంలో ఇస్తున్న సబ్సీడీల్లో ఎక్కువ భాగం పెట్టుబడులు భారీ మొత్తాలలో ఉండే పరిశ్రమలకు తప్ప ఉపాధి ఎక్కువగా దొరికే వాటికి వెళ్లటం లేదని అభివృద్ధి అధ్యయనాల మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆర్థికవేత్త అభిషేక్‌ ఆనంద్‌ చెప్పారు.


ముడిచమురు ధరలు పీపాకు పది డాలర్లు పెరిగితే జిడిపిలో 0.4శాతం తగ్గిపోతుంది. అదే తగ్గితే అంతే మేరకు పెరుగుతుంది. చమురు ధరలు పెరిగితే సబ్సిడీల మొత్తం కూడా దానికి అనుగుణంగా పెరుగుతుంది. గత రెండు సంవత్సరాలుగా చమురు ధరలు తగ్గటం, రష్యా నుంచి రాయితీ ధరలకు కొనుగోలు చేస్తుండటంతో జిడిపి పెరిగినట్లు కనిపిస్తున్నది. అది తాత్కాలికమే అని వేరే చెప్పనవసరం లేదు. మూలధన పెట్టుబడి ఏ ఆర్ధిక వ్యవస్థకైనా ఎంతో ముఖ్యం. గతేడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో 30శాతం మూలధన పెట్టుబడి ఖర్చు తగ్గిందని, అదే ఏప్రిల్‌ఆగస్టు నెలలకు 19.5శాతం తగ్గినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు నెలలో ఉత్పత్తి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 1.8శాతం తగ్గింది, ఇది గత 42నెలల్లో అధ్వాన్నపని తీరు. జిఎస్‌టి వసూళ్లు పెరుగుతున్నాయి, అవి కూడా సెప్టెంబరులో 6.5శాతమే, 2021 తరువాత ఇంత తక్కువ పెరుగుదల లేదట.ఉత్పత్తి, సేవారంగాల పిఎంఐ పరిస్థితి కూడా ఇంతే. గతేడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది అదే నెలలో 9.3శాతం మేరకు వాహనాల అమ్మకాలు తగ్గినట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ ఫెడరేషన్‌ వెల్లడిరచింది.వీటిని వినిమయానికి ఒక సూచికగా పరిగణిస్తారు. వాణిజ్య వాహనాల అమ్మకాలు గత నాలుగు నెలలుగా పడిపోతూనే ఉన్నాయి, 43నెలల్లో అధ్వాన్నంగా తేలింది. కార్ల నిల్వలు పెరిగిపోవటంతో వాటిని వదిలించుకొనేందుకు కంపెనీలు పెద్ద ఎత్తున రాయితీలను ప్రకటించటం రోజూ పత్రికల్లో కనిపిస్తున్నదే.పండుగల తరుణంలో పరిస్థితి మెరుగుపడుతుందనే ప్రకటనలు ప్రతి ఏటా తెలిసిందే.

ప్రపంచ మీడియా నరేంద్రమోడీ అద్భుత శక్తుల గురించి ఎందుకు ప్రశ్నిస్తోంది ? ఎన్నికల్లో మోడీ ఆకర్ష ఆకర్ష మంత్ర ప్రభావం, గొప్పగా ప్రచారం చేసుకున్న ఎఫ్‌డిఐ, దేశ ఆర్థిక రంగం ఎలా ఉందోపైన చెప్పుకున్న విషయాలన్నీ మన గోడీ మీడియా చర్చలు పెట్టకపోతే, విశ్లేషణలు రాయనంత మాత్రాన, నా కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తా అన్న ముసలమ్మ మాదిరి ఉంటే సూర్యోదయంఅస్తమయం ఆగుతుందా ? హర్యానా ఎన్నికల్లో బిజెపికాంగ్రెస్‌ మధ్య ఓట్లతేడా ఒకశాతం లోపే. ఒక స్థానంలో పోటీ చేసిన సిపిఎం, 89 చోట్ల బరిలో దిగిన కాంగ్రెస్‌కు కలిపి వచ్చిన ఓట్లు 39.34శాతం కాగా, బిజెపికి 39.94 ఆమ్‌ ఆద్మీ పార్టీని కాంగ్రెస్‌ కలుపుకొని వెళ్లి ఉంటే దానికి వచ్చిన 1.79శాతం ఓట్లు తోడైతే అక్కడా బిజెపి బొక్కబోర్లా పడి ఉండేదే. ఈ చిన్న మతలబు ప్రపంచానికి తెలియకుండా ఉంటుందా ?హర్యానా, జమ్మూకాశ్మీరు ఎన్నికల అనుభవాలను చూసిన తరువాత రాబోయే మహారాష్ట్ర,ఢల్లీి, రaార్కండ్‌, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి పెద్ద సవాలుగా మారబోతున్నాయి.