Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు.


నాలుగు సంవత్సరాల క్రితం మనదేశంలో చైనా వ్యతిరేక ఉన్మాదం తారాస్థాయిలో ఉంది.చైనా వస్తువులను బహిష్కరించి దాన్ని మనకాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనేక మంది వీరంగం వేశారు. ఇప్పుడు అలాంటి దృశ్యాలు, రాతలు ఎక్కడా కనిపించవు. అక్టోబరు చివరి వారంలో కొన్ని పత్రికలు, వెబ్‌సైట్లలో వచ్చిన వార్తల శీర్షికలు కొంతమందికి ఆనందం, ఆసక్తి కలిగిస్తే మరి కొందరికి ఆందోళన కలిగించవచ్చు. 2020 సంవత్సరంలో జరిగిన సరిహద్దు ఉదంతాల అనంతర అనుమానాల నుంచి బయటపడి లడక్‌ సరిహద్దు ప్రాంతంలో సాధారణ పరిస్థితులను పునరుద్దరించేందుకు భారతచైనా ప్రభుత్వాలు నిర్ణయించాయి, ఆ మేరకు చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీచైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ ఈమేరకు కరచాలనం చేసి ఆమోద ముద్రవేశారు. ఇది రెండు దేశాలకూ శుభసూచికం. వేల కోట్ల రూపాయలను సరిహద్దుల్లో వృధా చేయనవసరం లేదు. ‘‘ భారతచైనాల సామరస్యత కొరకు భారత సిఇఓలు ఎందుకు వత్తిడి చేశారు ’’ ( 2024 అక్టోబరు 24 ) బిజినెస్‌ చెఫ్‌ డాట్‌కాం విశ్లేషణ శీర్షిక. పదాల తేడాతో అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ఇచ్చిన ఇదే వార్తకు మరికొంత విశ్లేషణను జోడిరచి జాతీయ పత్రికలు, టీవీ ఛానల్స్‌ కొన్నింటిలో దర్శనమిచ్చింది. ఇదే సమయంలో ‘‘ పావురాల మధ్య గండుపిల్లి ’’ అంటూ చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు మరోశీర్షికతో వచ్చిన వార్తా విశ్లేషణలో చైనా పెట్టుబడుల గురించి భారత మాజీ రాయబారి హెచ్చరిక గురించి రాశారు. ఈ అంశంలో ఏం జరుగుతోంది ? ఎవరు దిగి వచ్చారు, ఎవరు వెనక్కు తగ్గారన్నది పాఠకులకే వదలి వేద్దాం.

గాల్వన్‌లోయలో పెద్ద ఉదంతం జరిగిన తరువాత మన దేశం చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధించి రాకుండా అడ్డుకుంది. ఇప్పుడు మన కార్పొరేట్‌ శక్తులు ఎందుకు చైనాతో సంబంధాల పునరుద్దరణకు నరేంద్రమోడీ మీద వత్తిడి తెస్తున్నారు ? చైనా సోషలిస్టు వ్యవస్థ అంటే అభిమానమా, కమ్యూనిజం అంటే ప్రేమా ?కానే కాదు, పక్కా వాణిజ్య ప్రయోజనాలే ! పెట్టుబడుల మీద ఆంక్షల సడలింపు గురించి కొద్ది నెలల క్రితమే మన అధికారం యంత్రాంగం లీకులు వదిలింది. దాని మీద ప్రతికూల ప్రచారం, వ్యతిరేకత తలెత్తకుండా రాజకీయ నాయకత్వం తగిన జాగ్రత్తలు తీసుకున్నది. చైనా పెట్టుబడులను అనుమతించేందుకు కేంద్రం నిర్ణయించినట్లు ఈ ఏడాది వెల్లడిరచిన ఆర్థిక సర్వేలో పేర్కొన్న అంశాలే సూచన ప్రాయంగా వెల్లడిరచాయి. అయితే సరిహద్దు వివాదం చర్చలు కొనసాగుతున్న తరుణంలో తలుపులు బార్లా తెరిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భయంతో చైనా వ్యతిరేకులను చల్లబరిచేందుకు, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కలిగించేందుకు చూస్తున్నారు. సరిహద్దులో పూర్వపు స్థితిని పునరుద్దరించేందుకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చిన వార్తల ప్రకారం ఇరుదేశాల పరువుకు భంగం కలగకుండా గతంలో ఎవరు ఎక్కడ ఉంటే అక్కడకు వెనక్కు తగ్గాలన్న ఒప్పందం కుదిరింది. ఆ మేరకు తట్టాబుట్టా సర్దుకోవటం ప్రారంభమైంది. చైనాతో సాధారణ స్థితికి మన సంబంధాలు రాకూడదని కోరుకుంటున్న అమెరికాకు ఇది మింగుడుపడటం లేదు.దానికి తక్షణ స్పందన అన్నట్లుగా ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో మన ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న కెనడాకు మద్దతు పలుకుతున్న వైనాన్ని చెప్పవచ్చు.అంతర్జాతీయ రాజకీయాల్లో ఏదీ సూటిగా ఉండదు.

ఇటీవలి ఆర్థిక సర్వేలో చైనా పెట్టుబడులకు పచ్చజెండా ఊపారు. దీని మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్న చీలికలను ఉపయోగించుకొనేందుకు వెంటనే మనదేశంలో చైనా రాయబారి పావులు కదిపారని చైనాలో భారత మాజీ రాయబారి గౌతమ్‌ బంబావాలే వ్యాఖ్యానించారు. చైనా ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ భారత ప్రధాన ఆర్థిక సలహాదారు చేసిన వ్యాఖ్యలతో పావురాల మధ్య గండుపిల్లిని వదలినట్లయింది. ఈ విషయంలో సమన్వయం లేదని, అలాంటి ప్రకటన చేసే ముందుకు జాతీయ భద్రతా సలహాదారులను కూడా పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందని, ఎకనమిక్‌ సర్వే సమయంలో వ్యాఖ్యలు చేయటం ఆందోళనకరంగా ఉందని గౌతమ్‌ వ్యాఖ్యానించారు. టెలికమ్యూనికేషన్స్‌ ఇతర రంగాలలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని గౌతమ్‌ సలహాఇచ్చారు. చైనా పెట్టుబడులపై పునరాలోచనలేదని వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ గతంలోనే చెప్పినా పరిణామాలు దానికి భిన్నంగా ఉన్నాయి. చైనాతో సఖ్యతకు కేంద్రం సుముఖంగా లేకపోతే సరిహద్దు సమస్యపై అంగీకారం కుదిరివుండేదే కాదు.రానున్న రోజుల్లో వేగం పుంజుకొనే అవకాశం ఉంది. చైనా పెట్టుబడులపై ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పును అర్ధం చేసుకోవాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించే స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జెఎం) గతంలో ఏం చెప్పిందో 2020జూలై ఒకటవ తేదీ ఎఎన్‌ఐ వార్త సారాంశాన్ని చూద్దాం.ఆ సంస్థ జాతీయ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ చెప్పినదాని ప్రకారం ఇలా ఉంది.‘‘పేటిఎం వంటి భారతీయ స్టార్టప్‌ కంపెనీల నుంచి చైనా పెట్టుబడులకు ఉద్వాసన పలకాలి. మన విదేశీమారకద్రవ్య నిల్వలు ఐదువందల బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఆరు బిలియన్‌ డాలర్ల చైనా పెట్టుబడులు లెక్కలోనివి కాదు. మన సంస్థలు పైచేయి సాధించటానికి ఇదొక సువర్ణ అవకాశం.చైనా పెట్టుబడులను కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకించటం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. చైనా ఒక సూపర్‌పవర్‌ అనే వాతావరణాన్ని సృష్టిస్తున్నపుడు దాన్ని మనం దెబ్బతీయాల్సిన అవసరం లేదా ? ముందుగా మన పరిశ్రమలను రక్షించుకోవాలి.’’ సరిగ్గా ఈ మాటలు చెప్పిన నాలుగు సంవత్సరాల తరువాత అదే చైనా నుంచి పెట్టుబడులు తెచ్చుకోవాలని మన ఎకనమిక్‌ సర్వేలో రాసుకున్నాం, తగిన జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడులను తీసుకోవచ్చని అదే పాలకపార్టీ పెద్దలు సెలవిస్తున్నారు.మేము వాణిజ్యం కావాలనుకుంటున్నాం, పెట్టుబడులను కోరుకుంటున్నాం, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకుంటాం అని తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.అమెరికన్లను ఉద్దేశించిన ఒక సమావేశంలో ఈ మాటలు చెప్పారు. జాగ్రత్తలు తీసుకోవద్దని ఎవరన్నారు? ఇది కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతలను నిరంతరం రెచ్చగొట్టే సంఘపరివార్‌, దాని భావజాలానికి లోనైన వారికి చెప్పుకోరానిచోట తగిలినదెబ్బ.

2020 సరిహద్దు ఉదంతం తరువాత చైనా పెట్టుబడులపై ఆంక్షలు ఎదురుతన్నుతున్నాయని మన కార్పొరేట్‌ పెద్దలు చెప్పినట్లు, వాణిజ్య ఆంక్షలను సడలించేందుకు ప్రభుత్వం చూస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. నిజానికి చైనా నుంచి దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవు, ఈ విషయంలో మోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. నిబంధనలు సడలించటం అంటే పెట్టుబడుల స్వీకరణకు ద్వారాలు తెరవటమే. గడచిన ఆర్థిక సంవత్సరంలో చైనాతో లావాదేవీలు 118.4బిలియన్‌ డాలర్లు కాగా అక్కడి నుంచి చేసుకున్న దిగుమతుల మొత్తం 101.7బిలియన్‌ డాలర్లు ఉంది. చైనా పెట్టుబడులపై ఆంక్షల కారణంగా చిప్‌ తయారీ వంటి ఉన్నత సాంకేతిక రంగాలతో పాటు విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీల తయారీలో కూడా వెనుకబడుతున్నట్లు భావిస్తున్న కార్పొరేట్స్‌ చైనా పెట్టుబడులకు అనుమతులు ఇవ్వాలని మోడీ సర్కార్‌ మీద తీవ్ర వత్తిడి తెస్తున్నాయి. భారతీయులు యజమానులుగా ఉన్న కంపెనీలలో తొలిదశలో పదిశాతం మేరకు చైనా పెట్టుబడులను అనుమతించాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గత పదిహేను సంవత్సరాలలో మనదేశ దిగుమతులలో చైనావాటా 21 నుంచి 30శాతానికి పెరిగింది.ప్రస్తుతం మొత్తం దుస్తులు, వస్త్రాల దిగుమతుల్లో చైనా నుంచి 41.5, ఎలక్ట్రానిక్‌, టెలికాం ఉత్పత్తులు 38.7,యంత్రాలు 38.5 శాతం చొప్పున ఉన్నాయి.రసాయనాలు 28.7,ప్లాస్టిక్స్‌ 25, ఆటోమొబైల్‌ 23, ఐరన్‌,స్టీలు, బేస్‌ మెటల్‌ 16.6శాతం చొప్పున దిగుమతి చేసుకుంటున్నాము.నరేంద్రమోడీ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత 201920లో చైనా నుంచి దిగుమతుల విలువ 8,187 కోట్ల డాలర్లుండగా 202324నాటికి 11,839 కోట్ల డాలర్లకు పెంచారు.(2015లో 7,166కోట్ల డాలర్లు మాత్రమే ఉండేది.) ఇదే సమయంలో మన ఎగుమతులు చైనాకు 1,661 కోట్ల నుంచి 1,665 కోట్ల డాలర్లకు మాత్రమే పెరిగాయి. మన మేకిన్‌ ఇండియా ఎలా విఫలమైందో దీన్నొక ఉదాహరణగా చెప్పవచ్చు.

కొన్ని ప్రత్యేక పరిశ్రమలకు సంబంధించి 2023 చివరిలో చైనా నిపుణులకు వీసా నిబంధనలు సడలించటమే మోడీ సర్కార్‌లో వచ్చిన మార్పుకు నిదర్శనమని 2024 జూలై 18 ఎకానమిస్టు పత్రికలో వచ్చిన వార్తను నిదర్శనంగా చూపుతున్నారు.కొన్ని కంపెనీలలో యంత్రాల అమరిక వంటి పనులకు అవసరమైన చైనా ఇంజనీర్లను గతనాలుగు సంవత్సరాలుగా మనదేశం అనుమతించని కారణంగా మన పరిశ్రమలకే నష్టం వాటిల్లింది. తాజాగా ప్రభుత్వం పదిహేను రోజుల్లో ఇ వీసాలు ఇచ్చేందుకు నిర్ణయించటంతో పరిశ్రమలకు ఎంతో ఊరట కలిగింది. ఇటీవలి కాలంలో చైనా వ్యతిరేక ధోరణి తగ్గి, సరిహద్దుల్లో శాంతి మంత్రం జపించటం పెరిగింది. సరిహద్దు చర్చలు ‘‘పురోగతి’’లో ఉన్నాయని ఏప్రిల్‌ నెలలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చెప్పారు. ఆ మరుసటి నెలలోనే 18నెలల తరువాత ఢల్లీిలో చైనా నూతన రాయబారి నియామకం జరిగింది.మరో వైపు మన దేశంలో దలైలామాను అమెరికా అధికారులు కలిసినా పెద్ద సమస్యగా మార్చకుండా చైనా సంయమనం పాటించింది. దాన్ని అమెరికాతో సమస్యగా పరిగణించింది. సరిహద్దులో బఫర్‌ జోన్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఇరు దేశాలు సేనలను వెనక్కు రప్పించి, కాపలా నిబంధనలను సడలించటం కూడా ముఖ్యపరిణామమే.చైనా ఇతర దేశాలతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నదని, భారత్‌తో సఖ్యతగా మెలిగితే దానికి లాభం తప్ప నష్టం ఉండదనే ముందుచూపుతో సరిహద్దుల్లో సఖ్యతకు అంగీకరించిందని కొందరు చెబుతున్నారు. ఇప్పటికే మన దేశానికి చెందిన కొన్ని కార్పారేట్‌ సంస్థలు చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్య కంపెనీల ఏర్పాటుకు పావులు కదుపుతున్నాయి. చైనా ప్రభుత్వ ంగ సంస్థ ఎస్‌ఏఐసి మోటార్స్‌తో కలసి మన దేశానికి చెందిన జెఎస్‌డబ్ల్యు గ్రూపు 2030నాటికి దేశ మార్కెట్లో గణనీయ వాటాను దక్కించుకొనేందుకు విద్యుత్‌ వాహనాల ఉత్పత్తికి భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. డిక్సన్‌ టెక్నాలజీస్‌ సంస్థ లాంగ్‌ ఛీర్‌ మరియు హెచ్‌కెసి అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు, మైక్రోమాక్స్‌ కంపెనీ స్మార్ట్‌ ఫోన్ల నమూనాలు, ఐటి హార్డ్‌వేర్‌, టెలికాం పరికరాల రూపకల్పనలకు ఓడిఎం హాక్విన్‌ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నాయి. చైనాలో యాపిల్‌ ఐ ఫోన్లను తయారు చేసే అమెరికా కంపెనీ మనదేశంలో కూడా ఉత్పత్తి చేస్తున్నది. దానికి విడిభాగాలను అందిస్తున్న చైనా కంపెనీలను మనదేశంలో ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇలాంటి వాటివలన చైనాకు వచ్చే నష్టం ఉండదు.

సరిహద్దు సమస్యపై ఒప్పందాలు, పెట్టుబడుల స్వీకరణకు చైనాతో సఖ్యత కుదుర్చుకుంటున్న మన దేశం పాకిస్తాన్‌తో అదే మాదిరి ఎందుకు ముందుకు పోవటం లేదని కూడా మన మీడియాలో కొందరు విశ్లేషిస్తున్నారు. అదేమీ అర్ధం కానంత బ్రహ్మపదార్ధమేమీ కాదు. ప్రపంచ సరఫరా గొలుసులో మనం కూడా కలవాలంటే చైనా నుంచి ఎఫ్‌డిఐ అవసరమని తాజా ఆర్థిక సర్వేలో స్పష్టంగా పేర్కొన్నారు. మనవాణిజ్యంలో ప్రధమ స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కు నెట్టి మరోసారి చైనా ముందు వచ్చింది.అమెరికాకు ఎగుమతులు చేయాలన్నా చైనా పెట్టుబడుల అవసరం ఉంది. చైనా కంపెనీలు మనదేశంలో పెట్టుబడులు పెడితే మనం ఎగుమతులు చేయవచ్చు. ఇలా ఆర్థికంగా చైనాతో ఉన్న లాభాలు పాకిస్థాన్‌తో లేవు. పాక్‌ ప్రేరేపిత లేదా అక్కడి నుంచి వచ్చిన తీవ్రవాదులు మనదేశంలో అనేక దాడులు చేసి ఎంతో నష్టం కలిగించారు.సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ పాక్‌ నుంచి మనదేశానికి ఉగ్రవాదంతీవ్రవాదులను ఎగుమతి చేస్తున్నట్లుగా చైనా నుంచి లేదన్నది తెలిసిందే.చైనాను వ్యతిరేకించేవారు, అనుమానంతో చూసే వారు కూడా ఉగ్రవాదం విషయంలో వేలెత్తి చూపే అవకాశం లేదు.