Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

తాను అందరి మాదిరి జీవ సంబంధంగా పుట్టలేని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. రాగద్వేషాలు లేని కర్మయోగి, విశ్వగురువు అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. ఆయన కన్నతల్లి వృద్ధాప్యంలో ఉన్నపుడు, చివరి రోజు వరకు చూసేందుకు అనేక సార్లు వెళ్లారు, సేవ చేశారని వార్తలు చదివాం, చిత్రాలను చూశాం. కానీ అలాంటి మరో తల్లిని చూసేందుకు ఆమె కుమార్తెకు వీసా నిరాకరించిన అదే పెద్దమనిషి తీరును ఎలా చూడాలి. ఎందుకు అలా చేశారు ? భారతీయ సంప్రదాయం, నైతికత అయితే కాదు, మరి రాజకీయ కక్షా ? అది అంత అమానవీయంగా ఉంటుందా ? అనేక వ్యాధులతో దినదిన గండగా నేడో రేపో అన్నట్లుగా గడుపుతున్న 82 ఏండ్ల కన్నతల్లిని చూసేందుకు ఒక కుమార్తెకు వీసా ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం నిరాకరించింది. ఆమె వీసా సమస్య గురించి విదేశాంగ మంత్రి జై శంకర్‌కు పూర్తిగా తెలుసు.జూన్‌ 26 నుంచి జూలై 15 మధ్య బెంగలూరు వచ్చేందుకు తనను అనుమతించాలని ఆమె జై శంకర్‌కు 2024 జూన్‌ 13న ఒక లేఖ రాశారు. రెండు సంవత్సరాల నుంచి తన తల్లి చికిత్స పొందుతున్నదని, దానికి సంబంధించిన వైద్యుల వివరణను కూడా జత చేసినా కనీసం లేఖ అందినట్లుగానీ, అనుమతి గురించి గానీ ఎలాంటి సమాధానం మంత్రి నుంచి రాలేదని ఆమె పేర్కొన్నారు. తాను కేవలం తల్లిని చూడటానికి మాత్రమే వస్తున్నట్లు, ఇతర కారణాలేమీ లేవని కూడా స్పష్టం చేసినప్పటికీ పట్టించుకోలేదు. విశ్వగురువు, అపరమానవతావాదిగా ప్రశంసలు పొందిన నరేంద్రమోడీ నాయకత్వంలోని అధికారులు ఒకసారి కాదు ఏడాదిలో ఏకంగా మూడు సార్లు తిరస్కరించారు. దీని గురించి అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన తరువాత కూడా స్పందించలేదంటే కచ్చితంగా కావాలనే నిరాకరిస్తున్నట్లు భావించాల్సి వస్తోంది.

ఈ ఏడాది జనవరి తొమ్మిదిన ఆన్‌లైన్‌ ద్వారా క్షమ, ఆమె భర్త వీసా దరఖాస్తులను సమర్పించగా దాదాపు నెల రోజుల పాటు దరఖాస్తును తొక్కి పట్టి ఏ కారణం చెప్పకుండా మానసిక ఆందోళనకు గురిచేశారు. చివరికి భర్త కాల్విన్‌ ప్రీస్ట్‌కు మంజూరు చేసి క్షమకు తిరస్కరించారు. బెంగలూరులో ఉంటున్న తల్లి వసుంధరా రామానుజమ్‌ను పరామర్శించే నిమిత్తం ఇండియన్‌అమెరికన్‌ మహిళ క్షమా సావంత్‌(51) గతేడాది మే నెల నుంచి మూడు సార్లు దరఖాస్తు చేశారు. అమెరికాలోని మన దౌత్య కార్యాలయాలు అత్యవసర వీసా నిరాకరించాయి.తీవ్ర నేరారారోపణలతో జైళ్లలో ఉన్న నిందితులకు, శిక్షలు పడిన వారికి కూడా ఇలాంటి కారణాలతో పరిమిత బెయిలు మంజూరు చేసిన ఉదంతాలు మనకు తెలిసిందే. క్షమ సావంత్‌ నేరస్థురాలు కాదు, మన దేశ ఉగ్రవాద లేదా మరొక నిషేధిత జాబితాలో ఆమె పేరు లేదు. ఎలాంటి కేసులు లేవు. కానీ కారణాలు చూపకుండానే మీరు తిరస్కరణ జాబితాలో ఉన్నారంటూ అమెరికా వాషింగ్టన్‌ రాష్ట్రంలోని సియాటిల్‌ నగరంలో భారత కాన్సులేట్‌ దౌత్య కార్యాలయం 2025 ఫిబ్రవరి మొదటి వారంలో వీసా నిరాకరించింది. కారణం ఏమిటో చెప్పాలంటూ గట్టిగా అడిగినందుకు, చెప్పాల్సిన పని లేదని, కార్యాలయంలో అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులను పిలిపించింది. భర్త కాల్విన్‌ ప్రీస్ట్‌కు వీసా మంజూరు చేసి తనకు నిరాకరించటానికి నరేంద్రమోడీ విధానాలను వ్యతిరేకించే రాజకీయ కారణాలు తప్ప మరొకటి కాదని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.

మోడీ సర్కార్‌ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సిఏఏ), జాతీయ పౌరనమోదు (ఎన్‌ఆర్‌సి)లను ఖండిస్తూ ఆమె ప్రాతినిధ్యం వహించిన సియాటిల్‌ నగరపాలక సంస్థలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కులవివక్షకు వ్యతిరేకంగా 2023లో అదే సంస్థలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. కొన్ని కులాల వారి పట్ల వివక్ష చూపకూడదంటూ అమెరికా చరిత్రలో అధికారికంగా ఒక నగరంలో తీర్మానించటం ఇదే ప్రధమం.ఈ పరిణామం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించటమే గాక భారత్‌లో ఉన్న వివక్ష గురించి చర్చకు దారితీసింది. ఆమె సోషలిస్టు ప్రత్నామ్నాయం అనే సంస్థలో సభ్యురాలు. వీసా నిరాకరించిన కారణం చెప్పనందుకు తాను, తన భర్త , మద్దతుదారులతో కలిసి శాంతియుత పద్దతిలో ధర్నా చేశామని, వివరణ ఇచ్చేందుకు వారు తిరస్కరించారు, తెలుసుకోకుండా కదిలేది లేదని మేము తిరస్కరించటంతో వారు పోలీసులను పిలుస్తామని బెదిరించారంటూ ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన మీద, మద్దతుదారులపై కూడా చేయి చేసుకున్నట్లు ఆ తెలిపారు. తనకు వీసా ఇవ్వకపోవటానికి నరేంద్రమోడీ ప్రభుత్వ తిరస్కరణ జాబితాలో పేరుండటమే అని ఒక అధికారి తనతో చెప్పినట్లు కూడా ఆమె మరో పోస్టులో పేర్కొన్నారు. వారాల తరబడి ఎలాంటి స్పందన లేకపోగా ఫోన్‌ ద్వారా సంప్రదించినా సమాధానం లేదన్నారు. వాషింగ్టన్‌ రాష్ట్రంలోని అతి పెద్ద నగరమైన సియాటిల్‌ సిటీ కౌన్సిల్లో సిఏఏ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా తాను తీర్మానాలు ప్రవేశ పెట్టటమే దీనికి కారణమని కూడా క్షమ పేర్కొన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వ విధానాల పట్ల విమర్శనాత్మక వైఖరిని వెల్లడిరచిన స్వీడన్‌లో ఉన్న భారతీయ ప్రొఫెసర్‌ అశోక్‌ సవాయిన్‌, బ్రిటన్‌లో ఉన్న రచయిత నితాషా కౌల్‌కు సైతం ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. విదేశాల్లో ఉంటూ తమ ప్రభుత్వాన్ని విమర్శించటం ఏమిటన్న దురహంకారం, కక్ష తప్ప దీనిలో మరోటి కనిపించటం లేదు.

క్షమ సావంత్‌ మహారాష్ట్రలోని పూనాలో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. తల్లి స్కూల్‌ పిన్సిపల్‌గా పని చేశారు. క్షమ 13 ఏండ్ల వయస్సులో ఇంజనీరైన తండ్రి ఒక ప్రమాదంలో మరణించారు. ముంబైలో ఆమె చదువుకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరయ్యారు.1996లో అమెరికా వెళ్లిన తరువాత అర్థశాస్త్రంలో పిహెచ్‌డి చేసి కొంతకాలం ప్రొఫెసర్‌గా పని చేశారు. అక్కడే ఆమె 2006లో వామపక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు.అంతకు ముందు ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. 2012లో వాషింగ్టన్‌ ప్రజాప్రతినిధుల సభకు పోటీచేసి ఓడిపోయారు. తరువాత సియాటిల్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలిచి 2014 నుంచి 2024వరకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో కులవివక్ష వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదింప చేయించటంతో పాటు కనీసం వేతనం గంటకు 15 డాలర్ల చట్టాన్ని అమలు జరిపించటంలో కూడా ఆమె పట్టుబట్టారు. కుల వివక్షకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదింప చేసేందుకు ఆమె కృషి చేయటాన్ని, సిఎఎ, ఎన్‌ఆర్‌సి చట్టాలను ఖండిస్తూ తీర్మానాలను చేయించటాన్ని అమెరికాలోని హిందూత్వశక్తులు జీర్ణించుకోలేకపోయాయి.


కుల వివక్ష వ్యతిరేక తీర్మానం చేయించటంలో కీలక పాత్ర పోషించటాన్ని హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీసా తిరస్కరణ వెనుక ఈ అంశం ఉందా అన్న ప్రశ్నకు ఇంతకు మించి బిజెపి ప్రభుత్వ రాజకీయ నిర్ణయం వెనుక మరొక కారణం కనిపించటం లేదు అన్నారు. నేను ఒక సోషలిస్టును, పదేండ్ల పాటు కార్మికవర్గ ప్రతినిధిగా సియాటిల్‌ కౌన్సిల్లో ఉన్నాను, ఆ సమయంలో నేను ప్రజా ఉద్యమ నిర్మాణానికి, కనీసవేతనం గంటకు 15డాలర్లకు పెంచాలని కోరుతూ నా పదవిని వినియోగించాను. ఇప్పుడది 20.76 డాలర్లకు పెరిగింది. అమెరికాలో ఇది గరిష్టం. పేదల గృహ నిర్మాణాలకు కార్పొరేట్‌ సంస్థలు వాటా చెల్లించాలని కూడా నేను పని చేశాను.2020 ఫిబ్రవరిలో సిఏఏ, ఎన్‌ఆర్‌సి చట్టాలను ఖండిస్తూ సియాటిల్‌ కౌన్సిల్లో పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ కార్యాలయం నాకు ఒక లేఖ పంపింది. అమెరికాలోని హిందూత్వ శక్తులు, మోడీ మద్దతుదార్లనుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాం.2023 ఫిబ్రవరిలో కులవివక్షపై చారిత్రాత్మక నిషేధాన్ని ప్రకటించటంలో విజయం సాధించాం. మాకు విశ్వహిందూ పరిషత్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. మితవాద హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌, ఉత్తర అమెరికా హిందువుల సంఘటన మాకు వ్యతిరేకంగా పని చేశాయి. అందువలన మోడీ ప్రభుత్వం, అమెరికాలోని దాని మద్దతుదార్లు మాకు వ్యతిరేకంగా ఉన్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. వారందరికీ నా రాజకీయ అభిప్రాయాలు ఏమిటో తెలుసు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు అనుమతించకపోవటం అమానుషం, ఏ రకమైన ప్రభుత్వమిది. నా వీసా తిరస్కరణ వెనుక రాజకీయ కారణాలు లేవని మోడీ సర్కార్‌ చెప్పుకోవాలంటే వీసా మంజూరు చేసి నిరూపించుకోవచ్చని క్షమ పేర్కొన్నారు.

అమెరికాకు వెళ్లిన వారు అందరూ అని కాదు గానీ ఎక్కువ మంది తమతో పాటు కులతత్వాన్ని, కులవివక్షను కూడా తీసుకుపోయారు. ఈ మధ్య దానికి మతాన్ని కూడా తోడు చేశారు. మన దేశంలో మత ప్రాతిక మీద పని చేసే సంస్థలన్నింటికీ అమెరికా శాఖలు ఉన్నాయి. దక్షిణాసియా నుంచి వచ్చిన దళితులు, ఇతర అణచివేతకు గురైన కులాల వారు అమెరికాలో కూడా దాన్ని తప్పించుకోలేకపోతున్నారు.కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ అనే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం విద్యాపరంగా మూడిరట ఒక వంతు, పని స్థలాల్లో , మూడిరట రెండువంతుల మంది వివక్షను ఎదుర్కొన్నట్లు తేలింది. తక్కువగా చూడటం, సూటిపోటి మాటలు, లైంగిక వేధింపుల గురించి 30 మంది దళిత మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు తమ అనుభవాలను బహిరంగ లేఖ రూపంలో వెల్లడిరచారు. సిస్కో సిస్టమ్స్‌ కంపెనీలో అగ్రవర్ణాలుగా భావించబడుతున్నవారు తనకు రావాల్సిన ఉద్యోగోన్నతి, వేతన పెంపుదలను ఎలా అడ్డుకుంటున్నారో వెల్లడిస్తూ దాఖలు చేసిన కేసును ఒక దళత సామాజిక తరగతికి చెందిన ఇంజనీరు గెలిచారు. ఆ తరువాత వందలాది మంది తాము ఎదుర్కొన్న వివక్ష గురించి గళం విప్పారు. ఈ పూర్వరంగంలోనే క్షమ సావంత్‌ సియాటిల్‌ సిటీ కౌన్సిలర్‌గా వివక్షకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింప చేయించారు. లేని సమస్య ఉన్నట్లు, అతిగా చేసి పరువు తీస్తున్నారంటూ హిందూత్వ సంస్థలు, అగ్రకుల నాయకత్వంలోని సంస్థలు ఆమె మీద ధ్వజమెత్తాయి. సియాటిల్‌ కౌన్సిల్లో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారు ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారు తొలుత తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు. మితవాదులు ముందుకు తెచ్చిన వాదనలనే వారు వల్లించారు. చివరి వరకు ఏదో విధంగా అడ్డుకోవాలని చూశారు. అయితే వారి మీద వచ్చిన వత్తిడి కారణంగా ఒకరు తప్ప మిగతావారందరూ ఓటు వేయటంతో తీర్మానం నెగ్గింది.

క్షమా సావంత్‌ అలుపెరగని పోరాట యోధురాలిగా ఉన్నారు.కార్మికవర్గాన్ని దోచుకుంటున్న ధనికులు, వారికి మద్దతు ఇస్తున్న అధికార రిపబ్లిక్‌, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీల వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 22న సియాటిల్‌ నగరంలో ఒక సభను ఆమె నాయకత్వంలో పని చేస్తున్న వర్కర్స్‌ స్ట్రైక్‌ బాక్‌ సంస్థ నిర్వహిస్తున్నది. డెమోక్రటిక్‌ సోషలిస్టుగా ఉన్న బెర్నీ శాండర్స్‌ కూడా అందరికీ అందుబాటులో వైద్యం వంటి అంశాలలో జో బైడెన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించారని కూడా ఆమె విమర్శించారు. ఆ రెండు పార్టీలకు ప్రత్నామ్నాయంగా మరొక పార్టీ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని గతంలో ప్రకటించారు. దళితుల సమస్యల మీద ఆ సామాజిక తరగతికి చెందిన వారు మాత్రమే సక్రమంగా స్పందించగలరని వారు మాత్రమే పోరాటాలకు నాయకత్వం వహించాలని చెబుతున్న వారు క్షమ పోరాటం, ఆమె ఎదుర్కొంటున్న వేధింపులను చూసిన తరువాత తమ సంకుచిత వైఖరిని మార్చుకోవాలని సూచించటం తప్పుకాదేమో !