Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు


మన ఎన్నికలలో ఓటర్లు ఎక్కువగా పాల్గొనేందుకు ప్రోత్సాహ చర్యలు తీసుకొనేందుకు అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యాన నడిచే ఏజన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఎయిడ్‌) సంస్థ 21 మిలియన్‌ డాలర్లు (రు.182 కోట్లు) మంజూరు చేసింది. దీన్ని జో బైడెన్‌ సర్కార్‌ కేటాయిస్తే డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఆ నిర్ణయాన్ని 90 రోజుల పాటు స్థంభింపచేస్తూ జనవరి 20న ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశాడు. నిజానికి ఈ మొత్తాన్నే కాదు, ప్రపంచమంతటా వివిధ దేశాలకు ఇస్తున్న మొత్తాలపై ఈ నిర్ణయం జరిగింది. భారత్‌ దగ్గర చాలా డబ్బుంది, అక్కడ ఓటర్లను ప్రోత్సహించేందుకు మనమెందుకు డబ్బివ్వాలంటూ ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఈ సొమ్మును గతంలో ఇచ్చారా, రాబోయే రోజుల్లో ఖర్చుచేసేందుకు మంజూరు చేశారా, విడుదల చేశారా లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. బిజెపి నేతలు అమిత్‌ మాలవీయ, రాజీవ్‌ చంద్రశేఖర్‌ల స్పందన చూస్తే ఈ మొత్తం ఖర్చు చేసినట్లుగా అర్ధం అవుతున్నది. ‘‘ ఓటర్లు బారులు తీరేందుకు 21 మిలియన్‌ డాలర్లా ? ఇది కచ్చితంగా భారత్‌ ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యమే. దీన్నుంచి ఎవరు లబ్ది పొందారు ? అధికారపక్షమైతే కచ్చితంగా కాదు ’’ అని అమిత్‌ మాలవీయ చెప్పారు. రాజుగారి చిన్న భార్య అందగత్తె అంటే పెద్ద భార్య అనాకారి అనేకదా అన్నట్లుగా అధికారంలో ఉన్న బిజెపి గాకపోతే కాంగ్రెస్‌ లబ్దిపొందినట్లు ఆరోపించటమే కదా ? ఈ మాత్రం అర్ధం చేసుకోలేనంత అమాయకంగా మన జనాలు ఉన్నారా ?ప్రజాస్వామ్యాలను బలహీనపరచటం, జోక్యం చేసుకోవాటానికి ఇది నిదర్శనం అని మాజీ కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రకటించారు.ఒక వైపు ప్రజాస్వామిక విలువల గురించి చర్చ చేస్తూ మరోవైపు నిర్లజ్జగా ప్రజాస్వామిక దేశాలను బలహీనపరిచేందుకు పూనుకోవటం దిగ్భ్రాంతి కలిగిస్తున్నదన్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. శుక్రవారం నాడు విదేశాంగశాఖ ప్రతినిధి మాట్లాడుతూ తామీ సమాచారాన్ని చూశామని, సహజంగానే ఇది ఎంతో ఆందోళన కలిగిస్తుంది, భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం గురించి ఆందోళనకు దారి తీసింది. సంబంధిత శాఖలు, ఏజన్సీలు దీని గురించి చూస్తున్నాయి, ఈ దశలో బహిరంగంగా ప్రకటించటం తొందరపాటు అవుతుంది,తరువాత చెబుతాము అన్నారు.

నిజానికి ఇంత స్వల్ప మొత్తంతో ప్రభావితమై ఒక రాష్ట్రం లేదా దేశంలో ఓటర్లు కుప్పలు తెప్పలుగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తారా ? ఒక్కో ఎంపీ అభ్యర్థి వంద కోట్లు, ఎంఎల్‌ఏ పాతిక కోట్ల వరకు ఖర్చు పెడుతుంటేనే మాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, వేరేవారికి ఎక్కువ ఇచ్చారంటూ నిరసనలతో అందరూ రావటం లేదు. ఏ మూలన చీమ చిటుక్కుమన్నా పసిగట్టే అమెరికన్లకు ఇంత చిన్న విషయం తెలియదా ? తామిచ్చే 182 కోట్లతో ఓటర్లు బారులు తీరతారా ? సాక్షాత్తూ అమెరికా ప్రభుత్వం వెల్లడిరచిన ఈ అంశం మీడియాలో చర్చకు దారితీసింది. వాస్తవాలను వెల్లడిరచేవరకు ఇది చర్చలో ఉంటుంది. సూది కోసం సోదికి పోతే పాత బాగోతాలన్నీ బయటపడినట్లు ఈ వ్యవహారంలో ఎంత పాత్ర ఉందో తెలియదు గానీ అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీణా రెడ్డి అనే ఆమె 2021 ఆగస్టు నుంచి 2024 జూలై వరకు అమెరికా సాయ ఏజన్సీ భారత డైరెక్టర్‌గా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎవరినో గెలిపించేందుకు ప్రయత్నించారని తాను ఊహిస్తున్నట్లు ట్రంప్‌ ఒక సాధారణ వ్యాఖ్య చేశాడు. 2014కు ముందు పెద్ద మొత్తంలో అమెరికా సాయం వచ్చిందని, తాము అధికారంలోకి వచ్చాక నామమాత్రమని బిజెపి పెద్దలు చెబుతున్నారు. అదే నిజమైతే ఆ సొమ్మును మోడీ గెలుపుకోసం వినియోగించినట్లు ఎందుకు భావించకూడదు ? ఒక వేళ కాంగ్రెస్‌ కోసం ఖర్చు చేసి ఉంటే పదేండ్ల నుంచి బిజెపి పాలకులు నిజాల నిగ్గుతేల్చకుండా ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? బిజెపి మాజీ ఎంపీ మహేష్‌ జత్మలానీ వీణా రెడ్డి గురించి ఒక ట్వీట్‌ చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత ఆమె అమెరికా వెళ్లారని ఇక్కడ ఉంటే దర్యాప్తు సంస్థలు ఈ సొమ్ము గురించి ప్రశ్నించి ఉండేవారన్నారు. తప్పించుకుపోయారన్న అర్ధం దీని వెనుక ఉంది. అమెరికాలో ఉంటే మాత్రం మన కేంద్ర ప్రభుత్వానికి అడిగే అవకాశం లేదా ? యూఎస్‌ఎయిడ్‌ ప్రభుత్వ సంస్థ, అందువలన నేరుగా మన ప్రభుత్వమే వివరాలు ఇవ్వాలని ఈ పాటికే ఎందుకు అడగలేదు ? జనానికి చెవుల్లో కమలంపూలు పెడుతున్నట్లుగా ఉంది. అమెరికా ప్రభుత్వ సమాచారాన్ని ఉటంకించిన ఇండియా టుడే వార్త ప్రకారం వీణా రెడ్డి హయాంలో మన దేశానికి అమెరికా సాయం రు.720 కోట్ల నుంచి 2022లో రు.2,500 కోట్లకు పెరిగినట్లు, 2023లో రు.1,515 కోట్లు, 2024లో రు.1,304 కోట్లు వచ్చాయి. ఈ సొమ్మును దేనికి ఖర్చు చేశారో నిగ్గుతేల్చాల్సింది పోయి, కాంగ్రెస్‌ మీద మరొక పార్టీ మీద నిందలు వేస్తే కుదరుతుందా ? ఓటర్లను పెద్ద ఎత్తున రప్పించేందుకు ఇచ్చినట్లు చెబుతున్న 21మిలియన్‌ డాలర్లు(రు.182 కోట్లు) అమెరికా కేంద్రంగా పని చేస్తున్న కన్సార్టియం ఫర్‌ ఎలక్షన్స్‌ అండ్‌ పొలిటికల్‌ ప్రోసెస్‌ స్ట్రెంతనింగ్‌`సిఇపిపిఎస్‌( ఎన్నికలు, రాజకీయ క్రమాన్ని పటిష్ట పరిచేందుకు ఏర్పడిన సహవ్యవస్థ)కు కేటాయించారు. ఇది అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎలక్ట్రొరల్‌ సిస్టమ్స్‌, ఇంటర్నేషనల్‌ రిపబ్లికన్‌ ఇనిస్టిట్యూట్‌, నేషనల్‌ డెమోక్రటిక్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థలతో కూడిన కూటమి. ఎలన్‌ మస్క్‌ నిర్వహిస్తున్న ప్రభుత్వ సామర్ధ్య శాఖ(డోజె) వెల్లడిరచిన సమాచారమే ఇది.

సాయం పేరుతో ఎంత ఖర్చు చేస్తే అంతగా ఆర్థికంగా, రాజకీయంగా అమెరికా లబ్ది పొందింది తప్ప ఊరికే ఒక్క డాలరు కూడా వెచ్చించలేదు.అమెరికా సాయ సంస్థ 1949లో అధ్యక్షుడు ట్రూమన్‌ హయాం నుంచి తరువాత కాలంలో అనేక మార్పులు, చేర్పులతో సహా అనేక దేశాలకు నిధులు కేటాయిస్తున్నది. వాటిని కమ్యూనిస్టు వ్యతిరేక, తనను వ్యతిరేకించే దేశాలకు వ్యతిరేకంగా ప్రచారం, కుట్రలు, పాలకులు, ప్రభుత్వాలను కూలదోయటం, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆకట్టుకొనేందుకు, ఉగ్రవాదులతో సహా ఎన్‌జిఓలు, మరొక పేరుతో ప్రపంచ మంతటా తన తొత్తులను, విద్రోహులను సమకూర్చుకోవటం దానిపని. అందుకోసం ప్రపంచమంతటా పదివేల మంది సిబ్బంది, ఏటా వందబిలియన్‌ డాలర్ల వరకు బడ్జెట్‌తో నడుస్తున్నది. గూఢచార సంస్థ సిఐఏతో అనుసంధానించుకొని ప్రజాస్వామిక సంస్కరణలు, అభివృద్ధి పేరుతో కథనడిపిస్తున్నది. మన దేశం, చైనాకు వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు 2004లో మిలీనియం ఛాలెంజ్‌ కార్పొరేషన్‌ (ఎంసిసి) ఏర్పాటు చేసి శ్రీలంక, నేపాల్‌ దేశాలను దానిలో చేరాలని వత్తిడి చేసింది. మొత్తం 29 దేశాలతో 2019 నాటికి 37 ఒప్పందాలు చేసుకుంది. 1990కి ముందు సోవియట్‌ యూనియన్‌తో ప్రచ్చన్న యుద్ధం సాగించిన కాలంలో దాని పనితీరు ఒక విధంగా ఉంటే తరువాత కొన్ని మార్పులు చేసుకుంది. అవి ఏవైనప్పటికీ ప్రపంచంలో మార్కెట్‌ సంస్కరణలతో సహా అమెరికా ప్రయోజనాలకు అనుగుణమైనవి, రాజకీయంగా వ్యతిరేకించేవారిని లక్ష్యంగా చేసుకున్నవే. తమ మిలిటరీ, రాజకీయ ఎత్తుగడలో భాగంగా ముందుకు తెచ్చిన క్వాడ్‌ కూటమిలో చేరాలని బంగ్లాదేశ్‌పై అమెరికా వత్తిడి తెచ్చింది. చిట్టగాంగ్‌ ప్రాంతంలోని సెయింట్‌ మార్టిన్‌ దీవిని తమకు కౌలుకు ఇవ్వాలని, అక్కడ మిలిటరీ కేంద్రం ఏర్పాటు చేస్తామని చేసిన ప్రతిపాదనను షేక్‌ హసీనా వ్యతిరేకించారు. ఆ కారణంగానే ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఆమెను దేశం నుంచి తరిమివేసిన శక్తుల వెనుక ‘‘ అమెరికా సాయం ’’ ఉందని వార్తలు వచ్చాయి. నిజానికి ఆ కేంద్రాన్ని చైనాను దెబ్బతీయాలని చెప్పినప్పటికీ అది మన దేశానికీ ముప్పు తలపెట్టేదే.


ప్రజాస్వామ్యం, స్వేచ్చా మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ పేరుతో రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌ దురాక్రమణకు అమెరికా దాదాపు రెండులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. దీనిలో అభివృద్ధి కోసం చేసిన ఖర్చు కేవలం 3,240 కోట్ల డాలర్లు మాత్రమే ఉంది. చివరకు తాలిబాన్లకు సలాం గొట్టి అన్నింటినీ వదలివేసి 2021 అమెరికా సేనలు అక్కడి నుంచి పారిపోయాయి. తమ సాయం ఆకలి, దారిద్య్ర నిర్మూలన, విద్య, వైద్యం వంటి వాటికి ఖర్చు చేస్తున్నట్లు అమెరికా చెబుతుంది. ఇరవై ఏండ్ల దురాక్రమణ తరువాత అక్కడ చూస్తే సర్వనాశనం. ముఫ్పైవేల మంది పౌరులతో సహా 1.74లక్షల మంది ఆప్ఘన్‌లు మరణించారు, 30లక్షల మంది పిల్లలు బడికి దూరం, 1.89 కోట్ల మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నారు.తాలిబాన్లతో సాగించిన పోరులో భయానక చర్యలెన్నో. 950 కోట్ల డాలర్ల మేర ఆఫ్ఘన్‌ జాతీయ సంపదలను దోచుకున్నారు. ఇలాంటి ఉదాహరణలను ఎన్నో చెప్పవచ్చు. మన దేశంలో కాశ్మీరు, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాల వేర్పాటు వాదులు, ఉగ్రవాదుల వెనుక అమెరికా సాయ హస్తం గురించి చెప్పుకోనవసరం లేదు. హాంకాంగ్‌ స్వాతంత్య్రం పేరుతో గతంలో విద్యార్థులను రెచ్చగొట్టి రోడ్లెక్కించటం వెనుక, చైనాలో అంతర్భాగంగా ఐరాస గుర్తించిన తైవాన్‌ స్వాతంత్య్ర నినాదం, టిబెట్‌ వేర్పాటు వాదుల వెనుక అమెరికా హస్తం, సాయం బహిరంగ రహస్యమే.


అమెరికా మేథో సంస్థ కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌(సిఎఫ్‌ఆర్‌) ఫిబ్రవరి ఏడవ తేదీన రాసిన విశ్లేషణలో ప్రతి ఏటా అమెరికా సాయం ఎలా ఉంటుందో వెల్లడిరచింది. 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాపితంగా 7,200 కోట్ల డాలర్లను అందించగా దానిలో 61శాతం యుఎస్‌ఎయిడ్‌ ద్వారా పంపిణీ జరిగింది. దీని ద్వారా జరుగుతున్నట్లు చెబుతున్న సాయంలో ఒక డాలరులోని వంద సెంట్లకు గాను 10 నుంచి 30 మాత్రమే అవసరమైన వారికి అందుతున్నదని ఇటీవల సిబిఎస్‌ మీడియాతో అమెరికా ఎంపీ బ్రియాన్‌ మాస్ట్‌ చెప్పాడు. చైనా తప్పుడు ప్రభావాన్ని ఎదుర్కొనే పేరుతో 2024 సెప్టెంబరులో 32.5 కోట్ల డాలర్లను అమెరికా పార్లమెంటు మంజూరు చేసింది.2023 నుంచి 2027వరకు ఇదే కార్యక్రమాలకు మొత్తం 162.5 కోట్ల డాలర్లను ఖర్చు చేసేందుకు నిర్ణయించారు. ఇంత మొత్తాన్ని ఎవరి పర్యవేక్షణలో ఎలా ఖర్చు చేస్తారో వెల్లడిరచలేదు గానీ యుఎస్‌ఎయిడ్‌ ప్రతినిధే ఉంటాడు. ఎందుకు ? ఎలా అంటే 2021లో జింబాబ్వే బడా పత్రిక హెరాల్డ్‌ అసలు విషయాన్ని వెల్లడిరచింది. ఆఫ్రికా ఖండంలో చైనా పెట్టుబడుల గురించి తప్పుడు వార్తలను ఎలా వండాలో స్థానిక విలేకర్లకు శిక్షణ ఇచ్చేందుకు అమెరికా నిధులు అందచేసిందట. మన దేశంలో కొన్ని పత్రికలు, టీవీలలో వస్తున్న కథనాలు, విశ్లేషణల వెనుక అమెరికా సాయం ఉందంటే తప్పు పట్టాలా ?

అమెరికా సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించగానే కొంత మంది సరికొత్త పల్లవి అందుకున్నారు. ఇప్పటికే బిఆర్‌ఐ పథకాలతో అనేక దేశాలలో చైనా పాగా వేస్తున్నదని, ఇప్పుడు అమెరికా సాయం ఆగిపోతే అది మరింతగా విస్తరించి అనేక దేశాలను అదుపులోకి తీసుకుంటుందనే పాటపాడుతున్నారు. ఇది రెండు అంశాలను తేటతెల్లం చేస్తున్నది. ఒకటి ఇన్ని దశాబ్దాలుగా సాయం పేరుతో అమెరికా తన ఆధిపత్యం కోసం ప్రయత్నించిందని నిర్ధారించటం, మరొకటి చైనా ఆధిపత్యం పెరుగుతుందనే భయాన్ని రెచ్చగొట్టటం. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని నివారించే పేరుతో తాలిబాన్లను తయారు చేయటం, తరువాత ఏకుమేకైన వారి మీదే పోరు సాగించిన అమెరికా మాదిరి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడైనా చైనా వ్యవహరించిందా ? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత రెండు కొరియాలు ఐక్యం కావాల్సి ఉండగా దాన్ని పడనీయకుండా దక్షిణ కొరియాలో అమెరికా మిలిటరీ తిష్టవేసి కొనసాగిస్తున్నది. ఆ మాదిరి చైనా ఎక్కడైనా కేంద్రాలను ఏర్పాటు చేసిందా ? అమెరికా సాయం పేరుతో మన దేశంలో సాగించిన తప్పుడు పనులను బహిర్గతం చేసేందుకు మోడీ సర్కార్‌ ముందుకు వస్తుందా ? వాటిలో సంఘపరివార్‌ సంస్థలేమైనా ఉంటే అసలు రంగు బయటపడుతుందని భయపడి మూసి పెడుతుందా ?