Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

మీ కుటుంబంలో తరతరాల వారికి పుణ్యం రావాలంటే కాశీ దాకా తాటిపట్టె మీద దేకమన్నాడట ఒక సనాతనవాది. ముడ్డి మీది కాదుగనుక ఏమైనా చెబుతారు మీ పుణ్యం వద్దు మీరు వద్దు అంటూ ఒక పామరుడు చక్కాలేచిపోయాడని ఒక కథ.జనాభా తగ్గకుండా ఉండాలంటే ప్రతి మహిళ కనీసం ముగ్గురు పిల్లలను కనాలని బ్రహ్మచారి అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ సంఫ్‌ు వందేళ్ల సభలో చెప్పారు. మోసే గాడిదలకు తెలుస్తుంది మోపిన బరువెంతో అన్నట్లుగా పిల్లలున్నవారికి తెలుస్తుంది వారిని పెంచటంలో ఉన్న ఇబ్బంది. బ్రహ్మచారులు, కుటుంబ జీవనం లేని సాధువులు, సన్యాసులు, సాధ్విలకు ఏమి తెలుస్తుంది. మోహన్‌ భగవత్‌ ముగ్గురు పిల్లల గురించి చెప్పటం ఇదే మొదటిసారి కాదు. అయితే సంఘపరివార్‌ సభ్యులు లేదా దాని గురించి గొప్పగా చెప్పుకొనే వారు ఎంత మంది ముగ్గురు పిల్లలను కంటున్నారన్నది సమస్య.వారు ఎప్పటి నుంచో చెబుతున్నా జనాలు పట్టించుకోవటం లేదు. జననాల రేటు తగ్గుతూనే ఉంది. అయినా చెబుతూనే ఉండటం వెనుక పెద్ద ఓట్ల రాజకీయం ఉంది. అయితే జనాభా తగ్గుదల గురించి ఇతరులు అనేక మంది చెబుతున్నారు గదా భగవత్‌ చెప్పిందాంట్లో తప్పేముందని ఎవరైనా అడగవచ్చు. నిజమే, ముఖ్యమంత్రులు స్టాలిన్‌, చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు తప్పు వారు మతాన్ని జోడిరచలేదు. అదే అసలు సమస్య. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి 2022 అక్టోబరులో జనాభా అదుపుకు సమగ్ర విధానం ఉండాలని, మత ప్రాతిపదికన అసమతూకం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మనదేశంలోకి ఇస్లాం, క్రైస్తవం రాకముందు ఇక్కడ పుట్టిన మతాలు తప్ప మరొకటి లేవుగా, మరి అవి జనానికి ఒరగబెట్టిందేమిటి. అందరూ ఒకే మతం వారంటూ సమానంగా చూసిన పాపాన పోలేదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కులవివక్ష, పీడన అదనంగా ప్రసాదించటం తెలిసిందే.

నేడు దేశంలో ఉన్న వాతావరణం ఏమిటి ? హిందూ మతం బతికి బట్టకట్టాలంటే హిందువులు ఎనిమిది నుంచి పది మంది పిల్లలను కనాలని ఆర్‌ఎస్‌ఎస్‌ గుంపుకు చెందిన విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా చెప్పారు.ఆయన కన్నది ఇద్దరిని, అలాంటి వారి కబుర్లన్నీ ఇలాగే ఉంటాయి. బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ నలుగురిని కనాలన్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2006 ఏప్రిల్‌ 20వ తేదీన ‘‘కాషాయ జనాభా శాస్త్రం ’’ పేరుతో ప్రచురించిన విశ్లేషణ వివరాల ప్రకారం విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు అశోక్‌ సింఘాల్‌ 2004లో మాట్లాడుతూ హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనకపోవటం ఆత్మహత్యా సదృశ్యమన్నారు.2005 ఫిబ్రవరిలో విహెచ్‌పి మార్గదర్శక మండల్‌ సమావేశంలో శ్రీకృష్ణుడి తలిదండ్రుల మాదిరి సంతానాన్ని కనాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు.సుభాష్‌ చంద్రబోస్‌ కృష్ణుడి మాదిరి ఎనిమిదవ సంతానమని, రవీంద్రుడు తొమ్మిదవ సంతానమని దానిలో పేర్కొన్నారు.హిందూ మహిళలు విచ్చల విడిగా అబార్షన్లు చేయించుకోకుండా చూడాలని విహెచ్‌పి కోరింది.ముస్లింల జనాభా అదుపులేకుండా పెరుగుతోందని, వారికి పోటీగా హిందువులు పిల్లలను ఎక్కువగా కనాలని హరిద్వార్‌లో జరిగిన విశ్వహిందూపరిషత్‌ మార్గదర్శక్‌ మండల్‌ పిలుపు ఇచ్చిందని రెడిఫ్‌ న్యూస్‌ 2006 జూన్‌ 15న ‘‘ హిందువులు జనాభాను పెంచాలని కోరిన విహెచ్‌పి ’’ అనే శీర్షికతో వార్త ఇచ్చింది. ఇలా కాషాయ గుంపునేతల మాటలను ఎన్నయినా ఉటంకించవచ్చు. హిందూ జాతి అంతరిస్తున్నదని, మతానికి ముప్పు వచ్చిందని, త్వరలో ముస్లిం జనాభా మెజారిటీగా మారుతుందని హిందూ మహాసభ నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులంతా పదే పదే చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం తెలిసిందే.జనాభా సమతూకంలో ఉండాలని చెబుతారు.ఇప్పుడు ముస్లింల గురించి చెబుతున్నప్పటికీ తరువాత హిందువుల్లో ఏ కులం వారు ఎందరుంటే సమతూకం ఉంటుందో కూడా నిర్దేశించరని, సమాజం సమతూకంగా ఉండాలంటే చాతుర్వర్ణ వ్యవస్థ ఉండాలనే అజెండాను ముందుకు తీసుకురారనే హామీ ఏముంటుంది. అంటే వీరు చెప్పినట్లే జనం కులం, మతాన్ని పాటించాలి, ఎందరు పిల్లల్ని కనమంటే ఆ సంఖ్యలోనే కనాలి.


జనాభా పెరుగుదల తరుగుదల సమస్యలను మతకోణంలో చూడటం అవాంఛనీయ వైఖరి. ముస్లిం ఛాందసులు అధికారంలో ఉన్న ఇరాన్‌లో సంతానోత్పత్తి రేటు పడిపోతున్నది. 1950లో అక్కడ 6.9 ఉండగా 2024లో 2.08కి తగ్గింది. క్రైస్తవుల్లో కూడా ఛాందసులు తక్కువేమీ కాదు, కానీ ఐరోపాలో సంతానోత్పత్తి రేటు 1.5, సగం ఐరోపా, సగం ఆసియాలో ఉన్న టర్కీ ముస్లిం దేశం, అక్కడ కూడా అంతే ఉంది.ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న దేశాలను ముస్లిం దేశాలని పిలుస్తున్నారు.2011నుంచి 21 సంవత్సరాల కాలంలో ఈ దేశాల్లో సంతనోత్పత్తి రేటు 3.3 నుంచి 2.7కు తగ్గింది.విద్య, పట్టణీకరణ, ఆర్థిక, సామాజిక,ఆరోగ్య, శిశుమరణాలు తదితర పరిస్థితులను బట్టి తప్ప ప్రపంచంలో ఎక్కడా మత ప్రాతిపదికన పిల్లలను కనటం, మానటం లేదు. మేం సనాతనులం, పక్కా హిందువులం అని చెప్పుకుంటున్న కుటుంబాలలో తొగాడియా చెప్పినట్లు ఎంత మంది పదేసి మంది పిల్లలు కలిగి ఉన్నదీ చెప్పమనండి. తమ ఉన్మాద చర్యలకు ఉపయోగించుకోవటం తప్ప ఏ మతమూ పిల్లల బాగోగులకు బాధ్యత తీసుకోవటం లేదు.


2019 నుంచి 21 వరకు జరిగిన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో సంతానోత్పత్తి రేటు 2.1 ఉంటే దక్షిణాది రాష్ట్రాలలో 1.64,ఉత్తరాదిన 2.0, పశ్చిమాన 1.81, తూర్పున 2.0, మధ్య ప్రాంతంలో 2.1 ఈశాన్య ప్రాంతంలో 2.15 ఉంది. రాష్ట్రాలన్నింటా ఒకే విధంగా లేదు.బీహార్‌లో 3.02, పక్కనే ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో 2.38, దాన్నుంచి ఏర్పాటు చేసిన ఉత్తరా ఖండ్‌లో 1.87, పశ్చిమ బెంగాల్లో 1.56 పక్కనే ఉన్న ఒడిషాలో 2.14 చొప్పున ఉంది. ఒకే రాష్ట్రంలో చూస్తే గుజరాత్‌ గ్రామీణంలో 2.15, పట్టణాల్లో 1.63, మధ్యప్రదేశ్‌లో 2.23 1.62, తెలంగాణాలో 1.95 1.63, ఆంధ్రప్రదేశ్‌లో 1.74 1.62 ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలు, దేశమంతటా కాషాయదళాలు చెప్పినట్లుగా హిందువులు ఎనభైశాతం ఉన్నప్పటికీ సంతానోత్పత్తి ఒకే విధంగా ఎందుకు లేదు ? 201516 జాతీయ కుటుంబ సర్వే వివరాల ప్రకారం అత్యంత ఎక్కువ విద్యావంతులున్న జైన్‌ సామాజిక తరగతిలో 1.2శాతమే. ఇంత తక్కువ ఏ సామాజిక తరగతిలోనూ లేదు. అత్యంత పేదల్లో 3.2 ఉండగా ధనికుల్లో 1.5 మాత్రమే ఉంది. ముస్లిం సామాజిక తరగతిలో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉండటానికి వారు ఆలశ్యంగా మేలుకోవటమే. దానికి కుట్ర సిద్దాంతాలతో విద్వేష ప్రచారం చేయటం తగనిపని.దేశంలోని కొన్ని ప్రాంతాలలో మైనారిటీలు పైచేయి సాధించటాన్ని నివారించాలంటే పెద్ద హిందూ కుటుంబాలు ఉండాలని, ఉన్నత హిందూ కుటుంబాల వారు కుటుంబనియంత్రణ గురించి తీవ్రంగా సమీక్షించుకోవాని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కేరళలోని కొచ్చిలో 2013లో జరిగిన ఒక సభలో పిలుపునిచ్చారు. కుటుంబ నియంత్రణ అన్నది హిందువులకు ఇంకేమాత్రం వ్యక్తిగత సమస్య కాదని, ఒక బిడ్డ చాలని వారు అనుకుంటే ముస్లింలు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని విశ్వహిందూ పరిషత్‌ నేత చంపత్‌ రాయ్‌ 2015లో ఒక పత్రికా గోష్టిలో చెప్పారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు పిల్లల్ని కనాలని చెబుతున్నారు సరే, వారి బాగోగుల గురించి శ్రద్ద తీసుకోవాలని తమ మార్గదర్శకత్వంలో నడిచే కేంద్రం, 15 రాష్ట్ర ప్రభుత్వాలు, వారికి మద్దతుగా ఉన్న మరో ఆరు మిత్ర ప్రభుత్వాలకు ఎందుకు చెప్పటం లేదు ? ఎంత సేపటికీ మతం తప్ప శిశుసంరక్షణకు కేటాయింపులు, వివిధ పథకాల వైఫల్యం గురించి మీడియాలో వస్తున్న విశ్లేషణలు వారికి పట్టవా, కనిపించవు, వినిపించవా ! మతంతో నిమిత్తం లేకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి ఒక్క బిడ్డకు ఏడాదికి రు.44వేల చొప్పున మూడు స ంవత్సరాల పాటు నగదు ఇచ్చే పధకాన్ని చైనా ప్రవేశపెట్టింది. వారి జనాభా మనతో సమానంగా ఉంది. హంగరీలో ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లలుంటే పన్నుల రాయితీ, గృహరాయితీ, పోలాండ్‌లో రెండవ బిడ్డ తరువాత ఎందరుంటే అందరికీ నెలవారీ నగదు, రష్యాలో 25 ఏండ్ల లోపు యువతులు పిల్లలను కంటే నగదు బదిలీ, అమెరికాలో తొలిసారి తల్లులయ్యేవారికి బేబీ బోనస్‌ పేరుతో ఐదువేల డాలర్లు, దక్షిణ కొరియాలో కూడా రాయితీలు ఇస్తున్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులు అని కబుర్లు చెప్పటం తప్ప వారి సక్రమపెరుగుదలకు మనదేశంలో తీసుకుంటున్న చర్యలేమిటి ? కార్పొరేట్‌ కంపెనీలకు గణనీయంగా పన్ను మొత్తాలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం మరోవైపున శిశు సంరక్షణ కేటాయింపులకు కోత పెడుతున్నది.


పోషకాహార లేమితో పిల్లలు గిడసబారి పోవటం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవటం, రక్తహీనత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. పేద పిల్లల్లో ఉండాల్సినదానికంటే బరువు తక్కువగా ఉంటే, ధనికుల పిల్లల్లో హానికరమైన ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఐదేండ్లలోపు పిల్లలు 35.5శాతం మంది పోషకాహారం లేక గిడసబారినట్లు, 19.3శాతం ఎత్తుకు తగ్గ బరువు లేరని, 32.1శాతం మంది బరువు తక్కువ, మూడు శాతం ఎక్కువ బరువు ఉన్నట్లు 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది.49 ఏండ్ల పురుషుల్లో 25, మహిళల్లో 57శాతం మందికి రక్తహీనత ఉంది.దేశంలో 74శాతం జనాభాకు ఆరోగ్యవంతమైన ఆహారం లేదని సర్వేలు తెలుపుతున్నాయి, ఆకలి సూచికలో మనం దిగువన ఉన్నాం. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌ అని ఎన్నడో మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన పరిస్థితులే నేడు కూడా ఉన్నాయని చెప్పుకోవాల్సి రావటం సిగ్గుచేటు. బాల్యంలో పోషకాహారలోపం ఉంటే అది ఆర్థిక వ్యవస్థకు నష్టమేగాక ఆరోగ్యపరంగా భారంగా మారుతున్నది. అంగన్‌వాడీల నుంచి ఆరేండ్లలోపు పిల్లలు కేవలం 50.3శాతమే ఏదో ఒక సేవను పొందుతున్నారు. కేంద్ర బడ్జెట్‌, రాష్ట్రాల బడ్జెట్ల గురించి పాలకులు గొప్పలు చెప్పుకోవటం తప్ప పిల్లల సంక్షేమానికి కేటాయిస్తున్నదేమిటి ? 2017 కేంద్ర బడ్జెట్‌లో 3.2శాతం కేటాయిస్తే 2021లో అది 1.9శాతానికి తగ్గి 2024లో 2.3దగ్గర ఉంది. జిడిపిలో 2000సంవత్సరంలో 0.12శాతం కాగా 2024కు 0.10కి తగ్గింది. బీహార్‌లో 2020 నుంచి 2022వరకు మూడు సంవత్సరాల్లో కేటాయించిన బడ్జెట్లో ఖర్చు చేసిన మొత్తాలు 83,76,77శాతాలు మాత్రమే ఉన్నాయి.దేశానికి ఆదర్శంగా చెప్పిన గుజరాత్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పరిగణిస్తారు. అక్కడ నరేంద్రమోడీ ఏలుబడి సాగింది. రక్తహీనతలో అగ్రస్థానంలో దేశానికే ‘‘ ఆదర్శం ’’గా ఉంది !