Tags

, , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

సముద్రంలో చైనా నిర్మించిన పదమూడు వందల టన్నుల బరువుగల డేటా సెంటర్‌ ఆదివారం నాడు(2025 అక్టోబరు26న) ప్రారంభమైంది. ఇది గాలి మరలతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వినియోగించనుంది. హై క్లౌడ్‌ అనే కంపెనీ మొదటి దశలో భాగంగా 24మెగావాట్ల కేంద్రాన్ని షాంఘై తీరంలో నెలకొల్పింది. న్యూస్‌ అట్లాస్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం సముద్రపు ఒడ్డున నిర్మించిన గాలి మరల విద్యుత్‌ కేంద్రం నుంచి 95శాతం విద్యుత్‌ను ఈ కేంద్రానికి సరఫరా చేస్తారు, సముద్రపు నీటిని చల్లబరిచేందుకు వినియోగిస్తారు. మొత్తం 22.6 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఈ కేంద్రంలో సాంప్రదాయపు డేటా సెంటర్ల కంటే 23శాతం విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. సముద్రంలో 114 అడుగుల అడుగున ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలోని ఒక్కో గదిలో 4 నుంచి ఐదు వందల సర్వర్లు ఉంటాయి. సముద్రంలో ఏర్పాటు చేసిన టెలికాం కేబుళ్ల ద్వారా ఈస్ట్రన్‌ డేటా, వెస్ట్రన్‌ కంప్యూటింగ్‌ వ్యూహం ప్రకారం ప్రధాన భూభాగంలోని కేంద్రానికి అనుసంధానం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివే మరో వందగదులను నిర్మించి విస్తరిస్తారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ చైనాలో 2015లో పైలట్‌ ప్రాజక్టుగా సముద్రంలో ఒక డాటా కేంద్రాన్ని నిర్మించింది. ప్రాజెక్ట్‌ నాటిక్‌ పేరుతో చేసిన ఈ ప్రయోగానికి స్వస్తి పలికి 2024జూన్‌లో దాన్ని సముద్రంలో ముంచివేసింది. ఆదివారం నాడు సముద్రంలో తొలి వాణిజ్య డాటా కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించిన తొలి దేశంగా చైనా చరిత్రకెక్కింది. ఇలాంటివే మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. ఈ కేంద్రం చైనాలో అతి పెద్ద తొలి స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఉన్న హైనాన్‌ సమీపంలో ఉంది. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో నిర్మించారు.

విశాఖలో అదానీ, ఎయిర్‌టెల్‌ కంపెనీలతో కలసి గూగుల్‌ నిర్మించనున్న డేటా కేంద్రం ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందన్నది చర్చ. లింక్‌డ్‌ఇన్‌లో వచ్చిన ఒక విశ్లేషణ జర్మనీలోని బిఎఎస్‌ఎఫ్‌ రసాయన కంపెనీతో డేటా సెంటర్ల ఉపాధిని పోల్చింది. సదరు జర్మనీ సంస్థ 684మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది, 50వేల మందికి పూర్తి స్థాయి ఉపాధిని కల్పిస్తున్నది. అదే జర్మనీలో డాటా కేంద్రం 2,283మెగా వాట్ల విద్యుత్‌ను వినియోగించే చోట పూర్తి కాలపు ఉపాధి 6,849 నుంచి 13,699 మందికి చూపుతుంది. రసాయన ఫ్యాక్టరీ ఒక మెగావాట్‌కు 73 మందికి ఉద్యోగ కల్పన చేస్తుంటే డేటా సెంటర్‌ ఒక మెగావాట్‌కు 3 నుంచి ఆరు ఉద్యోగాలను ఇస్తున్నది. గూగుల్‌ ఆధునిక సాంకేతిక ప్రక్రియలను వినియోగిస్తుంది గనుక ఇంకా తగ్గవచ్చు. ఆ లెక్కన చూసినా విశాఖలో నిర్మించే ఒక గిగావాట్‌(వెయ్యి మెగావాట్లు) కేంద్రం మూడు నుంచి ఆరువేల మందికి పర్మనెంటు ఉద్యోగాలను కల్పిస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పిన అంకెలు దీనికి దగ్గరగా ఉన్నాయి. దానికి భిన్నంగా రాష్ట్ర మంత్రి లోకేష్‌ చెప్పారు. ఇద్దరికి సమాచార వనరు ఏమిటి ? ఈ విషయాన్ని చెప్పటానికి బిడియపడాల్సిందేముంది. అదే గూగుల్‌ను అడిగితే అందించిన ఇతర విశ్లేషణలు కూడా దీనికి దగ్గరగానే ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలన్నీ సాధ్యమైనమేరకు తక్కువ మందితో పని చేయించుకొనేందుకు చూస్తాయి. కన్సిడర్‌ మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసిన సిడ్నీలోని డాటా కేంద్రం 2023లో అకస్మాత్తుగా ఆగిపోయింది. తగినంత మంది సిబ్బంది లేని కారణంగా జరిగిన ఆ అంతరాయం 46 గంటల పాటు సేవల నిలిపివేతకు దారితీసింది. అప్‌టైమ్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ సిబ్బంది కొరత గురించి పేర్కొన్నది. ప్రపంచ డాటా సెంట్లర్లలో 2019లో ఇరవైలక్షల మంది పూర్తి కాలపు ఉద్యోగులు ఉంటే 2025 నాటికి కేంద్రాలు పెరిగినా 23లక్షల మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులా అన్నది వివరణ లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న 122 గిగావాట్ల సామర్థ్యంలో సగటు తీసుకుంటే ఒక్కో గిగావాట్‌కు 18,700 ఉన్నట్లు కనిపిస్తున్నది. విశాఖ గూగుల్‌ సెంటర్‌కు అందరూ కలసి 20 నుంచి 30వేల మంది ఉంటారని కూడా పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. డాటా కంపెనీలు సిబ్బందిని చేర్చుకోవటం, నిలుపుకోవటంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చిన్న కేంద్రాలు(ఒకటి నుంచి ఐదు మెగావాట్లు) 8 నుంచి 15 మంది, ఐదు నుంచి ఇరవై మెగావాట్ల కేంద్రాలు 15 నుంచి 35 మంది, ఇరవై అంతకు మించిన సామర్ధ్యం కలిగినవి 35 మందికి పైగా, 40 మెగావాట్ల సంస్థలు 45 మందిని, వంద మెగావాట్లు అంతకు మించి సామర్ధ్యం కలిగినవి కొద్దిమందితోనే నిర్వహిస్తున్నాయి, ఎందుకంటే యాంత్రీకరణ మరియు నిర్ణీత ప్రమాణాలతో ఉండే వ్యవస్థలు అందుకు దోహదం చేస్తున్నాయి. నియమించుకుంటున్నాయి. డేటా సెంటర్లలో మొత్తం 230 రకాల సిబ్బంది అవసరం అని చెబుతున్నారు. అయితే చిన్న సంస్థలు అంతమందిని నియమించవు, అవి అవసరమైనపుడు పొరుగు సేవలను ఉపయోగించుకుంటాయి. సగం డేటా సెంటర్లు అవసరమైన నిపుణులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి.

రెండును రెండుతో కలిపినా, హెచ్చవేసినా ఫలితం నాలుగే. ఇది చెప్పటానికి గణితమేథావులతో పనిలేదు. డేటా సెంటర్లతో కలిగే పర్యావరణహాని, విషపూరితమైన వ్యర్ధాల వంటి ఇతర దుష్ఫలితాల గురించి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెప్పినా(అఫ్‌ కోర్స్‌ అధికారంలో ఉన్నపుడు ఈ పెద్దమనిషి వీటి గురించి చెప్పలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నోరు విప్పరు) ఆ రంగం గురించి అధ్యయనం చేసినవారు చెప్పినా విషయం ఒకటే. ఎవరైనా రాజకీయాలతో నిమిత్తం లేని వారు చెబితే చూశారా రాష్ట్ర అభివృద్దిని వ్యతిరేకించేవారు జగన్‌తో చేతులు కలిపి అవే వాదనలు చేస్తున్నారంటూ ప్రచారదాడికి దిగుతున్నారు. అంటే నోరు మూయించేందుకు ఇదొక రకం నియంతృత్వపోకడతప్ప మరొకటి కాదు. తేమ కారణంగా యంత్రాలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అమెరికాలోని డేటా కేంద్రాలన్నీ పొడివాతావరణం ఉండే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారని చెబుతున్నారు.పెట్టుబడిలో నాలుగో వంతు సబ్సిడీలు, సంవత్సరాల తరబడి రాయితీ ధరలకు నీరు, విద్యుత్‌ అందచేస్తున్న తరువాత ఏ పెట్టుబడిదారుడు మాత్రం చంద్రబాబు నాయుడి దరిచేరడు ! డాటా సెంటర్‌ మాప్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం గూగుల్‌కు ప్రపంచంలో 113 డాటా సెంటర్లు ఉండగా వాటిలో 68 పని చేస్తున్నాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఎందరు ఉద్యోగులు పని చేస్తున్నారని అడిగితే సమాచారం లేదని బదులు వచ్చింది. ప్రపంచంలో గూగుల్‌ సంస్థలో లక్షా 83వేల మంది పనిచేస్తున్నారనే సమాచారం ఉంది తప్ప ఏ విభాగంలో ఎందరు అన్నది లభ్యం కావటం లేదు. ఎవరికైనా దొరికితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. మానవహక్కుల ఫోరం(హెచ్‌ఆర్‌ఎఫ్‌) సమాచారం ప్రకారం అమెరికాలోని అష్‌బర్న్‌ మరియు లీస్‌బర్గ్‌ డాటా సెంటర్లు రెండిలోనూ కలిపి ప్రత్యక్షంగా 400 మందికి పరోక్షంగా 3,100 మంది ఉపాధి దొరుకుతున్నట్లు పేర్కొన్నది.లోకేష్‌ చెప్పినట్లు లక్షా 88వేల ఉద్యోగాల్లో 88వేలు పర్మనెంటు అనుకుంటే మొత్తం గూగుల్‌ ఉద్యోగులు విశాఖలోనే ఉంటారన్నట్లుగా భావించాలి, అది జరిగేదేనా !

ఇంటర్నెట్‌ వెతుకులాటలో డాటా సెంటర్ల ఉపాధి గురించి ఎవరెటు తిప్పి చెప్పినా పెట్టుబడులు, స్థలాల విస్తీర్ణం ఎక్కువ, ప్రత్యక్ష ఉపాధి తక్కువ, పరోక్ష ఉపాధి గురించి మాత్రమే వెల్లడవుతున్నది. పరోక్షం అంటే భవనాల నిర్మాణ సమయంలో దొరికే ఉపాధి, వాటి చుట్టూ ఉండే నివాసాలతో కలిగే లబ్ది గురించి మాత్రమే ప్రస్తావన ఉంటున్నది. ఆ లెక్కన బడా పరిశ్రమలు అంతకంటే ఎక్కువ కల్పిస్తున్నాయి. వస్తూత్పత్తిలో చైనాను పక్కకు నెట్టే ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా దేశాన్ని మారుస్తామన్న మాటలు ఇప్పుడు ఎకువగా వినిపించటం లేదు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ గురించి కబుర్లు పెరిగాయి.ఒకదానికి ఒకటి పోటీ కాదు, పరస్పరం సాయం చేసుకొనేవే.పెట్టుబడులు ఎక్కువ ఉపాధి తక్కువ ఉండే టెక్‌ కంపెనీల కోసం మోడీ, చంద్రబాబు వంటి వారు వెంపర్లాడుతున్నారు. ఒకసారి భవనాల నిర్మాణాలు పూర్తయిన తరువాత తాత్కాలిక కార్మికులకు పని ఉండదు. ఆటోమేషన్‌ ప్రధాన ప్రక్రియగా నడిచే ఈ కేంద్రాలలో కీలకమైన సిబ్బంది ఎవరంటే సెంటర్ల మేనేజర్లు, నెట్‌వర్క్‌ మరియు వ్యవస్థల అడ్మినిస్ట్రేటర్లు, సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక నిపుణులు, వారికి సహాయ సిబ్బంది.

ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఏటా పదివేల కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. డేటా సెంటర్లు అవసరమే, అయితే అవి కొత్త సమస్యలను సృష్టించకూడదు. మనదేశంలో అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం గురించి తెలిసిందే. పాలకులు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారంటే ఉత్పత్తులకు తప్ప కాలుష్యానికి కాదు, దాన్ని నివారించేందుకు పరిశ్రమలే చర్యలు తీసుకోవాలన్న నిబంధనలు ఉంటాయి. వాటిని అమలు చేస్తే తమ లాభాలు తగ్గుతాయని తిలోదకాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలో ఫార్మా, ఇతర సంస్థల నుంచి వెలువడుతున్న కాలుష్యం సమీపంలోని సముద్రంలో కలుస్తున్నది. దాంతో మత్స్యకారుల ఉపాధికి దెబ్బతగులుతున్నది. పరిష్కరించండి మహానుభావా అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అడిగితే ఈ మధ్యే మాట్లాడుతూ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది తాము కాదని, వంద రోజుల గడువులో పరిష్కరిస్తానని చెప్పారు. అధికారానికి వచ్చి 15నెలల తరువాత ఈ మాటలు చెప్పిన పెద్ద మనిషి ఇంతకాలం ఏం చేస్తున్నట్లు ?

డేటా అనేక విధాలుగా కీలక పాత్ర పోషిస్తున్న పూర్వరంగంలో మనదేశం కూడా వెనుకపడకూడదు. కానీ నరేంద్రమోడీ లేదా రెండింజన్ల పాలనలో ఉన్న ప్రభుత్వాలు గానీ ఎంతో నిర్లక్ష్యం చేశాయన్నది అంకెలే చెబుతున్నాయి.2019లో 350 మెగావాట్ల సామర్ధ్యం ఉండగా 2025 నాటికి 1,350 మెగావాట్లకు చేరుతుందని చెబుతున్నారు. ఈ రంగంలో మిగిలిన దేశాలు ఎంతో ముందున్నాయి.దీనికి కూడా నెహ్రూయే కారణం అని చెబుతారేమో తెలియదు. ముందు చూపు లేకపోవటం తప్ప మరొకటి కాదు.చైనాలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు లేవు, మైక్రోసాఫ్ట్‌ కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో తప్ప ప్రభుత్వం వినియోగించటం లేదు.కృత్రిమ మేథ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో చైనా వెనుకబడిందని శత్రువులు కూడా చెప్పలేరు.తాజా సమాచారం ప్రకారం 2024నాటికి చైనాలో డేటా వాణిజ్య విలువ 47.23 బిలియన్‌ డాలర్లు కాగా 2030 నాటికి అది 97.30బి.డాలర్లకు పెరుగుతుందని రిసర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ సంస్థ పేర్కొన్నది. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ మరోవిధంగా ఉంది.అమెరికాలో 2025 నాటికి డాటా సెంటర్ల ఆదాయం 171.9 బిలియన్‌ డాలర్లు, కాగా చైనాలో 103.19 బిలియన్‌ డాలర్లని 2030 నాటికి 142.64 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. మరో సమాచారం ప్రకారం ప్రపంచ డేటా సెంటర్ల సామర్ధ్యం 2024నాటికి 122.2 గిగావాట్లు. దీనిలో అమెరికా 53.7(44శాతం) కలిగి ఉండగా చైనా 31.9 గిగావాట్లు కలిగి ఉంది. మూడో స్థానంలో ఒక కూటమిగా ఐరోపా యూనియన్‌ 11.9 గిగావాట్లు, మనదేశం 3.6గా ఉంది.చైనాలో ఇటీవల జత చేసిన సామర్ధ్యాన్ని పని చేయించటం లేదని వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి అర్ధం అవుతున్నదేమిటి ? దేశం వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలన్నింటా వృద్ది చెందితేనే డేటా కేంద్రాలకు చేతినిండా పని ఉంటుంది. గడచిన పదకొండు సంవత్సరాలుగా కబుర్లు తప్ప అభివృద్ధి లేని కారణంగా డేటా సెంటర్ల సామర్ధ్యం కూడా పెరగలేదన్నది స్పష్టం.విశ్లేషణలను కొనుగోలు చేసేవారు లేకపోతే రేపు విశాఖ గూగుల్‌ సెంటర్‌ అయినా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే.

దేశాన్ని, రాష్ట్రాన్ని వికసిత్‌ భారత్‌లో ఎక్కడికో తీసుకుపోతామని ప్రధాని నరేంద్రమోడీ, ఆయన అడుగుజాడల్లో లేదా అడుగులకు మడుగులద్దుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక మంది దృష్టిలో దేశంలో అతి పెద్ద దార్శనికులు, ఇతరులకు తట్టనివి అనేకం వారికి కనిపిస్తాయని చెబుతారు. ఆ ప్రచారం వలన దేశానికి ఎంత లాభమో తెలియదు గానీ నష్టం కలిగిస్తున్నారంటే ఎవరూ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి) నేడు ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో చెప్పనవసరం లేదు.తన పాలనలో జిడిపిని పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి తెచ్చిన ఘనత నాదే అంటారు మోడీ. కాసేపు అంగీకరిద్దాం, ఆ పురోగతి ఇతర రంగాల్లో ఉందా ? వాటిలో కీలకమైన పరిశోధనకు కేటాయింపుల సంగతేమిటి ? 1995-96 నుంచి 2014-15వరకు రెండు దశాబ్దాల వార్షిక సగటు జిడిపిలో 0.73 శాతం ఉంది. యుపిఏ పాలనలో 2008-09లో జిడిపిలో 0.8శాతం నిధులు కేటాయిస్తే మోడీ ఏలుబడిలో 2017-18లో 0.7, ఇప్పుడు 0.64శాతానికి తగ్గించారు. దీనికైతే జవహర్‌లాల్‌ నెహ్రూ కారణం కచ్చితంగా కాదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే భావజాలంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల ఈ నిర్వాకాన్ని చంద్రబాబు నాయుడు సమర్ధిస్తారా ? 2013 నాటి సైన్స్‌ మరియు టెక్నాలజీ విధానంలో, 2017-18 ఆర్థిక సర్వేలో కూడా కనీసం రెండు శాతం కేటాయించాలని చెప్పిన అంశం ఎవరికీ తెలియదా ? ఇద్దరు నేతలు దేశ దేశాలు తిరుగుతున్నారు కదా ఎక్కడ ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోరా ? ఎందుకీ నిర్లక్ష్యం ? మన అభివృద్ధి మీద గణనీయమైన ప్రభావం చూపాలంటే 2047నాటి వరకు కనీసం ఒక శాతం, ఆదర్శవంతంగా(ఐడియల్‌) ఉండాలంటే మూడుశాతం చొప్పున ఖర్చు చేయాలని నిపుణులు చెబుతున్నారు. పిండికొద్దీ రొట్టె, పరిశోధనా రంగంలో మనం ప్రపంచ బస్‌ను అందుకోకుండా చేసింది ఎవరంటే ఎవరిని చూపాలి ? పరిశోధనలకు మనం తక్కువ కేటాయిస్తున్నా, పరిశోధనా పత్రాలు గణనీయంగానే మనవారు సమర్పిస్తున్నారుగా అని సమర్ధించుకొనే వారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు ! ఎలాంటి పాలకులను మోస్తున్నాంరా బాబూ అని తల పట్టుకోవాలి !!

సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు ;

మేథోమధనం : డేటా సెంటర్లంటే గోడౌన్లా ! ఉత్పత్తి కేంద్రాలా !! జగన్‌, చంద్రబాబు చెబుతున్నదానిలో నిజానిజాలేమిటి ?
https://vedikaa.com/2025/10/25/are-data-centers-godowns-or-production-houses-what-is-the-truth-about-ycp-and-tdp-claims-on-employment/