Tags
14th Dalai Lama, 2025 Pentagon Report, anti china, Anti communist, BJP, China, China Arms, Donald trump, Narendra Modi Failures, RSS, Vladimir Putin, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
ప్రతి ఏటా మాదిరే ఈసారి కూడా అమెరికా రక్షణశాఖ ( పెంటగన్ ) 2025 నివేదిక విడుదల చేసింది. దానిలో ఉన్న అభూత కల్పనలు, కుట్ర సిద్దాంతాలు, వక్రీకరణలతో సహా అనేక అంశాల గురించి మీడియాలో, ఇతరంగా అనేక మంది తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. హెచ్చరికలు, పరోక్ష బెదిరింపులు, బుజ్జగింపులు, చైనా, మనదేశం పరస్పరం దెబ్బలాడుకొనేందుకు తంపులు పెట్టటం వంటివి అనేకం ఉన్నాయి. ఈ ఏడాది నివేదిక ప్రత్యేకత ఏమంటే తనతో చెట్టపట్టాలు వేసుకుతిరిగి ఒకే కంచం, ఒకే మంచం అనే జిగిని దోస్తులా ఉన్న నరేంద్రమోడీకి సహజభాగస్వామి డోనాల్డ్ ట్రంప్ అగ్ని పరీక్ష పెట్టాడంటే అతిశయోక్తి కాదు. ఏడాది కాలంలో ఎంతలో ఎంతమార్పు ? ఐదేండ్ల పాటు శత్రువుగా పరిగణించిన చైనాతో పూర్వంమాదిరి సంబంధాలు, అమెరికాతో ఎడబాటుకు 2025 నాంది పలికింది. అమెరికా మీడియా కొన్ని అంతర్గత అంశాల మీద విమర్శనాత్మకంగా ఉన్నప్పటికీ మొత్తం మీద ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ కనుసన్నలలోనే ఉంటుంది.” భవిష్యత్‌లో ఘర్షణ అవకాశం ” ఉంటుందంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజాగా భారత్-చైనా గురించి ఒక విశ్లేషణ రాసింది. దానికి ఆధారం పెంటగన్ నివేదికలోని అంశాలు. భవిష్యత్‌లో చైనాతో తలెత్తే యుద్ధం కోసం యావత్ హిమాలయ ప్రాంతంలో భారత్ వందల కోట్ల డాలర్లతో రోడ్లు, సొరంగాలు, విమానాలు ఎగిరే, దిగే ఏర్పాట్లు తదితర మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. రక్షణ విషయంలో సమతూకంతో ఉండటం కాకుండా వ్యూహాత్మక పోటీని సంచలనాత్మకం కావిస్తోంది. 2020 గాల్వన్ లోయలో మాదిరి చైనా కొద్ది గంటల్లోనే అదనపు బలగాలను దించగలదు, మౌలిక సదుపాయాలు లేని కారణంగా అదే భారత్‌కు ఒక వారం పడుతుంది. మొత్తం వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందని గుర్తించామని, అందువలన ఆలోచనలు నాటకీయంగా మారినట్లు లడఖ్ ప్రాంతంలో రవాణా నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షించిన మాజీ అధికారి మేజర్ జనరల్ అమ్రిత్ పాల్ సింగ్ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది.గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత రెండుదేశాల మధ్య సంబంధాలు కనిష్ట స్థాయికి పడిపోయాయని, డోనాల్డ్ ట్రంప్ పన్నుల విధింపుతో భారత్, చైనాలతో అమెరికా సంబంధాలు దెబ్బతిన్నట్లు కూడా వ్యాఖ్యానించింది.
రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను సరి చేసుకోవాలని 2024 అక్టోబరు నుంచి నిర్ణయించుకోవటమేగాక వేగంగా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాయి. దాంతో ఏడు సంవత్సరాల తరువాత ప్రధాని నరేంద్రమోడీ చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి హాజరై పుతిన్, షీ జింపింగ్‌లతో భేటీ జరిపి అమెరికాకు పరోక్ష హెచ్చరికలు పంపారు. పెంటగన్ నివేదిక ఈ పూర్వరంగంలో తయారైందే అన్నది స్పష్టం. సరిహద్దులలో ఉద్రిక్తతలు తగ్గటాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా-భారత్ సంబంధాలను బలహీనపరిచేందుకు చూస్తున్నదని, పాకిస్తాన్‌తో రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకుంటున్నదని, అరుణాచల్ ప్రదేశ్‌ను ప్రధాన అంశంగా చూస్తున్నదని ఆ నివేదికలో చైనా మీద ఆరోపించారు. గత పదకొండు సంవత్సరాలు, అంతకు ముందు యుపిఏ హయాంలో అమెరికా జూనియర్ భాగస్వామిగా మారేందుకు మన్మోహన్ సింగ్ ప్రయత్నించారు. ఆ కారణంతోనే యుపిఏ-2 హయాంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. తరువాత నరేంద్రమోడీ హౌడీమోడీ కార్యక్రమంలో డోనాల్డ్ ట్రంప్‌ను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేసి చెట్టపట్టాలు వేసుకుతిరిగి మరింత సన్నిహితమయ్యారు. క్వాడ్ పేరుతో చైనాకు వ్యతిరేకంగా మరింత చురుకుగా వ్యవహరించారు.ఈ పరిణామాలకు చైనా కారణమా ? ప్రారంభ సంవత్సరాల్లో జవహర్‌లాల్ నెహ్రూ కూడా అమెరికావైపే మొగ్గారు.దానిది ధృతరాష్ట్ర కౌగిలి అని అర్ధమయ్యాక అలీనవిధానం, సోవియట్ వైపు మొగ్గారు. పరిస్థితిని చూస్తుంటే ఇప్పుడు నరేంద్రమోడీ కూడా చైనాతో రానున్న రోజుల్లో ఎలా ఉంటారో తెలియదుగాని అనివార్యంగా అమెరికా బెదిరింపులను వ్యతిరేకించకతప్పని స్థితిలో ఉన్నారు. నరేంద్రమోడీ అమాయకంగా చైనా వలలో చిక్కుకున్నారని అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. అవసరాలు అలానడిపిస్తాయి.
అరుణాచల్ ప్రదేశ్ టిబెట్‌లో అంతర్భాగమని మనదేశంలో ఆశ్రయం పొందుతున్న దలైలామా స్వయంగా చెప్పాడు. ఆ పెద్దమనిషికి మనదేశం అన్నివిధాలుగా మద్దతు ఇస్తున్నది.అదే మాట చైనా కూడా చెబుతున్నమాట నిజం.అయితే ఎన్నడూ ఆక్రమించుకుంటామని చెప్పలేదు.1962 యుద్ధం సందర్భంగా చైనా సేనలు అరుణాచల్ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్ వరకు వచ్చాయి. అక్కడే తిష్టవేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.యుద్ధంలో కాల్పుల విరమణను వారే ప్రకటించి, తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు ఆవలకు వెళ్లాయి. ఇది చైనా వ్యతిరేకులు కూడా అంగీకరిస్తున్న తిరుగులేని వాస్తవం. బ్రిటీష్ అధికారులు గీచిన సరిహద్దు రేఖలను చైనా ఎన్నడూ అంగీకరించ లేదు. లడఖ్‌లోని ఆక్సారు చిన్ ప్రాంతం మనదిగానూ, అరుణాచల్ చైనాలో భాగంగా బ్రిటీష్ మాపుల్లో ఉంది. అందుకే సరిహద్దు వివాదం తలెత్తింది. ఐదేండ్ల క్రితం ఆరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి చైనా కొన్ని గ్రామాలు నిర్మిస్తున్నదని మన మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అవి అమెరికా సిఐఏ సృష్టించిన కట్టుకథలు, వక్రీకరించిన చిత్రాలు. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన మన మిలిటరీ అధికారి రావత్ అప్పుడే ఆ వార్తలు అవాస్తమని ప్రకటించారు. గతంలో ఎన్నడో నిర్మించిన ఇండ్లు పాతబడిపోయినందున వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు తప్ప చైనా ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని చెప్పారు.మన కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఎలాంటి దురాక్రమణలు జరగలేదని పార్లమెంటులో, వెలుపలా ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు, యుద్ధ విమానాలు విక్రయిస్తున్నది జాగ్రత్త అంటూ మనదేశాన్ని భయపెట్టేందుకు పెంటగన్ పూనుకుంది. ఆయుధాల క్రయ, విక్రయాలు అంతర్జాతీయ నిబంధనలమేరకే జరుగుతున్నాయి.చైనా గురించి మనలను రెచ్చగొడుతున్న అమెరికా దాని కంటే ముందుగానే ఎఫ్-16 యుద్ధ విమానాలను, ఇతర ఆయుధాలను పాకిస్తాన్‌కు ఎందుకు అమ్మినట్లు ? మనకు కూడా ఎఫ్-35 విమానాలను ఇస్తామని స్వయంగా డోనాల్డ్ ట్రంపే చెప్పాడు కదా ? మనం ఫ్రాన్సునుంచి రాఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నాం. అదేవిధంగా చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది. చైనా విమానాలు ఎగరలేవు, ఆయుధాలు తుస్సుమనే నాశిరకం అని ఒకవైపు ప్రచారం చేస్తున్నవారు, వాటి గురించి ఎందుకు భయపెడుతున్నట్లు ? ఎంతో సమర్ధవంతమైనవని చెబుతున్న రాఫేల్ విమానాలను పాకిస్తాన్ ఆ నాశిరకం ఆయుధాలతోనే కూల్చివేసింది. ఆపరేషన్ సింధూర్‌లో ఏం జరిగిందీ, చైనా ఆయుధాల గురించీ నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు. ఆ తరువాతే కదా చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి మోడీ వెళ్లటం, చైనాకు వీసాలు, విమానాల పునరుద్ధరణ వంటి సానుకూల పరిణామాలన్నీ చోటు చేసుకున్నది. సంబంధాల పునరుద్ధరణ సందర్భంగా రెండు దేశాలూ ఇతర దేశాలతో సంబంధాల విషయంలో పరస్పరం ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని నిర్ణయించాయి. పెంటగన్ నివేదికను చూసి మనదేశంలోని కొందరు నిజమే కదా అనుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
తగాదాలు పెట్టటం, అనుమానాలను పెంచటంలో అమెరికా తరువాతే ఎవరైనా. పెంటగన్ నివేదికను బయటపెట్టిన తరువాత గతంలో అధ్యక్షుడిగా ఉన్న జార్జి డబ్ల్యు బుష్ మరియు రష్యా అధినేత వ్లదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణలు బయటకు వచ్చాయి. చైనాను నమ్మవద్దని ఇప్పుడు మనకు ట్రంప్ చెబుతున్నట్లే నాడు బుష్ కూడా పుతిన్‌కు చెప్పాడు. బుష్-పుతిన్ మధ్య 2001 నుంచి 2008వరకు జరిగిన సంభాషణల ప్రకారం చైనా నుంచి మీకూ మాకూ ఇద్దరికీ దీర్ఘకాలిక సవాలు ఉన్నదని, అందువలన మీరు జాగ్రత్తలు తీసుకోవాలని బుష్ చెప్పాడు. తొలిసారి స్లోవేనియాలో ఇద్దరు నేతలు భేటీ అయినపుడు రష్యా పశ్చిమదేశాల్లో భాగం అనీ శత్రుదేశం కాదని, చైనాతో జాగ్రత్తగా ఉండాలని, ఇద్దరికీ దీర్ఘకాలం సమస్యలుంటాయని బుష్ అన్నాడు.2005లో కూడా ఈ ప్రస్తావన చేసినపుడు మాకంటే మీకే ఎక్కువ సమస్యలని పుతిన్ చెప్పాడు. దానికి వారేమీ మా సరిహద్దులలో లేరని (చైనా – రష్యా మధ్య 4,195 కిలోమీటర్ల సరిహద్దు ఉంది ) చైనా నుంచి వ్యవస్థాపరమైన సవాలు ఉందని బుష్ బదులిచ్చాడు.అయితే పుతిన్ తక్కువేమీ తినలేదు గనుక తమకు తక్షణ ప్రమాదం నాటో తూర్పువిస్తరణ, ఐరోపాలో అమెరికా క్షిపణి మోహరింపు పధకాల నుంచి వుందని చెప్పాడు. చివరి సారిగా ఇద్దరు నేతల మధ్య 2008లో సంభాషణలు చోటు చేసుకున్నాయి. అక్కడ కూడా బుష్ చైనా గురించి హెచ్చరించాడు. అయితే తమ దేశ సరిహద్దులకు పశ్చిమ దేశాల మిలిటరీ మోహరింపు తక్షణ ప్రమాదంగా ఉందని పుతిన్ స్పష్టం చేశాడు. తరువాత జరిగిన పరిణామాల్లో రష్యాను నమ్మించి మోసం చేసేందుకు అమెరికా నాయకత్వంలోని నాటో చేసిన కుట్రలు బయటపడ్డాయి. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి తమకు తొత్తులుగా ఉండేవారిని గద్దెనెక్కించి, దానికి నాటో సభ్యత్వమిచ్చి రష్యా సరిహద్దుల్లో తిష్టవేసేందుకు పూనుకున్నారు. దానికి ప్రతిగానే రష్యా 2014లో ఉక్రెయిన్‌లో ఉన్న ప్రాంతమైన క్రిమియాను స్వాధీనం చేసుకుంది. దాంతో రష్యాను జి 8 కూటమి నుంచి తొలగించారు.
అసలు అమెరికా ఎందుకు గుండెలు బాదుకుంటోంది ? ఆసియా ఖండంపై ఆధిపత్యం కోసం, దానిలో భాగంగా చైనాను కట్టడి చేసేందుకు దీర్ఘకాలంగా అది అనుసరిస్తున్న విధానానికి న్యూఢిల్లీ-బీజింగ్ సాధారణ సంబంధాల పునరుద్దరణ పెద్ద ఎదురుదెబ్బ.భారత్ మెడమీద తుపాకి పెట్టి చైనాను కాల్చాలనుకున్న దాని ఎత్తుగడ పారే అవకాశం లేదని అనుకుంటున్నది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంలో మూడోదేశ జోక్యానికి అవకాశం లేదని మోడీ సర్కార్ స్పష్టం చేసింది.చైనాతో దౌత్య సంబంధాలు, వీసాలు, విమానాల పునరుద్దరణ ఏదో తాత్కాలిక వ్యూహంలో భాగం అనుకోలేము. రష్యా,చైనా, భారత్ సంబంధాలు మరింత సన్నిహితం కావటం సహజంగానే అమెరికాకు మింగుడుపడటం లేదు. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాలలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేదిగా కనిపిస్తున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా, భారత్,జపాన్,ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్ కూటమి భవిష్యత్ ఏమిటన్నది ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు.దక్షిణ చైనా సముద్రంలో చైనాను అడ్డుకొనేందుకు 2007లో ఈ కూటమిని అమెరికా ముందుకు తెచ్చింది. తరువాత దాని పరిణామాలు, పర్యవసానాలను మదింపు చేసుకొని మన్మోహన్ సింగ్ దాని పట్ల ఆసక్తి చూపకపోవటంతో ఒక విధంగా అది అటకెక్కింది. తరువాత నరేంద్రమోడీ ఉత్సాహం చూపటంతో 2017 నుంచి చురుకుగా పని చేస్తున్నది. అప్పటి వరకు అది ఆసియా – పసిఫిక్ అనే ఇతివృత్తంతో పని చేస్తున్నది కాస్తా మన దేశాన్ని ఇరికించేందుకు అమెరికా తెలివిగా ” ఇండో-పసిఫిక్ ” అజండాగా మార్చి దానికి భారత్ మూలస్థంభం అంటూ మోడీని మునగచెట్టు ఎక్కించి మన భుజాల మీద తుపాకి పెట్టి చైనాను కాల్చాలని పధకం వేసింది. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో మోడీ ముందుకు పోతారా ? ఈ కూటమి తనకు వ్యతిరేకంగా రూపొందిన ” ఆసియా నాటో ” అని చైనా భావిస్తున్నది. తమకు ముప్పు తలపెట్టిన ఐరోపా కేంద్రంగా ఉన్న నాటో కూటమిని పుతిన్ వ్యతిరేకించటమేగాక దానికి పావుగా ఉన్న ఉక్రెయిన్ మీద మిలిటరీ చర్య జరుపుతున్న సంగతి తెలిసిందే. క్వాడ్ అంశంలో మరింత ముందుకు పోతే చైనాకు, వెనక్కు తగ్గితే అమెరికాకు ఆగ్రహం. అందుకే నరేంద్రమోడీకి డోనాల్డ్ ట్రంప్ అగ్నిపరీక్ష పెట్టాడని చెప్పాల్సి వస్తోంది. ఏ దేశానికైనా దీర్ఘకాలిక విదేశాంగ విధానం ఉండాలి. ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి అన్నట్లు ఎటువాటంగా ఉంటే అటుపోతే ఇలాంటి ఇరకాటాలే వస్తాయి మరి ! ఏం జరుగుతుందో చూద్దాం !!
రాజకీయంగా ఆర్‌ఎస్‌ఎస్ అది నడిపించే బిజెపిలోని అత్యధికులు కమ్యూనిస్టు వ్యతిరేకత, చైనా వ్యతిరేకత కారణంగా అమెరికా వైపు మొగ్గాలని వత్తిడి చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అయితే మనవిదేశాంగ విధానం, స్వదేశీ విధానాలను నిర్దేశించేది ఇక్కడ ఉన్న పాలకవర్గం-బడా కార్పొరేట్లు, వారితో చేతులు కలిపే భూస్వామ్య, ధనిక రైతులు- అన్నది బహిరంగ రహస్యం. కొంత మందికి వెంటనే అవగతం గాకపోవచ్చు. అమెరికా విధించే షరతులు,వాణిజ్య విధానం తమకు నష్టదాయకమని పాలకవర్గం భావిస్తున్నది. దానికి అనుగుణంగా నడుచుకోవటం మినహా ప్రధానిగా ఎవరున్నా చేసేదేమీ లేదు. ధిక్కరిస్తే తమకు దాసులుగా ఉన్నవారిని గద్దెనెక్కిస్తారు.సంస్కరణలను మరింతవేగవంతంగా, ప్రతిఘటనను అణచివేసి తమకు మరింతగా లాభాలు సంపాదించి పెడతారనే నమ్మకంతోనే మన్మోహన్ సింగ్‌ను వదిలించుకొని నరేంద్రమోడీని రంగంలోకి తెచ్చారు. మారిన పరిస్ధితుల్లో అంతర్గతంగా మోడీకి ఇష్టం ఉన్నా లేకపోయినా ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నారు, చైనా వైపు మొగ్గారు. అందుకే ట్రంప్ ఇప్పుడు అగ్నిపరీక్ష పెట్టారు. ఏ గట్టునుండాలో తేల్చుకొమ్మని హెచ్చరించాడు. చరిత్రలో అనేక మంది తీరుతెన్నులను చూసినపుడు జెండాలు, అజెండాలను ఊసరవెల్లి మాదిరి పరిస్థితికి తగినట్లుగా మార్చటం చూశాము. ముందు రోజు రాత్రి వరకు జనతా పార్టీని గట్టిగా సమర్ధించిన ” సోషలిస్టు ” జార్జి ఫెర్నాండెజ్ తెల్లవారేసరికి మొరార్జీదేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారటం తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది !
