Tags
Amaravati capital, Andhra Pradesh Budget 2019-20, BJP, CHANDRABABU, Narendra Modi Failures, nirmala sita raman
ఎం కోటేశ్వరరావు
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో లేదా ఇతర చోట్ల ఏ ఇద్దరు తెలుగు వారు కలిసినా, రచ్చబండల మీద జరిగిన,కానసాగుతున్న చర్చ ఒక్కటే. అది రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం గురించే, ప్రత్యేకించి రాజధాని అమరావతి పట్టణ అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన పదిహేనువేల కోట్ల రూపాయలు రుణమా లేక దానమా (ఆంగ్లంలో గ్రాంట్ అంటే తెలుగులో దానం ) అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కొన్ని మీడియా సంస్థల వార్తల్లో, చర్చల సందర్భంగా తెలుగుదేశం నాయకత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రతినిధులు దానమే అంటే, కొందరైతే మరొక అడుగు ముందుకు వేసి ఐదేండ్లపాటు ఏటా పదిహేనువేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినందున పండగ చేసుకోవాలని చెప్పారు.కాదన్నవారి మీద మండిపడ్డారు. కొందరైతే విదేశీ సాయంతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే ప్రాజెక్టుల ఖర్చులో కేంద్రం 90శాతం భరిస్తుందని, కేవలం పదిశాతమే రాష్ట్రం పెట్టుకోవాలని చెప్పారు. అంటే పదమూడున్నరవేల కోట్లు కేంద్రమే భరిస్తుందని, పదిహేను వందల కోట్లు రాష్ట్రం పెట్టుకోవాలన్నది వారి వాదన. అదే నిజమనుకున్నా రాష్ట్రానికి కొంత మేలే. రాష్ట్రం కోరుతున్నది తన మీద భారం మోపని సాయం. కేంద్ర మంత్రి చెప్పిన పదాలకు అర్ధం రుణం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఉన్న రెండు ఇంజన్ల డ్రైవర్లు ఏది నిజమో చెబితే జనం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సినపని లేదు.చెప్పటానికి సిద్దంగా ఉన్నారా ?
దీని గురించి స్పష్టంగా చెప్పకుండా చంద్రబాబు నాయుడు తన పరువును, నరేంద్రమోడీ పరువును కాపాడేందుకు పూనుకున్నారు. గతంలో కేంద్రం ప్రత్యేక హౌదా బదులు పాకేజ్ ఇస్తామంటే అదే గొప్పదని చెప్పారు. బిజెపితో బంధం తెగిన తరువాత మాట మార్చారు. ఇప్పుడు ఎలాగైతేనేం డబ్బులు వస్తున్నాయిగా అంటున్నారు.తరువాత ఏమంటారో భవిష్యత్‌కే వదలివేద్దాం.తనదైన శైలిలో చెప్పిందేమిటి ? ” నిధులు ఎక్కడి నుంచి ఎలా వస్తేనేం రాష్ట్రం అభివృద్ది చెందుతుంది.కేంద్రం ముందు ఆంధ్రప్రదేశ్ ఉంచిన ప్రతిపాదనల్లో అత్యధికాన్ని ఆమోదించింది. రాజధానికి వచ్చే నిధులతో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి, దీంతో పన్నుల రూపంలో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. వాగ్దానం చేసిన నిధులతో రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభమౌతుంది.విదేశీ సంస్థల నుంచి రుణాల రూపంలో వచ్చినప్పటికీ వాటిని 20-30 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వివిధ సంస్థల నుంచి వచ్చే రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. రాజధాని సహాయ రూపంలో కొన్ని కేంద్ర గ్రాంటులు వస్తాయి.వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా సాయం వచ్చే అవకాశం ఉంది.ఈ పాకేజ్‌లో పారిశ్రామిక సబ్సిడీలు కూడా ఉంటాయి.” అన్నారు చంద్రబాబు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తరువాత విలేకర్లతో నిర్మలా సీతారామన్ మాట్లాడిన అంశాలు గందరగోళంగా ఉన్నాయి. ” రాజధాని నిర్మాణానికి ఈ ఏడాదే ప్రపంచ బాంకు నుంచి 15వేల కోట్ల రుణం తీసుకుంటాం.ఇందులో రాష్ట్రం వాటాను కూడా భరించాలి.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం తన వాటాను చెల్లించగలదా లేదా కేంద్రమే గ్రాంటు ఇస్తుందా అన్న విషయాలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం ” అని నిర్మలమ్మ చెప్పారు. ప్రపంచబ్యాంకు నుంచి కేంద్రం రుణం తీసుకుంటే దానిలో రాష్ట్రం భరించాల్సిదేమిటి ? ఇచ్చేది రాష్ట్రానికే అయినపుడు రాష్ట్ర వాటా ఏమిటి ? దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రాజెక్టుల రుణాలు తీసుకోవటం కొత్తేమీ కాదు. అవి రాష్ట్రాల్లో అమలు జరిగినా కేంద్రం హామీ ఇవ్వాల్సి ఉంటుంది.నేరుగా రాష్ట్రాలు తీసుకొనేందుకు వీలులేదు. అలా ఇచ్చే రుణాలలో కొన్నింటిలో కొంత గ్రాంటు కూడా వుంటుంది. బాటా కంపెనీ చెప్పుల ధరలు, వెయ్యో, రెండువేలో కాకుండా రు.999, 1,999 మాదిరి ఉంటాయి. వినియోగదారుని మానసిక స్థితిని సొమ్ముచేసుకొనే వాణిజ్య చిట్కా ఇది. అలాగే అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రుణాలకు అనేక షరతులు ఉంటాయి. వాటికి వ్యతిరేకత తలెత్తకుండా ఉండేందుకు అవిచ్చే రుణాల్లో కొంత భాగాన్ని గ్రాంటుగా ఇస్తాయి. చేదు మాత్రను మింగించేందుకు వాటికి పంచదార పూత పూయటం వంటిదే ఇది. రుణ షరతులను వ్యతిరేకించేవారి నోరు మూయించేందుకు గ్రాంటు భాగాన్ని జనానికి చూపుతారు. అమరావతి స్వయం పోషక నగరమని, దాని నిధులతోనే నిర్మాణం జరుపుతామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆర్థిక మంత్రి విదేశీ సంస్థల నుంచి అప్పుతీసుకుంటామంటున్నారు. ఒక వేళ అదే వాస్తవం అనుకుంటే ఆ అప్పును ఎవరు తీర్చాలి ? కేంద్రం అంటే దేశం మొత్తం కదా ! ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చేసే అప్పును దేశం మొత్తం ఎందుకు భరించాలి ? మా రాజధానులను కూడా నవీకరిస్తాం, ప్రపంచ స్థాయి నగరాలుగా చేస్తాం అప్పుచేసి మాకూ నిధులు ఇవ్వాలి అంటే కేంద్రం అంగీకరిస్తుందా ? విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకోవాలంటే ముందుగా ఆ సంస్థలకు ప్రాజెక్టు వివరాలను సమర్పించాలి. పర్యావరణం,వాటి అమలుతో నష్టపోయేవారెవరైనా ఉన్నారా, ఉంటే వారికి పరిహారం ఎలా చెల్లించాలి? తీసుకున్న అప్పులను ఎలా తీరుస్తారు? అందుకుగాను మీదగ్గర ఉన్న ఆదాయవనరులు ఏమిటి ? లేకపోతే ఎలా రాబడతారు ? ఇలా అనేక అంశాలను పరిశీలించి షరతులతో కూడిన రుణాలను మంజూరు చేస్తాయి. ఆదాయాన్ని ఎలా రాబట్టాలో కూడా వినియోగదారుల ఛార్జీల వంటి సూచనల రూపంలో షరతులు విధిస్తాయి. మనం సాధారణంగా బాంకులకు అలా వెళ్లి ఇలా అప్పుతెచ్చుకున్నంత సులభంగా విదేశీ సంస్థల అప్పు ఉండదు. అయినప్పటికీ ఇంకా వర్తమాన ఆర్థిక సంవత్సరంలోనే విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకొని ఇస్తామంటూ నిర్మలా సీతారామన్ చెప్పారు. బహుశా నరేంద్రమోడీగారిని విశ్వగురువుగా, నేతగా ప్రచారం చేస్తున్నారు గనుక అలాంటి నిబంధనలను పక్కన పెట్టే ప్రత్యేక వెసులు బాటు, వివరాలేమీ లేకుండానే ముందుగానే ఇచ్చే అవకాశం ఉందేమో తెలియదు. ఇంతవరకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను కేంద్రానికి సమర్పించినట్లు చంద్రబాబు నాయుడు ఎక్కడా ప్రకటించలేదు, లీకులు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య అధికారంలో ఉన్నపుడు అమరావతి కోసం విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. వినియోగదారుల దగ్గర రుసుములు వసూలు చేసే షరతులతో ముందుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం మారటం, అమరావతిని వదలివేయటంతో కథకంచికి చేరింది. ఒక వేళ ఇప్పుడు మరోసారి ప్రయత్నించాలన్నా, పెరిగిన ధరలకు అనుగుణ్యంగా డిపిఆర్‌ను సమర్పించాలి. అలాంటి ప్రక్రియ ఇంతవరకు లేనందున పదిహేనువేల కోట్లు వెంటనే ఎలా వస్తాయన్నది ప్రశ్న.
ఇలాంటి ప్రశ్నలు, సందేహాలను ఎవరైనా లేవనెత్తితే రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవటం లేదనో, వైసిపి కండువా కప్పుకున్నారనో ఎన్‌డిఏ కూటమి ఎదురుదాడికి దిగవచ్చు.గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నిస్తే వైసిపి వారు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. వాటిని వదలి వేద్దాం.హిందూ బిజినెస్‌లైన్ పత్రికలో 2024 జూలై 18న న్యూఢిల్లీ ప్రతినిధి రాసిన విశ్లేషణ ప్రకారం ”రాష్ట్ర పునర్‌నిర్మాణానికి ” కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల సాయం కావాలని చంద్రబాబు నాయుడు కోరారు. అందుకోసం ప్రధాని నరేంద్రమోడీ, అరడజను మంది కేంద్ర మంత్రులు, పదహారవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియాను కలిశారు. నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరణాత్మక పత్రాన్ని కూడా అందచేశారు.కేంద్రం ఎందుకు సాయం చేయాలో కూడా వివరించారు.వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి జిడిపిలో మూడుశాతం నిబంధనను సడలిస్తూ 0.5శాతం పెంచాలని, అమరావతి నిర్మాణానికి రు.50వేల కోట్ల సాయం ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు పన్నెండువేల కోట్లు ఇవ్వాలని కోరారు. అలాగే దుగ్గరాజపట్నం రేవు నిర్మాణం, రాష్ట్ర మూలధన పెట్టుబడికి ప్రత్యేక పధకం కింద సాయం,బుందేల్ ఖండ్ పాకేజ్ మాదిరి వెనుకబడిన ప్రాంతాలకు సాయాన్ని, చమురుశుద్ధి కర్మాగారాల ఏర్పాటును కూడా కోరారు.కీలకమైన కేంద్ర మంత్రి పదవులు,లోక్‌సభ ఉపసభాపతి పదవిని కూడా కోరకుండా ఆర్థిక సాయం మీదే కేంద్రీకరించినట్లు కూడా బిజినెస్‌లైన్ పత్రిక రాసింది. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ” ఆంధ్రప్రదేశ్‌కు నిర్మల మద్దతు, కానీ నాయుడు కోరిన దానికి చాలా తక్కువ ” అనే శీర్షికతో అదే బిజినెస్‌లైన్ పత్రిక రాసింది. దానిలోని అంశాల సారం ఇలా ఉంది. కేంద్ర సాయాన్ని ఆశిస్తూ బడ్జెట్‌లో ఏం కేటాయిస్తారో చూసేందుకు గాను చంద్రబాబు రాష్ట్రబడ్జెట్ ప్రవేశపెట్టటాన్ని వాయిదా వేసుకున్నారు. స్థానికంగా వనరులను పెంచేందుకు మార్గాలు వెతకాల్సి ఉంటుంది, పదిహేనవ ఆర్థిక సంఘం సూచనను అనుసరిస్తే రాష్ట్ర ప్రభుత్వం పన్నేతర రాబడులను పెంచుకోవాల్సి ఉంది.కేేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక పాకేజ్ లేదా ప్రత్యేక హౌదా ప్రస్తావన లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి బడ్జెట్ పెట్టకుండా సమయాన్ని తీసుకుంది.అయితే చంద్రబాబు లక్ష్యం అంత తేలిక కాదు.రాష్ట్ర ఆదాయంతో పోల్చితే వడ్డీ చెల్లింపులు గణనీయంగా ఎక్కువగా ఉన్నందున ఆర్థిక పునర్‌నిర్మాణం కోసం ఎంతో ఎంతో చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
బడ్జెట్ కేటాయింపులను పరిశీలించేపేరుతో కొద్ది రోజులు కాలయాపన చేయవచ్చు. కేంద్రం నుంచి ఆశించిన సాయం, దాని గురించి తెలుగుదేశం పార్టీ, జనసేన జనంలో పెద్ద ఎత్తున ఆశలు కలిగించాయి.సూపర్‌సిక్స్ పేరుతో చేసిన వాగ్దానాలను బిజెపి ఆమోదించి ఉంటే ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో దాని పేరు కూడా ఉండేది.ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయం గురించి 2014-19 మధ్య బిజెపితో కలసి కాపురం చేసినంత కాలం చంద్రబాబు నాయుడు సానుకూలంగా మాట్లాడారు తప్ప జనాలకు వివరాలు చెప్పలేదు. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్న తరువాతే గళమెత్తి, ఢిల్లీలో నిరసనలు, తరువాత 2019ఎన్నికలకు ముందు శ్వేత పత్రాలను ప్రకటించారు. జనం వాటిని నమ్మలేదు.చిత్తుగా ఓడించారు.వైసిపిని గెలిపించారు. ఆ పార్టీ అనుసరించిన వైఖరితో విసిగిపోయి చారిత్మ్రాక స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని గెలిపించారు. రాష్ట్రం ఉన్న స్థితి గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పటి మాదిరి గుండెలు బాదుకుంటే, వైసిపి మీద విమర్శలను గుప్పిస్తే కుదరదు. కేంద్ర సాయం గురించి తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలంటే అధికారానికి వచ్చిన తరువాత కేంద్రాన్ని ఏ ఏ రంగాలలో ఎంత సాయం చేయాలని కోరారు, తాజా బడ్జెట్‌లో వాటిలో ఏమేరకు వచ్చింది అనే అంశాలను జనానికి అర్దమయ్యే రీతిలో ఒక శ్వేతపత్రం ద్వారా ప్రకటించి పరిస్థితిని వివరించాలి. అందుకు చంద్రబాబు సిద్దపడతారా ?
హొ


