Tags
# Anti Muslims, #Hindutva, Anti Muslim propaganda in India, BJP, Gujarat hindutva rapist files, HC Judge Shekhar Kumar Yadav, Hindutva And the Higher Judiciary, Hindutva fanatics, Narendra Modi Failures, RSS, Supreme Court, VHP
ఎం కోటేశ్వరరావు
ఆ పెద్దమనిషి దేశంలోనే పురాతన కోర్టులలో ఒకటైన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి. పేరు శేఖర్ కుమార్ యాదవ్, 2026లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. కాషాయ తాలిబాన్ల మాదిరి ముస్లిం విద్వేషాన్ని వెళ్లగక్కిన ఆ పెద్దమనిషిని జడ్జిగా తొలగించాలని తీర్మానం పెట్టేందుకు ఎంపీల నిర్ణయం, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పలువురి ఫిర్యాదు. విశ్వహిందూ పరిషత్ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరిన సుప్రీం కోర్టు. దేశవ్యాపితంగా సంచలనం కలిగించిన ఈ ఉదంతానికి వస్తే..... 2024 డిసెంబరు ఎనిమిదవ తేదీన కోర్టు ప్రాంగణంలోని గ్రంధాలయ హాలులో వివాదాస్పద హిందూత్వ ఉగ్రవాద సంస్థగా కొందరు పరిగణించే విశ్వహిందూపరిషత్ న్యాయవాదుల విభాగం నిర్వహించిన సభను అలహాబాద్ హైకోర్టు జడ్జి దినేష్ పాథక్ ప్రారంభిస్తే అదే కోర్టుకు చెందిన మరో జడ్జి శేఖర్ కుమార్ యాదవ్ రాజ్యాంగవిరుద్దమైన, విద్వేషపూరిత ప్రసంగం చేశారు. చేసిన ప్రమాణానికి విరుద్దంగా మాట్లాడినందున న్యాయమూర్తిగా అనర్హులని ఆ మేరకు చర్య తీసుకోవాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. న్యాయవ్యవస్థ జవాబుదారీతనం మరియు సంస్కరణల ప్రచార సంస్థ(సిజెఎఆర్) కన్వీనర్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషన్ కూడా సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరం రాశారు. సదరు జడ్జి ప్రసంగం న్యాయవ్యవస్థకు అపచారమని, ప్రసంగ అంశాలపై విచారణ జరపాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ కూడా పదవి నుంచి తొలగించాలని కోరారు. ఈ ఉదంతం దేశంలో పెద్ద సంచలనం సృష్టించింది. సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మరోసారి న్యాయవ్యవస్థలో ఆవాంఛనీయ ధోరణులు, హిందూత్వ శక్తుల ప్రవేశం, ముస్లిం వ్యతిరేక విద్వేష ప్రచారం తదితర అంశాల గురించి చర్చకు దారితీసింది. ఒక వివాదాస్పద సంస్థ హైకోర్టు ప్రాంగణంలో సభకు అనుమతించటం, దానిలో న్యాయమూర్తులు పాల్గొని అనుచిత ప్రసంగం చేయటం మన న్యాయవ్యవస్థకు ముంచుకువస్తున్న ముప్పుగా అనేక మంది భావిస్తున్నారు.
1991నాటి ప్రార్ధనా స్థలాల చట్టం ప్రకారం 1947 నాటికి ఏ మత ప్రార్ధనా స్థలం అలా ఉంటే దాన్ని అలాగే కొనసాగించాలి తప్ప వివాదాస్పదం చేయకూడదు. అయితే బాబరీ మసీదు లేదా రామజన్మభూమి వివాదం కోర్టులో ఉన్నందున దానికి మినహాయింపు ఇచ్చారు. దీన్ని సుప్రీం కోర్టు కూడా సమర్ధించింది. గతంలో పార్లమెంటుచేసిన అనేక చట్టాలను మార్చినందున దీన్ని కూడా సవరించాలనే వాదనలు ముందుకు వచ్చాయి. దీని మీద సుప్రీం కోర్టులో దాఖలైన కేసు ఈనెల 12న విచారణకు రానున్నది. గతంలో షాబానో కేసు తీర్పును వమ్ము చేస్తూ కాంగ్రెస్ హయాంలో పార్లమెంటులో చట్ట సవరణ చేయటాన్ని అనేక మంది పురోగామి వాదులు వ్యతిరేకించారు. బిజెపి దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని ముస్లింలను కాంగ్రెస్ సంతుష్టీకరిస్తున్నదని దాడి చేస్తున్నది. చరిత్రలో జరిగిన తప్పులను సరిదిద్దే పేరుతో ప్రార్ధనా స్థలాల చట్టాన్ని ఎందుకు మార్చకూడదని కాషాయ దళాలు ప్రశ్నిస్తున్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేశారని, ఈ చట్టాన్ని కూడా ఎందుకు మార్చకూడదనే వాదనలను ముందుకు తెచ్చాయి. దీనికి కూడా సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పు వారికి ఆయుధంగా మారింది. ‘‘ ఉమ్మడి పౌర స్మృతిరాజ్యాంగ అనివార్యత ’’ అనే అంశంపై ముప్ఫై నాలుగు నిమిషాల ప్రసంగంలో దేశం మెజారిటీ వాంఛలకు అనుగుణంగా పని చేయాలని, ముస్లిం సమాజం నుంచి కీడు తలెత్తిందని అలహాబాదు జడ్జి చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా హిందూమతోన్మాదశక్తులు చేస్తున్న వాదనల సారాంశాన్ని శేఖర్ కుమార్ యాదవ్ పునశ్చరణ చేశారు.బహుభార్యాత్వం,ఛాందసత్వం,కుహనా మతవాదులంటూ ముస్లింలోని ఒక తరగతిని కించపరుస్తూ ఉపయోగించే ‘‘కత్‌ముల్లా ’’ అనే పద ప్రయోగం చేశారు. అలాంటి వారు దేశానికి ముప్పు అన్నారు. హిందువులు పిల్లలకు చిన్నతనం నుంచి అహింసను బోధిస్తారని, సహనాన్నిచొప్పిస్తారని, అదే ముస్లింల పిల్లలు చిన్నతనంలోనే జంతువధ హింసను చూస్తారని ఆరోపించారు. ఇంకా అయోధ్యలో రామమందిరం కోసం పూర్వీకులు త్యాగాలు చేశారు. ఉమ్మడి పౌర స్మృతి కూడా త్వరలో సాకారం కానున్నది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మెజారిటీకి అనుకూలంగా చట్టం పని చేస్తుంది.ఇది చట్టం, ఒక హైకోర్టు న్యాయమూర్తిగా నేను ఇది చెబుతున్నానని మీరు చెప్పలేరు. అది కుటుంబ నేపధ్యమైనా సమాజ సంబంధమైనా మెజారిటీ ప్రకారమే జరగాలి.కేవలం మెజారిటీ సంక్షేమం, సంతోషాలకు తోడ్పడేదానినే అంగీకరించటమౌతుంది. నేను మాట్లాడుతున్నదంతా చెడ్డ కాదు, కానీ మీరు ఎవరినైతే కత్‌ముల్లాస్ అని పిలుస్తున్నారో….ఈ మాట అభ్యంతరకరమని నాకు తెలుసు, కానీ దీన్ని చెప్పటానికి నేను సంకోచించను, ఎందుకంటే దేశానికి ఇది వినాశకరమైనది. హిందువులు సహనం, దయతో ఉన్నారంటే పిరికి వాళ్లని పొరపాటు పడవద్దు. మీరు ఒక లాయరు, ఒక వ్యాపారి లేదా ఒక విద్యార్థి కావచ్చు గానీ ముందు నీవు ఒక హిందువు. ఇది తన మాతృభూమి అని ఎవరు చెప్పినా వారు దాని బిడ్డలే, వారు ఏ మతాన్ని పాటించినా హిందువులే. అలహాబాద్ జడ్జి ప్రసంగం సాగిన తీరు ఇది.
ఈ న్యాయమూర్తి గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2021లో సంభాల్‌కు చెందిన ఒక ముస్లిం వ్యక్తి తన అనుచరులతో కలసి ఆవును అపహరించి వధించినట్లు కేసు దాఖలైంది.సదరు నిందితుడికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, హిందువుల ప్రాధమిక హక్కుల్లో గోరక్షణ చేర్చాలని చెప్పారు. ఆక్సిజన్ పీల్చి దాన్నే బయటకు వదిలే ఏకైక జంతువు ఆవు అని శాస్త్రవేత్తలు నమ్ముతారని కూడా అన్నారు. రాముడు, కృష్ణుడిని అవమానిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడనే మరొక కేసులో హిందువుగా ఉన్న దళితుడికి బెయిలు ఇస్తూ వాల్మీకి, వేదవ్యాసులకు జాతీయ గౌరవాన్ని కల్పించాలని అన్నారు. సంఘపరివార్ ముందుకు తెచ్చిన హిందూత్వకు న్యాయవ్యవస్థ తనదైన శైలిలో భాష్యం చెప్పటంతో బిజెపి ఆ పేరుతో ఓట్లడగటానికి, మనోభావాలను రెచ్చగొట్టటానికి వీలు కలుగుతోంది.1995లో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జెఎస్ వర్మ, ఎన్‌పి సింగ్,కె.వెంకటసామి ఇచ్చిన ఒక తీర్పులో రాజకీయ నేతలు మతం, కులం,జాతి, తెగ లేదా భాష పేరుతో ఓట్లు అడగటాన్ని, పౌరుల్లోని భిన్న తరగతుల మధ్య శతృత్వం లేదా విద్వేషాన్ని పెంచటాన్ని అక్రమ పద్దతులుగా పేర్కొన్నారు. అయితే హిందూత్వ అనేది మతం కాదని, ఒక జీవన విధానం లేదా ఒక మానసిక స్థితి అని దాన్ని హిందూమత ఛాందసంతో సమానంగా చూడకూడదని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు. అందుకే బిజెపి నేతలు పదే పదే తాము హిందూత్వకు కట్టుబడి ఉన్నామని, అలాగే ఉంటామని చెబుతుంటారు. అందుకే నరేంద్రమోడీని హిందూ హృదయ సామ్రాట్‌గా పిలుచుకుంటారు.
మరికొన్ని కోర్టు తీర్పులు కూడా విమర్శలకు గురైన సంగతి తెలిసిందే.బాబరీ మసీదు కేసులో తమ ముందు ఉన్న సాక్ష్యాలను బట్టిగాక మతపరమైన మనోభావాల ప్రకారం తీర్పు ఇచ్చి రామాలయ నిర్మాణానికి వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. బాబరీ మసీదు కూల్చివేత రాజ్యాంగ విరుద్దం, అత్యంత చెడు చర్య అని గుర్తిస్తూనే తీర్పును వెల్లడిరచారు. ఆ బెంచ్‌లో తీర్పురాసిన, తరువాత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన చంద్రచూడ్ తన పదవీకాలం చివరిలో చెప్పిన మాటలతో అనేక మంది నిర్ఘాంతపోయారు. అయోధ్య కేసు తీర్పు రాజ్యాంగాన్ని బట్టిగాక దేవుడి ప్రమేయంతో ఇచ్చినట్లు, ఒక పరిష్కారం చూపాలని తాను ప్రార్దించినట్లు చెప్పారు.(తన జన్మ మామూలుగా జరగలేదని, దేవుని అంశంతో జన్మించినట్లు ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకున్న సంగతి తెలిసిందే) ఈ వివాదం రేకెత్తించినప్పటి నుంచి హిందువుల మనోభావాలను గౌరవించాలని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు చేసిన వాదనలకు అనుగుణంగా ఆ తీర్పు ఉంది. కాశీలోని గ్యానవాపి మసీదు స్వభావాన్ని మార్చాలని హిందువులు అడగటం లేదని కేవలం దాని మత స్వభావాన్ని నిర్ధారించాలని మాత్రమే కోరుతున్నందున సర్వే చేయవచ్చంటూ ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు కొత్త వివాదాలకు తెరలేపింది. దాన్ని అవకాశంగా తీసుకొని సంభాల్‌లో ఉన్న పురాతన మసీదును సర్వే చేయాలని జిల్లా కోర్టు అనుమతివ్వటం, అనంతరం జరిగిన అవాంఛనీయ పరిణామాలు తెలిసిందే.అనేక మసీదులపై అలాంటి సర్వేలు చేయాలన్న డిమాండ్లను ముందుకు తేవటమే గాక చివరికి 1947 తరువాత ప్రార్ధనా స్థలాల స్వభావాన్ని మార్చకూడదన్న 1991నాటి చట్టాన్ని తిరగదోడేందుకు పూనుకున్నారు.
న్యాయవ్యవస్థలో కాషాయ దళాలు తమ భావజాలం ఉన్న వారిని న్యాయమూర్తులుగా ప్రవేశపెట్టిన తీరును కూడా చూడవచ్చు.కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తన పదవీ విరమణ రోజునే ఆర్‌ఎస్‌ఎస్‌తో తన జీవితాంతం కొనసాగిన బంధాన్ని వెల్లడిరచారు, దానికి తాను రుణపడి ఉంటానని ప్రకటించారు.మరొక న్యాయమూర్తి లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాజీనామా చేసి బిజెపి అభ్యర్ధిగా పోటీచేసి గెలిచిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ హైకోర్టులో ఇద్దరు సభ్యుల బెంచ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరటంపై ఇచ్చిన తీర్పు దారుణంగా ఉంది. ఒక కేసులో ఇచ్చిన తీర్పులో ప్రముఖ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో నిషేధిత సంస్థలో చేర్చిన తప్పు కారణంగా ఐదు దశాబ్దాలపాటు అనేక మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేక విధాలుగా దేశానికి సేవచేయాలనుకొని కూడా ఈ నిషేధం కారణంగా చేయలేక పరిమితమయ్యారని బెంచ్ వ్యాఖ్యానించింది. అంటే దేశానికి సేవచేయాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాలన్న సందేశం దీనిలో ఉంది.ప్రస్తుతం విధుల్లో ఉన్న అడ్వొకేట్ జనరల్స్, జడ్జీలు 33 మంది ఆర్‌ఎస్‌ఎస్ లాయర్ల విభాగం ఏర్పాటు చేసిన సభలు, సమావేశాలకు ప్రధాన అతిధులుగా హాజరయ్యారని, వారిలో తొమ్మిది మంది ఒకటి కంటే ఎక్కువ సభల్లో పాల్గొన్నట్లు కారవాన్ 2024 అక్టోబరు సంచికలో పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో విశ్వహిందూ పరిషత్ లాయర్ల విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో 30 మంది సుప్రీం కోర్టు, హైకోర్టులలో పనిచేసిన మాజీ న్యాయమూర్తులు పాల్గ్గొన్నారు. వారణాసి, మధుర వివాదం, వక్ఫ్ బిల్లు, మతమార్పిడుల గురించి చర్చించినట్లు విహెచ్‌పి అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా దీనిలో పాల్గ్గొన్నారు. ఇది తొలిసారి జరిపిన సమావేశమని తరువాత నిరంతరం జరపుతామని ఒక నేత చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది. గతంలో అనేక మంది ఇలాంటి సమావేశాల్లో పొల్గొనేందుకు సంకోచించేవారు. ప్రస్తుతం దేశంలో హిందూత్వశక్తుల హవా నడుస్తున్నందున నిజరూపాలను బయటపెట్టుకుంటున్నారు.
