Tags
Bangladesh liberation struggle, BJP, BNP, China, cia, coup against Sheikh Hasina, Narendra Modi Failures, pakistan, RSS
ఎం కోటేశ్వరరావు
జవహర్‌లాల్ నెహ్రూ చేసిన తప్పిదాలు అన్నిన్ని కావు అన్నీ అతనే చేశాడు అంటూ బొమ్మరిల్లు డైలాగులతో బిజెపి నేతలు, కాషాయదళాల నిత్యపారాయణంలో దలైలామాకు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన అంశం ఎక్కడా వినిపించదు, రాతల్లో కనిపించదు. మిగతా అన్ని విషయాల్లో తప్పు చేసి నెహ్రూ ఒక్క దీనిలోనే మంచి చేశారా ?చేస్తే ఆ విషయం ఎందుకు చెప్పరు అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా ? షేక్ హసీనా ! బంగ్లా ప్రధానిగా ఆమె పదవీ కాలంలో మనదేశానికి ఇబ్బందులు కలిగించినట్లు ఎవరూ చెప్పలేరు. ఆమె ప్రత్యర్థి బంగ్లానేషనలిస్టు పార్టీ(బిఎన్‌పి), దానికి వెన్నుదన్నుగా జమాతే ఇస్లామీ అనే మతోన్మాద సంస్థ మన దేశానికి వ్యతిరేకమని ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. అఫ్‌కోర్స్, వారు అసలు బంగ్లాదేశ్ విముక్తికే వ్యతిరేకులు, అమెరికా సప్తమనౌకా దళాన్ని బంగాళాఖాతంలోకి రప్పించి విముక్తి పోరాటాన్ని అణచేందుకు, దానికి వెన్నుదన్నుగా ఉన్న భారత్‌ను బెదిరించేందుకు చూసిన చరిత్ర జగమెరిగినదే. టిబెట్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించి చైనా మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు రాజకీయ ఆశ్రయం కల్పించటమే గాక హిమచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు నాటి ప్రధాని నెహ్రూ ఎంతగానో సహకరించారు.మిలిటరీ కుట్ర కారణంగా షేక్ హసీనా 2024 ఆగస్టు ఐదవ తేదీన మనదేశానికి వచ్చి ఆశ్రయం పొందారు. ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ వద్ద ఉన్న వైమానిక స్థావరంలో ఆమె ఉన్నారు. ఇది రాస్తున్న సమయానికి ఆమె శరణార్ధిగా లేదా రాజకీయ ఆశ్రయం పొందిన వ్యక్తిగా గానీ లేరు. కేవలం వీసా మీద వచ్చిన ఒక సాధారణ బంగ్లా పౌరురాలిగా మాత్రమే ఉన్నారు. అలా ఎన్ని రోజులు ఉంటారు ? వీసా గడువును పొడిగిస్తారా ? నరేంద్రమోడీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. బంగ్లాదేశ్ పరిణామాల గురించి మీడియా, సామాజిక మాధ్యమంలో అనేక అంశాలు చక్కర్లు కొడుతున్నాయి.కుట్ర సిద్దాంతాలను వండి వారుస్తున్నారు. వాట్సాప్ విశ్వవిద్యాలయం సరేసరి. పక్కనే ఉన్న దేశంలో జరిగే పరిణామాలు మన మీద అనుకూలంగానో ప్రతికూలంగానో ప్రభావం చూపుతాయి. అందునా ఇరుగు పొరుగుదేశాలన్నీ మనకు దూరంగా జరుగుతున్న తీరు తెలిసి కూడా మన జేమ్స్‌బాండ్ అజిత్ దోవల్ ఏం చేస్తున్నట్లు అన్న ప్రశ్న తలెత్తుతోంది. పసిగట్టి హసీనాను హెచ్చరించినట్లు, లేదని గానీ వార్తలు రాలేదు. ఎందుకు అంటే మన నేతలందరూ ఎన్నికల్లో నిమగమైనట్లు కొందరు వారి తరఫున సంజాయిషీ ఇస్తున్నారు. అంటే ఎన్నికల్లో బిజెపి లబ్దికోసం చూడటం తప్ప దేశం ఇరుగుపొరుగున ఏం జరిగినా పట్టదా ? ఎవరి పని వారు చేయాలి. ఎక్కడో మన ”రా” ఏజంట్లు మన వ్యతిరేకులను లేపేశారంటే ఎంత గొప్పో అని పొగిడేవారు, ఇప్పుడా ఏజంట్లు బంగ్లాదేశ్‌లో ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగారా ?దేశం సురక్షితమైన నరేంద్రమోడీ చేతుల్లో ఉందని, అమెరికాను సైతం మెడలు వంచగల విశ్వగురువుగా భావించేవారు, పొగిడేవారు గానీ ఇప్పుడేం చెబుతారు ?
టిబెట్ చరిత్రను చూసినపుడు అది చైనాలో భాగంగా ఉన్న సామంత రాజ్యంగా(మన దేశంలో నిజాం హైదరాబాదు సంస్థానం మాదిరి) ఉంది తప్ప స్వతంత్రదేశంగా ఎన్నడూ లేదు. చైనాలో ఒక స్వయం పాలిత ప్రాంతం. బౌద్దంలో లామా అంటే గురువు లేదా బోధకుడు. కేంద్రంగా ఉండే దలైలామా చైనా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రాక ముందు టిబెట్‌లో లామాల మార్గదర్శనంతో పాలనా వ్యవహారాలు సాగేవి. తరువాత ఆ పాలన స్థానంలో పౌరపాలనా వ్యవస్థ ఏర్పాటుకు 14వ దలైలామాతో సంప్రదించి 1951లో 17 అంశాలతో కూడిన ఒప్పందానికి చైనా కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఆ క్రమం పూర్తిగాక ముందే 1959లో 14వ దలైలామా తిరుగుబాటు ప్రకటించటం, దాన్ని చైనా ప్రభుత్వం అణచివేయటం అదే ఏడాది ఏప్రిల్ 18న అమెరికా సిఐఏ పర్యవేక్షణ, భారత ప్రభుత్వ సహకారంతో నేటి అసోంలోని తేజ్‌పూర్ దగ్గర మనదేశంలోకి వచ్చాడు. అమెరికా,బ్రిటన్ ఏజంట్లు ఒక పధకం ప్రకారం వ.ునదేశానికి చేర్చారు. రాజకీయ ఆశ్రయం ఇప్పించారు. 1956లోనే దలైలామా మన బుద్ద జయంతి కార్యక్రమం పేరుతో మనదేశం వచ్చి ఒకవేళ కోరితే తనకు రాజకీయ ఆశ్రయం ఇస్తారా అని నెహ్రూను అడగ్గా చైనాతో ఉన్న సంబంధాల రీత్యా అది కుదరదని సున్నితంగా తిరస్కరించారు. అయితే మూడు సంవత్సరాల తరువాత అదే నెహ్రూ ఎందుకు అంగీకరించారంటే సిఐఏ తెచ్చిన వత్తిడికి లొంగారన్నది స్పష్టం. అతనేమీ దేశాధినేత కాదు, మనదేశంతో రాజకీయంగా, అధికారికంగా ఎలాంటి సంబంధాలు లేవు.షేక్ హసీనా వచ్చిన నేపధ్యం భిన్నం. విద్యార్థుల ఆందోళన ముసుగులో అక్కడి మిలిటరీ దేశం వదలి వెళ్లాలని ఆదేశించటం, వారే ఒక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసి మన దేశానికి పంపించారు.(గతంలో లాటిన్ అమెరికాలోని హొండూరాస్‌లో అధ్యక్షుడు జెలయా మీద తిరుగుబాటు చేసిన మిలిటరీ జెలయాతో పాటు నిద్ర మంచాల మీద ఉన్న భార్యను కూడా బలవంతంగా తీసుకువెళ్లి పక్కనే ఉన్న కోస్టారికా అనేదేశంలో వదలి వచ్చారు)మానవహక్కులు, ప్రజాస్వామ్యం పేరుతో నాడు దలైలామాకు ఆశ్రయం ఇవ్వటాన్ని సమర్ధించే బిజెపి ఇప్పుడు మనదేశానికి మిత్రురాలిగా ఉన్న హసీనాకు అలాంటి ఏర్పాటుకు ఎందుకు తటపటాయిస్తున్నట్లు ?
హసీనా ప్రజాస్వామ్యాన్ని అణచి ప్రతిపక్షాలను వేధించారని ఆలాంటి వ్యక్తికి ఆశ్రయం ఎందుకు ఇవ్వాలని కొందరు వాదిస్తున్నారు. నిజమే, అది వారి అంతర్గత వ్యవహారం.మన దేశం ఎవరికీ రాజకీయ ఆశ్రయం కల్పించలేదా ? జోక్యం చేసుకోలేదా ? 1971లో బంగ్లాదేశ్ విముక్తికి మన మిలిటరీని నడిపాము. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. గయూమ్ కోరిక మేరకు ఆపరేషన్ కాక్టస్ పేరుతో ఆగ్రా వైమానిక దళ కేంద్రం నుంచి ఐదు వందల మంది పారా ట్రూపర్లను నేరుగా మాల్దీవుల్లో దించి మనదేశం కుట్రను విఫలం గావించింది. అనేక మంది కుట్రదారులను కాల్చి చంపి, కొందరిని బందీలుగా పట్టుకుంది. అబ్దుల్ గయూమ్ ప్రజాస్వామిక స్వేచ్చకు తిలోదకాలిచ్చి 2008లో ఓడిపోయే వరకు పదవిలో కొనసాగాడు. అతడి మీద జరిగిన కుట్రను భారత్ అడ్డుకొని అధికారంలో కొనసాగించింది. తరువాత అధ్యక్షుడు నషీద్ మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తటంతో జనంలో నిరసన తలెత్తి చివరకు 2012లో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నాడు. జనం ఛీకొట్టిన నషీద్ మనదేశంతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. దీన్ని ఎలా చూడాలి ? దలైలామా పాలనలో ఫ్యూడల్ శక్తులు టిబెటన్లను అణచివేసిన తీరు ప్రపంచానికి, మనదేశానికి తెలియదా ? ఏ దలైలామా ఏలుబడిలోనైనా అక్కడసలు ఎన్నికలు, ప్రజాస్వామిక పౌరపాలన ఉందా ? లేనపుడు దలైలామాకు ఆశ్రయం ఇవ్వటాన్ని బిజెపి ఇతర శక్తులు ఎలా సమర్థిస్తున్నట్లు ? అందువలన ఆ కారణం తర్కానికి నిలవదు. దలైలామా కమ్యూనిస్టులను ఎదిరించాడు గనుక మనదేశంలో ఉన్న కొన్ని శక్తులకు కమ్యూనిజం, చైనా అంటే వ్యతిరేకత గనుక మన శత్రువు శత్రువు మనకు మిత్రుడన్నట్లుగా దలైలామాకు ఆశ్రయం ఇచ్చారని చెబుతారా ? ఆ చర్యతో చైనాతో అదనపు తగాదా కొని తెచ్చుకోవటం తప్ప మనదేశానికి ఒరిగిందేమైనా ఉందా ? ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న శక్తులు మనదేశానికి మిత్రులా ? వారిని మన ప్రభుత్వం సమర్థిస్తున్నదా ? అక్కడ మతశక్తులు రెచ్చిపోయి మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద దాడులు చేస్తున్నారని, దేవాలయాలను కూల్చివేస్తున్నారని బిజెపి అనుకూల శక్తులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అవి చేసింది ఎవరు ? హసీనాను వ్యతిరేకించే, మనదేశాన్ని శత్రువుగా చూసే శక్తులే ? హసీనా ఏలుబడిలో అలాంటి ఉదంతాలేమీ లేవు గనుక ఆమెకు మద్దతు ఇచ్చి ఒక మంచి సందేశాన్ని మోడీ ఎందుకు పంపలేకపోతున్నారు ?
బంగ్లాదేశ్‌లో పాలకులను మార్చి భారత పలుకుబడిని తగ్గించాలని పాకిస్తాన్, చైనా చూస్తున్నదని దానిలో భాగంగా హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన వెనుక వాటి హస్తం ఉందని, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాతే ఇస్లామీ విద్యార్థి విభాగంతో చేతులు కలిపియాన్నది ఒక కథనం. వాటికి నిర్దిష్ట ఆధారాలు లేకపోయినా నడుస్తున్న భూ భౌతిక రాజకీయాలను చూసినపుడు ఈ కోణాన్ని చూడాలని చెబుతున్నారు. వాస్తవం ఏమిటి ? తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల వెనుక పాక్ హస్తం ఉందని తరచూ హసీనా గతంలో బహిరంగంగానే ప్రకటించించారు గాని చైనా గురించి అలాంటివేమీ లేవు. చైనా వైపు మొగ్గుచూపుతున్న కారణంగా ఆమె ప్రభుత్వాన్ని కూల్చివేశారని మరొక విశ్లేషణ. తొలిసారిగా బంగ్లాదేశ్‌తో కలసి చైనా మిలిటరీ విన్యాసాలు జరపాలని నిర్ణయించటం భారత్, అమెరికాలకు ఆందోళన కలిగించిందన్నది ఒక అంశం.(2009 నుంచి 2023వరకు హసీనా ఏలుబడిలో భారత్-బంగ్లాదేశ్ మిలిటరీ సంయుక్త విన్యాసాలు పదకొండుసార్లు జరిగాయి. వీటిని చైనా తనకు వ్యతిరేకం అని భావించి ఉంటే బంగ్లాదేశ్‌లో భారీమొత్తాలను పెట్టుబడులుగా పెడుతుందా ?) అంతే కాదు కాక్స్‌బజార్ ప్రాంతంలోని పెకూ వద్ద ఒక జలాంతర్గామి కేంద్రాన్ని నిర్మించేందుకు హసీనా సర్కార్ చైనాకు అనుమతివ్వటం,మింగ్ తరగతికి చెందిన రెండు జలాంతర్గాములను బంగ్లాదేశ్ కొనుగోలు చేయటం మీద కూడా అమెరికా ప్రతికూలంగా స్పందించింది. దీనికి తోడు చైనా నుంచి ఇతర మిలిటరీ పరికరాలు, ఆయుధాలు కొనుగోలు చేయటం వంటి అంశాలను చైనా వైపు మొగ్గుచూపటంగా విశ్లేషకులు పేర్కొన్నారు. మరి అది నిజమైతే తాజా పరిణామాల వెనుక పాకిస్తాన్ హస్తం లేదా అమెరికా కుట్ర వుండవచ్చు తప్ప చైనా ఎందుకు ఉంటుంది ? రెండు దేశాల మధ్య 40బిలియన్ డాలర్ల విలువగల ఒప్పందాలు జరిగాయి, వాటిలో సగానికి పైగా పథకాలు నిర్మాణంలో ఉన్నపుడు హసీనాను కూలదోసి మరొకరిని గద్దెమీద కూర్చోపెట్టాల్సిన అవసరం చైనాకు ఉంటుందా ? చైనా తన భాగస్వామిని కోల్పోయిందని వాయిస్ ఆఫ్ అమెరికా పేర్కొన్నది తప్ప భారత మిత్ర ప్రభుత్వాన్ని పోగొట్టుకుంది అనలేదు.
జూన్ నెలలో ధర్మశాలలో ఉన్న దలైలామాను అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ ప్రతినిధులు కలిశారు. ఇది చైనాకు ఆగ్రహం కలిగించినప్పటికీ మోడీ సర్కార్ ఖాతరు చేయలేదు.అధికారికంగా టిబెట్‌ను చైనా అంతర్భాగంగా గుర్తిస్తూనే దలైలామాకు మద్దతు ఇవ్వటం మనదేశం అనుసరిస్తున్న వైఖరి. ఇది అమెరికాను సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు. ఇది నెహ్రూ నాటి నుంచి మోడీ వరకు కొనసాగుతూనే ఉంది. మతనేతగా ఆశ్రయం కల్పించామని చెబుతున్నప్పటికీ దలైలామా, అతగాడితో టిబెట్ నుంచి వచ్చిన వారు చేస్తున్నదంతా రాజకీయం, చైనా వ్యతిరేక కార్యకలాపాలు తప్ప వారు వచ్చి మనదేశంలో చేసే మత కార్యక్రమాలేమిటి ? వారు రాక ముందు మనదేశంలో బౌద్ద మత భిక్షువులు లేరా ? ఆరామాలు లేవా ? బంగ్లా పరిణామాల వెనుక నిజంగా పాక్ హస్తం ఉంటే హసీనాకు ఆశ్రయం కల్పించటానికి తటపటాయించాల్సిన అవసరం ఏమిటి ? పాకిస్తాన్ వైపు నుంచి వ్యతిరేక స్పందనను తట్టుకోలేమని భావిస్తున్నారా ? లేదూ చైనా హస్తమే ఉందని నమ్మితే దలైలామా ప్రవాస ప్రభుత్వాన్నే అనుమతించిన మనదేశం హసీనాకు కనీసం రాజకీయ ఆశ్రయమైనా ఎందుకు వెంటనే ప్రకటించలేదు ? అనేక మంది అనుమానిస్తున్నట్లు లేదా తాజాగా తన పతనం వెనుక అమెరికా హస్తం ఉందని ఆమె మన దేశంలో ఒక ప్రకటన ద్వారా గళం విప్పారు. అంటే ఇవన్నీ తెలిసే 56 అంగుళాల ఛాతీ ఉన్న నరేంద్రమోడీ అమెరికాకు భయపడుతున్నారా ? ఇలా ఆలోచించటం లేదా చర్చించటం, సందేహాన్ని వెలిబుచ్చటం దేశద్రోహమేమీ కాదు.
