Tags
AIADMK, BJP, BJP Appeasement, DMK, Narendra Modi, PMK, politics of iftar, SDPI, Tamilnadu Elections 2026, Tamilnadu politics
ఎం కోటేశ్వరరావు
తమిళనాడులో చరిత్ర పునరావృతమైంది. అధికారం కోసం మరోసారి అన్నాడిఎంకెతో బిజెపి ఎన్నికల ఒప్పందం చేసుకుంది.కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో 2025 ఏప్రిల్ 11న మైత్రీ బంధాన్ని ప్రకటించారు. ఈ కూటమికి అధికారం వస్తుందో రాదో తెలియదుగానీ ఈ పరిణామంతో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలై పదవి మాత్రం పోయింది.అంటే అన్నారని అంటారు గానీ వీరశూర ప్రతిజ్ఞలు చేయాలని అతగాడిని ఎవరైనా కోరారా ? తెలంగాణా ఎలక్షన్ రెడ్డి(తూర్పు జగ్గారెడ్డి) మాదిరి గడ్డం ప్రతిజ్ఞ చేస్తే వేరు. డిఎంకె ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు తాను చెప్పులు ధరించేది లేదంటూ 2024 డిసెంబరు 28న తన ఇంటి ముందు ఆరుసార్లు కొరడా దెబ్బలు కొట్టుకొని పెద్ద ప్రదర్శన చేశారు. అదేమీ లేకుండానే 2025 ఏప్రిల్ 12న చెప్పులు వేసుకున్నారు.ఎందుకంటే అన్నాడిఎంకెతో కలసి బిజెపి విజయానికి ఇప్పటికే అమిత్ షా బాట వేసినందున నిరసన విరమించాలంటూ కొత్త అధ్యక్షుడు నాగేంద్రన్,కేంద్రమంత్రి ఎల్ మురుగన్, ఇతర నేతలు కలసి ఒక కార్యక్రమంలో చెప్పులు అందచేశారు. స్వయంగా పరువు తీసుకోవటం, విధి వైపరీత్యం అంటే ఇదే కదా ! అతగాడితో కలసి పని చేయటం తమకు అంగీకారం కాదని, రాష్ట్ర బిజెపి సారధిగా మరొకరిని పెట్టాలని అన్నాడిఎంకె విధించిన షరతుకు బిజెపి తలొగ్గింది. గతంలో అన్నాడిఎంకె నేతగా ఉన్న నైనార్ నాగేంద్రన్ను ఎంపిక చేసింది. 2019లోక్‌సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేశాయి. తరువాత అన్నామలై బిజెపి అధ్యక్ష పదవి స్వీకరించిన తరువాత మాజీ సిఎం అన్నాదురై, జయలలిత, పళనిస్వామిని పదే పదే రెచ్చగొట్టే విధంగా విమర్శించారు. అతని వ్యాఖ్యలతో మైనారిటీల ఓట్లు పోతాయని కూడా అన్నాడిఎంకె భయపడిరది. ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపిని ఓడిరచేందుకు ఉప్పు నిప్పుగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపి చేతులు కలిపి విజయం సాధించటంతో అదే ఫార్ములాతో తమిళనాడులో కూడా గెలవాలని రెండు పార్టీల నేతలు కొంతకాలంగా ఆలోచనలు చేస్తున్నారు. అడ్డుగా ఉన్న అన్నామలైని తప్పించారు.
అధికారం వస్తుందంటే బిజెపి దేనికైనా సిద్దపడుతుంది. విలువలు, వలువల గురించి కబుర్లు చెప్పే ఆ పార్టీకి ఇతరులకు తేడా లేదు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను కొనసాగిస్తామని స్వయంగా ప్రకటించిన పార్టీ సరిగ్గా ఎన్నికలకు ముందు పదవి నుంచి తప్పించి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని కూర్చోపెట్టింది. ఏడాదిన్నర కావస్తున్నా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోయింది. వ్రతం చెడ్డా ఫలందక్కలేదనట్లు బిజెపి పరిస్థితి తయారైంది. బండి సంజయ్‌ను తొలగించినా మిన్నువిరిగి మీద పడలేదు, ఇప్పుడు అన్నామలైని తొలగించినా అంతే. నోటి దురుసులో ఇద్దరూ ఇద్దరే. తమిళనాడులో ఒక ప్రాంతీయ పార్టీకి అది తోకగా తయారైంది. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరి మధ్యవర్తి పవన్ కళ్యాణ్ లాంటి వారెవరూ లేకపోతే నేరుగా కేంద్ర బిజెపి నాయకత్వం బేరం కుదుర్చుకుంది. ఇటీవల ఆమోదించిన వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకించిన వారిని ముస్లిం సంతుష్టీకరణ పార్టీలుగా వర్ణించింది. వాటిలో అన్నాడిఎంకె ఒకటి. శుభకార్యానికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు ఇప్పుడు బిజెపి నేతలను చంకనెక్కించుకొని ముస్లింల ఓట్లను అర్ధించటం ఆ పార్టీకి పెద్ద పరీక్ష. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ)ని ఉగ్రవాద పార్టీ అని బిజెపి వర్ణించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడిఎంకె మద్దతుతో అది ఒక స్థానానికి పోటీ చేసింది. ఇప్పుడు ఎస్‌డిపిఐ కూటమిలో భాగస్వామిగా కొనసాగితే బిజెపి దాని అభ్యర్థులను ఎలా బలపరుస్తుంది, సమర్ధిస్తుందన్నది ప్రశ్న.ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు ! మమ్మల్ని విమర్శించే వారేమైనా నాలుగు ఓట్లు వేయిస్తారా, ఒకటో అరో సీటు తెప్పిస్తారా !! అనుకున్నట్లుగా ఉంది. రాష్ట్రానికి పాచిపోయిన లడ్లు ఇచ్చారంటూ ధ్వజమెత్తి వాటినే మహాప్రసాదంగా స్వీకరించిన పవన్ కల్యాణ్ మాదిరి అన్నాడిఎంకె నేత పళనిస్వామి కూడా తమిళనాడుకు బిజెపి చేసిన అన్యాయాల గురించి నిన్నటి వరకు ధ్వజమెత్తారు. ఆకస్మికంగా అదే పార్టీతో చేతులు కలిపితే తమిళ తంబీలు ప్రశ్నించకుండా ఉంటారా ? అంతకు ముందు బిజెపితో కలసి ఉన్నపుడు సంకీర్ణ ధర్మంగా సిఏఏను సమర్ధించామని విడిపోయిన తరువాత విమర్శించామని చెప్పుకున్న ఆ పెద్దమనిషిని మైనారిటీలు నమ్ముతారా ? అదే తర్కం ప్రకారం కొద్ది రోజుల క్రితం వ్యతిరేకించిన వక్ప్ చట్టానికి ఇప్పుడు జైకొట్టరనే హామీ ఏమిటి ?సినిమా నటుడు విజయ్ నాయకత్వంలోని టివికె పార్టీతో చేతులు కలపాలని తొలుత అన్నాడిఎంకె భావించి పావులు కదిపింది. విజయ్ అంగీకరించకపోవటంతో స్వంతంగా డిఎంకెను ఓడిరచలేమని గ్రహించి బిజెపిని కలుపుకుంది. బిజెపితో తెగతెంపులు చేసుకున్నా 2024లో మైనారిటీల ఓట్లు రాలేదని అందువలన తిరిగి ఆ పార్టీతో చేతులు కలిపినా నష్టం లేదన్నది అన్నాడిఎంకె అంతర్గత ఆలోచన అని కూడా చెబుతున్నారు.
ఐపిఎస్ అధికారి అన్నామలై (40) 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి 2020 బిజెపిలో చేరారు, 2021లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే పోలీసు అధికారిగా పనిచేశారు. బిజెపిలో చేరగానే ఇతర పార్టీల తోలువలిచి, తాటతీసే మొనగాడిగా సింహం అంటూ ప్రచారం సాగించారు.2024లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరులో డిఎంకె చేతిలో ఓడిపోయారు. కొంగు ప్రాంతంలో బలమైన గౌండర్ సామాజిక తరగతిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అన్నాడిఎంకె నేత ఎడప్పాడి కె పళనిస్వామి కూడా అదే ప్రాంతం, అదే సామాజిక తరగతికి చెందిన వ్యక్తి. అన్నామలై బిజెపి అధ్యక్షుడిగా ఉంటే పొత్తు ఉండదని కరాఖండితంగా చెప్పటంతో బిజెపి అగ్రనాయకత్వం దిగిరాక తప్పలేదు. కేంద్ర పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇస్తామని అమిత్ షా గట్టిగా చెప్పలేదు, మా గురించి మీకెందుకు ఆందోళన అంటూ విలేకర్లను ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ ఆ హోదాతో తమిళనాడులో చక్రం తిప్పాలనుకుంటే పళనిస్వామి అంగీకరిస్తారా అన్నది అనుమానమే. పార్టీ పదవి నుంచి తొలగించటాన్ని అన్నామలై అభిమానులు వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు. అన్నాడిఎంకెతో పొత్తు వార్తలు వెలువడిన సమయంలో ఉద్వాసన ఖాయమని తేలటంతో విధిలేక తాను మరోసారి రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయటం లేదని ప్రకటించారు.
2024లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడిఎంకె,బిజెపి విడివిడిగా పోటీ చేశాయి.ఈ రెండు కూటముల ఓట్లు కలిస్తే 13లోక్‌సభ నియోజకవర్గాలలో మెజారిటీ వచ్చిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ముందుగానే ఒప్పందం చేసుకొని కలసి పోటీ చేస్తే అధికారం ఖాయమనే అభిప్రాయంతో అవి కలిశాయి.లోక్‌సభ ఓటింగ్ వివరాలను చూసినపుడు త్రిముఖ పోటీ జరిగింది. డిఎంకె నాయకత్వంలోని కూటమి మొత్తం 39 స్థానాలను గెలుచుకుంది.ఇండియా కూటమికి 46.97, అన్నాడిఎంకె కూటమి 23.05, బిజెపి కూటమి 18.28,ఎన్‌టికె అనే ప్రాంతీయ పార్టీ 8.2శాతం చొప్పున ఓట్లు పొందాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ చూస్తే మొత్తం 234కు గాను ఇండియా కూటమి 221, అన్నాడిఎంకె 10, బిజెపి కూటమి మూడు సీట్లలో మెజారిటీ తెచ్చుకున్నాయి. అయితే బిజెపికి ఒక్క సీటులోనూ మెజారిటీ రాలేదు, దానితో కలసి పోటీ చేసిన పిఎంకె మూడు చోట్ల ఆధిక్యత కనపరిచింది.లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ తమిళనాడును ఏడుసార్లు సందర్శించినా ఫలితం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం,జనసేన, బిజెపి పరస్పరం ఎలా తిట్టుకున్నాయో 2019 ఎన్నికల్లో చూశాము. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనుసరించిన అప్రజాస్వామిక, కక్షపూరితమైన, బిజెపికి లంగుబాటు వైఖరిని, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయటం వంటి తీరును డిఎంకె నేత ఎంకె స్టాలిన్ అనుసరించలేదు. అన్నింటికీ మించి తమిళనాడుకు చేసిన అన్యాయం, డీలిమిటేషన్, హిందీని బలవంతంగా రుద్దేందుకు పూనుకున్న బిజెపిని ఎలాంటి తొట్రుపాటు లేకుండా వ్యతిరేకించి ఎండగడుతున్నారు.అందువలన ఆంధ్రప్రదేశ్ మాదిరి ఫలితాలను ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. ప్రముఖ హీరో విజయ్ స్వంత దుకాణం పెట్టుకొని బిజెపి, ఇండియా కూటమి రెండిరటినీ వ్యతిరేకిస్తానని ప్రకటించాడు. అన్నాడిఎంకె నుంచి ఉద్వాసనకు గురైన పన్నీర్ సెల్వం,టిటివి దినకరన్ వంటి వారు ఏ వైఖరి తీసుకుంటారో వెల్లడి కాలేదు. డీలిమిటేషన్, భాషా సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అన్నాడిఎంకె, బిజెపి మిత్రపక్షమైన పిఎంకె కూడా మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు బిజెపితో కలసి ఈ పార్టీలు ఈ అంశాలపై జనానికి ఏం చెబుతాయన్నది ప్రశ్న. ఇలాంటి తలనొప్పులు ఇండియా కూటమి పార్టీలకు లేదు. ఒకే మాట, బాటలో నడుస్తున్నాయి. వీటిని వ్యతిరేకించే పార్టీలకు డిఎంకెను గద్దె దించటం తప్ప ఎలాంటి భావసారూప్యత లేదు.
ఇతర పార్టీల వారు ఇప్తార్ పార్టీలకు వెళితే ముస్లింలను సంతుష్టీకరించేందుకు అని బిజెపి దాడి చేస్తుంది. మరి అదే పార్టీ ఈ ఏడాది ఏకంగా ఇప్తార్ విందు ఏర్పాటు చేసింది, ఎందుకు అంటే తమకు అందరూ ఒకటే అని చెప్పింది. దీన్నే తాము చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారం అంటారు. అన్నాడిఎంకెతో చేతులు కలపటం గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే అన్నామలై ఏర్పాటు చేసిన ఇప్తార్ విందుకు బిజెపి మిత్రపక్ష నేతలైన మాజీ సిఎం పన్నీర్ సెల్వం, టిటివి దినకరన్ తదితర నేతలు హాజరయ్యారు. ఇప్తార్ విందు కేవలం ప్రారంభం మాత్రమే, మేమంతా కలసి కూర్చుని ఐక్యమై తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అదే విందుకు వచ్చిన మాజీ తెలంగాణా గవర్నర్ తమిళశై సౌందర్‌రాజన్ అన్నారు.తనకు అధికారమిస్తే ఇప్తార్‌తో పాటు దీపావళి, క్రిస్మస్ విందులను అధికారికంగా ఇస్తానని అన్నామలై చెప్పుకున్నాడు. ఇతర బిజెపి అధ్యక్షుడు ఎవరైనా ఇప్తార్ ఇచ్చారా అని విలేకర్లతో గొప్పగా చెప్పుకున్నాడు. అర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన ముస్లిం నేషనల్ ఫోరమ్ దేశవ్యాపితంగా ఇప్తార్ విందులు ఇస్తామని గతంలో ప్రకటించింది.రెండు కత్తులు ఒకే వరలో ఇమడవు అన్నట్లు, ఒకే సామాజిక తరగతి, ఒకే ప్రాంతానికి చెందిన నేతలు కూడా అంతే. దీనికి తోడు అన్నామలై 2023లో మాజీ సిఎం అన్నాదురై, జయలలిత, పళనిస్వామి గురించి చేసిన వ్యాఖ్యలు అప్పుడు అన్నాడిఎంకె వేరుపడటానికి కారణమైతే ఇప్పుడు అతగాడిపదవికి ఎసరు తెచ్చినట్లు చెబుతున్నారు. అప్పుడు అన్నామలై బిజెపి నేతలకు కొత్తదేవుడిగా కనిపించటంతో అన్నాడిఎంకెను వదులుకొనేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మోజు రింది గనుక అదే పార్టీతో చేతులు కలిపేందుకు పక్కన పెట్టారు. ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందన్నది పెద్ద ప్రశ్న !
