ఎం కోటేశ్వరరావు
‘‘ దేశభక్తులుగా ఉండండి, దేశంలో ఉన్న సమస్యలను చేపట్టండి :బాంబే హైకోర్టు ’’ మీడియా వార్తల్లో వచ్చిన ఒక శీర్షిక ఇది. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండకు నిరసనగా అజాద్ మైదానంలో తలపెట్టిన ప్రదర్శనకు ముంబై పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ చర్యకు వ్యతిరేకంగా సిపిఐ(ఎం) దాఖలు చేసిన పిటీషన్ను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.సిపిఎం తరఫున మానవ, పౌరహక్కుల సీనియర్ న్యాయవాది మిహిర్ దేశాయ్ వాదించారు. కోర్టు నిర్ణయం సరైనదా కాదా అన్నది ఒక అంశమైతే ఈ సందర్భంగా డివిజన్ బెంచ్‌లోని న్యాయమూర్తులు రవీంద్ర ఘాగే, గౌతమ్ అఖద్ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేసేవిగా, ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. అవి రాజ్యాంగ వ్యతిరేకమైనవని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో విమర్శించింది. ఎస్‌ఎం గోరవాద్‌కర్ అనే సీనియర్ న్యాయవాది సిపిఎం ప్రకటన నేరపూరితంగా ఉందని, న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించేదిగా ఉన్నందున కోర్టే స్వయంగా చర్య తీసుకోవాలని ఆగస్టు నాలుగవ తేదీన ఒక పిటీషన్ దాఖలు చేశారు. ఎలాంటి చర్యలు అవసరం లేదంటూ కోర్టు దాన్ని కొట్టివేసింది.
ఇటీవలి కాలంలో కోర్టులు ఇస్తున్న తీర్పులు, ఆదేశాలు అనేకం వివాదాస్పదం అవుతున్నాయి. విచారణల సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు కూడా విమర్శలకు దారితీస్తున్నాయి. తాజా ఉదంతానికి వస్తే అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ప్రశాంతకుమార్ క్రిమినల్ కేసులను విచారించకూడదంటూ సుప్రీం కోర్టు డివిజన్ బెంచి ఇచ్చిన ఆదేశం వివాదాస్పదమైంది. ఈ ఆదేశాన్ని అమలు జరపకుండా చూసేందుకు కోర్టు మొత్తాన్ని సమావేశపరచాలని పదమూడు మంది అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు చీఫ్ జస్టిస్ అరుణ్ భన్సాలీకి లేఖ రాశారు. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ జోక్యం చేసుకోవటంతో గతంలో ఇచ్చిన ఉత్తరువును కోర్టు వెనక్కు తీసుకుంది. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందన్నది కీలకమైన అంశం.మణిపూర్ హైకోర్టు తన పరిధిలో లేని గిరిజనేతరులను గిరిజనులుగా మార్చే రిజర్వేషన్ల అంశంపై జారీ చేసిన ఆదేశాలతో ఆ రాష్ట్రంలో వ్యతిరేకులు, అనుకూల సామాజిక తరగతుల మధ్య తలెత్తిన ఘర్షణలు, దాడులతో 2023 మే మూడవ తేదీ నుంచి రాష్ట్రంలో అల్లకల్లోలం తలెత్తింది, ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉంది, ఎప్పుడు సాధారణ పరిస్థితి నెలకొంటుందో తెలియని స్థితి. దీనికి మూలం కోర్టు ఆదేశాలే. న్యాయమూర్తులందరూ పత్తిత్తులు కాదని గతంలో కొందరు, తాజాగా హైకోర్టు జస్టిస్ యశ్వంతవర్మ ఉదంతం వెల్లడిరచింది. జ్యుడిషియల్ యాక్టివిజమ్(న్యాయమూర్తుల ఆచరణతత్వం) రెండంచుల పదనుగల కత్తి వంటిది. చట్టంలో దీనికి అవకాశం ఉందా లేదా పరిధి ఏమిటి అన్నది ఒక చర్చ. ఈ యాక్టివిజమ్‌లో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని విమర్శలకు, మరికొన్ని ప్రశంసలకు అర్హమైనవి. బాంబే హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు మొదటి కోవకు చెందినవని చెప్పవచ్చు. తీర్పులను విమర్శించే స్వేచ్చ మనకు రాజ్యాంగం కల్పిస్తున్నది గానీ న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించకూడదు. ఇంతకూ సిపిఎం తన ప్రకటనలో చేసిన వ్యాఖ్యలేమిటి ? దాని పూర్తి పాఠం దిగువ విధంగా ఉంది.
‘‘ రాజ్యాంగ వ్యతిరేకమైన బాంబే హైకోర్టు వ్యాఖ్యలకు ఖండన
గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ మారణకాండకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ు అనుమతించని ముంబై పోలీసు చర్యను సవాలు చేస్తూ పార్టీ దాఖలు చేసిన దరఖాస్తును తిరస్కరించిన సందర్భంగా బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ సందర్భంగా పార్టీ దేశభక్తిని ప్రశ్నించేవరకూ కోర్టు వెళ్లింది. ఒక రాజకీయ పార్టీకి రాజ్యాంగం ప్రసాదించిన అంశాల గురించి లేదా పాలస్తీనియన్లు మరియు వారి న్యాయబద్దమైన మాతృభూమి హక్కుకు మన దేశం మరియు మన పౌరులు ప్రదర్శించిన సంఫీుభావ చరిత్ర గురించి గానీ హైకోర్టుకు తెలియనట్లుగా కనిపించటం హాస్యాస్పదంగా ఉంది. కోర్టు వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా స్పష్టమైన రాజకీయ వివక్షతో కూడినవిగా ఉన్నాయి. కోర్టు బెంచ్ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి, ‘‘ పాలస్తీనా లేదా ఇజ్రాయెల్ పక్షానికి అనుకూలంగా గానీ ఇచ్చే మద్దతు రేపే దుమ్ము(వివాదం) గురించి మీకు తెలియదు. మీరెందుకు ఇలా చేయాలని కోరుకుంటున్నారు. మీరు ప్రాతినిధ్యం వహించే పార్టీ చర్య దేశ విదేశీ వ్యవహారాలకు చేసేదేమిటో మీకు అర్ధం కావటం లేదని స్పష్టంగా కనిపిస్తున్నది. మీ సంస్థ భారత్‌లో నమోదైన వాటిలో ఒకటి. చెత్త కుమ్మరింపు, కాలుష్యం, మురుగు, వరదల వంటి అంశాలను మీరు తీసుకోవచ్చు. మేం కొన్ని ఉదాహరణలు మాత్రమే చెబుతున్నాం. మీరు వాటి మీద నిరసనలు తెలపటం లేదు కానీ దేశానికి కొన్నివేల మైళ్ల దూరంలో జరుగుతున్నదాని మీద చేస్తున్నారు.’’
గత శతాబ్ది 40వ దశకంలో మహాత్మాగాంధీ, జాతీయోద్యమం, తరువాత స్వతంత్ర భారత్ విదేశాంగ విధానం గానీ పాలస్తీనియన్ల స్వేచ్చాహక్కు మరియు మాతృభూమికి మద్దతు ఇవ్వటానికి సంకోచించలేదు. ఐరాస సంస్థలు మరియు అంతర్జాతీయ న్యాయస్థానం వెల్లడిరచిన వైఖరులు మరియు ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాపితంగా అసందిగ్దంగా తెలుపుతున్న మద్దతు వాస్తవాన్ని గానీ కోర్టు గుర్తించినట్లు లేదు. స్వేచ్చ, ప్రజాస్వామ్యాలను ప్రేమించే దేశ పౌరులు ఇలాంటి గర్హÛనీయమైన వైఖరిని ఎలాంటి శషభిషలు లేకుండా తిరస్కరించేందుకు మాతో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ’’ అని పేర్కొన్నది.
బాంబే హైకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సిపిఐ(ఎం) తన ప్రకటనలో ప్రస్తావించలేదు. మీడియాలో వచ్చిన వార్తల్లోని అంశాలు కొన్ని దిగువ విధంగా ఉన్నాయి. ‘‘ మన దేశానికి చాలా సమస్యలున్నాయి. ఇలాంటి వాటిని మేము కోరుకోవటం లేదు. మీరు సంకుచిత దృష్టితో ఉన్నారని చెప్పాల్సి వచ్చి నందుకు నేను విచారిస్తున్నాను. మీరు గాజా మరియు పాలస్తీనా సమస్యలను చూస్తున్నారు మీ స్వంత దేశం గురించి చూడండి.దేశ భక్తులుగా ఉండండి, ఇది దేశభక్తి కాదు.(డెక్కన్ హెరాల్డ్)’’ సిపిఐ(ఎం) చేసిన ప్రకటన కోర్టులను ధిక్కరించేదిగా, న్యాయవ్యవస్థ మీద విశ్వాసాన్ని పోగొట్టేదిగా ఉన్నందున స్వయంగా హైకోర్టు చర్య తీసుకోవాలని కోరుతూ సీనియర్ న్యాయవాది ఎస్‌ఎం గోరవాద్‌కర్ దాఖలు చేసిన దరఖాస్తును హైకోర్టు కొట్టి వేసింది. ఎలాంటి చర్యలూ అవసరం లేదని పేర్కొన్నది, తమ వ్యాఖ్యల మీద ఆ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడిరచిందని మాత్రమే చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులు వెల్లడిరచిన అభిప్రాయాలను ఆసరా చేసుకొని ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్ కమ్యూనిస్టుల మీద మరోసారి విషం కక్కింది.ఆధారం లేని ఆరోపణలు చేసింది. వారెప్పుడూ రష్యా, చైనాలకు విధేయులుగా ఉంటారని వ్యాసకర్త సెలవిచ్చారు. దశాబ్దాల నాటి మైండ్ సెట్ నుంచి ఇంకా బయటపడినట్లు లేదు, రష్యాను కూడా కమ్యూనిస్టు దేశంగా ఇప్పుడు కూడా పేర్కొన్నారు. పాడిరదే పాడరా అన్నట్లుగా అరిగిపోయిన రికార్డును మళ్లీ వినిపించారు.
‘‘ పాలస్తీనా పక్షం లేదా ఇజ్రాయెల్ పక్షానికి అనుకూలంగా గానీ ఇచ్చే మద్దతు రేపే దుమ్ము(వివాదం) గురించి మీకు తెలియదు ’’ అంటూ సిపిఎంకు చెప్పిన సుభాషితం ప్రధాని నరేంద్రమోడీకి వర్తిస్తుందా ? ఆయన దేశభక్తుడా కాదా ? హమస్ సాయుధులు 2023 అక్టోబరు ఏడవ తేదీన గాజా నుంచి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1,195 మందిని చంపి 251 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి హమస్ సాయుధులను పట్టుకొనే పేరుతో ఇజ్రాయెల్ మిలిటరీ జరుపుతున్నదాడుల్లో ఇప్పటి వరకు 61వేల మందిని చంపారు, వారిలో సగానికి పైగా పిల్లలు, మహిళలు. మరో లక్షా 52వేల మందిని గాయపరిచారు. లక్షలాది ఇండ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలను నేలమట్టం గావించారు. గాజా ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు పూనుకున్నారు. హమస్ చర్యను మనదేశంలో ఏ ఒక్క పార్టీ కూడా సమర్ధించలేదు. పాలస్తీనియన్ల మీద, వారికి ప్రాతినిధ్యం వహించే సాయుధ సంస్థలతో ఇజ్రాయెల్ మిలిటరీ, దాని మద్దతు ఉన్న సాయుధ బృందాల మధ్య దాడులు, ప్రతిదాడులు ఈ నాటివి కాదు. వాటి కొనసాగింపుగా హమస్ దాడులు చేసింది, నిరాయుధులుగా ఉన్న పాలస్తీనా పౌరులు లేదా ఇజ్రాయెల్ పౌరులను చంపటం ఎవరు చేసినా తప్పే. హమస్ దాడుల గురించి గుండెలు బాదుకుంటున్నవారు, గడచిన ఎనిమిది దశాబ్దాలుగా పాలస్తీనా ఆక్రమణకు పూనుకోవటం, ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండ గురించి పల్లెత్తు మాట్లాడటం లేదు.హమస్ దాడి తరువాత మన ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా మాట్లాడారు, దానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. పాలస్తీనియన్లను హత్య కావించటం తప్పు అంటారే తప్ప దానికి బాధ్యురాలైన ఇజ్రాయెల్‌ను ఇంతవరకు ఖండిరచలేదు. మనదేశంలో ఎన్నో సమస్యలుండగా ఎక్కడో జరిగిన వాటి మీద నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని దేశంలో ప్రతిపక్షాలన్నీ తప్పు పట్టాయి. హైకోర్టు న్యాయమూర్తుల సుభాషితాల ప్రకారం మోడీ నోరు మూసుకొని ఉండాలి కదా, ఎందుకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా మాట్లాడినట్లు ? రాజ్యాంగం ప్రకారం ప్రధాని ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఇజ్రాయెల్ పట్ల గత ప్రభుత్వాలు తీసుకున్న వైఖరికి భిన్నంగా వ్యవహరించి ‘‘ దుమ్ము(వివాదం)’’ రేపారు. తమ మీద తిరుగుబాటు చేసి భారత్‌లో ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన దలైలామా 90వ జన్మదినోత్సం, అంతకు ముందు అరుణాచల్ ప్రదేశ్ సందర్శన సందర్భంగా చైనా అభ్యంతరాలు తెలిపినా మన ప్రభుత్వం, ప్రధాని కూడా ఖాతరు చేయలేదు, అది రెండు దేశాల మధ్య ‘‘దుమ్ము ’’ రేపింది. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌లో అధికారానికి వచ్చిన చైనా వ్యతిరేక ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి తన ప్రతినిధిని పంపి బిజెపి ‘‘ దుమ్ము ’’ రేపింది. ప్రధానిగా ఉంటూ అమెరికా పర్యటనకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సత్కారాలు పొంది తిరిగి రావాల్సిన నరేంద్రమోడీ అబ్‌కీబార్ ట్రంప్ సర్కార్ అని పిలుపిచ్చి ‘‘ దుమ్ము ’’ రేపారు. ఈ చర్య అమెరికా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం, మన విదేశాంగ విధానానికి వ్యతిరేకం.
ఒక పార్టీ నేతగా ప్రధాని మోడీకి ఇజ్రాయెల్‌ను సమర్ధించే హక్కు ఉన్నపుడు మరో పార్టీకి విమర్శించే, నిరసించే హక్కు ఉంటుందని న్యాయమూర్తులకు తెలియదా ? అధికారంలో ఉన్న పార్టీ అడుగుజాడల్లోనే నడవాలా ? అమెరికా మొదలు ఆస్ట్రేలియా, ఐరోపా నుంచి ఆఫ్రికా వరకు అన్ని ఖండాలు, దేశాలలో లక్షలాది మంది పాలస్తీనియన్ల మీద సాగిస్తున్న మారణకాండకు పలు రూపాల్లో నిరసన తెలుపుతున్న అంశాన్ని న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోరా ? ఆ దేశాల్లో వారికి స్థానిక సమస్యలు లేక లేదా పనిపాటలు లేక అంతర్జాతీయ అంశం మీద స్పందిస్తున్నారా ? వియత్నాం మీద యుద్ధానికి వ్యతిరేకంగా స్వంత ప్రభుత్వ తీరునే తప్పు పడుతూ అమెరికాలో పెద్ద ఉద్యమమే నడిచిన చరిత్రను మరువగలమా ? మానవత్వం, మానవహక్కులను పరిరక్షించాలన్న వాంఛ ఈ నిరసనల్లో ఉందని న్యాయమూర్తులు గ్రహించలేని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పుట్టిన తరాలలో గత చరిత్ర, ప్రజా ఉద్యమాలకు అంతర్జాతీయ సంఫీుభావం వంటి అంశాల పట్ల ఆసక్తి లేదు. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తరువాత సంకుచిత ధోరణలు మరింతగా పెరుగుతున్నాయి. దీనికి సమాజంలో ఎవరూ మినహాయింపుగా కనపడటం లేదు. మణిపూర్‌లో 2023 మే 3వ తేదీ నుంచి ప్రారంభమైన హింసాకాండలో ఒక మహిళను వివస్త్రను గావించి ఊరేగించిన దుర్మార్గం జరిగినప్పటికీ తెలిసి కూడా ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోలేదు. ఆ ఉదంతం సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన తరువాత జూలై మూడున మరోమార్గం లేక నోరు విప్పాల్సి వచ్చింది. రెండు సంవత్సరాలు దాటిన తరువాత కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించేందుకు తీరికలేని ప్రధాని ఈ కాలంలో అనేక దేశాలను సందర్శించి ప్రసంగాలు చేసి వచ్చారు. ఈ తీరు న్యాయమూర్తులకు పట్టదా ? స్వదేశీ సమస్యలను పట్టించుకోండి, దేశభక్తుడిగా ఉండండి అని మోడీకి సలహా ఇవ్వగలరా !
