Tags
Awami League, Bangla Hindus, BJP, coup against Sheikh Hasina, Coup In Bangladesh, CPI(M), Narendra Modi Failures, RSS
ఎం కోటేశ్వరరావు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన, ఆమెను దేశం నుంచి వెళ్లగొట్టిన సందర్భంగా జరిపిన హింసాకాండ గురించి, దానిలో భాగంగా అక్కడ మైనారిటీలైన హిందువులపై జరిపిన దాడుల వార్తలతో మనదేశంలో అనేక మంది ఆందోళన వెలిబుచ్చారు. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకొనేందుకు చూసే బాపతు మాదిరి కొందరు ప్రయత్నించారు. ”హిందువుల ఊచకోత, మారణహౌమం ” ఇటీవలి పరిణామాలపై మన మీడియాలో వచ్చిన కొన్ని శీర్షికలివి.ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్ 2024 ఆగస్టు 13వ తేదీన వెబ్ ఎడిషన్‌లో ” బంగ్లాదేశ్‌లో హిందూ జాతి సంహారం : మతహింస క్రూరత్వ వాస్తవం ” అనే పేరుతో ఒక విశ్లేషణ చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన దాడులను మనదేశంలోని అన్ని పార్టీలు బిజెపి మాదిరే ఖండించాయి. ఖండించాల్సిందే, బంగ్లా ప్రభుత్వానికి మన ఆందోళన వెల్లడించాల్సిందే. బంగ్లా హిందువులే కాదు, పాకిస్తాన్‌లో హిందువులు, క్రైస్తవులు, శ్రీలంక హిందువులు, ముస్లిం, క్రైస్తవులు, మయన్మార్ రోహింగ్యాలు ఇలా ఏ దేశంలో మైనారిటీలపై దాడులు జరిగినా మానవతా పూర్వక స్పందన ఉండాల్సిందే. బంగ్లా పరిణామాలు, వాటి తీరుతెన్నులను వివరించటం, పోలికలు తేవటం, వాస్తవాలివి అని చెప్పటం అంటే దాడుల తీవ్రతను తక్కువ చేసి చూపటం కాదు. ప్రతి భాషలోనూ తీవ్రతను వెల్లడించే పద ప్రయోగాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో పోలికలు కూడా తెలిసిందే.బంగ్లాదేశ్ పరిణామాల సందర్భంగా హిందూత్వనేతలు, సంస్థలు ఒక పోలికను తెచ్చాయి. ఎక్కడో పాలస్తీనాలో ఇజ్రాయెల్ జరుపుతున్నదాడులను ఖండిస్తూ ఇక్కడ ప్రదర్శనలు జరుపుతున్నవారు మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్నదాడులకు వ్యతిరేకంగా ఎందుకు ప్రదర్శనలు చేయటం లేదు అని ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమంలో ఊరూపేరూలేని పోస్టులతో రెచ్చగొడుతూ ప్రతికూల మనోభావాలను, ముస్లింల పట్ల విద్వేషాన్ని రేకెత్తించేందుకు చూస్తున్నారు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటారు. ఈ ప్రశ్నను అడిగేవారు రెండు రకాలు. మొదటి రకం జనాలు నిజంగా పాలస్తీనా పౌరుల మీదనే కాదు, అసలు మానవత్వం మీద కూడా అభిమానం ఉన్నవారు కాదు. ఎందుకంటే వారు ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ఎన్నడూ ప్రశ్నించిన వారు కాదు. రెండవ తరగతి జనాలు మొదటి తరగతి బాపతు ప్రచారానికి లోనై ప్రశ్నించేవారు. వీరిని అర్దం చేసుకోవచ్చు. మొదటి తరగతి వారు ఎన్నడైనా తమ జీవితాల్లో పాలస్తీనా వాసుల మీద జరుగుతున్న దారుణమారణకాండకు నిరసనగా అయ్యోపాపం అని ఏదైనా ప్రదర్శన సంగతి అటుంచండి కనీసం ప్రకటన అయినా చేశారా ? ఎందుకు ఈ పోలిక తెస్తున్నారు, ఇదే కాదు మనదేశంలో జరిగినట్లు చెబుతున్న ఉదంతాలకు కూడా పాలస్తీనా, ఇతర సమస్యలను జోడించి అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. ప్రతిదాన్నీ మత కళ్లద్దాలతో చూస్తే వచ్చే సమస్య ఇది.
మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత అమెరికా, బ్రిటన్, ఇతర సామ్రాజ్యవాదులు కుట్ర చేసి పాలస్తీనా ప్రాంతంలోకి ఇతర దేశాల నుంచి యూదులను రప్పించారు. స్థానికంగా ఉన్న అరబ్బుల మీద దాడులు చేయించిన నాటి నుంచి జరిగిన పరిణామాలను చూడాలి. వికీపీడియా సమాచారం ప్రకారం 1920 నుంచి 1948వరకు 20,631మరణాలు సంభవించాయి, ఇంకా లెక్కకు రానివి మరికొన్ని వేలు ఉన్నాయి. వీటిలో అత్యధికులు పాలస్తీనియన్లే.1948లో పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసింది ఐక్యరాజ్యసమితి. ఎవరికి ఏ ప్రాంతమో కేటాయించింది. నాటి నుంచి ఇజ్రాయెల్ ఏర్పడింది తప్ప పాలస్తీనా ఎక్కడ ? దానికి కేటాయించిన ప్రాంతాలను క్రమక్రమంగా ఆక్రమిస్తూ అసలు పాలస్తీనా దేశాన్ని ఇంతవరకు ఉనికిలోకి రాకుండా చేసింది ఇజ్రాయెల్, దానికి మద్దతు ఇస్తున్న అమెరికా. తమ మాతృభూమి కోసం పోరాడుతున్నవారిని వేల మందిని దురహంకారులైన యూదులు, వారికి మద్దతుగా ఉన్న మిలిటరీ హత్యలు చేస్తున్నది. అప్పటి నుంచి (1948 ) ఇప్పటి వరకు మరణించిన వారు 1,44,963 మంది, వీరిలో అరబ్బులే అత్యధికం. గతేడాది అక్టోబరు ఏడు నుంచే గాజాలో దాదాపు 40వేల మందిని బాంబులు, విమానదాడులతో ఇజ్రాయెల్ మిలిటరీ చంపివేసింది, వారిలో 80శాతం మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. ఆసుపత్రులను ధ్వంసం చేసిన కారణంగా, వ్యాధులు ప్రబలి మరోలక్ష మంది మరణించారు. దాడుల్లో లక్ష మందివరకు గాయపడ్డారు. లక్షలాది ఇండ్లను నేలమట్టంగావించారు. ఇరవై మూడు లక్షల మందిని నిర్వాసితులను గావించారు.మారణకాండ, జాతిహననం అంటే ఇది. ఇవి యూదులు-పాలస్తీనీయన్ల మధ్య జరుగుతున్న ఘర్షణలు కావు. ఏకపక్ష దాడులు, ఒక దేశ మిలిటరీ మరొక దేశ పౌరుల మీద జరుపుతున్న మారణకాండ. దీనికీ బంగ్లాదేశ్‌లో జరిగిన దానికి పోలిక పెట్టటాన్ని ఏమనాలి. ప్రపంచమంతా పాలస్తీనియన్లకు సంఘీభావం తెలుపుతున్నది.ఏదైనా సందర్భం వస్తే హమస్ జరిపిన హత్యాకాండ సంగతేమిటని బిజెపి పెద్దలు ఎదురుదాడికి దిగుతారు. సాధారణ పౌరులపై వారి డాడిని సమర్థిస్తూ మనదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా చేసిన ప్రకటనను చూపమనండి.దాడులు, ప్రతిదాడులను ఖండిస్తూ 2023 అక్టోబరు ఎనిమిదిన సిపిఐ(ఎం) ఒక ప్రకటన చేసింది. కాంగ్రెస్ కూడా హమస్‌దాడులను ఖండించింది. ఇంతవరకు బిజెపి లేదా ఇతర సంఘపరివార్ సంస్థలు గానీ గాజా మారణకాండను ఖండించాయా ? పాలస్తీనాకు మనదేశం మద్దతు ఇస్తున్నది, కానీ దానికి సంఘీభావం తెలుపకుండా కేంద్ర ప్రభుత్వం కాశ్మీరులో నిషేధాలు విధించిందని, ఇజ్రాయెల్, అమెరికాలను సంతుష్టీకరించిందనే అంశం ఎంత మందికి తెలుసు ?
తమ మీద దాడులు జరిపిన వారి మీద చర్యలు తీసుకోవాలంటూ ఆగస్టు పది, పదకొండు తేదీలలో ఢాకా నగరంలో హిందువులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు.వారికి భరోసా కల్పించేందుకు తాత్కాలిక ప్రభుత్వ నేతగా ఉన్న మహమ్మద్ యూనస్ ఢాకేశ్వరి దేవాలయాన్ని సందర్శించాడు. తగినంత భద్రత కల్పించలేకపోయినందుకు క్షమించాలని హౌంమంత్రిత్వశాఖ సలహాదారు(మంత్రితో సమానం) సఖావత్ హుసేన్ ఆగస్టు12న కోరాడు. ఇలాంటి పరిస్థితి మనదేశంలో అధికారంలో ఉన్న బిజెపి నేతల నుంచి ఎన్నడైనా చూశామా ? బంగ్లాదేశ్ హిందువుల సంగతి పట్టదు గానీ పాలస్తీనియన్ల గురించి మాట్లాడతారంటూ బిజెపి, దాని మద్దతుదార్లు ఎదురుదాడి చేస్తున్నారు. అన్ని పార్టీలూ బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడిని ఖండించాయి.మిగతా పార్టీల మాదిరిగానే ఒక ఖండన ప్రకటన చేయటం తప్ప బిజెపి అదనంగా చేసిందేమిటి ? మణిపూర్ రాష్ట్రంలో మైనారిటీ మతావలంబకులుగా ఉన్న కుకీ గిరిజనులపై జరిగిన దాడులు, మహిళలపై అత్యాచార ఉదంతాల పట్ల ఆందోళన వెలిబుచ్చుతూ ఐరోపా యూనియన్ పార్లమెంటులో చర్చ జరిగింది. సబ్‌కాసాత్ సబ్‌కా వికాస్ అని చెప్పుకుంటూ మరోవైపు హిందువుల కోసం బరాబర్ మేము ఏమైనా చేస్తాం, పోరాడతాం అని బిజెపి నేతలు చెబుతారు. బంగ్లాపరిణామాలపై కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు కూడా అదే సమయంలో జరిగాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగితే ఒక తీర్మానం, చర్చ పెట్టి ఖండించటానికి, వారికి సానుభూతి తెలిపేందుకు బిజెపికి ఎవరు అడ్డుపడ్డారు ? పదవీ బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్‌కు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు చెబుతూ పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని, హిందువులతో సహా మైనారిటీలందరికీ భద్రత, రక్షణ కల్పించాలని కోరుతూ ఆగస్టు ఎనిమిది రాత్రి ఒక ఎక్స్ సందేశం పంపారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగితే స్పందించరేమిటని సంఘపరివార్ శక్తులు అడుగుతున్నాయి. తప్పులేదు. మణిపూర్‌లో గత పదిహేను నెలలుగా స్వంత పౌరుల మధ్య జరుగుతున్న హింసాత్మక ఉదంతాల పట్ల మీ స్పందన, కార్యాచరణ ఏమిటని ఎప్పుడైనా నరేంద్రమోడీని ప్రశ్నించాయా ? మహిళలను నగంగా ఊరేగించారే ! గట్టిగా అడిగితే ఆ ఉదంతాల్లో విదేశీ, చొరబాటుదారుల హస్తం ఉందంటూ తప్పించుకుంటున్నారు. కాసేపు వాదన కోసం ఉన్నదనే అనుకుందాం. సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత, చొరబాటుదార్లను అడ్డుకొని వారి కుట్రలను ఛేదించాల్సిన పని ఎవరిది ? కేంద్ర పెద్దలదే కదా ! ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారు. ఆ బాధ్యత ఢిల్లీ పెద్ద ఇంజనుదైతే రాష్ట్రంలో పౌరుల మాన ప్రాణాలను రక్షించాల్సిన కర్తవ్యం చిన్న ఇంజనుది కాదా ? అదేమి చేస్తున్నట్లు ? ప్రభుత్వ సమాచారం ప్రకారం 2024 మే మూడవ తేదీ నాటికి ఏడాది కాలంలో జరిగిన ఘర్షణలు, దాడుల్లో క్రైస్తవ గిరిజనులు గానీ, హిందూ మెయితీలుగానీ 221 మంది మరణించారు.మరో 32 మంది జాడ తెలియటం లేదు.వెయ్యి మంది గాయపడ్డారు. 4,786 ఇండ్లను దగ్దం చేశారు.దేవాలయాలు, చర్చ్‌లు 386 ధ్వంసమయ్యాయి. అరవై వేల మంది నెలవులు తప్పారు. వారికి ఓదార్పుగా ఇంతవరకు ప్రధాని మోడీ ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. ఇంత జరుగుతుంటే బిజెపి శ్రేణులు, వారికి మద్దతు ఇచ్చే వారు గానీ మణిపూర్ దారుణాలకు నిరసనగా లేదా కనీసం శాంతిని కోరుతూ ఎన్నడైనా ప్రదర్శనలు చేశారా ? ఎందుకు చేయలేదు ? మతకోణంలో చూసినా మణిపూర్ మెయితీలు హిందువులు , ఇంతకాలం వారిని ఓట్లకోసం ఉపయోగించుకున్నారా లేదా ? బిజెపి బండారం బయట పడింది గనుకనే మెయితీలు, గిరిజనులు ఇద్దరూ బిజెపిని లోక్‌సభ ఎన్నికల్లో ఉన్న రెండు సీట్లలో ఓడించారు. అందుకే బంగ్లాదేశ్ హిందువుల గురించి కారుస్తున్న కన్నీళ్లు నిజమైనవి కాదు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లకోసం గ్లిజరీన్ సరకు అని ఎవరైనా అంటే తప్పేముంది.
సామాజిక మాధ్యమంలో వచ్చిన అనేక అంశాలలో సంధించిన ఒక ప్రశ్న దిగువ విధంగా ఉంది.” అత్యంత పలుకుబడి కలిగిన హిందువులు బంగ్లాదేశ్ గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు ” అన్నది దాని శీర్షిక. ” బంగ్లాదేశ్‌లో ఏమీ జరగటం లేదన్నట్లుగా ప్రఖ్యాతి గాంచిన వారిలో ఎక్కువ మంది ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు తెలియటం లేదు.జై శంకర్ నుంచి వచ్చిన ఒకటి తప్ప భారత ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. మన ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మౌనంగా ఉన్నారు, మంత్రులందరూ, ఇతర రాజకీయనేతలు గమ్మున ఉన్నారు. చివరికి జై శంకర్ ప్రకటనలో కూడా ”మైనారిటీ” అనే పదాన్ని ఉపయోగించారు తప్ప ”హిందువులు ” అనలేదు. వారే కాదు ఒక అధికారి, ఒక న్యాయమూర్తి, ”ప్రముఖ ” టీచర్, ప్రముఖులు, ఒక పారిశ్రామికవేత్త ఎవ్వరూ హిందువుల కోసం నోరు తెరవ లేదు. కొంత మంది యూట్యూబర్లు మాత్రమే గళమెత్తారు. అయితే అది చాలదు.వీరంతా హిందువులే అయినా అందరూ ఇంకా మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష పార్టీల మౌనం గురిచి నేను మాట్లాడదలచుకోలేదు.ఎందుకంటే వారికి ఇప్పుడు అవకాశం లేదు. రాహుల్, అఖిలేష్,మమత, ఉద్దావ్ లేదా ఇతర రాజకీయనేతలు గళం విప్పుతారని నేను ఆశించను. కానీ బిజెపి ఎందుకు మౌనంగా ఉంది. మన హిందూ సోదరులు బాధలు పడుతుంటే మనమంతా మొద్దుబారిపోయామా ? ” (రెడిట్ డాట్‌కాం) బిజెపి మొద్దుబారలేదు, ఇలాంటి అవకాశాలు ఎప్పుడు వస్తాయా ? ఎలా సొమ్ముచేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది, చురుకుగా వ్యవహరిస్తుంది అన్న విషయం పై ప్రశ్న వేసిన వారికి తెలియదేమో !
ఇండియా టుడే పత్రిక 2024 ఆగస్టు 13న ఒక విశ్లేషణ ప్రచురించింది. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తరువాత తలెత్తిన అరాచకంలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై ఐదు హత్యలతో సహా రెండు వందలకు పైగా ప్రాంతాలలో దాడులు జరిగాయి. విడిగా దాడులను చూస్తే కొన్ని వందలు ఉంటాయి. అత్యాచార ఉదంతాలు కూడా జరిగాయి.దాడుల వీడియోలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తాయి. వాస్తవాల నిర్ధారకులు వాటిని ప్రశ్నించారు.బాధితుల్లో రాజకీయాలతో నిమిత్తం ఉన్నవారితో పాటు లేని వారు కూడా ఉన్నారు. ఆగస్టు ఐదు నుంచి మూడు రోజుల్లో 205ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇండ్లు, దుకాణాలపై ఎక్కువగా ఉన్నాయి, కావాలని లూటీలు, దహనాలు చేశారు.రాజకీయాల నుంచి మతాన్ని విడదీసి చూడాల్సిన అవసరం ఉంది, నిజమైన విచారణ వాస్తవాలను వెల్లడించుతుంది. సమగ్రమైన విచారణ జరపకుండా ఫలానా సంస్థ లేదా పార్టీ దీని వెనుక ఉందనే నిర్ధారణలకు రాలేము. ఇదీ ఇండియా టుడే పేర్కొన్న అంశాల సారం. మతపరమైన దాడులు ఎన్ని, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎన్ని అత్యాచారాలు జరిగాయనే అంకెలు తీవ్రతను వెల్లడిస్తాయి తప్ప ఒక్క ఉదంతమైనా తీరని నష్టం, తీవ్రంగా ఖండించాల్సిందే. అన్ని దేశాల్లో మతం, భాషా మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను బంగ్లాదేశ్‌లో మైనారిటీలు కూడా ఎదుర్కొంటున్నారు.
మన దేశంలో బిజెపి దానికి ముందు ఉన్న జనసంఘం, ఈ రెండు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌ఎస్ వైఖరి కారణంగా మైనారిటీలు దూరంగా లేదా వ్యతిరేకంగా ఉన్నారు, వారి హక్కులు, భద్రత గురించి పట్టించుకుంటున్నకారణంగా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నారు.దాన్ని ముస్లిం సంతుష్టీకరణగా బిజెపి ఇప్పటికీ ప్రచారం చేస్తున్నది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులు అత్యధికులు అక్కడి నేషనల్ అవామీలీగ్ పార్టీ మద్దతుదార్లుగా ఉన్నారు. ఆ పార్టీ మద్దతుదార్లలో నాలుగోవంతు వారే అని చెబుతున్నారు, అంటే అవామీలీగ్‌ను కూడా హిందువులను సంతుష్టీకరించే పార్టీగా బిజెపి చిత్రిస్తుందా ? అవామీ లీగ్‌పై దాడులు, అరాచకం చెలరేగినపుడల్లా ఆ పార్టీలో ఉన్న హిందువుల మీద కూడా జరుగుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేనివారి మీద కూడా జరిగిన దాడులను చూస్తే ముస్లిం మతోన్మాదశక్తులు ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారన్నది స్పష్టం. ఇంట్లో ఆవు మాంసం ఉంది, గోవులను వధిస్తున్నారంటూ గోరక్షకుల ముసుగులో ఉన్న మతోన్మాదులు మనదేశంలో సామూహిక దాడులకు, హత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తిమ్మినిబమ్మినిగా చూపే వీడియోలు, వాట్సాప్ సమాచారం మనదేశంలో కుప్పలు తెప్పలుగా సృష్టిస్తూ బుర్రలు ఖరాబు చేసే పార్టీలు, సంస్థల గురించి తెలిసిందే.బంగ్లాదేశ్ కూడా దీనికి మినహాయింపు కాదు. అక్కడ జరగని ఉదంతాలను జరిగినట్లు ప్రచారం చేయటంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాటిలో కొన్నింటిని మన దేశంలోనే తయారు చేస్తున్నారట, అవాంఛనీయ శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం వైరల్ చేస్తున్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలించిన నిజ నిర్ధారకులు వాస్తవాలు కాదని తేల్చారు. దీని అర్ధం అసలు దాడులే జరగలేదు, హిందువులను నష్టపరచలేదని కానేకాదు.
మనదేశంలో ఉన్న కొన్ని సంస్థలకు చెందిన నిజ నిర్ధారకులు గతంలో అనేక తప్పుడు ప్రచారాల నిగ్గుతేల్చారు.వారికి రాజకీయ అనుబంధాలను అంటగడుతూ కాషాయ మరుగుజ్జుదళాలు జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూశాయి.మన దూరదర్శన్ మాదిరి జర్మనీ ప్రభుత్వ మీడియా సంస్థ డ్వట్చ్ విలా. దీన్ని పొట్టి రూపంలో డిడబ్ల్యు అని కూడా పిలుస్తారు. దానికి కూడా దురుద్ధేశ్యాలను ఆపాదిస్తే ఎవరూ చేసేదేమీ లేదు. వైరల్ కావించిన అంశాలను లక్షలాది మంది చూశారు, ఇతరులతో పంచుకున్నారు. వీటిలో బంగ్లాదేశ్ హిందూ క్రెకెటర్ లిటన్ దాస్ ఇంటిని తగుల పెట్టారు అన్నది ఒకటి. దుండగులు జరిపిన దాడుల్లో దహనం చేసిన ఆ ఇల్లు మాజీ క్రికెటర్ మష్రఫీ మోర్తజాది తప్ప లిటన్‌దాస్‌ది కాదు అని తేలింది. ఫొటో లిటన్‌దాస్‌ది,ఇల్లు అతనిది కాదు.మోర్తజా రాజకీయంగా హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ కార్యకలాపాల్లో పాల్గొనటం, ఇటీవలి ఎన్నికలు, అంతకు ముందు కూడా ఆ పార్టీ ఎంపీగా గెలవటం అతని ఇంటిని తగులబెట్టటానికి కారణంగా తేలింది. హిందూ మహిళలపై అత్యాచారాలు, వేధింపులు అంటూ మరోరెండు ఉదంతాలను వైరల్ చేశారు. అవి తాజా సంఘటనలు కాదు, వాటిని కూడా అసందర్భంగా జత చేసినట్లు తేలింది.. హిందూ మహిళ లోదుస్తులను ప్రదర్శిస్తున్న ముస్లిం పురుషుల దృశ్యాలను పోస్టు చేస్తూ హిందు బాలికల బ్రాలను తొలగించారని అత్యాచారం చేసిన తరువాత వాటిని ప్రదర్శించి తమ మగతనాన్ని ప్రదర్శించుకున్నారని వ్యాఖ్యానాలు జోడించారు.నిజానికి ఆ వీడియో దృశ్యం,దానిలో కనిపించిన దుస్తులు మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం వదలి వెళ్లిన తరువాత ఆమె నివాసంలో ప్రవేశించిన వారు చేసిన అరాచకంలో భాగం, అవి మీడియాలో ప్రచురించిన, టీవీలలో చూపించినవిగా తేలింది. అత్యాచారానికి గురైన హిందూ మహిళంటూ వైరల్ ఆయిన ఫొటోల బండారాన్ని కూడా జర్మన్ టీవీ బయటపెట్టింది. వాటిలో ఒక చిత్రంలో ఉన్న మహిళ 2023లో మణిపూర్‌లో హిందూ పురుషులు అపహరించి, సామూహిక అత్యాచారం చేసిన ఒక క్రైస్తవ యువతిగా తేలింది. మరొక చిత్రం 2021లో ఇండోనేషియాలో వైరల్ అయింది. ఐదుగురు బంగ్లాదేశీయులు ఇండోనేషియా వలస మహిళను చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసినట్లు దానిలో పేర్కొన్నారు. దాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందూ మహిళలపై అత్యాచారంగా చిత్రించారు. మరొక వీడియో అత్యాచారం చేసినట్లుగా వైరల్ అయింది. అది బెంగలూర్ రామ్మూర్తినగర్‌లో 2021వ సంవత్సరం మే నెలలో జరిగిన అత్యాచార ఉదంతంలో ముగ్గురు మహిళలతో సహా పన్నెండు మంది బంగ్లా జాతీయులను అరెస్టు చేసిన వీడియోగా మన దేశానికి చెందిన వెబ్‌సైట్ బూమ్ తేల్చింది. ఇలా సామాజిక మాధ్యమంలో తిప్పుతున్న వీడియో, ఫొటోలను గుడ్డిగా నమ్మించి భావోద్రేకాలను రెచ్చగొట్టేందుకు పనిగట్టుకు చేస్తున్నవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు వాదనలపై హేతుబద్దంగా ఆలోచించాలి. ఎవరు దాడులకు పాల్పడినా ఖండించాలి, నిరసించాలి. దానికి సరిహద్దులు ఎల్లలూ ఉండనవసరం లేదు. మతం కళ్లద్దాలు తొలగించి మానవత్వ అద్దాలను పెట్టుకోవాలి.
