Tags
A Revanth Reddy, BJP, BRS, CHANDRABABU, Electricity Act (2003), KCR, meters for agriculture pump sets, Narendra Modi Failures, UDAY sceam
ఎం కోటేశ్వరరావు
విద్యుత్ వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత రెడ్డి చేసిన ప్రకటన, సభకు చూపిన పత్రాలు వివాదాస్పదమయ్యాయి.తాము వ్యవసాయ పంపుసెట్లకు తప్ప మిగిలిన వాటికి మాత్రమే స్మార్టు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకున్నామని, ఆ విషయాన్ని దాచి తమపై అవాస్తవాలు చెప్పారని బిఆర్‌ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. పంపిణీ ట్రాన్స్‌ఫర్లకు మీటర్లు పెడతామని అంగీకరించారని, రైతులకు కూడా అక్కడి నుంచే సరఫరా జరుగుతుంది గనుక వ్యవసాయ సరఫరాకూ మీటర్లు పెట్టేందుకు సమ్మతించినట్లే కదా అని కాంగ్రెస్ చెబుతోంది. ఒప్పంద పత్రాలను జనాలకు అందుబాటులో ఉంచితే నిజానిజాలేమిటో అందరికీ సుబోధకం అవుతుంది.2017లో కుదుర్చుకున్న ఒప్పందంలో ఏమి ఉంది అన్నది పక్కన పెడితే బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పంపుసెట్లకు మీటర్లు పెట్టలేదన్నది వాస్తవం. అందువలన నిజంగా వ్యవసాయ పంపుసెట్లకు తప్ప అనే పదం ఒప్పందంలో ఉందా లేదా అన్నది ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది.
ఇప్పటికే విద్యుత్ మీటర్లు ఉన్నాయి కదా స్మార్ట్ మీటర్లంటే ఏమిటని ఎవరికైనా సందేహం రావచ్చు.ప్రయివేటీకరించే రంగాలలో విద్యుత్ పంపిణీ కూడా ఒకటి. సెల్‌ఫోన్లకు రెండు పథకాలు ఉన్నాయి. ఒకటి ముందుగానే డబ్బు చెల్లించేది, రెండవది తరువాత బిల్లు కట్టేది. విద్యుత్ రంగంలో స్మార్టు మీటర్లు అంటే ముందుగా సొమ్ము చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేయాలి. ఆ మేరకు వినియోగించగానే సరఫరా ఆగిపోతుంది. వాడకం తరువాత బిల్లు చెల్లించే పథకాలనూ పెట్టవచ్చు. అసలు ఈ విధానం ఎందుకు, చెప్పిన కారణాలేమిటి ? వినియోగించే ప్రతి యూనిట్‌కూ లెక్కతేలాలని, మీటర్లు లేకుండా వినియోగించేవారిని నిరోధించేందుకు, ఖర్చు మొత్తం వినియోగదారుల నుంచి రాబట్టేందుకు అని చెప్పారు. ప్రయివేటీకరించిన తరువాత కొనుగోలు చేసిన కార్పొరేట్ సంస్థకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం ఒకటైతే, ముందుగానే చెల్లించే జనం సొమ్ముతో పెట్టుబడి పెద్దగా లేకుండా సదరు సంస్థలకు లాభాలు అప్పగించే మహత్తర ఆలోచన దీనివెనుక ఉంది. వినియోగదారులు చెల్లించే మొత్తాలనే జన్‌కోలకు చెల్లిస్తారు. ఇతర ఖర్చులకూ వినియోగిస్తారు.ప్రస్తుతం రైతాంగానికి కొన్ని రాష్ట్రాలలో ఉచితంగా అందచేస్తున్నారు, కొందరికి సబ్సిడీలు ఇస్తున్నారు. స్మార్టు మీటర్లు పెడితే అందరూ ముందుగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయాలి. ఎలా అంటే గతంలో వంటగ్యాస్‌కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని తగ్గించి చెల్లిస్తే సిలిండర్లు ఇచ్చేవారు. ఇటీవల దాన్ని మార్చి ముందుగా మొత్తం చెల్లించేట్లు చేశారు. తరువాత సబ్సిడీ మొత్తం వారి బాంకు ఖాతాలలో జమ చేస్తున్నారు. విద్యుత్‌కూ అంతే చేయనున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తే వినియోగదారులకు బదలాయిస్తారు. చేతులేత్తేసినా చేసేదేమీ లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు పంపిణీ సంస్థలకు సబ్సిడీ సొమ్మును నెలల తరబడి చెల్లించటం లేదు, ప్రభుత్వ శాఖలు బిల్లులు చెల్లించకుండానే వాడుతున్నాయి. దీంతో పంపిణీ సంస్థ(డిస్కామ్‌లు)లు అప్పుల పాలవుతున్నాయి.ప్రైవేటీకరిస్తే వాటిని కొనుగోలు చేసే సంస్థలు ముందుకు రావు. అందుకే రుణాలు లేకుండా చూసేందుకు విధానపరంగా ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
దానిలో భాగంగానే నరేంద్రమోడీ సర్కార్ అధికారంలోకి రాగానే 2015లో ఉజ్వల డిస్కామ్ అస్యూరెన్సు యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది.దీని పొట్టి రూపమే ”ఉదరు”. తొలుత ప్రకటించినదాని ప్రకారం 2018-19 నాటికి విద్యుత్ ప్రసార నష్టాలను 22 నుంచి 15శాతానికి తగ్గించాలి.విద్యుత్ కొనుగోలు,సరఫరా, ప్రసారానికి అయ్యే ఖర్చును పూర్తిగా వినియోగదారుల నుంచి రాబట్టాలి. ఇందుకు గాను స్మార్ట్ మీటర్లను విధిగా పెట్టించి నిర్వహణా సామర్ధ్యాన్ని మెరుగుపరచాలి. పొదుపు చర్యల్లో భాగంగా ఎల్‌ఇడి బల్బులను ప్రోత్సహించాలి, ఇదే మాదిరి వ్యవసాయ పంపుసెట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండీషనర్లను ప్రోత్సహించాలి. విద్యుత్ ఖర్చు, వడ్డీ భారాన్ని, నష్టాలను తగ్గించాలి.సరసమైన ధరలకు విద్యుత్‌ను అందించాలి. ఇలాంటి చర్యలను చేపట్టిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందించాలి.ఇది ఘోరంగా విఫలం కావటంతో తొలుత ప్రకటించిన లక్ష్యాలను కొన్నింటిని 2021జూన్‌లో సవరించారు. వాటి ప్రకారం ప్రైవేటు రంగంలో ఉన్న పంపిణీ సంస్థలు తప్ప ప్రభుత్వ రంగంలో ఉన్నవాటి ఆర్థిక, నిర్వహణ సామర్ధ్యాన్ని పెంచాలి.మౌలిక సదుపాయాల పటిష్టతకు ఆర్థిక సాయం చేసేందుకు కొన్ని షరతులను విధించాలి.ప్రసార నష్టాలను 2024-25నాటికి 12-15శాతానికి తగ్గించాలి. సరఫరా ఖర్చును పూర్తిగా వినియోగదారుల నుంచి వసూలు చేయాలి, ఆధునిక పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.పైన చెప్పుకున్న స్మార్ట్ మీటర్ల కథ ఈ పధకంలో భాగమే. ఆంధ్రప్రదేశ్‌లో అందిన కాడికి అప్పులు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెట్టేందుకు అంగీకరించి ఎఫ్‌ఆర్‌బిఎం అర్హతకు మించి అదనంగా 0.5 అప్పులు తెచ్చుకొనే ” ప్రోత్సాహాన్ని ” పొందింది. తెలంగాణాలో విద్యుత్ మోటార్లు ఎక్కువగా ఉన్నందున అంగీకరిస్తే రైతాంగం నుంచి వ్యతిరేకత వస్తుంది గనుక బిఆర్‌ఎస్ సర్కార్ వాటి జోలికి పోకుండా పంపిణీ ట్రాన్సఫార్మర్లకు మీటర్లు పెట్టి లెక్క తేలుస్తామని, ఇతర వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు, పార్టీలు అధికారంలోకి వచ్చాయి. స్మార్టు మీటర్లను రెండచోట్లా బిజెపి సమర్ధించింది, ఇప్పటికీ సమర్ధిస్తున్నది. ఈ విషయంలో బిఆర్‌ఎస్, వైసిపి విధానాలకు మద్దతు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం వ్యతిరేకించింది. ఇప్పుడు అదే బిజెపితో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసిపి తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తామని గానీ, కొనసాగిస్తామనీ ఇంతవరకు స్పష్టం చేయలేదు.తెలంగాణాలో వ్యతిరేకించిన కాంగ్రెస్‌దీ ఇప్పుడు అదే పరిస్థితి. అమలు చేయకపోతే పంపిణీ సంస్థలపై కేంద్రం చర్యలు తీసుకోవచ్చని చెబుతోంది తప్ప, స్మార్టు మీటర్లు పెట్టేదీ లేనిదీ స్పష్టం చేయలేదు. ఏం చేస్తారో చూడాలి.మరోవైపు విద్యుత్ సంస్కరణలను అమలు జరిపి తీరుతామని బిజెపి గట్టిగా చెబుతోంది. పంపిణీ సంస్థలు అప్పుల్లో కూరుకుపోవటం గురించి రాజకీయపరమైన దాడి చేస్తున్నది. అనేక రాష్ట్రాలలో అంగీకరించినందున రెండు తెలుగు రాష్ట్రాలలో ఎందుకు వ్యతిరేకించాలని బిజెపి అంటున్నది. ఇది అసంబద్ద వాదన. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధారిటీ (సిఇఏ) కేంద్ర ప్రభుత్వ సంస్థ, దాని నివేదిక 2023 ప్రకారం 2022 నాటికి ఆంధ్రప్రదేశ్,తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక,తెలంగాణా, పంజాబ్ రాష్ట్రాలు మాత్రమే రైతాంగానికి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నాయి. మీటర్లు లేకుండా పంపుసెట్ల సామర్ధ్యాన్ని బట్టి మరో ఎనిమిది రాష్ట్రాలు రేట్లు నిర్ణయించాయి. ఒక హార్స్ పవర్‌కు బీహార్‌లో నెలకు రు.800, గుజరాత్‌లో రు.200, హర్యానాలో పదిహేను హెచ్‌పి వరకు రు.12, అంతకు మించితే రు.15, కాశ్మీరులో పది హెచ్‌పి వరకు రు.205, 11 నుంచి 20కి రు.222, ఇరవై మించితే రు.1,415, మహారాష్ట్రలో జోన్లు, హార్స్‌పవర్ ప్రాతిపదికన గరిష్టంగా రు.422 నుంచి కనిష్టంగా రు.265వరకు, పంజాబ్‌లో ప్రభుత్వ సబ్సిడీ లేని పంపుసెట్లకు రు.419, రాజస్తాన్‌లో రు.775, 955 చొప్పున రెండు తరగతులుగా, ఉత్తర ప్రదేశ్‌లో రైతాంగానికి రు.170( లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం దీన్ని రద్దు చేశారు, రు.1,500 కోట్లు సబ్సిడికి కేటాయించినట్లు ప్రకటించారు.), ప్రభుత్వ, పంచాయతీరాజ్ నిర్వహణలో ఉన్న పంపుసెట్లకు 100 హెచ్‌పివరకు రు.3,300 వసూలు చేస్తున్నారు. అందువలన ఈ రాష్ట్రాలలో మీటర్లు పెట్టినందున రైతులకు జరిగే నష్టం లేదు, ఎలాగూ సొమ్ము చెల్లిస్తున్నారు. అందువలన అవి అంగీకరించాయంటే వేరు, ఉచితంగా ఇచ్చే వాటి సమస్య వేరు. అయితే మీటర్లు పెట్టి ఇప్పుడు చెల్లిస్తున్నదానికంటే అదనపు భారం మోపితే వచ్చే వ్యతిరేకతను అక్కడి పార్టీలు అనుభవించాల్సి ఉంటుంది.
ఇక పంపిణీ సంస్థల నిర్వహణ ఇతర పార్టీల ఏలుబడి ఉన్న చోట కంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏమైనా మెరుగ్గా ఉందా ?బిజెపి వారు తెలంగాణాలో తరచూ హైదరాబాదు పాత బస్తీలో విద్యుత్ చౌర్యం గురించి చెబుతూ ఉంటారు. అక్కడ ఉన్నవారిలో ఒక్క ముస్లింలే విద్యుత్‌ను అక్రమంగా వాడుతున్నట్లు ? హిందువులుగా ఉన్నవారు దేశం కోసం ధర్మం కోసం నిజాయితీగా ఉన్నట్లు చిత్రిస్తున్నారు.అవకాశం ఉంటే చౌర్యంలో ఎవరూ తక్కువ కాదు, వివిధ సందర్భాలలో లైన్ల మీద కొక్కేలు వేసేవారందరూ చోరులే. ఇతర చోట్ల, ఇతర రాష్ట్రాలలో ఇలాంటి ఆక్రమాలు, మీటర్లు తిరగకుండా చేస్తున్నవారు లేరా ? స్వయంగా ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌ను చూద్దాం. హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ చౌర్యం జరుగుతోందని బిజెపి ఆరోపిస్తున్న, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న తెలంగాణాలో డిస్కామ్‌ల రుణం రు.62వేల కోట్లు దాటింది. ఉత్తర ప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడేవారి మీద ప్రయోగానికి అక్కడ యోగి బుల్డోజర్లు సిద్దంగా ఉంటాయి, రెండింజన్ల పాలన. రెండు దశల్లో ఉదరు పథకాన్ని అమలు జరిపిన తరువాత చూస్తే పంపిణీ సంస్థల నష్టాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి తప్ప మరొకటి కాదు.జూలై నెలలో పదహారవ ఆర్థిక సంఘానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సమర్పించిన పత్రంలో 2022-23సంవత్సరం నాటికే దేశంలో అన్ని పంపిణీ సంస్థలకు పేరుకు పోయిన నష్టాల మొత్తం రు.6.77లక్షల కోట్లు, వీటిలో సమర్దవంతమైన పాలన సాగిస్తున్నట్లు చెబుతున్న యోగి ఏలుబడిలో ఉత్తర ప్రదేశ్ వాటా పదిహేనుశాతం అంటే లక్ష కోట్లు దాటింది, ఈ నష్టాలు సగటున ఏటా పదిశాతం పెరుగుతున్నట్లు చెబుతున్నందున మరుసటి ఏడాదిలో మరో పదివేల కోట్లు అదనం, రాజస్తాన్ వాటా కూడా పదిహేనుశాతం, మరోబిజెపి పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో పదిశాతం నష్టాలు ఉన్నాయి.తెలంగాణాలో కూడా పదిశాతం ఉన్నాయి. వినియోగదారుల మీద భారాలు మోపటానికి బదులు గడచిన పదేండ్లుగా విద్యుత్ ప్రసార నష్టాలను తగ్గించేందుకు కేంద్రం పూనుకొని ఉంటే ఎంతో మేలు జరిగేది. మోడీ సర్కార్ దాని మీద కేంద్రీకరించి ఉంటే ఈ పాటికి ఎంతో మేలు జరిగి ఉండేది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న 2014 వివరాల ప్రకారం మనదేశంలో ఆ నష్టాలు 19.33శాతం ఉంటే బంగ్లాదేశ్‌లో 11.4, శ్రీలంకలో 11 పాకిస్తాన్‌లో 17.14 శాతం ఉండగా చైనాలో 5.47శాతం ఉంది.ప్రపంచంలోని 138దేశాల సూచికలో మనం 25వ స్థానంలో ఉండగా చైనా 119వదిగా ఉంది. అందువలన ఈ విఫల పధకం గురించి కాంగ్రెస్-బిఆర్‌ఎస్ దెబ్బలాడుకుంటే ప్రయోజనం లేదు.వినియోగదారుల మీద భారాలు మోపటాన్ని సమర్ధిస్తున్న బిజెపిని ఎండగడుతూ విధానాన్ని వ్యతిరేకించేందుకు పూనుకోవాలి !
