Tags
anti china, BJP, China, China problem, India’s RCEP dilemma, Jaishankar problem’, Narendra Modi, Narendra Modi Failures, Pro USA, RSS, S Jaishankar
ఎం కోటేశ్వరరావు
‘‘ చైనాతో వాణిజ్యానికి వ్యతిరేకం కాదు, ఏ రంగంలో లావాదేవీలు ఎలా అన్నదే సమస్య అన్న జయశంకర్ ’’ ఈటివి భారత్ ప్రసారం చేసిన ఒక వార్త శీర్షిక ఇది. ఇంకా మరికొన్ని పత్రికలు కూడా ఇదే వార్తను ఇచ్చాయి. 2024 సెప్టెంబరు పదిన అక్కడి విదేశాంగ మంత్రితో కలసి జర్మనీ నగరమైన బెర్లిన్‌లో ఒక చర్చలో పాల్గొన్న జయశంకర్ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘ చైనాతో వాణిజ్యానికి తలుపులు మూయలేదు. ప్రపంచంలో అది రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. అది ఒక ప్రముఖ ఉత్పత్తిదారు. చైనాతో వాణిజ్యం చేయబోమని చెప్పగలిగేవారెవరూ లేరు. ఏఏ రంగాలలో వాణిజ్యం చేయాలి, ఏ షరతులతో చేయాలన్నదే సమస్య అని నేను అనుకుంటున్నాను. ఇది ఎంతో సంక్లిష్టమైనది, నలుపా తెలుపా అన్నంత సులభంగా సమాధానం చెప్పలేము ’’ అన్నారు. జయశంకర్ చెప్పిన ‘‘ సమస్య ’’ ఒక్క చైనాతోనే అనే ముంది, ప్రతిదేశంతోనూ ఉండేది కాదా ? చైనాతో ఆచితూచి, మిగతా దేశాలతో ఎలాబడితే అలా చేస్తారా ? 2020లో జరిగిన గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత మనదేశం చైనా పేరు పెట్టకపోయినా దానికి వర్తించే అనేక ఆంక్షలను పెట్టిన సంగతి తెలిసిందే. భద్రత, సమాచార రక్షణ పేరుతో అంతకు ముందు స్వేచ్చగా అనుమతించిన టిక్‌టాక్ వంటి యాప్‌లను కూడా నిషేధించింది. ఆగస్టు నెలలో ఒక సందర్భంలో జయశంకర్ మాట్లాడుతూ చైనాతో ప్రత్యేక సమస్యలు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఏం జరుగుతోంది ? మన విధానాలను ప్రభావితం చేస్తున్నది ఎవరు ? ప్రధాని నరేంద్రమోడీకి విదేశాంగ మంత్రి జయశంకర్ సమస్యగా మారారా ? ఆయన వెనుక ఎవరున్నారు ? జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఇలా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.
ఇటీవలి కాలంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌తో సహా అనేక మంది చైనా పెట్టుబడులకు అనుకూలంగా సంకేతాలివ్వటమేగాక మాట్లాడుతున్నారు.జూలై నెలలో విడుదల చేసిన మనదేశ వార్షిక ఆర్థిక సర్వేలో చైనా సరఫరా గొలుసుతో అనుసంధానం చేసుకోవటం,మరింతగా చెనా పెట్టుబడులను మనదేశంలోకి అనుమతించటం గురించి పేర్కొన్నారు. సూర్యరశ్మి పలకలు, విద్యుత్ వాహనాల బ్యాటరీలు, ఇంకా మన దగ్గర తయారీకి నైపుణ్యం లేని, రక్షణ సమస్యలు లేని ఉత్పత్తుల వంటి రంగాలలో చైనా పెట్టుబడుల అనుమతికి, చైనీయులకు నిలిపివేసిన వీసాల జారీ నిబంధనలను భారత్ సడలించవచ్చని జూలై నెలలోనే రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.జై శంకర్ జర్మనీ పర్యటనలో ఉండగానే చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో ‘‘ భారత దౌత్యానికి ఎస్ జైశంకర్ సమస్య ’’ అనే శీర్షికతో ఒక విశ్లేషణ వెలువడిరది. దాన్ని వెబ్‌సైట్ నుంచి వెంటనే తొలగించారని కూడా వార్తలు వచ్చాయి.అయితే అది నెటిజన్లకు అందుబాటులో ఉంది. దానిలో పేర్కొన్న అంశాల సారం ఏమిటి ?
ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు, సంప్రదింపులు సంబంధాలు మెరుగుపడటానికి అనువైన వాతావరణాన్ని సృష్టించిన నేపధ్యంలో ఎకనమిక్ టైమ్స్ పత్రిక నిర్వహించిన ప్రపంచ వేదిక సమావేశంలో జై శంకర్ చేసిన వ్యాఖ్యలను చైనా విశ్లేషకుడు తప్పు పట్టటమే కాదు, రెండుదేశాల సంబంధాలు మెరుగుపడటం ఇష్టం ఉన్నట్లు లేదని విమర్శించాడు. ‘‘ మామూలుగానే చైనా సమస్య ఉంది.చైనా గురించి చర్చిస్తున్నది ప్రపంచంలో భారత్ ఒక్కటే కాదు. భారత్‌కు చైనా సమస్య ఉంది… ప్రపంచానికి ఉన్న సాధారణ చైనా సమస్య కంటే భారత్‌కు ప్రత్యేక సమస్య ఉంది’’ అన్న జై శంకర్ వ్యాఖ్యను ఉటంకించాడు. అంతే కాదు కేంద్రంలో నేటి పరిస్థితి గురించి మనదేశ విశ్లేషకుడు ప్రవీణ్ సాహ్నే చేసిన వ్యాఖ్యలను కూడా పేర్కొన్నాడు. అవేమిటంటే ‘‘ మోడీ సర్కార్‌లో ఒక బలమైన వర్గం చైనాతో సంబంధాలను సాధారణ స్థాయికి తేవాలని అభిప్రాయపడుతున్నది. జై శంకర్ నాయకత్వంలోని మరొక శక్తివంతమైన వర్గం చైనాతో సాధారణ సంబంధాలు నెలకొల్పుకుంటే అమెరికాతో ఉన్న భారత సంబంధాలు సంకటంలో పడతాయి కనుక జరగకూడదని చెబుతున్నది. లబ్ది పొందాలని చూస్తున్న కారణంగా నరేంద్రమోడీ ఎటూ తేల్చుకోలేదు ’’ అని పేర్కొన్నారు. అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పకపోయినా జై శంకర్ అమెరికన్ లాబీయిస్టుగా ఉన్నారని చైనా చెబుతోంది. భారత్‌చైనా సంబంధాలు మెరుగుపడటం, బలపడటం గురించి జై శంకర్ భయపడుతున్నారని కూడా గ్లోబల్‌టైమ్స్ విశ్లేషణలో ఉంది.ఒక వర్గం తమతో సంబంధాల గురించి అనుకూలంగా ఉన్నపుడు ఇలాంటి వ్యాఖ్యలు అవసరం లేదన్న పునరాలోచనతో దాన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించి ఉండవచ్చు. చైనా యాప్‌లు, దాని కంపెనీల టెలికాం పరికరాలతో సమాచారాన్నంతా సంగ్రహిస్తుందని, దేశ భద్రతలకు ప్రమాదమని కదా చెబుతోంది. మా పరికరాల ద్వారా అలాంటి ముప్పు ఉందనుకుంటే మరి అమెరికా పరికరాలతో భద్రత ఉంటుందనే హామీ ఇస్తారా అని చైనా అడుగుతోంది. ప్రిజమ్ పేరుతో అమెరికా వివిధ మార్గాలలో ఇతర దేశాల సమాచారం మొత్తాన్ని సేకరిస్తోందని దాని రహస్య మెయిళ్లు, ఫైళ్లను బయటపెట్టిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఉదంతం గురించి అది పేర్కొన్నది. మరొక దేశ పరికరాల ద్వారా గూఢచర్యం జరుగుతోందని ప్రతిదాన్నీ అనుమానిస్తే మన పరికరాలు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లను మనం అమ్ముకోగలమా? కొనేవాళ్లు గుడ్డిగా ఉంటారా ?
చైనాతో సత్సంబంధాలు , రష్యాతో మైత్రి అమెరికన్లకు మింగుడుపడదన్నది బహిరంగ రహస్యం. అందుకే వాటితో పాటు అమెరికాతో కూడా అదే మాదిరి ఉంటున్నాం కదా అని మెప్పించేందుకు మోడీ ఇటీవల ఉక్రెయిన్ పర్యటన జరిపినట్లు అనేక మంది భావిస్తున్నారు. నరేంద్రమోడీయే స్వయంగా చైనా సంబంధాల గురించి సానుకూలంగా లేకపోతే ఒక బలమైన వర్గం అనుకూలంగా తయారయ్యే అవకాశమే ఉండదని జై శంకర్‌కూ తెలుసు. మోడీకి చైనా మీద ప్రత్యేక ప్రేమ ఉండి అనుకూలంగా ఉంటున్నారని దీని అర్ధం కాదు, కార్పొరేట్ల ప్రయోజనం, వత్తిడే కారణం. ఇక జై శంకర్ వివరాలను చూసినపుడు నరేంద్రమోడీ పాలనలో 2015 నుంచి 18వరకు విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత టాటా కంపెనీ విదేశీ వ్యవహారాలను చూసే కీలక బాధ్యతల్లో పని చేశారు. ఆ సమయంలో టాటా కంపెనీల అవసరాల కోసం చైనాతో సంబంధాల మెరుగుదలకు తీవ్రంగా కృషి చేశారని అలాంటి వ్యక్తి ఇప్పుడు చైనా వ్యతిరేకత కలిగి ఉన్నట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొన్నది.(అదే టాటా కంపెనీ తన విద్యుత్ కార్లకు అవసరమైన బ్యాటరీలను చైనా నుంచి కొనుగోలు చేసేందుకు నిర్ణయించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ) ఒక బలమైన వర్గం చైనా పెట్టుబడులు, వాణిజ్యాన్ని కోరుకుంటున్న కారణంగానే బెర్లిన్‌లో జై శంకర్ చైనాతో సంబంధాలు ఉండవని మేమెప్పుడు చెప్పాం, అసలుదానితో సంబంధాలు లేనివారు ఉంటారా అంటూ మాట్లాడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే తెగేదాకా లాగదలుచుకోలేదు. అందుకే భారత దౌత్య అసలు సమస్యను జై శంకర్ సమస్యగా చైనా పరిగణిస్తోంది.
మన కార్పొరేట్ల ప్రయోజనాలను దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ ఇటీవల గట్టిగా ప్రతిబింబిస్తున్నారు. చైనా సరఫరా(గొలుసు) వ్యవస్థతో అనుసంధానించుకోవటం తప్పనిసరని చెప్పినట్లు 2024సెప్టెంబరు 11వ తేదీన రాయిటర్స్ వార్త పేర్కొన్నది. మనం పూర్తిగా దిగుమతులు చేసుకోవాలా లేక చైనా పెట్టుబడులతో ఇక్కడే తయారు చేయాలా అన్నది భారత్ నిర్ణయించుకోవాలని నాగేశ్వరన్ చెప్పారు.అమెరికా, ఐరోపాలు చైనా నుంచి సేకరణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నందున మనం చైనా నుంచి దిగుమతులు చేసుకోవటం, వాటికి కొంత విలువను జోడిరచి తిరిగి ఎగుమతి చేయటం కంటే చైనా కంపెనీల పెట్టుబడులతో మనదేశంలో వస్తువులను ఉత్పత్తి చేసి ఆ మార్కెట్లకు ఎగుమతి చేయటం మరింత ప్రభావం చూపుతుంది అని జూలై నెలలో విడుదల చేసిన దేశ వార్షిక ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు. దాని రూపకల్పన నాగేశ్వర్ మార్గదర్శకత్వంలోనే జరిగిందని వేరే చెప్పనవసరం లేదు. మోడీ సర్కార్ గతంలో విధించిన ఆంక్షలను సడలించటమే కాదు స్థానిక ఉత్పత్తులను పెంపొందించటానికి సబ్సిడీలు కూడా ఇచ్చేందుకు రూపకల్పన చేసిందని రాయిటర్స్ పేర్కొన్నది.‘‘ చైనా సరఫరా గొలుసులలో భాగస్వామి కాకుండా ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన ఉత్పత్తులైన సోలార్ సెల్స్, విద్యుత్ వాహనాల రంగంలో ఏమీ చేయలేమని ’’ అమెరికా ఏలే విశ్వవిద్యాలయ లెక్షరర్ సుశాంత సింగ్ చెప్పారు. చైనా వస్తువుల మీద దిగుమతి పన్నులు విధించాలని చెబుతున్న మనదేశంలోని ఉక్కు పరిశ్రమ దిగ్గజం నవీన్ జిందాల్ కూడా చైనాతో ఆచరణాత్మక వైఖరిని అవలంభించాలని చెప్పారు.‘‘ అనేక ఉక్కు కంపెనీలు చైనా నుంచి పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి, చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు ఉత్పత్తిదారు కొన్నింటిలో అది ఎంతో ముందుంది, అన్నింటిలో కాదు ’’ అని జిందాల్ అన్నారు.చైనా పెట్టుబడులపై నాలుగు సంవత్సరాల ఆంక్షల తరువాత ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు సన్నిహితం కావటానికి చూస్తున్నారు, తన మేక్ ఇండియా లక్ష్యాలకు కొత్త జీవితాన్ని ఇవ్వటానికి చూస్తున్నారని కూడా రాయిటర్స్ పేర్కొన్నది. గాల్వన్ ఉదంతాల తరువాత చైనా నుంచి మన దిగుమతులు 56శాతం పెరిగాయి.వాణిజ్యలోటు రెట్టింపైంది.
చైనా పెట్టుబడుల గురించే కాదు, ఇతర అంశాలలో కూడా పునరాలోచన చేయాలని మన కార్పొరేట్ శక్తులు నరేంద్రమోడీ సర్కార్ మీద వత్తిడి తెస్తున్నాయి.‘‘ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్‌సిఇపి) పేరుతో పని చేస్తున్న ఆర్థిక కూటమిలో చేరితే మన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు హాని జరుగుతుందనే విమర్శలు, వ్యతిరేకత వెల్లడి కావటంతో మన దేశం దానికి 2019లో దూరంగా ఉంది. అయితే భారత్‌కు తలుపులు తెరిచే ఉంచామని ఆర్‌సిఇపి ప్రకటించింది. మనకు ఇప్పటికీ ముప్పు పొంచి ఉన్నప్పటికీ దానిలో చేరటం గురించి సానుకూలంగా ఆలోచించాలనే వత్తిడి క్రమంగా పెరుగుతోంది.దానికి దూరంగా ఉండటం కంటే చేరి మరింత వాణిజ్యం చేయవచ్చని చెబుతున్నారు. గత పది సంవత్సరాల్లో భారత్ వృద్ధి ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ప్రపంచ వాణిజ్యంలో దాని వాటా తక్కువగా ఉందని,వేగాధిక్యత తగ్గుతోందని ఇటీవల ప్రపంచబ్యాంకు చెప్పింది. 2030 నాటికి భారత్ లక్ష కోట్ల డాలర్ల మేర ఎగుమతి చేయాలన్న లక్ష్యాన్ని చేరాలంటే ఇప్పుడున్న విధానాలను మార్చుకోవాలని చెప్పింది. మనదేశం ఆర్‌సిఇపిలో ఉంటే చైనాకు పోటీగా ఉంటుందని అనేక దేశాలు భావించాయి. మన దేశ ప్రయోజనాల కంటే చైనాతో దగ్గర అవుతున్నామన్న భావన అమెరికాకు కలిగితే నష్టమని మోడీ సర్కార్ ఎక్కువగా భయపడిరది. దీన్లో భాగస్వామిగా మారేందుకు అమెరికా తిరస్కరించింది.చైనాకు పోటీగా అమెరికా నాయకత్వంలోని కూటమి ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకోనుందని మోడీ నాయకత్వం ఆశపడిరది. అయితే అది ఎండమావిగానే మిగిలిపోవటంతో పునరాలోచనలో పడిరది. మరోవైపున మన ఉత్పత్తిదారులు చైనా పోటీని ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. ఈ కూటమిలోని 15కు గాను 13 దేశాలతో మనకు స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలగటం లేదు.200709 నుంచి 2020`22 మధ్య కాలంలో ఈ దేశాలతో మన వాణిజ్యలోటు 303శాతం పెరిగింది, మనదేశం దీనిలో చేరితే దిగుమతి పన్నులు సున్నా అవుతాయి, అప్పుడు దిగుమతులు మరింతగా పెరుగుతాయి. అయినప్పటికీ కూటమి బయట ఉండటం కంటే లోపలే ఉండటం మేలని మన కార్పొరేట్‌లు భావిస్తున్నాయి.
అయితే ఆర్‌సిఇపిలో చేరితే కలిగే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయనే వాదనలు గతంలోనే ముందుకు వచ్చాయి. వస్తూత్పత్తిదారులు పోటీని తట్టుకోలేమని వ్యతిరేకిస్తుండగా దిగుమతి వ్యాపారులు లబ్ది పొందవచ్చనే ఆశతో అనుకూలంగా ఉన్నారు.పదేండ్లుగా మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా అంటూ లక్షల కోట్ల మేర సబ్సిడీలు ఇచ్చినా ఉత్పాదకత, ఎగుమతులు పెరగలేదని రెండవ వర్గం చేస్తున్నవాదనకు బలం చేకూరుతోంది. సేవల ఎగుమతికి అవకాశాలు పెరుగుతాయని దాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు. మనకంటే ఉత్పాదకశక్తి ఎక్కువగా ఉన్న జపాన్, దక్షిణ కొరియా, కొన్ని ఆసియన్ దేశాలు ఆర్‌సిఇపిలో చేరిన తరువాత తమదేశ వాణిజ్యలోటు పెరిగిందని గగ్గోలు పెడుతున్నాయి. అలాంటిది మన దేశం చేరితే చైనా,మరికొన్ని దేశాల ఉత్పత్తులను ఇబ్బడి ముబ్బడిగా కుమ్మరిస్తాయనే ఆందోళన కూడా ఉంది.ఇప్పటికే చైనాతో వాణిజ్య లోటు భారీగా ఉందని అది మరింతగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.మోడీ సర్కార్ ఏం చేస్తుందో, పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే !
