Tags
2023 Israel–Hamas war, Gaza Deaths, Israel genocide, israel massacre, Joe Biden, Netanyahu, US strikes in Syria
ఎం కోటేశ్వరరావు
గాజా ప్రాంతంలో అమాయక పౌరులపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ మారణకాండ. నెతన్యాహును ఎవరూ నమ్మటం లేదు, ఇజ్రాయెల్ యుద్ధ మంత్రివర్గంలో విబేధాలు.వివాద విస్తరణకు సిరియాపై అమెరికా దాడులు. లెబనాన్ సరిహద్దులో హిజబుల్లా – ఇజ్రాయెల్ మిలటరీ పరస్పరదాడులు, దాడులను ఆపేది లేదన్న యూదు దురహంకారులు. ఈ వార్తల తీరు తెన్నులు చూసినపుడు మధ్య ప్రాచ్యంలో మంటలు రేపేందుకు పశ్చిమ దేశాలు పూనుకున్నాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. గాజాలో భీకర పోరు జరుగుతున్నట్లు కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారు. అక్టోబరు ఏడు నుంచి నవంబరు ఒకటి ఉదయం వరకు వచ్చిన వార్తల ప్రకారం గాజాలో 8,525 మంది మరణించారు. వారిలో 3,542 మంది పిల్లలు, 2,187 మంది మహిళలు. వీరుగాక పశ్చిమ గట్టు ప్రాంతంలో మరో 120 మందిని ఇజ్రాయెల్ మూకలు బలితీసుకున్నాయి. గాజాలో ఇంతవరకు తొమ్మిది మంది తమ సైనికులు మరణించినట్లు ఇజ్రాయెల్ చెప్పటం తప్ప నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు.అక్కడ జరుగుతున్నది ఏకపక్ష మారణహౌమం తప్ప మరొకటి కాదు. రోజుకు మరణిస్తున్న లేదా గాయపడుతున్న పిల్లల సంఖ్య రోజుకు 420గా ఉంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో 24 దేశాల్లో జరిగిన దాడులు, ఘర్షణల్లో ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఇంత మంది పిల్లలు చనిపోలేదు. పిల్లల్ని రక్షించండి(సేవ్ చిల్డ్రన్) అనే సంస్థ ఆదివారం నాడు వెల్లడించిన సమాచారం ప్రకారం 2020లో ఇరవై రెండు దేశాల్లో 2,674 మంది,ఇరవైనాలుగు దేశాల్లో 2021లో 2,515 మంది, 2022లో 2,985 మంది మరణించారు. ఈ ఏడాది కేవలం అక్టోబరు ఏడు నుంచి 31వ తేదీ వరకు ఒక్క గాజాలో 3,542, పశ్చిమగట్టులో 36 మంది మరణించారు. తాము చంపుతున్నది హమస్ తీవ్రవాదులను అని చెబుతున్న ఇజ్రాయెల్ ప్రకటనలను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్న అపర మానవతావాదులు ఈ వివరాల గురించి ఏమంటారో !
ఇజ్రాయెల్ పాలక యంత్రాంగంలో ఉన్న విబేధాలు, కుమ్ములాటలు బయటికి వచ్చాయి. అక్టోబరు ఏడవ తేదీన జరిగిన హమస్‌దాడి గురించి తనకు ముందుగా ఎవరూ ఎలాంటి సమాచారం అందించలేదని ఆదివారం తెల్లవారు ఝామున ప్రధాని నెతన్యాహు ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. హమస్ భయపడిందని, ఒక పరిష్కారానికి సిద్దంగా ఉందనే విశ్లేషణను మిలిటరీ, గూఢచార అధిపతులు అందించారని ఆరోపించాడు. దాంతో తీవ్ర ఆగ్రహం, ఆందోళన వెల్లడి కావటంతో వెంటనే తన ట్వీట్‌ను వెనక్కు తీసుకోవటమేగాక తాను ఉపయోగించిన పదజాలం తప్పని క్షమించాలని కోరాడు. పాలకుల్లో ఉన్న విబేధాలకు ఇది నిదర్శనమని విశ్లేషకులు పేర్కొన్నారు. మిలిటరీ ఎంతో కష్టమైన దాడులను కొనసాగిస్తున్నపుడు ప్రధానిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. దేశ భద్రత, బందీలుగా ఉన్నవారి గురించి గాక కేవలం రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. నెతన్యాహు తొలుత 1996లో అధికారానికి వచ్చాడు, మధ్యలో విరామం వచ్చింది, ఇప్పటివరకు మొత్తం పదమూడు సంవత్సరాలు పదవిలో ఉన్నాడు.
ఇజ్రాయెల్ ఇరుగుపొరుగున ఉన్న దేశాలను కూడా యుద్ధంలోకి లాగేందుకు అమెరికా పూనుకుంది. అంతా చేస్తున్నది ఇరాన్ అంటూ రెచ్చగొడుతున్నది. వివిధ దేశాల్లో ఉన్న సాయుధ సంస్థలకు వెన్నుదన్నుగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నది. సిరియాలోని అలెప్పో నగర పరిసరాల శరణార్ధి శిబిరాల్లో ఇరాన్ మద్దతుదారులైన సాయుధులు ఇరాక్, సిరియాల్లోని తమ స్థావరాల మీద దాడులు చేశారని, తాము ఆత్మరక్షణ ప్రతిదాడులు చేసినట్లు అమెరికా అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ ప్రకటించాడు. గత కొద్ది రోజుల్లో పదమూడు సార్లు దాడులు జరిగినట్లు ఆరోపించాడు. ఈ ప్రాంతంలో పరిస్ధితులు దిగజారాలని తాము కోరుకోవటం లేదని తెర వెనుక నుంచి ఇరాన్ దాడులు చేయిస్తున్నట్లు ఆరోపించాడు. తమ మీద దాడి చేస్తే తాము వారిని వదలబోమన్నాడు. గాజాలో హమస్, లెబనాన్‌లో హిజబుల్లా, ఎమెన్‌లో హౌతీలు, ఇరాక్, సిరియాల్లోని వివిధ సాయుధ బృందాలకు ఇరాన్ ఆయుధాలు, నిధులు అందుతున్నాయన్నాడు. మరోవైపున లెబనాన్‌లో ఉన్న హిజబుల్లా సాయుధ బృందాలపై అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్ రెచ్చగొట్టే దాడులు జరుపుతోంది. ఇంతవరకు హిజబుల్లా రంగంలోకి దిగలేదు. రెచ్చగొట్టే సాయుధ కవ్వింపులతో పాటు మీడియా ద్వారా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారదాడి ముఖ్యంగా ఇరాన్‌పై సాగిస్తున్నారు.
గతంలో 1890దశకంలో అమెరికాలో న్యూయార్క్ వరల్డ్, న్యూయార్క్ జర్నల్ అనే రెండు పత్రికల మధ్య పోటీ తలెత్తి సంచలనాత్మక, వక్రీకరణ, కుహనా వార్తలను పెద్దక్షరాలతో ప్రచురించి పాఠకులను పెంచుకొనేందుకు చూశాయి.దీన్ని ఎల్లో జర్నలిజం అని పిలిచారు. ఆ క్రమంలోనే స్పెయిన్ ఆధీనంలో ఉన్న వలసలను ఆక్రమించేందుకు అమెరికా ప్రభుత్వం వాటికి మద్దతు కూడా ఇచ్చింది. స్పానిష్-అమెరికా యుద్ధానికి మద్దతుగా మైనే అనే అమెరికా నౌకను స్పెయిన్ ముంచివేసిందనే తప్పుడు వార్తను న్యూయార్క్ జర్నల్ ప్రచురించింది. ఆ పోరులో గెలిచిన అమెరికన్లు క్యూబా, ఫిలిప్పీన్లను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. నాటి నుంచి నేటి వరకు సామ్రాజ్యవాదులు జరిపే దాడులకు జనాన్ని తప్పుదారి పట్టించేందుకు అలాంటి తప్పుడు వార్తలను మీడియాలో ప్రవేశపెడుతూనే ఉన్నారు. హమస్, ఇరాన్, చైనా, రష్యా ఇలా సంస్థలు, దేశాల మీద ఎన్నో కట్టుకథలను రాయిస్తున్నారు. అనేక వారాల ముందే ఇజ్రాయెల్ మీద అక్టోబరు ఏడున జరిగిన దాడి కుట్రకు ఇరాన్ సాయం చేసిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ మరుసటి రోజే కథ అల్లింది. తరువాత రోజు మరో పిట్టకత చెప్పింది. ఇరాన్-సౌదీ అరేబియా మధ్య సయోధ్య కుదిర్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నపుడే ఏప్రిల్ నుంచి హమస్ తదితర సంస్థలకు ఇరాన్ శిక్షణ ఇవ్వటం ప్రారంభించిందని కూడా రాశారు. ఆ ముక్క ఇజ్రాయెల్‌కు లేదా అమెరికా పాలకులకు సదరు పత్రిక ఎందుకువెల్లడించలేదు ? ఇరాన్ మీద చమురు ఆంక్షలను అమలు జరపటంలో బైడెన్ విఫలమైన కారణంగా వచ్చిన చమురు సొమ్ముతో హమస్ సంస్థకు ఇరాన్ సాయం చేసిందని కూడా కధ అల్లింది. మరోవైపు అమెరికా మంత్రి ఆంటోని బ్లింకెన్ ఇరాన్ పాత్ర గురించి ఆధారాలు లేవు అని చెబుతాడు. ఇజ్రాయెల్ వేగులు కూడా దాన్ని పసిగట్టలేదని ఒక వైపు వారు నెత్తీనోరు కొట్టుకుంటుండగా కొద్ది వారాల ముందే కుట్ర జరిగిందని సదరు పత్రిక రాసింది. ఇలాంటి అమెరికా కట్టుకథల ఉదాహరణలను అనేకం చెప్పవచ్చు. న్యూయార్క్‌టైమ్స్ పత్రిక విలేకరి ఒకడు 2002లో ఇరాక్ తన అణ్వాయుధ కార్యక్రమాలకు అవసరమైన అల్యూమినియం గొట్టాలను సేకరించేందుకు పూనుకుందని రాశాడు. బాంబులు తయారు చేయగలిగిన వారు గొట్టాలను రూపొందించలేరా ? పాలస్తీనా ఏర్పాటుకు కేటాయించిన ప్రాంతాలను ఇజ్రాయెల్ దురాక్రమించటం గతం, తాజా పరిణామాలకు కారణం అన్నది తెలిసిందే. వారి ప్రాంతాల నుంచి వైదొలిగితే ఎవరి బతుకు వారు బతుకుతారు.దాన్ని దాచి పెట్టి అమెరికా ఒక వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేయదలచిందని, దానికి ఈజిప్టులోని సూయజ్ కాలువ, ఇరాన్-ఎమెన్‌లను కలిపే హార్ముజ్ జలసంధి, ఎమెన్-జిబౌటీ మధ్య ఉన్న ఎర్ర సముద్రం-అరేబియా సముద్రాన్ని కలిపే బాబ్ అల్ మండే జలసంధులు కీలకమని, ఈ వాణిజ్య మార్గాన్ని అడ్డుకొనేందుకు హమస్ దాడులు చేసినట్లు కథలను వ్యాపింపచేశారు.
మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ యుద్ధం చెలరేగితే తమకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయని అమెరికా ఆయుధ వ్యాపారులు, ఉత్పత్తిదారులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అదే జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు మొదలైంది.పొరుగున ఉన్న ఈజిప్టు, సిరియా, లెబనాన్, జోర్డాన్, ఆ ప్రాంత దేశాలైన ఇరాన్, కతార్ తదితర దేశాల పాత్ర ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిశి 2013 నుంచి అధికారంలో ఉన్నాడు. అంతకు ముందు ముస్లిం బ్రదర్‌హుడ్ అధికారంలో ఉంది. హమస్‌సంస్థకు చెందిన వారు దాని నుంచి విడగొట్టుకున్నవారే. తాజా పరిణామాలతో జనంలో ఇజ్రాయెల్ మీద ఉన్న వ్యతిరేకత, పాలస్తీనియన్లకు మద్దతు కారణంగా అనేక ఆంక్షల మధ్య పరిమితంగా కైరో, ఇతర చోట్ల నిరసన ప్రదర్శనలకు ఎల్ సిశి ప్రభుత్వం అవకాశం కల్పించింది తప్ప ఇష్టం ఉండి కాదు. స్వేచ్చగా అనుమతిస్తే ఆ ప్రదర్శనల పేరుతో ప్రతిపక్షం తనకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించే అవకాశం ఉందనే భయం కూడా ఉంది. అందువలన ప్రాంతీయ యుద్ధం వస్తే ఈజిప్టు పాల్గొనే అవకాశాలు లేవన్నది కొందరి భావన. గాజా నుంచి నిర్వాసితులు వస్తే తనకు సమస్యలు వస్తాయని కూడా భయపడుతున్నాడు.అందుకే గాజాతో ఉన్న సరిహద్దు తెరిచేందుకు సిద్దంగా లేడు.
లెబనాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా జనంలో అసంతృప్తి ఉంది. ఈ దశలో ఇజ్రాయెల్‌తో యుద్దాన్ని అది కోరుకోవటం లేదు. అక్కడ ఉన్న షియా ముస్లిం సామాజిక తరగతికి చెందిన హిజబుల్లా మిలిటెంట్ సంస్థ సరిహద్దులో ఇజ్రాయెల్‌తో ఇప్పటికే అడపాతడపా పోరాడుతోంది. యుద్ధం జరిగితే 2006 నుంచి రెండు దేశాల మధ్య నెలకొన్న శాంతి దెబ్బ తింటుంది. దానికి తోడు క్రైస్తవ-ఇస్లామిక్ వర్గాల మధ్య గతంలో జరిగిన మాదిరి అంతర్యుద్ధం పునరావృతమైనా ఆశ్చర్యం లేదు. అయితే హిజబుల్లా సంస్థ లెబనాన్ ప్రభుత్వంలో పాతుకుపోయింది. లక్ష మంది సాయుధులున్న దాన్ని విస్మరించటం ప్రభుత్వానికి సాధ్యం కాదు. అక్కడి మిలిటరీ కంటే ఇదే శక్తివంతమైనది, అందువలన ప్రభుత్వం కూడా దాన్ని అనుసరించటం మినహా మరొక మార్గం లేదు. ఈ సంస్థకు ఇరాన్ నుంచి సాయం అందుతోంది. అందువలన ఇరాన్ అనుమతి మీదనే హిబబుల్ నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌తో ఉన్న సరిహద్దులోని అనేక గ్రామాల్లో ఉన్న జనాన్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటీవలి వారాల్లో జరిగిన చిన్న చిన్న ఘర్షణల్లో తమ మిలిటెంట్లు 50 మంది మరణించినట్లు హిజబుల్లా ప్రకటించింది. గాజాలో భారీ ఎత్తున హత్యాకాండ కొనసాగితే హిజబుల్ జోక్యానికి మద్దతు ఇస్తామని జనం చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. లెబనాన్‌లో కూడా పాలస్తీనియన్ల హమస్, ఇతర సాయుధ బృందాలు ఉన్నాయి.వారు లెబనాన్ ప్రాంతం నుంచి కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్ మీద ప్రయోగించారు. సిరియాలో 2011 నుంచి అంతర్యుద్ధం జరుగుతోంది. అధ్యక్షుడు బషెర్ అల్ అసాద్‌కు ఇరాన్, రష్యా మిలిటరీ మద్దతు ఉంది. ఆ కారణంగానే ,ఇజ్రాయెల్ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలూ కిరాయి మూకలు, ఉగ్రవాద సంస్థలకు ఎంతగా సాయపడినా అది నిలదొక్కుకుంటున్నది. అక్టోబరు ఏడు తరువాత రాజధాని డమాస్కస్, అలెప్పో నగరాలపై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఎనిమిది మంది సిరియా సైనికులు మరణించారు. ఇక్కడ కూడా ఇరాన్ మద్దతు ఉన్న సాయుధశక్తి ఉంది. మరోదేశం కతార్‌కు ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హమస్ రాజకీయ కార్యాలయం కతార్‌లోని దోహాలో ఉంది. ఆర్థికంగా కూడా పెద్ద ఎత్తున తోడ్పడుతోంది. ఇటీవల హమస్ వద్ద ఉన్న బందీలలో నలుగురిని విడిపించటంలో కతార్ కీలక పాత్ర పోషించింది.ఈ ప్రాంతంలో తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తున్న కతార్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు, ఎలాంటి పాత్ర పోషించేది ఇంకా స్పష్టం కాలేదు. మొత్తం మీద చూసినపుడు ఇరాన్ కీలకంగా ఉన్నందున దాన్ని కవ్వించేందుకు అమెరికా పూనుకుంది.ఏం జరిగేదీ ఎవరూ ఊహించలేకపోతున్నారు.



