ఎం కోటేశ్వరరావు
కేరళలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రసవత్తర రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ గతంలో సాధించిన సీట్లను నిలుపుకోవాలని చూస్తున్నది. సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని కొనసాగించి లోక్‌సభ సీట్లును గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓట్ల కోసం కమలనాధులు దేనికైనా సిద్దపడుతున్నారు. కేరళలో 2019లో ఇరవై స్థానాలకు గాను కేవలం ఒక్కచోటే సిపిఎం గెలిచింది. ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఎన్నికలకు ముందు శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఎల్‌డిఎఫ్ సమర్ధించింది. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంది, సుప్రీం కోర్టులో పునర్విచారణ జరుగుతోంది. దానికి తోడు కేంద్రంలో రెండవసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే సమర్ధవంతంగా ఎదుర్కోగలిగింది కాంగ్రెస్ మాత్రమే అని జనం నమ్మటం కాంగ్రెస్ గెలుపుకు దోహదం చేశాయి. తరువాత జరిగిన ఎన్నికల్లో, ఇప్పుడు శబరిమల వివాదం ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని తేలిపోయింది. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఐ కూడా భాగస్వాములుగా ఉండటంతో ఎవరు గెలిచినా బిజెపిని వ్యతిరేకించే వారే గనుక గతంలో మాదిరి బిజెపిని గట్టిగా వ్యతిరేకించే ముస్లింలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవకాశం లేదని సాధారణంగా కమ్యూనిస్టులను వ్యతిరేకించే ప్రముఖ పత్రిక మళయాళ మనోరమ తాజాగా ఒక సమీక్షలో పేర్కొన్నది. దానిలోని కొన్ని ముఖ్య అంశాల సారం దిగువ విధంగా ఉంది.
గత ఎన్నికల అనంతరం సిఎస్‌డిఎస్ జరిపిన సర్వేలో మూడింట రెండువంతుల మంది ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటువేసినట్లు వెల్లడైంది. గతం కంటే నరేంద్రమోడీ అధికారంలోకి రాగూడదన్న భావన ముస్లింలలో పెరిగినప్పటికీ గుడ్డిగా కాంగ్రెస్‌వైపు మొగ్గే ధోరణిలో లేరు. మధ్య ప్రదేశ్, చత్తీస్‌ఘర్ వంటి చోట్ల బిజెపి కంటే కాంగ్రెస్ ఎక్కువ హిందూత్వను అనుసరించటం ముస్లిం సామాజిక తరగతిని ఆశాభంగానికి గురి చేసింది. రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కాబోవటం లేదని చెప్పేందుకు కాంగ్రెస్ ఆలశ్యం చేయటం కూడా వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కాంగ్రెస్ మీద తొలుగుతున్న భ్రమలతో పాటు విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా సిపిఎంను చూస్తున్నారు. ” కాంగ్రెస్ నేతలు బిజెపిలో చేరే అవకాశం కోసం వేచి చూస్తున్నారు.వారు ఉన్నత రాజకీయ లక్ష్యాలనేమీ ప్రకటించటం లేదు.వారికి కేవలం అధికారం మాత్రమే ప్రధానంగా ఉంది ” అని రచయిత, ఒక పరిశోధనా సంస్థ అధ్యక్షుడు ముజిబ్ రహమాన్ కినలూర్ చెప్పారు. ” అలాంటి వలస కేరళలో కూడా కనిపిస్తోంది.ఎకె ఆంటోని కుమారుడు అనిల్ అంటోని, ఇప్పుడు కరుణాకరన్ కుమార్తె పద్మజ బిజెపిలో చేరారు.ఎవరైనా కాంగ్రెస్ ఎంపీని నమ్మాలంటే ఎంతో కష్టంగా మారుతోంది” అని కూడా ముజిబ్ చెప్పారు. ”బిజెపిని ఎదుర్కొనే అవకాశం సిపిఎంకు లేదని మాకు తెలుసు, కానీ కాంగ్రెస్‌కు ఉంది.ఇప్పుడు రెండు పార్టీలూ ఇండియా కూటమిలో ఉన్నాయి. అందువలన ఎల్‌డిఎఫ్ అభ్యర్ధిని ఎంచుకుంటే తేడా ఏముంటుంది.” అని ఇస్లామిక్ పండితుడు, రచయిత అష్రాఫ్ కడక్కల్ ప్రశ్నించారు.” ఈ సారి ప్రతి ముస్లిం ఒక అభ్యర్ధి లౌకిక వైఖరినే చూస్తారు.పార్లమెంటులో గట్టిగా లౌకికవాదాన్ని ఎవరు గట్టిగా రక్షణకు నిలబడతారు, ఉదాహరణకు జాన్ బ్రిట్టాస్(సిపిఎం రాజ్యసభ సభ్యుడు) వంటి వారిని ఎంచుకుంటారు ” అని కూడా చెప్పారు.లౌకివాద పరీక్షలో కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్, ఆర్‌ఎస్‌పి ఎంపీ ఎన్‌కే ప్రేమ చంద్రన్ ఫెయిల్ అయ్యారు. హమస్‌ను ఉగ్రవాద సంస్థ అని శశిధరూర్ వర్ణించారు.పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణకాండను గట్టిగా ఖండించలేదు. దీంతో పాలస్తీనా సంఘీభావ సభల్లో పాల్గొనే వారి జాబితా నుంచి ముస్లిం సంస్థలు శశిధరూర్ పేరును తొలగించాయి. ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కావటంతో ప్రేమచంద్రన్‌పై అపనమ్మకం ఏర్పడింది.
శుక్రవారాల్లో నమాజు తరువాత మసీదుల్లో చేసే ప్రసంగాల్లో ఎల్‌డిఎఫ్‌ను విమర్శించాలని ముస్లింలీగు కోరుతున్నది. మసీదుల్లో రాజకీయ విమర్శలు చేయకూడదని సమస్త కేరళ జమాయతుల్లా చెప్పింది.ముస్లిం లీగ్ చేస్తున్న రాజకీయాలు సమస్తలోని ఒక వర్గాన్ని ఆశాభంగానికి గురిచేశాయి.వారు ఈసారి ఎల్‌డిఎఫ్‌ను ఎంచుకోవచ్చు.లీగ్ నేతల తీరుతెన్నులను విమర్శించినందుకే పార్టీ నేత కెఎస్ హంసను బహిష్కరించారు. ఇప్పుడు సిపిఎం తన అభ్యర్ధిగా హంసను పొన్నాని బరిలో నిలిపింది.అయోధ్యలో రామాలయ నిర్మాణం గురించి నిరసన తెలపాల్సిన అవసరం లేదని, అక్కడ మసీదు నిర్మాణం కూడా చేయనున్నందున లౌకికవాదం మరింత బలపడుతుందని ముస్లింలీగ్ రాష్ట్ర అధ్యక్షుడు సాదిక్ అలీ తంగల్ చేసిన వ్యాఖ్యలను లీగ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.జ్ఞానవాపి మసీదు కూడా కావాలని సంఘపరివార్ కోరుతున్నందున అలా ఎలా మాట్లాడతారని సమస్త నేత ప్రశ్నించారు.తిరువాన్కూర్ సెంట్రల్ ప్రాంతంలో 2016 ఎల్‌డిఎఫ్‌కు ముస్లింలు 25శాతం మంది మద్దతు ఇవ్వగా 2021లో అది 50శాతానికి పెరిగింది.ఎక్కడైతే బిజెపి పోటీ ఇస్తుందని అనుకుంటారో అక్కడ ఓడించేవారిని చూసి ఎంచుకుంటారు.
కాంగ్రెస్ నేత బొమ్మతో బిజెపి ప్రచారం !
కేరళలో జగమెరిగిన కాంగ్రెస్ నేత, మాజీ సిఎం కరుణాకరన్. ఆయన కుమార్తె పద్మజ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరగానే బిజెపి పెద్దలు కాషాయ జెండాపై కరుణాకరన్ బొమ్మను ముద్రించి ప్రచారానికి దిగారు. తన తండ్రి కాంగ్రెస్ ఆస్తి అని త్రిసూర్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్ధి కె మురళీధరన్ ప్రకటించారు. నిలంబూర్‌లో నరేంద్రమోడీ, కరుణాకరన్, పద్మజ బొమ్మలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్య తీసుకోకపోవటంతో వారు వాటిని చించివేశారు. రాష్ట్రంలో మొత్తం 20లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పోటీ చేస్తున్న 16చోట్ల అభ్యర్ధులను ఖరారు చేసింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కె కరుణాకరన్, ఎకె ఆంటోనీ. ఇద్దరూ కాంగ్రెస్ ప్రముఖులే. గతంలో ఆంటోని కుమారుడు అనిల్ అంటోని బిజెపిలో చేరగా,ప్రస్తుతం ఆ పార్టీ తరఫున పత్తానంతిట్ట లోక్‌సభ బరిలో దిగారు. అక్కడ సిపిఎం నేత థామస్ ఐజాక్ పోటీ చేస్తున్నారు. పద్మజ వేణుగోపాల్ వయనాడ్‌లో రాహుల్ గాంధీ మీద ఆమె పోటీ చేయనున్నట్లు నిర్దారణగాని వార్తలు వచ్చాయి. దేశవ్యాపితంగా ఈ పోటీని సంచలనాత్మకం కావించేందుకు బిజెపి ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె సోదరుడు, ప్రస్తుతం వడకర ఎంపీగా ఉన్న మురళీధరన్ త్రిసూర్ నుంచి పోటీ చేస్తున్నట్లు ఆకస్మికంగా మార్పును ప్రకటించారు.
కాంగ్రెస్ నేతలు బిజెపిలో చేరటంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఈ రోజు కాంగ్రెస్‌లో ఉన్న నేతలు రేపుదానిలో ఉంటారన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. బిజెపిలో చేరతానని గతంలో పిసిసి అధ్యక్షుడు సుధాకరన్ స్వయంగా చెప్పారు. ఇద్దరు ప్రముఖుల పిల్లలు బిజెపిలో చేరారు. ఇంకా ఎంత మంది చేరతారో తెలియదు. కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా గెలిచినప్పటికీ వారు పార్టీలో కొనసాగుతారన్న ఎలాంటి హామీ లేదన్నారు.ఇంకా ఎంత మంది కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరతారో మీరే చూస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ విలేకర్లతో అన్నారు. అనేక మంది ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారని, మొత్తంగా బిజెపిలో చేరరన్న గ్యారంటీ ఏముందన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వందల మంది మాజీ ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ముగ్గురు పిసిసి అధ్యక్షులు బిజెపిలో చేరారని చెప్పారు.
సురేష్ గోపికి కోపమొచ్చింది ! ఓట్ల కోసం ఎన్ని తిప్పలో !!
ఈ సారి ఎలాగైనా విజయం సాధిస్తాననే ధీమాతో త్రిసూర్‌లో పోటీకి దిగిన సినీనటుడు సురేష్ గోపికి శనివారం నాడు కోపమొచ్చింది. ఒక గిరిజన కాలనీలో ప్రచారానికి వచ్చిన గోపికి కొంత మంది మహిళా వలంటీర్లు తప్ప ఓటర్లు కనిపించలేదు.దాంతో కారుదిగకుండానే వలంటీర్లు కూడా తగినంత మంది లేనపుడు ఇక్కడ పోటీ చేయటం ఎందుకు తిరువనంతపురం వెళ్లి అక్కడ కేంద్రమంత్రి చంద్రశేఖర్‌కు ప్రచారం చేస్తా అంటూ మండిపడినట్లు మీడియా పేర్కొన్నది. ఇంకా నామినేషన్ కూడా దాఖలు చేయలేదు గుర్తుపెట్టుకోండి అంటూ ఆగ్రహించారు. దాంతో కార్యకర్తలు ఇక ముందు ఇలా జరగకుండా చూస్తామంటూ క్షమాపణలు చెప్పారట. అక్కడ సోదరుడికి వ్యతిరేకంగా చెల్లి పద్మజ బిజెపి తరఫున ప్రచారం చేయనున్నట్లు వార్తలు. బిజెపిని మూడవ స్థానంలోకి నెడతామని మురళీధరన్, కాంగ్రెస్‌నే ఆ చోటులో ఉంచుతామని సురేష్ గోపి ప్రకటించారు. ఓట్ల కోసం ఈ పెద్దమనిషి నానా తిప్పలు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక మంది ప్రముఖుల సమక్షంలో తన కుమార్తె వివాహాన్ని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో నిర్వహించారు. దానికి రెండు రోజుల ముందు త్రిసూర్‌లోని ఒక చర్చిలో మేరీమాతకు ఒక బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించుకున్నారు. అయితే అది బంగారు పూత పూసిన రాగిదనే విమర్శలు రావటంతో వివాదాస్పదమైంది. దానిలో బంగారం ఎంత ఉందో పరీక్షించి చెప్పాలని చర్చి అధికారులను కాంగ్రెస్ కోరింది. ఐదు సవర్ల బంగారంతో దాన్ని చేసినట్లు కంసాలి చెప్పారు. తాను ఇచ్చినదానిలో సగం బంగారాన్ని కంసాలి తనకు తిరిగి ఇచ్చారని, 18కారట్ల బంగారంతో కిరీటాన్ని తయారు చేసినట్లు, తాను గెలిస్తే మరో పదిలక్షల విలువగల బంగారాన్ని మేరి మాతకు కానుకగా ఇస్తానని సురేష్ గోపి వివరణ ఇచ్చారు. ఎల్‌డిఎఫ్ తరఫున సిపిఐ అక్కడ పోటీ చేస్తున్నది.అక్కడ టిఎన్ ప్రతాన్ తమ అభ్యర్ధి అని కాంగ్రెస్ ఎన్నో రోజుల ముందుగానే అనధికారికంగా ప్రకటించింది. దాంతో గోడరాతలతో పాటు మూడున్నరలక్ష వాల్‌పోస్టర్లను కూడా ప్రతాపన్ ముద్రించారు. ఇప్పుడు అవన్నీ వృధా అయ్యాయి.
ఇడి దెబ్బకు బిజెపిలోకి ఫిరాయింపు !
పద్మజా వేణుగోపాల్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి బిజెపిలో చేరటానికి కారణం ఆమె భర్త డాక్టర్ వేణుగోపాల్‌ను ఇడి అధికారులు ప్రశ్నించటమేఅని కాంగ్రెస్ నాయకురాలు బిందు కృష్జ చెప్పారు. ఆమె ఎప్పటి నుంచో తమతో మాట్లాడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ అన్నారు. తన సోదరితో అన్ని బంధాలను తెంచుకున్నానని, ఆమె చేరికతో బిజెపికి ఒక్క పైసా కూడా ఉపయోగం ఉండదని మురళీధరన్ మీడియాతో చెప్పారు.తన తండ్రి ఆత్మ ఆమెను క్షమించదన్నారు.ఆమె ఫిరాయింపు వెనుక తమ కుటుంబంతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్న మాజీ డిజిపి లోక్‌నాధ్ బెహరా ఉన్నారని, అతను ప్రధాని నరేంద్రమోడీ, పినరయి విజయన్‌కూ సన్నిహితుడే అన్నారు. పత్తానం తిట్టలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత ఎకె ఆంటోని కుమారుడు అనిల్ అంటోని ఓట్లకోసం శివరాత్రి నాడు శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకున్నారు. తన పార్టీ జనపక్షంను బిజెపిలో విలీనం చేసిన పిసి జార్జి ఆ సీటును ఆశించి భంగపడ్డారు.కేరళ రాజకీయాల గురించి అనిల్ ఆంటోనికి అనుభవం లేదని అక్కడ ఓడిపోతారని ప్రకటించారు. దాంతో బిజెపి నాయకత్వం నష్టనివారణకు పూనుకొని అనిల్‌తో కలిపి శివాలయానికి పంపింది. అక్కడ జార్జి స్వయంగా అనిల్ నుదుట తిలకాన్ని దిద్దిన వీడియో వైరల్‌గా మారింది. పోటీకి దిగాలన్న తన కలను సిఎం పినరయి విజయన్, బిజెపి మిత్రపక్షం బిడిజెఎస్ నేత తుషార్ వెల్లపల్లి వమ్ముచేశారని పిసి జార్జి ఆరోపించారు.
