Tags
# Anti Sanatan Dhrma, #Annapoorani, Ayodhya Ramalayam, BJP, Narendra Modi, Nayanthara's Film, RSS, sankaracharya
ఎం కోటేశ్వరరావు
నయనతార ప్రధాన పాత్రలో నటించిన అన్నపూరణి సినిమా తమ మనోభావాలను గాయపరచిందని హిందూత్వవాదులు ఫిర్యాదు చేసిన కారణంగా నెట్‌ఫ్లిక్స్ ఆ సినిమాను తన వేదిక నుంచి తొలగించింది. ఒక బ్రాహ్మణ పూజారి కుమార్తె బతుకుతెరువు కోసం వంటగత్తెగా మారి ఎలా ఎదిగిందన్నది ప్రధాన కథ. తండ్రి ప్రసాదాలు వండి వడ్డిస్తే, కుటుంబ ఆంక్షలకు భిన్నంగా పాకశాస్త్ర కాలేజీలో చేరి మాంసాహార తయారీ నేర్చుకోవటమే గాక, ఒక రోజు తింటూ కనిపిస్తుంది. ఆ క్రమంలో ఆమెకు బలవంతంగా వివాహం చేసేందుకు తండ్రి చూడటంతో ఇష్టం లేనందున తన స్నేహితుడు ఫర్హాన్‌తో కలసి ఇంటి నుంచి పారిపోతుంది. ఈ సినిమాను సెన్సార్ బోర్డు అనుమతించిన తరువాత విడుదలైంది. అయితే కొద్ది రోజుల తరువాత ఆ కథ, చిత్రీకరణలో తమ దేవతలు మాంసాహారాన్ని తింటున్నట్లు చిత్రించారని, ఇది హిందూమత, బ్రాహ్మణ కుల మనోభావాలను గాయపరచిందంటూ ఫిర్యాదులు, పోలీసు కేసుల దాఖలు వరకు హిందూత్వవాదులు వెళ్లారు.లవ్ జీహాద్ కోణం కూడా ఉందని ఆరోపించారు. ఇదే సమయంలో అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట శాస్త్రవిరుద్దంగా జరుగుతోందంటూ ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏకంగా నలుగురు శంకరాచార్యలు తిరస్కరించారు. వారి మనోభావాలు దెబ్బతిన్న కారణంగానే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. భార్యలేని నరేంద్రమోడీ విగ్రహ ప్రతిష్ట పూజలకు అనర్హులని సామాజిక మాధ్యమంలో వ్యతిరేక, అనుకూల వాదనలు వెల్లువెత్తాయి. శంకరాచార్యుల వ్యాఖ్యల మీద మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రామాలయ ట్రస్టు చేస్తున్నది సనాతన హిందూ ధర్మ విరుద్దమని వారు ప్రకటించినప్పటికీ ఏ ఒక్క హిందూత్వవాది మనోభావాలూ గాయపడలేదు, ఆ కార్యక్రమం మీద ఎలాంటి పోలీసు కేసులు నమోదు చేయలేదు. ఎవరు ఎవరి మనోభావాలను దెబ్బతీశారు. కొందరిపైనే హిందూత్వవాదులు ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారు.శంకరాచార్యులు చెప్పిన మాటలనే ఏ నాస్తికులో, హేతువాదులో చెప్పి ఉంటే ఈ పాటికి ఎంత రచ్చ జరిగి ఉండేది !
బాబరీ మసీదు-రామ మందిర వివాదానికి సుప్రీం కోర్టు తెరదించింది. ఆ తీర్పు గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా దాన్నెవరూ సవాలు చేయలేదు. ఆ మేరకు బాబరీ మసీదును కూల్చిన ప్రాంతంలో రామాలయ నిర్మాణం జరుగుతోంది.అది పూర్తిగాక ముందే ప్రారంభానికి ముహూర్తం పెట్టటంతో కొన్ని వివాదాలు తలెత్తాయి. వాటిని నాస్తికులు, హేతువాదులు, అబ్రహామిక్ మతాల వారో చెప్పలేదు. సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధులుగా, భాష్యం చెబుతున్న నలుగురు శంకరాచార్యులే అభ్యంతరాలను లేవనెత్తారు. రామాలయ నిర్మాణం కావించిన నరేంద్రమోడీ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిధిగా రావటాన్ని సహించలేని శంకరాచార్యులు తమ మనోభావాలను గాయపరుస్తున్నారంటూ వారి మీద సామాజిక మాధ్యమంలో మోడీ భక్తులు విరుచుకుపడుతున్నారు. అసలు రామాలయ ఉద్యమంలో వారెక్కడ ఉన్నారని సవాళ్లు విసురుతున్నారు. తమ మనోభావాలను దెబ్బతీస్తూ సనాతన ధర్మ విరుద్ద పద్దతులకు తెరతీశారని శంకరాచార్యులను అనుసరించేవారు కుమిలిపోతున్నారు. ఎవరైనా నరేంద్రమోడీ చేస్తున్నది ధర్మవిరుద్దం అంటూ వీధుల్లోకి వస్తే వారి వీపులకు హామీ లేదనే వాతావరణం నేడుంది అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. హిందూ మతంలోని అసంబద్దతలు, మతం లేదా మనుస్మృతి పేరుతో అమలు జరిపిన వివక్షాపూరితమైన చర్యలను ప్రశ్నించిన నాస్తికులు, హేతువాదులు, సంస్కరణ వాదులు, పురోగామివాదులు, కమ్యూనిస్టులను హిందూ ద్వేషులు, సనాతన ధర్మవిరోధులుగా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు హిందూత్వను పరిరక్షిస్తామని చెబుతున్నవారు శంకరాచార్యులను కూడా ఆ జాబితాలో చేరుస్తారా ? లేదా సనాతనాన్ని నిలబెట్టాలని కంకణం కట్టుకున్నాం అనుకుంటున్నవారు రామాలయాన్ని రాజకీయం చేసిన నరేంద్రమోడీ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంస్థలను ధర్మం కోసం- దేశం కోసం వ్యతిరేకిస్తారో లేదో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చింది.
హిందూ ఉనికి కోసం పోరాటం(స్ట్రగుల్ ఫర్ హిందూ ఎగ్జిస్టెన్స్.ఓఆర్‌జి) అనే వెబ్ సైట్ జనవరి ఏడవ తేదీన దైనిక్ జాగరణ్ అనే పత్రిక ప్రచురించిన ఒక వ్యాసం ఆధారంగా చేసిన వ్యాఖ్యను తన సైట్‌లో ఉంచింది. నలుగురు సనాతన హిందూ ధర్మ గురువులు ఎందుకు రామ మందిర ప్రాణప్రతిష్టలో పాల్గొనటం లేదు అన్నది దాని శీర్షిక. దాన్ని రాసిన వారు ఉపేంద్ర భారతి, శౌనక్ రారు చౌదరి. వారి రచనలో పేర్కొన్న కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.” గోవర్ధన మఠ పూరీ పీఠ శంకరాచార్య స్వామి శ్రీ నిశ్చలానంద సరస్వతి అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరస్కరించారు. ఆయనిలా చెప్పారు.” పవిత్ర ఆలయ నిర్మాణంవైపుగా ప్రభుత్వ ప్రయత్నం లేదు ” ఆయన మాటల్లోనే ” ఒక సమాధి ” అని ఆ నిర్మాణాన్ని వర్ణించటాన్ని బట్టి సాంప్రదాయ ఆలయ నిర్మాణానికి ఉండవలసిన పూజ్యభావం మరియు పవిత్రత దానికి లేవు అని సూచించినట్లయింది. తగిన గౌరవంలేని స్థలానికి వెళ్లటం ఇష్టం లేదనే ఆయన నిర్ణయం వెల్లడిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవటం అంటే శ్రీరాముడిని తిరస్కరించటం కాదు. కొందరు నేతల అవకాశవాద, తిమ్మినిబమ్మిని చేసే రాజకీయాలకు వ్యతిరేకం.
శృంగేరి శారదా పీఠ శంకరాచార్య స్వామి శ్రీ భారతీ తీర్ధ ఎందుకు తిరస్కరించారంటే ఆలయ నిర్మాణం అసంపూర్తిగా జరగటమే.అలాంటి దానికి వెళ్లటం సరైన చర్యకాదు. దీనితో పాటే ఆసియాలో అతి పెద్దదైన మసీదును అయోధ్యలో నిర్మించాలని తలపెట్టటం పట్ల ఆయన తన ఆందోళన వెల్లడించారు. దురదృష్టకరమైన పరిణామాలుగా భావిస్తున్నారు.తాను, ఇతరులు కోర్టుకు రామమందిరం సాక్ష్యాలను సమర్పించామని, కానీ రామమందిర ట్రస్ట్ లేదా దాని ప్రతినిధులుగానీ ఆలయనిర్మాణంలో తమ సలహాలు తీసుకోలేదని భారతీ తీర్ధ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలో ద్వంద్వ వైఖరి ఉన్నట్లు శంకరాచార్య విమర్శించారు. రామాలయ నిర్మాణం చేసినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మనోభావాలను ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతీ తీర్ధ నిరాకరణకు ప్రాణ ప్రతిష్ట పవిత్రత, నిర్మాణ క్రమం పట్ల అసంతృప్తి, మత వ్యవహారాల పట్ల ప్రభుత్వ వైఖరికి తిరస్కరణగా చెప్పవచ్చు.
ద్వారకా పీఠ శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి అనేక అంశాల మీద ఆందోళన వెల్లడించారు. పుష్య మాసం ప్రాణప్రతిష్టకు శుభప్రదం కాదన్నది మొదటి విమర్శ.దేవతల ప్రతిష్టాపన అశుభ గడియల్లో చేపట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. సరైన సమయం వచ్చే శ్రీరామ నవమి అవుతుంది.రామ నవమి నాటికి ఎన్నికల నియమావళి అడ్డం వస్తుంది గనుక ముందుగానే ఎంచుకోవటం వ్యూహాత్మకమని, అప్పుడు జరిపితే పెద్దగా ఉపయోగం ఉండదని బిజెపి నేతలు భావించిన కారణంగానే నిర్మాణం పూర్తి కాకుండా ముందుగానే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని సదానంద సరస్వతి భావిస్తున్నారు. మతపరమైన అంశాలు, రాజకీయ ఉద్దేశ్యాలు, ప్రాణ ప్రతిష్ట సమయం, నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించటం అనే అంశాలు అయోధ్య రావటం లేదని చెప్పటానికి సదానంద సరస్వతి కారణాలుగా చెప్పవచ్చు.
ఉత్తరాఖండ్ జ్యోతిర్‌మఠ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తిరస్కరణకు మతపరమైన, సామాజిక అంశాలు ఉన్నాయి. వేదాలు, హిందూ మత గ్రంధాల్లో బ్రాహ్మణుల పాత్ర గురించి ప్రత్యేక స్థానం ఉంది. పూజారులుగా కేవలం వారినే నియమించాలి.ప్రత్యేకించి శూద్రులను పూజారులుగా నియమించటాన్ని ఆయన విమర్శిస్తున్నారు. మత ఆచారాల ఫలాలను అందరూ పొందటానికి అర్హులే అయినప్పటికీ శూద్రులు సేవకు మాత్రమే పరిమితం, సనాతన హిందూ ధర్మంలో వివక్ష ఉందనటాన్ని ఆయన ఖండిస్తారు.బ్రాహ్మణులకు బదులు పూజారులుగా శూద్రుల నియామకం వేదాలకు విరుద్ధం అని భావిస్తారు. అలాంటి నియామకాలు శ్రీ రాముడితో ముడివడిన ఆదర్శాలకు విరుద్దం, వేదాల్లో చెప్పినట్లు సామాజిక వ్యవస్థ ఉండాలి అంటారు. వీటికి విరుద్దంగా జరుగుతున్న కారణంగానే అవిముక్తేశ్వరానంద హాజరు కావటం లేదు. రాజకీయ లబ్దికోసం ఒకనాడు శంకరాచార్యుల పాదాల ముందు మోకరిల్లిన నరేంద్రమోడీ ఇప్పుడు సనాతన విలువలు, మర్యాదలకు భిన్నంగా అధర్మంగా వ్యవహరించటం దురదృష్టకరం. రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రారు ప్రధాని మోడీలో విష్ణు అవతారాన్ని మాత్రమే చూస్తున్నారు. నలుగురు శంకరాచార్యల్లో శివుడిని చూడలేకపోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్టలో హిందూ ధర్మంలోని ఉన్నత ధర్మ గురువులు భాగస్వాములు గాకపోవటం దురదృష్టకరం. ఇది కేవలం మతపరమైన ఎదురుదెబ్బే కాదు సామాజిక, రాజకీయ చిక్కులను కూడా తీసుకువస్తాయి. ఇదీ స్ట్రగుల్ ఫర్ హిందూ ఎగ్జిస్టెన్స్.ఓఆర్‌జి విశ్లేషణ, వ్యాఖ్య సారం. ఈ భావాలు, అభిప్రాయాలతో నిజమైన హిందువులు ఏకీభవిస్తారు తప్ప రాజకీయ హిందూత్వ వాదులకు మింగుడు పడదు. పురోగామి వాదుల దృష్టిలో మతం వ్యక్తిగతం, రాజీకీయాల్లోకి చొప్పించకూడదని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పుడు మతాన్ని రాజకీయాలకు ముడి పెట్టారని ఏకంగా శంకరాచార్యలు చెప్పటమే కొసమెరుపు.
విశ్వాసుల ఖర్మో లేక రాముడికి పరీక్షో గానీ రామాలయాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు మోసగాండ్లు బయలుదేరారు. జనవరి 22 అయోధ్య రామాలయ ప్రతిష్టకు ఆహ్వానం అంటూ వాట్సాప్ విశ్వవిద్యాలయంలో మోసగాండ్లు రెచ్చిపోతున్నారని వార్తలు.” రామజన్మ భూమి గృహసంపర్క్ అభియాన్.ఏపికే ” పేరుతో ఉన్న యాప్‌ను ఫోన్లో ఏర్పాటు చేసుకోవాలని, దానితో ప్రముఖుల పాస్‌లను పొందాలని కోరుతున్న మెసేజ్‌లు మొదలయ్యాయి.ఎవరైనా ఆ పని చేస్తే తమ సమాచారం మొత్తాన్ని దొంగలకు స్వయంగా అప్పగించినట్లే.ఇక అనేక వెబ్‌సైట్లు కూడా ప్రారంభమై దోచుకోవటం ప్రారంభించాయి. రాముడి ప్రసాదం ఉచితంగా పంపుతామని, మీరు చేయవలసిందల్లా రవాణా ఖర్చులు ముందుగా పంపటమేనని పేర్కొంటున్నాయి. ఇది మీ జేబులోని సొమ్ముతో పాటు మీ సమాచారాన్ని కూడా మోసగాండ్లకు అప్పగించటమే అవుతుంది.
