Tags
BJP, Manipur crisis, Manipur unrest, Narendra Modi, Narendra Modi Failures, No confidence motion 2023, RSS
ఎం కోటేశ్వరరావు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగానే దేశనేతలందు మన ప్రధాని నరేంద్రమోడీ వేరయా అని చెప్పక తప్పదు. సుదీర్ఘ ప్రసంగంతో తన రికార్డును బద్దలు చేశారు. గురువారం నాడు(ఆగస్టు పదవ తేదీ) తన ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ప్రశ్నలను సంధిస్తూ ప్రధాని మాట్లాడిన తీరు కూడా దాన్ని నిర్ధారించింది. మణిపూర్ మీద నోరు విప్పించేందుకే అవిశ్వాసం అన్నది తెలిసిందే. దానికి సమాధానం అంటూ 133 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో కేవలం మూడంటే మూడు నిమిషాలే (డక్కన్ హెరాల్డ్ పత్రిక) మణిపూర్ గురించి మాట్లాడారంటే మొక్కుబడి,ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో లోకానికి వెల్లడైంది. ప్రశ్నలను అడిగే చతురత ఏ ఒక్కరి సొత్తూ కాదు. మీడియాతో మాట్లాడని దేశాధినేతలెవరు లేదా ఎందరు ? ప్రజాస్వామ్యానికి మన దేశం పుట్టినిల్లు , పార్లమెంటును దేవాలయం అని వర్ణించి దానికి దూరంగా ఉండటం, మాట్లాడేందుకు ?ఇచ్చగించని ప్రధాని ఎవరు ? పార్లమెంటుకు వస్తూ సభలో చేయాల్సిన ప్రకటనను ప్రాంగణంలోని మెట్లు, గోడలను ఉద్దేశించి మొక్కుబడిగా మాట్లాడిన ప్రధాని ఎవరు అన్న ప్రశ్నలకు సమాధానం అంత కష్టమేమీ కాదు. యావత్ దేశాన్నే గాక ఐరోపా పార్లమెంటులో కూడా చర్చనీయాంశమైన మణిపూర్ దారుణాల గురించి స్పందనకు కూడా తీరికలేకుండా ప్రధాని ఉన్నారు.పార్లమెంటులో ఈ అంశం గురించి ప్రధాని నోరు విప్పాలన్న ప్రతిపక్షాల, యావత్ సమాజ వేడుకోళ్లు, విన్నపాలు, డిమాండ్లను పట్టించుకోకపోవటంతో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టి మాట్లాడించే మార్గాన్ని అనుసరించాల్సిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా తలెత్తి ఉండదు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. మణిపూర్ మీద ఏం చెబుతారో దేశానికి వెల్లడించాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రవేశపెట్టారన్నది తెలిసిందే.
మానవతుల మర్యాద మంట గలిపిన దుర్మార్గం గురించి మాట్లాడవయ్యా మహానుభావా అంటే మణిపూర్ ప్రభుత్వ ఆఫీసుల్లో మహాత్మాగాంధీ చిత్రాలను అనుమతించనపుడు అక్కడున్న ప్రభుత్వం ఎవరిది, జాతీయగీతం అలపించటాన్ని అనుమతించనపుడు ఎవరు అధికారంలో ఉన్నారు, తిరుగుబాటుదార్లు చెప్పిందే జరిగినపుడు ఏలుబడి ఎవరిది అంటూ జికె ప్రశ్నలను సంధించారు. మిజోరామ్ అమాయక పౌరుల మీద 1956 మార్చి ఐదున వైమానిక దళంతో కాంగ్రెస్ దాడులు చేయించింది అంటూ ప్రధాని మోడీ మాట్లాడిన తీరును చూసి ఏమనుకోవాలి ! జనాలకు బుర్ర తిరిగింది. అప్పుడు మిజోరంలో కాంగ్రెస్ దాడి చేయిస్తే నేడు మణిపూర్‌లో ఉన్న రెండింజన్ల పాలన సాగిస్తున్న బిజెపి మేమేన్నా తక్కువ తిన్నామా అంటూ మహిళలను నగంగా తిప్పి మానభంగం చేయించినట్లుగా ప్రధాని తర్కం ఉంది. మణిపూర్ వెళ్లి బాధితులను ఎందుకు పరామర్శించలేదు, రెండు సామాజిక తరగతుల మధ్య తలెత్తిన అనుమానాలను ఎందుకు తీర్చలేదు, ప్రధాని కనిపించటం లేదు అని పోస్లర్లు వేసి మరీ అక్కడ జనం అడుగుతున్నారు అని ప్రతిపక్షాలు అడిగాయి. వాటికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ ఎన్నడూ ఆ ప్రాంత ప్రజల మనోభావాలను అర్ధం చేసుకొనేందుకు చూడలేదు, నేను 50సార్లు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాను అన్నారు ప్రధాని. ఓట్ల కోసం వందసార్లు వెళ్లవచ్చు, ఒక రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించి జనం బిక్కుబిక్కు మంటూ దిక్కులేకుండా ఉన్నపుడు మణిపూర్ వెళ్లారా, పరామర్శించారా ,గాయపడిన మణిపూర్ పౌరుల మనోభావాలను పట్టించుకున్నారా లేదా అన్నది గీటురాయి తప్ప ఆ ప్రాంతానికి ఎన్నిసార్లు వెళ్లారు అని ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అడిగిందా ? మణిపూర్‌లో నిందితులను కఠినంగా శిక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.సమీప భవిష్యత్‌లో మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని దేశ ప్రజలకు హామీ ?ఇస్తున్నాను, దేశం మొత్తం మీతో ఉందని మణిపూర్ మహిళలు, బిడ్డలతో సహా పౌరులందరికీ నేను చెబుతున్నాను అని ప్రధాని చెప్పారు. ఈ ముక్కేదో మణిపూర్‌లో హింసాకాండ చెలరేగిన తొలి రోజుల్లోనే చెప్పి ఉంటే ? పార్లమెంటు ప్రారంభం కాగానే స్వయంగా ప్రకటన చేసి ఉంటే ఇంత రచ్చ జరిగేదా ?
తనకు లేని అధికారాన్ని పుచ్చుకొని మెయితీలను గిరిజనులుగా పరిగణిస్తూ రిజర్వేషన్లు వర్తింప చేయాలన్న మణిపూర్ హైకోర్టు ఆదేశమే కదా అక్కడ జరిగిన పరిణామాలకు కారణం.దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక వైఖరి ప్రకటించనంతవరకు గిరిజనుల్లో ఉన్న అనుమానాలు తొలగవు. ఇతర ప్రాంతాల్లోని గిరిజనులలో కూడా అదే పరిస్థితి తలెత్తవచ్చు. కానీ ప్రధాని ప్రసంగంలో దాని ప్రస్తావన లేదు. అంటే ఆ వివాదాన్ని కొనసాగించాలని చూస్తున్నారన్నది స్పష్టం. మణిపూర్ దారుణాలు జరిగినపుడు కర్ణాటకలో ఓట్ల వేటలో ఉన్నందున మోడీ గారికి వెళ్లే తీరికలేదు అనుకుందాం. ఒక ట్వీట్ ద్వారానైనా తన స్పందన ఎందుకు వెల్లడించలేదు. ట్వీట్ అంటే గుర్తుకు వచ్చింది. మణిపూర్‌లో హింసాత్మక ఉదంతాలు ఆగలేదు, ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. పక్కనే ఉన్న హర్యానాలో బుల్డోజర్లను నడిపిస్తున్న ఆటవిక పాలన సాగుతున్నది. సరిగ్గా అప్పుడు అంటే ఆగస్టు రెండున ఒక ఉదంతం జరిగింది. దాన్ని నరేంద్రమోడీ గారి ట్వీట్‌లోనే చూద్దాం. ” గత సాయంత్రం నేను భారత దక్షిణ రాష్ట్రాల ఎన్‌డిఏ ఎంపీలతో ఒక అద్భుతమైన సమావేశాన్ని జరిపాను. తరువాత గొప్ప విందు జరిగింది. దానిలో పానియారమ్, అప్పమ్, కూరగాయల కుర్మా, పులిహోర,పప్పుచారు,అడాయి. అవియాల్ ?ఇంకా కొన్ని వడ్డించారు ” అని ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు మూడవ తేదీ సాయంత్రం 4.1?కు ఒక ట్వీట్ చేశారు, దానికి విందు ఫొటోను కూడా జత చేశారు.
రోమ్ తగులబడుతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తి నిర్వాకం గురించి తెలిసిందే. పులిహౌర-పప్పుచారు రుచుల మీద ఉన్న యావ మణిపూర్ మీద ప్రధానికి ఎందుకు లేకపోయింది అన్నది ప్రశ్న. అవిశ్వాస తీర్మానం మీద సమాధానంగా ప్రధాని చేసిన మిగతా ప్రసంగమంతా కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల మీద గతంలో చేసిన దాడిని పునరుచ్చరించటం తప్ప మరేమీ లేదు.ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నిసార్లు వెళ్లిందీ ప్రధాని చెప్పారు. దేవాలయం అని వర్ణించిన పార్లమెంటుకు ప్రధాని ఎన్నిసార్లు వచ్చారు, ఎంతసేపు గడిపారు, ఏం మాట్లాడారు అన్నది ప్రశ్న.పార్లమెంటు నిబంధనల ప్రకారం ప్రధానితో సహా కేంద్ర మంత్రులు పార్లమెంటుకు వచ్చినా రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిన అవసరం లేదు గనుక వారెన్ని సార్లు వచ్చిందీ మనకు తెలియదు. మన ప్రజాస్వామ్య గొప్పతనమిది అనుకొని మన భుజాలను మనమే చరుచుకోవాలి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను 2014 ఎన్నికలపుడు నరేంద్రమోడీ విమర్శించిన తీరును చూశాము. బలహీన, నోరులేని, మౌన మోహన సింగ్ అని వర్ణించారు. గడచిన తొమ్మిది సంవత్సరాలలో అదే పెద్దముషి తాజాగా చేసిన ప్రసంగంతో కలుపుకొని పార్లమెంటులో మాట్లాడింది కేవలం 31 సార్లు మాత్రమే అని తేలింది. ఇంత కంటే ఎక్కువ సార్లు మాట్లాడినట్లు ఎవరైనా చెబితే ఆ మేరకు అంకెను సవరిద్దాం. అదే మౌన మోహన సింగ్ గారు పదేండ్ల పాలనా కాలంలో 70సార్లు మాట్లాడారు. అనేక కీలక అంశాల మీద నరేంద్రమోడీ మౌనం జగమెరిగిన సత్యం.ప్రతి ఏడాదీ రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలపటం, స్పీకర్ ఎన్నిక సందర్భంగా అభినందనలు, తన మంత్రుల పరిచయం, రామ మందిర నిర్మాణం గురించి ప్రకటనల వంటివి మోడీ ప్రసంగాల జాబితాలో ఉన్నట్లు ఇండియా టుడే ఒక విశ్లేషణలో పేర్కొన్నది.
2014లో మంత్రిగా ఉన్న సాధ్వి నిరంజన ప్రతిపక్షాల మీద చేసిన సంస్కారం లేని అనుచిత వ్యాఖ్యల మీద దుమారం లేవటంతో తప్పనిసరై మోడీ జోక్యం చేసుకొని పార్లమెంటులో మాట్లాడటం, తరువాత ఆమె మంత్రి పదవి పోవటం, ముంబై పేలుళ్లలో పాక్ జాతీయుడికి బెయిలిచ్చిన ఉదంతం మీద, ఒకసారి కాశ్మీరు మీద, మరోసారి వ్యవసాయ సంక్షోభం, పదహారవ లోక్‌సభలో ముగింపు మాటలు తప్ప మరొకటి లేదు.రాఫెల్ గురించి, అదానీ కంపెనీల మీద హిండెన్‌బర్గ్ నివేదిక వంటి అంశాల మీద నోరు విప్పలేదు. వర్తమాన లోక్‌సభలో నెలల తరబడి సాగు చట్టాల మీద పార్లమెంటు అనేక సార్లు స్థంభించినా, మిత్రపక్షం అకాలీదళ్ వెళ్లిపోయినా నోరు విప్పలేదు. బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమ మర్యాదకు భంగం కలిగించినట్లు మహిళా రెజ్లర్లు కేసులు పెట్టి ఆందోళన చేసినా నోరు మెదపలేదు. అందువలన మణిపూర్‌లో తమ పార్టీ నిర్వాకం వలన తలెత్తిన పరిస్థితి గురించి ప్రధాని మౌనంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. విధిలేక సాగు చట్టాలను రద్దు చేస్తూ జాతికి క్షమాపణలు చెబుతూ బయట మాట్లాడారు తప్ప పార్లమెంటులో కాదు. అంతకు ముందు గోరక్షకుల పేరుతో జరిపిన దురాగతాల గురించి చేసిన ప్రకటన, సిఏఏ ఆందోళన గురించి మాట్లాడింది కూడా పార్లమెంటులో కాదు. చివరికి గాల్వన్ ఉదంతాల మీద కూడా ప్రతిపక్షాలతో జరిపిన అఖిల పక్ష సమావేశంలో, టీవీలో మాత్రమే మన భూభాగంలోకి ఎవరూ రాలేదు, ఏ పోస్టునూ కదిలించలేదు అని మాట్లాడారు. ప్రతిపక్షం అవిశ్వాసం తీర్మానం పెట్టటమే తప్పు అధికారం కోసం ఆకలితో ఉన్నట్లు ప్రధాని ఆరోపించారు. చరిత్రను ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే తమ గతం గుర్తుకు వచ్చి ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద గతంలో ప్రవేశపెట్టిన అన్ని అవిశ్వాస తీర్మానాలకు బిజెపి లేదా దానికి ముందు రూపమైన జనసంఘం మద్దతివ్వటమే కాదు, తానే స్వయంగా ప్రవేశపెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి.ప్రతిపక్షాలకు అవిశ్వాస తీర్మానం ఒక ఆయుధం.దేశ చరిత్రలో 28సార్లు ప్రవేశపెట్టారు. పదహారు సంవత్సరాల పాలనలో ఇందిరా గాంధీ పదిహేను తీర్మానాలను ఎదుర్కొన్నారు. ఏ ఒక్కటీ నెగ్గలేదు.
ఇక ప్రధాని నరేంద్రమోడీ పులిహోర- ప్చుచారు ట్వీట్ మీదా నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. కొన్ని స్పందనలను చూద్దాం.” ఉప్మా ఎక్కడ మోడీ గారూ, పెరుగన్నం గురించి చెప్పలేదేం సార్, పప్పు అంటే ఏమిటి ? ” ఒక మొద్దుబారిన స్పందన ఇది, హర్యానా, మణిపూర్ తగులబడుతున్నది, ఎక్కడ చూసినా హింసాకాండ, రక్తపాతం, విద్వేష ప్రసంగాలు, ప్రతి చోటా జనం చచ్చిపోతుండగా ఈ మనిషి తాను తిన్నదాని గురించి ట్వీట్ చేశారు.అతనికేమీ సహానుభూతి లేదు, అతనేమీ పట్టించుకోరు.” ” జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు ఎందుకు వెళ్లరు,మణిపూర్‌ను ఎందుకు సందర్శించరు ?” ” ఈ మనిషి నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నారు, దేశం తగులబడుతుంటే తాను తిన్న పదార్ధాల గురించి చెబుతున్నారు ” ” మీ డిన్నర్‌లో దాక్షిణాది వంటకాలతో మజా చేసుకోండి ” ” చాలా గొప్పగా ఉందండి హర్యానా లేదా మణిపూర్‌లో గుజరాత్ నమూనా విద్వేష విస్తరణ పండగ పార్టీలా ఉంది. మీరు పార్లమెంటు లేదా మణిపూర్ ఎప్పుడు వెళతారు ” ” ఎంతటి గొప్ప మనిషిని మనం ప్రధానిగా కలిగి ఉన్నాం. మణిపూర్ సమస్య మీద వివరణ కోసం మీరు పార్లమెంటుకు రావాలని యావత్ ప్రతిపక్షం కోరుతుండగా మీరు మాత్రం తాపీగా ఉన్నారు. దక్షిణాది వంటకాల రుచులను అనుభవిస్తున్నారు. మోడీ గారూ పౌరుల గురించి మీకు ఎంత విశాల హృదయ స్పందన ఉందో కదా ! ” ” మీరు మంచి సమావేశాన్ని జరిపారు కానీ మీకు దేశంలో జరుగుతున్న దానిమీద చర్చించేందుకు తగిన సమయం లేదాు. మీరు ఆ గద్దెమీద ఎందుకు ఉన్నారు. మీ వంటి నేతను కలిగి ఉన్నాం కాబట్టి వందల సంవత్సరాల తరువాత కూడా మీ కారణంగా మనం అభివృద్ది చెందిన దేశం మాదిరి గాక అభివృద్ది చెందుతున్న దేశంలోనే ఉంటాం.” ” అద్భుతం మీరూ హాపీ మేమూ హాపీ . రకరకాల దుస్తులు, ఎన్నో రకాల వంటలు అనుభవించండి, భిన్న రుచులను అనుభవించటమే కదా జీవితం ” ” సార్ అప్పుడప్పుడూ డిన్నర్‌లో ఒక రొట్టె ముక్కను కూడా తినేందుకు ప్రయత్నించాలి మీరు. ఎందుకంటే మణిపూర్ సహాయ శిబిరాల్లో ఉంటున్నవారు తింటున్నది అదే ” ” ఎనభై కోట్ల మంది జనం ఐదు కిలోల ఉచిత రేషన్‌తో బతుకుతుండగా మీరు అనేక వంటకాలను భుజిస్తున్నారు ” ” అనేక శాంతి భద్రలతల సమస్యల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం, లక్షలాది మంది పేదా మధ్యా తరగతి జనాల ఆదాయం మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నది. మన దేశ ప్రధానికి తమ పార్టీ ఎంపీలతో కలసి ఆరగించిన ఆహార పదార్దాల గురించి ట్వీట్ చేసేందుకు వ్యవధి ఉంటుంది గానీ పరిస్థితిని అదుపు చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కనిపించటం లేదు.” వీటి గురించి వేరే వ్యాఖ్యలు అవసరమా ?
