డాక్టర్ కొల్లా రాజమోహన్
2023 అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి తరువాత పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో మారణకాండకు పూనుకుంది. ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్ధుల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని కార్పెట్ బాంబుదాడులను సాగిస్తోంది. కొరియా, వియత్నాంలపై దురాక్రమణ యుద్ధాలలో ఒక్క అంగుళంకూడా వదలకుండా ఇలాగే అమెరికా మారణహౌమాన్ని సష్టించింది. అదే చరిత్రను పునరావతం చేస్తూ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలో ఇళ్ళను భూమట్టంచేస్తూ తన పై దాడి చేసిన హమాస్ వారిని పట్టుకోలేక, 22 వేలమందికి పైగా సామాన్య అమాయక ప్రజలను హతమార్చింది. ఇందులో 70 శాతం మంది చిన్న పిల్లలు, మహిళల తోపాటుగా జర్నలిస్టులు , డాక్టర్లు కూడా వున్నారు. తీవ్ర అననుకూల పరిస్ధితులలోవార్తలను సేకరిస్తూ, సంఘర్షణలను, బాంబుదాడులను చిత్రీకరిస్తూ 90 మంది జర్నలిస్టులు తమ ప్రాణాలనర్పించారు. హ్యూమన్ రైట్స్ వాచ్ గత వారం ఇజ్రాయెల్ ప్రభుత్వం యుద్ధ నేరానికి పాల్పడిందని ప్రకటించింది. ప్రజలకు ఆహారం, నీరు అందకుండా కత్రిమ కరువు ను సష్టించి ప్రజల ప్రాణాలను తీస్తున్నఇజ్రాయల్ ప్రధాని నెతన్యాహూని ఈ నాటి హిట్లర్ అని టర్కీఅధ్యక్షుడు ఎర్డోగాన్ అన్నాడు. అంతేకాకుండా గాజాపై ఈ ఉన్మాద దాడులను ఆపేయాలి అన్నాడు. పాలస్తీనా ప్రజలకు అండగా మేమున్నామంటూ, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా ప్రదర్శను ఇస్తాంబుల్ పట్టణంలో నిర్వహించారు. మలేసియా ప్రధాని అన్వర్‌ఇబ్రహీమ్ తమది ఒక స్వతంత్ర సార్వభౌమ దేశమని, అమెరికా వత్తుడులకు లోంగమన్నారు. తమహక్కులకోసం, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లకు పూర్తి సహకారం అందిస్తామని పెద్ద ప్రజా ప్రదర్శనను నిర్వహించారు. కొలంబియా అధ్యక్షుడు పెట్రో. దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు రామపోసా , అమెరికా, జర్మనీ, బ్రిటన్, తదితర దేశాల్లో ప్రజలు గాజా ప్రజలకుఅండగా వుంటామన్నారు.
మానవ కల్పిత కరువు
గాజాలోని పాలస్తీనియన్లకు అవసరమయిన ఆహారంలో కేవలం 10 శాతం మాత్రమే అందుతున్నదని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఐరాస ఏజెన్సీలు మరియు స్వచ్చంద సహాయ సంస్థల భాగస్వామ్యం అయిన ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ ప్రచురించిన ఒక నివేదికలో, గాజాలో ఉన్న కుటుంబాలు సంక్షోభంలో తీవ్రమైన ఆహార అభద్రతతో బాధపడుతున్నట్లు పేర్కొంది. గాజాలోని మొత్తం 23 లక్షల జనాభా అతిపెద్ద మానవ కల్పిత కరువు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని హెచ్చరించింది.తక్షణ కాల్పుల విరమణ కోసం ఐ రా స పిలుపునిచ్చేందుకు వీల్లేదని అమెరికా వీటోని ప్రయోగించి తన సామ్రాజ్యవాద స్వభావాన్ని మరోసారి నిరూపించుకున్నది. గాజాలో మానవతావాద పరిస్థితి మరింత భయంకరంగా మారడంతో ఇజ్రాయెల్ సైనిక చర్య సమర్థించలేనిదిగా మారడంతో, బలమైన మద్దతుదారు అమెరికా, జర్మనీ, బ్రిటన్ లలోకూడా ప్రజలు తీవ్ర నిరసనతెలపుతున్నారు. ప్రభుత్వాలు ఇరుకున పడుతున్నాయి.ఎర్ర సముద్రంలోని ”ఇజ్రాయెల్- సంబంధిత” నౌకలపై యెమెన్ హౌతీ మిలీషియా దాడులను తీవ్రతరం చేయడంతో వివాదం మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఇజ్రాయల్-పాలస్తీనాకు పరిమితమయిన యుద్ధం సముద్రానికి మారింది.
పాలస్తీనాకు మద్దతిస్తున్న హౌతీ రెబెల్స్ ఎర్రసముద్రంలో ఇజ్రాయల్‌తో సంబంధమున్న దేశాల నౌకలపై డ్రోన్లు, క్షిపణు లతో దాడులను చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య రంగంలో ముఖ్యమైన నౌకా రవాణా రంగంలో అత్యంత కీలకమైన మార్గమిది. అమెరికా, ఐరోపా దేశాలు ఆసియా, ఆఫ్రికా దేశాలతో వ్యాపారం చేసి లాభాలను ఆర్జిస్తూన్నాయి. ఆఫ్రికా చుట్టూ తిరిగిరాకుండా ఈజిప్ట్‌లోని సూయజ్ కాలువ-ఎర్రసముద్రం మీదుగా ఆంతర్జాతీయ వాణిజ్యంసాగుతోంది. బాబ్ ఎల్ మండెప్ జలసంధి వద్ద మార్గం చాలా సన్నంగా 29 కి.మీ. మాత్రమే వుండటం వలన నౌకలపై దాడులకు అనువుగా వుంది. పక్కనే ఉన్న ఎమెన్ స్ధావరంగా చేసుకుని హౌతీ రెబెల్స్ వాణిజ్య నౌకలపై దాడుల ద్వారా గాజాలో మారణహౌమాన్ని ఆపాలని వత్తిడి తెస్తున్నారు. ఇజ్రాయల్, అమెరికా, యూరప్‌లను హడలెత్తిస్తున్నారు. మొత్తం ఆంతర్జాతీయ సమాజానికి అల్టిమేటం ఇస్తున్నారు. పది దేశాల మిలిటరీ బలగాలను ఎర్రసముద్రం లోకి దించి హౌతీలను ఎదుర్కోవాలని అమెరికా”ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్” వ్యూహాలను రచిస్తున్నది. యుద్ధ నౌకల పహారాతో నౌకలను దాడులనుండి రక్షించటానికి ఎర్రసముద్ర సంకీర్ణ రక్షణ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, బహరైన్, షెషల్స్, స్పెయిన్, నార్వే, నెదర్లాండ్, కెనడా, ఇటలీతో 10 దేశాలున్నాయి. ప్రాంతీయ దేశాలలో బలమైన సౌదీ అరేబియా, ఈజిప్టు చేరలేదు. ఒక్క బహ్రైన్ చేరింది. కూటమిలో చేరటానికి అన్ని నాటో దేశాలు ఉత్సాహం చూపటంలేదు.
గాజాపై దాడులు ఆపకపోతే ప్రపంచ ఇంటర్నెట్‌పై కూడా దాడి చేస్తామని హౌతీలు హెచ్చరించారు. బాబ్ ఎల్ మండెప్ జలసంధికి దగ్గర సముద్ర కేబుల్ నెట్ వర్క్ వైర్‌లను కత్తిరించేస్తామన్నారు. హౌతీలు వాణిజ్య నౌకల పైననే కాకుండా , అమెరికా యుద్ధనౌకలపైనా, ఇజ్రాయల్ రేవులపౖౖె కూడా దాడులను మొదలెట్టారు. వందలకొలదీ నౌకలు సముద్రంలో లంగరు వేసి ఆగిపోయాయి. అతి పెద్ద, యం.స్.సీ యునైటెడ్ వాణిజ్య నౌక పై డిసెంబర్ 26న హౌతీ మిలిటరీ మిస్సైల్ తో దాడి చేసినట్లుగా వెల్లడించింది. గెలక్సీ లీడర్ అనే ఇజ్రాయల్ వ్యాపారి నౌకను హైజాక్ చేసి 25 మంది సిబ్బందిని ఎమెన్ లో నిర్బంధించారు. ఇజ్రాయల్ తో అంటకాగుతున్న ఇండియా నౌకలను కూడా వదలలేదు. ఇండియా వస్తున్నఎం.వి.కెమ్.ఫ్లూటో నౌక పైనా, సౌదీనుండి వస్తున్న ఎం.వి.సాయిబాబా నౌకల పైన కూడా డ్రోన్ దాడులు జరిగాయి. భారతదేశం 3 యుద్ధ నౌకలను కాపలాగా పంపించింది. అందులో”ఐ యన్ యస్ మారముగో”గైడెడ్ మిస్సైల్ విధ్వంసక నౌక కూడా వుంది.
ప్రపంచ ప్రజలు ఉద్యమించాలి
నౌకలు రెడ్ సీ ద్వారా రోజుకి 16 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణించి 25 రోజులలో యూరప్ ని చేరగల్గుతున్నాయి. ఎర్రసముద్రాన్ని తప్పించి ఆఫ్రికా చుట్టూ తిరిగి గుడ్ హౌప్ మార్గం ద్వారా ప్రయాణించటానికి 43 రోజులు పడ్తుంది. వ్యయ ప్రయాసలకోర్చిరూట్ మార్చే ప్రయాణానికి 9 రోజులనుండి 30 రోజులు ఆలస్యమవుతుంది. 15 రోజులు ప్రయాణ కాలం పెరిగితే నౌకకు ఇంధనం ఖర్చు అదనంగా 10లక్షల డాలర్ల వుతాయి. వందకు పైగా వాణిజ్య నౌకలు రూటు మార్చుకున్నాయి. ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. భీమా కంపెనీలు ప్రతి కంటైనర్ మీద 700 డాలర్ల సర్ ఛార్జి విధిస్తున్నాయి. నిత్యవసరవస్తువులన్నిటికీ ఆసియా, ఆఫ్రికా దేశాలపై ఆధారపడిన అమెరికా యూరప్ దేశాలు సరుకుల రవాణా ఆలస్యాన్ని భరించలేవు. ఖర్చు పెరుగుతుంది. ఆసియా ధేశాలకు చమురు సహజ వాయువు దిగుమతులు కష్టవుతాయి. ప్రపంచవ్యాపితంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం సంభవించి ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రమాదంగా పరిణమించిన సమస్యను పరిష్కరించాలంటే గాజా పై ఇజ్రాయల్ మానవ హననాన్ని ఆపేటట్లుగా ప్రపంచ ప్రజలు ఉద్యమించాలి.
టెక్నాలజీ, ఆయుధాలు సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాయనే విశ్వాసం అన్నిసార్లూ వాస్తవం కాదని పాలస్తీనీయులు, హౌతీలు నిరూపించారు. ప్రపంచంలో అత్యంత ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఏదైనా ముందే కనుక్కోగలమనే ఇంటలిజెన్స్ నెట్ వర్క్ వున్నదనుకుని విర్రవీగే ఇజ్రాయల్ ప్రభుత్వం, హమాస్ దాడిని ముందే పసిగట్టలేకపోయింది. హఠాత్తుగా జరిగిన అక్టోబర్ 7 దాడిని జీర్ణించుకోలేక సాగిస్తున్నవిశంఖలదాడులు హమాస్ ని పట్టుకోవటం లో విఫలం చెంది విచక్షణారహితంగా సామాన్యప్రజలను హతమారుస్తున్నారు. 200 డాలర్లతో తయరయ్యే డ్రోన్ ల తో , లక్షలకోట్ల డాలర్ల విలువ చేసే నౌకలను హౌతీలు హడలెత్తిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యం సంక్షోభం లోకి జారేటట్లున్నది. వరస ఎదురుదెబ్బలు తింటూ, డాలర్ పతనం ప్రారంభమయి, ఉక్రెయిన్ లోకూడా భంగపడబోతున్న అమెరికాకు ఇజ్రాయల్ దుశ్చర్యలను చివరకంటా బలపరచటం సాధ్యంకాదు. ప్రజలే చరిత్రను నిర్మిస్తున్నారు.

