Tags
Adani bribery, Adani Group, BJP, CHANDRABABU, Gautam Adani Devised Bribery Scheme, Narendra Modi Failures, Solar Power, YS jagan
ఎం కోటేశ్వరరావు
వివాదాస్పద పారిశ్రామిక, వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ పరివారపు లంచాల బాగోతం బట్టబయలైంది. హరిత ఇంథన కొనుగోళ్ల వ్యవహారంలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్నవారికి 26.5 కోట్ల డాలర్ల మేరకు ముడుపులు చెల్లించిందని రెండు కేసులు దాఖలయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో నవంబరు 20న ఒక కేసును న్యాయశాఖ, మరో కేసును సెక్యూరిటీలు మరియు ఎక్సేంజ్‌ల నియంత్రణ సంస్థ వేసింది. ముడుపుల మొత్తంలో సింహభాగం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహనరెడ్డికి ముట్టిందని చెబుతున్నారు. అసలు తమ నేత అదానీ కంపెనీలతో ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకి)తో డిస్కామ్‌ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ఒక ప్రభుత్వరంగ సంస్థ ఎక్కడైనా లంచాలు ఇస్తుందా అని వైసిపి ఒక ప్రకటనలో అమాయకత్వాన్ని ప్రదర్శించింది. అమెరికా కోర్టులో దాఖలు చేసిన కేసుల పత్రాలలో పేర్కొన్నదాని మేరకు సంక్షిప్తంగా వివరాలు ఇలా ఉన్నాయి.తాను స్వంతంగా లేదా ప్రయివేటు సంస్థలు ఉత్పత్తి చేసిన హరిత విద్యుత్‌ను సెకి కొని అవసరమైన వారికి విక్రయిస్తుంది. ఆ మేరకు 2019 డిసెంబరు, 2020 జూలై మధ్య కాలంలో కేంద్ర పునరుత్పాదక ఇంథన మంత్రిత్వశాఖ కంపెనీ సెకి ద్వారా అదానీ కంపెనీ, మరో అమెరికా కంపెనీ అజూర్ పవర్ నుంచి పన్నెండు గిగావాట్ల విద్యుత్ కొనుగోలుకు అంగీకరించింది.దానిలో అదానీ ఎనిమిది, అమెరికా కంపెనీ నాలుగు గిగావాట్లు సరఫరా చేయాల్సి ఉంది. విద్యుత్‌ను నిలువ చేయటానికి వీలుండదు గనుక తమ దగ్గర నుంచి కొనుగోలు చేసే వారి కోసం సెకి ప్రయత్నించింది. ఒప్పందాలు చేసుకుంటేనే సదరు కంపెనీలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.
అసలు కథ ఇక్కడి నుంచి ప్రారంభమైంది.అమెరికా న్యాయశాఖ ఆరోపించిన మేరకు గౌతమ్ అదానీ, అతగాడి మేనల్లుడు సాగర్ అదానీ, వినీత్ జైన్ మరో ఐదుగురు రాష్ట్రాలలో ఉన్న పాలకులు, అధికారులకు ముడుపుల బాగోతానికి తెరతీశారు. అమెరికా, ఇతర దేశాల నుంచి అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టే వారికి తెలియకుండా ఈ అక్రమాన్ని దాచి అమెరికా చట్టాల ప్రకారం మోసం చేశారు. సెకి నుంచి ఎవరైనా విద్యుత్‌ను కొనుగోలు చేస్తేనే అదానీ, అమెరికా కంపెనీలు ముందుకు పోవాల్సి ఉంటుంది. అయితే సెకి ధర ఎక్కువగా ఉండటంతో భారీ మొత్తంలో విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలేవీ ముందుకు రాలేదు.అదానీ, అమెరికా కంపెనీల పెద్దలు కూర్చుని రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలంటే ఆయా రాష్ట్రాల నేతలు, అధికారులకు తామే ముడుపులు చెల్లించి సెకితో ఒప్పందాలు చేయించాలని పథకం వేశారు. దాని ప్రకారమే అంతా జరిగింది. అమెరికా కేసులో దాఖలు చేసిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, గౌతమ్ అదానీ అందుకోసమే కలిశారన్నది ఆరోపణ. ఆ తరువాతే 2021 డిసెంబరులో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు సెకీతో ఒప్పందాలు చేసుకున్నాయని చెబుతున్నారు. అంటే ముడుపుల బేరసారాలకే వారి కలయిక అన్నది స్పష్టం.
ఇక ఈ ఒప్పందం గురించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తాజాగా అధికారంలోకి వచ్చిన తరువాత విడుదల చేసిన శ్వేత పత్రాల సందర్భంగా చెప్పిందేమిటి ? సెకి నుంచి యూనిట్‌కు రు.2.49 చొప్పున ఏడువేల మెగావాట్లు ఆంధ్రప్రదేశ్ కొనుగోలు చేసింది. మూడువేల మెగావాట్లు 2024సెప్టెంబరు నుంచి, మరో మూడువేల మెగావాట్లు 2025 సెప్టెంబరు, మిగిలిన వెయ్యి 2026 సెప్టెంబరు నుంచి సరఫరా చేయాలి. అయితే ఒప్పంద సమయంలో మార్కెట్లో యూనిట్ ధర రు.1.99 మాత్రమే ఉందని, సెకితో ఒప్పందం వలన ఏటా వినియోగదారులపై రు.850 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, సోలార్ విద్యుత్ ప్లాంట్లకు విద్యుత్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసేందుకు చెల్లించాల్సిన సరఫరా ఛార్జీల భారాన్ని ఏటా మూడు నుంచి మూడున్నరవేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని, ఇవన్నీ కలుపుకుంటే ఒప్పంద గడువు పాతిక సంవత్సరాలలో 62వేల కోట్ల రూపాయల భారం పడుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. దీని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (పార్టీ ద్వారా విడుదల చేసిన ప్రకటన) ఏమంటున్నారు ?
గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ప్రకారం యూనిట్ ధర రు.5.10కి చేరింది. ఈ భారాన్ని తగ్గించేందుకు పదివేల మెగావాట్ల సౌరవిద్యుత్ తయారీకి జగన్ సర్కార్ నిర్ణయించింది.దాన్లో భాగంగా 2020 నవంబరులో 6,400 మెగావాట్లకోసం ఏపి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలిచింది.యూనిట్ రు.2.49, 2.58 చొప్పున సరఫరా చేసేందుకు 24 టెండర్లు వచ్చాయి. అయితే న్యాయపరమైన సమస్యలతో వాటిని రద్దు చేసింది. ఆ తరువాత యూనిట్ ధర రు.2.49కి సరఫరా చేసేందుకు సెకి ముందుకు వచ్చింది.అది 2019 జూన్‌లో ఒప్పందాలను కుదుర్చుకున్న సంస్థల నుంచి సరఫరా చేస్తుంది. విద్యుత్ సరఫరా చార్జీలను మినహాయించేందుకు సెకి అంగీకరించింది. దీని వలన ఏటా రాష్ట్రానికి రు.3,700 కోట్ల మేర ఆదా అవుతుంది. చంద్రబాబు నాయుడు విద్యుత్ సరఫరా ఛార్జీల భారం రాష్ట్రం మీద పడుతుందని అంటే జగన్మోహనరెడ్డి లేదని చెబుతున్నారు. ఏది వాస్తవమో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి, ఒప్పంద పత్రాలను జనాల పరిశీలనకు అందుబాటులో ఉంచాలి. అప్పుడే నిజం తెలుస్తుంది.
అమెరికాలో దాఖలైన కేసు జగన్‌మోహనరెడ్డి లేదా ఇతర రాష్ట్రాలలో ఒప్పందం చేసుకున్నవారి మీద కాదు. అమెరికా, అంతర్జాతీయ మదుపుదార్లను ముడుపుల గురించి మభ్యపెట్టి అదానీ కంపెనీ మోసం చేసినదాని గురించి మాత్రమే. సూదికోసం సోదికి పోతే పాత గుట్టంతా రట్టయినట్లుగా ఈ క్రమంలో ముడుపుల బాగోతం బయటపడిరది. అదానీ అండ్ కో మొత్తం 26.5 కోట్ల డాలర్లు(మన కరెన్సీలో రు.2,209 కోట్లు) ముడుపులుగా ఇచ్చారని, ఈ మొత్తంలో రు.1,750 కోట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలను ఒప్పించటానికి ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ముడుపులకు ఒప్పించిన తరువాత ఒడిషా, జమ్ము అండ్ కాశ్మీరు, తమిళనాడు, చత్తీస్‌ఘర్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. సెకి ఒప్పందాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు అదానీ సంస్థ ఏడువేల మెగావాట్లు, అమెరికా సంస్థ 650 మెగావాట్లను మిగిలిన నాలుగు రాష్ట్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. ముడుపుల గురించి దర్యాప్తు చేసేందుకు పూనుకున్న ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించినట్లు అమెరికన్ ఎఫ్‌బిఐ(మన సిబిఐ వంటిది) అధికారి ఫిర్యాదు చేశాడు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సెకి ఒప్పందం కుదుర్చుకోక ముందు 2021 ఆగస్టులో సిఎం జగన్‌మోహన రెడ్డితో గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిసినట్లు కేసులో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముడుపులు చెల్లించటం లేదా ఇచ్చేందుకు అదానీ వాగ్దానం చేసినట్లు, ఆ కారణంగానే ఒప్పందం చేసుకున్నట్లు అమెరికా సెక్యూరిటీస్ సంస్థ దాఖలు చేసిన కేసు 80, 81పేరాలలో పేర్కొన్నది. అదానీ గ్రీన్ మరియు అజూర్ పవర్ అంతర్గత వర్తమానాలలో సెకీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు అంగీకరించింది అనే సమాచారం ఉన్నట్లు మరోమాటలో చెప్పాలంటే ముడుపులు చెల్లించటం లేదా వాగ్దానం పనిచేసినట్లు కూడా పేర్కొన్నది. ఒక మెగావాట్‌కు రు.25లక్షలు చెల్లించేట్లు ఆ మొత్తం రు.1,750 కోట్లని, అదానీ కంపెనీ అంతర్గత రికార్డుల్లో ఉన్న అంశం దీనికి దగ్గరగా ఉందని కూడా చెప్పింది. ఇవన్నీ తమ మీద చేసిన నిరాధార ఆరోపణలు మాత్రమేనని, నేరం రుజువయ్యేవరకు నిందితులుగానే పరిగణించాలని అదానీ కంపెనీ వివరణ ఇచ్చింది.
అమెరికా కోర్టులో దాఖలైన కేసుల్లో ఏమి తేలుతుందో తెలియదు, అదానీ కంపెనీల మీద 2023లో హిండెన్‌బర్గ్ సంస్థ వెల్లడిరచిన నివేదిక, కొన్ని దేశాల్లో అదానీ కంపెనీల బాగోతాలు చూసిన తరువాత విదేశాల్లో మన గురించి ఒక చెడు అభిప్రాయం ఏర్పడిరదన్నది వాస్తవం. ఈ ఉదంతాల గురించి అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినందున ప్రతి వారి నోళ్లలో మనదేశం నానుతున్నది. ప్రభుత్వరంగ సంస్థ సెకి విద్యుత్‌ను అమ్మే స్థితిలో లేదన్న సందేశం, అందుకోసమే ప్రయివేటు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ నేతలకు ముడుపులు ఇచ్చినట్లు తాజా ఉదంతంతో వెల్లడైంది. విదేశాలు తిరిగి ప్రతిష్టను పెంచానని చెప్పుకున్న నరేంద్రమోడీ అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల గురించి పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. శ్రీలంక ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి అక్కడ విద్యుత్ ప్రాజెక్టును అదానీకి ఇప్పించారని వచ్చిన వార్తల గురించి చెప్పనవసరం లేదు. గతంలో హిండెన్‌బర్గ్ సంస్థ ముందుకు తెచ్చిన ఆరోపణల నిగ్గుతేల్చేందుకు పార్లమెంటరీ కమిటీ వేయాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఎందుకంటే అది తన లబ్దికోసం పనిచేసే ప్రైవేటు సంస్థ అంటూ కొట్టివేశారు. సెబిపేరుతో విచారణను నీరుగార్చారు. ఇప్పుడు అమెరికా అధికారిక సంస్థలే కేసులు దాఖలు చేసినందున మోడీ సర్కార్ గతంలో మాదిరి తప్పించుకుంటుందా ?
ఈ ఉదంతం గురించి పూర్తి వివరాలు తెలియవని, విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వివిధ రాష్ట్రాల నేతలకు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చినందున కేంద్రమే దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. ఈ ఉదంతంలో నరేంద్రమోడీచంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడినట్లు చెప్పవచ్చు. తన రాజకీయ ప్రత్యర్థి జగన్‌మోహనరెడ్డి పట్ల ఎలాంటి సానుభూతి లేకున్నా, ముడుపులు ఇచ్చినట్లు చెబుతున్నది అదానీ గనుక విచారణ గురించి చంద్రబాబు పట్టుబడతారా అన్నది సందేహమే. ఎవరు అవునన్నా కాదన్నా మోడీఅదానీ బంధం గురించి తెలిసిందే. గతంలో తాను చెట్టాపట్టాలు వేసుకు తిరిగిన డోనాల్డ్ ట్రంప్ అధికారానికి వచ్చినందున ఆ సంబంధాలతో అదానీ అండ్‌కోను బయటపడవేయిస్తే ఇక్కడ జగన్మోహనరెడ్డిని రక్షించినట్లే గాక సచ్చీలుడని అంగీకరించాల్సి ఉంటుంది. అదానీ కంపెనీల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను ఆశిస్తున్న చంద్రబాబు మాట మాత్రంగా విచారణ జరపాలన్నారు తప్ప అంతకు మించి మాట్లాడకపోవచ్చన్నది ఒక అభిప్రాయం. గతంలో వైసిపి ప్రభుత్వం అదానీ కంపెనీతో చేసుకున్న విద్యుత్ మీటర్ల ఒప్పందాన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం దాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకుంది. సెకి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే విద్యుత్ సమస్య తలెత్తవచ్చనే సాకు చూపి కొనసాగించవచ్చు. కేంద్రం తీసుకొనే నిర్ణయం, ప్రతిపక్షాలు ఈ సమస్యను ముందుకు తీసుకుపోయే తీరు తెన్నులను చూసిన తరువాత చంద్రబాబు వైఖరి నిర్ణయం కావచ్చు. అవినీతి అక్రమాలను నిలదీస్తా, తాట వలుస్తా అని గతంలో బీరాలు పలికిన జనసేన నేత పవన్ కల్యాణ్‌కూ ఇది పరీక్షే. అమెరికాకూ ఇది ప్రతిష్టాత్మకంగా మారిందనే చెప్పాలి.అక్కడి న్యాయశాఖ, ఆర్థికలావాదేవీల నియంత్రణ సంస్థ దాఖలు చేసిన కేసులు వీగిపోతే అవినీతిని సహించదనే దాని ప్రతిష్టకు భంగం కలుగుతుంది. మొత్తం మీద ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
