Tags
ఎంకెఆర్
నరేంద్రమోడీ 2014 ఎన్నికలకు ముందు బిజెపిలో తిరుగులేని నేత ! వుక్కు మనిషిగా అభిమానులు కీర్తించిన ఎల్‌కె అద్వానీని సైతం తుక్కు కింద జమకట్టి మూలన పడేసిన అపర చాణక్యుడు !! మరి నేడు ? ఏం పీకుతారో పీక్కోండి అంటూ మోడీ-అమిత్‌షాల నాయకత్వాన్ని సవాలు చేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎంత తేడా !!! ఎందుకీ పరిస్ధితి? ఏం జరుగుతోంది?
భారతీయ జనతా పార్టీ దాని పూర్వరూపాలైన జనసంఘం,జనతా పార్టీ న్యూఢిల్లీలో సాంప్రదాయంగా బలంగా వుండేవి. అలాంటిది కేంద్రంలో స్వంతంగా తొలిసారి బిజెపి అధికారానికి వచ్చిన తరువాత అక్కడ బిజెపి ఆమ్ ఆద్మీ చేతిలో చావు దెబ్బ తిన్నది. సృష్టి, స్ధితి, లయ కారకుడిగా నరేంద్రమోడీని వర్ణించినందున అక్కడ తగిలిన చావు దెబ్బకూ ఆయనే మూలం. తరువాత బీహార్‌లో పద్దతి మార్చారా అంటే అదీ లేదు, అక్కడా బిజెపి విష్ణుమూర్తి బోర్లా పడ్డాడు. తాను పాలించిన గుజరాత్ అభివృద్దికి నమూనా అని దాన్ని దేశం మొత్తానికి విస్తరింప చేస్తానని నమ్మబలికిన పెద్ద మనిషి ఇరవై నెలలు గడిచినా దాని జాడే లేదు, అంతకు ముందు కంటే వుత్పత్తి రంగంలో అధోగతిలోకి దేశం దిగజారింది. ఏ రంగంలో చూసినా పరిస్ధితి దిగజారటమే తప్ప సమీప భవిష్యత్‌లో మెరుగు పడే సూచనలు కనిపించటం లేదు. ఇంటా బయటా మరిన్ని సంస్కరణలు అమలు జరపాలన్న వత్తిడి పెరుగుతోంది. జిఎస్టి వంటి బిల్లులు ఆమోదం పొందే పరిస్ధితి కనిపించటం లేదు. నోరు తెరిస్తే జర్నలిస్టులు ఏం అడుగుతారో, ఏం చెప్పాల్సి వస్తుందో తెలియని స్ధితిలో నరేంద్రమోడీ మన్మోహన్ సింగ్ బాటలోనే మౌన ముని అవతారమెత్తారంటే అతిశయోక్తి కాదు.
ఇన్ని వైఫల్యాల తరువాత నరేంద్రమోడీకి, ఆయన అంతర్భాగం లేదా అంతరంగమైన అమిత్‌షాకు పార్టీపైన పట్టేముంటుంది. పూర్వాశ్రమంలో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్న షాట్ గన్ శతృఘ్న సిన్హా ఇప్పుడు బిజెపి మందలో ఒకడు. అద్వానీ సమక్షంలో షాపై జోకులు పేల్చుతున్నాడు. బీహార్ పీఠాన్ని ఆశించి భంగ పడ్డవారి జాబితాలో వున్నాడు. తన జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సందర్భంగా పాత గాయాన్ని మరోసారి కెలికినట్లు బీహార్ ఘోరపరాజయాన్ని జనం ముందుకు తెచ్చారు.ఆ సభలో బిజెపిలో మూలన పడేసిన అద్వానీ, యశ్వంత సిన్హా, ఇద్దరు కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, వికె సింగ్,ఎస్పి నేత అమరసింగ్,కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా కూడా హాజరై సభను రక్తి కట్టించారు.’ మా నాయకుడు అమిత్ షా బీహార్‌లో మూడింట రెండువంతుల మెజారిటీతో గెలుస్తామని జోస్యం చెప్పారు.బహుశా అలా చెప్పటం ఆయనకు అలవాటు అనుకుంటా ఎందుకంటే ఢిల్లీలో కూడా అదే చెప్పారు అక్కడ మూడింట రెండువంతులకు బదులు రెండుమూడు సీట్లు వచ్చాయి’ అని శతృఘ్న సిన్హా జోక్ చేశారు. బీహార్‌కు చెందిన ఇతర మా నాయకులు ప్రతివారూ వాటిని చిలుక పలుకుల్లా వల్లించారు. వుల్లితో కన్నీరు తెప్పించి గతంలో ఓడిపోయి మనం కన్నీరు కార్చాము ఈ సారి దానిని పునరావృతం కాకుండా ధరలు తగ్గించమని తాను చెప్పానని, తన మాట ఎవరూ వినలేదని సిన్హా ఆత్మకధలో రాసుకున్నారు. తనకు నాయకత్వం అప్పగించని కారణంగా పార్టీ ఓడిపోతుందని కొందరు తనతో చెప్పారని చివరికి అదే జరిగిందని కూడా పేర్కొన్నారు.సిన్హా ఈ విధంగా మాట్లాడటానికి తొలి ఏడాది కాలంలోనే నరేంద్రమోడీ పసేమిటో తేలిపోవటం మినహా మరొకటి కాదని వేరే చెప్పాలా ?
ప్రధాని సన్నిహితులలో ఒకరైన అరుణ్‌జైట్లీ అవినీతి గురించి ధ్వజమెత్తిన బిజెపి ఎంపీ కీర్తీ అజాద్‌పై ఏ క్షణంలో అయినా పార్టీ క్రమశిక్షణా చర్య తీసుకొనే అవకాశం వుంది. అజాద్ క్రమశిక్షణను వుల్లంఘించినట్లు క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ఆయన ప్రవర్తన పార్టీ ప్రతిష్టను దిగజార్చేదిగా వుందని కమిటీ అధ్యక్షుడు గణేషీ లాల్ వ్యాఖ్యానించాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన నిధుల అవినీతి గురించి అజాద్ ఎవరి పేరునూ ప్రస్తావించకుండానే విలేకర్ల సమావేశంలో పరోక్షంగా జెట్లీ గురించి చెప్పారు. విలేకర్లతో మాట్లాడవద్దని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించినా ఖాతరు చేయలేదు. పార్టీ ఇచ్చిన సంజాయిషీ లేఖను కూడా పట్టించుకోకుండా తానెలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకూ పాల్పడలేదని పేర్కొన్నారు.
గతంలో తాను అధ్యక్షుడిగా వున్న క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలపై ఆరోపణలు చేసినందుకు అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం పేద అయినందున తాను కేవలం ఒక రూపాయి ఫీజు తీసుకొని జైట్లీకి వ్యతిరేకంగా వాదిస్తున్నట్లు బిజెపి మాజీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు రామ్ జెత్మాలనీ చెప్పారు. దేశంలో ఎక్కువ ఫీజు తీసుకొనే న్యాయవాదిని తాను అన్న మాట వాస్తవమేనని అయితే తాను వాదించే కేసులలో కేవలం పదిశాతం మంది నుంచే డబ్బు తీసుకుంటానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వాజ్‌పేయి సర్కారులో న్యాయశాఖ మంత్రిగా వున్న తనను తొలగించటంలో అరుణ్‌జెట్లీ పాత్ర వుందని అన్నారు. తనకు జైట్లీ మీద బలమైన అభిప్రాయాలు వున్నాయని అయితే అవి మంచివి కాదని చెప్పారు. తన గురించి నాకు ఎన్నో విషయాలు తెలుసని జైట్లీకి తెలుసని కూడా అన్నారు.ఎన్నికల ప్రచారంలో చెప్పిన నల్ల ధనం గురించి మోడీ-అమిత్ షా- జెట్లీ ఎన్నో చెప్పినపుడు తాను వారి అభిమానినయ్యానని, వాటి గురించి ఇప్పుడేమీ చేయని కారణంగా తాను వారి విమర్శకుడిగా మారినట్లు జెత్మలానీ చెప్పారు.
నరేంద్రమోడీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించారని విమర్శిస్తూ సామాజిక వుద్యమ కార్యకర్త అన్నా హజారే ఒక లేఖ రాశారు. అంతకు ముందున్న కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఏ పాలనకూ మోడీ ఏలుబడికి పెద్ద తేడా కనపడటం లేదని పేర్కొన్నారు. నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానని, లోక్‌పాల్, లోకాయక్తలను సక్రమంగా అమలు చేస్తానని చెప్పిన మోడీ వాటిని విస్మరించారని పేర్కొన్నారు.ఈ విషయమై తాను ఎన్నిసార్లు లేఖలు రాసినా వాటిని చెత్తబుట్టలో వేశారని ఇది కూడా అలాంటిదే అని వ్యాఖ్యానించారు.గతంలో లంచం ఇవ్వకుండా ఆఫీసుల్లో పని జరగదని మీరు చెప్పిన మాటలను జనం నమ్మారు, ఇప్పుడు కూడా పరిస్ధితి అలాగే వుంది, ద్రవ్యోల్బణం కూడా తగ్గలేదని హజారే విమర్శించారు. చేసిన వాగ్దానాలను మరిచి పోయారని పేర్కొన్నారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో తాను దీక్ష చేపట్టిన సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు బిజెపి నేతలు సుష్మా స్వరాజ్,అరుణ్ జైట్లీ కూడా అవినీతి వ్యతిరేక బిల్లును అమోదిస్తామని తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి లేఖకు ప్రధాని స్పందించటం సాధ్యం కాదని తనకు తెలుసునని తన వంటివ వారికి సమాధానం రాయాల్సి వుందన్నారు.పివి నరసింహారావు ప్రధానిగా వున్నపుడు కొన్ని సార్లు ఫోన్లో మాట్లాడారని, వాజ్‌పేయి పూనేకు వచ్చినపుడు తన గురించి తెలుసుకున్నారని, మన్మోహన్ సింగ్ తన లేఖలకు సమాధానాలు రాసేవారని, ఆర్ఎస్ఎస్ నాయకుడు శేషాద్రి తన వూరు పహెల్ గామ్ సిద్దికీ సందర్శించి తనను గ్రామ కర్మయోగిగా ఒక పుస్తకంలో రాశారని అలాంటి తనను మోడీ విస్మరించారిని హజారే వాపోయారు.
ఇదిలా వుండగా ఇది జరిగిన కొద్ది రోజులకే మహారాష్ట్రలోని బిజెపి సర్కార్ హజారే తదితరులు ట్రస్టు సభ్యులుగా వున్న ఒక ప్రభుత్వేతర సంస్ధ పేరులోని అవినీతి వ్యతిరేక అనే పదాన్ని తొలగించనందుకు గాను వారిని ట్రస్టీలుగా తొలగిస్తూ ప్రభుత్వం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గతేడాది జూన్‌లో ఈ మేరకు అధికారులు జారీ చేసిన నోటీసులో అవినీతి వ్యతిరేక అనే పదాన్ని తొలగించకపోతే చర్య తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక సేవ తప్ప అవినీతి వ్యతిరేక చర్యలు తీసుకొనే బాధ్యత ధర్మాదాయ సంస్ధల చట్టం కింద నమోదైన సంస్ధల పని కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ నోటీసు అందుకున్న హజారే అందుకు తిరస్కరించారు.ప్రభుత్వం ఎన్జీవోలను వేధించటం మానుకొని అవినీతి నిరోధక చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం మొత్తం ఇరవై సంస్ధలకు ఇలాంటి నోటీసులే ఇచ్చింది. అవినీతి నిరోధక చర్యల పేరుతో అధికారంలోకి వచ్చిన బిజెపి సర్కార్ ఇలాంటి చర్యలకు పూనుకోవటం నిజంగా ఆశ్చర్యం గొలుపుతోంది కదూ !
