Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

   సుగర్‌ డాడీ, సుగర్‌ మమ్మీ, సుగర్‌ బేబీ ఆగండాగండి. సుగర్‌ వ్యాధి కుటుంబం గురించి చెబుతున్నారని అనుకుంటున్నారా ? కానే కాదు, ఆ వ్యాధికీ వీరికీ నక్కకూ నాగలోగలోకానికి వున్నంత దూరం. పోనీ ఈ పదాల గురించి విన్నారా ? లేదా ఎక్కడైనా తారసిల్లారా ?

     సోషల్‌ మీడియాలోని ఫేస్‌బుక్‌లో ఖాతాలున్న వారికి ఎప్పుడో ఒకప్పడు వీళ్లలో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో తగిలే వుంటారు. పబ్లిక్‌ అన్నతరువాత పది రకాల మనుషులు వుంటారు.నేను ఖాళీగా వున్నాను కావాలంటే మీరు నాతో మాట్లాడవచ్చు, నా ఫోన్‌ రీచార్జి చేయించండి నేను సెక్స్‌ ఛాట్‌ చేస్తా, నాకు చాలా డబ్బు అవసరం ప్లీజ్‌ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా ఇలాంటి మెసేజ్‌లు ఫోన్‌,ఫేస్‌బుక్‌లో చాలా మందికి రావటం, కొంత మంది స్పందించటం సర్వసాధారణం. ఇంకా చాలా దారుణమైన సందేశాలు కూడా వస్తుంటాయి. సోషల్‌ మీడియాతో ప్రయోజనంతో పాటు ఇలాంటి ప్రమాదాలు కూడా వున్నాయి.

    ముందుగా సుగర్‌ డాడీ, సుగర్‌ మమ్మీల గురించి తెలుసుకుందాం. డాడీలైతే తమ కూతురి వయస్సున్న ఆడపిల్లలను, మమ్మీలైతే తమ కొడుకుల, కూతుర్ల వయస్సులో వున్న కోడెకారు కుర్ర వాళ్లను చేరదీసి తమ దేహ అవసరాలను తీర్చుకోవటంతో పాటు వారి ఆర్ధిక అవసరాలను కూడా తీర్చే వారు. భూస్వామిక వ్యవస్ధ పెత్తనం చేస్తున్న రోజులలో సుగర్‌ డాడీలు అనేక చోట్ల తమ ఖాతాలు తెరిచేవారు, ఎంత మందిని చేరదీస్తే అంత గొప్ప భూస్వామి లేదా జమిందారు కింద లెక్క. మరి ఇప్పుడు కార్పొరేట్‌ సుగర్‌ డాడీలు ఆ స్ధానాన్ని ఆక్రమిస్తున్నారు.ఈ పరంపరలోనే సుగర్‌ మమ్మీలు కూడా తయారవుతారని వేరే చెప్పనవసరం లేదు. వారికి ఎస్కార్టులనో మరో పేరుతోనే బలయ్యేవారే సుగర్‌ బేబీలు, బాబులు.

      పెట్టుబడిదారీ విధానం బాగా పెరిగే కొద్దీ ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూ వుంటుంది. మన దేశం లేదా ప్రాంతం ఇంకా అలాంటి వున్నత ‘అభివృద్ధి’ దశకు చేరలేదు కనుక ఈ విషయాలు కొంచెం ఎబ్బెట్టుగానూ, మరీ చోద్యం గాకపోతే అనిపిస్తాయి. పెట్టుబడిదారీ వ్యవస్దలో ప్రతిదీ సరుకే. కార్పొరేట్స్‌ తమకు అవసరమైన దానిని కొనుక్కుంటారు. అభాగ్యులు, వేరే ప్రత్యామ్నాయం లేనివారు, పెట్టుబడిదారీ విలాసాలకు అలవాటు పడి వెనక్కు రాలేని వారు వారు తమ దగ్గర వున్నదానిని అది శ్రమ లేదా శరీరం ఏదైనా కావచ్చు విక్రయించటం,అవసరాలు తీర్చుకోవటం జరుగుతుంది.

     పశ్చిమ దేశాలలో ఇలాంటి వ్యాపారం లేదా సేవలు అందించేందుకు ప్రత్యేకంగా కొన్ని వెబ్‌సైట్లు కూడా పనిచేస్తున్నాయి. మన దగ్గర కూడా కొన్ని సైట్స్‌ వున్నాయి. బ్రిటన్‌లో ‘సీకింగ్‌ అరేంజ్‌మెంట్‌.కామ్‌ అనేది ఒక పేరుమోసిన సుగర్‌ డాడీ,మమ్మీ, బేబీల డేటింగ్‌ సైట్‌. పచ్చి తెలుగులో చెప్పుకోవాలంటే తార్పుడు కేంద్రం. పెట్టుబడిదారీ వ్యవస్ధకు పుట్టిన ఒక తీవ్ర అవలక్షణం.

     బ్రిటన్‌ ప్రభుత్వం ట్యూషన్‌ ఫీజులను మూడు రెట్లు పెంచిన తరువాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్ధినులు ఈ సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవటం పెరిగినట్లు తేలింది. అంటే విశ్వవిద్యాలయ విద్యను కొనుగోలు చేయటానికి స్ధోమత లేనివారు దానికి దూరంగా వుండాలి లేదా అందుకోసం దేనికైనా సిద్ధ పడాలి. బ్రిటన్‌లో అత్యంత ప్రతిష్ట కలిగిన ఆ సంస్ధకు నిర్వహణ వ్యయం చెల్లించటాన్ని నిలిపివేస్తామని ఈనెలలో ప్రభుత్వం ప్రకటించింది కనుక వచ్చే ఏడాది మరోసారి ట్యూషన్‌ ఫీజులతో పాటు వాటిని చెల్లించేందుకు డబ్బులిచ్చే సుగర్‌ డాడీల కోసం వెతికే విద్యార్దులు కూడా పెరుగుతారని ఆ కేంద్రం అంచనా వేస్తోంది.ఎంత దైన్య స్దితి, ఎంత దుర్మార్గం ?

      వెబ్‌సైట్‌లో రకరకాల సేవల గురించి వివరాలు వుంటాయి. ఏ సేవ కావాల్సిన వారు వారిని ఎంచుకోవచ్చు. అందుకు తగ్గ ఫీజు లేదా పరిహారం, బహుమతులు వుంటాయి. పైన చెప్పిన బ్రిటన్‌ డాట్‌కామ్‌లో ఈ ఏడాది జనవరి నాటికి తమకు సదరు సేవలందించేందుకు సిద్దంగా వున్నట్లు అంగీకారం తెలిపేవారు గానీ 2.25లక్షల మంది విద్యార్ధులున్నారట. మరో అంచనా ప్రకారం ఇంకా ఎక్కువ మందే వున్నారు. ఆ డాట్‌కాం స్ధాపక సిఇవో బ్రాండన్‌ వేడ్‌ దీని గురించి చెబుతూ దేశం ఒక విధంగా అత్యవసర పరిస్ధితిలో వున్నట్లుగా వుంది.అయితే వుగ్రవాదంతో కాదు, 1.2లక్షల కోట్ల పౌండ్ల విద్యార్ధుల అప్పు పేరుకుపోయి సంక్షోభానికి దారితీసేదిగా వుంది.ఎవరూ దీని గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు, మేము మిలియన్లలో గాక పోయినా లక్షల మందికి మా సైట్‌ ద్వారా విద్యకోసం చేసిన అప్పునుంచి బయట పడేట్లు తోడ్పడుతున్నాం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.

     సేవల విషయానికి వస్తే సుగర్‌ డాడీలు కొందరు వెబ్‌కామ్‌ల ముందు కూర్చొని కబుర్లు చెప్పమని అడుగుతారట. అయితే మేం బట్టలు వేసుకొనే మాట్లాడతాం అని అమ్మాయిలు షరతులు విధిస్తున్నవారు కూడా వున్నారట. ఇది అమలిన శృంగారం. కొంత మంది భౌతిక సుఖాల జోలికి పోకుండా కేవలం ఫోన్లో సంభాషిస్తూ విద్యార్దినులను ఆదుకొనే వారు కూడా వున్నారట.ఎవరైనా ఒక పరిధికి మించి డిమాండ్‌ చేస్తే దక్కిన వరకు సొమ్ము తీసుకొని గుడ్‌బై చెప్పేవారు కూడా వున్నారట.విశ్వవిద్యాలయ విద్యకోసం ఇదంతా తాము స్వచ్చందంగానే చేస్తున్నాం తప్ప ఎవరి బలవంతమూ లేదంటున్నవారు కూడా లేకపోలేదు.అయితే అవసరాల బలహీనతను సొమ్ము చేసుకోవటానికి ఏ అమ్మాయి దొరుకుతుందా అని సదరు వెబ్‌సైట్‌ వారు నిరంతరం శోధిస్తుంటారని, ఇక్కడ కూడా మహిళలు దోపిడీకి గురవుతున్నారని వేరు చెప్పనవసరం లేదు.

      పెట్టుబడిదారీ ధనిక దేశాలలో విద్యారంగం నుంచి ప్రభుత్వాలు తప్పుకోవటం, సంక్షేమ చర్యలపై కోత పెట్టటం ఎక్కువ చేయటంతో పాటు 2008లో ప్రారంభమైన ఆర్దిక సంక్షోభ సమయంలోనే బ్రిటన్‌లోనీ సీకింగ్‌ అరెంజ్‌మెంట్‌ డాట్‌ కామ్‌ 2006లో వునికిలోకి వచ్చింది. ఇప్పుడది ప్రపంచంలోనే అగ్రగామి సంస్ధ.ముందే చెప్పుకున్నట్లు విశ్వవిద్యాలయాలలో ఫీజుల రేట్లు పెరిగే కొద్దీ ఇలాంటి సైట్లలో నమోదు చేసుకొనే విద్యార్ధినుల సంఖ్య పెరుగుతోంది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 2015లో పెరుగుదల రేటు 40శాతం ఎక్కువ. అనధికారికంగా ఇంకా చాలా మంది వుంటారని వేరే చెప్పనవసరం లేదు. ఈ సేవలకు ముందుకు వస్తున్న వారి గురించి చేసిన విశ్లేషణలో ఇలాంటి వారు 21-27 సంవత్సరాల వయస్సులో వారు అత్యధికులు వున్నారు.ఇరవై నాలుగు శాతం మంది అల్పాదాయ, 56శాతం మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. సగటున వారు రెండువేల పౌండ్ల ప్రతిఫలం పొందుతున్నారు.ఆ మొత్తంలో వారి కనీస అవసరాలైన ట్యూషన్‌ ఫీజుకు 36శాతం, అద్దెకు 23, పుస్తకాలకు 20, ట్రాన్స్‌పోర్ట్‌కు 9శాతం మొత్తాలను ఖర్చు చేస్తున్నట్లు తేలింది.

      నేటి విద్యార్ధే రేపటి పౌరుడన్న సంగతేమో గానీ రేపటి రుణగ్రస్తుడిగా మారుతున్నాడన్నది 2014 సర్వేలో తేలిన సత్యం. కాలేజీల నుంచి బయట పడిన తరువాత 50 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కొంత మంది విద్య కోసం చేసిన అప్పును తీరుస్తూనే వున్నారట.డిగ్రీతో పాటు సగటున 44వేల పౌండ్ల అప్పుతో బయటకు వస్తున్నారు. రుణం తీసుకొని చదువు కొనుక్కొనే వారు బ్రిటన్‌లో నానాటికీ పెరుగుతున్నారు . అలాంటి వారు 2013లో 60శాతం వుంటే 2015 నాటికి 74శాతానికి పెరిగారు.అంటే సంక్షోభ తీవ్రతకు ఇది దర్పణం. తమ చదువు కోసం పని చేస్తున్న వారి సంఖ్య కూడా 59 నుంచి 74శాతానికి పెరిగింది. యువకులు సగటున నెలకు 412 పౌండ్లు సంపాదిస్తుంటే, యువతులు 334 పౌండ్లు పొందుతున్నారు.ఈ పూర్వరంగంలోనే అవి చాలనపుడు 2000 పౌండ్ల ఆదాయం వచ్చే సుగర్‌ బేబీస్‌గా మారుతున్నారు.

      పోనీ పని చేసి సంపాదించినా లేదా నీతి తప్పి సంపాదించి పొందిన సర్టిఫికెట్లతో మంచి వుద్యోగాలు వస్తున్నాయా, వాటితో అప్పు తీర్చగలుగుతున్నారా అంటే అదీ లేదు. చదుకు తగిన వుద్యోగాలు లేవు, అవసరానికి తగిన వేతనాలు లేవు.ఇది ఒక్క బ్రిటన్‌ పరిస్దితే కాదు మొత్తం పెట్టుబడిదారీ ధనిక దేశాలన్నింటా వున్న దౌర్బాగ్యం. దివాళాకోరు, ఖాయిలా పడిన పెట్టుబడిదారీ విధాన ఫలితమిది.

    అమెరికాలో గత ఏడు సంవత్సరాలలో 58శాతం పెరిగింది. అప్పుతో పాటు చెల్లించలేని వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. విద్యార్ది రుణం 2014లో 1.2లక్షల కోట్ల డాలర్లని, చెల్లించటంలో విఫలమైన వారు 70లక్షల మంది వున్నట్లు తేలింది.ఈ కారణంగానే ఈ ఏడాది జరగనున్న ఎన్నికలలో విద్యార్ధి రుణ సమస్య కూడా ముందుకు వచ్చింది.ఈ సమస్య గత రెండు దశాబ్దాలలోనే ముందుకు వచ్చింది.కారణం అన్ని చోట్లా వుదారవాద విధానాల పేరుతో ప్రభుత్వం చేసే ఖర్చు తగ్గించటం, ప్రజలపై భారాలు మోపుతున్న పర్యవసానాల ఫలితమిది.