ఎంకెఆర్‌

   పేరు ఏదైతేనేం పాలకులు విధించే పన్ను తమ జేబుల నుంచి మరికొంత డబ్బును ఖాళీ చేస్తుందా లేదా అని పైసా పైసా లెక్క వేసుకొనే సామాన్యులు చూస్తారు. జనం నుంచి సొమ్మును ఎలా పిండి విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టపెట్టాలా అని పాలకులు నిద్రపోకుండా నిత్యం ఆలోచిస్తుంటారు. ఇన్ని రాష్ట్రాలేమిటి, ఇన్ని రకాల పన్నులేమిటి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రేటేమిటి అబ్బే ఇలాగైతే మాకు తలనొప్పి, చికాకు పన్నుల పద్దతిని మార్చమని విదేశీ కార్పొరేట్లు డిమాండ్‌ చేయటంతో అమ్మకపు పన్ను పోయిన వ్యాట్‌ వచ్చింది. అది కూడా అంతగా నచ్చకపోవటంతో దాని స్ధానంలో జిఎస్‌టి, అంటే వస్తు, సేవల పన్ను పద్దతి పాటిస్తే దేశమంతటా ఒకే విధంగా వుంటుంది అంటూ దాన్ని ప్రవేశ పెట్టమని కోరారు. రాజరికాలలో రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా, ప్రజాస్వామ్య వ్యవస్ధల రోజుల్లో పాలకవర్గం తలచుకొంటే మార్పులకు కొరతేముంటుంది. మిగతా విషయాలలో ఎలా దెబ్బలాడుకున్నా, ఎదుటి పార్టీని ఎలా అంతం చేయాలని చూసినా ఇలాంటి విషయాలలో మాత్రం బిజెపి, కాంగ్రెస్‌ ఎంతో స్నేహంగా వ్యవహరిస్తాయి. పర్యవసానంగా జిఎస్‌టి బిల్లుకు ఆమోద ప్రక్రియ పూర్తి అయింది. ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నట్లు దీంతోనే అంతా అయిపోదు. ఆ బిల్లేమిటి, దానిలో వడ్డించబోయే పన్ను రేటెంత అనే విషయాలను నరేంద్రమోడీ వెండి తెరపై చూడాల్సిందే.

   దాని గురించిన వూహాగానాలు, అంచనాలతో అటు వ్యాపార, పారిశ్రామికవేత్తలు, ఇటు సామాన్య వినియోగదారులు అందరూ భయపడుతున్నట్లు వస్తున్న విశ్లేషణలను బట్టి చెప్పవచ్చు. అందువలన వాటి మంచి చెడ్డల గురించి రాబోయే రోజులలో చూద్దాం. ఆ బిల్లు చట్టంగా మారి అమలు కావటానికి తీసుకోవటానికి అవసరమైన తదుపరి చర్యల గురించి కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి పేర్కొన్న అంశాలను పాఠకులకు అందించటం వుపయోగంగా వుంటుందనే భావంతో దాని లింక్‌ను ఇక్కడ ఇస్తున్నాం.

Click to access p20168402.pdf