ఎం కోటేశ్వరరావు
ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయటాన్ని అంగీకరించబోమన్న హొండురాన్లపై పాలకులు వుక్కుపాదాన్ని మోపేందుకు పూనుకున్నారు. దేశమంతటా పది రోజుల పాటు కర్ఫ్యూ ప్రకటించి రక్తాన్ని కండ్ల చూస్తున్నారు. తెలియందేముంది, మేమున్నాం అంటూ సకల అప్రజాస్వామిక చర్యలకు మద్దతు ఇచ్చే అమెరికన్లు తాజా దుండగానికీ మద్దతు ఇస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. రాజకీయ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం నాటి వరకు 11మంది మరణించినట్లు మానవహక్కుల సంఘం ప్రకటించింది. మరోవైపు పోలీసు బలగాలు తాము ప్రభుత్వ ఆజ్ఞలను పాటించేది లేదని తిరుగుబాటును ప్రకటించాయి. కర్ఫ్యూను వుల్లంఘించి ప్రదర్శనలు జరుపుతున్న వారిపై బల ప్రయోగానికి నిరాకరించాయి. ప్రదర్శనల్లో పాల్గొన్నవారిని సురక్షితంగా ఇండ్లకు చేర్చేందుకు ముందుకు వస్తున్నాయి. అనేక చోట్ల పోలీసులు కూడా ప్రదర్శకులతో కలసి అధ్యక్షుడు హెర్నాండెజ్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దక్షిణ అమెరికా ఖండంలోని మధ్య అమెరికాగా పిలిచే కరీబియన్ దేశాలలో ఒకటైన హొండురాస్‌కు ఈశాన్యంలో నికరాగువా, నైరుతిలో ఎల్ సాల్వెడార్, పశ్చిమాన గౌతమాలా, దక్షిణాన పసిఫిక్, వుత్తరాన కరీబియన్ సముద్రాల మధ్యలో తొంభైలక్షల మంది జనాభా వున్న దేశమది.నవంబరు 26న ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు మితవాది జువాన్ ఆర్లొండో హెర్నాండెజ్ తిరిగి ఎన్నికౌతాడని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర శక్తులు బలపరిచిన టీవీ జర్నలిస్టు సాల్వెడార్ నసరల్లా విజయం సాధించే దిశగా వున్నట్లు ఓట్ల లెక్కింపు సరళి వెల్లడించింది. పోలైన ఓట్లలో 58శాతం లెక్కించిన సమయానికి ఐదుశాతం మెజారిటీతో నసరల్లా ముందున్నారు. అయితే సాంకేతిక కారణాలు చూపి ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. రెండు రోజుల తరువాత ప్రారంభించగా నాటకీయంగా నసరల్లా మెజారిటీ తగ్గిపోయి హెర్నాండెజ్ స్వల్పమెజారిటీకి చేరుకున్నారు. ఓట్ల లెక్కింపును నిలిపివేయగానే ఓటర్ల తీర్పును వమ్ము చేయనున్నారని గ్రహించిన నసరల్లా ఎన్నికలలో తాను గెలిచానని, తీర్పును వమ్ముచేసేందుకు పూనుకున్నందున నిరసన తెలపాలని తన మద్దతదార్లకు పిలుపునిచ్చారు.
టీవీ జర్నలిస్టు సాల్వెడార్ నసరల్లా
ఇదే సమయంలోే ఎన్నికల పరిశీలకురాలిగా వున్న అమెరికా దేశాల సంస్ధ(ఓఏఎస్) హొండూరాస్ ప్రతినిధి బృందం నాయకుడు జార్జ్ క్విరోగా ఒక ప్రకటన చేస్తూ ఓట్ల లెక్కింపులో అక్రమాలు, తప్పిదాలు, వ్యవస్ధా పరమైన సమస్యలున్నందున ఫలితాన్ని గురించి చెప్పలేమని, తిరిగి లెక్కింపు జరపాలని ప్రకటించారు. ఈ పూర్వరంగంలో అనుమానాలున్న వెయ్యి పోలింగ్ కేంద్రాల ఓట్లను తిరిగి లెక్కించిన తరువాత మొత్తం 99.98శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని, హెర్నాండెజ్ 42.98, నసరల్లా 41.39 శాతం చొప్పున పొందినట్లు సోమవారం నాడు ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే విజేత ప్రకటన చేయలేదు. శుక్రవారం రాత్రి నుంచి కర్ఫ్యూ ప్రకటించి ఈ ఓట్ల లెక్కింపు తతంగం జరిపారు. తాజా ఓటింగ్ ఫలితాన్ని ప్రకటించకముందే వాటిని తాము అంగీకరించేది లేదని అన్ని పోలింగ్ కేంద్రాల ఓట్లను తిరిగి పార్టీల ప్రతినిధుల, పరిశీలకుల సమక్షంలో జరపాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాపితంగా జనం ప్రదర్శనలకు దిగారు. భద్రతా దళాలు వారిపై భాష్పవాయు, నీటి ఫిరంగులను ప్రయోగించాయి.కొన్ని చోట్ల కాల్పులు జరిపాయి. దేశంలోని మొత్తం 5,179 పోలింగ్ బూత్‌ల ఓట్లను తిరిగి లెక్కించాలని, లేనట్లయితే నిరసన తెలుపుతామని నసరల్లా నాయకత్వంలోని అలయన్స్ పార్టీ ప్రకటించింది.
రాజధాని టెగు(టెగుసియాగల్పా)తో సహా ఎక్కడా పోలీసులు ప్రస్తుత అధ్యక్షుడు ప్రకటించిన కర్ఫ్యూ ఆజ్ఞలను అమలు జరపరని, రాజకీయ సంక్షోభం పరిష్కారమయ్యే వరకు తాము యూనిట్లకే పరిమితం అవుతామని పోలీసు ప్రతినిధి ప్రకటించారు.’ మాకు రాజకీయ సిద్ధాంతాలు లేవు, మేము శాంతిని కోరుకుంటున్నాము, మేము ప్రభుత్వ ఆజ్ఞలను పాటించేది లేదు, ఈ విషయంలో మేము అలసిపోయాము.మేము జనంతో ఘర్షణ కొనసాగించలేము, అణచివేతను కోరుకోవటం లేదు, దేశ ప్రజల మానవహక్కులను వుల్లంఘించజాలం’ అని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ప్రతినిధి ప్ర కటించాడు. అంతకు ముందు కొట్లాటల నిరోధ కోబ్రా దళ సభ్యుడు మాట్లాడుతూ ‘ఇదేమీ సమ్మె కాదు, వేతనాలు లేదా డబ్బు గురించి కాదు, మా విధి దేశ ప్రజలకు శాంతి, భద్రత కల్పించటం, వారిని అణచివేయటం కాదు, దేశ ప్రజలందరూ సురక్షితంగా వుండాలని కోరుకుంటున్నాం’ అని చెప్పారు. ఈ ప్రకటనల పరంపర కొనసాగుతుండగానే మరో పోలీసు ప్రతినిధి ఒక టీవీలో మాట్లాడుతూ కొంత మంది పోలీసులు నిరాహారదీక్షకు పూనుకుంటారని ప్రకటించారు. ‘మేము మానవహక్కుల వుల్లంఘనలో భాగస్వాముల కాబోం, మేమా పని చేస్తే త్వరలోనో తరువాతో అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుంది. వాస్తవానికి గతంలో మా వున్నతాధికారుల హక్కుల వుల్లంఘన కారణంగా మేము ఇప్పటికే పరిహారం చెల్లిస్తున్నాము.యూనిఫాంలో వున్న సిబ్బంది మెరుగైన పని పరిస్ధితులు వుండాలని కోరుతున్నారు, వాటిని మా డిప్యూటీ డైరెక్టర్ తిరస్కరించారు. మాకు కావాల్సింది యజమానులు కాదు, నాయకులు, మా కమిషనర్ నాయకుల కోవకు చెందుతారు. వీధులలో గస్తీ తిరిగే సిబ్బందికి నిరాకరించి అనుబంధంగా వుండే వారికి మాత్రమే వేతనాలు ఎందుకు పెంచారు.ఇది సరైనది కాదు. అని చెబుతూ తమ డిమాండ్లు ఇవి అని టీవీలో ఒక ప్రకటన చదివారు. మరోవైపు భద్రతా దళాలు అనేక మంది విదేశీ జర్నలిస్టులను అదుపులోకి తీసుకొని స్వదేశాకు పంపివేయటం ప్రారంభించాయి.
ఇదిలా వుండగా హొండురాస్‌లో ఎన్నికల కమిషన్ క్రమపద్దతిలో ఓట్ల లెక్కింపు జరిపిందని అమెరికా వున్నతాధికారి ఒకరు కితాబునిచ్చారు.హెర్నాండెజ్ అమెరికాకు అత్యంత సన్నిహితుడు. ఈక్రమంలోనే అతగాడిని రక్షించేందుకు పూనుకుంది.హొండురాస్ సర్కార్ అవినీతి వ్యతిరేకత పోరాటం, మానవ హక్కుల పరిరక్షణకు మద్దతు ఇస్తోందంటూ అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రక ప్రకటనలో పేర్కొన్నది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే ఇలాంటి శక్తులకు మద్దతు ఇవ్వకపోతేనే ఆశ్చర్యం. లాటిన్ అమెరికాలో నియంతలకు వ్యతిరేకంగా అనేక దేశాలలో పోరాడిన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు అధికారంలోకి రావటాన్ని అమెరికా తొలి రోజుల్లో అడ్డుకోలేకపోయింది. ఇటీవలి కాలంలో చట్టబద్దమైన కుట్రలకు తెరతీసి అనేక దేశాలలో మితవాదులకు పెద్దపీట వేసి తన మద్దతుదార్లుగా మారుస్తున్నది. హొండురాస్‌లో కూడా అదే పునరావృతం అవుతోంది.
అటు వుత్తర అమెరికా ఖండానికి ఇటు దక్షిణ అమెరికా ఖండానికి మధ్యలో కీలకమైన ప్రాంతంలో వున్న హొండూరాస్‌లో ప్రజాస్వామ్యం ఒక మేడి పండు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగంలోని ప్రతి వ్యవస్ధ ఆమోద ముద్రవేయాల్సిందే. అది నందంటే నంది పందంటే పంది. రాజ్యాంగాన్ని సవరించటం అన్నది అప్రజాస్వామికమని ఇంతవరకు ఏ కోర్టూ చెప్పలేదు.2009లో నాటి అధ్యక్షుడు మాన్యువల్ జెలయా రాజ్యాంగసవరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు నిర్ణయించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపటం రాజ్యాంగ బద్దమేనని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నిలిపివేసింది తప్ప రాజ్యాంగ సవరణ రాజ్యాంగ బద్దమా కాదా అన్న విషయం చెప్పలేదు. ఈ లోగా పార్లమెంట్, అటార్నీ జనరల్, ఎన్నికల సంఘం జెలయా నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని ప్రకటించాయి.వాటిని ఖాతరు చేయని జెలయా బ్యాలట్ పత్రాలు, బాక్సులను పోలింగ్ కేంద్రాలకు తరలించాలని జారీ చేసిన ఆదేశాన్ని మిలిటరీ అధిపతి తిరస్కరించాడు. ఈ సమయంలో తమ ఆదేశాన్ని పాటించలేదనే పేరుతో జెలయాను పదవి నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మిలిటరీ ఆయనను నిదుర మంచం మీద నుంచి తీసుకు పోయి పక్కనే వున్న కోస్టారికా దేశంలో విడిచి వచ్చింది. ఒక దేశ పౌరుడిని మరొక దేశంలో అక్రమంగా వదలి రావటం ఏ చట్టం ప్రకారం సమర్ధనీయమో, మిలిటరీ చేసిన పని తప్పోకాదో కూడా సుప్రీం కోర్టు విచారించలేదంటే ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో చూడవచ్చు. జెలయా, కుటుంబ సభ్యులు కోస్టారికా నుంచి బయలు దేరి రహస్యంగా కాలినడకన తిరిగి హొండూరాస్ చేరుకొని బ్రెజిల్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. తరువాత ఆయన మీద కేసులు ఎత్తివేసి దేశంలో కొనసాగనిచ్చారు.
రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒకసారి పదవీ బాధ్యతలలో వున్న తరువాత రెండసారి అధ్యక్షపదవికి పోటీ చేయటానికి అర్హత లేదు. ఆ రీత్యా చూసినపుడు తాజా ఎన్నికలలో అధికారంలో వున్న అధ్యక్షుడు హెర్నాండెజ్ పోటీ చేయటానికి లేదు.అయినా కేంద్ర ఎన్నికల సంఘం మూడింట రెండు ఓట్ల మెజారిటీతో ఆమోదం తెలపటంతో పోటీ చేసినా సుప్రీం కోర్టు, ఇతర రాజ్యాంగ సంస్ధలు నోరు మెదపలేదు. అనుకున్నదొకటీ అయింది ఒకటి అన్నట్లుగా సులభంగా విజయం సాధిస్తాడని అనుకున్న హెర్నాండెజ్ వెనుకబడటంతో ఆయన నియమించిన ఎన్నికల సంఘం సాంకేతిక సమస్యలు తలెత్తాయనే సాకు చూపి ఓట్ల లెక్కింపును రెండు రోజుల పాటు నిలిపివేసి మెజారిటీతో వున్న ప్రతిపక్ష అభ్యర్ధికంటే హెర్నాండెజ్‌కు స్వల్ప మెజార్టీ వచ్చిందని ప్రకటించి ఎన్నికలను బూటకంగా మార్చివేసింది. ప్రస్తుతం మెజారిటీ ఓట్లు సాధించి విజయం సాధించిన ప్రతిపక్ష అభ్యర్ధి జర్నలిస్టు అయిన సాల్వెడార్ నసరల్లా ఓ ప్రజాస్వామికవాది, గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి ప్రజామద్దతు పొందిన వ్యక్తి. ఆయనను మాజీ అధ్యక్షుడు, వామపక్షాలతో సహా పురోగామి పార్టీలు, శక్తులు బలపరిచాయి. నసరుల్లాకు వున్న అనర్హత ఏమంటే అమెరికాకు బంటుగా పనిచేస్తాడనే హమీ లేకపోవటమే. అందుకే ఓట్ల లెక్కింపు మధ్యలోనే ఫలితాన్ని తారుమారు చేశారు. అమెరికా తలచుకుంటే అక్రమాలకు కొదవా ?ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగినందున మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలి లేదా ఎన్నికను రద్దు చేసి తిరిగి జరపాలని ప్రతిపక్ష అభ్యర్ధి సాల్వెడార్ నసరల్లా డిమాండ్ చేశారు. గురు, శుక్రవారాలలో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం వుందని వార్తలు వచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ఎన్నికను తొత్తడం గావించి, మరింతగా అణచివేతకు పూనుకుంటే పరిణామాలు ఏ రూపం తీసుకొనేది చెప్పలేము.