ఎం కోటేశ్వరరావు
అనుచిత వాణిజ్య లావాదేవీలకు పాల్పడుతున్నదనే సాకుతో చైనానుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై 50బిలియన్ డాలర్ల సుంకాలను ప్ర కటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇది రాస్తున్న సమయానికి మరొక 200 బిలియన్ డాలర్ల మేరకు పన్ను విధించేందుకు సరకుల జాబితాను తయారు చేయాలంటూ అధికార గణానికి ఆదేశాలిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆందోళనతో వున్న అమెరికా రైతాంగం ఈ వార్తతో మరింత వత్తిడికి లోనైనట్లు వార్తలు వచ్చాయి. అమెరికా వ్యవసాయం అంటే పెద్ద రైతులతో పాటు కార్పొరేట్‌ల ప్రయోజనాలు ఇమిడి వుంటాయి. అందుకే వాణిజ్య యుద్దమంటే అవి గజగజలాడతాయి. అమెరికాలోని ప్రతి రైతుకు వచ్చే ఆదాయంలో వందకు ఇరవై రూపాయలు ఇతర దేశాలతో జరిపే అమెరికా వాణిజ్యంపై ఆధారపడి వుంటాయని అంచనా. అందువలన సహజంగానే వారి భయం వారికి వుంటుంది. ఇతర దేశాలతో ట్రంప్ సామరస్యంగా వున్నంత వరకు వారికి ఢోకాలేదు, తగాదా పెట్టుకుంటే తమ స్ధితి ఏమవుతుందో తెలియని అయోమయంలోకి వారు పోతారు.
అమెరికాలో ఏటా 6కోట్ల టన్నుల గోధుమలు పండుతాయి. వాటిలో సగాన్ని ఎగుమతి చేయాల్సిందే. నిజంగా వాణిజ్య యుద్ధం వాస్తవ రూపందాల్చితే వాటిని ఎక్కడ అమ్ముకోవాలన్నది ప్రశ్న. ట్రంప్ ఒక్క చైనా మీదనే కాదు అనేక దేశాల మీద తొడగొడుతున్నాడు. కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్ కూడా ప్రతి చర్యలు తీసుకొనేందుకు సిద్దమౌతున్నాయి. అమెరికా ఏటా 140 బిలియన్ డాలర్ల మేర వ్యవసాయ వుత్పత్తులను ఎగుమతి చేస్తోంది.కెనడా, మెక్సికోలు 39, చైనా 20, ఐరోపా యూనియన్ 12 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటున్నాయి. నిజంగా వాణిజ్య యుద్దమే జరిగితే సగం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. పర్యవసానాలు ఎలా వుంటాయో తెలియదు కనుక ఆచి తూచి వ్యవహరించాలని అనేక మంది సూచిస్తున్నా ట్రంప్ దూకుడు తగ్గటం లేదు. ఇది ప్రపంచీకరణ యుగం, ఎక్కడ ఏ వస్తువు లేదా విడి భాగం తయారైతే అక్కడి నుంచి మరికొన్ని చోట్ల కూర్చి వస్తువులను తయారు చేస్తున్నారు. అందువలన చైనా నుంచి అటువంటి వాటి మీద అమెరికా లేదా మరొక దేశం పన్నులు విధిస్తే దాని పర్యవసానం ఒక్క చైనాకే అనేక దేశాలమీద పడుతుంది. చైనాగనుక ప్రతికూల చర్యల్లో భాగంగా సోయా, పందిమాంస వంటి వాటిపై పన్నులు విధిస్తే మొత్తంగా అమెరికాకు పెద్దగా దెబ్బతగలకపోవచ్చుగానీ రైతాంగానికి పెద్ద దెబ్బ. గత ఏడాది చైనా దిగుమతి చేసుకున్న 95మిలియన్ టన్నుల సోయాను ఈ ఏడాది వంద టన్నులకు పెంచనుంది. వాటిలో ఒక్క అమెరికా ఎగుమతులే 33 మిలియన్ టన్నులు. వాటి మీద 25శాతం అదనంగా దిగుమతి పన్ను విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అందువలన అంత పన్ను చెల్లించి దిగుమతి చేసుకోవటమా ప్రత్యామ్నాయం చూసుకోవటమా అన్నది చైనా ముందు వుంది. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో గతేడాది 119 మిలియన్ టన్నుల సోయా వుత్పత్తి కాగా దానిలో 51మిలియన్ టన్నులు చైనాకు ఎగుమతి చేశారు. ఇది 2016కంటే 33శాతం ఎక్కువ. అమెరికా బెదిరింపులకు లొంగకుండా వుండేందుకు చైనా తన ప్రయత్నాలలో తాను వున్నట్లు ఈ పరిణామం తెలియ చేస్తోంది.బ్రెజిల్ కరెన్సీ విలువ తక్కువ వుండటంతో అమెరికా కంటే తక్కువ ధరలకు అది ఎగుమతి చేయగలుగుతోంది. దీంతో ఇటు చైనా వినియోగదారులు, అటు బ్రెజిల్ రైతులు లబ్దిపొందుతున్నారు.
మూడు దశాబ్దాల నాటి అంటే 1986ా88 సంవత్సరాలలో వున్న ప్రపంచ ధరల సగటు ప్రాతిపదికన ప్రపంచ వాణిజ్య సంస్ధ సబ్సిడీలను లెక్కిస్తోంది. అందువలన అప్పటి మన కనీస మద్దతు ధరలను ఇప్పటితో పోల్చితే చాలా ఎక్కువగా వున్నట్లు కనిపించటం సహజం, దాన్ని చూపే అమెరికా మన మీద డబ్ల్యుటివోలో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఆ సంస్ధలో వున్న నిబంధనల లసుగు లేదా ధనిక దేశాలకు అనుగుణంగా రూపొందించిన ఫార్ములాలకు అనుగుణంగా అనేక రూపాలలో తన రైతాంగానికి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ మనవంటి వర్ధమాన దేశాల రైతాంగాన్ని దెబ్బతీసేందుకు పూనుకుంది. నిబంధనావళి ప్రకారం మొత్తం వ్యవసాయ పంటల విలువలో పదిశాతం మేరకు సబ్సిడీలు ఇవ్వటానికి అవకాశం వుంది. ఆ మొత్తంలో ఏ పంటకు ఎంత ఇవ్వాలన్నది తమ ఇష్టమని ధనిక దేశాలు వాదిస్తున్నాయి. వుదాహరణకు వంద రకాల పంటలకు అనుమతించిన సబ్సిడీ మొత్తం వంద రూపాయనుకుందాం. ఒక్కొక్క పంటకు రూపాయి బదులు పది పంటలకు పది రూపాయల చొప్పున ఇస్తే అభ్యంతర పెట్టకూడదని అమెరికా వాదిస్తోంది. ఆ పద్దతిలో అమెరికా, ఐరోపా యూనియన్‌లో అనేక పంటలకు ఇచ్చే సబ్సిడీ మొత్తాలు 50శాతానికి మించాయి. వుదాహరణకు అమెరికాలో వరికి 59శాతం సబ్సిడీ ఇస్తున్నారు. 2015 నవంబరులో మింట్ పత్రికలో డాక్టర్ రవికాంత్ రాసినదాని ప్రకారం అమెరికాలో ప్రతి రైతుకు 50వేల డాలర్ల మేర సబ్సిడీ ఇవ్వగా మన దేశంలో ఇచ్చినది కేవలం 200డాలర్లే. అక్కడి వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీ జనానికి వూబకాయం పెరిగేందుకు తోడ్పడుతోందని సైంటిఫిక్ అమెరికన్ అనే పత్రిక రాసింది. ఐరోపాయూనియన్ వుమ్మడి బడ్జెట్‌లో 40శాతం వ్యవసాయ సబ్సిడీలకే కేటాయిస్తున్నారు. ఈ విషయంలో అమెరికాాఐరోపా యూనియన్ మధ్య కూడా విబేధాలు వున్న కారణంగానే వ్యవసాయంపై గత పదిహేను సంవత్సరాలుగా ఒప్పందం కుదరటం లేదు. మన దేశం నుంచి ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు, సామర్ధ్యనిర్మాణం, ఎగుమతులకు ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా రైతుల ఖాతాలో జమచేసి అమెరికా అభ్యంతర పెడుతోంది.
అమెరికా లేదా ఇతర ఐరోపా ధనిక దేశాలు మన వ్యవసాయం మీద దాడిని ప్రధానంగా కేంద్రీకరించాయి. భారీ సబ్సిడీలతో వారి వుత్పత్తులను మన దేశంలో కుమ్మరించాలని చూడటం ఒకటైతే మన వుత్పత్తులు ప్రపంచమార్కెట్లో వాటికి పోటీ రాకుండా చూడటం మరొకటి. మన దేశంలో ఏదో ఒక ఏడాదో, రెండుసార్లో తప్ప మొత్తం సబ్సిడీలు జిడిపిలో ఒకశాతానికి మించటం లేదు. ఇదే సమయంలో పారిశ్రామిక, వాణిజ్యాలకు ఏటా ఇస్తున్న పన్ను రాయితీల మొత్తం నాలుగు నుంచి ఆరులక్షల కోట్ల వరకు వుంటోంది. ఇది జిడిపిలో 5-8శాతం. ఈ రంగాలలో అమెరికా, ఇతర ధనిక దేశాల నుంచి వస్తున్న ప్రత్యక్ష పెట్టుబడులు లేదా సంస్ధల వాటాల కొనుగోలు చేస్తున్నవారికి ఈ మొత్తంలో లాభాల రూపంలో వాటా ముడుతోంది కనుక ఆ దేశాలకు ఎలాంటి అభ్యంతరాలు కనిపించటం లేదు.
ఇక అమెరికాలో ఇస్తున్న సబ్సిడీల తీరుతెన్నుల గురించి చూద్దాం. ఒక తాజా నివేదిక ప్రకారం సబ్సిడీ లేదా ప్రకృతి వైపరీత్యాల నష్ట పరిహారంగాని 1985-2016 మధ్య 27,930 వ్యవసాయ క్షేత్రాల యజమానులకు చెల్లించిన మొత్తం 19బిలియన్ డాలర్లు. ప్రస్తుతం వున్న రూపాయి మారకపు విలువలో ఏడాదికి సగటున ఒక్కొక్క యజమాని పొందిన మొత్తం నాలుగు కోట్ల 67లక్షలకు పై మాటే. గరిష్టంగా ఒక యజమాని పొందిన మొత్తం 76కోట్ల రూపాయలకు పైగా వుంది. రానున్న పది సంవత్సరాలలో వ్యవసాయ సబ్సిడీల నిమిత్తం 868 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఎవరికి ఎంత ఎలా చెల్లించాలనే అంశంపై వివాదం తలెత్తటంతో మే నెలలో వ్యవసాయ బిల్లుకు ఆమోదం లభించలేదు. సవరణలతో మరోమారు ఓటింగ్‌కు రానున్నది. పెద్ద యజమానులకు మరింత ఎక్కువ, చిన్న వారికి తగ్గించే ప్రతిపాదనలు వున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం వున్న చట్ట ప్రకారం వ్యవసాయ నష్టభయం కింద నమోదు చేసుకున్న రైతులకు ఒక వ్యక్తికి ఏడాదికి లక్షా 25వేల డాలర్లకు మించి చెల్లించే అవకాశం లేదు. ఏడాదికి తొమ్మిది లక్షల ఆదాయపరిమితిని విధించారు. ఈ పరిమితిని తగ్గించి పరిహార మొత్తాన్ని పెంచాలనే ప్రతిపాదనలున్నాయి. రైతుల బీమా ప్రీమియంలో ప్రభుత్వం 62శాతం మొత్తం చెల్లిస్తోంది. అక్కడ కూడా చిన్న రైతులకు అన్యాయం జరుగుతోందనే విమర్శలున్నాయి. బీమా కంపెనీలకు ప్రభుత్వం 14శాతం లాభానికి గ్యారంటీ ఇస్తున్నది. ఆ మేరకు ఎంత లాభం తగ్గితే అంత ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతిదానికీ నిర్ణీత ధర నిర్ణయించే అమెరికాలో రైతులకు సరఫరా చేసే నీటిని మార్కెట్ ధరలో కొన్ని సందర్భాలలో పదిశాతం మొత్తానికే అందచేస్తున్నారు. అక్కడి వ్యవసాయదారులలో పదిశాతం బడా యజమానులకు 90శాతం సబ్సిడీ అందుతున్నది. 2015లో దేశంలోని 21లక్షల మంది రైతులలో రెండులక్షల పదివేల మందికి ప్రభుత్వ చెల్లింపులలో 70, పంటల బీమా సొమ్ములో 78శాతం దక్కింది. మిగిలిన వారిలో 80శాతం మందికి నామమాత్రం లేదా అసలు అందని పరిస్ధితి వుంది.చెరకు సాగులో రసాయన ఎరువుల వాడకం వలన ఎవర్‌గ్లాడ్స్ ప్రాంతంలో వాగులు, వంకలలో చేరిన కాలుష్యాన్ని తొలగించేందుకు 2035నాటికి 10.5 బిలియన్ డాలర్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే లాభాలు యజమానులకు, కాలుష్య పరిహారం ప్రజలు చెల్లించాలన్నమాట. వ్యవసాయ వస్తువులతో వ్యాపారం చేసే వారికి కూడా ఏటా 20బిలియన్ డాలర్ల మేర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నది.
అమెరికా వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం ప్రత్యక్షంగా పరోక్షంగా 60కిపైగా పద్దతులలో రైతులకు సాయం చేస్తున్నారు. 2014లో వ్యవసాయ పరిశ్రమలో పని చేసిన వారు 8.27లక్షలు, మొత్తం వ్యవసాయ క్షేత్రాలు 20,48,000, సగటున ఒక వ్యవసాయ క్షేత్రం 440 ఎకరాలుంటుంది. పదహారు బీమా కంపెనీలు పంటల బీమా చేస్తున్నాయి. ప్రీమియం సబ్సిడీగా గత ఐదు సంవత్సరాలలో సగటున 6.7బిలియన్ డాలర్ల సబ్సిడీ చెల్లించారు.బీమా కంపెనీలకు ఇచ్చిన సబ్సిడీ 1.5బిలియన్ డాలర్లు, వాటికి వచ్చిన నష్టానికి పరిహారం 30కోట్ల డాలర్లు, ప్రభుత్వ యంత్రాంగ ఖర్చు 20కోట్ల డాలర్లు. వందరకాల పంటలకు బీమా వర్తిస్తుంది. బీమా కంపెనీలు అక్రమాలకు పాల్పడటం షరా మామూలు. ప్రభుత్వం సగటున 62శాతం బీమా సొమ్ము చెల్లిస్తోంది.2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రైతులు చెల్లించిన ప్రీమియం కంటే అదనంగా 65బిలియన్ డాలర్లు పొందారు. బీమాకు అందరూ అర్హులే కావటంతో బిలియనీర్లు కూడా సబ్సిడీలను పొందుతున్నారు.
వ్యవసాయ నష్టభయం కింద ఒక రైతు ఎకరా ఆదాయం లేదా ఆ ప్రాంతంలో ఎకరాకు గ్యారంటీ ఆదాయం కంటే తక్కువ పొందితే వారికి గ్యారంటీ ఇచ్చిన మేరకు పరిహారం చెల్లిస్తారు. ఇరవై పంటలకు దీనిని వర్తింప చేస్తున్నారు.గతేడాది 3.7బిలియన్ డాలర్లు చెల్లించారు. పార్లమెంట్ సూచించిన పంట జాతీయ సగటు ఆదాయం కంటే తక్కువ వచ్చిన రైతులకు ఆ మేరకు చెల్లిస్తారు. గతేడాది ఆ మొత్తం 3.2బిలియన్ డాలర్లుంది.పై రెండు పధకాలలో రైతులు దేనినో ఒకదానిని ఎంచుకోవాలి. ఇదే సమయంలో వారికి పంటల బీమా పరిహారం అదనం. కొన్ని ప్రాంతాలలో భూమిని అభివృద్ధి చేసినందుకు, మరికొన్ని చోట్ల సాగు నిలిపివేసి భూమిని కాపాడినందుకు కూడా ఇస్తున్న సొమ్ము మొత్తం ఏడాదికి ఐదు బిలియన్ డాలర్లుంది. పంట సమయంలో తక్కువ ధరలకు అమ్ముకోకుండా రైతాంగానికి రుణాలు ఇస్తే మంచి ధర వచ్చే వరకు పంటలను నిలువ చేసుకొనే పధకం వుంది. ఆ మేరకు ధరలు తగ్గితే దానికి కూడా పరిహారం ఇస్తారు. ఇక్కడ కూడా వ్యవసాయ సబ్సిడీలకోత లేదా ఎత్తివేయాలనే ప్రతిపాదనలు లేకపోలేదు. ఏడాదికి ఐదులక్షల డాలర్లకు మించి ఆదాయం వచ్చే రైతులకు సబ్సిడీలను ఎత్తివేస్తే ఏటా 6బిలియన్ డాలర్లు, పంటల బీమా సబ్సిడీ ఒక క్షేత్రానికి 40వేల డాలర్లకు పరిమితం చేస్తే రెండుబిలియన్ డాలర్లు ఆదాఅవుతాయని అంచనా.
అమెరికాలో 2016 సగటున ఏడాది కుటుంబాదాయం 83,143డాలర్లు కాగా వ్యవసాయ కుటుంబాలకు 1,17,918 వుంది. మొత్తంగా దారిద్య్రరేఖకు దిగువన వున్న కుటుంబాలు 14శాతం కాగా వ్యవసాయ రంగంలో అది రెండుశాతం వుంది. వ్యవసాయ సబ్సిడీలు అధిక వుత్పత్తికి దారితీస్తున్నాయని,భూమి దెబ్బతినటానికి, పర్యావరణానికి, ఇతరత్రా హానికరమని,అవినీతికి దారితీస్తున్నాయని, ఇతర వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయని, జనమీంద అదనపు భారం మోపుతున్నాయని బలంగా వాదిస్తున్నవారు వున్నారు. వ్యవసాయంలో వచ్చే లాభాలను వ్యవసాయేతర రంగాలలో వస్తున్న నష్టాలను భర్తీ చేసుకొనేందుకు, పన్నుల ఎగవేతకు వుపయోగించుకుంటున్నారనే విమర్శలున్నాయి. మన దేశంలో వ్యవసాయం గిట్టుబాటు కానందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను చూస్తున్నాం తప్ప ఇతర రంగాలలో అలాంటి పరిస్ధితి లేదు. అమెరికాలో వున్న గణాంకాల ప్రకారం వ్యాపారాలలో ప్రతి పదివేల సంస్ధలకు ఎనిమిది చొప్పున దివాలా ప్రకటిస్తుండగా వ్యవసాయంలో ఆ రేటు రెండు నుంచి మూడు వరకు మాత్రమే వుంది. గతేడాది 2.4గా నమోదైంది. మన దేశంలో ధనిక రైతులు ఏదో విధంగా నెట్టుకు వస్తుండగా పేద, మధ్యతరగతి, కౌలు రైతులు వ్యవసాయంలో నష్టాలు వచ్చి అప్పులపాలై చివరకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.