Tags
'Socialist' Bernie Sanders, american youth, American youth prefer socialism to capitalism, ideological churning, prefer socialism to capitalism
ఎం కోటేశ్వరరావు
5డబ్ల్యూస్ 1హెచ్ ఒక ఫార్ములా, దీని గురించి ఏ మాత్రం తెలియకపోయినా మానవ పరిణామ క్రమంలో వానరుడు నరుడుగా మారిన తరువాత యావత్ మానవ జాతిని గతంలో ముందుకు నడిపించింది, ఇప్పుడు నడిపిస్తున్నదీ, రాబోయే రోజుల్లో నడిపించేదీ ఇదే. ఎవరు, ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా? అన్నదే ఆ సూత్రం. అమెరికాలో తలెత్తిన వర్తమాన పరిస్ధితులు అక్కడి జనాన్ని మొత్తంగా, ప్రత్యేకించి మూడుపదుల లోపు యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడి సమాజంలో ఒక సరికొత్త మధనం ప్రారంభమైంది. వివిధ సర్వేల ఫలితాలు దాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
గతేడాది డిసెంబరు నాలుగున న్యూయార్క్ టైమ్స్ పత్రిక ‘సహస్రాబ్ది యువత పెట్టుబడిదారీ విధానాన్ని అసహ్యించుకోవటంలో ఆశ్చర్యం లేదు’ అంటూ మిచెల్లీ గోల్డ్‌బర్గ్ రాసిన ఒక విశ్లేషణను ప్రచురించింది. అది ఇలా ప్రారంభం అయింది.’ మనం పెట్టుబడిదారీ విధానాన్ని రద్దు చేయాలా అనే అంశంపై గతనెలలో శుక్రవారం రాత్రి మాన్‌హట్టన్(న్యూయార్క్)లో జరిగిన ఒక చర్చను నేను సమన్వయం చేశాను. దానిని సోషలిస్టు పత్రిక జాకోబిన్ నిర్వహించింది. పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధిస్తూ వుదారవాద పత్రిక ‘ రీజన్ ‘ సంపాదకులు పాల్గొన్నారు. హాలులోని 450సీట్లకు ఒక రోజులోనే టికెట్లు అయిపోయాయి. దాంతో దానికి రెట్టింపు మంది పట్టే చోటుకు జాకోబిన్ పత్రిక వేదికను మార్చింది. అదనపు సీట్ల టిక్కెట్లు కేవలం ఎనిమిది గంటలలోనే అయిపోయాయి. నేను రాగానే ప్రవేశ ద్వారం వైపు వరుసలలో వెళుతూ జనం కనిపించారు. భూ గర్భంలోని ఒక నైట్ క్లబ్ పార్టీ ఆహ్వానితుల జాబితాలో నేనున్నానా అనిపించింది. హాజరైన వారిలో అత్యధికులు 20,30వ పడులలో వున్నారు. వారి పెద్దలు ఎలాంటి శషభిషలు లేకుండా విశ్వసించిన పెట్టుబడిదారీ విధానం పట్ల ఈ తరంలోని ఒక భాగం అసాధారణ రీతిలో అనుమానంతో వుంది.
సహస్రాబ్దియువతలో 44శాతం మంది ఒక సోషలిస్టు దేశంలో నివసించాలని కోరుకుంటున్నారని, దానితో పోల్చితే పెట్టుబడిదారీ విధానం కావాలని కోరుకొనే వారు 42శాతం మందే అని ఇటీవలి సర్వేలో కనుగొనటం గురించి కమ్యూనిస్టు వ్యతిరేక ‘కమ్యూనిజం బాధితుల స్మారక సంస్ధ ‘ హెచ్చరించింది. కమ్యూనిజం కుప్పకూలటం అంటే పెట్టుబడిదారీ విధానానికి మరొక ప్రత్యామ్యాయం లేనట్లుగా అమెరికాలోని పెద్దవారికి కనిపించింది. కానీ రాను రాను మన ఆర్ధిక వ్యవస్ధ కొద్ది మంది చేతిలో పోగుబడే స్వభావ రూపం పెట్టుబడిదారీ విధానం అంటే విఫలమైన దేవుడిగా ఎక్కువ మంది యువతకు కనిపించటంలో ఆశ్చర్యం లేదు. శనివారం తెల్లవారు ఝామున ఆమోదం పొందిన దిక్కుమాలిన పన్నుల బిల్లుతో ఇప్పుడు అది మరింత స్పష్టమైంది. ఆ బిల్లు ధనికులను మరింత ధనికులుగా పేదలను మరింత పేదలుగా చేస్తుంది. టాక్స్ పాలసీ కేంద్రం పేర్కొన్నదాని ప్రకారం 2027 ఆదాయంలో అగ్రభాగాన వున్న ఐదు శాతం మందికి పెద్ద మొత్తంలో పన్నుల తగ్గింపు, అధమ స్ధానంలో వున్నవారికి పెంపుదల వుంటుంది. ఇక్కడ ఒక వుదాహరణ చూద్దాం. ప్రయివేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపే తలిదండ్రులకు సెనేట్ బిల్లు పన్నుల రాయితీని ప్రకటించింది. సహస్రాబ్ది తరంలో అత్యధికులు ఎవరైతే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతారో ఈ చర్య వాటికి నిధుల లభ్యతను కష్టతరం గావిస్తుంది.’
ట్రంప్ ప్రతిపాదించిన ఈ పన్నుల రాయితీలు ధనికులను మరింతగా ధనికులను గావిస్తాయి, పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త థామస్ పికెటీ పేర్కొన్న ఆదాయ,సంపద అంతరాలను మరింతగా పెంచుతాయి. అలాంటపుడు వాటి గురించి యువత, మొత్తం సమాజం ఆలోచించకుండా ఎలా వుంటుంది. వారికి ముందుగా చెప్పుకున్న ఫార్ములా తప్ప మరొకటి దారి చూపదు. దానికి అనుగుణ్యంగానే సర్వేలు అక్కడి జనాల మనోభావాలను వ్యక్తీరిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఒక గాలప్ సర్వే ప్రకారం అమెరికాలో తొలిసారిగా సోషలిజం పట్ల మెజారిటీ యువతలో సానుకూల ధోరణులు వ్యక్తమయ్యాయి. పురోగామి శక్తులకు ఇది నిజంగానే ఎంతో వుత్సాహం, తిరోగామి వాదులకు నిరుత్సాహం కలిగించే అంశం. సోషలిజం, కమ్యూనిజం అంతరించింది, వాటికి భవిష్యత్ లేదు అని ప్రకటించిన పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకతకు నెలవైన చోటే ఈ పరిణామం జరుగుతోంది. 2010లో పెట్టుబడిదారీ విధానం పట్ల 18-29 సంవత్సరాల యువతలో 68శాతం సానుకూలత వ్యక్తం కాగా అది క్రమంగా దిగజారుతూ 2018లో 45కు పడిపోయింది, ఇదే సమయంలో తొలిసారిగా 51శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ పార్టీ, దానిని అభిమానించే స్వతంత్రులలో సోషలిజాన్ని అభిమానించే వారు 57శాతం వరకు వున్నారని కూడా తేలింది. అయితే అమెరికా సమాజంలో మొత్తంగా చూసుకున్నపుడు పెట్టుబడిదారీ విధానం పట్ల 56శాతం సానుకూలంగా వున్నప్పటికీ అది ఇప్పటి వరకు నమోదైన కనిష్ట సంఖ్య. సోషలిజం అంటే సానుకూలత పెరిగినప్పటికీ దాని సాధనకు ఒక విప్లవ పార్టీని ఏర్పాటు చేసే పరిస్ధితులు ఇంకా ఏర్పడలేదు. 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఏడాది కాలంలోనే అధిగమించామని అమెరికా పాలకులు ఎంతగా నమ్మబలికినప్పటికీ జనం దానిని నమ్మటం లేదని ఈ సర్వే నిర్దారించింది. ఎందుకంటే గత పది సంవత్సరాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలను కుదించటం లేదా నిధుల కోత పెట్టారు. గతంలో మాదిరి వాటిని అమలు జరుపుతారనే నమ్మకం పోతోంది.
1990 దశకంలో సోవియట్, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన సమయంలో తరుణ వయస్సు వచ్చిన వారికి, తరువాత పుట్టిన వారికి ఆధునిక ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం సహజమైనదిగా కనిపించింది. దాని వైఫల్యం, తమ కళ్ల ముందే ధనికులకు మరిన్ని అవకాశాలను కల్పించటంతో యువత ఆ విధానం సరైంది కాదని భావిస్తోంది. అన్నింటికీ మించి వారికి పొద్దున లేస్తే చైనా తయారీ వస్తువులు లేనిదే గడవదు. తమ దేశంలో మాదిరి సమస్యలు తలెత్తినట్లు చైనా గురించి వార్తలేమీ లేవు.అధికారంలో ఎవరున్నప్పటికీ చైనాతో పెరుగుతున్న వాణిజ్యలోటు గురించి నిత్యం చర్చ జరుగుతోంది. చైనాపై వ్యతిరేకతను కూడా రోజూ రెచ్చగొడుతున్నారు, అయినప్పటికీ జపాన్‌ను వెనక్కు నెట్టి తమతో పోటీ పడేవిధంగా చైనా అభివృద్ధి చెందుతోందనే వార్తలు వెలువడుతున్నాయి. అందువలన వారికి సోషలిస్టు వ్యవస్ద గురించి పూర్తి అవగాహన లేకపోయినా తమ విధానం కంటే సోషలిజమే మెరుగైనదని వారు భావించటం సహజం.
యువతను పునరాలోచనకు పురికొల్పుతున్నదేమిటి?
నిజవేతనాలు పడిపోతున్నాయి, మెరుగైన వుద్యోగాలు లేవు, ఆదాయ అసమానతలు వేగంగా పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో పరిస్ధితి మెరుగుపడుతుందనే ఆశ కనిపించటం లేదు. విద్యకోసం తీసుకున్న రుణాలు కొండలా పెరిగిపోతున్నాయి. గతంలో తమ వేతనాల్లో 18శాతం ఇండ్ల అద్దెలకు చెల్లిస్తే సరిపోయేది ఇప్పుడు అది 30శాతం దాటింది. మెరుగైన జీవనం గడవాలంటే వారానికి కనీసం 80గంటలు పని చేస్తే తప్ప అవసరమైన ఆదాయం రాదు. అన్ని గంటల పని దొరికే అవకాశాలు కూడా లేవు. స్వతంత్రంగా బతికే అవకాశాలు తగ్గిపోతుండటంతో తలిదండ్రుల మీద ఆధారపడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కాపిటలిజం ప్రతినిధులుగా డోనాల్డ్ ట్రంప్ వంటి వారే కనిపిస్తున్నారు, ఇలాంటి వారు తమ జీవితాలను మెరుగుపరచే అవకాశాలు లేవని బలంగా నమ్ముతున్నారు. డెమోక్రటిక్ పార్టీలో శాండర్స్ వంటి వారు సోషలిజం గురించి గతం కంటే గట్టిగా మాట్లాడుతున్నారు.
ఏ సిద్ధాంతం లేదా రాజకీయాలు లేకపోవటం కంటే ఏదో ఒక సిద్ధాంతం, రాజకీయాల మీద చర్చ జరగటం మంచిది. సిద్ధాంత, రాజకీయ రాహిత్య ధోరణులను ప్రోత్సహించేది పాలకవర్గమే. అమెరికాలో జరుగుతున్న మధనం, పరిణామాల గురించి భిన్నాభిప్రాయాలు వున్నాయి. ట్రాట్క్సీయిస్టులుగా వున్న వారి వాదన ప్రకారం పెట్టుబడిదారీ విధానానికి జన సామాన్యంలో ఎదురవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, గందరగోళపరిచేందుకు మరొక మార్గంలో పాలకవర్గం బెర్నీ శాండర్స్ వంటి నకిలీ సోషలిస్టులను, వుద్యమాలను ప్రోత్సహిస్తున్నది. డెమోక్రటిక్ పార్టీలోని ఒక భాగం ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా(డిఎస్‌ఏ) అనే పార్టీ దాని అనుబంధ సంస్ధ తప్ప ఆ పార్టీని వ్యతిరేకించేది కాదు. దాని పెట్టుబడిదారీ, బూర్జువా రాజకీయాలకు అది ఆమోదయోగ్యమైనది. ఈ అవగాహనతో పూర్తిగా ఏకీభావం వుండకపోవచ్చు లేదా అంగీకరించవచ్చు. తాము చెప్పేదే నిజమైన సోషలిస్టు విప్లవ మార్గం అని చెప్పుకొనే ట్రాట్క్సీయిస్టులు ఎక్కడా బలమైన కమ్యూనిస్టు వుద్యమాలను నిర్మించిన లేదా సోషలిస్టు విప్లవాలకు నాయకత్వం వహించిన చరిత్రగానీ లేదు. తాము తప్ప మిగిలిన వారందరూ నకిలీలని వారు చెప్పుకుంటారు. సోషలిస్టులుగా, మార్క్సిస్టులుగా చెప్పుకొనే కొంత మంది చైనాలో జరుగుతున్నది ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధ తప్ప సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం కాదు అంటారు. అందువలన నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను బయటకు రానివ్వండి అన్నట్లుగా చర్చ జరగనివ్వాలి, భిన్నాభిప్రాయలను వినటానికి ఇబ్బంది లేదు. ఆయా దశలను బట్టి కార్యాచరణను ప్రోత్సహించాలి. జనాల వివేచన మీద విశ్వాసం వుండాలి, దాన్ని మెరుగుపరచేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలి. డెమోక్రటిక్ పార్టీలో వామపక్ష వాదులుగా వున్న వారు ఏర్పాటు చేసిన ఒక వేదిక తప్ప డిఎస్‌ఏ అనేది ఒక పార్టీ కాదని కూడా చెబుతారు. అయితే ఆ వేదిక సభ్యులం అని అనేక మంది సగర్వంగా చెప్పుకుంటారు. అలాంటి వారిని ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది.
ఈ పూర్వరంగంలో అమెరికాలో జరుగుతున్న పరిణామాలను ఆహ్వానించాలా, వ్యతిరేకించాలా? మార్క్సిస్టు అవగాహన ప్రకారం కార్మికవర్గం తప్ప దోపిడీకి గురయ్యే వారందరూ సోషలిస్టు విప్లవం జయప్రదం అయ్యేంత వరకు దానికి నాయకత్వం వహించే పార్టీలతో వుండరు. తమ సమస్య పరిష్కారం కాగానే కొందరు ఆగిపోతారు. కమ్యూనిస్టు పార్టీలు దున్నేవానికి నినాదంతో రైతాంగాన్ని సమీకరిస్తాయి. ఆ సమస్య పాక్షికంగా పరిష్కారమై కొందరికి భూమి వచ్చిన తరువాత వారు వుద్యమంలో భాగస్వాములయ్యే తీరుకు, రాని వారి తీరుకు తేడా వుంటుంది. కమ్యూనిస్టులు గాని సోషలిస్టు పార్టీలు కూడా అంతే. సోషలిజం, కమ్యూనిజం అనే మాటే బూతుగా, సోషలిస్టును, కమ్యూనిస్టును అని చెప్పుకున్న వారిని వెలివేసినట్లుగా చూసే వాతావరణం వున్న అమెరికాలో అవును నేను సోషలిస్టును అని చెప్పుకోవటమే ఒక పెద్ద ముందడుగు. ఎన్నికలలో పోటీ చేసి ఒక మున్సిపల్ వార్డులో అయినా గెలవటం సామాన్య విషయం కాదు. అమెరికన్ యువతలో సోషలిజం పట్ల పెరుగుతున్న సానుకూలత ఒక మంచి పరిణామం. గతంలో కమ్యూనిజం సిద్ధాంతానికి ఆకర్షితులు అయిన వారందరూ సమగ్రంగా ఆ సిద్ధాంతం, ఆచరణలను అవపోసన పట్టిన తరువాతే కమ్యూనిస్టులుగా మారలేదు. ఇప్పుడున్న దుష్ట సమాజాన్ని మార్చాలని కోరుకుంటున్న వారికి కమ్యూనిస్టు నినాదమే ఆకర్షణీయంగా కనిపించింది కనుక ఆ వైపు మొగ్గారు. తరువాత రాటు దేలారు. అమెరికాలో అయినా మరొక చోట అయినా అదే క్రమం. అమెరికా డిఎస్‌ఏలో 2016లో ఏడువేల మంది సభ్యులుంటే గతేడాదికాలంలో ఆ సంఖ్య 47వేలకు చేరింది. నవంబరులో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ఆ వేదికకు చెందిన ఇద్దరు విజయం సాధించబోతున్నారని వార్తలు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్దుల ఎంపిక పోటీలో న్యూయార్క్ నగరంలోని ఒక స్ధానంలో డిఎస్‌ఏ అభ్యర్ధి అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్ ప్రస్తుతం సభ్యుడిగా వున్న జోసెఫ్ క్రోలేను ఓడించి అభ్యర్ధిగా ఎంపికయ్యారు. డెట్రాయిల్ 13వ నియోజకవర్గం డిఎస్‌ఏకు బలమైనది, ఆ బృందానికి చెందిన రషీదా లాయిబ్ అభ్యర్ధిగా ఎంపికయ్యారు. ఈ బృందం నడిపే జాకోబిన్ పత్రిక సంపాదకుడిగా ప్రవాస తెలుగు సంతతికి చెందిన సుంకర భాస్కర్ వున్నాడు. అమెరికాలో సోషలిజం పట్ల యువతలో పెరుగుతున్న సానుకూలతను సొమ్ము చేసుకొనేందుకు భాస్కర్ రచనలకు న్యూయార్క్‌టైమ్స్ పత్రిక కొద్దికాలంగా అవకాశం ఇస్తున్నది. ప్రపంచ సోషలిస్టు పార్టీల చరిత్ర చూసినపుడు అవి ప్రధానంగా సంస్కరణల మీద కేంద్రీకరించాయి తప్ప వ్యవస్ధలో మౌలిక మార్పులను కోరలేదు. మితవాద, తిరోగమన వాదం కంటే నిస్సందేహంగా ఇవి మెరుగైనవే. డిఎస్‌ఏను సంస్కరణవాద వేదికగా భావించవచ్చు.
కారల్ మార్క్స్-ఫెడరిక్ ఎంగెల్స్ కంటే ముందే రకరాల సోషలిస్టు భావాలు కలిగిన వారున్నారు. వారంతా సమాజాన్ని సంస్కరించాలని, మార్చాలని కోరుకున్నారు. మార్పును కోరుకుంటే రాదు. తత్వవేత్తలు వివిధ మార్గాలలో ప్రపంచానికి వ్యాఖ్యానాలు చెప్పారు. అసలు సమస్య దానిని మార్చటం ఎలా అన్నదే అన్న మార్క్స్-ఎంగెల్స్‌లు తమ కమ్యూనిస్టు ప్రణాళికలో ఒక శాస్త్రీయ మార్గాన్ని చెప్పిన తరువాతే వారికీ సోషలిస్టులకు వున్న తేడాను ప్రపంచశ్రామికవర్గం గ్రహించింది. ట్రాట్క్సీయిస్టులు లేదా మరొకరో అంటున్నట్లు అమెరికాలో ఇప్పుడు సోషలిస్టులుగా చెప్పుకుంటున్నవారు కేవలం సంస్కరణలకే పరిమితం అయితే కావచ్చు. పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలు పూర్తిగా పోయాయని ఎవరూ చెప్పటం లేదు. అలాంటి వారు సంస్కరణల ద్వారా మంచి భవిష్యత్ నిర్మాణం చేసుకోవచ్చని అనుకోవచ్చు. తమ అనుభవంలో వాటికి వున్న పరిమితులను అర్ధం చేసుకొని అక్కడి యువత,శ్రామికవర్గం ఆ తదుపరి ఏం చేయాలో, ఏ బాటను పయనించాలో నిర్ణయించుకోలేదా ? విప్లవ పార్టీని నిర్మించుకోలేదా ? పాలకవర్గ నిజరూపాన్ని గుర్తించలేదా ? అందువలన అనుమానాలు, ఎలాంటి సందేహాలు అవసరం లేదు.