Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


చైనా – అమెరికా మధ్య యుద్ధం జరుగుతుందా ? ఇప్పటి వరకు అమెరికా జరిపిన యుద్దాలలో ఒక్కటంటే ఒక్కదానిలో కూడా చెప్పుకొనేందుకు విజయం లేదు. అవమానాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో జరిగిన ఏ యుద్ధమైనా ముందు ప్రచార దాడితోనే ప్రారంభమైంది. అదేమంటే నిజాన్ని ఏడు నిలువుల లోతున పాతి పెట్టటం. ఇప్పుడు చైనా మీద అమెరికా, దాని మిత్రపక్షాల నుంచి ముప్పేట ప్రచారదాడి మొదలైంది. అమెరికా, జపాన్‌, ఐరోపా యూనియన్‌, వాటితో జట్టుకట్టిన దేశాలన్నీ తమ తమ పాత్రలను పోషిస్తున్నాయి. మన దేశంతో సహా అనేక దేశాల్లో ఉన్న యుద్ధోన్మాదులు ఈ పరిణామాలను చూసి రెచ్చిపోతున్నారు, చంకలు కొట్టుకుంటున్నారు. పర్యవసానాలను పట్టించుకోవటం లేదు. తాజాగా అమెరికా రక్షణ శాఖ పెంటగన్‌ వార్షిక నివేదికలో ఒక ప్రచార అస్త్రాన్ని వదిలింది. దాన్ని పట్టుకొని అనేక మంది పండితులు అది నిజమే అని జనాన్ని నమ్మించేందుకు, చైనాను ఒక బూచిగా చూపేందుకు ఒళ్లుదాచుకోకుండా పని చేస్తున్నారు.


ఇంతకీ పెంటగన్‌ చెప్పిందేమిటి ? చైనా వద్ద రెండువందల వరకు అణ్వాయుధాలు ఉన్నట్లు, దశాబ్ది చివరికి అవి రెట్టింపు కావచ్చని గతేడాది అమెరికా రక్షణ అంచనా వేసిందట. అప్పటి నుంచి చైనా తన అస్త్రాలను విస్తరించటం ప్రారంభించటంతో 2027నాటికి ఏడువందలకు, 2030 నాటికి 1000కి పెరగవచ్చని, దీంతో ప్రపంచానికి ముప్పు పెరుగుతుందని ఈ ఏడాది పెంటగన్‌ చెప్పింది. ఆధారం లేని అంశాలను, అబద్దాలను చెప్పటంలో పెంటగన్‌ పేరు మోసింది. ఎగిరే పళ్లాలు లేదా గ్రహాంతర వాసులంటూ కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా మీడియా అల్లిన కట్టు-పిట్ట కథలను జనం నమ్మారు, ఇప్పటికీ నమ్మే వారున్నారు. నిజానికి అలాంటి వేమీ లేవు. వియత్నాం యుద్దం గురించి అది ఎలాంటి నివేదికలను రూపొందించిందో, మిలిటరీ, పౌర అధికారులు, విధాన నిర్ణేతలు ఎన్ని అబద్దాలు చెప్పి పార్లమెంటు, స్వంత పౌరులను , ప్రపంచాన్ని తప్పుదారి పట్టించారో తరువాత వివరాలు బయటపడ్డాయి. అందరూ కలిసి చేసిన ఈ దారుణానికి లక్షలాది మంది వియత్నాం పౌరులు దెబ్బతిన్నారు. సైగాన్‌ వంటి నగరాలు, పంట పొలాలను నాశనం చేశారు. ఎందరో మానవతులను చెరబట్టారు. చివరికి ఆ దాడుల్లో ఉత్తిపుణ్యానికి తమ 58వేల మంది సైనికులు మరణించారని, లక్షలాది మంది భౌతికంగా, మానసికంగా దెబ్బతిన్నారంటూ ఆ దాడులను ఆపివేయాలని అమెరికా జనం వీధుల్లోకి వచ్చి ఉద్యమించిన అంశం తెలిసిందే.వియత్నాం టాస్క్‌ ఫోర్స్‌ పేరుతో రక్షణశాఖ మంత్రిత్వ కార్యాలయం రూపొందించిన నివేదికను పత్రికలు ప్రచురించరాదని అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ప్రభుత్వం వత్తిడి తెచ్చింది. అటార్నీ జనరల్‌ జాన్‌ డబ్ల్యు మిచెల్‌ టైమ్‌ పత్రికకు ఒక టెలిగ్రాం పంపాడు. ఆ నివేదిక ప్రచురణ అమెరికా రక్షణ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని వాదించాడు.(ఈ ప్రబుద్దుడు తరువాత నిక్సన్‌ పాల్పడిన వాటర్‌గేట్‌ కుంభకోణంలో పోషించిన పాత్రకు జైలు పాలయ్యాడు, సదరు నిక్సన్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.) తరువాత ఈ అంశం సుప్రీం కోర్టుకు వెళ్లింది. పత్రికలకు ప్రచురించే హక్కుందని తీర్పు వచ్చింది.


ఇరాన్‌కు ఆయుధాల సరఫరాపై నిషేధం ఉన్నప్పటికీ రీగన్‌ ప్రభుత్వం రహస్యంగా విక్రయించటమే గాక ఆ సొమ్మును నికరాగువాలో వామపక్ష శాండినిస్టా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తయారు చేసిన కిరాయి మూక కాంట్రాలకు అందచేసింది. వారికి నిధులు ఇవ్వటాన్ని పార్లమెంట్‌ నిషేధించింది. దీని గురించి కూడా పెంటగన్‌ పచ్చి అబద్దాలు, అతకని వాదనలు వినిపించింది. తరువాత జార్జి బుష్‌ పాలనాకాలంలో ఇరాక్‌ మీద దాడి చేసేందుకు అల్లిన అబద్దాలు ఇంకా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. సద్దాం హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా నిలవ చేశాడని ప్రచారం చేసిన అంశం, తరువాత అలాంటివేమీ దొరకలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇండోచైనా దేశాలైన వియత్నాం, లావోస్‌, కంపూచియాలను ఆక్రమించుకొనేందుకు, కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు జపాన్‌, ఫ్రాన్స్‌, అమెరికా వరుసగా దాడులు చేశాయి. చివరిగా పాల్గొన్న అమెరికన్లు అవమానకర రీతిలో అక్కడి నుంచి తోకముడిచారు. ఆ ఉదంతం నుంచి అమెరికన్లు ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదంపై పోరు పేరుతో జోక్యం చేసుకున్నారు. అక్కడా పరాభవాలు ఎదురైనా రెండు దశాబ్దాల పాటు విజయం సాధిస్తున్నట్లు అమెరికన్లను, యావత్‌ ప్రపంచాన్ని ఎలా నమ్మించారో, చివరకు ఆ తాలిబాన్ల కాళ్లు పట్టుకొని బతుకు జీవుడా అంటూ పారిపోయిన దృశ్యాలు ఇంకా మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి.


సోవియట్‌ యూనియన్నుంచి పశ్చిమ ఐరోపాకు ముప్పువస్తుందనే ముసుగులో నాటో కూటమి ఏర్పాటు చేశారు. ఆ సోవియట్‌ ఇప్పుడు ఉనికిలో లేదు. తూర్పు ఐరోపా రాజ్యాలన్నీ ఇప్పుడు రష్యాతో కూడా లేవు, అయినా అమెరికన్లు నాటోను కొనసాగిస్తూ మరింతగా విస్తరిస్తున్నారు ? ఐరోపాకు ముప్పు అని కథలు చెబుతూనే ఉన్నారు. పెంటగన్‌ తన సేనలను కొనసాగిస్తూనే ఉంది.తమ ఆయుధాలను అమ్ముకొని లాభాలు గడిస్తూనే ఉన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆసియాలో విస్తరించేందుకు, ఇక్కడ కూడా నాటో మాదిరి ఆసియా కూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. దానిలో భాగమే మన దేశం, జపాన్‌,ఆస్ట్రేలియాలను కలుపుకొని చతుష్టయ(క్వాడ్‌) కూటమి, తరువాత బ్రిటన్‌,ఆస్ట్రేలియాలతో చేరి అకుస్‌ ఏర్పాటు సంగతి తెలిసిందే.వాటిని మరింత ముందుకు తీసుకుపోవాలనే ఎత్తుగడతోనే చైనా అణ్వాయుధాల బూచిని చూపటం, ఖండాంతర క్షిపణుల ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నదనే ప్రచారం, అంతరిక్షం నుంచి ప్రయోగించే మహావేగ క్షిపణి పరీక్ష అనే తప్పుడు వార్తలు, తైవాన్‌ పేరుతో రెచ్చగొడుతున్నది. దక్షిణ చైనా సముద్రంలో తిష్టవేసేందుకు అమెరికన్లకు ఒక సాకు కావాలి. దాన్లో భాగమే పెంటగన్‌ ప్రచారదాడి.


ఆయుధాలు కలిగి ఉండే హక్కు తమకు మాత్రమే ఉందన్నట్లుగా, తమ దగ్గర ఉంటే లోక కల్యాణం, ఇతరులు సమకూర్చుకుంటే వినాశనానికి, కనుక అందరం కలిసి అలాంటి వారిని దెబ్బతీద్దాం, అందుకు గాను మా దగ్గర మీరు ఆయుధాలు కొనుగోలు చేయండి అన్నట్లుగా ఉంది అమెరికన్ల తీరు. అమెరికా సైనిక దళాల అధికారుల చైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిలే ఒక మీడియా సంస్ధతో మాట్లాడుతూ చైనా గురించి చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో చూడండి.” మీరు గనుక మరోసారి చూస్తే, నాలుగుదశాబ్దాల క్రితం వారికి ఉపగ్రహాలు అసలు లేవు. ఈ రోజు ఎన్ని ఉన్నాయో చూడండి. వారికి ఖండాంతర క్షిపణులు లేవు, ఈ రోజు వారికి ఎన్నున్నాయో చూడండి. వారికి అణ్వాయుధాలు లేవు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూడండి. వారికి నాలుగవ లేదా ఐదవ తరం లేదా చివరికి ఆధునిక యుద్ద విమానాలు కూడా లేవు. మరలా చూడండి వారి దగ్గరెన్ని ఉన్నాయో. వారికి నౌకాదళం లేదు, జలాంతర్గాములు లేవు, వారికి ఈ రోజు ఎన్ని ఉన్నాయో చూడండి.” ఇవన్నీ కలిగి ఉండటం ప్రపంచానికి ప్రమాదమైతే తొలి ముప్పు అమెరికా నుంచే వస్తుంది. వారి దగ్గర ఉన్నన్ని మరొక దేశానికి లేవు. పోనీ ఇవన్నీ ఒక్క చైనాకేనా మిగతా దేశాల దగ్గర లేవా ? వాటిని నుంచి మిగతా దేశాలకు ముప్పు లేదా ? ఇదంతా చైనాను దెబ్బతీసే, అనుమానాలు కలిగించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.


ఈ ఏడాది మొదట్లో ప్రపంచానికి తెలిసిన అంచనా ప్రకారం అమెరికా దగ్గర 5,500 అణ్వాయుధాలున్నాయి.ప్రతి ఏటా లక్షల కోట్ల డాలర్లతో నూతన బాంబర్లు, కొత్త ఆయుధాలను రూపొందిస్తోంది. ఖండాంతర క్షిపణి వ్యతిరేక ఒప్పందం, మధ్య శ్రేణి అణ్వాయుధాల నిరోధ ఒప్పందాల నుంచి వైదొలిగింది.ప్రపంచమంతటా ఏదో ఒక పేరుతో తన క్షిపణులను మోహరిస్తూనే ఉంది. అకుస్‌ ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియాకు దొడ్డిదారిన అణుపరిజ్ఞానాన్ని కూడా అంద చేసేందుకు బ్రిటన్‌తో కలసి ఒప్పందం చేసుకుంది. మరి చైనా ఆయుధాలను తయారు చేయటం లేదా ? ప్రతి ఏటా తన వద్ద ఉన్న వాటిని చైనా బహిరంగంగానే ప్రదర్శిస్తోంది. ప్రతిదేశం అదే చేస్తోంది. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున మన దేశం కూడా ఆయుధాల ప్రదర్శన, ఇతర దేశాలతో కలసి మిలిటరీ విన్యాసాలు చేస్తున్నది. అమెరికన్లు ప్రపంచ పెత్తనం కోసం ఆయుధాలను వినియోగిస్తుంటే మిగిలిన దేశాలు ఆత్మ రక్షణ కోసం తయారు చేసుకుంటున్నాయి. తొలిసారిగా అణుబాంబులు వేసి ప్రపంచాన్ని భయ పెట్టింది అమెరికా తప్ప మరో అణుశక్తి ఏదీ అలాంటి దుర్మార్గానికి పాల్పడలేదు. తాముగా ఎవరి మీద ముందుగా అణుబాంబులను ప్రయోగించబోమని చైనా ప్రకటించింది.


కాశ్మీరు మన దేశంలో అంతర్భాగం ఎలాగో తైవాన్‌ దీవి చైనాలో అంతర్భాగమని అమెరికాతో సహా ప్రతిదేశం అధికారికంగా గుర్తించింది. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినపుడు అది తిరుగుబాటు ప్రాంతంగా కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల చేతిలో ఉండి, ఇప్పటికీ కొనసాగుతోంది. ఐరాసలో చైనా అంటే తైవాన్‌తో కూడినది తప్ప మరొకటి కాదు. కానీ అమెరికా, ఐరోపాయూనియన్‌, తదితర కొన్ని దేశాలు తైవాన్ను బలప్రయోగంతో ఆక్రమించేందుకు చైనా చూస్తోందని, దాన్ని తాము అడ్డుకుంటామని చెబుతున్నాయి. శాంతియుత పద్దతిలోనే విలీనం జరగాలని చైనా చెబుతోంది. గత నెల 27న అమెరికా నావలు తైవాన్‌ తీరంలో సంచరించాయి.తైవాన్‌ మిలిటరీకి ఆధునిక ఆయుధాలను విక్రయిస్తున్నది. పదమూడు మంది సభ్యులున్న ఐరోపా యూనియన్‌ పార్లమెంటరీ కమిటీ తైవాన్‌కు రావటం అమెరికా పధకంలో భాగమే. గత పది నెలల్లో ఐరోపా యూనియన్‌ పార్లమెంటు పన్నెండు తైవాన్‌ అనుకూల తీర్మానాలు చేసింది. ఇవన్నీ చైనాను రెచ్చగొట్టే ఎత్తుగడలు తప్ప మరొకటి కాదు. ఒకవైపు ఇలాంటి పనులు చేస్తూ వాటిని కప్పి పుచ్చేందుకు చైనా గురించి కట్టుకధలను ప్రచారం చేస్తున్నది. ఇలాంటివి ఇదే ప్రారంభం కాదు, ఇంతటితో ఆగేవి కాదు. 2049 నాటికి చైనాలో కమ్యూనిస్టు పాలనకు వందేళ్లు పూర్తి అవుతాయి. అప్పటికి హాంకాంగ్‌, మకావూ, తైవాన్‌ దీవులను పూర్తిగా ప్రధాన చైనా భూభాగంలో విలీనం చేసేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. దాన్ని కొనసాగనివ్వకుండా చూసేందుకు అమెరికా, ఇతర కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు పూనుకున్నాయి.పెంటగన్‌ నివేదిక దానిలో భాగమే !