Tags
appeasement politics, BJP, BJP Appeasement, BJP Christian appeasement, Clean church premises, Nagaland BJP, Narendra Modi, RSS
ఎం కోటేశ్వరరావు
నాగాలాండ్ ! ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి. జనాభా ఇరవైలక్షలకు పైబడి. భాషలెన్నో తెలుసా 17, అక్షరాలా పదిహేడు. ఆంగ్లం అధికార భాష, అత్యధికులు గిరిజనులే, 2011 జనాభా లెక్కల ప్రకారం 87.92 శాతం మంది క్రైస్తవులు,8.75శాతం హిందువులు. ఇప్పుడు ఈ చిన్న రాష్ట్రం గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే….తమ పూర్వీకుడు, జనసంఫ్‌ు పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన శ్యామ ప్రసాద ముఖర్జీ జూన్ 23న 70వ వర్ధంతిని పురస్కరించుకొని మే 11న రాష్ట్రంలోని చర్చ్‌లను శుభ్రపరచాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బెంజమిన్ యప్తోమి తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు.దీని మీద మీ మహత్తర సేవలను వేరే చోట ఉపయోగించాలని నాగాలాండ్ బాప్టిస్టు చర్చి కౌన్సిల్ సున్నితంగా తిరస్కరించింది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్‌డిపిపి) అనే ప్రాంతీయ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపి ఉంది. నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చిన తరువాత క్రైస్తవుల మీద అసాధారణ రీతిలో హింసాకాండ జరుగుతోందని అందువలన బిజెపి అలాంటి మార్గదర్శకాలను జారీ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చర్చి కౌన్సిల్ సలహా ఇచ్చింది. రాజకీయ పార్టీలు మతపరమైన అంశాలను తీసుకోరాదని హెచ్చరించింది. నాగాలాండ్ క్రిస్టియన్ రివైవల్ చర్చి కౌన్సిల్((ఎన్‌సిఆర్‌సిసి) విడిగా ఒక ప్రకటన చేస్తూ స్వార్ధ ప్రయోజనాలకు పవిత్ర స్థలాలను రాజకీయం చేయవద్దని కోరింది. మన సమాజంలో మౌలిక విలువలైన సహనం,గౌరవం, మత స్వేచ్చలను కాపాడాలని పేర్కొన్నది. నాగాలాండ్‌లో చర్చ్‌లను ఊడ్చే కార్యక్రమం బదులు దేశమంతటా వేధింపులకు గురవుతున్న క్రైస్తవుల రక్షణ గురించి కేంద్రీకరించాలని కౌన్సిల్ అధ్యక్షుడు రెవరెండ్ ఎన్ పాఫినో వ్యాఖ్యానించారు.దేశంలో ఇతర ప్రాంతాల్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే నాగాలాండ్‌లో చర్చ్‌లను శుభ్రపరచటం ఏమిటని ప్రశ్నించారు.మొత్తం మీద బిజెపి సంతుష్టీకరణ యత్నం వికటించింది. అది బుద్ది తక్కువ నిర్ణయమని ఆ పార్టీ ఎంఎల్‌ఏ ఇమ్‌కాంగ్ ఇంచెన్ బహిరంగంగానే వర్ణించారు.అలాంటి నిర్ణయం తీసుకొనే ముందు చర్చి అధికారులతో చర్చించి ఉండాల్సిందన్నారు.ముందస్తు అనుమతి లేకుండా ఇతరుల ప్రాంగణాల్లోకి వెళ్లాలనటం అక్రమ ప్రవేశం కిందకు వస్తుందని విమర్శించారు.చర్చ్‌లన్నీ శుభ్రంగా ఉంటాయి, అయినా ఒక రాజకీయ పార్టీ అలాంటి నిర్ణయాలు చేయకూడదన్నారు. తమ ప్రయత్నాన్ని అపార్ధం చేసుకున్నారని, అయితే తమ పార్టీ ఇచ్చిన పిలుపులో చర్చ్‌లని కాకుండా ప్రార్ధనా స్థలాలను శుభ్రం చేయాలని రాసి ఉండాల్సిందని బిజెపి ప్రతినిధి థామస్ మాV్‌ా వివరణ ఇచ్చుకున్నారు. ఏ మతాన్ని కించపరచాలని తాము భావించటం లేదన్నారు. ఇంతకూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జారీ చేసిన మార్గదర్శకాలలో కేవలం చర్చ్ ప్రాంగణాలను ఊడ్చటమేనా లేక స్నానాల గదులు, మరుగుదొడ్లను కూడా శుభ్రపరచాలని ఉందా ? చర్చ్‌లను ఊడ్చాలనటం మణిపూర్‌లో చర్చ్‌ల మీద, క్రైస్తవులుగా ఉన్న గిరిజనుల మీద జరిపిన దాడుల నివారణలో విఫలమైన బిజెపి ప్రభుత్వ పాపపరిహారార్ధం తీసుకున్న సంతుష్టీకరణ కార్యక్రమమా ?
అధికారం, ఓట్ల కోసం ఇతర పార్టీలు మైనారిటీలసు సంతుష్టీకరిస్తున్నాయని నిత్యం పారాయణం చేస్తున్న బిజెపి ఒక వైపు ముస్లింల మీద విద్వేషాన్ని వెళ్లగక్కుతూ మరోవైపు వారి మీద క్రైస్తవులను ఉసిగొల్పుతూ సంతుష్టీకరించేందుకు చూస్తున్నది. ప్రధాని మోడీ స్వయంగా చర్చ్‌కు వెళ్లటమే గాక కేరళలో, ఇతర మరికొన్ని చోట్ల బిజెపి పడుతున్న పాట్లు తెలిసిందే. మొత్తంగా చూసినపుడు దాడులతో బెదిరింపులు ఒక వైపు సంతుష్టీకరణ మరోవైపు కనిపిస్తున్నది. బిజెపి నేత సినీ హీరో సురేష్ గోపి తన కుమార్తె వివాహం శ్రీ కృష్ణ దేవాలయంలో చేయబోయే రెండు రోజుల ముందు త్రిసూర్‌లోని ఒక చర్చికి భార్య, కుమార్తెతో సహా వెళ్లి వర్జిన్ మేరీకి ఐదు సావరిన్ల బంగారు కిరీటాన్ని సమర్పించుకున్నారు. ఇదంతా తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లకోసమే చేశారనే విమర్శలు వచ్చాయి.తాము తప్ప ఇతర పార్టీలు మైనారిటీల సంతుష్టీకరణకు చూస్తున్నాయని ఆరోపించే ఆ పార్టీ హిందువుల సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. క్రైస్తవులు ఆంగ్లేయులు, వారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదని ఆరు సంవత్సరాల క్రితం ముంబై ఉత్తర లోక్‌సభ నియోజకవర్గ బిజెపి ఎంపీ గోపాల్ షెట్టి ఆరోపించారు.2019 ఎన్నికలకు ముందు అది వివాదాస్పదం కావటంతో తాను రాజీనామా చేస్తానని సదరు ఎంపీ ముందుకు వచ్చారు. దీని గురించి శివసేన పత్రిక సామ్నా ధ్వజమెత్తింది.ఒడిషాలో ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రాహమ్ స్టెయిన్ను చంపినపుడు అక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జెబి పట్నాయక్‌తో కాంగ్రెస్ రాజీనామా చేయించింది.వాటికన్ చర్చి నుంచి వత్తిడి రావటం, సోనియా గాంధీ క్రైస్తవురాలు కావటం వల్లనే అలా జరిగిందని హిందూత్వ నేతలు విమర్శించారు. ఇప్పుడు ఏమైంది ? సోనియా గాంధీ అధికారంలో లేరు, వాటికన్ నుంచి వత్తిడి వచ్చే అవకాశమూ లేదు, గోపాల్ షెట్టిని ఒక నేరస్తుడిగా ఎందుకు చూస్తున్నారని, ఇదంతా రాజకీయం,2019 ఎన్నికలకు ముందు క్రైస్తవులను సంతుష్టీకరించే ప్రయోగమే అని శివసేన పత్రిక ధ్వజమెత్తింది. పాల్ఘర్ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంలో ఓట్ల కోసం ముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముంబై వాసైలోని చర్చ్‌లు, మిషనరీల చుట్టూ ప్రదక్షిణలు చేశారని,క్రైస్తవ సమాజ దేశభక్తిని ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని శివసేన పేర్కొన్నది.
చర్చ్‌లు, క్రైస్తవులపై పెరుగుతున్న దాడులకు భయపడిన లేదా లొంగిపోయిన కొందరు క్రైస్తవ మతాధికారులు ” ముందు రక్షణకు ప్రాధాన్యత ” అనే పేరుతో బిజెపితో చేతులు కలిపేందుకు పూనుకున్నారు.దానిలో భాగంగానే గతేడాది ఢిల్లీలో క్రిస్‌మస్ విందు ఏర్పాటు దానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరు.దానికి అనేక మంది మతాధికారులతో పాటు కేరళలో రుణ, బంగారం వ్యాపారంలో దిట్టలుగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల దాడుల నుంచి తమ విద్యాసంస్థలు, వ్యాపారాల రక్షణకే వారంతా బిజెపికి అనుకూలంగా మారేందుకు సిద్దపడినట్లు వేరే చెప్పనవసరం లేదు. వివిధ పార్టీలలో ఉన్న వాణిజ్య, పారిశ్రామికవేత్తలను తనవైపు తిప్పుకొనేందుకు ఐటి,సిబిఐ, ఇడిలను ప్రయోగిస్తున్న బిజెపి క్రైస్తవ మతాధిపతులు, వారి ప్రభావంలో ఉన్న సామాన్యుల ఓట్ల కోసం మతాధికారుల మీద కూడా ఆ సంస్థలను ప్రయోగించి దారికి తెచ్చుకుంటున్నది. రకరకాల పేర్లతో ఉన్న సంఘపరివార్ సంస్థలు, క్రైస్తవ, ఇస్లామిక్ సంస్థలకు విదేశాల నుంచి నిధులు అందుతున్న సంగతి తెలిసిందే. క్రైస్తవ, ఇస్లామిక్ సంస్థలకు అందే నిధులను ఏదో ఒకసాకుతో నిలిపివేయించి నిర్వాహకులను దారికి తెచ్చుకొనేందుకు చూస్తున్నారు. ఇడి, ఐటి దాడులకు గురైన కేరళలోని బిలీవర్స్ ఈస్టరన్ చర్చి స్థాపకుడు ఇవాంజలిస్ట్ కెపి యోహనన్ కేరళ పత్తానం తిట్ట నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత, మాజీ సిఎం ఏకె ఆంటోని కుమారుడు అనిల్ అంటోనికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. వందమంది పాస్టర్లు, ఇతర చర్చినేతలను తిరువళ్ల పట్టణంలో ఒక చోట సమావేశపరిచి మరీ ఈ పని చేశారు. ఒక చర్చి ఒక రాజకీయ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించటం ఇదే ప్రధమం అని అనిల్ ఒక ప్రకటనలో సంతోషం వెలిబుచ్చారు. ఈ చర్చికి అనుబంధంగా ఏర్పాటు చేసిన స్వచ్చంద సంస్థలు విదేశాల నుంచి నిధులు పొందుతున్నట్లు ఆరోపించి 2017లో నిధులు పొందకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తరువాత దాని కొనసాగింపుగా చర్చి సంస్థలు, వ్యక్తుల మీద 2020,2022లో ఐటి, ఇడి దాడులు జరిగాయి.విదేశాల నుంచి 2015-16లో రు.2,397 కోట్ల నిధులను పొంది దాన ధర్మాల కోసం వినియోగించాల్సిన వాటిలో వెయ్యి కోట్లు రియలెస్టేట్ పెట్టుబడులుగా పెట్టినట్లు వార్తలు వచ్చాయి.కెపి యోహనన్ ప్రమేయం ఉన్న గోస్పెల్ ఫర్ ఆసియా అనే సంస్థ మీద అమెరికాలో నిధుల దుర్వినియోగం కేసు నమోదు కాగా రు.261 కోట్లు చెల్లించి పరిష్కారం చేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ పూర్వరంగంలో సదరు చర్చి బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించింది.
దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా కేరళలో 18శాతం క్రైస్తవులు ఉన్నారు.ఆర్థికంగా కూడా బలమైన తరగతి.2014 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నియోజకవర్గంలో బిజెపి నేత ఓ రాజగోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి శశి ధరూర్‌పై పదిహేనువేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అక్కడి లాటిన్ చర్చి నేతలే తన ఓటమికి కారణమని రాజగోపాల్ వాపోయారు. దాంతో క్రైస్తవుల ఓట్లు లేకుండా ముందుకు పోలేమని గ్రహించిన బిజెపి 2019లో చర్చిల చుట్టూ తిరిగినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.శబరిమల దేవాలయంలో మహిళల ప్రవేశాన్ని పెద్ద వివాదంగా మార్చినపుడే బిజెపికి కేరళలో హిందువుల మద్దతు లేదని దానికి వచ్చిన 14.88శాతం ఓట్లు వెల్లడించాయి. తరువాత బిజెపి ఒక సర్వే నిర్వహించి క్రైస్తవ ఓటర్లను ప్రభావితం చేయగలవారెవరు, ఎవరు ఏ సంస్థలను నడుపుతున్నారు, వాటి మంచి చెడ్డలేమిటి అన్న జాబితాను రూపొందించుకొని వారిని తమవైపు తిప్పుకొనేందుకు ఏ అవకాశం దొరుకుతుందా అని బిజెపి చూస్తోంది. ఆక్రమంలో యోహనన్ బిజెపి వలకు చిక్కారు. కేరళలో సిరో-మలబార్ చర్చి ఒకటి.దానిలో తలెత్తిన వివాదంలో ఒక వర్గం బిజెపికి దగ్గరైంది. అవాస్తవాలు, ముస్లింల పట్ల విద్వేషంతో కూడిన కేరళ స్టోరీ అనే సినిమాను ఎన్నికల ముందు ప్రదర్శించి వారు తమ భక్తిని ప్రదర్శించుకున్నారు. అదే చర్చిలో మరికొందరు అంతే తీవ్రంగా బిజెపిని వ్యతిరేకిస్తున్నారు. బిజెపిని సమర్ధిస్తున్న వారిని ”క్రిసంఘీ” (క్రిస్టియన్ + సంఘపరివార్) అని పిలుస్తున్నారు. చర్చి నేతలతో సంద్రింపులు జరిపామని తిరువనంతపురం, త్రిసూర్,పత్తానంతిట్ట,అట్టింగల్ నియోజకవర్గాలలో క్రైస్తవుల మద్దతు కోరినట్లు బిజెపి నేతలు చెప్పినట్లు ఇండియా టుడే పేర్కొన్నది.సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా కేరళలోని చర్చి అధికారులను కలసి మద్దతును కోరారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమే అని కాంగ్రెస్ విమర్శించింది.తిరువనంతపురం సమీపంలోని విఝినం అదానీ రేవు నిర్మాణాన్ని చర్చి తరఫున వ్యతిరేకించినందుకు బిజెపి సర్కార్ తమ బాంకు ఖాతాలను స్థంభింప చేసిందని ఏప్రిల్ 21న తిరువనంతపురం లాటిన్ చర్చి ఆర్చిబిషప్ థామస్ జె నెట్టో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వికె సక్సేనాను కలిసేందుకు నెట్టో తిరస్కరించారు.సిరో మలంకర, బాసిలోస్ మార్తమ్మ మాథ్యూస్, కాథలిక్స్ ఆఫ్ ఈస్ట్, మలంకర చర్చినేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ ప్రయత్నాలు బిజెపికి ఎంతమేరకు ఉపయోగపడతాయో చూడాల్సి ఉంది. మొత్తం మీద బిజెపి క్రైస్తవ సంతుష్టీకరణ కొత్త పుంతలు తొక్కుతున్నది.
