Tags
Ayodhya Ramalayam, ‘Sent by god’, BJP, God, kashi vishwanath, Mohan Bhagwat, Narendra Modi Failures, RSS
ఎం కోటేశ్వరరావు
‘‘ నా మాతృమూర్తి జీవించి ఉన్నంత వరకు నేను జన్యు నిర్ణాయకంగా(బయలాజికల్లీ) జన్మించినట్లు నమ్ముతుండేవాడిని. ఆమె మరణించిన తరువాత నా అనుభవాలన్నింటి మీద ప్రతిఫలించుతున్నవాటిని చూస్తుంటే దేవుడే నన్ను పంపాడని నిర్ధారణకు వచ్చాను. నా జీవ సంబంధ శరీరం నుంచి అయితే ఈ శక్తి వెలువడి ఉండేది కాదు.నా శక్తి సామర్ద్యాలు, ఉత్తేజం, సదుద్దేశ్యాలను దేవుడు ఒక లక్ష్యం కోసం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. నేను ఒక సాధనాన్ని తప్ప మరొకటి కాదు.అందుకే నేను ఎప్పుడు ఏది చేసినా దేవుడు నన్ను నడిపిస్తున్నాడని నమ్ముతాను ’’ అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. వారణాసి నియోజకవర్గంలో 2024 ఎన్నికలలో నామినేషన్ వేసే సందర్భంగా న్యూస్ 18 టీవీ ఛానల్ విలేకరి అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానం అది. చిత్రం ఏమిటంటే అదే విలేకరి 2019 ఎన్నికల సందర్భంగా ‘‘ మీకు అలసట రాదా ’’ అని ప్రశ్నించినపుడు దేవుడు అలా రాసి పెట్టాడు అని బదులిచ్చారట. అయితే అప్పుడు అంతగా దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు.నిజం చెప్పాలంటే మనకే(జనానికే) అర్ధం కాలేదు గానీ మొదటి నుంచి నరేంద్రమోడీ తన గురించి స్పష్టతతో ఉన్నారు.మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా నూతన పార్లమెంటు భవనంలో చేసిన తొలి ప్రసంగంలో మోడీ చెప్పిన అంశాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ‘‘ అతల్ బిహారీ వాజ్‌పాయి హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పలుసార్లు ప్రవేశ పెట్టారు, కానీ దాన్ని ఆమోదించటానికి తగినంత మెజారిటీ లేక ఆమోదం పొందలేదు. ఆ కల అసంపూర్తిగా ఉంది, దాన్ని పూర్తి చేయటానికే బహుశా దేవుడు నన్ను పంపినట్లున్నాడు ’’ అన్నారు.2024 మేనెల 22న ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభల్లో మరోసారి తన దైవత్వం గురించి ప్రస్తావించారు. ఎవరైతే తనకు ఓటు వేస్తారో వారు పుణ్యం చేసుకున్న మంచి పనులను పందుతారని, తాను చేస్తానని చెప్పుకున్నారు. కోరుకున్న రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడని భక్తులు నమ్ముతారు.నరేంద్రమోడీ ఏ రాష్ట్రానికి వెళితే అక్కడ ఆ రూపంలో సాక్షాత్కరించటం బహుశా దానిలో భాగమేనేమో ! తాము అపర భగవత్‌స్వరూపులమని భావించే నలుగురు శంకరాచార్యలు ‘‘ తమ పోటీ భగవంతుడి ’’ ముందు అయోధ్యలో రామ విగ్రహప్రతిష్టలో ఉత్సవిగ్రహాలుగా కనిపించటం ఇష్టంలేక ఆ కార్యక్రమాన్ని బహిష్కరించిన సంగతి తెలిసిందే. మోడీ నిజంగా దైవాంశ సంభూతుడే అయితే కరోనా సమయంలో శవాలు గంగాతీరానికి కుప్పలుగా వస్తుంటే దీపాలు వెలిగించమని, చపట్లు కొట్టాలని, పళ్లాలను మోగించమని ఎందుకు చెప్పినట్లని అనేక మంది ఎద్దేవాచేశారు.దైవాంశ సంభూతులు అలాంటి వాటిని పట్టించుకోరు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జై భజరంగ భళీ అంటూ ఓటింగ్ యంత్రాల మీట నొక్కమని ఓటర్లకు ఉపదేశించిన సంగతి తెలిసిందే. మోడీ మనసులో ఉన్న భావాన్ని గ్రహించి ఒడిషాలో బిజెపి నేత సంబిత్ పాత్ర పూరీ జగన్నాధుడు స్వయంగా మోడీ భక్తుడని సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తరువాత నోరు జారానని చెప్పుకున్నప్పటికీ దానిలో చిత్తశుద్ది లేదని జనం భావించారు. మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలిపోయినందుకు మోడీ క్షమాపణలు చెప్పారు. పూరీ జగన్నాధుడే మోడీ భక్తుడంటూ బిజెపి నేత చేసిన వ్యాఖ్యలకు నరేంద్రమోడీ నుంచి క్షమాపణలు కాదు కదా కనీసం విచారం కూడా వెల్లడి కాలేదు, తనకేమీ తెలియనట్లు ఉన్నారు. మోహన్ భగవత్ పరోక్షంగా మాట్లాడటం రెండోసారి. అంతకు ముందు జూలై నెలలో రaార్కండ్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ‘‘ అభివృద్దికి అంతం లేదు… జనాలు అతీంద్రియశక్తులు (సూపర్‌మాన్‌లు) కావాలని కోరుకుంటారు, కానీ వారు అక్కడితో ఆగరు. తరువాత దేవతగా మారాలని తరువాత దేవుడిగా మారాలని కోరకుంటారు. కానీ తాను విశ్వరూపుడనని భగవంతుడు చెప్పారు. అంతకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నది ఎవరికీ తెలియదు.’’ అన్నారు. ఈ మాటలు నాగపూర్ నుంచి పేల్చిన అగ్నిక్షిపణి వంటివని నాడు కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ వర్ణించారు. కానీ ఆ క్షిపణి తుస్సుమన్నది. ఆ తరువాత మోడీ నుంచి కనీసం అలికిడి కూడా లేదు.నాగపూర్ పెద్దలకు మోడీ మాటలు నచ్చలేదన్నది స్పష్టం.
తాజాగా 2024 సెప్టెంబరు ఆరవ తేదీన పూనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్ మాట్లాడుతూ ‘‘ మనం దేవుడిగా మారతామా లేదా అన్నది జనం నిర్ణయిస్తారు. దేవుడిగా మారామని మనం ప్రకటించుకోకూడదు. మౌనంగా ఉండటానికి బదులు కొంత మంది తాము మెరుపులా మెరవాలని కోరుకుంటారు.కానీ మెరుపుల తరువాత అంతకు ముందు ఉన్నదాని కంటే అంధకారం ఏర్పడుతుంది.అవసరమైనపుడు కార్యకర్తలు కొవ్వొత్తిలా కరగాలి, వెలుగునివ్వాలి ’’ అన్నారు. ఈ మాటలు నరేంద్రమోడీ గాలితీస్తూ అన్నవేతప్ప వేరు కాదు. ఒకనాడు మెరిసిన మోడీ మూడోసారి సంపూర్ణ మెజారిటీ తెచ్చుకోవటంలో విఫలం కావటాన్ని అంధకారం అని వర్ణించినట్లుగా చెప్పవచ్చు. తన పేరుతో ఓట్లు దండుకోచూడటం, తాను పూర్తిగా బిజెపి పక్షాన ఉన్నట్లు చిత్రించటం, వీధుల్లోకి లాగటం పట్ల రాముడికి ఆగ్రహం కలిగి ఉండవచ్చు, అందుకే అయోధ్య(ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం)లో ఓడిరచినట్లు అనేక మంది నిజమైన భక్తులు భావిస్తున్నారు. చివరికి కాశీ విశ్వనాధుడికి కూడా మనోభావాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. అందుకే మూడవ సారి రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించాలని చూసిన నరేంద్రమోడీకి గతం కంటే ఓట్లు, మెజారిటీని కూడా తగ్గించి పరువు తీసినట్లు భావిస్తున్నారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గంలో 63.62శాతం(6,74,664) ఓట్లు రాగా సమాజవాదీ పార్టీ అభ్యర్ధిపై 4,79,505 మెజారిటీ తెచ్చుకున్నారు. 2024ఎన్నికల్లో 54.24శాతం(6,12,970) ఒట్లు తెచ్చుకోగా కాంగ్రెస్ అభ్యర్ధి మీద కేవలం 1,52,513 మెజారిటీ మాత్రమే తెచ్చుకున్నారు.
తాను దైవాంశ సంభూతుడనని లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ప్రకటించుకున్నదానికి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం వచ్చింది. ఆ విషయం మోహన్ భగవత్‌కు అప్పుడు తెలియదని అనుకోలేము. ఫలితాలు వెలువడే వరకు మౌనవ్రతం పాటించారు. తరువాత కూడా పరోక్షంగా విమర్శలు చేయటం తప్ప నేరుగా తప్పని చెప్పే సాహసం చేయలేకపోయారు. అది కూడా లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ సాధించటంలో విఫలమై మిత్ర పక్షాల మీద ఆధారపడాల్సిన స్థితి ఏర్పడి మోడీ బలహీనత లోకానికి వెల్లడైన తరువాతనే చెప్పారు.మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితి గురించి కూడా మోహనభగవత్ మరోసారి పూనా సభలో ప్రస్తావించారు(జూన్‌లో తొలిసారి నాగపూర్‌లో నోరు విప్పారు). దీన్లో కూడా చిత్తశుద్ది కనిపించదు. 2023 మే మూడు నుంచి మణిపూర్ మండుతున్నది. రాష్ట్రంలో విఫలమైన బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించారు. అయినా గానీ అక్కడ ఎంతో కష్టతరమైన, సవాలు విసురుతున్న పరిస్థితి ఉందని, స్థానికులకు తమ భద్రత మీద విశ్వాసం లేదని, సామాజిక సేవచేయాలని అక్కడకు వెళ్లిన వారికి కూడా పరిస్థితి మరింత సవాలుగా ఉందని మోహన్ భగవత్ చెప్పారు. ఇన్ని చెప్పిన పెద్దమనిషి తన ఆధీనంలో పనిచేసే ఒక స్వయం సేవకుడిగా మణిపూర్ వెళ్లాలని నరేంద్రమోడీని ఆదేశించలేకపోయారు. కనీసం రాజధర్మంగా ప్రధాని మోడీ ఆ రాష్ట్ర పర్యటన జరిపి జనానికి భరోసా కల్పించాలన్న ఉద్బోధ చేయలేకపోయారు. మోడీతో సహా మొత్తం కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలన్నీ ఆర్‌ఎస్‌ఎస్ మార్గదర్శనంలో నడుస్తాయన్న బహిరంగ రహస్యం అందరికీ తెలిసిందే.
దేవుళ్లు,దేవతల పట్ల విశ్వాసం, కనిపించిన ప్రతి పుట్టా చెట్టుకు మొక్కే జనాలు పుష్కలంగా ఉన్న మన సమాజంలో చరిత్రలో అనేక మంది తాము దైవాంశ సంభూతులం,కలియుగ దేవతలమని చెప్పుకొన్నారు.ఎంతగా మూఢభక్తి ఉన్నా ఇలాంటి బాపతు చరిత్ర చెత్తబుట్టలో కలిశారు. ఈ విషయం తెలిసినప్పటికీ ఎంతమేరకు వీలైతే అంతమేరకు సొమ్ము చేసుకోదలచిన వారు ఎప్పటికప్పుడు పుట్టుకు వస్తూనే ఉన్నారు. తనను దేవుడే పంపాడని నరేంద్రమోడీ పదేండ్ల తరువాత అంత బాహాటంగా ఎందుకు చెప్పుకున్నట్లు ? జనం ఎందుకు నమ్మలేదు ? మోడీ ప్రతిష్టను పెంచటానికి 2014కు ముందు, తరువాత కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రశాంత కిషోర్ వంటి ‘‘కృత్రిమ గొప్పల తయారీ నిపుణులను’’ కూడా వినియోగించుకున్నారు.ఎక్కడ పర్యటించినా కాషాయ దుస్తులతో గుళ్లు గోపురాలను సందర్శించి మతపరమైన పూజలు పునస్కారాలు, ధ్యానాలు చేశారు. వాటన్నింటినీ టీవీలు పెద్ద ఎత్తున చూపాయి. జనాలను హిందూ ముస్లిం వర్గాలుగా సమీకరించేందుకు చేయాల్సిందంతా చేశారు. తీరా ఇంత చేసినా పదేండ్ల పాలన ఎలాంటి ఫలితాలు ఇవ్వటం లేదని గ్రహించి తానే రంగంలోకి దిగి రామబాణంలాగా దైవాంశసంభూతుడనని చెప్పుకున్నారని చెప్పవచ్చు. రామాయణంలో చివరి అస్త్రంగా పరిగణించే రామబాణం గురించి చదువుకోవటం, సినిమాల్లో చూశాము, కానీ నరేంద్రుడి బాణం ఎదురు తిరగకపోయినా పనిచేయలేదు.
