ఎం కోటేశ్వరరావు
లడ్డు కల్తీ ఉదంతంలో దోషులుగా ఎవరు తేలతారో, ఏ శిక్షలు అనుభవిస్తారో ఆ భగవంతుడికే ఎరుక. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా తయారవుతుందా అన్నది ఒక అనుమానం. కానీ తిరుమల శ్రీనివాసుడితో నిమిత్తం లేకుండా సుప్రీం కోర్టులో దాఖలైన పలు కేసులు, ఈ వివాదం నుంచి చంద్రబాబు ఎలా బయటపడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. కల్తీ గురించి దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వ వేసిన సిట్ సరిపోతుందా లేక మరొక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అవసరమో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలంటూ అక్టోబరు మూడవ తేదికి కోర్టు వాయిదా వేసింది. కేంద్రం ఏమి చెబుతుందో కోర్టు ఏమి నిర్ణయిస్తుందో తెలియదు. అయితే అప్పటి వరకు సిట్ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ డిజిపి ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. నిజానికి సిట్ దర్యాప్తు నిలిపివేయాలని కోర్టు ఎలాంటి ఆదేశాలూ జారీ చేయకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే నష్టనివారణ చర్యగా కనిపిస్తున్నది. లడ్డూలలో వాడే నేతిలో కల్తీ ఉందంటూనే దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా ఇచ్చిన నివేదికలో ఎన్‌డిడిబి లాబ్ తన జాగ్రత్తలు తాను తీసుకుంది. దాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా మార్చి జగన్మోహన్ రెడ్డిని మరింతగా దెబ్బతీయవచ్చని ఎవరైనా సలహా ఇచ్చారో లేక తనంతట తానే నిర్ణయం తీసుకున్నారో తెలియదుగానీ లాబ్ నివేదికను బహిర్గతం చేసి చంద్రబాబు ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. దాని గురించి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వెల్లడిరచిన అభిప్రాయాలు తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని ఇరకాటంలోకి నెట్టాయి. లడ్డూలో కల్తీకి పరిహారంగా లడ్డు పోటు, ఇతర ప్రాంతాలను ఆలయం శుద్ది చేసింది. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకంగా తానేమీ తక్కువ కాదన్నట్లు పదకొండు రోజుల దీక్ష పేరుతో చేసిన హడావుడి చూశాము. కల్తీ గురించి సిట్ వేసినపుడు దాని నివేదిక రాకుండా ముందుగానే ఉన్నట్లు కల్తీ గురించి సిఎం ఎలా ప్రకటిస్తారు ? అంటే మీకే స్పష్టత లేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కోట్లాది మంది మనోభావాల మీద ప్రభావం చూపే అంశాలను నిర్ధారించుకోకుండా ఉన్నత పదవుల్లో ఉన్నవారు మాట్లాడటం సరికాదని, దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని కూడా వ్యాఖ్యానించింది. అనేక కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు తీర్పుల్లో కనిపించవు. ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియదు.
నెయ్యి కల్తీ నివేదిక గురించి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తరువాత ప్రతికూల స్పందనలు రావటంతో కొంత మంది కొత్త వాదనలు ముందుకు తెస్తున్నారు. అసలు చంద్రబాబు నివేదికను బయటపెట్టాలనుకోలేదని, వందరోజుల పాలన సందర్భంగా ఎంఎల్‌ఏతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఎన్‌డిడిబి నివేదికను యథాలాపంగా ప్రస్తావించారని చెబుతున్నారు. దాన్ని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి సవాలు చేయటంతో అనివార్యంగా తెలుగుదేశం పార్టీ సదరు నివేదికను విడుదల చేయాల్సి వచ్చిందని సమర్ధించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడికి లీకు వీరుడు అనే మారు పేరు ఉంది. అనేక అంశాలను కావాలనే వేరే మార్గంలో బయటపెట్టించి స్పందనను బట్టి దాన్ని వాడుకోవటం అలవాటు. గతంలో ప్రపంచ బ్యాంకు పధకాలను అమలు చేసే క్రమంలో వాటికి జనం మద్దతు కూడగట్టటం కోసం ఏ శాఖలో ఎంత అవినీతి ఉందో అనే సర్వేలు చేయించి వాటిని మీడియాకు అందచేసిన తీరు జనం మరచిపోయినా అది వాస్తవం. ఇప్పుడు లడ్డూ కల్తీలో ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. ఇప్పుడు ఒకవేళ సుప్రీం కోర్టు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించితే దాని మీద స్పందన ఎలా ఉంటుందో తెలియదు. అలాగాక ఇప్పుడు వేసిన సిట్‌ను కొనసాగిస్తే ముందే కల్తీ గురించి సిఎం చెప్పిన తరువాత దానికి అనుగుణంగా నివేదిక ఇవ్వటం తప్ప వేరే ఏముంటుందని జనం భావిస్తారు. ఒకవేళ సిబిఐ విచారణ జరిపితే మూడు పార్టీల కూటమికి అనుకూలంగా దాని నివేదిక ఉంటుందని కూడా అదే జనం భావిస్తారు. విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది.
దేశ రాజకీయాల మీద చంద్రబాబు చూపిన ప్రభావం గురించి గతంలో ఎన్నో చెప్పుకున్నాం, ఇప్పుడు పలు దేవాలయాల్లో ప్రసాదాల మీద కూడా ‘‘ ప్రభావం ’’ చూపారని వార్తలు. అదేమిటంటే భక్తులు ప్రసాదాల పట్ల ముఖ్యంగా లడ్డుపట్ల అనుమానంగా చూస్తున్నారట. మీడియాలో వచ్చిన వివరాలను బట్టి బయటి సంస్థలు సరఫరా చేసే ప్రసాదాల మీద పూర్తి నిషేధం విధించాలని అయోధ్యలోని రామజన్మ భూమి దేవాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. తయారీ, పంపిణీలో మార్పులు తేవాలని, ఆలయ పూజారుల పర్యవేక్షణలో తయారు చేయాలని కోరారు. దేవాలయాల్లో వినియోగిస్తున్న నెయ్యి స్వచ్చత పట్ల ఆందోళన వెల్లడిరచారు. నైవేద్యాలలో కల్తీ ద్వారా దేవాలయాలను అపవిత్రం చేయాలన్న అంతర్జాతీయ కుట్ర ఉందని ఆరోపించారు.వాణిజ్య పద్దతిలో తయారు చేసే తీపి పదార్ధాల బదులు పండ్లు, పూల వంటి సహజ వస్తువులతో ప్రసాదాలను తయారు చేయాలని మధుర లోని ధర్మ రక్ష సంఫ్‌ు ప్రకటించింది. సంస్థ జాతీయ అధ్యక్షుడు సౌరవ్ గౌర్ మాట్లాడుతూ ప్రసాదాల తయారీలో మార్పులు తేవాలని, తిరిగి సాంప్రదాయ పద్దతులకు మరలాలని సంస్థలు, మత నేతలలో ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. సంగం నగరంగా పిలుస్తున్న ప్రయాగ్ రాజ్ (గతంలో అలహాబాదు) అలోప్ శంకరిదేవి, బడే హనుమాన్, మంకమేశ్వర వంటి వాటితో సహా అనేక దేవాలయాల్లో భక్తులు తెచ్చే స్వీట్లు తదితర పదార్ధాలను అర్పణలకు అనుమతించకుండా నిషేధించారు. లలితా దేవి ఆలయ ప్రధాన పూజారి శివమూర్తి మిశ్రా మాట్లాడుతూ భక్తులు కేవలం కొబ్బరి కాయలు, పండ్లు, ఎండిన పండ్లు మాత్రమే తేవాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వెల్లడిరచారు.స్వీట్ల స్వచ్చత నిరూపితమయ్యే వరకు వాటిని దేవాలయాల్లో అనుమతించకూడదని లక్నోలోని మంకమేశ్వర దేవాలయ మహంత్ శ్రీధరానంద బ్రహ్మచారి జీ మహరాజ్ చెప్పారు. వెలుపలి నుంచి భక్తుల ప్రసాదాలు, సీట్లను అనుమతించేది లేదని అలోప్ శంకరీదేవి దేవాలయ ప్రధాన పూజారి, శ్రీ పంచాయతీ అఖారా మహానిర్వాణి కార్యదర్శి యమునా పూరీ మహరాజ్ ప్రకటించారు. సంగం తీరంలోని బడే హనుమాన్ మహంత్ బల్బీర్ జి మహరాజ్ మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణ నిర్మాణం పూర్తయిన తరువాత లడ్డుపేడ ప్రసాదాలను యాజమాన్యమే తయారు చేయనుందన్నారు.పక్కా హిందూత్వవాది యోగి పాలనలోనే పరిస్థితి ఇలా ఉంది.మధ్య ప్రదేశ్‌లోని సేహోర్‌లోని ప్రముఖ వింధ్యవాసినీ బీజాసన్ దేవీ దేవాలయ ప్రాంగణంలో స్వయం సహాయక బృందం విక్రయిస్తున్న లడ్డుల విక్రయాన్ని నిలిపివేయాలని ట్రస్టు సభ్యులు జిల్లా కలెక్టకర్‌కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. లడ్లు వాసన వస్తున్నాయని, రుచిలో తేడా ఉందని భక్తులు చెబుతున్నారని ట్రస్ట్ చైర్మన్ మహేష్ ఉపాధ్యాయ చెప్పారు. ఈ దేవాలయం భోపాల్‌కు 70కిలో మీటర్ల దూరంలో ఉంది.అయితే తాను సదరు స్వయం సహాయక బృందంతో మాట్లాడానని సమస్య పరిష్కారమైందని కలెక్టర్ చెప్పారు.
మన దేశంలో ప్రసాదాల గురించి భక్తులు అనుమానించటం కొత్తేమీ కాదు. వాటిని సరఫరా చేసే వారు లేదా తయారీకి ఉపయోగించే సరకులు కల్తీ లేదా నాసిరకంగా ఉంటున్నాయని గతంలో అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. నెయ్యి కల్తీ గురించి నాటి కలకత్తాలో వచ్చిన ఆరోపణల గురించి స్పెక్టేటర్ అనే పత్రిక 1886 సెప్టెంబరు 25వ తేదీ సంచికలో రాసింది. ఒక చట్టాన్ని చేయాలని భక్తులు కోరినట్లు దానిలో పేర్కొన్నది. నెయ్యిలో పంది, ఆవు కొవ్వు, ఇతర జంతువుల మాంసాలలో ఉన్న కొవ్వు కల్తీ జరుగుతున్నట్లు విశ్లేషణలో పేర్కొన్నది. తరువాత కలకత్తాలో నెయ్యి వ్యాపారం చేసే మార్వాడీలు నెయ్యిలో కల్తీ చేస్తున్న కారణంగా ఒక నాటికి బెంగాలీ జాతే అంతరించి పోతుందంటూ 1917లో ఒక పత్రికలో వచ్చిన వార్త ఆందోళనకు దారితీసింది.దాంతో మార్వాడీ అసోసియేషన్ నెయ్యి గోడవున్ల వద్దకు వెళ్లి 67నమూనాలను సేకరించి పరీక్షకు పంపగా కేవలం ఏడు మాత్రమే స్వచ్చంగా ఉన్నట్లు తేలింది. దాంతో వేలాది మంది కలకత్తా బ్రాహ్మలు హుగ్లీ నది(బెంగాల్లో గంగానది పేరు) తీరాన హోమాలు చేసి కల్తీ నెయ్యి ఆరగించినందుకు ప్రాయచిత్తం, శరీరాలను శుద్ది చేసుకున్నారు. దాంతో మార్వాడీ అసోసియేషన్ కల్తీ చేసిన వారిని గుర్తించి వారి వద్దనుంచి జరిమానాల రూపంలో రు.75వేలు వసూలు చేసి ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనంలో గడ్డి భూములను కొనుగోలు చేసినట్లు ప్రకటించటంతో బ్రాహ్మలు శాంతించారట. అందువలన దేశంలో నెయ్యి కల్తీ వివాదం తిరుపతితోనే ప్రారంభమైందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే వ్యాపారంలాభం ఉంటుందో అక్కడ అవినీతి కూడా తోడుగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. వ్యాపారం చేస్తూ కల్తీ చేసేవారు, వినియోగించేవారు కూడా హిందువులే, ఎక్కడన్నా ఇతర మతాలకు చెందిన వారు కూడా ఉంటే ఉండవచ్చు. నెయ్యి అంటే ఒక్క ఆవు, గేదె(బర్రె) పాలనుంచే కాదు, గొర్రెలు, మేకలు, ఒంటె పాల నుంచి కూడా తయారు చేస్తారు. శాస్త్రీయ పరీక్షలు అందుబాటులో లేని కాలంలో నెయ్యిని చేతిలో వేసుకొని నలపటం, వాసన చూడటం ద్వారా కల్తీ జరిగిందీ లేనిదీ చెప్పేవారటు. శాస్త్రీయ పరీక్షలు వచ్చిన తరువాత కూడా అనుసరించే పద్దతులను బట్టి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుమల తాజా వివాదంలో ఎన్‌డిడిబి అనుసరించిన పద్దతి గురించి నివేదికలో పేర్కొన్నది, దానితో పాటు ఫలితాల గురించి షరతులు వర్తిస్తాయంటూ కొన్ని సార్లు నివేదికలు తప్పుగా రావచ్చని కూడా చెప్పింది. అందుకే మరొక ప్రయోగశాలలో కూడా పరీక్ష చేయించకుండా చంద్రబాబు నాయుడు తొందరపడి నిర్దారణకు వచ్చి బహిర్గత పరిచారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.ఆ చర్య కోట్లాది మంది భక్తుల మనోభావాల మీద ప్రభావం చూపింది. ఎక్కడ ఎన్ని పరీక్షలు జరిపినా నెయ్యి స్వచ్చత గురించి ఏ లాబ్‌లోనూ ఫలితాలు ఒకే విధంగా ఉండవు అని కూడా చెబుతున్నారు. ఆవులు, గేదెలకు పెట్టే మేతను బట్టి కూడా ఫలితాలు భిన్నంగా ఉంటాయి.
బిజెపి బీఫ్ రాజకీయం గురించి తెలిసిందే.2014ఎన్నికల్లో దాని ప్రచార అస్త్రాల్లో అదొకటి.ఆవు, ఎద్దు,దున్నపోతులు, గేదెల మాంసాన్ని బీఫ్ అంటారు. దీని ఎగుమతులకు వ్యతిరేకంగా నాటి యుపిఏ ప్రభుత్వం మీద నరేంద్రమోడీ ఉత్తరాదిన ఎన్నికల్లో ప్రచారం చేశారు. చిత్రం ఏమిటంటే అధికారానికి వచ్చిన తరువాత వాటి ఎగుమతులకు అనుమతి ఇచ్చారు. ఏటేటా పెరుగుతున్నట్లు ఎగుమతి గణాంకాలు చెబుతున్నాయి. 2023 వివరాల ప్రకారం బ్రెజిల్ తరువాత రెండవ స్థానంలో ఉన్న అమెరికాను పక్కకు నెట్టి మనదేశం ఎగబాకింది.బ్రెజిల్ అన్నిరకాల బీఫ్‌ను 30.12 లక్షల టన్నులు, దున్న, గేదె మాంసాన్ని భారత్ 14.75లక్షల టన్నులు ఎగుమతి చేసింది. తమ కారణంగా చీమలకు సైతం హాని కలగకూడదంటూ జైన మునులు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తారు. కానీ అనేక మంది ఆ మతానికి చెందిన వారు బీఫ్ ఎగుమతిదార్లుగా ఉన్నారు.ఒక సందర్భంలో స్వయంగా నరేంద్రమోడీయే ఆ విషయాన్ని చెప్పారు. మాంస ఎగుమతి ఒక సామాజిక తరగతికి మాత్రమే పరిమితమని చెప్పటం వాస్తవం కాదు, జైన్ సామాజిక తరగతికి చెందిన అనేక మంది నా స్నేహితులు ఆ వ్యాపారంలో ఉన్నారు, ఏదో ఒక సామాజిక తరగతికి ముడిపెట్టే ప్రయత్నం చేయవద్దంటూ మాట్లాడారు. మన పురాణాలు, నమ్మకాల ప్రకారం ప్రతి జంతువు ఏదో ఒక దేవుడితో ముడిపడి ఉంది.గోవధను కొందరు వ్యతిరేకిస్తారు. గోమూత్రం తాగటం పవిత్రంగా భావిస్తారు. దున్నపోతు యుముడి వాహనం, అయినా వాటిని వధించి ఎగుమతులు చేస్తారు. ఎలుక వినాయకుడి వాహనం అంటారు, కానీ అది కనిపిస్తే చంపేయాలని చూస్తారు.(ఇలా చెబుతున్నానంటే నష్టదాయకమైన ఎలుకలను చంపకుండా వదలివేయమని నా ఉద్దేశ్యం కాదు) మొత్తం మీద నెయ్యి కల్తీ గురించి వచ్చే నివేదికలు ఏ ఒక్కటీ ఒకే విధంగా ఉండదని మాత్రం కొందరు నిపుణులు చెబుతున్నారు. అందువలన ముందే చెప్పుకున్నట్లు తిరుపతి లడ్డు కల్తీ వివాదం ఎలా ముగుస్తుందో తెలియదు.
