Tags
ఎం కోటేశ్వరరావు
దేశంలో అనధికారికంగా పెత్తనం చెలాయిస్తున్నారని, ప్రధాని నరేంద్రమోడీ నీడగా భావిస్తున్న అమిత్ షా. సహనం కోల్పోయి ఏం మాట్లాడుతున్నదీ తెలియనంతగా అంతరంగంలో బిఆర్ అంబేద్కర్ మీద ఉన్న ఉక్రోషాన్ని వెళ్లగక్కటం దేశంలో తీవ్ర వివాదానికి దారి తీసింది. దాంతో ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. దేశంలో అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఉలిక్కి పడిన బిజెపి ఎదురుదాడికి దిగటంతో పాటు అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందంటూ ప్రతినిరసనకు పాల్పడిరది. నరేంద్రమోడీ ఒకనాడు దేవాలయంగా వర్ణించిన పార్లమెంటు ప్రాంగణంలో దిక్కుతోచని బిజెపి ఎంపీలు దెబ్బలాటలకు దిగటం తమ నేత వ్యాఖ్యలు వారి మీద ఎంత వత్తిడిని పెంచాయో వెల్లడిరచింది. ఆక్రమంలో జరిగిన తోపులాటలో వారు కూడా కిందపడటం, గాయాలపాలైనట్లు కనిపిస్తోంది. మీరే ముందు దాడికి దిగారంటే కాదు మీరే అని బిజెపికాంగ్రెస్ పరస్పరం ఆరోపించుకోవటం పోలీసు కేసుల వరకూ వెళ్లింది. స్థానిక సంస్థల పాలకవర్గాల సమావేశాలపుడు కొన్ని చోట్ల ఇలాంటి ఉదంతాల గురించి విన్నాం గాని పార్లమెంటు చరిత్రలో ఇదే ప్రధమం.
ఇంతకీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలేమిటి ? 2024 డిసెంబరు 17వ తేదీన రాజ్యసభలో రాజ్యాంగం మీద ప్రత్యేక చర్చలో మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అంబేద్కర్ పేరును దుర్వినియోగపరుస్తున్నదని ఆరోపించారు. ఆ క్రమంలోనే ‘‘ అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని మాట్లాడటం ఇప్పుడొక ఫాషన్‌గా మారింది. ఎవరైనా ఇలాగే అనేక సార్లు దేవుడి పేరును ఉచ్చరిస్తే అలాంటి వారికి స్వర్గం ప్రాపిస్తుంది. అంబేద్కర్ పేరు మరో వందసార్లు ఉచ్చరించండి, కానీ ఆయన పట్ల మీరు ఏ విధంగా వ్యవహరించారో నేను చెబుతా ’’ అన్నారు. ఆంగ్లంలో ఫాషన్ అంటే దురాచారం, రీతి, వాడుక, తీరు వంటి అనేక అర్ధాలు ఉన్నాయి. అమిత్ షా ఏ అర్ధంతో మాట్లాడిరదీ ఎవరికి వారు అన్వయించుకోవచ్చు. ఏ విధంగా చూసినప్పటికీ అమిత్ షా తీరు అంబేద్కర్‌పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించలేదు. అందుకే అంత వివాదాస్పదమైంది. దాని ప్రతికూల ప్రభావాన్ని గ్రహించిన బిజెపి వెంటనే నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. తమ నేతను సమర్ధించుకోవటాన్ని ఒక విధంగా అర్ధం చేసుకోవచ్చు. కానీ అంతకు మించి ఎంపీలు సభలో ప్రవేశించే మకరద్వారం వద్ద మెట్ల మీద బిజెపి సభ్యులు భైఠాయించి ప్రతిపక్ష సభ్యులను సభలోకి వెళ్లకుండా అడ్డుకోవటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. ఆ క్రమంలో కూర్చున్న తమను తోసివేసి రాహుల్ గాంధీ లోపలికి వెళ్లారని, పక్క నుంచి వెళ్లటానికి అవకాశం ఉన్నా కావాలనే ఈ పని చేశారని బిజెపి ఆరోపించటం ఎదురుదాడి తప్ప మరొకటి కాదు. అసలు అడ్డంగా కూర్చోవటం ఎందుకు, పక్కకు తప్పుకు పోవాలని అనటం ఏమిటి ? సభ్యులకు అంతటి అగత్యం ఎందుకు ? కావాలంటే ఇరు పక్షాలూ చెరోవైపు నిలుచుని నినాదాలతో నిరసన తెలపవచ్చు, లోపలికి వెళ్లే వారిని అడ్డుకోవటం ఏమిటి ? బిజెపి ఎంపీలు తనను నెట్టివేయటంతో కాలికి గాయమైందని కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యులు అధికారపక్షాన్ని అడ్డుకుంటారు, కానీ పార్లమెంటుప్రాంగణంలో దానికి విరుద్ధంగా అధికారపార్టీ దౌర్జన్యానికి దిగినట్లు కనిపిస్తోంది.ఈ తోపులాటలో కొందరికి గాయాలు కావటం విచారకరం.
తన మాటలను వక్రీకరించారంటూ ప్రత్యారోపణ చేయటం తప్ప అమిత్ షా వద్ద సదరు వక్రీకరణ ఏమిటో మాట్లాడరు. ప్రధాని నరేంద్రమోడీ మొదలు గల్లీ నేతల వరకు అమిత్ షాకు సమర్ధనగా రంగంలోకి దిగారు.మోడీ సమర్ధన పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని ఆమ్ ఆద్మీనేత కేజరీవాల్ అన్నారు. అమిత్ షా మాట్లాడిన తీరుతో అంబేద్కర్‌ను అభిమానించేవారందరి మనోభావాలు గాయపడ్డాయి. ఆయన పేరు బదులు దేవుడి పేరు స్మరిస్తే స్వర్గం లభిస్తుందనటం అవమానించటం, అంతరంగంలో ఉన్న చులకన భావం తప్ప మరొకటి కాదని వారందరూ భావిస్తున్నారు. బిజెపి మద్దతుదారులుగా ఉన్న అంబేద్కర్ భావజాల అనుచరులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అనేక వివాదాలు చెలరేగినపుడు, మణిపూర్ వంటి దారుణాలు జరిగినపుడు కూడా మౌనమే నా భాష ఓ దేశమా అన్నట్లు ఉన్న మోడీ రంగంలోకి దిగి అమిత్ షాను సమర్ధించటం, చరిత్రలో అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు తెలిసిందే అంటూ ఎదురుదాడి చేశారు. రెండు సార్లు అంబేద్కర్‌ను ఎన్నికల్లో నెహ్రూ ఓడిరచారని, ఓటమిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, భారత రత్న నిరాకరించటంతో పాటు పార్లమెంటు హాలులో ఫొటో కూడా పెట్టలేదని ఆరోపించారు. ఎందుకు మోడీ నోరు విప్పాల్సి వచ్చిందంటే 17శాతంగా ఉన్న దళితుల్లో మద్దతు తగ్గే ప్రమాదాన్ని పసిగట్టటమే. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ నేత రిజర్వేషన్ల గురించి సామాజిక సమీక్ష జరపాలని ఇచ్చిన పిలుపు మొదటి రెండు దశల్లో బిజెపిని దెబ్బతీసిందని ఆ పార్టీ సీనియర్‌నేత సిపి ఠాకూర్ వాపోయారు. మూడోదశలో నష్ట నివారణకు మోడీ రంగంలోకి దిగి అలాంటిదేమీ లేదని చెప్పాల్సి వచ్చింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి నాలుగు వందల సీట్లు వస్తాయన్న ప్రచారం ఒకటైతే ఆ బలంతో రాజ్యాంగాన్ని సవరిస్తామని కొందరు నేతలు చేసిన ప్రకటనలతో దళితుల్లో అనుమానాలు తలెత్తాయి, రిజర్వేషన్లకు ఎసరు పెడతారని భావించారు. పార్లమెంటులో షెడ్యూలు కులాలకు కేటాయించిన 84 స్థానాలకు గాను 2019లో 46 సీట్లు తెచ్చుకున్న బిజెపి 2024లో 29కి దిగజారింది. దళితులు, గిరిజనులపై అత్యాచారాల నిరోధక చట్టం ఉన్నప్పటికీ దాన్ని ఆచరణలో నీరుగార్చిన తీరు తెలిసిందే. తీవ్ర నిరసన వెల్లడి కావటంతో చట్టంలో కొన్ని నిబంధనలను తిరిగి చేర్చాల్సి వచ్చింది. వీటన్నింటినీ చూసినపుడు సున్నితమైన అంశాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, వ్యవహరిస్తే నష్టం అన్నది గ్రహించి బిజెపి అమిత్ షా వ్యాఖ్యలపై నష్టనివారణకు పూనుకుంది. వారి తీరు చూసిన తరువాత తమ నేతను అలా తక్కువ చేసి మాట్లాడతారా అని గాయపడిన మనోభావాలకు స్వాంతన కలుగుతుందా అన్నది అనుమానమే.
అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ రచన జరిగి ఉండకపోతే అమిత్ షా కేంద్ర మంత్రి పదవికి బదులు స్వంత గ్రామంలో చెత్తకాగితాల, పాత సామాన్ల వ్యాపారం చేసుకోవాల్సి వచ్చేదని, మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్‌లో ఉన్నత స్థానాన్ని అధిరోహించేవారు కాదని, తాను పశువులు, గొర్రెలను కాయటానికి పరిమితం అయ్యేవాడినని కర్ణాటక సిఎం సిద్దరామయ్య ఘాటుగా స్పందించారు. అమిత్ షా మాటలు తనకు ఆశ్చర్యం కలిగించటం లేదని బిజెపి, సంఘపరివార్ నేతల మనసులో మాట చెప్పారన్నారు. అంతరంగాన్ని బయట పెట్టినందుకు షాను అభినందిస్తున్నా అంటూ చమత్కరించారు. అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ రచన జరిగే వరకు దేశంలో లింగ, వర్ణ వివక్షతో కూడిన మనుస్మృతి ఒక చట్టంగా చెలామణైందన్నారు. రాజ్యాంగం 1949 నవంబరు 30న దేశానికి అంకితమైందని, తరువాత నాలుగు రోజులకు ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్ దానికి వ్యతిరేకంగా సంపాదకీయం రాసిందని సిద్దరామయ్య గుర్తు చేశారు.‘‘ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భారతీయత లేదు. ఈ నాటికి కూడా మనుస్మృతిలో పేర్కొన్న వాటిని ప్రపంచం గౌరవిస్తున్నది. రాజ్యాంగాన్ని రాసిన పండితులకు ఇవేవీ పట్టలేదు ’’ అని రాశారని, అంబేద్కర్‌ను ఒక పండిట్ అని ఎద్దేవాచేశారని, ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్ లేదా బిజెపి దాన్ని సమర్ధిస్తూనే ఉన్నదన్నారు.
మనుస్మృతిని బహిరంగంగా తగులబెట్టి వివక్షను వ్యతిరేకించిన అంబేద్కర్‌ను అదే మనువాదులు తమవాడిగా చిత్రించేందుకు నిరంతరం ప్రయత్నించటం గమనించాల్సిన అంశం. బుద్దుడిని కూడా దశావతారాల్లో ఒక దేవుడిగా చెప్పేవారు అంబేద్కర్‌కు కాషాయ ముద్రవేయటంలో కొత్తేముంటుంది. ఆర్‌ఎస్‌ఎస్ నేతలలో ఒకరైన దత్తోపంత్ టేంగ్డీ రాసిన పుస్తకంలో హిందూ సమాజాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసే వారు ఐక్యం చేయాలనుకుంటే దాని విస్తరణను వేగవంతం చేయాలని చెప్పినట్లు, ఆ సంస్థ క్రమశిక్షణ గురించి మురిసిపోయారని రాశారు.దాన్లో అంబేద్కర్‌తో తన అనుబంధం, ఆర్‌ఎస్‌ఎస్‌అంబేద్కర్ మధ్యవారధిగా ఉన్నట్లు చెప్పుకున్నారు. అనేక పుస్తకాలు టేంగ్డీ రాసినట్లు ఆర్‌ఎస్‌ఎస్ వాదులు ఉటంకిస్తారు. కమ్యూనిస్టు వ్యతిరేకత అంశంలో అంబేద్కర్`ఆర్‌ఎస్‌ఎస్‌ది ఒకే వైఖరని ఇలా ఎన్నో రకాలుగా రాతపూర్వక చరిత్ర, మౌఖిక చరిత్ర అంటూ ఆధారాలు లేని అంశాలను నిజాలుగా చిత్రించేందుకు గతంలో చూశారు, ఇప్పటికీ గోబెల్స్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. వాటిని గుడ్డిగా నమ్మేవారికి అంబేద్కర్ కూడా సంఘపరివార్ వ్యక్తిగా కనిపిస్తారు. మరి అంతగా ఆర్‌ఎస్‌ఎస్ వారు అంబేద్కర్, అంబేద్కర్,అంబేద్కర్,అంబేద్కర్ అంటూ పదే పదే తమవాడని చెబుతున్న విషయం అమిత్ షాకు తెలియదా ? అది ఆర్‌ఎస్‌ఎస్ ఫాషన్‌గా ఎప్పుడూ అనిపించలేదా ? ఆర్‌ఎస్‌ఎస్ గురించి అంబేద్కర్ సానుకూలంగా, సదభిప్రాయంతో ఉన్నారని చెప్పేందుకు రాతపూర్వక ఆధారాలేమీ లేవు. నిజానికి సంఘపరివార్‌కు అంబేద్కర్ మీద కొత్తగా పుట్టుకువచ్చిన ప్రేమ 1980దశకం తరువాతే. అంతకు ముందు వ్యతిరేకించారు.పదిహేడుశాతంగా ఉన్న దళితుల ఓట్లు లేకుండా అధికారానికి రావటం కష్టమని వారికి జనతా ప్రయోగం తరువాత అవగతమైంది. కొంత మంది చెబుతున్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్ ఒక ఊసరవెల్లి, ఒక హైడ్రా దాని రాజకీయ అవసరాల కోసం రంగు, ఏ రూపమైనా మార్చగలదు, ఏమాటైనా చెప్పగలదు. అంబేద్కర్ నిజమైన హిందువని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే మనుస్మృతిని తగుల పెట్టినందుకు ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన పశ్చాత్తాపం ప్రకటించారా ? లక్షలాది మందితో హిందూమతం నుంచి బౌద్దానికి ఎందుకు మారారో ఎవరైనా చెప్పగలరా ?
