Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కొన్ని సమయాలలో కొందరు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేం. అదే మాదిరి అంతర్జాతీయ రాజకీయాల ఎత్తులు జిత్తులలో భాగంగా సంభవించే పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. ఆగస్టు 31, సెప్టెంబరు ఒకటవ తేదీలలో చైనాలోని రేవు పట్టణమైన తియాన్‌జిన్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) 25 వార్షిక సమావేశం జయప్రదంగా జరిగింది. దాని చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టం అని చెప్పవచ్చు.ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పేందుకు ఈ సభ నాంది పలుకుతుందా ? పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయంటూ సానుకూలంగా, ప్రతికూలంగా ఉండే పండితులందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. చైనా, భారత్‌ మధ్య వెల్లవిరిసిన స్నేహం మరింతగా విస్తరిస్తుందా లేదా అని కమ్యూనిస్టులు, పురోగామి శక్తులలో ఒకింత ఆనందం, అదే స్థాయిలో సందేహాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఒక్క ఈ తరగతికి చెందిన వారే కాదు చైనా, కమ్యూనిజాలను వ్యతిరేకించే, అమెరికాను భక్తితో కొలిచే కాషాయ దళాలు, ఇతరులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. జరుగుతున్న పరిణామాలు వారికి ఏమాత్రం మింగుడు పడటం లేదంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు తియాన్‌జిన్‌లో నరేంద్రమోడీ చైనా ఎర్రజెండా కారులో ప్రయాణం, ఉపన్యాసాలు, కరచాలనాలు, ఆత్మీయపలకరింపులు జరుగుతుండగానే అమెరికాలో కలవరం మొదలై స్వరం మార్చి ప్రకటనలు చేయటం ప్రారంభించారు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియకుండా గందరగోళంగా మాట్లాడారు. తమ కౌగిలిలోకి వస్తారని భావించిన నరేంద్రమోడీ షీ జింపింగ్‌, పుతిన్‌తో చేతులు కలపటంతో డోనాల్డ్‌ ట్రంప్‌లో ఉక్రోషం కట్టలు తెగింది. ఈ ఏడాది చివరిలో తలపెట్టిన క్వాడ్‌ సమావేశంలో పాల్గొనేందుకు రావాల్సిన మనదేశ పర్యటనను రద్దు చేసుకున్నాడు. చివరి క్షణంలో మనసు మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. అయితే తెగేదాకా లాగామా అన్న మలి ఆలోచనలో అమెరికన్లు పడ్డారనే చెప్పాలి.బహుశా ఆ కారణంగానే నవంబరులో వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పారా ? చైనాకు దగ్గర అవుతున్నామన్న సందేశంతో అమెరికాతో మోడీ బేరమాడేందుకు పూనుకున్నారా ? ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. ఒకటి మాత్రం నిజం రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ఎవరు తగ్గినా జనంలో గబ్బుపట్టటం ఖాయం.


షాంఘై ఐదు పేరుతో 1996 ఏప్రిల్‌ 26న చైనా, పూర్వపు సోవియట్‌ యూనియన్‌ విచ్చిన్నమైన తరువాత స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించిన రష్యా, కజకస్తాన్‌, కిర్ఖిరిaస్తాన్‌, తజికిస్తాన్‌లతో పాటు చైనా భాగస్వామిగా ఒక బృందం ప్రారంభమైంది. వాటిన్నిటికీ చైనాతో సరిహద్దు సంబంధాలు కొత్తగా ఏర్పడటంతో మిలిటరీ ఖర్చు తగ్గించుకొనేందుకు, పరస్పరం విశ్వాసం పాదుకొల్పటం వాటి ఒప్పంద అసలు లక్ష్యం. రెండవ సమావేశంలోనే బహుధృవ ప్రపంచం గురించి 1997 మాస్కో సమావేశంలో చైనా, రష్యా నేతలు ఒక ప్రకటన చేశారు. అంటే చక్రవర్తి, సామంత రాజులు అని గాకుండా ఎవరి స్వతంత్రవైఖరిని వారు కలిగి ఉండటం, పెత్తందారీ పోకడలకు దూరంగా, సహకరించుకోవటాన్ని సంకల్పంగా ప్రకటించారు. తరువాత 2001 జూన్‌ 21న ఆరవ దేశంగా ఉజ్బెకిస్తాన్ను చేర్చుకోవటమే కాదు షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) ఏర్పడి భాగస్వాముల మధ్య సహకారాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. తరువాత వివిధ సంస్థల ఏర్పాటుతో పాటు ఆర్థిక, భద్రతా విషయాల్లో కూడా చొరవ తీసుకొనేందుకు ముందుకు పోయారు. తరువాత దానిలో భారత్‌, పాకిస్తాన్‌, ఇరాన్‌, బెలారస్‌ సభ్య దేశాలుగా చేరాయి. ఇవి గాక 17దేశాలు చర్చల భాగస్వాములుగా, ఐక్యరాజ్యసమితి, ఆసియన్‌ కూటమి, పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లుగా ఉండి స్వతంత్రదేశాలైన వాటితో కూడిన కామనవెల్త్‌ ఇండిపెండెంట్‌ కంట్రీస్‌(సిఐఎస్‌) సంస్థ, తుర్క్‌మెనిస్తాన్‌ అతిధులుగా ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో ఈ దేశాలు ఉన్నాయి.మొత్తం 50 రంగాలలో సహకరించుకుంటున్నాయి. ఈ దేశాల జిడిపి 30లక్షల కోట్ల డాలర్లు ఉండగా ప్రపంచ జనాభాలో 42శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.


తియాన్‌జిన్‌ సమావేశాన్ని ప్రారంభించి చైనా నేత షీ జింపింగ్‌ పేరు ప్రస్తావించకుండానే అమెరికాకు తీవ్రమైన హెచ్చరిక చేశాడు. ప్రచ్చన్న యుద్ధ మానసిక స్థితి నుంచి బయటపడాలని, అంతర్జాతీయ సంబంధాలలో అదిరించి బెదిరించే ఎత్తుగడలు, కూటముల ఘర్షణలు సాగవని, నిజాయితీ, న్యాయంతో వ్యవహరించాలని ప్రపంచ నేతలను కోరాడు.సంస్థ సభ్యదేశాలు భద్రత, అభివృద్ధి రంగాలలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని, సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పాడు.మిలిటరీ వ్యవహారాల్లో పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు ప్రారంభమైన ఎస్‌సిఓ ఇప్పుడు సరిహద్దులను అధిగమించి స్నేహ బంధంగా, పరస్పర విశ్వాసం,సహకారంతో విస్తరించిందని, ఈ స్పూర్తిని ముందు ముందు కూడా కొనసాగించాలని షీ జింపింగ్‌ ఆకాంక్షించాడు.విబేధాలను పక్కన పెట్టి పరస్పర లాభదాయకమైన అంశాల మీద కేంద్రీకరించాలని, ఆచరణ ప్రాతిపదికన నిజమైన ఫలితాల సాధన, ఉన్నతమైన సామర్ధ్యంతో వ్యవహరించాలని కోరాడు. సభ్యదేశాలన్నీ స్నేహితులు, భాగస్వాములే అన్నాడు. విబేధాలను గౌరవించాలని, వ్యూహాత్మక సంప్రదింపులతో ఏకాభిప్రాయ సాధనకు రావాలని కోరాడు. భద్రత, ఆర్థికపరమైన సహకారంలో భాగంగా సాధ్యమైనంత త్వరలో ఎస్‌సిఓ అభివృద్ధి బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకుందామని షీ ప్రతిపాదించాడు.ఈ ఏడాదే సభ్యదేశాలకు తాము రెండు బిలియన్‌ యువాన్ల మేర గ్రాంట్లు ఇస్తామని, వాటితో పాటు పది బిలియన్‌ యువాన్లు రానున్న మూడు సంవత్సరాలలో సభ్యదేశాల బాంకుల కన్సార్టియంకు రుణాలు కూడా ఇస్తామన్నాడు. కూటమి దేశాలలో ఇప్పటి వరకు చైనా 84బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది, దాని వాణిజ్య లావాదేవీల విలువ 2024లో 890 బిలియన్‌ డాలర్లు దాటింది. ప్రపంచ జిడిపిలో 23, జనాభాలో 42, ప్రపంచ చమురు నిల్వల్లో 20, గ్యాస్‌లో 44శాతాల చొప్పున ఈ కూటమి దేశాలు కలిగి ఉన్నాయి. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకులకు పోటీగా పెద్దగా షరతులు లేకుండా బ్రిక్స్‌ కూటమి నూతన అభివృద్ది బ్యాంకును కూడా ఏర్పాటు చేసింది, ఇప్పుడు షాంఘై సహకార సంస్థ కూడా మరో బ్యాంకును ఏర్పాటు చేసేందుకు పూనుకుంది.


షాంఘై సహకార సంస్థ సమావేశాలకు ముందే ఆదివారం నాడు షీ జింపింగ్‌ మరియు నరేంద్రమోడీ భేటీ జరిగింది.చైనాతో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవాలని వాంఛిస్తున్నట్లు మోడీ చెప్పారు. భారత్‌పై అమెరికా పన్నులు, జరిమానాలు అమల్లోకి వచ్చిన తరువాత జరిగిన ఈ సమావేశానికి పరిశీలకులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. పరస్పర మన్నన, విశ్వాసం, సున్నితత్వాల ప్రాతిపదికన ఇరుదేశాల సంబంధాలను పెంచుకొనేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. ఏడు సంవత్సరాల తరువాత చైనాను తొలిసారిగా సందర్శించారు. ఇరుదేశాల సంబంధాలను మరింతగా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని, నిరంతరం ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన అభివృద్దిని ముందుకు తీసుకుపోవాలని షీ జింపింగ్‌ ప్రతిస్పందించాడు. ఇరు దేశాల సంబంధాలలో సరిహద్దు సమస్యల నిర్ధారణ అంశాన్ని ముందుకు తేవద్దని, రెండు దేశాల ఆర్థిక అభివృద్ధి మీద ప్రధానంగా కేంద్రీకరించాలని, మనం ప్రత్యర్ధులు గాకుండా భాగస్వాములుగా ఉండాలని కట్టుబడి ఉన్నంతకాలం బెదిరింపులుగాక అభివృద్ధి అవకాశాల మీద దృష్టిపెట్టాలని రెండు దేశాల సంబంధాలు మరింతగా ముందుకు పోయి ఫలించాలన్నాడు.


ఈ వాంఛలను రెండు దేశాలూ వెల్లడిరచటాన్ని చైనాకు భారత్‌ మరింత దగ్గర అవుతున్నట్లు అమెరికా పరిగణిస్తోంది. సరిహద్దుల యాజమాన్యం గురించి ఒక ఒప్పందం, సరిహద్దు వాణిజ్యం, వీసాలు, విమానాల రాకపోకల పునరుద్దరణ, చైనా పెట్టుబడులకు అనుమతి, టిబెట్‌లోని మానససరోవరాన్ని భారత యాత్రీకులకు తెరవటం, విలువైన ఖనిజాలు, ఉత్పత్తులపై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయటం, ఎరువుల సరఫరా పునరుద్దరణ, సొరంగాలను తవ్వే యంత్రాల సరఫరా, అన్నింటికీ మించి చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రముఖుడు, విదేశాంగ మంత్రిగా ఉన్న వాంగ్‌ యి భారత పర్యటనలను ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారానికి వచ్చి ఏడాది కూడా గడవక ముందే ఇవన్నీ జరగటాన్ని అమెరికా జీర్జించుకోలేకపోతోంది. వీటితో పాటు షాంఘై సహకార సంస్థ అమెరికా నాయకత్వంలోని నాటో మిలిటరీ కూటమికి పోటీగా తయారు అవుతుందేమో అన్న భయం కూడా దాన్ని పట్టిపీడిస్తోంది. నిజానికి అలాంటి ఆలోచనలు కూటమిలోని ఏ దేశ అంజండాలో కూడా లేదు. పశ్చిమదేశాల అధికార కూటములకు భిన్నంగా నూతన అంతర్జాతీయ సంబంధాలకు ప్రయత్నిస్తున్నట్లు పాతిక సంవత్సరాల తీరు తెన్నులు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా పెత్తందారీతనాన్ని వ్యతిరేకించటం అంటే మరో మిలిటరీ కూటమిని కట్టటం కాదు.


నాటో, ధనికదేశాలతో కూడిన జి7, ఐరోపా సమాఖ్యకు పోటీగా తయారవుతుందేమో అన్న భయ సందేహాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి అజెండా ఎస్‌సిఓలో ఇంతవరకు లేదు. బ్రిక్స్‌, ఎస్‌సిఓ రెండూ కూడా విస్తరణ దశలో ఉన్నాయి. స్థానిక కరెన్సీలతో వాణిజ్య లావాదేవీలు జరపాలనటంలో వాటి మధ్య ఏకీభావం ఉంది. తొలుత అది విజయవంతమైన తరువాత డాలరుకు పోటీగా మరోకరెన్సీని తీసుకురావచ్చు. రష్యా, భారత్‌, చైనాలతో కూడిన(రిక్‌) కూటమి గురించి కూడా కొందరు చర్చిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి ఆ దిశగా ఎలాంటి పరిణామాలు లేవు.అమెరికా చేసే దాడుల తీవ్రతను బట్టి అజెండాలోకి రావచ్చు. తెగేదాకా లాగినట్లు భావించి లేదా దిద్దుబాటు చర్యల్లో భాగంగా అమెరికా స్వరం మార్చింది. గత కొన్ని దశాబ్దాలుగా వాణిజ్యంలో భారత్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న తమనేత ట్రంప్‌ వ్యాఖ్యల పూర్వరంగంలో రెండు దేశాలూ ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చునని విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ వ్యాఖ్యానించాడు.తాము భారత్‌ నుంచి ఎంతో ఎక్కువగా కొనుగోలు చేయగా తమ నుంచి తక్కువ దిగుమతి చేసుకున్నట్లు ట్రంప్‌ చెప్పాడు. తమ వస్తువుల మీద ఎలాంటి పన్నులు ఉండవని భారత్‌ చెప్పిందనీ అయితే ఇప్పటికే సమయం మించిపోయింది గనుక తాను వెనక్కు తగ్గేదేలేదన్నట్లు మాట్లాడాడు. బెసెంట్‌ ఫాక్స్‌ టీవీతో మాట్లాడుతూ విబేధాలను కూడా పరిష్కరించుకోవచ్చన్నాడు. అన్ని అవకాశాలూ తమ ముందు ఉన్నాయని చెప్పాడు. చిత్రం ఏమిటంటే ట్రంప్‌ కంటే ముందు అమెరికా మరియు భారత సంబంధాల గురించి అమెరికా రాయబార కార్యాలయం పొగిడిరది. ఇరుదేశాల సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయంటూ తమ విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో చేసిన వ్యాఖ్యలను అది ఉటంకించింది. ట్రంప్‌ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే బెసెంట్‌ భారత్‌ను సంతుష్టీకరించే స్వరంతో మాట్లాడాడు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పాడు. షాంఘై సహకార సంస్థ సమావేశం మొత్తం మీద నాటకీయ వ్యవహారం, తద్దినం లాంటిదని, భారత్‌ ప్రపంచంలో అత్యధిక జనాభాగల ప్రజాస్వామిక దేశం, వారి విలువలు చైనా, రష్యాల కంటే అమెరికాకే దగ్గరగా ఉంటాయన్నాడు. అధ్యక్షుడు, రాయబార కార్యాలయం, ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను చూసినపుడు వారి మధ్య సమన్వయం లేకపోవటంతో పాటు నష్టనివారణకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా చూసినపుడు భారత్‌ను దువ్వేందుకు అమెరికా పూనుకుంది. ఈ నెలలో ఐరాస సమావేశాలకు వెళ్లిన సమయంలో ప్రధాని నరేంద్రమోడీ బృందం ట్రంప్‌తో భేటీ కానున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి, అది జరుగుతుందా లేదా జరిగితే ఏమిటి అన్నది చూడాల్సివుంది !