Tags
#Pinarayi Vijayan, 2025 Kerala Lokal Elections, Believers in Kerala LDF, BJP, Kalpetta Municipal Chairman, LDF, Paniya Tribe, Pinarayi Vijayan, RSS, Sabarimala Gold case, Soniya gandhi, UDF Kerala
ఎం కోటేశ్వరరావు
మేం అందంగా లేకపోవచ్చు, మేమూ అందరిమాదిరి మనుషులమే…
మా శరీరాలు నల్లగా ఉండవచ్చు, మా హృదయాలు స్వచ్చం…
విత్తనాలు నాటేవారిలో మేమూ ఒకరిమే, వాటికి కాపలాదారులం కూడా ….
పిడికెడు ధాన్యమే మేం కోరుతున్నాం….
ఈ భావంతో లిపిలేని తమ భాషలో పాటలు పాడుకొంటారు కేరళలోని పనియా గిరిజన తెగకు చెందిన వారు. సమాజంలో నిరాదరణకు గురైన ఈ తెగకు చెందిన నాలుగుపదుల వయస్సున్న పి.విశ్వనాధన్ జీవనం కోసం కాపలాదారుగా పని చేస్తున్నాడు. గతేడాది డిసెంబరులో జరిగిన ఎన్నికలలో కేరళలోని వయనాడ్ జిల్లా కేంద్రమైన కాల్‌పెట్టా మున్సిపల్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించాడు. ఇతర గిరిజన తెగలలో కురిచియా వారే రిజర్వుడు సీట్ల నుంచి ప్రాతినిధ్యం వహించారు తప్ప జనాభా రీత్యా ఎక్కువగా ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడిన కారణంగా నోరులేని పనియా తెగకు చెందిన వారు ఇప్పటి వరకు ఇలాంటి పదవులను చేపట్టలేదు. దళితులు, గిరిజనులకు కేటాయించిన స్థానాల నుంచే ఆ తరగతులకు చెందిన వారు ఎన్నికై పదవులను చేపట్టటం సర్వసాధారణం. అయితే సిపిఐ(ఎం) తన కార్యకర్తగా పని చేస్తున్న విశ్వనాధన్ను ఒక జనరల్ వార్డు నుంచి పార్టీ పోటీకి నిలిపింది. పట్టణంలో అత్యధిక మెజారిటీతో కౌన్సిలర్‌గా గెలిపించింది. గిరిజనులకు రిజర్వు చేసిన చైర్మన్ పదవిని చేపట్టారు.మళయాళ పత్రికలతో పాటు అక్కడి నుంచి వెలువడే జాతీయ పత్రికలన్నీ ఈ ఎన్నిక గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. విశ్వనాధన్ను ఒక పత్రిక హీరోగా వర్ణించింది. తమ పొలాల్లో పని చేసేందుకు గతంలో ఈ తెగవారిని భూస్వాములు బానిసలుగా చేసుకున్న చరిత్ర ఉంది.
యువకుడిగా డివైఎఫ్‌ఐ నేతగా, సిపిఐ(ఎం)లో ఏరియా కమిటీ సభ్యుడిగా, ఆదివాసీ క్షేమ సమితి నేతగా, జానపద గాయకుడిగా విశ్వనాధన్ పని చేస్తున్నారు.గిరిజన తెగల హక్కులు, గౌరవం కోసం జరిగే అన్ని ఉద్యమాల్లో భాగస్వామి.చిన్న తనంలో చదువు సంధ్యలకు నోచుకోని కారణంగా ఈ వయస్సులో పదవ తరగతితో సమానమైన( మెట్రిక్ వంటిది) తుల్యత పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన తరువాత మీడియాతో మాట్లాడుతూ ఎవరికోసమో ఎదురు చూడకుండా తమ సామాజిక తరగతికి చెందిన వారు తమ పరిమితులను అధిగమించి అన్ని ఆటంకాలను తట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. తన ఎన్నిక తమవారిలో ప్రోత్సాహానికి దోహదం చేస్తుందన్నారు.దరఖాస్తులు రాసుకోవటం కూడా రాని తమవారు ఇతరుల మీద ఆధారపడుతున్నారని చెప్పారు. వయనాడ్ జిల్లాలోని గిరిజనుల్లో పనియా తెగవారు 75వేల మంది ఉండగా కురుమా, కురిచియా తెగలకు చెందిన వారు 52వేల మంది చొప్పున ఉన్నారు. ఈ తెగకు చెందిన వారు వయనాడ్, కన్నూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలో ఉన్నారు. పొరుగునే ఉన్న తమిళనాడు నీలగిరి జిల్లాలో, కర్ణాటకలో పరిమితగా ఉన్నారు. ఎన్నికైన తరువాత అధికారిక వాహనంలో తన తలిదండ్రులను కలుసుకొనేందుకు వెళ్లినపుడు వారిలో ఎలాంటి సంభ్రమాశ్చర్యాలు లేకుండా కొడుకును చూశారని, తన కుమారుడు ఈ పదవికి ఎన్నికైనందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని తల్లి చెప్పినట్లు పిటిఐ తెలిపింది. అతని సామర్ధ్యం కారణంగానే జనరల్ సీటు నుంచి గెలిచారని సిపిఐ(ఎం) సీనియర్ నేత వి హారిస్ చెప్పారు.
కాంగ్రెస్-ముస్లింలీగ్ – కుమ్మక్కుతోనే బిజెపి విజయం: పినరయి విజయన్
కేరళలో కూడా మతపరమైన రాజకీయాలు పెరుగుతున్నాయని జనం జాగరూకులై ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హెచ్చరించారు.గురువారం నాడు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సిపిఐ(ఎం) వ్యతిరేకంగా 1990దశకంలో ప్రారంభమైన కాంగ్రెస్-ముస్లింలీగ్-బిజెపి కుమ్మక్కు ఇప్పటికీ కొనసాగుతున్నదని, ఆ కారణంగానే ఇటీవల తిరువనంతపురంలో, 2024 ఎన్నికల్లో త్రిసూర్ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిందని, అంతకు ముందు 2016లో నీమమ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలిచిందని చెప్పారు.తనకు అనుకూలంగా కాంగ్రెస్ సహకరించిందని నీమమ్‌లో గెలిచిన బిజెపి నేత ఓ రాజగోపాల్ స్వయంగా అంగీకరించిన అంశాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. తిరువనంతపురంలో బిజెపి గెలిచిన అనేక వార్డుల్లో కాంగ్రెస్‌కు అతి తక్కువగా ఓట్లు రావటాన్ని బట్టే కుమ్మక్కును గ్రహించవచ్చన్నారు. కర్ణాటకలో ముస్లింల ఇండ్ల కూల్చివేతపై తాను స్పందించిందాంట్లో తప్పులేదన్నారు. ఇలాంటి ఉదంతాలు విదేశాల్లో జరిగినా స్పందిస్తున్నపుడు దేశంలో జరిగిన వాటి మీద మౌనంగా ఎలా ఉంటామని ప్రశ్నించారు. కేరళకే పరిమితం కావాలని అనటం ఏమిటని అన్నారు. ఈ అంశాన్ని కర్ణాటక సిఎం సిద్దరామయ్యతో చర్చించారా అని అడగ్గా, ఇటీవల శివగిరి మఠసమావేశానికి ఆయన ఆలశ్యంగా వచ్చారని, మంత్రివర్గ సమావేశం, ఇతర కార్యక్రమాల వలన తాను ముందుగానే మాట్లాడి వెళ్లినట్లు చెప్పారు.
సోనియా గాంధీని కలిసిన శబరిమల బంగారం చోరీ కేసు నిందితులు !
శబరిమల ఆలయ బంగారం చోరీ కేసు సిట్ దర్యాప్తులో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంటున్నదన్న కాంగ్రెస్ ఆరోపణను విజయన్ తోసిపుచ్చారు. జవాబు చెప్పాల్సిన వారు ఎదురుదాడికి దిగినట్లు ఆయన చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టి, దొంగబంగారం కొనుగోలు చేసిన వర్తకుడు గోవర్ధన్‌తో పాటు కాంగ్రెస్ ఎంపీలు ఆడూర్ ప్రకాష్, ఆంటో ఆంటోనీ కాంగ్రెస్ నేత సోనియగాంధీతో కలసి దిగిన ఫొటో సంగతేమిటో చెప్పకుండా నాటకాలు వేస్తున్నారని సిఎం అన్నారు. పొట్టి పిలిస్తే వెళ్లానని ప్రకాష్ చెబుతున్నారని, ఎవరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళతారా, అసలు వారిని సోనియా వద్దకు తీసుకువెళ్లిన వారెవరో చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కేసు విచారణలో ఎలాంటి ఇబ్బంది లేదని, హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తున్నందున బిజెపి కోరుతున్నట్లుగా సిబిఐకి నివేదించాల్సిన అవసరం లేదని విజయన్ చెప్పారు.
ఏ కూటమి ఓట్లు పెరిగాయి, ఎవరికి తగ్గాయి !
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎల్‌డిఎఫ్ ఘోరపరాజయం పాలైందని, రానున్న రోజుల్లో బిజెపి హవా ప్రారంభమౌతుందని మీడియాలో అనేక మంది చెబుతున్నారు. మళయాళ మనోరమ పత్రిక రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించిన అంకెలను ఉటంకిస్తూ కొన్ని వివరాలను వెల్లడించింది. ఎల్‌డిఎఫ్‌కు మొత్తం 70,99,175 ఓట్లు వచ్చాయి, 2024లోక్‌సభ ఎన్నికల కంటే 4.3లక్షలు ఎక్కువ.యుడిఎఫ్, ఎన్‌డిఏల కంటె మెరుగైనదిగా ఉంది.లోక్‌సభ ఎన్నికల్లో యుడిఎఫ్ 90,18,752 ఓట్లు తెచ్చుకోగా తాజా ఎన్నికల్లో 82,37,385కు అంటే 7.81లక్షల ఓట్లు తగ్గాయి.ఎన్‌డిఏ(బిజెపి) ఓట్లు 38,37003 నుంచి 31,21,335కు పడిపోయాయి, 7.16లక్షల ఓట్లు తగ్గాయి.
బిజెపి మేయర్‌కు శృంగభంగం !
తిరువనంతపురం నగరమేయర్‌గా ఎన్నికైన బిజెపి నేత వివి రాజేష్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకొనే తానే ఇరుక్కు పోయారు. స్మార్ట్ సిటీ పధకంలో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్ వాటా సొమ్ముతో 113 ఎలక్ట్రానిక్ బస్సులను కొనుగోలు చేసి నగరంలో, వెలుపలా వాటిని నడిపిస్తున్నారు.గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం వాటి నిర్వహణలో వచ్చే లాభంలో వాటాను నగర కార్పొరేషన్‌కు ఇవ్వాలని ఉంది. ఆ మేరకు తమకు ఇవ్వటం లేదంటూ బిజెపి మేయర్ ధ్వజమెత్తారు. ఆ బస్సులను రాష్ట్ర రవాణా సంస్థకు అప్పగించారు. కార్పొరేషన్ ఖాతా నుంచి కొంత సొమ్ము ఇచ్చినప్పటికీ అది కూడా ప్రభుత్వ సొమ్మే, దీనికి తోడు ప్రత్యేకంగా ఆ బస్సుల నిర్వహణకు ప్రత్యేక ఖాతా లేదు గనుక గనుక లాభనష్టాల ప్రస్తావన రాలేదు.పినరయి ప్రభుత్వం మీద ధ్వజమెత్తేందుకు మంచి అవకాశం దొరికిందని బిజెపి భావించింది. డీజిలుతో నడిచే బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ భారంగా ఉందని రవాణా శాఖ మంత్రి కెబి గణేష్ కుమార్ చెప్పారు. మేయర్‌కు నిజంగా ఆసక్తి ఉంటే వాటిని తిరిగి తమకు అప్పగించాలని లేఖ రాస్తే వెంటనే స్వాధీనం చేస్తామని ప్రకటించారు. ఆ బస్సులను ఆర్‌టిసి డిపోలలో నిలిపేందుకు వీల్లేదని, కార్పొరేషనే ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పారు. ప్రభుత్వం చౌకగా దొరికే డీజిల్ బస్సులను కొనుగోలు చేస్తుందని కూడా స్పష్టం చేశారు. దాంతో తత్వం బోధపడిన మేయర్ తమకు వాటిని వెనక్కు తీసుకోవాలనే ఉద్దేశ్యం లేదంటూ తోకముడిచారు. నగరమేయర్ పదవిని ఆశించి భంగపడిన బిజెపి కార్పొరేటర్, మాజీ డిజిపి అయిన ఆర్ శ్రీలేఖ ఒక భవనం విషయంలో కూడా భంగపడ్డారు. మాజీ మేయర్, సిపిఐ(ఎం) ఎంఎల్‌ఏ అయిన వికె ప్రశాంత్ ప్రస్తుతం కార్పొరేషన్‌కు చెందిన ఒక భవనానికి అద్దె చెల్లిస్తూ తన కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ భవనంలోనే సదరు ప్రాంత వార్డు కార్పొరేటర్ కార్యాలయం కూడా ఉంది. ప్రస్తుతం ఆ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలేఖ భవనం నుంచి ఎంఎల్‌ఏ ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. తాను ఒప్పందం మేరకు అద్దె చెల్లిస్తున్నందున ఖాళీ చేసే ప్రసక్తి లేదని, గడువు తీరేంతవరకు తననెవరూ కదిలించలేరని ప్రశాంత్ స్పష్టం చేశారు. దాంతో ఆమె అబ్బే ఊరికే కేవలం అభ్యర్ధించా అంటూ వెనక్కు తగ్గారు. నెల రోజులు కూడా గడవక ముందే బిజెపి ఇలాంటి పనులకు పాల్పడిందింటే రానున్న రోజుల్లో ఎలాంటి గిల్లి కజ్జాలకు దిగుతుందో చూడాల్సి ఉంది.
బంగ్లాదేశీయుడివా అంటూ గిరిజనుడిని కొట్టి చంపిన ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి గూండాలు !
డిసెంబరు 17న కేరళ పాలక్కాడ్ జిల్లా అట్టపల్లమ్ గ్రామంలో హత్యకు గురైన చత్తీస్‌ఘడ్ వలస కూలీ, గిరిజనుడైన రామనారాయన్ భగేల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 30లక్షల రూపాయలు మంజూరు చేసింది. తల్లి, భార్యకు ఐదేసి లక్షలు, ఇద్దరు పిల్లలకు పదేసి లక్షల చొప్పున వారి పేర్లతో ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తారు. నువ్వు బంగ్లాదేశీయుడివా అంటూ రామనారాయన్‌ను కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో నిందితుల్లో ఆర్‌ఎస్‌ఎస్-బిజెపికి చెందిన వారు ఉన్నారు. ఏడుగురిని అరెస్టు చేయగా మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో నిందితుల్లో ఇద్దరు పదిహేనేండ్ల క్రితం ఒక సిఐటియు మరియు డివైఎఫ్‌ఐ కార్యకర్తను చేసిన వారిలో ఉన్నారు. వారితో తమకేమీ సంబంధం లేదని బిజెపి చెప్పుకుంది. ఆ పార్టీకి చెందిన వారు ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు మీడియాకు తెలిసినప్పటికీ మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.
