Tags
Achieving gender equality, action by action, BJP, international day of parliamentarism 2025, Narendra Modi Failures, RSS, Women Parliamentarians
ఎం కోట్వేరరావు
నేడు జూన్ 30న ప్రపంచ వ్యాపితంగా అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం జరిగింది. వివిధ దేశాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఏటా ఒక ఇతివృత్తాన్ని ఎంచుకొని దాన్ని ప్రచారం చేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ ఏడాది ” చిన్న చిన్న కార్యాచరణలతో లింగ సమానత్వ సాధన ” గా నిర్ణయించారు. ఈ మేరకు ప్రపంచంలో అనేక కార్యక్రమాలను రూపొందించారు.1889 జూన్30వ తేదీన తొలిసారిగా పారిస్‌లో అంతర పార్లమెంటరీ యూనియన్(ఐపియు) సమావేశం జరిగింది. ఉనికిలోకి వచ్చి 136 సంవత్సరాలైనప్పటికీ 2023వరకు 147 సమావేశాలు జరిగాయి. ఇటీవల ఏడాదికి రెండేసి చోట్ల నిర్వహిస్తున్నారు. .
ఐపియు తొలి అధ్యక్షుడిగా బెల్జియంకు చెందిన అగస్ట్ బీర్‌నియర్ట్ పనిచేయగా, ప్రస్తుతం టాంజానియాకు చెందిన తులియా అక్సాన్ ఉన్నారు. గతంలో మన దేశానికి చెందిన జిఎస్ థిల్లాన్, నజమాహెప్తుల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఐపియు ప్రధానంగా మూడు లక్ష్యాలతో పనిచేస్తుంది. రిజర్వేషన్లు, ఇతర బృందాల ద్వారా పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం పెరిగేందుకు, పార్లమెంట్లలో మహిళలకు మద్దతు ఇచ్చేందుకు, మహిళల హక్కుల కోసం పనిచేసే సంస్థలుగా పార్లమెంట్లను మార్చేందుకు కృషి చేస్తున్నది. హేగ్‌లో అంతర్జాతీయ శాశ్వత కోర్టు ఏర్పాటులో ఇది ప్రముఖపాత్ర పోషించింది. ప్రారంభలో స్విడ్జర్లాండ్‌లోని బెర్న్ నగరం తరువాత బెల్జియంలోని బ్రసెల్స్, కొన్ని సంవత్సరాలు నెదర్లాండ్స్‌లోని ఓస్లో నగరంలో 1921 నుంచి ఇప్పటివరకు స్విడ్జర్లాండ్‌లోని జెనీవాలో ప్రధాన కార్యాలయం కొనసాగుతున్నది. అంతర్జాతీయ సహకారానికి ఉద్దేశించిన తొలి రాజకీయ సంస్థగా దీన్ని చెప్పవచ్చు. అయితే దీని ప్రభావం ఎంత అంటే అనుమానాస్పదమే.
ప్రజాస్వామ్యం ఖూనీ..
ఒక వైపు అనేక దేశాలలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నది. ఈ సంస్థ ఉనికిలోకి వచ్చిన తరువాతనే అనేక దేశాల్లో పార్లమెంట్లను రద్దు చేసి, నియంతలు అధికారానికి వచ్చారు. హిట్లర్ ఏకంగా పార్లమెంటు భవనాన్ని తగులబెట్టించి, నెపాన్ని కమ్యూనిస్టులపై నెట్టి ఆ సాకుతో అణచివేత సాగించాడు. సంప్రదింపులు, మధ్యవర్తిత్వం వంటి అంశాలను చేపట్టినప్పటికీ అనేక దేశాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించటంలో ఐపియు పాత్ర ఎక్కడా కనిపించదు. దీని స్థాపకులలో కొందరికి నోబెల్ శాంతి బహుమతి వచ్చినప్పటికీ ప్రపంచంలో నేడున్న అశాంతి, దానికి దోహదం చేసే శక్తులు చెలరేగిపోవటాన్ని చూస్తున్నాము. ఒక స్వచ్చంద సంస్థలా ఉంది తప్ప ఇది చేసే నిర్ణయాలు, తీర్మానాలకు ఎలాంటి చట్టబద్దత లేదు.
ప్రపంచంలో 190 దేశాల్లో పార్లమెంట్లు ఉన్నాయి. వీటిలో 78 చోట్ల ఎగువ, దిగువ సభలు ఉండగా 112 దేశాల్లో ప్రజాప్రతినిధుల సభలు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా 268 సభలు ఉన్నాయి. ఐపియులో 181 దేశాలు మాత్రమే సభ్యులుగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే అమెరికా, ఆఫ్రికాలోని నైగర్, సూడాన్ ఈ యూనియన్లో లేవు. దీనికి అనుబంధ సభ్యులుగా 13 ప్రాంతీయ పార్లమెంటులు ఉన్నాయి. మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్టవిప్పి చూడ పురుగులుండు అన్నట్లుగా అనేక దేశాలలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. అయినప్పటికీ ప్రతి ఏటా పార్లమెంటరీ దినోత్సవం పాటించటం ఒక తద్దినంగా మారిందంటే అతిశయోక్తి కాదు.2024 మార్చి 18 నుంచి 20వ తేదీ వరకు దక్షిణ కొరియా ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య మూడవ ప్లీనరీ సమావేశం ఆన్‌లైన్‌లో జరిగింది. దీనికి ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అధ్యక్షత వహించాడు. నరేంద్రమోడీతో సహా అనేక మంది సందేశాలు ఇచ్చారు. సదరు యూన్ తరువాత డిసెంబరులో సైనిక పాలన ప్రకటించాడు. పార్లమెంటు దాన్ని వ్యతిరేకించటంతో కొద్ది గంటల్లోనే ఎత్తేశాడు. తరువాత అభిశంసనకు గురై, పదవి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నాడు. దోషిగా తేలితే జీవిత ఖైదు లేదా మరణశిక్ష అంటున్నారు. అందువలన ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారి గురించి జనం సదా అప్రమత్తంగా ఉండాలి.
మహిళల ప్రాతినిధ్యం తక్కువే!
ఐపియు వెబ్‌సైట్ సమాచారం ప్రకారం 2025 జూన్ ఒకటవ తేదీ నాటికి దిగువ, ఎగువ సభల్లో, ఒకే సభ ఉన్న చట్టసభల్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 37,303. ఎగువ సభల్లో ఉన్నవారు 7,168 మంది. వీరిలో పురుషులా,స్త్రీలా అని వివరాలు ఉన్న వారు 43,729 మంది. పురుషులు 31,858 మంది కాగా మహిళలు 11,871 (27.1శాతం). ఎగువ సభల్లో 27.7 శాతం ఉన్నారు. మోడీ వర్ణించినట్లు ప్రజాస్వామ్య కన్నతల్లి మనదేశం చట్టసభలకు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించటంలో 181కి గాను 149వ స్థానంలో ఉంది. లోక్‌సభలో 13.8, రాజ్యసభలో 16.7 శాతం ఉన్నారు. తూర్పు ఆఫ్రికాలో ర్వాండా అనే చిన్న దేశం కోటీ 40 లక్షల మంది జనాభాతో ఉంది.1962లో స్వాతంత్య్రం పొందింది. అక్కడ దిగువసభలో 63.8, ఎగువ సభలో 53.9 శాతం మంది మహిళలు ఉన్నారు. రెండు, మూడు స్థానాలలో క్యూబా, నికరాగువా ఉన్నాయి. దిగువ సభలో 40 శాతంపైగా మహిళలు ఉన్న దేశాలు 29 ఉన్నాయి.మనతో సహా 15 శాతం లోపుఉన్నవి 40 దేశాలు ఉన్నాయి. అసలు ప్రాతినిధ్యం లేని దేశం ఓమన్. పాకిస్తాన్‌తో పోల్చుకోవద్దని అనుకున్నా మన కంటే ఎగువన 134వ స్థానంలో ఉన్నందుకు సిగ్గుపడాలి. వయస్సుడిగిన తరువాత అయ్యప్పస్వామి అన్నా తన ఆలయంలోకి మహిళలను రానిస్తున్నాడంటే ఆయనే కాస్త ”మెరుగు” లా ఉంది. ప్రజాస్వామ్య సదస్సుల్లో మోడీ చెప్పినట్లు చంద్రయాన్‌తో జయప్రదంగా చంద్రుడి మీద కాలుపెట్టాంగానీ మహిళలను మాత్రం చట్టసభల్లోకి రానివ్వటం లేదు.. ”మహత్తర విజయాల్లో ” దీన్ని ఎందుకు చెప్పరు? మొత్తం మీద ప్రపంచ దేశాల్లో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో తక్కువగా ఉంది. ప్రాంతాల వారీ చూసినపుడు అమెరికా ఖండంలో గరిష్టంగా 35.6, ఐరోపాలో 31.7, సబ్‌సహారా ఆఫ్రికాలో 26.9, పసిఫిక్ 24.5, ఆసియా 21.9, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా 16.7 శాతం ఉన్నారు.
అపహాస్యంగా అంతర్జాతీయ దినం..
పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న రోజుల్లో దాన్ని కాపాడాలంటూ ఒక అంతర్జాతీయ దినాన్ని పాటిస్తున్నాము. మన దేశంలో అసెంబ్లీలు, పార్లమెంటు కేవలం ప్రభుత్వ కార్యక్రమానికి ఆమోద ముద్ర వేయించుకొనేందుకు ఆరునెలలకు ఒకసారి సమావేశం కావాలన్న నిబంధన మేరకు కొద్దిరోజుల పాటు సమావేశం కావటం తప్ప, చర్చలకు అవకాశం ఇవ్వటం లేదు. ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు పూనుకోవటంతో పాటు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు పాలకపక్షాలు సిద్ధం కావటం లేదు. పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రమూకల దాడి దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్, పాక్ దుర్మార్గాలను ఎండగడుతూ వివిధ దేశాలకు మన పార్లమెంటరీ బృందాలు వెళ్లటం చూశాము. యావత్ దేశాన్ని కుదిపివేసిన ఈ పరిణామం గురించి ప్రత్యేక పార్లమెంటు సమావేశం జరపాలన్న కనీస డిమాండ్‌ను పాలకపక్షం తిరస్కరించింది. దాన్ని సాధారణ వర్షాకాల సమావేశాల్లోనే చర్చిస్తామని చెప్పింది. గత సమావేశాల తీరుతెన్నులను చూసిన తరువాత అవి ఎలా ఉండేదీ ఊహించుకోవచ్చు. ఐపియు కోరుకున్న జవాబుదారీ తనానికి ఇది విరుద్ధం.
మనదేశం సుభాషితాలు..
ఈ అంతర్జాతీయ సమావేశంలో నరేంద్రమోడీ ఎన్నో సుభాషితాలు చెప్పారు.ప్రజాస్వామ్యానికి భారత్ మాతృమూర్తి అన్నారు, అంతకు ముందు కూడా చెప్పారు. ”సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్” అనే మంత్రంతో గత పదేండ్లుగా భారత్ ముందుకు పోతున్నదన్నారు. దేశంలో 15శాతం జనాభా ఉన్న ముస్లిం సామాజిక తరగతి నుంచి ఒక్కరంటే ఒక్కరి కూడా బిజెపి తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు సీట్లు ఇవ్వని పెద్దమనిషి నుంచి ప్రజాస్వామ్యం, సబ్‌కా సాత్ కబుర్లు. ఇదే ప్రసంగంలో 14 లక్షల మంది ఎంపికైన మహిళా ప్రజాప్రతినిధులు మహిళల నాయకత్వంలో అభివృద్ధి సాధించేందుకు దిగువస్థాయిలో ఉన్నారని చెప్పారు.
అసమానతలకు వ్యతిరేకంగా..
అంతర పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) లో మహిళా పార్లమెంటేరియన్ల వేదిక గడచిన నాలుగు దశాబ్దాలుగా చురుకుగా పని చేస్తున్నది.1985లో ఉనికిలోకి వచ్చి 40వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది. మహిళల సాధికారతకు అవసరమైన చట్టాలు, విధానాలు, వాటికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరగాలని, లింగ అసమానతలకు వ్యతిరేకంగా, పార్లమెంటరీ బృందాలలో మహిళల ప్రాతినిధ్యం పెంపు వంటి అంశాల మీద ఈ వేదిక కేంద్రీకరిస్తున్నది. అత్యధిక చట్ట సభలు పురుషాధిక్యంలోనే ఉన్నాయి. నిర్ణయాలు చేసే సంస్థలలో మహిళలు తక్కువగా ఉన్నారు. తాము చట్టసభల్లో మానసిక హింసకు గురైనట్లు ఆఫ్రికాలోని 80 శాతం మంది మహిళలు ఒక సర్వేలో చెప్పారు.1978లో ఐపియు సభల్లో కేవలం 7.7 శాతమే మహిళలు. ప్రస్తుతం దాదాపు 30 శాతం ఉన్నారు. 2024లో ప్రపంచవ్యాపితంగా 73 సభలకు ఎన్నికలు జరిగాయి. కేవలం 0.3 శాతం మాత్రమే మహిళలు పెరిగారు. 2017 తరువాత ఇది అత్యంత తక్కువ వృద్ధి రేటు. ప్రభుత్వాల్లో ప్రాతినిధ్యం 0.4 శాతం తగ్గింది.
నిరాయుధీకరణ గురించి..
దీనిపై ఐపియు సుభాషితాలు వల్లిస్తుంటే పట్టించుకొనేదెవరు? ప్రపంచ ఆధిపత్యం కోసం, అనేక దేశాలను తన అదుపులో ఉంచుకొనేందుకు అమెరికా, ఐరోపా ధనికదేశాలు అనేకచోట్ల ఉగ్రవాదులను తయారుచేసి ఆయుధాలు ఇస్తున్నాయి. ఐపియు చొరవతో ప్రభుత్వేతర శక్తుల చేతుల్లో మారణాయుధాలు పడకూడదన్న ఐరాస భద్రతా మండలి 1540 తీర్మానానికి విలువ ఏముంది? సద్దాం హుసేన్ నాయకత్వంలో ఇరాక్ మారణాయుధాలను గుట్టలుగా పోసిందనే పేరుతో అమెరికా దాడి చేసి దురాక్రమణకు పాల్పడింది. సద్దాంను ఉరితీసింది. చివరికి అక్కడ అలాంటివేమీ లేవని అదే అమెరికా చెప్పింది. అయినప్పటికీ దాన్ని అంతర్జాతీయ నేరం కింద బోనులో నిలబెట్టలేదు. యుద్ధాలు, దాడుల సమయంలో మహిళలు, యువత మీద ప్రభావం పడకుండా చూడాలని భద్రతామండలి 1325, 2250 తీర్మానాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయెల్ చేతుల్లో మరణించిన వారిలో 80 శాతం మంది పిల్లలు, మహిళలే ఉన్నప్పటికీ అదే భద్రతామండలి చేసిందేమీ లేదు. ఆ దుర్మార్గాన్ని ఖండించే తీర్మానాన్ని కూడా చేయనివ్వకుండా అమెరికా వీటో చేసింది. మారణకాండను ఆపాలని కోరుతూ సాధారణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని మనదేశం బలపరచాల్సిందిపోయి, ఓటింగ్‌కు దూరంగా ఉండి అమెరికా, ఇజ్రాయెల్‌ను సంతుష్టీకరించింది. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథంలో 55 వేల మందికి పైగా పిల్లలు, మహిళలు, వృద్ధులు బలైనా, ఆ ప్రాంతాన్ని నేలమట్టం గావించటాన్ని నిస్సిగ్గుగా సమర్ధిస్తున్న అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్‌కు శాంతి బహుమతి ఇవ్వాలని నోబెల్ కమిటీకి పాకిస్తాన్ ప్రతిపాదించిందంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఆ ప్రతిపాదన ప్రకటన వెలువడిన తరువాత ఇరాన్‌పై భీకరదాడికి ట్రంప్ ఆదేశించాడు. ‘అతగాడొక ప్రజాస్వామికవాది..!’ అంటూ పాకిస్తాన్ వంతపాడుతున్నది.
