యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

మేక పిల్లను మింగేయాలనుకున్న తోడేలు కథ తెలిసిందే ! ప్రపంచంలో ఏదో ఒక మూల ఘర్షణ లేదా యుద్ధం లేకుండా అమెరికాకు నిదురపట్టదు. అందుకే మాదక ద్రవ్యాల రవాణా సాకుతో వెనెజులాపై ఏ క్షణమైనా దాడి చేసేందుకు అవసరమైన సన్నాహాలన్నీ పెంటగన్‌ పూర్తి చేసింది. మిలిటరీ ద్వారా మదురోను తొలగించేందుకు పూనుకోవద్దని, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పోప్‌ లియో మంగళవారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌కు హితవు చెప్పాడు. అక్కడ మార్పులు కావాలని అనుకుంటే ఆర్థిక ఆంక్షల ద్వారా చేయవచ్చని సలహా కూడా ఇచ్చాడు. ప్రపంచంలో అతి పెద్దది, అధునాతనమైనదిగా పరిగణిస్తున్న యుఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఫోర్డ్‌ విమానవాహక యుద్ధ నౌకతో సహా అనేక ఇతర నౌకలు, వేలాది మంది సైనికులను కరీబియన్‌ సముద్ర ప్రాంతానికి తరలించింది.దేశం నుంచి వెళ్లిపోవాలని డోనాల్డ్‌ ట్రంప్‌ వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను బెదిరించిన ట్రంప్‌ శుక్రవారం నాటితో గడువు ముగిసిందంటూ వెనెజులా గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించాడు. ఆ ప్రకటన చేసినప్పటికీ సోమ, మంగళవారాల్లో అమెరికా నుంచి వెనెజులా పౌరులను అనేక మందిని విమానాల ద్వారా తరలించారు, వారానికి రెండు రోజుల్లో తరలించవచ్చని గతంలో మదురో సర్కార్‌ అనుమతించింది. అద్దె విమానాలను నడిపే సంస్థ తమకు అనుమతులు ఇవ్వాలని సోమవారం నాడు దరఖాస్తు చేసింది. గత కొద్ది నెలలుగా వెనెజులా నుంచి మాదక ద్రవ్యాలతో నిండిన పడవలు వస్తున్నాయంటూ వాటిపై దాడులు చేసి అనేక మందిని అమెరికా హత్య చేసింది. అమెరికా దుర్మార్గాన్ని వదలిపెట్టి వెనెజులా మిలిటరీ సామర్ధ్యం ఎంత, దాడులను తట్టుకోగలదా లేదా అంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించే కథనాలను మీడియా ముందుకు తెస్తున్నది. గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ డాట్‌కామ్‌ 2025 మిలిటరీ సూచిక ప్రకారం అమెరికా మొదటి స్థానంలో ఉండగా వెనెజులా 50వదిగా ఉంది. అయినప్పటికీ తమ దేశాన్ని కాపాడు కొనేందుకు చివరి రక్తపు బొట్టువరకు చిందిస్తామని మదురో గతంలో ప్రకటించాడు. ఏ దేశానికైనా అంతకు మించి మరో మార్గం ఉండదు.సోమవారం నాడు విదేశాంగ, రక్షణ మంత్రులు, ఉన్నతాధికారులతో ట్రంప్‌ సమావేశమైన దాడి సన్నాహాల గురించి చర్చించినట్లు వార్తలు.అమెరికా అధికార పీఠంపై ఎవరు ఉన్నప్పటికీ వెనెజులాలో వామపక్షల హ్యూగో ఛావెజ్‌ రాజకీయ వారసుడిగా వచ్చిన మదురో వరకు వారి కుట్రలు ఆపటం లేదు. అక్కడి ప్రతిపక్ష నేతలకు మద్దతు ఇచ్చి కుట్రలకు తెరలేపిన సంగతి తెలిసిందే.

తప్పుడు ప్రచారం, అసత్యాలతో ఇతర దేశాలపై దాడులు చేయటం అమెరికాకు కొత్తేమీ కాదు. తనకు లొంగని, నచ్చని దేశాధినేతలను పదవుల నుంచి తొలగించేందుకు చేసిన కుట్రల గురించి తెలిసిందే. వాటి వలన ప్రయోజనం లేదని చరిత్ర చెబుతున్నా పదే పదే ప్రయత్నాలు చేస్తున్నది.వలసవాదానికి వ్యతిరేకంగా లాటిన్‌ అమెరికా గతంలో పోరాడింది. దాన్ని తన పెరటితోటగా మార్చుకొనేందుకు అమెరికా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.ఈ ప్రాంతంలో సామ్రాజ్యవాదుల దుర్మార్గాలు ఇన్నిన్నికాదు. నవంబరు 29న లాటిన్‌ అమెరికాలో జోంగ్‌ మారణ కాండకు 244 సంవత్సరాలు నిండాయి.లాటిన్‌ అమెరికాలోని చెరకు తోటల్లో పని చేసేందుకు జోంగ్‌ అనే పడవలో 1781లో ఆఫ్రికా నుంచి బానిసలను తరలించారు. ఒక్కో బానిసను 36 పౌండ్లకు విక్రయించారు. పడవ సామర్ధ్యానికి రెండు రెట్లు అంటే 442మందిని ఎక్కించారు.ఘనా నుంచి జమైకాకు ప్రయాణించే ఆ పడవ నావికులు చేసిన తప్పిదాల వలన ఆలస్యమై మంచినీరు చాలకపోవటం, ఇతరత్రా కారణాలతో అనేక మంది మరణించారు. ఓడ యజమానులు ఒక్కొక్క బానిస మీద 30 పౌండ్ల చొప్పున బీమా సొమ్ము పొందే అవకాశం ఉంది. దుర్మార్గం ఏమంటే అందుకోసం నీరసించిపోయిన వారిలో 54 మంది మహిళలు, పిల్లలను మరణించినవారితో పాటు నవంబరు 29న కరీబియన్‌ సముద్రంలోకి నెట్టి చంపివేశారు.ఈ ఉదంతం సామ్రాజ్యవాదంపై ప్రతిఘటన, బానిసత్వ రద్దు చట్టాలకు నాంది పలికింది. దీన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే బానిసవ్యాపారులు బీమా సొమ్ముకోసం బతికి ఉన్నవారిని సముద్రంలోకి తోసివేసినట్లే వెనెజులాపై దాడికి అమాయకులైన వారు ప్రయాణిస్తున్న పడవలపై దాడులు చేసి వారిని చంపివేసిన అమెరికా మిలిటరీ దాన్ని మాదకద్రవ్యాల నిరోధానికి తీసుకున్న చర్యగా ప్రపంచాన్ని నమ్మించేందుకు చూసింది. అసలు అమెరికాకు అలాంటి అధికారం ఎవరిచ్చారు, అదేమీ అమెరికా గడ్డకాదు, సముద్రజలాలు వారివి కాదు. తాము పేల్చివేసిన ప్రతిపడవతో 25వేల మంది అమెరికన్ల ప్రాణాలను రక్షించామని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకున్నాడు.ప్రతి ఏటా వేలాది మందిని అమెరికాలో తుపాకులతో కాల్చిచంపుతుంటే, మాదక ద్రవ్యాలతో నింపుతుంటే వారిని నిరోధించటం చేతగాని దద్దమ్మలు ఎక్కడో మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయంటూ యుద్ధ నౌకలు, మిలిటరీని తరలిస్తుంటే నమ్మటానికి జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరు. ఛావెజ్‌ నాయకత్వంలో వెనెజులాలో ప్రారంభమైన వామపక్ష పాలనకు 26 సంవత్సరాలు నిండాయి. ఆ ప్రాంతంలో అమెరికాకు కొరకరాని కొయ్యగా తయారైంది.అసలు దుగ్ద అది, అందుకే మదురోను తొలగించి తన తొత్తులను అక్కడ అధికారంలో కూర్చోపెట్టేందుకే ఈ దుర్మార్గానికి ట్రంప్‌ తెరతీశాడు.

అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా వెనెజులా ప్రస్తుతం క్యూబా, చైనా తదితర దేశాలకు చమురు ఎగుమతులు చేస్తున్నది. ప్రపంచంలో 303 బిలియన్‌ పీపాల చమురు నిల్వలతో వెనెజులా మొదటి దేశంగా ఉంది.వాటిని చేజిక్కించుకొని అమెరికా కంపెనీలకు అప్పగించాలని అక్కడి రిపబ్లికన్లు, డెమోక్రాట్లూ ప్రయత్నిస్తున్నారు.దానికి గాను సాకులు చెబుతున్నారు.2007లో ఛావెజ్‌ ప్రభుత్వం అమెరికా కంపెనీల చేతుల్లో ఉన్న చమురు సంస్థలను జాతీయం చేసినప్పటి నుంచి కుట్రలు మొదలయ్యాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల సరఫరాలో వెనెజులా కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిరంతరం ప్రచారం చేస్తున్నారు. మాదకద్రవ్యాలు, నేరాలకు సంబంధించిన ఐరాస సంస్థ, చివరికి అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజన్సీ కూడా వాటిని తిరస్కరించింది. వార్షిక నివేదికల్లో మాదకద్రవ్యాలను వెనెజులా ఉత్పత్తి చేయటం లేదని, సరఫరా గురించి ఆధారాలు లేవని పేర్కొన్నాయి.అమెరికా చేరుతున్న కొకెయిన్‌లో 90శాతం పసిఫిక్‌ సముద్రమార్గాల ద్వారా దక్షిణ అమెరికా మిత్రదేశాల నుంచి నుంచి చేరుతున్నదని, ప్రమాదకరమైన ఫెంటానిల్‌ అమెరికా దక్షిణ సరిహద్దుల నుంచి ఎక్కువగా అమెరికా పౌరులే స్మగ్లింగ్‌ చేస్తున్నారని అనేక నివేదికలు ఉన్నాయి.వాటిని విస్మరించి మదురో మాదక ద్రవ్యాల సరఫరా మాఫియా నాయకుడని ఆరోపించటం తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. అమెరికా చెబుతున్న మాదకద్రవ్యాల ముఠా జాడ అక్కడ ఉందని ఏ అంతర్జాతీయ సంస్థా చెప్పలేదు. మాదకద్రవ్యాల రవాణా మీద పోరాడుతున్నట్లు అమెరికా చెప్పుకోవటం హాస్యాస్పదం, బూటకం. లాటిన్‌ అమెరికాలోని హొండురాస్‌ మాజీ అధ్యక్షుడు జువాన్‌ ఓర్లాండో హెర్నాండెజ్‌ మాదక ద్రవ్యాల రవాణా కేసులో 2024లో అమెరికా కోర్టు 45 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాంటి నేరగాడికి క్షమాభిక్ష ప్రసాదిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు.

యుద్ధాల ప్రారంభానికి సామ్రాజ్యవాదులు, యుద్దోన్మాదులు అబద్దాలు చెప్పటం కొత్త కాదు.నిజానికి అది పురాతన ఎత్తుగడ. యుద్దంలో ముందుగా హతమయ్యేది నిజం.మొదటి ప్రపంచ యుద్దంలో న్యూయార్క్‌ నుంచి బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ బయలుదేరిన ఆర్‌ఎంఎస్‌ లుస్టియానా అనే నౌకను ఐర్లండు వద్ద జర్మన్లు పేల్చివేశారని ప్రచారం చేశారు.జున్ను, వెన్న రవాణా పేరుతో పేలుడు పదార్దాలను కూడా దానిలో రవాణా చేస్తుండగా అవి పేలటంతో 139 మంది అమెరికన్లలో 128 మంది మరణించారు. ఇది వాస్తవం కాగా జర్మనీ మీద నెపం మోపి అమెరికన్లను యుద్దానికి సిద్ధంచేసేందుకు తప్పుడు ప్రచారం చేశారు. ఇదే ఎత్తుగడతో రెండవ ప్రపంచ యుద్దంలో చేరేందుకు కుట్ర చేశారు.దాన్ని అర్ధంచేసుకోని జపాన్‌ 1941 డిసెంబరులో పెరల్‌హార్బర్‌పై చేసినదాడిలో 2,400 మంది అమెరికన్‌ మిలిటరీ, పౌరులు మరణించారు. ఆ దాడి గురించి నాటి అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌, అధికార యంత్రాంగానికి ముందే తెలుసునని, వారం ముందే దాడి జరగనున్నదని రూజ్‌వెల్ట్‌ తనకు చెప్పినట్లు నాటి అమెరికా యుద్ధ మంత్రి హెన్రీ టిమ్సన్‌ తన డైరీలో రాశాడు. ప్రభుత్వానికి అందిన హెచ్చరికలను కూడా కావాలనే పక్కన పెట్టారని తరువాత వెల్లడైంది.ఈ దాడిని ఆసరా చేసుకొని జపాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించటం, అణుబాంబులను వినియోగించటం తెలిసిందే. దీనికి పది సంవత్సరాల ముందు చైనాలోని మంచూరియాను ఆక్రమించుకొనేందుకు జపాన్‌ సామ్రాజ్యవాదులు కూడా ఇదే ఎత్తుగడను అనుసరించారు. తమ నిర్వహణలోని రైల్వే ట్రాక్‌ను తామే పేల్చుకొని చైనా మీద నెపం మోపి దురాక్రమణకు పూనుకున్నారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఉత్తర కొరియా దురాక్రమణ నుంచి దక్షిణ కొరియాను రక్షించేపేరుతో కొరియా యుద్దం జరిగింది. అది కూడా తప్పుడు ప్రచారమే.అసలు అలాంటి ప్రయత్నమే జరగలేదు. ఉత్తర కొరియా కమ్యూనిస్టుల ఆధీనంలో ఉండటమే అసలు కారణం. ఐరాస పేరుతో అమెరికా జరిపిన దాడి, ప్రతిఘటనలో 30లక్షల మంది పౌరులు మరణించారు.

వియత్నాం దురాక్రమణ కూడా అసత్యాలతోనే ప్రారంభమైంది. టోంకిన్‌ గల్ఫ్‌(దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం తీరంలోని జలసంధి) లో తమ నౌకపై ఉత్తర వియత్నాం 1964 ఆగస్టులో రెండుసార్లు దాడి చేసిందని ఆరోపిస్తూ అమెరికా దాడికి దిగింది. దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టు వ్యతిరేకపాలకులకు మద్దతుగా వచ్చిన అమెరికా నౌక ముందుగా చేసిన దాడిని ఉత్తర వియత్నాం ప్రతిఘటించింది. అసలు రెండవదాడి ఉదంతమే జరగలేదని తరువాత వెల్లడైంది. 1967లో అమెరికా మద్దతుతో ఈజిప్టు,జోర్డాన్‌, సిరియాపై ఇజ్రాయెల్‌ జరిపినదాడి కూడా అబద్దాలతోనే జరిగింది.ఈజిప్టు తొలుత తమపై దాడి చేసినట్లు దానికి ప్రతిదాడికి దిగినట్లు ఆరోపించింది. దానికి ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో ఈజిప్టు ఇతర అరబ్బుదేశాలు తమపై దాడికి సన్నద్దం అవుతుండటంతో ఆత్మరక్షణ కోసం దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ సమర్ధించుకుంది. అమెరికాను ప్రత్యక్షంగా రంగంలోకి దించేందుకు పధకం ప్రకారం ఈజిప్టు సమీపంలో ఉన్న అమెరికా నౌక యుఎస్‌ఎస్‌ లిబర్టీపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. నెపాన్ని ఈజిప్టుమీద నెట్టేందుకు చూసింది.ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని తరువాత వెల్లడైంది.1990దశకంలో జరిగిన గల్ఫ్‌దాడులను కూడా అమెరికా అబద్దాలతోనే మొదలు పెట్టింది.ఇరాకీలు కువాయిట్‌పై దాడి చేసినపుడు ఆసుపత్రిలో ఉన్న పిల్లలను చంపివేశారని కాకమ్మ కథలను అమెరికా చెప్పించింది. తరువాత 2003లో ఇరాక్‌ అధినేత సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసినట్లు ప్రచారం చేసి దాడి చేయటమేగాక సద్దామ్‌ను ఉరితీసిన సంగతి తెలిసిందే. తరువాత అలాంటి ఆయుధాలేమీ లేవని అమెరికన్లే అంగీకరించారు. సిఐఏ చెప్పిన కట్టుకథలను అమెరికాతో సహా యావత్‌ ప్రపంచ మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. లిబియాలో మానవహక్కులకు భంగం కలిగిందని, వాటిని పునరుద్దరించేపేరుతో జోక్యం చేసుకోవటమే గాక అధినేత గడాఫీని అంతం చేసేందుకు నాటో దళాలను దించిన సంగతి తెలిసిందే.గడాఫీ వ్యతిరేక తిరుగుబాటుదార్ల పేర్లతో నాటకమాడి 2011లో గడాఫీని హత్య చేశారు.

అనేక దేశాలలో పాలకులు, పార్టీలను మార్చి తనకు అనుకూలశక్తులను గద్దెల మీద కూర్చోపెట్టేందుకు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా చేసిన యత్నాలన్నీ విఫలం కావటమేగాక చేతులు కాల్చుకున్నది.నియంతలు, పచ్చిమితవాదులకు ఆశ్రయమిచ్చి రక్తపాతానికి కారకురాలైంది.అయినా సరే ఎప్పటికాలిట్టిట్టే అన్నట్లుగా అమెరికాలో ఏ పార్టీ అధికారానికి వచ్చినా అదే వైఖరి.ఇప్పుడు వెనెజులాలో కూడా అదే జరుగుతోంది.అధ్యక్షుడు నికోలస్‌ మదురో దేశం విడిచిపోవాలని ట్రంప్‌ బెదిరించాడు. ఒక విమానవాహక యుద్ధ నౌక, పది ఇతర మిలిటరీ నౌకలు, పదిహేనువేల మంది మిలిటరీ, వందలాది యుద్ధ విమానాలతో వెనెజులాను చుట్టుముట్టారు. మదురో కూడా గతకొద్ది నెలలుగా తనకున్న మిలిటరీ, గెరిల్లా దళాలను సన్నద్దం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ఏం జరగనుందో అని యావత్‌ ప్రపంచం ఆందోళనతో చూస్తున్నది.నేడు వెనెజులా పతనమైతే రేపు ఏ దేశం మీదనైనా ఏదో ఒకసాకుతో అమెరికా దాడికి దిగితే పరిస్థితి ఏమిటో ప్రతివారూ ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది !

అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Tags

, , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఇటీవల చైనాతో సంబంధం ఉన్న రెండు వార్తలు, విశ్లేషణలు మీడియాలో వచ్చాయి.ఒకటి, 1962లో చైనాతో వచ్చిన యుద్ధం సరిహద్దు సమస్యల మీద కాదు, రెండవది అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన మన పౌరురాలి పాస్‌పోర్టు, వీసా చెల్లదు అని చైనా విమానాశ్రయంలో ఇబ్బంది పెట్టారు అన్నది రెండవది. మొదటి అంశాన్ని మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు, రెండవదాని మీద పెద్ద ఎత్తున స్పందించింది, ఎందుకు ?చైనాతో వచ్చిన యుద్దం గురించి వచ్చిన విశ్లేషణ మీద కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది, దాని మనసెరిగి, కనుసన్నలలో నడుస్తున్న మీడియా కావాలనే విస్మరించింది. రెండవ ఉదంతం మీద దానికి భిన్నంగా జరిగింది. చరిత్ర దాస్తే దాగేది కాదు, చెరిపితే పోయేది కాదు.రెండు దేశాల మధ్య యుద్ధం ప్రాధమికంగా సరిహద్దులపై ఏకాభిప్రాయం లేకపోవటం లేదా దౌత్యపరమైన వైఫల్యాల వలన జరగలేదని, పథకం ప్రకారం 1950 మరియు 60దశకాల్లో అమెరికా అనుసరించిన వ్యూహంలో భాగంగా చోటు చేసుకుందని సిఐఏ, దౌత్యకార్యాలయాల పత్రాలు, ప్రచ్చన్న యుద్ద అంతర్జాతీయ చరిత్ర ప్రాజెక్టు పత్రాలు వెల్లడించాయి. కొన్ని ప్రధాన మంత్రి మ్యూజియం మరియు లైబ్రరీలో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని సంప్రదింపులతో పరిష్కరించుకోవాలన్న వైఖరిని వెల్లడించినందుకు తరువాత సిపిఐ(ఎం)గా ఏర్పడిన నాయకులను యుద్ధ సమయంలో ప్రభుత్వం, నాడు జనసంఘం రూపంలో ఉన్న నేటి బిజెపి నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర పార్టీలు, సంస్థలు దేశద్రోహులుగా చిత్రించాయి. ప్రభుత్వం జైల్లో పెట్టింది. యుద్దాన్ని సమర్ధించి నాటి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన సిపిఐతో ఇతరులను దేశభక్తులుగా చిత్రించారు, జనం కూడా అత్యధికులు నిజమే అని నమ్మారు. అది జరిగి ఆరు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు వెలువడిన నిజానిజాలేమిటి ? యుద్ధానికి కారణం సరిహద్దు సమస్య కాదని, టిబెట్‌ కేంద్రంగా అమెరికా జరిపిన కుట్రలో భాగంగా జరిగిందని ఇటీవల బహిర్గత పరచిన నాటి రహస్య పత్రాలను అధ్యయం చేసిన వారు చెప్పిన మాట ఇది. వారెవరూ కమ్యూనిస్టులు కాదు. ఆ పత్రాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి గనుక దీనికి భిన్నమైన విశ్లేషణను ఎవరైనా జనం ముందు పెట్టవచ్చు. అప్పటి వరకు కమ్యూనిస్టుల మీద నిందవేయటం తప్పని దాన్ని వెనక్కు తీసుకుంటామని ఎవరైనా నిజాయితీతో అంగీకరిస్తారా ?

” 1962 చైనా-భారత్‌ సంఘర్షణ భౌగోళిక రాజకీయ పరిణామాల వెల్లడి : చైనాా-భారత్‌ విభజనను అమెరికా ఎలా మలచింది ? ” అనే శీర్షికతో అమెరికాలోని పబ్లిక్‌ ఎఫైర్స్‌ జర్నల్‌ ఏప్రిల్‌ 2025 సంచికలో వెల్లడించారు. దాని రచయిత జిందాల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌లో పని చేస్తున్న డాక్టర్‌ లక్ష్మణ కుమార్‌. ది హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికతో ఆయన సంభాషించిన అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. సోషలిస్టు దేశాలపై అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ యూనియన్‌-చైనా మధ్య తలెత్తిన సైద్ధాంతిక వివాదాలను ఆసరా చేసుకొని టిబెట్‌ అంశాన్ని ముందుకు తెచ్చి భారత్‌-చైనా మధ్య వివాదాన్ని రగిలించేందుకు అమెరికా రూపొందించిన దీర్ఘకాలిక కుట్రకు రెండు దేశాలూ గురయ్యాయి. నాటి నుంచి నేటి వరకు తరువాత కాలంలో సాధారణ సంబంధాలు ఏర్పడినప్పటికీ పరస్పరం నమ్మకంలేకుండా గడుపుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా ఎత్తుగడ నిజానికి టిబెట్‌ తిరుగుబాటుదార్లకు ఏదో చేద్దామని కాదు, వారికి సాయపడే ముసుగులో భారత్‌-,చైౖనా మధ్య వైరం పెంచటమే అసలు లక్ష్యంగా రహస్య పత్రాల్లో వెల్లడైంది.

1962 అక్టోబరు 20న చైనా దాడి ప్రారంభించి నవంబరు 20న ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి అరుణాచల్‌ ప్రదేశ్‌లో తన ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి సేనలను ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు పరిమితమైంది. అవి తన ప్రాంతాలని అంతకు ముందునుంచి చెబుతున్నప్పటికీ చైనా వెనక్కు తగ్గింది. టిబెట్‌లో జరిగిన కుట్రల క్రమ సారాంశం ఇలా ఉంది.1956లో అక్కడ దలైలామా పలుకుబడిలో ఉన్న ప్రభుత్వ మద్దతుతో తిరుగుబాటుకు నాందిపలికారు. సిఐఏ దాన్ని అవకాశంగా తీసుకొని ముందే చెప్పుకున్నట్లు 1957 నుంచి 1961వరకు వారికి శిక్షణ, ఆయుధాలు,రేడియోలు, ఇతర పరికరాలను ఇచ్చింది.విమానాల ద్వారా 250టన్నుల మిలిటరీ సరఫరాలు చేసింది.నిఘావిమానాల ద్వారా సమాచారాన్ని అందచేసింది. చైనా మిలిటరీ తిరుగుబాటును అణచివేయటంతో 1959లో దలైలామాను టిబెట్‌ నుంచి తప్పించి అరుణాచల్‌ ప్రదేశ్‌ ద్వారా భారత్‌కు చేర్చారు.దీనికి నాటి నెహ్రూ సర్కార్‌ పూర్తి మద్దతు ఇచ్చింది, అధికారులను పంపి మరీ స్వాగత ఏర్పాట్లు చేసిందంటే అమెరికా సిఐఏతో సమన్వయం చేసుకోకుండా జరిగేది కాదు. అంతేనా మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చింది. దీన్ని రెచ్చగొట్టటం, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా పరిగణించింది.1961లో ఉత్తర నేపాల్లోని ముస్టాంగ్‌కు సిఐఏ తన కార్యకలాపాలను విస్తరించింది. దలైలామా పరారీ తరువాత అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా మిలిటరీ మన సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.చైనాను నిలువరించాలని ప్రధాని నెహ్రూ నాటి సోవియట్‌ నేతలను కోరారు. అయితే తాము తటస్థంగా ఉంటామనే సందేశాన్ని వార్తల ద్వారా సోవియట్‌ పంపింది. తరువాత దాని నేత కృశ్చెవ్‌ 1959 అక్టోబరు రెండున బీజింగ్‌ పర్యటనలో నెహ్రూ మంచివాడని, భారత్‌తో వైరం వద్దని మావోకు సూచించటంతో ఈ వైఖరి చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుంటామని అది పెద్ద సమస్య కాదని, అసలు అంశం టిబెట్‌ అని ఈ విషయంలో భారత్‌తో రాజీపడేది లేదని మావో చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దాని పర్యవసానాలు మనదేశంలో కూడా ప్రతిబింబించాయి. అవిభక్త కమ్యూనిస్టు పార్టీలోని ఒక వర్గం సోవియట్‌ వైఖరికి అనుగుణంగా నెహ్రూ అనుకూల, చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంది.దానికి భిన్నంగా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే వైఖరిని మరో వర్గం తీసుకుంది. అందుకు వారిని జైలుపాలు చేశారు. తరువాత వారే సిపిఐ(ఎం)గా ఏర్పడ్డారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు సిపిఐ(ఎం) వైఖరే సరైనదని రుజువు చేశాయి.సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, బిజెపి ఎవరు అధికారంలో ఉన్నా వాటి మీద ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉంటూనే చైనాతో సంబంధాలను కొనసాగించారు. ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీ అయి నరేంద్రమోడీ ఒక రికార్డు సృష్టించారు.చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులలో మోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు.

అసలు రెండు దేశాల మధ్య యుద్దానికి దారితీసిన పరిస్థితి ఏమిటి ? తెరవెనుక అమెరికా సృష్టించిన టిబెట్‌ చిచ్చుకాగా బయటికి సరిహద్దు వివాదంగా ముందుకు వచ్చింది.1954లో చైనా-భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అయితే అప్పటికే అమెరికా కుట్ర మొదలైంది. దాన్లో భాగంగా బుద్ద జయంతిని జరుపుకొనే పేరుతో 14వ దలైలామా భారత్‌ వచ్చాడు. ఆ సందర్భంగా అంగీకరిస్తే భారత్‌లో ఆశ్రయం పొందుతానని చేసిన వినతిని నెహ్రూ తిరస్కరించారు. కానీ అదే నెహ్రూ సిఐఏ పధకం ప్రకారం టిబెట్‌ నుంచి పారిపోయి 1959 ఏప్రిల్‌ 18న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ చేరుకున్న దలైలామాకు మానవతాపూర్వక కారణాల సాకుతో ఆశ్రయం ఇవ్వటమేగాక ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకూ అనుమతించించారు. వేలాది మంది టిబెట్‌ నుంచి వచ్చిన వారికీ ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. కాలనీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.సరిహద్దులో మన ప్రభుత్వం 1961 కొన్ని పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతం తమ అదుపులోనే ఉందని ఉద్ఘాటించింది. అప్పటికే దలైలామా ప్రవాస ప్రభుత్వం చైనా వ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తోంది.దీనికి తోడు సరిహద్దుల్లో కొత్తగా పోస్టులను ఏర్పాటు చేయటాన్ని అవకాశంగా తీసుకొని చైనా వాటిని తొలగించేందుకు పూనుకోవటం, మన మిలిటరీ ప్రతిఘటించటంతో అది తరువాత నెల రోజుల యుద్ధంగా మారింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ మహిళ ప్రేమా వాంగ్‌జోమ్‌ థోంగ్‌డాక్‌ దగ్గర ఉన్న పాస్‌పోర్టు చెల్లదంటూ షాంఘై పుడోంగ్‌ విమానాశ్రయ అధికారులు కొన్ని గంటల పాటు నిలిపివేశారంటూ వచ్చిన వార్తలకు మన మీడియా పెద్ద ఎత్తున ప్రచారమిచ్చిన సంగతి తెలిసిందే.మనదేశం, చైనాల మధ్య సరిహద్దులంటూ మాపులపై బ్రిటీష్‌ అధికారులు గీచిన రేఖలు రెండు దేశాల మధ్య వివాదాన్ని సృష్టించాయి. వివిధ సందర్భాలలో ప్రచురించిన మాప్‌ల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ చైనాకు చెందినది, చైనా ఆధీనంలో ఉన్న లడఖ్‌ సమీపంలోని ఆక్సారుచిన్‌ ప్రాంతం మనదిగా చూపాయి. అందువలన రెండుదేశాలూ అవి తమ ప్రాంతాలని మాపుల్లో చూపుతున్నాయి. అరుణాచల్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతమైన జాంగ్‌నాన్‌ అని చెబుతుండగా ఆక్సారు చిన్‌ మా లే (లడఖ్‌) జిల్లాలో భాగమని అంటున్నాము. దలైలామా 2023లో తవాంగ్‌ పర్యటన చేస్తామని ప్రకటించగా అనుమతించకూడదంటూ నాడు చైనా అభ్యంతరం చెప్పింది.అంతకు ముందు కూడా అభ్యంతరాల మధ్య పర్యటించినా చివరిసారిగా గాల్వన్‌ ఉదంతాల తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌-భారత్‌ పేరుతో ఉన్న పాస్‌పోర్టు, వీసాలను చైనా తిరస్కరించటం ఇదే మొదటిసారి కాదు. పాస్‌పోర్టు మీద స్టాంప్‌ వేయటానికి నిరాకరించి ఒక తెల్లకాగితం మీద అనుమతి పత్రాన్ని జారీ చేస్తామని చైనా చెప్పింది. దానికి నిరాకరించిన మనదేశం చైనాలో జరిగిన ఆసియా క్రీడలకు మన క్రీడాకారులను పంపలేదు. తాజాగా ప్రేమ అనే మహిళ విషయంలో కూడా అదే జరిగింది, మీరు భారతీయురాలు కాదు, చైనీస్‌ అందువలన వీసా కోసం దరఖాస్తు చేసుకోండి అని చైనా అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

చిత్రం ఏమిటంటే మన దేశంలో ఆశ్రయం పొంది,ప్రవాస టిబెట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1959 నుంచి అన్ని సౌకరాలను అనుభవిస్తున్న 14వ దలైలామా 2003లో మాట్లాడుతూ అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగం అన్నాడు తప్ప మనదేశంలో భాగం అని గుర్తించలేదు. అయినప్పటికీ అతగాడికి సౌకర్యాలు కల్పించటం రాజకీయం తప్ప వేరు కాదు. మనదేశం తెచ్చిన వత్తిడి, విధిలేని పరిస్థితిలో 2008లో తన వైఖరిని మార్చుకున్నాడు. 1914లో బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖను భారత్‌-టిబెట్‌ సరిహద్దుగా నిర్ణయిస్తూ బ్రిటీష్‌ ఇండియా పాలకులు టిబెట్‌ పాలకులతో సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు.బ్రిటీష్‌ వారి పాలనకు చరమగీతం పాడారు, దాంతో ఉక్రోషం పట్టలేని బ్రిటన్‌ కుట్రకు తెరలేపింది. అప్పుడే స్వాతంత్య్రం పొందిన చైనాకు టిబెట్‌ మీద హక్కులేదని చెప్పేందుకు బ్రిటీష్‌ పాలకులు పన్నిన కుట్రలో భాగం సిమ్లా ఒప్పందమంటూ నాటి, నేటి చైనా ప్రభుత్వం అంగీకరించలేదు. టిబెట్‌ తమ సామంత దేశమని అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకొనేందుకు దాని పాలకులకు హక్కు లేదు, చెల్లదని చైనా చెబుతున్నది. ఉదాహరణకు, బ్రిటీష్‌ పాలనలో సామంత రాజ్యాలుగా ఉన్న కాశ్మీరు, నిజాం సంస్థానాలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటాన్ని నాడు మన కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ పూర్వరంగంలో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటం తప్ప దగ్గరదారి లేదు. అప్పటి వరకు యథాతధ స్థితి కొనసాగించాల్సి ఉంది. రెండు దేశాలూ ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలకు ఢోకా ఉండదు. వివాదాన్ని కాలమే పరిష్కరించాల్సి ఉంది. యుద్ధాల ద్వారా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటం కుదిరే అంశం కాదు. ఆక్రమిత కాశ్మీరుపై మనకు తిరుగులేని హక్కు ఉంది, ఎలాంటి వివాదం లేకున్నా బలప్రయోగంతో స్వాధీనం చేసుకొనేందుకు పూనుకోలేదు. చైనా గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా బడా పత్రికలు అనేక తప్పుడు వార్తలు ఇచ్చాయి. మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు లేదా అధికారంలో లేని సంస్థలు, వ్యక్తులు చేసే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే అంశాలకు రెండు దేశాలకు చెందిన పౌరులు భావోద్వేగాలకు గురైతే బుర్రలు ఖరాబు చేసుకోవటం తప్ప జరిగేదేమీ ఉండదు. వివాదాలు పభుత్వాలు తేల్చాల్సిన, తేల్చుకోవాల్సిన అంశాలని గ్రహించాలి !

చైనాకు భారత ఎగుమతులు పెరిగాయా ! జనాలకు గోడీ మీడియా చెబుతున్న నిజానిజాలేమిటి !!

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

చైనాకు ఏడు నెలల్లో 25శాతం పెరిగిన భారత ఎగుమతులు. మీడియాలో కొద్ది రోజుల క్రితం వచ్చిన శీర్షిక ఇది. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు వరుసగా ఏడు నెలల నుంచీ పెరుగుతూనే ఉన్నాయి.మంచిదే, మన ఎగుమతులు ఏమాత్రం పెరిగినా సంతోషించాల్సిందే. అయితే అసలు కథేమిటంటే నరేంద్రమోడీకి భజన చేసేందుకు అలవాటు పడిన వారు చేసిన జిమ్మిక్కు లేదా తిమ్మిని బమ్మిని ఇది. నిజంగా జరిగిందేమిటి ? గతేడాదితో పోలిస్తే ఎగుమతులు పెరిగిన మాట నిజం. ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు అంతకంటే ఎక్కువగా పెరిగిన సంగతి, పదేండ్ల స్థాయికి ఎగుమతులు పడిపోయిన నిజాన్ని జనాలకు చెప్పరేం ! నరేంద్రమోడీ ఏలుబడి పదకొండు సంవత్సరాలను మూడు భాగాలుగా విభజిద్దాం. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో చైనాకు మన ఎగుమతులు 11.96 నుంచి 16.75 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. తరువాత మూడు సంవత్సరాలలో 21.56 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అప్పటి నుంచి 2024-25లో 14.25 బిలియన్‌ డాలర్లకు పతనమయ్యాయి. గత ఏడాది తొలి ఏడు నెలలతో పోల్చి చూపి వర్తమాన సంవత్సరంలో 10.03 బిలియన్‌ డాలర్లకు 25శాతం పెరిగినట్లు చిత్రించారు. మిగిలిన ఐదు నెలల కాలంలో గత ఏడాది మొత్తాలకు చేరవచ్చు, స్వల్పంగా పెరగవచ్చు తప్ప గతంలోని 21.56 బిలియన్‌ డాలర్లకు చేరే స్థితి ఉందా ? చైనాకు మన ఎగుమతులు పెరగటం వెనుక అంతర్జాతీయ రాజకీయాలు కూడా లేకపోలేదు. అమెరికా వైపు మొగ్గుచూపుతున్న నరేంద్రమోడీకి పన్నుల రూపంలో ట్రంప్‌ తీసుకున్న వైఖరి మింగుడు పడలేదు.ఈ స్థితిలో ఎత్తుగడగా అవసరం ఉన్నా లేకున్నా చైనా ఏప్రిల్‌ నుంచి మన దేశం నుంచి దిగుమతులను పెంచింది, దీని కొనసాగింపు రానున్న రోజుల్లో మనదేశం అనుసరించే వైఖరిని బట్టి ఉంటుంది.చైనాకు మన మార్కెట్‌ను ఎంతగా తెరిస్తే దానికి ప్రతిగా మనకూ మేలు చేకూరే విధంగా బీజింగ్‌ వ్యవహరిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. చైనా పెట్టుబడులను స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. మన దేశం నుంచి విమానాలను నడిపేందుకు రెండు చైనా కంపెనీలు దరఖాస్తు చేసినట్లు తాజా వార్తలు వెల్లడించాయి.

చైనా మీద ఆధారపడకూడదు, దాన్ని పక్కకు నెట్టేసి అసలు మనమే ప్రపంచానికి వస్తువులను ఎగుమతులు చేద్దాం అంటూ పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అలాంటి సూచనలు లేవు.తొలి ఏడు నెలల్లో ఎగుమతులు పెరిగాయని చెప్పిన వారు అదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 57.65 నుంచి 64బిలియన్‌ డాలర్లకు పెరిగాయని చెబితే నిజాయితీగా ఉంటుంది. గత సంవత్సరం చైనాతో మన వాణిజ్య లోటు 99.12 బిలియన్‌ డాలర్లు. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ సర్కార్‌ అసమర్ధతకు బీజింగ్‌కు మనం చెల్లించిన మూల్యం.ఇంకా చెప్పాలంటే గత పదకొండు సంవత్సరాల్లో 701.95 బిలియన్‌ డాలర్లు సమర్పించుకున్నాం. మోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది మన వాణిజ్య లోటు 48.45 బిలియన్‌ డాలర్లు కాగా పదకొండేండ్లలో రెట్టింపై 99.21 బి.డాలర్లకు చేరింది, ఎందుకని ? గత ఐదు సంవత్సరాల్లో చైనాకు మన ఎగుమతులు 33శాతం పడిపోగా దిగుమతులు 74శాతం పెరిగాయి. ఆత్మనిర్భరత ఏమైనట్లు, ప్రపంచంలో పెరిగినట్లు చెబుతున్న మోడీ పలుకుబడి సంగతేమిటి ? కాంగ్రెస్‌ యాభై ఏండ్లలోచేయలేని వాటిని తాను తొలి ఐదేండ్లలోనే చేసినట్లు గతంలో చెప్పుకున్నారు. సంతోషం. వర్తమాన అవసరాలకు అనుగుణంగా వస్తూత్పత్తిని ఎందుకు చేయలేకపోయినట్లు ? రెండింజన్ల పాలనే కదా ఉన్నది. యాపిల్‌ ఐఫోన్లను తయారు చేస్తున్నాం, ఎగుమతి చేస్తున్నాం చూడండహౌ అంటూ ప్రచారం చేస్తున్నారు. మిగతా ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంగతేమిటి ? గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(జిటిఆర్‌ఐ-ఇండియా) చెప్పినదాని ప్రకారం కీలకమైన ఎనిమిది పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో చైనా ప్రధాన సరఫరాదారుగా ఉంది. చైనా నుంచి దిగుమతుల వలన రెండు రకాల నష్టాలు, ఒకటి స్థానిక మన పరిశ్రమలు గిడసబారిపోతున్నాయి, కార్మికులకు ఉపాధి దొరకటం లేదు.విలువైన విదేశీమారక ద్రవ్యాన్ని చైనాకు సమర్పించుకుంటున్నట్లు ముందే చెప్పుకున్నాం. గత కాంగ్రెస్‌ పాలనకూ మోడీ ఏలుబడికి తేడా ఏమిటి ? చైనా నుంచి దిగుమతుల్లో మన్మోహన్‌ సింగ్‌ రికార్డులనే కాదు, తన రికార్డులను కూడా తానే మోడీ బద్దలు కొట్టుకున్నారు. చైనాతో తిరిగి సత్సంబంధాలను నెలకొల్పుకొనటం మంచిదే. కానీ అనేక వస్తువుల దిగుమతులపై ఆంక్షలను సడలించిన కారణంగా గత రికార్డులను అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి గత పదినెలలుగా చెబుతూనే ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేతతో సహా అన్నీ డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్నట్లే జరుగుతున్నందున అనేక అనుమానాలు. ఇంతవరకు ఏం జరుగుతోందో జనానికి తెలియదు. ట్రంప్‌ చెబితే తప్ప మనకు తెలిసేట్లు లేదు, మన మార్కెట్‌ను వారి వస్తువులకు బార్లా తెరవాలని అమెరికా వత్తిడి తెస్తోంది. అదే జరిగితే స్థానిక పరిశ్రమలు, వాణిజ్యాలను మూసుకోవాల్సిందే అని మన కార్పొరేట్లు హెచ్చరిస్తున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఏడునెలల్లో మన ఎగుమతులు ఎక్కువగా అమెరికాకు జరిగితే దిగుమతులు చైనా నుంచి జరిగాయి. ఇదేం కుదరదు అన్నీ మానుంచే దిగుమతి చేసుకోవాలని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. అసలు సంగతేమిటంటే చైనా నుంచి తక్కువ ధరలకు వస్తున్నాయి గనుక దిగుమతి చేసుకుంటున్నాం తప్ప షీ జింపింగ్‌ మీద ప్రేమతో కాదు. అమెరికాకు చోటిస్తే ఎడారి వ్యాపారి, ఒంటె కథ మాదిరి దేశీయ సంస్థలను బయటకు నెట్టేయటం లేదా మింగివేస్తుంది. అందుకనే రెండు దేశాలతో సమన్వయం చేసుకోవటం మోడీకి కత్తిమీద సాములా ఉంది. రానున్న రోజుల్లో మనకు మేలు జరిగే విధంగా విదేశాంగ విధానం ఉండాలని ఇప్పటికే కార్పొరేట్ల లాబీ మాట్లాడుతోంది. కరవమంటే కప్పకు విడవమంటే పాముకు కోపం ! మన దేశ వస్తు ఎగుమతులను చూస్తే 2024లో 434.44 బిలియన్‌ డాలర్లు కాగా దిగుమతులు 698-702 బి. డాలర్ల మధ్య ఉన్నాయి. నిఖర వాణిజ్యలోటు 263.31బిలియన్‌ డాలర్లు. ఎగుమతుల్లో అమెరికా 18.3, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 8.5, నెదర్లాండ్స్‌ 5.6, సింగపూర్‌ 3.6, చైనా 3.4,బ్రిటన్‌ 3.2, సౌదీ అరేబియా 2.8, బంగ్లాదేశ్‌ 2.6, జర్మనీ 2.4, ఇటలీ 1.92శాతాల చొప్పున ఉన్నాయి. 2024 జనవరి నుంచి జూన్‌ వరకు వివరాలు చూస్తే మన దేశం 151దేశాలతో వాణిజ్య మిగులు, 75దేశాలతో తరుగులో ఉంది. మోడీ భక్తులు చూశారా మానేత పలుకుబడి అని డబ్బా కొట్టుకోవటానికి ఈ అంకెలు తప్ప వాస్తవ పరిస్థితి ఏమిటోపైన చెప్పుకున్నాం. అమెరికాను వదులుకొనేందుకు భయపడటానికి, డోనాల్డ్‌ ట్రంప్‌ ఎంతగా అవమానించినా మౌనంగా ఉండటానికి అక్కడికి మన ఎగుమతులు ఎక్కువగా ఉండటమే.మరోవైపు ఐదేండ్లపాటు చైనాతో వైరంతో గడిపిన తరువాత సాధారణ సంబంధాలు ఏర్పరుచుకోవటానికి కారణం దాని మీద ఆధారపడాల్సి రావటమే. పదకొండు సంవత్సరాల్లో పరాధీనతను తగ్గించటానికి మోడీ చేసిందేమీ లేదు. అందుకే రాజీపడ్డాం. మన దిగుమతులను చూస్తే 2024లో చైనా నుంచి 15.5,రష్యా 9.1, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 8.6, అమెరికా 6.1, సౌదీ అరేబియా 4.3, ఇరాక్‌ 4.2, ఇండోనేషియా 3.4,స్విడ్జర్లాండ్‌ 3.1,దక్షిణ కొరియా 3, సింగపూర్‌ 2.9శాతం చొప్పున ఉన్నాయి. గాల్వన్‌ లోయ ఉదంతాల సమయంలో కాషాయ దళాలు చైనా నుంచి దిగుమతుల నిలిపివేస్తే డ్రాగన్‌ మన కాళ్ల దగ్గరకు వస్తుందంటూ ఊగిపోయారు.నిజానికి మనకు అంత సీన్‌ లేదు, 2024లో చైనా నుంచి దిగుమతులు చేసుకున్న మొదటి పది దేశాలలో మనం కేవలం 3.4శాతంతో ఆరవ స్థానంలో ఉన్నాం.

మన ఎగుమతులు, దిగుమతులు రెండు రకాలు. ఒకటి వస్తువులు, రెండవది సేవలు. వస్తు లావాదేవీల్లో 2014-15లో లోటు 137 బిలియన్‌ డాలర్ల నుంచి 2024-25 నాటికి 283బి.డాలర్లకు పెరిగింది. సేవల విషయంలో ఇదే కాలంలో మిగులు 74 నుంచి 189 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. రెండింటినీ కలిపి చూసినపుడు నిఖర లోటు 63 నుంచి 94 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.ప్రపంచంలో 2024లో మొత్తం 24.5లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తు ఎగుమతులు జరగ్గా ఎగువన ఉన్న 30దేశాల వాటా 20.3లక్షల కోట్ల డాలర్లు.మొదటి స్థానంలో ఉన్న చైనా వాటా 14.6 శాతం కలిగి మొదటి స్థానంలో ఉండగా పద్దెనిమిదవదిగా మనదేశ వాటా కేవలం 1.8శాతమే, రష్యా, స్విడ్జర్లాండ్‌ కూడా ఇదే వాటాను కలిగి ఉన్నాయి. చైనాను వెనక్కు నెట్టేయాలన్న సంకల్పాన్ని ఎవరూ కాదనరు, పోటీ పడాల్సిందే. కానీ ఒక్కసారిగా ఈ పరిస్థితి మారాలన్నా, 2047 నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోవాలన్నా నరేంద్రమోడీ అల్లావుద్దీన్‌ అద్భుత దీపాన్ని సంపాదించాల్సిందే. అల్లావుద్దీన్‌ ముస్లిం మేం బరాబర్‌ హిందువులం పొడగిట్టదు అని అంటారా, మనోభావాలను ముందుకు తెస్తే మన వేదాల్లో ఉన్నవాటిని వెలికి తీయాలి మరి, దగ్గరిదారి లేదు, చేస్తారా !

అమెరికాకు చెంపపెట్టు – 2025 జి20 సభ !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

అమెరికా జి20 సదస్సును బహిష్కరించటమంటే ప్రపంచ ఆర్థిక ఆకర్షణ శక్తి వేరేవైపు మరలుతున్నదనేందుకు సూచిక అని కెనడా ప్రధాని మార్క్‌ కార్నే చెప్పాడు. ప్రపంచ రాజకీయాలలో కెనడా అమెరికా అనుయాయిగా ఉంటున్నది, కొన్ని సందర్భాలలో విబేధిస్తున్నది. నవంబరు 22,23వ తేదీలలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2025 సంవత్సర జి20 శిఖరాగ్ర సమావేశంలో కార్నే చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్య చేశాడు. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే అమెరికా కోడి కూయనంత మాత్రాన తెల్లవారకుండా ఉండదన్నాడు..” సంఘీభావం, సమానత్వం, సుస్థిరత ” అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. ఐరాస నిర్దేశించిన 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇంకా కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే వ్యవధి ఉన్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. ఈ సదస్సును డోనాల్డ్‌ ట్రంప్‌ బహిష్కరించటమేగాక సమావేశ ప్రకటనను ఆమోదించవద్దంటూ ముందే అధ్యక్ష స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను బెదిరించాడు. వచ్చే ఏడాది జరిగే సదస్సుకు ఆతిధ్యం ఇచ్చే సభ్యదేశంగా, అధ్యక్ష స్థానాన్ని స్వీకరించాల్సి ఉండి కూడా ఒక చిన్న అధికారిని పరిశీలకుడిగా పంపాడు. బాధ్యతలను స్వీకరించే సాంప్రదాయ కార్యక్రమానికి కూడా రాకుండా దక్షిణాఫ్రికాను అవమానించాడు. ఈ ఏడాది మే నెలలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసాను అమెరికా అధ్యక్ష భవనంలో మీడియా ముందే ట్రంప్‌ అవమానించాడు. తెల్లజాతీయుల ఆధీనంలోని భూములను స్వాధీనం చేసుకుంటున్న ఆఫ్రికన్ల వీడియోను చూపి ఇది శ్వేతజాతీయుల మారణకాండ అంటూ ట్రంప్‌ రచ్చ చేశాడు. అప్పటి నుంచి కక్షకట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. వారి విధానాలు తనకు నచ్చటం లేదని అందువలన అక్కడ జరిగే జి20సమావేశాలకు వెళ్లటం లేదని జూలైలోనే ప్రకటించాడు. దక్షిణాఫ్రికా వస్తువులపై గరిష్టంగా 30శాతం పన్నులను విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దౌత్యమర్యాదలను తుంగలో తొక్కిన డోనాల్డ్‌ ట్రంప్‌ చర్య పర్యవసానాల గురించి అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఒక సభ్యదేశమై ఉండి నిజంగా ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటే సరైన స్ధాయి ఉన్న ఎవరినైనా పంపవచ్చు, ఇది అధినేతల సమావేశం, సరైన స్థాయి అంటే తన ప్రతినిధిగా ప్రత్యేకంగా ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానులు పంపవచ్చు గాని అమెరికా చేసింది ఏమాత్రం సమర్ధనీయం కాదని దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్‌ లామోలా విమర్శించాడు. శతాబ్దాల తరబడి మైనారిటీ శ్వేతజాతీయులు దక్షిణాఫ్రికాలో సాగించిన జాత్యహంకార పాలన, ఆఫ్రికన్ల అణచివేత, బంటూస్థాన్‌(మన దళితవాడల వంటివి)లకే వారిని పరిమితం చేయటం వంటి దుర్మార్గం గురించి తెలిసిందే.1994లో ఆ పాలన అంతమైన తరువాత ఇన్నేండ్లకు అక్కడి శ్వేతజాతి రైతులను ప్రభుత్వం అణచివేస్తున్నదంటూ ట్రంప్‌ ఈ సమావేశాలను బహిష్కరించటం ఒక సాకు తప్ప మరొకటి కాదు.శ్వేత జాతీయుల మారణకాండ అని కూడా వర్ణించాడు. బహిష్కరించటమేగాక అమెరికా ఎదురుదాడికి దిగింది. అధ్యక్ష భవనపు మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా తమ దేశ అధ్యక్షుడిపై నోరుపారవేసుకుంటున్నట్లు ఆరోపించింది.వాతావరణ మార్పు, ప్రపంచ సంపద అసమానతల వంటివాటిపై దక్షిణాఫ్రికా కేంద్రీకరించి సదస్సు ప్రకటనలో వాటిని ప్రస్తావించటాన్ని అమెరికా తట్టుకోలేకపోయినట్లు వార్తలు వచ్చాయి.తాము సమావేశాన్ని బహిష్కరించటమేగాక సదస్సు ప్రకటన వెలువడకుండా అడ్డుకుంటామని అమెరికా బెదిరించింది.తమ అంగీకారం లేకుండా ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించింది. అమెరికా వైఖరిని ఒక్క అర్జెంటీనా తప్ప ఐరోపా, ఇతర ఖండాల దేశాలేవీ ఆమోదించలేదు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలి డోనాల్డ్‌ ట్రంప్‌ అనుయాయి, అతగాడు కూడా ప్రకటనను వ్యతిరేకించి సదస్సును బహిష్కరించాడు. దక్షిణాఫ్రికా అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని, అక్రమవాణిజ్య పద్దతులను అనుసరిస్తున్నదని పాలస్తీనా మీద గట్టి వైఖరి తీసుకోవటమే గాక చైనా, రష్యాలతో కలుస్తున్నదని కూడా అమెరికా దాడి చేస్తున్నది. ఆర్థిక అసమానతల గురించి తక్షణమే చర్చించాల్సిన అవసరం ఉందని ప్రపంచ నేతలు గుర్తించిన తొలి సమావేశం ఇదని ఆక్స్‌ఫాం సంస్థ ప్రతినిధి మాక్స్‌ లాసన్‌ వ్యాఖ్యానించాడు.

ప్రపంచంలో అనేక కూటములు ఉన్నాయి. అవి సమావేశాలు జరపటం, సంకల్పాలు చెప్పుకోవటం, తీర్మానాలు ఆమోదించటం తప్ప సభ్య దేశాలకు వాటిని పాటించాల్సిన విధి లేదు. అలాంటి వాటిలో ఒకటి జి20. దీనిలో అర్జెంటీనా,ఆస్ట్రేలియ,బ్రెజిల్‌, కెనడా, చైనా,ఫ్రాన్సు, జర్మనీ, భారత్‌, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్‌, అమెరికా దేశాలతో పాటు ఐరోపా యూనియన్‌, ఆఫ్రికా యూనియన్‌ సభ్యులుగా ఉన్నాయి. ఆహ్వానితులుగా నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, ఐరాస, ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ కూటమి ఉంది. ఆఫ్రికా ఖండం నుంచి దక్షిణాఫ్రికా ఒక్కటే ఈ కూటమిలో ఉంది. తొలిసారిగా ఆఫ్రికా గడ్డమీద సదస్సు జరిగింది. జి20లోని సభ్య దేశాలు (ఐరోపా, ఆఫ్రికా యూనియన్లు మినహా) ప్రపంచ జిడిపిలో 85,అంతర్జాతీయ వాణిజ్యంలో 75, జనాభాలో 56, భూమిలో 60శాతం కలిగి ఉన్నాయి. అందువలన పరోక్షంగా ఈ దేశాల మీద ప్రభావం చూపేందుకు పెద్ద దేశాలన్నీ ప్రయత్నిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. జోహన్నెస్‌ సభకు మన ప్రధాని నరేంద్రమోడీ హాజరై అన్ని ముఖ్య సమావేశాల్లో పాల్గ్గొన్నారు. పలుదేశాల నేతలతో జరిపిన చర్చలు ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. చైనా ప్రతినిధిగా ఆ దేశ ప్రధాని లీ క్వియాంగ్‌ పాల్గొన్నాడు.

జి7 ధనిక దేశాలే కాలక్షేపపు కబుర్లకు పరిమితం అవుతున్నపుడు భిన్న ధృవాలుగా ఉన్న జి20 అంతకు మించి ఫలవంతమైన చర్చల వేదికగా మారుతుందన్న భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థిక అంశాల కంటే రాజకీయ పరమైనవాటికే జోహన్నెస్‌బర్గ్‌ సమావేశాల వేదిక నాంది పలికింది. సదస్సు తీర్మానం గురించి సంతకాలు చేయవద్దని ట్రంప్‌ చేసిన విన్నపాల రూపంలో ఉన్న ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయలేదు. ఇది దక్షిణాఫ్రికా విజయాల్లో ఒకటి. ముప్పై పేజీలు, 122 పేరాల అంతిమ ప్రకటనలో అనేక అంశాలు ఉన్నాయి. అది సాధారణ ప్రకటనగానే చూసే వారికి అనిపిస్తుంది, నిజం కూడా. అసమానతలు, రుణభారం, కీలకమైన ఖనిజాలు, ఇంథనం, సమానత్వం, నిరంతర అభివృద్ధి, పర్యావరణం ఇలా లేని అంశం లేదు. ముందే చెప్పుకున్నట్లు వాటిని అమలు జరపాల్సిన విధి సభ్యదేశాలకు లేదు గానీ వాటిని విస్మరిస్తే కుదరదు అనే సందేశాన్ని ఈ సమావేశం ఇచ్చింది.అసమానతల గురించి సదస్సు ఆమోదించిన పత్రంలో అరవై కోట్ల మంది ఆఫ్రికన్లకు విద్యుత్‌ అందుబాటులో లేదని పేర్కొన్నారు.2030 నాటికి పునరుత్పత్తి ఇంథనాన్ని మూడు రెట్లు, ఇంథన సామర్ధ్యాన్ని రెండు రెట్లు పెంచాలని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాలకు సంబంధించిన అభివృద్ధి రుణాలు, రుణ భారం తదితర అంశాల గురించి పరస్పరం సమాచార మార్పిడి,రుణాలు ఇచ్చే దేశాలు, సంస్థల పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశాలను పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ నియామకం ఈ సందర్భంగా జరిగింది. ఆఫ్రికాలో అభివృద్ధికి దక్షిణాఫ్రికా చొరవ, కృషికి ఒక గుర్తింపు దక్కింది. రెండు రోజుల పాటు 130 వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాలను సమర్ధవంతంగా నిర్వహించటంలో అక్కడి ప్రభుత్వ సామర్ధ్యం వెల్లడైంది.

జోహన్నెస్‌బర్గ్‌ సమావేశానికి ట్రంప్‌ గైరుహాజరు కావటంతో నాయకత్వ స్థానంలోకి వచ్చేందుకు చైనాకు అవకాశం వచ్చిందంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అమెరికా పలుకుబడి కోల్పోతున్నదనే ఉక్రోషం దీనిలో ఎక్కువగా కనిపిస్తున్నది.అమెరికా ఏకపక్ష వైఖరి, పెత్తందారీతనం కారణంగా అనేక ఆఫ్రికా దేశాలు ఇప్పటికే చైనా వైపు చూస్తున్నాయి. ట్రంప్‌ తాజా వైఖరులతో అది వేగం పుంజుకొనే అవకాశాలు ఉన్నాయి. ప్రభావం పెంచుకొనేందుకు అమెరికాయే చైనాకు అవకాశం ఇస్తున్నదని దానితో పాటు ఐరోపా సమాఖ్య కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చని బక్‌నెల్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఝీక్విన్‌ ఝ చెప్పాడు. అమెరికా బహిష్కరించిన వెంటనే దాని స్థానంలో చైనా చేరే అవకాశం ఉండదని అయితే మరింత నమ్మకమైన భాగస్వామిగా తనను తాను ప్రదర్శించుకొనేందుకు దోహదం చేస్తుందని బ్రిటన్‌ ఆర్థికవేత్త జింగ్‌ గు చెప్పారు.అంతర్జాతీయ సంస్థలు, పశ్చిమ దేశాలు విధించే కఠినమైన షరతులు లేకుండా ఇప్పటికే అనేక దేశాల్లో వివిధ ప్రాజక్టులకు చైనా సాయం చేసింది. ఆఫ్రికా ఇంథన అవసరాలలో భాగంగా ఇటీవలి కాలంలో చైనా నుంచి 60శాతం సౌరపలకలను దిగుమతి చేసుకున్నారు. బహిష్కరణ రాజకీయాలు, బెదిరింపులు చెల్లవని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా అమెరికాను నేరుగానే హెచ్చరించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు జి20తో పాటు దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార సంస్థ(ఎపెక్‌), బ్రెజిల్లో జరిగిన ఐరాస వావావరణ మార్పు సమావేశాన్ని అమెరికా బహిష్కరించింది. ఇలాంటపుడు ఇతర దేశాలు చైనా వైపు చూడటం సహజం.అంతే కాదు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏకపక్షంగా విధించిన దిగుమతి సుంకాలు కూడా దేశాలను ఆలోచింపచేస్తున్నాయి. ఆఫ్రికాలోని 22 దేశాల దిగుమతులపై ఇప్పటి వరకు ఎలాంటి పన్నులు లేకపోగా ట్రంప్‌ ఇప్పుడు 15 నుంచి 30శాతం విధించాడు. తమతో దౌత్య సంబంధాలు కలిగిన అన్ని ఆఫ్రికా దేశాల సరకులపై ఎలాంటి పన్ను విధించబోమని ఎపెక్‌ సమావేశంలో చైనా నేత షీ జింపింగ్‌ ప్రకటించాడు. చైనా ప్రధాని లీ ఐరాస 80వ వార్షిక సమావేశాల్లో మాట్లాడుతూ వాతావరణ మార్పులను ఉమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపు ఇవ్వగా డోనాల్డ్‌ ట్రంప్‌ పునరుత్పత్తి ఇంథనం గురించి అపహాస్యంగా మాట్లాడాడు. వచ్చే ఏడాది డిసెంబరులో జి20 సమావేశాలు అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీలో జరగనున్నాయి. ఈ మేరకు డోనాల్డ్‌ట్రంప్‌ గతంలోనే ప్రకటించాడు. ఇరవై సంవత్సరాల చరిత్రలో అమెరికాలో జరగటం ఇదే తొలిసారి. జోహన్నెస్‌ సమావేశాల సందర్భంగా అమెరికా అనుసరించిన వైఖరి వచ్చే ఏడాది సమావేశాలపై ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ప్రపంచ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు దాన్ని బహిష్కరించినా ఆశ్చర్యం లేదు !

హిందూత్వ శక్తుల అడ్డగోలు వాదనలు – ముస్లింలే కదా అని మౌనంగా ఉంటే మహిళలు, బడుగులకూ ముప్పు !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ -కాశ్మీరు రాష్ట్రంలో మాతా విష్ణుదేవి పేరుతో కొత్తగా ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటయింది.నేషనల్‌ ఎలిజబులిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ ) ప్రతిభ ఆధారంగా ఆ రాష్ట్రంలోని వారికి సీట్లు కేటాయిస్తారు. ఇటీవలనే జమ్మూ ప్రాంతంలో ప్రారంభమైన ఆ కాలేజీలో 2025-26 సంవత్సరానికి తొలి బ్యాచ్‌ సీట్ల కేటాయింపు జరిగింది. యాభై సీట్లకు గాను 42 మంది ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు సీట్లు పొందారు. దాని అనుబంధ ఆసుపత్రిలో వైద్యులు కూడా ముస్లింలే ఎక్కువగా ఉన్నారట. ఇంకేముంది అక్కడి హిందూత్వ వాదులు గుండెలు బాదుకుంటూ సీట్ల కేటాయింపు విధానాన్ని తాము అంగీకరించటం లేదని, మార్చాల్సిందే అని ఆందోళనకు దిగారు. షరా మామూలుగా బిజెపి వారు కూడా వారితో చేరారు. వారి వాదన ఏమిటి ? సీట్ల కేటాయింపు మత సమతూకం ప్రకారం లేదట. ఆ కాలేజీ నిర్వహణ మాత వైష్ణదేవి ఆలయానికి చెందిన బోర్డుది గనుక హిందూ భక్తులు ఇచ్చిన నిధులతో ఏర్పాటు చేసినందున మెజారిటీ సీట్లు, సిబ్బంది హిందువులతోనే నింపాలని రభస చేస్తున్నారు. మత ప్రాతిపదికన సీట్లు కేటాయించాలంటున్నారు. చిత్రం ఏమిటంటే దేశంలోని ఇతర ప్రాంతాల్లో వీరు మరోవిధంగా రెచ్చగొడుతున్నారు. వెనుకబాటు తనం ఆధారంగా ముస్లింలను ఓబిసి, బిసి జాబితాలో చేర్చి విద్య,ఉపాధి రంగాలలో రిజర్వేషన్లను కల్పించాలంటే ఇదే హిందూత్వ శక్తులు బరాబర్‌ వ్యతిరేకిస్తూ మత ప్రాతికన రిజర్వేషన్లు ఉండకూడదని రచ్చ చేస్తున్నాయి. ఏ రోటి దగ్గర ఆ పాట పాడుతున్నారు. వీరికి రాజ్యాంగం, చట్టాలు, నిబంధనల పట్ల నిబద్దత లేదు, వారు చెప్పిందే అమలు జరగాలి. ఈ అడ్డగోలు వాదన ఒక్క మాత వైష్ణదేవి సంస్థకే, ముస్లింలకే పరిమితం అవుతుందా ? దేశంలో పన్నులు చెల్లిస్తున్నవారిని మత, కుల ప్రాతిపదికన లెక్కించి అన్నీ ఆ ప్రకారమే చేయాలని కూడా రోడ్లెక్కరన్న గ్యారంటీ ఏముంది ?

ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనారిటీ మతాలకు చెందిన వారు నిర్వహించే సంస్థలలో ఆ మతాలకు చెందినవారికే పెద్ద పీట వేస్తారని, అలాంటిది హిందువులు నిర్వహించే సంస్థలకు ఎందుకు వర్తించదని అమాయకత్వాన్ని నటిస్తున్నారు. మన రాజ్యాంగం మైనారిటీ సంస్థల నిర్వహణకు అలాంటి వెసులుబాటు కల్పించింది. వాటికీ నిబంధనలు ఉన్నాయి తప్ప అడ్డగోలు తనం కుదరదు. దేశంలో హిందువులు మైనారిటీలు కాదు.వైష్టదేవి ఆలయ బోర్డు తన విధానాలను మార్చుకొని మతానికే మాత్రమే పరిమితం కావాలని, హిందువులకు మాత్రమే సీట్లు, ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్లను కూడా కొందరు ముందుకు తెచ్చారు. మరికొందరైతే దేవాలయాలకు వెళ్లని వారిని ఆ కాలేజీలో పనిచేయనివ్వకూడదని కూడా డిమాండ్‌ చేశారు. వైద్యసేవలు అందించటానికి-దేవాలయాల సందర్శనకు అసలు సంబంధం ఏమిటి ? ఈ ఉన్మాదం అంతటితో ఆగుతుందా ? అడ్డబొట్లు, నిలువు బొట్ల వివాదాన్ని, చివరకు మనువాద చాతుర్వర్ణ వ్యవస్థను కూడా ముందుకు తీసుకువస్తుంది. మొగ్గగా ఉన్నపుడే మహిళలు, వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు ఈ ప్రమాదకర ధోరణుల గురించి ఆలోచించాలి. ముస్లింలే కదా మనకెందుకులే అనుకుంటే చివరికి ఈ తరగతుల వరకు వచ్చినపుడు అయ్యో అనేవారు ఉండరు. ఎందుకంటే చరిత్రలో మనువాద బాధితులు వీరే. హిందూత్వ శక్తుల ఆరాధ్య దైవం హిట్లర్‌ జర్మనీలో చేసింది అదే. ముందుగా కమ్యూనిస్టులను అణచివేస్తే, యూదులను ఊచకోత కోస్తే జనం పట్టించుకోలేదు, చివరికి తమదాకా వచ్చిన తరువాత ఎవరూ మిగల్లేదు.

మన రాజ్యాంగం దేశం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి మైనారిటీలను గుర్తించింది తప్ప రాష్ట్రాల్లో ఉన్న జనాభాను బట్టి కాదు. జమ్మూ కాశ్మీరులో మొత్తంగా చూసినపుడు మెజారిటీ ముస్లింలు, ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ చోట్ల మెజారిటీ క్రైస్తవులు. అలాంటి చోట్ల ఇప్పుడు ఉనికిలో ఉన్న మన రాజ్యాంగం ప్రకారం హిందువులను మైనారిటీలుగా గుర్తించే అవకాశం లేదు. అందుబాటులో ఉన్న తాజా జనాభా జనాభా లెక్కలు 2011 ప్రకారం దేశ జనాభాలో 14.2శాతం మంది ముస్లిం మతానికి చెందిన వారు ఉన్నారు. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ వంటి హిందూత్వ సంస్థలు కాశ్మీరులో డిమాండ్‌ చేస్తున్నట్లు మతప్రాతిపదికను తీసుకుంటే దేశమంతటా విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 14.2శాతం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి ఏమిటి ? ఉన్నత విద్య గురించి 2020-21 సంవత్సరానికి సంబంధించి జరిపిన అఖిలభారత సర్వే(ఎఐఎస్‌హెచ్‌ఇ) ప్రకారం 4.326 కోట్ల మంది ఉన్నత విద్యలో చేరినట్లు నమోదు కాగా వారిలో ముస్లింలు కేవలం 4.87శాతమే(21,08,033) ఉన్నారు. ఇది హిందూ వ్యతిరేకులో కమ్యూనిస్టులో జరిపిన సర్వే కాదు. అంటే జనాభాకు అనుగుణంగా వారి శాతం ఉండాలంటే ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించాల్సి ఉంది. మన రాజ్యాంగాన్ని రాసుకున్న సమయంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్న కారణంగానే మైనారిటీ విద్యా సంస్థలద్వారా వారి స్థాయిని పెంచేందుకు సాధారణ రిజర్వేషన్లకు భిన్నంగా వారికి ఎక్కువ అవకాశం కల్పించారు. అయితే వాటిని దుర్వినియోగం చేసి ఆ సంస్థలను కొంత మంది వ్యాపారంగా మార్చివేశారన్నది వేరే అంశం.ఈ సర్వే ప్రకారం కొన్ని వివరాలను చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూ-కాశ్మీరు జనాభాలో ముస్లింలు 68.8, హిందువులు 28.8శాతం ఉన్నారు. అన్ని రంగాలలో ఆ దామాషా ప్రతిబింబించాలి. కానీ సర్వే ప్రకారం అక్కడ నమోదైన విద్యార్ధుల్లో 34.5శాతమే ముస్లింలు ఉన్నారు. మరి జమ్మూలోని హిందూత్వ వాదులు, దేశంలో వారిని సమర్ధించేవారు దీనికి ఏం చెబుతారు ? లడఖ్‌ ప్రాంతంలో 25.8శాతం ముస్లింలు ఉన్నారు. రాష్ట్రాల వారీ ఉన్నత విద్యారంగంలో ముస్లింల శాతం దిగువ విధంగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభాకు అనుగుణంగా ఎక్కడా ప్రాతినిధ్యం లేదు. బ్రాకెట్లలోని అంకెలు 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లిం శాతాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2014లో విడిపోయిన కారణంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రస్తుత ముస్లిం జనాభా శాతం అంచనాలుగా గమనించాలి)

ఆంధ్రప్రదేశ్‌ × 2.92(9.56), అరుణాచల్‌ ప్రదేశ్‌××0.16(1.95), అసోం ××12.5(34.22),బీహార్‌ ×× 6.58(16.87),చండీఘర్‌ ×× 0.62(1.95), చత్తీస్‌ఘర్‌ ×× 0.78(2.02),జమ్ము-కాశ్మీర్‌ ×× 34.50(68.31)ఢిల్లీ ×× 2.47(12.86), గోవా ×× 4.72(8.33),గుజరాత్‌ ×× 2(9.67), హర్యానా×× 0.99(7.03),హిమచల్‌ ప్రదేశ్‌×× 0.41(2.18)ఝార్ఖండ్‌×× 4.34(14.53)కర్ణాటక×× 6.05(2.18)కేరళ ×× 14.36(26.56)మధ్య ప్రదేశ్‌ ×× 1.4 (6.57)మహారాష్ట్ర ×× 3.38(11.54)మణిపూర్‌×× 1.5(8.40)మేఘాలయ××.2(4.40)మిజోరామ్‌ ×× 0.28(1.35)నాగాలాండ్‌ ×× 0.49(2.47)ఒడిషా ×× 0.79(2.17)పుదుచ్చేరి ×× 3.45(6.05)పంజాబ్‌ ×× 2.32(1.93)రాజస్థాన్‌ ×× 1.73(9.07)సిక్కిం ×× 0.48(1.62)తమిళనాడు ××3.50(5.86)తెలంగాణా ×× 7.60(12.56)త్రిపుర ×× 2.98(8.60)ఉత్తర ప్రదేశ్‌ ×× 4.68(19.26)ఉత్తరాఖండ్‌ ×× 2.96(13.95)పశ్చిమబెంగాల్‌×× 12.33(27.01)

పైన పేర్కొన్న వివరాల ప్రకారం విద్యా సంస్థలలో చేరిన వారు రెండంకెలు దాటిన రాష్ట్రాలు జమ్ము-కాశ్మీరు, కేరళ, పశ్చిమబెంగాల్‌, అసోం మాత్రమే.వీటిలో జనాభా రీత్యా ముస్లింలు మెజారిటీగా ఒక్క జమ్ము-కాశ్మీరు, కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌ మాత్రమే ఉన్నాయి. గణనీయ సంఖ్యలో ఉన్న వాటిలో 34 నుంచి 16.87శాతం వరకు ఉన్న రాష్ట్రాలు అసోం, పశ్చిమబెంగాల్‌, కేరళ,ఉత్తర ప్రదేశ్‌,బీహార్‌, మైనారిటీలుగా 14.53 నుంచి 5.86 శాతం మధ్య ఉన్న రాష్ట్రాలు ఝార్కండ్‌,ఉత్తరాఖండ్‌, కర్ణాటక,ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌,తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌,రాజస్తాన్‌,త్రిపుర,మణిపూర్‌, గోవా, హర్యానా,మధ్య ప్రదేశ్‌, పుదుచ్చేరి, తమిళనాడు ఉండగా మిగిలిన రాష్ట్రాలు 4.87 శాతం కంటే తక్కువగా ఉండి పెద్దగా లేనివిగా ఉన్నాయి. ఈ లెక్కలను గమనించినపుడు ముస్లింలు ఉన్నత విద్యలో ఎంత వెనుకబడి ఉన్నదీ కనిపిస్తున్నది. ముస్లింలను సంతుష్టీకరించేందుకు కాంగ్రెస్‌ పాలనలో వారికి అంతా దోచిపెట్టారన్న ప్రచారాన్ని చూసినపుడు అదంతా తప్పుడు ప్రచారం తప్ప వాస్తవం కాదని తేలుతున్నది. ఓట్ల కోసం మెజారిటీ ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ఎత్తుగడలో ఇది భాగం తప్ప వేరు కాదు. జమ్మూలో ఒక మెడికల్‌ కాలేజీలో అత్యధికులు ముస్లిం విద్యార్ధులు ఉన్నందుకే అదీ ప్రతిభ ఆధారంగా పొందినందుకే అంతగా యాగీ చేస్తున్న పెద్దలు దేశమంతటా నెలకొన్న పరిస్థితి గురించి ఏమంటారు ? సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ కేవలం మాటలకేనా ? పోనీ హిందువులను వీరు ఉద్దరించారా ? ఏం చేశారో చెప్పమనండి !

విత్తనాల ముసాయిదా బిల్లు ఎవరికోసం?

Tags

, , , , ,

డాక్టర్ కొల్లా రాజమోహన్

దశాబ్దాల నాటి 1966 విత్తనాల చట్టాన్ని, సీడ్ కంట్రోల్ ఆర్డర్, 1983 బదులుగా 2025 విత్తనాల ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టబోయే ముందుఒక నెలలోపున ప్రజల అభిప్రాయం కోరుతూ ఈ ముసాయిదా బిల్లును ప్రకటించింది. డిసెంబర్ 11 లోగా సూచనలు సమర్పించాలని ప్రజలను కోరారు.

రైతులకు అధిక నాణ్యత గల మంచి విత్తనాల లభ్యతను పెంచడం మరియు నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాల అమ్మకాలను అరికట్టడం లక్ష్యాలుగా ముసాయిదా బిల్లు నిర్ధారిస్తున్నది. మార్కెట్లో విక్రయించబడే అన్ని విత్తన వెరైటీస్ కి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తున్నది.. రైతులు సంప్రదాయంగా వాడుకునే వెరైటీలు మినహాయిస్తానంటున్నది. దీనివలన విత్తనాలనాణ్యత, పనితీరు గురించి ప్రభుత్వమువద్ద అధికార సమాచారం ఉంటుందని అంటుంది.

ఎవరికోసం

జన్యుమార్పిడి విత్తనాలను , కొత్త హైబ్రిడ్ విత్తనాలనుకార్పొరేట్ కంపెనీల నుంచి తేలికగా దిగుమతి చేసుకోవడానికి చట్టాలను సవరిస్తున్నారు. జన్యుమార్పిడి విత్తనాలు, దిగుమతి చేసుకునే విత్తనాల సాగుకు  పురుగు మందులు, ఎరువులు, నీళ్ళు ఎక్కువ అవసరం. మనం కార్పొరేట్ కంపెనీ వ్యవసాయ ఉచ్చులో చిక్కుకుంటున్నాము. ఈ బిల్లు కార్పొరేటర్లకు అనుకూలంగా ఉన్నది. చిన్న రైతులను నాశనం చేసేటట్లు గా ఉంది . తరతరాలుగా జాగ్రత్తగా చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని పురాతన విత్తన రకాల వెరైటీస్ ని రక్షించుకోవడానికి ఏమాత్రం సహాయం చేసే పరిస్థితి లేదు. సాధారణ రైతులకు, ముఖ్యంగా సాంప్రదాయ విత్తనాలను తయారుచేస్తున్న రైతుల ప్రయోజనాలకు. నష్టం కలుగుతుంది.

కేంద్రీకృత అనుమతి (Centralised Clearance):

 ఒక కంపెనీ కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు (Accreditation) పొందితే, అది దేశంలోని అన్ని రాష్ట్రాలలో విత్తనాలను విక్రయించడానికి అనుమతి పొందినట్లే. బహుళ రాష్ట్రాల నియంత్రణ లేనందున కార్పొరేట్ కంపెనీల వ్యాపార విస్తరణను వేగవంతం చేస్తుంది. రాష్ట్రాలపై కేంద్ర పెత్తనాన్ని సుస్ధిర పరుస్తున్నారు. 

కంపెనీలు ప్రతి రాష్ట్రంలో వేర్వేరు అనుమతులు పొందాల్సిన అవసరం ఉండదు. నియంత్రణల సరళీకరణ పేరున (Deregulated Control) అపరిమితమైన స్వేచ్ఛ లభిస్తుంది. కంపెనీల ఉల్లంఘనలపై నేరారోపణలను తొలగించారు లేదా శిక్షలను తగ్గించినందువలన  కంపెనీల అధికారులు జైలుకు వెళ్లాల్సిన భయం తప్పుతుంది. మైనర్ నేరాలుగా భావించమంటున్నారు.

విత్తనాల డీలర్లు, పంపిణీ దారులు విత్తనాలను విక్రయించడానికి, దిగుమతి చేసుకోవడానికి, ఎగుమతి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. క్యూ ఆర్ కోడ్ ద్వారా పక్కా నియంత్రణ వుంటుంది. చిన్న వ్యాపారస్తులు పోటీ లో నిలబడలేరు. పెద్ద కార్పొరేట్ కంపెనీల కు కేంద్రీకృత అనుమతి వలన వ్యాపారం సులభమవుతుంది.

నకిలీ విత్తనాలు

వ్యవసాయ మంత్రిత్వ శాఖ చాలా కాలంగా నకిలీ విత్తనాల గురించి మాట్లాడుతుంది. కార్పొరేట్ కంపెనీలు నకిలీ విత్తనాలు అమ్మితే కఠినమైన జరిమానా విధించబడుతుందనే అభిప్రాయాన్ని కలిగించింది .అయితే ప్రస్తుత బిల్లులో ఎటువంటి కఠినమైన నిబంధనలను ప్రతిపాదించలేదు. ముసాయిదాలో ఫేక్ సీడ్స్ నకిలీ విత్తనాలు అనే పదం లేదు. 

ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఖరీఫ్ రబీ సీజన్లో నకిలీ , నాణ్యతలేని నాసిరకం విత్తనాల అమ్మకాల కారణంగా రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. విత్తనాలు అమ్మిన కంపెనీలు ముందు ఒకరకంగా వాగ్దానాలిస్తున్నారు. మొలక శాతానికి, దిగుబడులకు మాదే గ్యారంటీ అంటూన్నారు. అమ్ముకున్నతరువాత సమస్య వచ్చినపుడు ముఖం చాటేస్తున్నారు.

విత్తన సరఫరా గొలుసులో పారదర్శకత , జవాబుదారితనం నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్న బిల్లు ఏమి చెప్తున్నదో చూడండి.

“సెక్షన్ 31కింద నియమించబడిన సీడ్ ఇన్స్పెక్టర్ కు విషేష అధికారాలను ఇచ్చారు. అనుమానం వచ్చిన విత్తనాల సాంపుల్స్ ను ఆ ప్రాంత అనలిస్ట్ దగ్గరకు పంపి , స్టాక్ ను సీజ్ చేయాలి. సీడ్ ఇన్స్పెక్టర్ కు అనుమానం వచ్చినప్పుడు ఇంటి తలుపులు పగలకొట్టైనా అనుమానం వున్న విత్తనాలను స్వాధీనం చేసుకునే అధికారాలను ఇచ్చారు.అపరిమితమైన అధికారాలను సీడ్ ఇన్స్పెక్టర్క ను కట్టబెట్టారు.

రైతులు, విత్తన కంపెనీలను అనవసరంగా కోర్టు కేసుల లోకి లాగుతున్నారట—- కొంతమంది స్వార్థ ప్రయోజనాలు కలిగినటువంటి రైతులు కంపెనీలను అనవసరంగా కోర్టుకులాగుతున్నందున కంపెనీల ను  రక్షించాలని ప్రభుత్వం వాదించింది.  25 నాటికి భారత విత్తన మార్కెట్ విలువ దాదాపు 3.8 2 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా మరియు 2030 నాటికి దాదాపు 5.5% వార్షిక వృద్ధిరేటుతో దాదాపు 5 బిలియన్ డాలర్లు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇంత భారీ మార్కెట్ పై బేయర్స్, మాన్సాంటో , సింజెంటా లాంటి కార్పొరేట్ కంపెనీలు కన్ను వేశాయి.  పెద్ద కంపెనీలు తప్పులు చేయరంటున్నారు. వలస పాలకులు తమ  సహాయకులు రక్షించేందుకు ఉపయోగించిన Good Faith క్లాజును విత్తన చట్టం లో కూడా ప్రయోగిస్తున్నారు. 

చట్టాలను అతిక్రమించే కార్పోరేట్ కంపెనీల కు వెసులుబాటు ఇలా వుంటుందట. 

మొదటి తప్పు, రెండవ తప్పు లకు పెనాల్టీ లేదు,

ప్రధమ తప్పు -రెండవ తప్పు -మూడు సంవత్సరాలు అదే తప్పు చేస్తూవుంటే , అపుడు 2 లక్షల రూపాయలు పెనాల్టీ విధించవచ్చు.

కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వం అవసరాన్ని బట్టి పెనాల్టీని నిర్ణయించటానికి సెక్షన్ 34 ప్రకారం ఒక నోటిఫికేషన్ ద్వారా ఒక ఆఫీసర్ ను  నిర్ణయించవచ్చు. ప్రభుత్వం నియమించిన ఆఫీసరు పెనాల్టీని నిర్ణయిస్తాడు. ఆ ఆఫీసురు సెక్షన్ 31 ప్రకారం ప్రధమ తప్పు అని భావిస్తే కంపెనీని శిక్ష లేకుండా వదిలేయొచ్చు.

లేకపోతే 50 వేల పెనాల్టీని, చిన్న తప్పు కింద విధించవచ్చు . మూడు సంవత్సరాల వరకు అదే తప్పులు మరలా చేస్తూ ఉంటే రెండు లక్షల పెనాల్టీ వరకు విధించవచ్చు. పెద్ద తప్పు అని భావిస్తే పది లక్షల పెనాల్టీ జరిమానా కూడా విధించవచ్చు. మరలా  ఐదు సంవత్సరాలు తర్వాత కూడా అదే పని చేస్తూ ఉంటే 30 లక్షలు వరకు కూడా పెనాల్టీ విధించడానికి, డీలర్ షిప్ ని క్యాన్సిల్ చేయడానికి, ఒక మూడు సంవత్సరాల జైలు ఖైదు విధించడానికి ఈ బిల్ అవకాశమిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయించిన దాని కంటే ఎక్కువ ధరలకు అమ్మడం, రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం విత్తన వ్యాపారాన్ని కొనసాగించటం, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను ప్రదర్శించకపోవడం, విత్తన ప్యాకెట్ పైన లేబుల్ అతికించబోవటం ఇలాంటివన్నీ కూడా చిన్న తప్పులు కింద భావిస్తారు,

విత్తనం మొలకెత్తివరకు కంపెనీలను బాధ్యత వహించేలా బిల్లు నిర్దేశించాలి. విత్తనాలు మొలకెత్తినప్పటికీ పంట దిగుబడి ఇవ్వకపోతే ఏమి చేయాలి ? విత్తన నష్టానికి గరిష్ట పరిహారంపై పరిమితి ఉండకూడదనిరైతు నాయకులు కోరుతున్నారు.

నకిలీ విత్తనాలు తరచుగా ఒకేలాంటి 

బ్రాండ్ కింద అమ్ముడు అవుతాయి , తరచుగా మొలకెత్తడంలో లేదా వాగ్దానం చేసిన దిగుబడిని అందించడంలో విఫలమవుతాయి. దీనివలన రైతుల అప్పుల భారం పెరుగుతుంది.  ఒక్క సంవత్సరంలో ఒక్క పంట నష్ట పోయినా దెబ్బ నుంచి కోలుకోలేరు. 25 లో 24 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల విత్తన తనిఖీదారులు సేకరించిన మొత్తం 2.5.లక్షల విత్తన నమూనాలలో 32,525 నమూనాలు నాణ్యత లేనివిగా తేలిందన్నారు

.

విత్తన దిగుమతులు

విత్తన ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం మూడో స్థానంలో ఉంది మొదటి స్థానాల్లో అమెరికా , చైనా , తర్వాత భారతదేశం ఉంది. భారతదేశంలో కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉత్పత్తిలో ముందున్నాయి. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన స్థానిక విత్తనాలను భద్రపరిచే తిరిగి వాడుకునే సాంప్రదాయ ప్రక్రియకు ప్రమాదం ఏర్పడింది . పేటెంట్ ఉన్న బ్రాండెడ్ పంపిణీ విత్తనాలను మాత్రమే వాడాలనే దుష్ట సాంప్రదాయాన్ని ఈ ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో లక్షల ఎకరాల్లో విత్తనాలను తయారుచేస్తున్నారు. విత్తనాలను తయారుచేస్తున్న కర్నూలు, మహబూబ్ నగర్, నూజివీడు రైతుల రక్షణ గురించి బిల్లు ఏమీ మాట్లాడలేదు. అమెరికా , యూరప్ దేశాల పేటెంట్లతో రైతులు విత్తన స్వాతంత్రాన్ని ,స్వేచ్ఛను కోల్పోనున్నారు . భారత సంప్రదాయ వ్యవసాయం లోని మంచి లక్షణాలను కూడా విస్మరిస్తున్నందున వ్యవసాయం ప్రమాదంలో పడుతున్నది. ఈ బిల్లు విత్తన దిగుమతులను సరళీకరించి, కార్పొరేట్ కంపెనీలకు లాభాలను కూడపెట్టడం ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నట్లున్నది. 

  ప్రపంచ వెరైటీలను భారత దేశంలోకి విచక్షణారహితంగా అనుమతించటంద్వారా దేశీయ విత్తనాభివృథిని శాశ్వతంగా దెబ్బగొడ్తున్నారు. రైతుల సృజనాత్మక చొరవను పెంచే గ్రామీణ విత్తన కేంద్రాల అభివృధి నినాదంగానే మిగిలిపోయింది. రైతు విత్తనాలను స్వంతంగా తయారు చేసుకునే హక్కు పై దాడి  చేస్తున్నారు. భారతదేశ విత్తన సంపదను కాపాడవలసిన అవసరం గురించి మౌనం వహించారు. రైతు విత్తన హక్కు గురించి విత్తన స్వావలంబన అందుబాటులోకి తీసుకురావడం, విత్తన సరఫరా లో పారదర్శక మరియు జవాబుదారీతనం పెంచటం ద్వారా రైతు హక్కులను కాపాడటం లక్ష్యంగా పెట్టుకోవటం విస్మరించారు. 

విత్తనాలను రైతులు సాగు చేస్తున్నారు రైతులు తయారు చేసినటువంటి విత్తనాలు ఏదో ఒక కంపెనీ కొనుక్కుని బ్రాండ్ వేసుకొని మార్కెట్లో అమ్ముకుంటున్నారు. మన రైతుల శక్తిని విస్మరించి,కార్పొరేట్ వత్తిడికి లొంగి మన విత్తన స్వాతంత్ర్యాన్ని తాకట్టు పెడుతున్నారు. 

రైతులకు నష్టపరిహారం విధానం మరింత కష్టం.

1. న్యాయం పొందడంలో సమస్యలు (Issues in Seeking Justice)

• నాసిరకం లేదా నకిలీ విత్తనాల వల్ల పంట నష్టం సంభవించిన రైతులకు తప్పనిసరిగా, సులభంగా నష్ట పరిహారం చెల్లించడానికి బిల్లులో స్పష్టమైన, సరళమైన నిబంధనలు ఏమీ లేవు.

నష్ట పరిహారం క్లెయిమ్ చేసుకోవడానికి అవసరమైన ప్రక్రియ క్లిష్టంగా వున్నది. సాంపుల్ సేకరణ, లాబోరేటరీ పరీక్షలు, విచారణలు అన్నీచాలా క్లిష్టంగా మరియు ఖరీదైనదిగా ఉన్నాయి. ఇది చిన్న రైతులు న్యాయం పొందకుండా నిరోధిస్తుంది. స్పష్టమైన నిబంధన లేకపోవడం: నాసిరకం విత్తనాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు తప్పనిసరిగా, సులభంగా పరిహారం చెల్లించేందుకు ఒక స్పష్టమైన మరియు సరళమైన నిబంధన బిల్లులో లేదు. 

• క్లిష్టమైన ప్రక్రియ: నష్టపరిహారం పొందే ప్రక్రియ క్లిష్టంగా, సాంకేతికంగా, మరియు సుదీర్ఘంగా ఉంటుందని, ఇది చిన్న రైతులు అనుసరించడానికి అనుకూలంగా ఉండదని అభిప్రాయపడుతున్నారు. నమూనాల సేకరణ, ప్రయోగశాల పరీక్షలు, విచారణ వంటి సుదీర్ఘ పద్ధతులపై అధికారులు మరియు కోర్టుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

• కోర్టుల ప్రమేయం: విత్తన లోపం వల్ల పంట నష్టం జరిగితే, రైతులు ఇప్పటికీ పెద్ద కంపెనీలతో న్యాయస్థానాలలో పోరాడవలసి వస్తుంది, ఇది ఆర్థికంగా, సమయం పరంగా చిన్న రైతులకు భారం అవుతుందని నిపుణులు హెచ్చరించారు.

కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడే ప్రధాన అంశాలు (Provisions Protecting Corporate Interests)

ముసాయిదా బిల్లులో కంపెనీల పరిశోధన (R&D) మరియు మార్కెట్ విస్తరణకు దోహదపడే అంశాలు, అలాగే నియంత్రణ భారాన్ని తగ్గించే నిబంధనలు ఉన్నాయి:

2. రైతు హక్కులపై పరిమితులు(Limitation of Farmer Rights)

• సంప్రదాయ విత్తనాలను సేవ్ చేసుకోవడం, మార్చుకోవడం లేదా అమ్మడంపై రైతులకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ, బిల్లులోని కొన్ని నిబంధనలు భవిష్యత్తులో ఈ హక్కులకు పరిమితులు విధించవచ్చని ఆందోళనగావున్నది. భారత దేశ జన్యు వారసత్వాన్ని రక్షించేందుకు తీసుకున్న చర్యలు చట్టం లో లేవు.

• రిజిస్ట్రేషన్ భారం: అన్ని విత్తన రకాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడం వలన, రైతులు తమ సంప్రదాయ వెరైటీల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు పడతారు.

3. మార్కెట్ మరియు ధరలపై ప్రభావం (Impact on Market and Prices)

• విత్తన ధరల పెరుగుదల: విత్తన పరిశ్రమపై ప్రభుత్వం యొక్క నియంత్రణ తగ్గి, కేంద్రీకృత గుర్తింపు వ్యవస్థ కారణంగా పెద్ద కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం పెరుగుతుంది. విత్తన ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. 

• పోటీ లేమి: చిన్న విత్తన కంపెనీలు మరియు స్థానిక తయారీదారులు కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థను ఎదుర్కొనే శక్తి లేక మార్కెట్ నుండి నిష్క్రమించక తప్పదు. దీనివల్ల పోటీ తగ్గి, పెద్ద కంపెనీల గుత్తాధిపత్యం (monopoly) పెరుగుతుంది.

4. ప్రభుత్వ నిబంధనల ఉపసంహరణ (Withdrawal of Government Regulations)

• ప్రభుత్వ పాత్ర తగ్గింపు: బిల్లులో విత్తన ధృవీకరణ (certification) మరియు పరీక్షల్లో ప్రభుత్వ పాత్రను తగ్గించి, ప్రైవేట్ సంస్థలకు ఎక్కువ అధికారం కల్పించడంపై ఆందోళన ఉంది. దీనివల్ల నాణ్యత పర్యవేక్షణ ప్రమాణాలు తగ్గే అవకాశం ఉంది. 

కార్పొరేట్ కంపెనీల ప్రయోజన పరిరక్షణ (Protection of Corporate Interests)

ఈ ముసాయిదా బిల్లు విత్తన పరిశ్రమలో  కార్పొరేట్ కంపెనీల వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని (Ease of Doing Business) పెంచడం ద్వారా మరియు వారి పరిశోధన (R&D) పెట్టుబడులకు రక్షణ కల్పించడం ద్వారా కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

1. కంపెనీలపాలనాపరమైన భారం తగ్గింపు (Reduced Regulatory Burden)

• మైనర్ నేరాల డీక్రిమినలైజేషన్ (Decriminalisation of Minor Offences):

• చిన్నపాటి నియమ ఉల్లంఘనలకు లేదా సాధారణ తప్పులకు శిక్షలను తగ్గించడం లేదా వాటిని నేరాల జాబితా నుండి తొలగించడం జరిగింది. దీనివల్ల కంపెనీలపై ఉండే న్యాయపరమైన మరియు పాలనాపరమైన ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.

• కేంద్రీకృత గుర్తింపు వ్యవస్థ (Centralised Accreditation System):

• విత్తన కంపెనీలు కేంద్ర స్థాయిలో గుర్తింపు పొందితే, రాష్ట్రాల స్థాయిలో మళ్లీ అనుమతులు/గుర్తింపులు పొందాల్సిన అవసరం ఉండదు. బహుళ రాష్ట్రాల్లో వ్యాపారం చేసే పెద్ద కంపెనీలకు ఇది ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది.

2. మార్కెట్ విస్తరణ మరియు R&D ప్రోత్సాహం (Market Expansion and R&D Incentive)

• విత్తన దిగుమతుల సరళీకరణ (Liberalised Seed Imports):

. కొత్త విత్తనాలను, ముఖ్యంగా పరిశోధన ఆధారిత జన్యు మార్పిడి విత్తనాలను, భారతదేశంలోకి సులభంగా దిగుమతి చేసుకునేందుకు నిబంధనలను సరళీకరించారు. ఇది వినూత్న విత్తనాలను అందించే పెద్ద కంపెనీల మార్కెట్ విస్తరణకు సహాయపడుతుంది. మన దేశ పరిస్థితులకు సంబంధం లేని పరిశోధనలు మన వ్యవసాయానికి ఉపయోగపడవు. కార్పోరేట్ కంపెనీల కు దండిగా లాభాలను సమకూరుస్తాయి.

• పరీక్షల ప్రక్రియ సరళీకరణ (Streamlined Trial Process):

• నూతన విత్తన వంగడాల ధృవీకరణ మరియు వినియోగ విలువ (Value for Cultivation and Use – VCU) పరీక్షల నియంత్రణలను కొంతవరకు సడలించడం జరిగింది. దీనివల్ల ప్రైవేట్ కంపెనీలు తమ నూతన వంగడాలను మార్కెట్‌లోకి వేగంగా విడుదల చేయగలుగుతాయి, తద్వారా పెట్టుబడిపై రాబడి పెరిగి కంపెనీల లాభాలు పెరుగుతాయి. (Return on Investment) 

3. నకిలీ విత్తనాల నియంత్రణ పేరున ట్రేసబిలిటీ (Traceability) మరియు పారదర్శకత: క్యూఆర్ కోడ్‌లు (QR Codes) మరియు SATHI పోర్టల్ ద్వారా ప్రతి విత్తనం యొక్క మూలాన్ని (Source) సులభంగా గుర్తించవచ్చు. ఇది బ్రాండెడ్ మరియు నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసే పెద్ద కంపెనీల ఉత్పత్తులకు రక్షణ కల్పిస్తుంది. దేశీ విత్తనాలను మార్కెట్‌లోకి తీసుకువచ్చే చిన్న వ్యాపారులను నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది.

ఈ నిబంధనలన్నీ కలిసి, పెద్ద కార్పొరేట్ కంపెనీలు భారతదేశ విత్తన మార్కెట్‌లో మరింత స్వేచ్ఛగా మరియు వేగంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. కార్పొరేట్ కంపెనీల కు అనుకూలంగా, రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా వున్న ఈ బిల్లు ను తిప్పికొట్టాలి. 

డాక్టర్ కొల్లా రాజమోహన్,. నల్లమడ రైతు సంఘం, గుంటూరు. 

9000657799

పతన దిశగా ఉక్రెయిన్‌, లొంగిపోతున్న మిలిటరీ – పరారీ క్రమంలో జెలెనెస్కీ !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

నిజమే ! గతవారం రోజులుగా ఉక్రెయిన్‌ పోరులో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పశ్చిమదేశాల నుంచి వస్తున్న వార్తలను చూస్తుంటే భయంకరమైన చలికాలం ముగిసేలోగా ఉక్రెయిన్‌ పతనం అవుతుందా ? చలికి తట్టుకోలేక ఉక్రెయిన్‌ సైన్యం తెల్లజెండా ఎత్తుతుందా ? ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య మంగళవారం నాడు 1,363వ రోజులో ప్రవేశించింది. వేలాది మంది ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోతున్నట్లు వార్తలు, అధ్యక్షుడు వ్లదిమిర్‌ జెలెనెస్కీ విదేశాలకు పారిపోనున్నాడా అంటే మిన్నువిరిగి మీద పడే అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప అందుకు అవకాశాలు లేకపోలేదని అనిపిస్తున్నది. గత కొద్ది వారాలుగా అనేక కీలక ప్రాంతాలను చక్రబంధంలో బిగించిన రష్యా ఒక్కో గ్రామం, ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది. పోకరోవస్క్‌ అనే పట్టణంలోకి పుతిన్‌ సేనలు చొరబడ్డాయని ఏక్షణంలోనైనా స్వాధీనం చేసుకోవచ్చని వార్తలు. గత ఏడాదిన్నర కాలంగా ఆ పట్టణాన్ని పట్టుకొనేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతున్నది. అక్కడ ఉన్న దాదాపు ఐదువేల మంది ఉక్రెయిన్‌ మిలిటరీ కదలకుండా బందీ అయిందని, తెల్లజెండా ఊపిందని, పోరు సాగుతున్నదని భిన్నవార్తలు వచ్చాయి. వెలుపలి నుంచి వస్తున్న రష్యన్‌ సేనలను ప్రతిఘటిస్తున్నట్లు కనిపించటం లేదని, అయితే ఇండ్లు, బంకర్లలో ఉన్నవారి కారణంగా ఒక్కో ప్రాంతాన్ని జల్లెడ పట్టి ముందుకు పోతున్నారని, కొన్ని వారాల్లో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్నారు.అది స్వాధీనమైతే అనేక కొత్త ప్రాంతాలను సులభంగా పట్టుకొనేందుకు వీలుకలుగుతుందని, సైనిక చర్య మరో మలుపు తిరుగుతుందని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో జరిపే పెద్ద దాడులకు సన్నాహాలలో భాగంగా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉన్న పోలాండ్‌లోని రైల్వేట్రాక్‌ను ధ్వంసం చేసినట్లు రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. సోమవారం నాడు పోలాండ్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఐరోపా దేశాల మీడియా రష్యా కారణమని చెబుతున్నది. ఇదే సమయంలో తాము ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటున్నట్లు శుక్రవారం నాడు జెలెనెస్కీ కూడా అంగీకరించాడు. నాటో కూటమి దేశాలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో సాయం అందిస్తున్నప్పటికీ అది వృధా అనే అభిప్రాయంతో నేతలు ఉన్నారు. ఉక్రెయిన్‌ ఇజ్‌మెయిల్‌ రేవు పట్టణం వద్ద ఉన్న టర్కీ ఎల్‌పిజి టాంకర్‌ షిప్‌పై జరిగినదాడిలో అది దగ్దమైంది.దాడి ఎవరు జరిపిందీ తేలనప్పటికీ రష్యా చేసిందని ఆరోపించారు. దాంతో పక్కనే ఉన్న రుమేనియాతన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. పత్యక్షంగా పాల్గ్గొనేందుకు నాటో నేతలు విముఖత చూపుతున్నారు. గతంలో తగిలిన దెబ్బలతో తలబొప్పి కట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఉక్రెయిన్‌ సమస్యపై ప్రస్తుతం కంటి చూపుతున్న నోటమాట లేదు.జెలెనెస్కీ పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలా ఉంది.

దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిఝఝియాలో మరికొన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలోకి వెళ్లాయి.ఈ ప్రాంతంలో పోరు దిగజారుతున్నదని జెలెనెస్కీ మిలిటరీ అధికారులే అంగీకరించారు.వ్యూహాత్మకంగా తమసేనలను వెనక్కు రప్పిస్తున్నట్లు చెప్పుకున్నారు.హంగరీ ప్రధాని విక్టర్‌ ఒర్బాన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ గెలిచే అవకాశం లేదని, ఐరోపా ఆర్థికసాయం పిచ్చితనం తప్ప మరొకటి కాదన్నాడు. ఇప్పటికే 185బిలియన్‌ యూరోలు తగలేశామని, ఇంకా అంతకంటే ఎక్కువే తగేలేయాలని చూస్తున్నామని, ఎంత చేసినా గెలిచే అవకాశం లేదని జర్మన్‌ మీడియా గ్రూపు అక్సెల్‌ స్ప్రింగర్‌ సిఇఓతో మాట్లాడుతూ చెప్పాడు. యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణుల కోసం జెలెనెస్కీ ప్రస్తుతం ఫ్రాన్సు పర్యటనలో ఉన్నాడు, రానున్న పది సంవత్సరాలలో 100 రాఫేల్‌ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. తరువాత స్పెయిన్‌ వెళతాడని వార్తలు.సరస్సులోని చేపలు పైకి వస్తే మింగివేసేందుకు సిద్దంగా ఉండే కొంగల మాదిరి క్రామాటోరస్క్‌ వంటి చోట్ల రష్యన్‌ లాన్సెట్‌ డ్రోన్లు దాడులకు సిద్దంగా ఉన్నాయని ఉక్రెయిన్‌ నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రతి రోజూ రష్యన్ల చేతిలో నరకం చూస్తున్నట్లు చెబుతున్నారు. సమీప భవిష్యత్‌లో రష్యాతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ జరిగే అవకాశం లేదని మాస్కోతో 1,350 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఫిన్లండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌ చెప్పాడు. సరిహద్దుల్లో ఉన్న పరిస్థితి గురించి తాను ట్రంప్‌తో మాట్లాడతానని, పది అంశాల్లో ఏ ఒక్కదానికి పుతిన్‌ అంగీకరించినా మంచిదే అన్నాడు. ఇటీవలనే ఫిన్లాండ్‌ నాటో కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. రష్యా ఎత్తుగడలు ఏమిటో తమకు బాగా తెలుసని స్టబ్‌ చెప్పాడు.

ఉక్రెయిన్‌ సేనలు యుద్ద రంగం నుంచి పారిపోతున్న వార్తలు గతంలోనే వచ్చినప్పటికీ ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉన్నాయి. వివాదం ప్రారంభమైన 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే పశ్చిమ దేశాల మీడియా వార్తల ప్రకారం అక్టోబరు నెలలో 21వేల మంది పారిపోయారు. రష్యాపై తాము విజయం సాధించబోతున్నామని జెలెనెస్కీ ఎన్ని కబుర్లు చెప్పినా, ఇతర దేశాలు ఇచ్చిన కొన్ని ఆధునిక ఆయుధాలు, సమాచారం ఆధారంగా రష్యాలోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేసిన తరువాత ఇలా జరగటం, అదీ పశ్చిమ దేశాల మీడియా వెల్లడించట గమనించాల్సిన అంశం. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని ఇటీవలి వరకు ఉక్రెయిన్‌ మిలిటరీలో పనిచేసిన ఇగోర్‌ లుస్టెంకో చెబుతున్నాడు. మిలిటరీ ఇలాంటి అంశాలను బయటకు రాకుండా చూస్తుందని వేరే చెప్పనవసరం లేదు.అధికారిక సమాచారం ప్రకారమే అక్టోబరులో 21,602 మంది పారిపోయారు, వాస్తవంలో ఎక్కువ మంది ఉంటారని లుస్టెంకో చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఇటీవలి కాలంలో రష్యన్‌ సేనలు మరిన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవటానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతుండగా, తాము గెలిచే అవకాశం లేదని ఉక్రెనియన్లు భావించటంతో పోరాడటం, ప్రాణాలు పోగొట్టుకోవటంలో అర్దం లేదని అనేక మంది భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇటీవల ఒక బ్రిటీష్‌ పత్రిక చేసిన విశ్లేషణ ప్రకారం ఆరున్నర లక్షల మంది మిలిటరీలో చేరి పోరాడగలిగిన వయస్సున్నవారు ఉక్రెయిన్‌ వదలి పారిపోయారు. ఆ దేశ పార్లమెంటు సభ్యుడొకరు నాలుగు లక్షలని చెప్పాడు.మిలిటరీ నుంచి పారిపోతున్నవారి గురించి 2024 డిసెంబరులో ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం అంతకు ముందు రెండు సంవత్సరాలతో పోలిస్తే ఆ ఏడాది రెండింతలున్నారు.బ్రిటీష్‌ పత్రిక టెలిగ్రాఫ్‌ ఇటీవల ఇచ్చిన విశ్లేషణ ప్రకారం ప్రతి నెల పారిపోతున్న లేదా విధులకు చెప్పకుండా గైరుహాజరవుతున్నవారి సంఖ్య ఇరవైవేలు ఉంటున్నది. పారి పోయిన వారి మీద 2.9లక్షల కేసులను ప్రభుత్వం నమోదు చేసింది.ఇప్పుడు కనీసం రెండు లక్షల మంది కొరత వున్నట్లు అంచనా. అనేక మంది మాజీ, ప్రస్తుత అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఈ విషయాలను రాసింది. పోరు జరుగుతున్న ప్రాంతాలలో ఉన్నవారిలో కేవలం 30శాతం మందే యుద్ద సన్నద్దతతో ఉన్నారు. సెప్టెంబరు నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ సేనలలో కేవలం 47-48శాతానికి మించి లేరని చెప్పాడు. సైనికుల కొరత ఉన్నవారి మీద వత్తిడిని కూడా పెంచుతున్నది.వారినే ఒక రంగం నుంచి మరో రంగానికి పదే పదే మారుస్తున్నారు. నిరంతర దాడులను తట్టుకొనే శక్తి తగ్గుతున్నదని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారులు వాపోతున్నారు. కొత్తగా సైన్యంలోకి తీసుకున్నవారికి కూడా తగిన శిక్షణ ఇవ్వకుండా యుద్ద రంగానికి తరలిస్తున్నారు.గ్రామాల నుంచి మిలిటరీలోకి తీసుకున్నవారిలో కొందరికి కేవలం రెండు రోజులు మాత్రమే శిక్షణ ఇచ్చి యుద్ధ రంగానికి పంపుతున్నట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొన్నది. యుద్ధం జరిగిన సమయాల్లో ఏ పక్షమైనా తమకు జరిగిన నష్టాన్ని మూసిపెడుతుంది.వర్తమాన పోరులో రష్యా, ఉక్రెయిన్‌ గురించి కూడా అలాంటి వార్తలే వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టులో వెల్లడైనట్లు చెబుతున్న ఒక పత్రం ప్రకారం 17లక్షల మంది ఉక్రేనియన్‌ సైనికులు మరణించారన్నది అతిశయోక్తితో కూడినదిగా ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో ఉంటారన్నది వాస్తవం. మిలిటరీ నుంచి పారిపోవటం పెరగటానికి ఇవి కూడా కారణం.

అనేక చోట్ల ఉక్రెయిన్‌ సేనల లొంగుబాటు, రష్యా ఆధీనంలోకి పలు ప్రాంతాలు పోతున్నట్లు వచ్చిన వార్తల నేపధ్యంలో జెలెస్కీ బ్రిటన్‌ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు, ఉక్రెయిన్‌ గగనతలంపై విమానాలు ఎగరటం ప్రమాదకరంగా ఉండటంతో పక్కనే పోలాండ్‌లో విమానాన్ని సిద్దంగా ఉంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జెలెనెస్కీ ఏ ఐరోపా దేశానికి వెళుతున్నా కూడా చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతున్నారు. భద్రతా కారణాల రీత్యా తమదేశ పర్యటన గురించి వివరాలను వెల్లడించలేమని స్పెయిన్‌ ప్రధాని కార్యాలయం పేర్కొన్నట్లు రేడియో వెల్లడించింది. అయితే జెలెనెస్కీ సోమవారం నాడు ఫ్రాన్సు వెళ్లాడు. మరో వైపున అతగాడి స్థానంలో ఎవరిని గద్దెనెక్కించాలా అని ఆరునెలలుగా డోనాల్డ్‌ ట్రంప్‌ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దానిలో భాగంగానే ఇంథన ఒప్పందాలలో జెలెనెస్కీకి పది కోట్ల డాలర్ల లంచం ముట్టినట్లు, దాని గురించి దర్యాప్తు జరుగుతున్నదనే వార్తలు వచ్చాయి. అనేక దేశాల్లో ఎవరినైనా సాగనంపాలనుకున్నపుడు ఇలాంటి వాటిని ముందుకు తెచ్చి రంగం సిద్దం చేసే సంగతి తెలిసిందే. జెలెనెస్కీ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు రష్యన్‌ వర్గాలు కూడా చెబుతున్నాయి. బ్రిటన్‌ ఆశ్రయం ఇచ్చేందుకుసిద్దంగా ఉన్నప్పటికీ అక్కడ ఎంతకాలం ఉంటారన్న విశ్లేషణ కూడా సాగుతున్నది. ఇప్పటికే బ్రిటన్‌లో భవనాలను కొనుగోలు చేశాడని, రాజు చార్లెస్‌తో సంబంధాలలో ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల నాటికి డెమోక్రటిక్‌ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసేందుకు గాను దాఖలు చేసే కేసులలో జెలెనెస్కీని సాక్షిగా చేసేందుకు చూస్తున్నట్లు, దానికి గాను పారిపోతే బ్రిటన్‌ నుంచి రప్పిస్తారని కూడా చెబుతున్నారు.మరొక దేశం ఇజ్రాయెల్‌ వెళ్లినా అదే జరుగుతుంది. కీలకమైన పోకరోవస్క్‌ పట్టణం పతనమైన తరువాత ఇలాంటి పరిణామం జరుగవచ్చని భావిస్తున్నారు. జెలెనెస్కీ పర్సుగా పరిగణిస్తున్న ఒక టీవీ కార్యక్రమాల స్టూడియో యజమాని తైముర్‌ మిండిచ్‌ మీద ఇప్పుడు జాతీయ అవినీతి నిరోధకశాఖ దర్యాప్తు జరుపుతున్నది. మాజీ ఉప ప్రధాని, ప్రస్తుతం జాతీయ ఐక్యత శాఖ మంత్రిగా ఉన్న ఒలెక్సీ గురించి కూడా దర్యాప్తు జరుగుతున్నది. జెలెనెస్కీ పదవీ కాలం ముగిసింది. పోరు సాగుతున్నదనే పేరుతో పదవిలో కొనసాగుతున్నాడు, ఉక్రెయిన్‌కు తగులుతున్న ఎదురుదెబ్బల పూర్వరంగంలో అతగాడిని బలిపశువుగా చేసి కొత్త బొమ్మను గద్దె నెక్కించి కాలం గడిపేందుకు అమెరికా, ఇతర నాటో దేశాలు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. అక్కడ ఎవరు గద్దె నెక్కినా రష్యాకు వ్యతిరేకంగా నాటో దేశాల కుట్రలకు తెరపడితే తప్ప ప్రయోజనం ఉండదు !

ప్రభుత్వ మూత సామాన్యులకే సంకటం : తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్న ట్రంప్‌ !

Tags

, ,

ఎం కోటేశ్వరరావు

అక్టోబరు ఒకటవ తేదీ నుంచి అమెరికాలో కొనసాగుతున్న ఫెడరల్‌ ప్రభుత్వ మూత (షట్‌డౌన్‌)ను ఎత్తివేసేందుకు ఆదివారం నాడు నాంది పలికారు.మూత 41వ రోజు సోమవారం నాడు ఎనిమిది అంశాలపై పార్లమెంటు ఎగువ సభ సెనెట్‌లో తీర్మానాలు ఆమోదం పొందాయి.బుధవారం నాడు ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌ ముందుకు వచ్చిన తరువాత చేసే తీర్మానంతో అధికారికంగా ప్రభుత్వ మూతకు తెరపడుతుందని భావిస్తున్నారు. గతంలో తొలిసారి అధికారానికి వచ్చినపుడు 2019లో 35 రోజుల పాటు మూత తరువాత తన రికార్డును ట్రంప్‌ బద్దలు కొట్టాడు. రారాజునంటూ దిగిరానని బెట్టు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ మెట్టుదిగటంతో జనవరి 31వరకు ప్రభుత్వానికి అవసరమైన నిధులను పొందేందుకు వీలుగా సెనెట్‌ 60-40 ఓట్లతో ఆదివారం నాడు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జనవరి ఒకటవ తేదీతో ముగియనున్న ఆరోగ్య సంరక్షణ సబ్సిడీ పథకాన్ని కొనసాగించేందుకు ట్రంప్‌ అంగీకరించటంతో ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన ఎనిమిది మంది సెనెట్‌ సభ్యులు మద్దతు ఇవ్వటంతో సర్కార్‌ గట్టెక్కింది.కుదిరిన ఒప్పందానికి తాను కట్టుబడి ఉంటానని ట్రంప్‌ ప్రకటించాడు. ఈ సమస్య ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీలో టీకప్పులో తుపాను వంటి చిచ్చు రేపింది. ఎనిమిది మంది సభ్యులను డోనాల్డ్‌ ట్రంప్‌ ” ఆకర్షించి ” మూత ఎత్తివేతకు మద్దతు పలికించినట్లు చెప్పవచ్చు. అసలు ఈ ప్రభుత్వ మూత అంటే ఏమిటి ? దాని పర్యవసానాలేమిటో చూద్దాం. మూత కారణంగా రోజుకు 17 బిలియన్‌ డాలర్ల చొప్పున అప్పు పెరుగుతున్నదని, వారానికి 14 బిలియన్‌ డాలర్ల మేర నష్టమని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఈ అంచనాలు లెక్కించే పద్దతి, పరిగణనలోకి తీసుకొనే అంశాలు ఒకటే కాకపోవటంతో భిన్నమైన అంకెలు మీడియాలో వచ్చాయి. వాటిని చూసి గందరగోళపడాల్సిన అవసరం లేదు, నష్టమైతే వాస్తవం.

ప్రతిదేశంలో బడ్జెట్లకు పార్లమెంట్ల ఆమోద ముద్ర పడితేనే నిధుల విడుదలకు అవకాశం ఏర్పడుతుంది. మనదేశంలో ఏప్రిల్‌ నుంచి మార్చి నెల వరకు ఆర్థిక సంవత్సరం,అత్యధిక దేశాల్లో జనవరి నుంచి డిసెంబరు వరకు ఉంటుంది. మార్చి 31వ తేదీలోగా ద్రవ్యబిల్లుకు ఆమోదం తెలపకపోతే ఏప్రిల్‌ ఒకటి నుంచి ఖజానా నుంచి నిధుల విడుదల ఆగిపోతుంది. అమెరికాలో అది జనవరి ఒకటి నుంచి జరుగుతుంది. అయితే ఇది పౌరకార్యకలాపాలకు తప్ప మిలిటరీ వంటి అత్యవసర సేవలకు వర్తించదు.1980దశకం నుంచి కొన్ని శాఖలకు తగినన్ని నిధులు కేటాయించటంలో తలెత్తిన సమస్యల కారణంగా ఇప్పటి వరకు 21సార్లు ప్రభుత్వ మూతలకు దారితీశాయి. ప్రారంభంలో కొద్ది గంటలతో మొదలై ఇప్పుడు వారాల తరబడి కొనసాగుతున్నది.ప్రారంభంలో ఈ మూతల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు ఉండేవి కాదు, ఇటీవలి 11 మూతల సమయంలో వారిపై వేటు పడటం సాధారణంగా మారింది.సామాన్యులకు ఇబ్బందులు కలుగుతున్నాయి.అమెరికా-మెక్సికో సరిహద్దులో ఇనుప గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్న డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనకు వ్యతిరేకత వ్యక్తం కావటంతో 2018-19లో 35 రోజులు, అంతకు ముందు వివిధ సంక్షేమ పధకాలకు కోతలను ప్రతిపాదించటంతో బిల్‌క్లింటన్‌ ఏలుబడిలో 21, ఆరోగ్య సంక్షేమానికి సబ్సిడీలను పెంచాలన్న బరాక్‌ ఒబామా ప్రతిపాదనలకు వ్యతిరేకంగా 16 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. ఇప్పుడు అదే ఒబామా అమలు చేసిన ఆరోగ్య పథకానికి జనవరి ఒకటి నుంచి నిధులు నిలిపివేయాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా రికార్డు సృష్టించిన మూత ప్రారంభమైంది.2013లో మూత కారణంగా 24 బిలియన్‌ డాలర్లు ఆర్థిక వ్యవస్థకు దూరమైనట్లు, ఆ ఏడాది నాలుగవ త్రైమాస కాలంలో జిడిపి 0.6శాతం నష్టపోయినట్లు అంచనా వేశారు. తాజా ఉదంతంతో నష్టం ఎంతో తెలియాల్సి ఉంది.

తెగేదాకా లాగితే రాజకీయంగా మరింత నష్టమన్న భయమే ట్రంప్‌ను దిగివచ్చేట్లు చేసింది. ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్‌ మేయర్‌, రెండు రాష్ట్రాల గవర్నర్‌ ఎన్నికల్లో అధికార పార్టీ మట్టికరవటం, వచ్చే ఏడాది పార్లమెంటు మధ్యంతర ఎన్నికలు ఉండటంతో రిపబ్లికన్‌ పార్టీ మీద తీవ్ర వత్తిడి వచ్చిన ఫలితమే తాజా పరిణామం అని చెప్పవచ్చు. మూత చివరి రోజులలో రెండువేల విమానాలు రద్దు కావటం, ఏడువేల సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, ప్రయాణీకుల నుంచి వచ్చిన నిరసన కూడా దోహదం చేసి ఉండవచ్చు. రానున్న సెనెట్‌ ఎన్నికలలో ప్రతిపక్ష డెమోక్రాట్లు మెజారిటీ సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కోట్లాది మంది పేదలు, యువత ఇబ్బందులు పడిన తీరు రానున్న రోజుల్లో ట్రంప్‌ మీద వ్యతిరేకత పెంచేదే తప్ప మరొకటి కాదు. ఇవన్నీ తెలిసినప్పటికీ ఆ పెద్దమనిషి ఎందుకు ఇలాంటి చర్యకు పాల్పడినట్లు ? పాలకవర్గాల సేవలో తరించేవారికి సామాన్య జనం పట్టరు. మాగా (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌-అమెరికాను మరోసారి గొప్పదానిగా చేద్దాం) రాజకీయాలు చెల్లవని న్యూయార్క్‌, న్యూ జెర్సీ, వర్జీనియా రాష్ట్రాల ఎన్నికలు స్పష్టం చేశాయి.లక్షలాది కుటుంబాలకు వచ్చే స్వల్ప ఆదాయానికి అంతరాయం కలగటంతో పెన్షన్‌ ఖాతాల నుంచి కుటుంబ అవసరాలకోసం డబ్బు తీసుకొనేందుకు సైతం సంకోచించారు, అప్పులు తీసుకుంటే రానున్న రోజుల్లో తీర్చలేమోననే భయంతో అనేక మంది సర్దుకున్నారు.

నలభై రోజులపైగా మూతతో అమెరికా ఏమైనా స్థంభించిందా అంటే లేదు. అంతకు ముందు నుంచి కొనసాగిస్తున్న అన్ని దుర్మార్గాలకు ప్రభుత్వం మద్దతు కొనసాగిస్తూనే ఉంది.మన దేశంలో పేదరికాన్ని నిర్మూలించామని చెబుతూనే ఆకలితో ఉన్న వారికి నరేంద్రమోడీ సర్కార్‌ 80 కోట్ల మందికి ఉచిత బియ్యం, గోధుమలను అందిస్తున్నది.ప్రపంచంలో అత్యంత ధనికదేశం అమెరికా, అక్కడి జనాభా 34 కోట్లు, వారిలో నాలుగున్నర కోట్ల మంది ప్రభుత్వం నుంచి ఆహార సాయం అందుకుంటున్నారు. ప్రభుత్వ మూత అంటే కుదరదు వారందరికీ ఆహార సహాయం చేయాలంటూ కోర్టు జారీ చేసిన ఆదేశాన్ని ట్రంప్‌ ఉల్లంఘించాడు. మరోవైపు తన కార్యాలయంలో ఉన్నదాన్ని పడగొట్టించి విలాసవంతమైన బాల్‌రూమ్‌ డాన్సు మందిరాన్ని నిర్మించాడు.అర్జెంటీనాలోని పచ్చి మితవాద ప్రభుత్వాన్ని ఆదుకొనేందుకు 80బిలియన్‌ డాలర్ల మేర సాయం అందించాడు. ఇవి మచ్చుకు కొన్ని అంశాలు మాత్రమే.ట్రంప్‌ వంటి వారి ప్రాధాన్యతలు ఎలాంటివో లోకానికి స్పష్టమైంది. వేలాది విమానాలు నిలిచిపోవటంతో ప్రయాణాలు రద్దయి లక్షల మంది ఇబ్బందులు పడుతుంటే మూత కారణంగా విమానరాకపోకల నియంత్రణ సిబ్బంది వత్తిడి నుంచి ఉపశమనం పొందుతారంటూ ట్రంప్‌ యంత్రాంగం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ఇచ్చే విందులు, వినోదాలు చాలా ఖర్చుతో కూడినవి, పిల్లలకు రెండు బదులు ఒక బొమ్మ కొనిపెట్టండని తలిదండ్రులకు మూత సమయంలో ట్రంప్‌ సలహాయిచ్చాడు.

మూతకు తెరపడినప్పటికీ అది ముందుకు తెచ్చిన సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకాల్సి ఉంది. ఫెడరల్‌ ఉద్యోగులు 9లక్షల మంది, ఇతరులు 20లక్షల మందికి మూత సమయంలో ఎలాంటి వేతనాలు ఉండవని అధికార యంత్రాంగం పేర్కొన్నది.దాన్ని ఉద్యోగులు అంగీకరించే అవకాశం లేదు, ఎందుకంటే మూతకు వారి విధులకు ఎలాంటి సంబంధం లేదు. ఆరోగ్య సంరక్షణ సబ్సిడీ బీమా పథకం పొడిగింపుకు ట్రంప్‌ దిగివచ్చినా కొనసాగిస్తాడనే హామీ లేదని ఏపి వార్తా సంస్థ పేర్కొన్నది. అన్నింటికీ మించి ఫెడరల్‌ ప్రభుత్వ ఉద్యోగులను భారీగా తగ్గించాలన్న ట్రంప్‌ యంత్రాంగ అజెండాకు పెద్ద పరీక్ష ఎదురుకానుంది. మూత ఎత్తివేతకు కుదిరిన రాజీ ప్రకారం తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకొనేందుకు, వేతనాలు చెల్లించేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం జనవరి మాసం వరకు మాత్రమే గనుక వచ్చే ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో ట్రంప్‌కు అసలైన పరీక్ష ఎదురుకానుంది. ఆదివారం నాటి రాజీ రెండు పార్టీల్లో ఉన్న విబేధాలను వెల్లడించింది. న్యూయార్క్‌ డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ ష్కన్నర్‌ వ్యతిరేకంగా ఓటు వేశాడు. ట్రంప్‌తో జరుపుతున్న పోరాటాన్ని వదలివేయటం భయంకరమైన తప్పిదమని డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీ స్వతంత్ర సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ వర్ణించాడు. రాజీకి అంగీకరించిన ఎనిమిది మంది డెమోక్రటిక్‌ సెనెటర్లు తమచర్యను సమర్ధించుకున్నారు. మరికొన్ని వారాలు మూత కొనసాగినా ఇంతకంటే మంచి ఒప్పందం కుదిరి ఉండేది కాదని త్వరలో పదవీకాలం ముగియనున్న సెనెటర్‌ షాహీన్‌ చెప్పింది. ఇల్లలకగానే పండగ కాదన్నట్లుగా మూత ముగిసినా వివిధ శాఖలకు కేటాయింపులకు అనేక అంశాల మీద ఓటింగ్‌ జరగాల్సి ఉంది. ఎక్కడైనా తేడా వస్తే మద్దతు ఇచ్చిన వారు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఆదివారం నాడు వ్యతిరేకంగా ఓటు చేసిన డెమోక్రాట్లు ట్రంప్‌ సర్కార్‌ మీద పోరాడిల్సిందే అంటున్నారు.

మూత కారణాలను గనుక చూస్తే రిపబ్లికన్లు ఇంకా దిగిరావాల్సి ఉంటుందన్నది స్పష్టం.2026 సంవత్సర బడ్జెట్‌ కేటాయింపులపై తలెత్తిన విబేధం 40 రోజులకు పైగా మూతకు దారితీసింది. జనవరి ఒకటి నుంచి ఆరోగ్యబీమా సబ్సిడీలను ఎత్తివేస్తానని ట్రంప్‌ ప్రకటించాడు, దాన్ని డెమోక్రాట్లు తిరస్కరించారు. ప్రధానమైన ఈ అంశంతో పాటు వృద్ధుల సంరక్షణ, ఇతర సేవలకు కేటాయింపులు కూడా వివాదాస్పాదం కావించాడు. కోట్లాది మంది కార్మికుల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను ఝటిలం చేయటానికి ట్రంప్‌దే బాధ్యత. గతంలో కూడా అనేకసార్లు మూత ఉదంతాలు జరిగాయి. కానీ ఈ సారి దానితో తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించాడు.దేన్నీ మానుకోలేదు. ప్రయాణాలు మానుకోలేదు, గోల్ఫ్‌ ఆడటం ఆపలేదు, మెక్‌డొనాల్డ్‌ నుంచి గాక వేరే సంస్థ నుంచి హామ్‌బర్గర్లు(పందిమాంసంతో చేసినవి) తెప్పించుకు తినటం తగ్గించలేదు. గతంలో ఇలాంటి సమయాల్లో అధ్యక్షులందరూ కనీసం జనానికి సానుభూతి చూపుతున్నట్లు కనిపించేందుకైనా తమ కార్యక్రమాలను తగ్గించుకున్నారు.ట్రంప్‌ అలాంటివేమీ లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరించాడు. నలభై రోజులూ తన కార్యక్రమాలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించాడు. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులదీ అదే వరుస. సామాన్యులు తప్ప అసామాన్యులెవరూ ఇబ్బంది పడలేదు.గతంలో అధ్యక్ష భవనంలో పనిచేసే సిబ్బందిలో 61 నుంచి 70శాతం మంది విధులకు హాజరుకాలేదు, ఈ సారి 32శాతమే రాలేదు.అంటే ఏ సేవకూ అంతరాయం కలగలేదు.చివరి నిమిషంలో ప్రజాప్రతినిధుల సభలో ఆరోగ్య సబ్సిడీలకు ప్రభుత్వం అడ్డం తిరగవచ్చా అంటే స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ చెప్పిన సమాధానం కొన్ని సందేహాలకు తావిస్తున్నది. తానెలాంటి హామీ ఇవ్వలేనని, సభ్యుల మధ్య ఏకాభిప్రాయ సాధన రావాల్సి ఉందన్నాడు.అయితే ఇప్పటికే ఇంటా బయటా అభాసుపాలైన డోనాల్డ్‌ ట్రంప్‌ పౌరుల ఆరోగ్యం విషయంలో మొరటుగా వ్యవహరిస్తే మరింతగా జనాలకు దూరం కావటం ఖాయం !

న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ విజయ దుందుభి ! డోనాల్డ్‌ ట్రంప్‌కు చెప్పుకోరానిచోట తగిలిన దెబ్బ !!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

జూన్‌ 24న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సర్వేలో ప్రత్యర్ధుల కంటే ముందున్న జోహ్రాన్‌ మమ్దానీ నవంబరు నాలుగవ తేదీన జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించాడు. ఓట్ల లెక్కింపు 91శాతం పూర్తయిన సమయానికి 50.4శాతంతో ముందుండి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. ప్రత్యర్ధిగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడి పరాజయం పాలై పార్టీ మీద తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన న్యూయార్క్‌ రాష్ట్ర మాజీ గవర్నర్‌ ఆండ్రూ కుమోకు 41.6, డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలను ధిక్కరించి పోటీలో నిలిచిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి కర్టిస్‌ సిల్వాకు 7.1, డెమోక్రటిక్‌ పార్టీ మరో తిరుగుబాటు అభ్యర్ది, మధ్యలో పోటీ నుంచి కుమోకు అనుకూలంగా తప్పుకున్న ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌కు 0.3 శాతం ఓట్లు వచ్చాయి.న్యూజెర్సీ, వర్జీనియా గవర్నర్లుగా, వర్జీనియా లెప్టినెంట్‌ గవర్నర్‌గా డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన అభ్యర్ధులు మైక్‌ షెరిల్‌, అబిగెయిల్‌ స్పాన్‌బెర్గర్‌, గజాలా హష్మీ మంచి మెజారిటీలతో ఎన్నికయ్యారు. గజాలా హష్మి 1964లో హైదరాబాద్‌లో జన్మించి నాలుగేండ్ల వయస్సులో అమెరికాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న తండ్రి జియా హష్మివద్దకు వెళ్లింది, ఆమె చదువు సంధ్యలన్నీ అమెరికాలో సాగాయి. రిపబ్లికన్‌ పార్టీ, ఇతర జాత్యహంకారులైన పచ్చి మితవాదులు ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ న్యూయార్క్‌ నగర మేయర్‌గా, వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆ సామాజిక తరగతికి చెందిన వారికే పట్టం గట్టటం ఓటర్ల పరిణితికి నిదర్శనం. నేతలు మతకళ్లద్దాలను తగిలించుకున్నప్పటికీ సామాన్య జనం ముఖ్యంగా కార్మికవర్గం అలా లేదు. మమ్దానీ విజయంతో కంగుతిన్న ట్రంప్‌ తన ఉక్రోషాన్ని యూదుల మీద వెళ్లగక్కాడు. వారు కూడా మమ్దానీకి ఓటు వేశారని వ్యాఖ్యానించాడు. మనదేశంలో ఉన్న హిందువులలో కొందరు కాషాయ తాలిబాన్లుగా మతోన్మాదులుగా మారినప్పటికీ సామాన్యులు అలా లేరు. అలాగే యూదులలో కొందరు దురహంకారులు ఉన్నప్పటికీ అందరూ అలాంటి వారు కాదని న్యూయార్క్‌ ఎన్నికలలో రుజువైంది. ప్రాధమికంగా వెల్లడైన విశ్లేషణ ప్రకారం 44ఏండ్ల లోపు యూదులలో 67శాతం మంది మమ్దానీకి ఓటు వేశారని తేలింది. ఇటీవలి గాజా మారణకాండలో పాలస్తీనియన్లను ఊచకోత కోసిన ఇజ్రాయెల్‌ చర్యలను ఖండించటంలో మమ్దానీ ముందున్నవారిలో ఒకడు. అతనికి ఓటు వేశారంటే సామాన్య యూదులు కూడా ఇజ్రాయెల్‌ చర్యలను సమర్ధించటం లేదన్నది స్పష్టం.

పోలింగ్‌కు కొద్ది గంటల ముందు వెల్లడైన సర్వేలన్నీ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి సోషలిస్టును అని సగర్వంగా ప్రకటించుకున్న జోహ్రాన్‌ మమ్దానీ గెలుపు బాటలో ఉన్నట్లు ప్రకటించాయి. ఎమర్సన్‌ కాలేజి చివరి సర్వేలో జోహ్రాన్‌కు 50శాతం, సమీప ప్రత్యర్ధి ఆండ్రూ కుమోకు 25,రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి కర్టిస్‌ సిల్వాకు 21శాతం మద్దతు ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రకటిత సమయానికి ముందే 7,35,000 మంది ఓట హక్కు వినియోగించుకున్నారు. వీరిలో యువత ఎక్కువగా ఉన్నట్లు, అత్యధికులు జోహ్రాన్‌కే ఓటు వేసినట్లు మీడియా పేర్కొన్నది. యాభై సంవత్సరాల లోపు వయస్సున్న ఓటర్లలో 69శాతం మద్దతు ఇస్తున్నట్లు, ఆఫ్రో-అమెరికన్‌ ఓటర్ల మొగ్గు కూడా పెరిగినట్లు వార్తలు వచ్చాయి. గత ఎన్నికల కంటే ఇవి నాలుగు రెట్లు ఎక్కువని, దీన్ని బట్టి ఓటర్లు ఎంత ఆసక్తిగా ఉన్నారో వెల్లడైందని విశ్లేషకులు పేర్కొన్నారు.ఇప్పుటికే ఓటు వేసిన వారిలో 58శాతం మమ్దానీకి వేసినట్లు, వేయాల్సివారిలో 45శాతం మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. ఏ రీత్యా చూసినా మమ్దానీ విజయం ఖాయం అని నిర్ణయించుకున్న తరువాత చివరి నిమిషంలో ే స్వంత పార్టీని పక్కన పెట్టి ట్రంప్‌ స్వతంత్ర అభ్యర్ధి ముసుగులో ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ తిరుగుబాటుదారుకు మద్దతు ప్రకటించాడని ఆ మేరకు కొన్ని ఓట్లు కుమోకు మళ్లినట్లు ఫలితాలు వెల్లడించాయి.మొత్తం నగరంలో నమోదైన ఓటర్ల సంఖ్య 47లక్షలు. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ పోటీ నుంచి మధ్యలో తప్పుకొని అదే పార్టీకి చెందిన తిరుగుబాటు అభ్యర్థి ఆండ్రూ కుమోకు మద్దతు ప్రకటించాడు.

మానవాళి చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ, ఎక్కడా విప్లవాలు చెప్పిరాలేదు, వాటికి ముహూర్తాలు, వాస్తు వంటివి కూడా లేవు. అనివార్యమని చరిత్రగమనాన్ని బట్టి గట్టిగా విశ్వసించటం తప్ప ఎక్కడ, ఎప్పుడు, ఎలా వస్తుందో కూడా తెలియదు.అన్నింటినీ మిమించి అంతిమంగా అడ్డుకోవటం ఎవరివల్లా కాదు. 2025 జూన్‌ 24వ తేదీ బుధవారం నాడు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ రాజధాని న్యూయార్క్‌ నగరంలో పిడుగుపాటు. విప్లవం అని వర్ణించటం అతిశయోక్తి అవుతుందిగానీ పెట్టుబడిదారులకు దడపుట్టించే పరిణామం జరిగింది. నగర మేయర్‌ ఎన్నికలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా జోహ్రాన్‌ మమ్‌దానీ(33) ఎన్నిక యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరిగింది. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని కోరుతూ 11 మంది పోటీపడ్డారు.తొలి రెండు దఫాలలో మమ్దానీ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ 50శాతంపైగా ఓట్లు రాకపోవటంతో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఇద్దర మధ్య మూడో రౌండులో న్యూయార్క్‌ రాష్ట్ర ఎంఎల్‌ఏ జహ్రాన్‌కు 56.39, రెండవ స్థానంలో ఉన్న న్యూయార్క్‌ మాజీ గవర్నర్‌, ఒక కార్పొరేట్‌ సంస్థకు అధిపతి అయిన అండ్రూ కుమోకు 43.61శాతం ఓట్లు వచ్చాయి. గత 36 సంవత్సరాలలో పెద్ద ఎత్తున డెమోక్రటిక్‌ పార్టీలో ఓటర్లు పాల్గనటం ఇదే ప్రధమం.

జోహ్రాన్‌ గెలిస్తే ఆర్థిక, సామాజిక విపత్తు సంభవిస్తుందని, అతను గెలిస్తే తాను నిబంధనలమేరకు తప్ప అదనపు నిధులు విడుదల చేసేది లేదని, తన మద్దతు డెమోక్రటిక్‌ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి మాజీ గవర్నర్‌ఆండ్రూ కుమోకు ఇస్తున్నట్లు సోమవారం రాత్రి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. కమ్యూనిస్టు జోహ్రాన్‌, చెడ్డ అభ్యర్థి కుమోలలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలి గనుక తాను కుమోనే ఎందుకున్నట్లు చెప్పాడు.వ్యక్తిగతంగా అతనంటే అభిమానం ఉందా లేదా అని కాదు, మరొక మార్గం లేదు గనుక కుమోను బలపరచాలి. మమ్దానీని ఓడించగలిగింది అతనే అని ట్రంప్‌ పేర్కొన్నాడు. ఒక అధ్యక్షుడిగా అదనంగా నిధులు ఇవ్వటం కష్టం, ఎందుకంటే మీరు గనుక కమ్యూనిస్టును ఎన్నుకుంటే నగరానికి ఇచ్చే నిధులన్నింటినీ మీరు వృధా చేసినట్లే అని ఒక టివీలో ట్రంప్‌ చెప్పాడు. వేయి సంవత్సరాలుగా విఫలమైన కమ్యూనిస్టు సిద్దాంతాన్ని మమ్దానీ అనుసరిస్తున్నాడని అన్నాడు.జోహ్రాన్‌ అభ్యర్ధిగా ఎన్నికైనప్పటి నుంచి అతను కమ్యూనిస్టు అని పదే పదే ట్రంప్‌ ఓటర్లను ఆకర్షించేందుకు, ఆ ముద్రతో కమ్యూనిస్టు వ్యతిరేేకతను రెచ్చగొట్టాలని చూశాడు.అతగాడికి కొమ్ము కాసే మీడియా యాజమాన్యాలు, వాటిలో పని చేసే యాంకర్లు రాజును మించిన రాజభక్తిపరులుగా మారారు.ఫాక్స్‌ న్యూస్‌ టీవీ యాంకర్‌ ఊగిపోతూ జోహ్రాన్‌ మమ్‌దానీ, అతని అనుచరులు కమ్యూనిస్టులు, తీవ్రవాదులు వారిని దెబ్బతీసేందుకు గతంలో కమ్యూనిస్టులపై విషం చిమ్మటంలో పేరు మోసిన జో మెకార్ధీని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నాడు. కొంత మంది తీవ్రవాదులను న్యూయార్క్‌ వంటి గొప్పనగరంలో ఎన్నిక కావటానికి అనుమతించకూడదని, నగరాన్ని నాశనం కానివ్వకూడదంటూ జోహ్రాన్‌ మీద విరుచుకుపడ్డాడు.కమ్యూనిస్టును కాదని ప్రజాస్వామిక సోషలిస్టును అని చెప్పుకుంటున్నాడు, అది ఏ తరహా ప్రజాస్వామ్యం అతను ఎన్నిక కావటాన్ని సహించకూడదని, ఏదో విధంగా అడ్డుకోవాలన్నాడు.జోహ్రాన్‌ గడ్డం ఉన్న కమలాహారిస్‌ అని నోరుపారవేసుకున్నాడు. ప్రచ్చన్న యుద్ధంలో అమెరికా గెలిచినప్పటికీ మార్క్సిజం బతికిందని దాంతో విశ్వవిద్యాలయాల్లోని టీచర్లకు ధైర్యం వచ్చిందన్నాడు. అందువలన వలస వచ్చేవారిని, సోషలిస్టు సిద్దాంతాలను ఎక్కించటాన్ని అడ్డుకోవాలి, కమ్యూనిస్టుకు ఓటువేయాలని, నగరనాశనాన్ని కోరుకొనే వారిని బయటకు నెట్టాలి. అందరం కూర్చుని కమ్యూనిస్టు ఎన్నికకాకుండా చూడాలి, అధికారికంగా నమోదు కాని, పౌరులు కాని వారు కూడా ఓట్లు వేస్తున్నారని ఆరోపించాడు.ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. అమెరికా తిరోగామి మీడియాలో ఇలాంటి వారు కోకొల్లలు.

డెమోక్రటిక్‌ పార్టీ కూడా కార్పొరేట్లకు అనుకూలమే కదా అలాంటి పార్టీలో జోహ్రాన్‌ వంటి పురోగామి వాదులు ఎలా ఉన్నారు అనే సందేహం రావటం సహజం. ఒక విధంగా అది మనదేశంలో కాంగ్రెస్‌ వంటిది. మన స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ సంస్థలో నాయకత్వ విధానాలను వ్యతిరేకించే వారు తమ పురోగామి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. దాని నేతలుగా ఉన్న ఇంఎంఎస్‌ నంబూద్రిపాద్‌, పుచ్చలపల్లి సుందరయ్య వంటి అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. అదే మాదిరి అమెరికా డెమోక్రటిక్‌ పార్టీలో పురోగామి విధానాలను ముందుకు తెచ్చేవారు డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. వారిలో ప్రముఖుడు సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ బహిరంగంగా తనను సోషలిస్టుగా ప్రకటించుకున్నాడు. అదే బాటలో జోహ్రాన్‌ మమ్‌దానీ వంటి యువకులు పెద్ద సంఖ్యలో సోషలిస్టులుగా ప్రకటించుకొన్నారు. వీరందరినీ కమ్యూనిస్టులుగా అక్కడి మీడియా, రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులు ముద్రవేస్తున్నారు. అభ్యర్థిగా ఎన్నికైన తరువాత జోహ్రాన్‌ ఒక కమ్యూనిస్టు పిచ్చోడని డోనాల్డ్‌ ట్రంప్‌ నోరుపారవేసుకున్నాడు.అమెరికా సమాజంలో ఒక మధనం జరుగుతున్నది. లక్షలాది మంది ఇటీవలి కాలంలో సోషలిస్టులం అని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. వారిని కమ్యూనిస్టులని ప్రచారం చేసినా ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. అక్కడి కార్మికవర్గం మార్పును కోరుకుంటున్నారని, వామపక్షం వైపు మొగ్గేందుకు సిద్దంగా ఉన్నట్లు, ఒక సామాజిక సంక్షోభానికి ఒక సూచికగా చెప్పవచ్చు. దీని అర్ధం తెల్లవారేసరికల్లా అధికారానికి రాబోతున్నారని కాదు.

జోహ్రాన్‌ అభ్యర్థిగా ఎన్నికైనట్లు ఫలితాల తీరు వెల్లడించగానే జరిగిన పరిణామాలు మనదేశంలో జరిగిందాన్ని గుర్తుకు తెచ్చాయి. కొన్ని పార్టీల వారు గతంలో సిపిఎం నేత జ్యోతిబసును ప్రధాని పదవికి సూచించగానే బాంబేక్లబ్‌గా పిలిచే బడాకార్పొరేట్‌ ప్రతినిధులందరూ సమావేశమై ఎట్టి పరిస్థితిలోనూ కానివ్వరాదని తీర్మానించారు. న్యూయార్క్‌ నగరానికి ఒక వామపక్షవాది మేయర్‌ కాగానే అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసే అవకాశం లేదు. అయినప్పటికీ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ లేదా జోహ్రాన్‌తో పోటీ పడిన కుమోను స్వతంత్ర అభ్యర్ధిగా నిలపాలని, రిపబ్లికన్‌ పార్టీ పోటీ చేయకుండా మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞాపనలతో పాటు 20 మిలియన్ల డాలర్లను వసూలు చేయాలని పిలుపు ఇచ్చారు. అభ్యర్ధి ఎన్నికలో జోహ్రాన్‌ ముందంజ గురించి తెలియగానే స్టాక్‌మార్కెట్లో కొన్ని కంపెనీల వాటాల ధరలు పడిపోయాయంటే ఎలాంటి కుదుపో చెప్పనవరం లేదు. మమ్దానీ ఇజ్రాయెల్‌ను గట్టిగా వ్యతిరేకించటమే కాదు, ఎన్ని విమర్శలు వచ్చినా పాలస్తీనా మద్దతుదారుగా ఉన్నాడు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు న్యూయార్క్‌ వస్తే అరెస్టు చేయించేందుకు వెనుకాడనని కూడా చెప్పాడు. అందుకనే ప్రత్యర్ధులు అతనికి యూదు వ్యతిరేకి అని ముద్రవేశారు. అయినప్పటికీ న్యూయార్క్‌లోని యూదులు పెద్ద సంఖ్యలో అతని అభ్యర్థిత్వానికి మద్దతుగా ఓటు చేశారని వార్తలు వచ్చాయి. మంగళవారం నాటి ఓటింగ్‌లో ముందే చెప్పుకున్నట్లు యూదులలో యువతరానికి చెందిన వారు 67శాతం మంది జోహ్రాన్‌కు ఓటు వేశారు. ట్రంప్‌ ఉక్రోషం గురించి చూశాం. నరేంద్రమోడీ న్యూయార్క్‌ వస్తే భేటీ అవుతారా అని విలేకర్లు ప్రచారం సందర్భంగా అడగ్గా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులందరూ లేదని అని ముక్తకంఠంతో చెప్పారు. బెంజమిన్‌ నెతన్యాహు మాదిరి నరేంద్రమోడీ కూడా గుజరాత్‌లో మారణకాండకు బాధ్యుడైన ఒక యుద్ద నేరగాడని జోహ్రాన్‌ కారణం చెప్పాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మేయర్‌ అయ్యాడంటే మనదేశంలోని కాషాయ దళాలు ఏ విధంగా స్పందిస్తాయో చెప్పనవసరం లేదు.చరిత్ర గతిని ఎవరూ ఆపలేరు.

కుమో పోటీకి దిగాలని నిర్ణయించినపుడే అతగాడు డోనాల్డ్‌ ట్రంప్‌తో సంబంధాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాను ట్రంప్‌ నుంచి ఎలాంటి సహాయం పొందటం లేదని అలాంటి ఆలోచన కూడా లేదని, పోటీ గురించి ట్రంప్‌తో మాట్లాడినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన వార్తలను తోసిపుచ్చాడు. ప్రముఖ మీడియా యజమాని జిమీ ఫింక్లెస్టయిన్‌ ఇంట్లో సమావేశమైన ట్రంప్‌ మద్దతుదార్లు చర్చించి కుమో ఎలా పోటీ ఇవ్వగలడో ట్రంప్‌కు నివేదించినట్లు కూడా న్యూయార్క్‌టైమ్స్‌ రాసింది. ట్రంప్‌తో నేరుగా మాట్లాడితే ఫలితం ఉంటుందేమో అని ఒక మద్దతుదారు కుమోను అడగ్గా ట్రంప్‌కు అన్నీ తెలుసు తనకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. మమ్దానీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే తనకు మద్దతు ఇవ్వాలని మరోపోటీదారు, ప్రస్తుత డెమోక్రటిక్‌ పార్టీ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ను కుమో కోరినట్లు వార్తలు. తరువాత అదే జరిగింది. కుమోను ట్రంప్‌ బలపరుస్తున్నాడని, ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిపేందుకు కుట్ర చేస్తున్నారని మమ్దానీ ప్రతినిధి డోరా పెకీ కొద్ది నెలల ముందే ఒక ప్రకటనలో హెచ్చరించారు.లక్షలాది మంది వలంటీర్లు అలాంటి ప్రయత్నాల మీద కన్నేసి ఉంచాలని మమ్దానీ మద్దతుదార్లు తగిన జాగ్రత్తలు తీసుకున్న కారణంగా అలాంటి దుస్సాహసానికి ట్రంప్‌ పూనుకోలేదు.

ట్రంప్‌ ప్రకటన తరువాత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డెమోక్రటిక్‌ పార్టీ నేత ఆండ్రూ కుమో స్పందిస్తూ రిపబ్లికన్‌ ఓటర్లు అధ్యక్షుడి మాట వింటారని భావిస్తున్నానని, ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలిచే మేయర్‌ మనకు కావాలని, న్యూయార్క్‌ నగరానికి నేషనల్‌ గార్డ్స్‌(మిలిటరీ) పంపే ముప్పు ఉన్నందున తాను సరైన అభ్యర్ధినని, మమ్దాని గనుక గెలిస్తే వెన్నలో వేడికత్తిని దింపినట్లు ట్రంప్‌ వ్యవహరిస్తాడని ఫాక్స్‌ న్యూస్‌తో చెప్పాడు.ట్రంప్‌ ప్రకటన తరువాత కొందరు రిపబ్లికన్‌ ఓటర్లు స్వంత అభ్యర్ధిని కాదని కుమోకు వేసినకారణంగానే సర్వేలకు భిన్నంగా అతనికి ఓట్లు పెరిగాయన్నది స్పష్టం. ఒక కమ్యూనిస్టును గాక న్యూయార్క్‌ ఒక చెడు డెమాక్రాట్‌ను ఎన్నుకోవాలని చెప్పటం సరైంది కాదని, తాను చెడ్డవాడిని కాదు, జోహ్రాన్‌ కమ్యూనిస్టు కాదని, ఒక సోషలిస్టు మాత్రమే అని అయితే నగరానికి సోషలిస్టు పనికి రాడని కుమో చెప్పుకున్నాడు. ప్రపంచ ధనికుల్లో ముందున్న ఎలన్‌ మస్క్‌ కూడా కుమో వైపు నిలిచినట్లు వెల్లడించాడు. అయితే ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి కర్టిస్‌ సిల్వా తాను పోటీ నుంచి తప్పుకోవటం లేదని ప్రకటించాడు. ఈ ఎన్నికల ప్రచారంలో అన్ని రకాల కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యతిరేక ప్రచారంతో పాటు ముస్లిం, పాలస్తీనా వ్యతిరేకతను కూడా రెచ్చగొట్టేందుకు ప్రత్యర్ధులు, మీడియా శతవిధాలా ప్రయత్నించాయి. ఇన్ని చేసినా ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు ప్రతిపక్ష అభ్యర్ధుల కంటే ఎక్కువ మంది మద్దతు జోహ్రాన్‌కు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. ఓటర్ల పరిణితిని ఎన్నికలు ప్రతిబింబించాయి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి కొనసాగుతున్న ఫెడరల్‌ ప్రభుత్వ స్థంభన కారణంగా పేదలు, సబ్సిడీ ఆహారం మీద ఆధారపడిన వారందరూ ఆకలితో మాడుతున్నట్లు వచ్చిన వార్తలను చూసిన తరువాత వారందరూ కూడా జోహ్రాన్‌కు మద్దతు ప్రకటించారని కనిపిస్తున్నది.

జోహ్రాన్‌ పక్కా కమ్యూనిస్టు అని ప్రకటించి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుట్రచేసి ఫలితాలను ప్రభావితం చేసేందుకు చూసినా ఓటర్లు అయితే మాకేంటి అన్నట్లుగా ఓటువేశారు. ప్రపంచ పెట్టుబడిదారుల కుంభస్థలం మీద తొలిసారిగా ఒక సోషలిస్టు గద్దెనెక్కాడు, 1892తరువాత ఒక యువమేయర్‌గా కూడా జోహ్రాన్‌ చరిత్రకెక్కాడు. మతకళ్లద్దాలతో చూసిన వారు తొలి ముస్లిం మేయర్‌ అవుతారంటూ చెప్పారు.ఒక పురోగామివాదిగా జోహ్రాన్‌ అసలు డెమోక్రటిక్‌ అభ్యర్ధిగా ఎన్నిక అవకుండా మొగ్గలోనే తుంచేందుకు ఆ పార్టీలోని మితవాద, పురోగామివాద వ్యతిరేకశక్తులు అన్ని విధాలుగా ప్రయత్నించాయి. డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులతో సహా ప్రతిపక్షం అంతా ఒక్కటి, జోహ్రాన్‌ ఒక్కడిగా రంగంలో ఉన్నాడు.ట్రంప్‌ చివరికి ఎంతగా దిగజారాడంటే తమ పార్టీ అభ్యర్ధి కర్టిస్‌ సిల్వాకు వేసే ఓటు జోహ్రాన్‌కు వేసినట్లుగానే పరిగణించాలన్నాడు. కొన్ని సమయాలలో కొందరు అన్నట్లుగా ఒక సోషలిస్టు విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు మిగతా సమయాలలో దెబ్బలాడుకొనే రిపబ్లికన్లు, డెమాక్రాట్లు ఎప్పుడైనా తమకే ఎసరు వస్తుందని భావిస్తే ఇద్దరు కలసిపోతారనేందుకు తాజా పరిణామం తార్కాణం.ఈ అంశం అనేక మందిలో భ్రమలను పోగొట్టి తామెటో నిర్ణయించుకొనేందుకు పనికి వస్తుందని, రానున్న రోజుల్లో డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాద శక్తులకు ఎదురుదెబ్బలు తగలటం అనివార్యమని చెప్పవచ్చు.ఆఫ్రికాలో జన్మించిన 34 ఏండ్ల జోహ్రాన్‌ గెలిస్తే ఒక దక్షిణాసియా సంతతి, ముస్లిం సామాజిక తరగతికి చెందటమే గాక తొలి సోషలిస్టు మేయర్‌గా చరిత్రకెక్కాడు. ప్రచారంలో డెమోక్రటిక్‌ సోషలిస్టును అని చెప్పుకున్నాడు తప్ప ఇతర అంశాలకు చెందిన మనోభావాలను ముందుకు తెచ్చేందుకు ప్రయతించకుండా ఎంతో హుందాగా వ్యవహరించాడని చెప్పవచ్చు. అతన్ని సోషలిస్టుగా వర్ణించినా తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని అనేక మంది చెప్పటం అమెరికా సమాజంలో వస్తున్న మార్పుకు నిదర్శనం.

జోహ్రాన్‌ తండ్రి మహమ్మద్‌ మమ్దానీ అమెరికాలో స్థిరపడిన గుజరాతీ మూలాలు ఉన్న ఉగాండా జాతీయుడు కాగా తల్లి ఒడిషాలో జన్మించిన పంజాబ్‌ హిందూ కుటుంబానికి చెందిన మీరా నాయర్‌(నయ్యర్‌ ) పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమా దర్శకురాలు, నిర్మాత. ఇజ్రాయెల్‌ హైఫా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి గౌరవ అతిధిగా వచ్చిన ఆహ్వానాన్ని 2013లో ఆమె తిరస్కరించారు. పాలస్తీనా ఆక్రమణనుంచి వైదొలిగినపుడు, జాత్యంహంకారాన్ని వీడినపుడు మాత్రమే ఇజ్రాయెల్‌ గడ్డమీద అడుగుపెడతానని చెప్పారు. జోహ్రాన్‌ వాగ్దానాల విషయానికి వస్తే తనను ఎన్నుకుంటే న్యూయార్క్‌ నగరంలో అద్దెలను స్థంభింప చేస్తానని, పేదలకు ఇండ్లు నిర్మిస్తానని, లాభనష్టాలు లేని ప్రాతిపదిక నగరపాలక సంస్థ సూపర్‌మార్కెట్లను ఏర్పాటు చేస్తానని, 2030 నాటికి గంటకు 30 డాలర్ల కనీసవేతన అమలు జరిగేట్లు చూస్తానని, అందరికీ అందుబాటులో ఉండే శిశు సంరక్షణా కేంద్రాల ఏర్పాటు వంటి తన వాగ్దానాల అమలుకు అవసరమైన పదిబిలియన్‌ డాలర్ల సొమ్మును ధనికుల మీద అదనంగా పన్నులు వేసి సమీకరిస్తానని చెప్పాడు.వలసవచ్చిన కుటుంబాల వారికి రక్షణ కల్పిస్తానని వాగ్దానం చేశాడు. ఇతగాడిని డెమోక్రటిక్‌ పార్టీలోని కార్పొరేట్‌ అనుకూల శక్తులు ఏదో ఒక సంస్కరణవాది అని సరిపెట్టుకోలేదు, వర్గపోరాటాన్ని ప్రోత్సహించే విప్లవవాదిగా చూశారు. ఆ పార్టీలో చేయి తిరిగిన పెద్దలు, మితవాదులు, కార్మిక, కార్పొరేట్‌ శక్తులు ఏకమై అనేక తప్పుడు ప్రచారాలు చేశారు.

జొహ్రాన్‌ పూర్తి పేరు జొహ్రాన్‌ క్వామే మమ్దానీ. తండ్రి మహమ్మద్‌ మమ్దానీ ఒక గుజరాతీ ముస్లిం కుటుంబంలో 1946లో ముంబైలో జన్మించాడు. తరువాత ఆఫ్రికాలోని ఉగాండాకు ఆ కుటుంబం వలస వెళ్లింది. ఉగాండాలో ఉండగా 1963లో అమెరికాలో విద్య స్కాలర్‌షిప్‌ రావటంతో అక్కడ చదువుకున్నాడు. తరువాత ఉగండా వెళ్లి అక్కడ బోధనావృత్తిలో చేరాడు. సినిమా దర్శకురాలు మీరా నయర్‌ తన సినిమా ” మిస్సిసిపీ మసాలా ” కోసం ఉగాండాలో పరిశోధనకు వెళ్లినపుడు 1988లో అక్కడ పరిచయమైన మహమ్మద్‌ హిమ్దానీని ఆమె రెండవ వివాహంచేసుకున్నారు. వారికి అక్కడే 1991లో జోహ్రాన్‌ జన్మించాడు.ఘనా తొలి అధ్యక్షుడు క్వామే అంటే అపరిమిత అభిమానంతో తమ కుమారుడి పేరులో క్వామే చేర్చారు. ఆ కుటుంబం తరువాత కొంత కాలం దక్షిణాఫ్రికాలో కూడా ఉంది, తరువాత అమెరికా వచ్చింది.2018లో జోహ్రాన్‌కు అమెరికా పౌరసత్వం వచ్చింది.రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో 2020లో తొలిసారిగా న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు,2024లో మూడవసారి ఎన్నికై ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నాడు. ఆచరణ సాధ్యంగాని వాగ్దానాలు చేసినట్లుగా జహ్రాన్‌ అభ్యర్ధిత్వాన్నే జీర్జించుకోలేని అదే పార్టీకి చెందిన ప్రస్తుత న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ఉక్రోషం వెలిబుచ్చాడు. చివరికి అనుకున్నదంతా జరిగింది, ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటాడో తెలియదు. జహ్రాన్‌ మమ్దానీ వందశాతం కమ్యూనిస్టు పిచ్చోడు, మేయర్‌ అయ్యేదారిలో ఉన్నాడు అని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమంలో గతంలోనే పోస్టు పెట్టాడు. జోహ్రాన్‌ ఎన్నికను అడ్డుకొనేందుకు కొందరు 1954నాటికి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టానికి దుమ్ముదులిపి జోహ్రాన్‌ పౌరసత్వాన్ని రద్దు చేసి ఉగాండాకు పంపే అవకాశాలను పరిశీలించాలని వత్తిడి తెచ్చారు. ఈ మేరకు మీడియాలో విశ్లేషణలు చేశారు. వీలుగాక ఊరుకున్నారు.

న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక అమెరికా చరిత్రలో ఒక ప్రత్యేక పేజీకి నాంది పలికింది. ఇటీవలి కాలంలో ఫాసిస్టు ధోరణులు పెరుగుతున్న పూర్వరంగంలో కార్మికవర్గం వామపక్ష అభ్యర్ధివైపు మొగ్గటం యావత్‌ పురోగామిశక్తులకు ఉత్సాహం ఇచ్చే పరిణామం. అమెరికాలో నిజమైన సోషలిస్టు శక్తుల పెరుగుదలకు తోడ్పడే పరిస్ధితి కనిపిస్తున్నది. డెమోక్రటిక్‌ సోషలిస్టులు ముందుకు తెస్తున్న సంస్కరణలనే మీడియా, శత్రువులు సోషలిజం, కమ్యూనిజం అని చిత్రిస్తున్నారు. వాటికి ఉండే పరిమితులను కార్మికవర్గం అర్ధం చేసుకున్న తరువాత శాస్త్రీయ సోషలిజం కోసం మరింత ముందుకు పోవటం తప్ప మరొక మార్గం లేదు. డెమోక్రటిక్‌ పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించేది ఇప్పుడున్న నాయకత్వం కాదని దేశ కార్మికవర్గమేనని డెమోక్రటిక్‌ సోషలిస్టు సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ వ్యాఖ్యానించాడు.భారత్‌ మూలాలున్న జోహ్రాన్‌ భారతీయుడి కంటే పాకిస్తానీగా ఎక్కువ హడావుడి చేస్తున్నాడని బిజెపి ఎంపీ కంగనా రనౌత్‌ నోరుపారవేసుకున్నారు. అతని హిందూ గుర్తింపు లేదా రక్తం సంగతి పక్కన పెడితే హిందూయిజాన్ని లేపేసేందుకు అతను ఇప్పుడు సిద్దంగా ఉన్నట్లు ఆరోపించారు. అసలు ఉక్రోషం ఏమిటంటే నరేంద్రమోడీని యుద్ధ నేరస్తుడని వర్ణించటమే అనివేరే చెప్పనవసరం లేదు. కొసమెరుపు ఏమంటే ప్రపంచంలోనే పిన్నవయస్కురాలైన మేయర్‌గా తిరువనంతపురంలో ఎన్నికైన సిపిఎం నాయకురాలు 21ఏండ్ల ఆర్య రాజేంద్రన్‌ను గతంలో అభినందిస్తూ జోహ్రాన్‌ చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ ఒక కమ్యూనిస్టును అభినందించిన ఇతగాడు కూడా కమ్యూనిస్టే అంటూ విద్వేషాన్ని వెళ్లగక్కారు. డోనాల్డ్‌ ట్రంప్‌ జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇంటా బయటా అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. వాటిలో ఒక ప్రధాన అంశంగా న్యూయార్క్‌ నగర మేయర్‌గా జోహ్రాన్‌ మమ్దానీ ఎన్నికను అడ్డుకోవటం కూడా ఉంది. బహుశా అమెరికా అధ్యక్షుల చరిత్రలో గడచిన శతాబ్ది కాలంలో మరొకరెవరికీ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని చెప్పవచ్చు. ఈ ఎన్నికల ఫలితం, పర్యవసానాలు వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల మీద కూడా ప్రభావం చూపవచ్చు అని చెబుతున్నారు. ఆ కారణంగానే ట్రంప్‌ స్వంత పార్టీ అభ్యర్థిని పక్కన పెట్టటమే కాదు, అతగాడికి ఓటేస్తే జోహ్రాన్‌కు ఓటేసినట్లే అని చెప్పేంతవరకు వెళ్లాడు.చిత్రం ఏమిటంటే ట్రంప్‌ను వ్యతిరేకించిన ఎలన్‌ మస్క్‌ కూడా ఇదే చెప్పాడు. మహాభారతంలో అభిమన్యుడిని అంతం చేసేందుకు చూసినట్లు జోహ్రాన్‌ ఓటమికి అన్ని రకాల శక్తులు ఏకమైనా సర్వేలు అతనికి అనుకూలంగా చెప్పాయి.ఈ అభిమన్యుడు కుట్రలను వమ్ము చేసి పద్మవ్యూహం నుంచి జయప్రదంగా బయటపడి విజయదుందుభి మోగించాడు. అమెరికాలో సరికొత్త రాజకీయాలకు నాంది పలికాడని చెప్పవచ్చు. డెమోక్రటిక్‌ పార్టీలో ఉన్న పురోగామి శక్తులు మరింతగా తమ స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు ఈ విజయం ఎంతగానో తోడ్పడుతుంది. ఆ క్రమం కొద్ది సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.పార్టీలోని కార్పొరేట్ల ప్రతినిధులతో ఘర్షణ పడుతున్నారు. అలాంటి వారికి ఈ పరిణామం ఎంతో ఊపునిస్తుంది, సమీకరణ వేగం పుంజుకుంటుంది. ఏ పరిణామాలకు ఇది నాంది పలికిందో ముందు ముందు చూస్తాం !

ఎనిమిదవ వేతన సంఘం చివరిదా : ఉద్యోగులకు ముప్పు పొంచి ఉందా ! రంగంలోకి దిగిన వ్యతిరేక విశ్లేషకులు !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన కమిషన్‌ నియామకం చేసింది. ఈమేరకు నవంబరు మూడవ తేదీన గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ రోజు నుంచి పద్దెనిమిది నెలల్లో నివేదికను సమర్పించాలని దానిలో నిర్దేశించారు. నరేంద్రమోడీ సర్కార్‌ ఏర్పాటు చేసిన తొలి సంఘం ఇది. ఈ క్రమాన్ని చూసినపుడు ప్రతిదాన్నీ ఓట్ల కోసం ఎలా వినియోగించుకుంటున్నారో దీన్లో కూడా చూడవచ్చు.ఏడవ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరిలో నియమించగా 2015 నవంబరులో నివేదిక సమర్పించింది. ఈ లెక్కన ఈ పాటికి ఎనిమిదవ వేతన సంఘనివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందాల్సి ఉంది. దూరాలోచన లేదా దుష్టాలోచనతో ఎన్నికల కోసం ఆలశ్యం చేశారనిపిస్తోంది. సరిగ్గా ఢిల్లీ ఎన్నికలకు ముందు ప్రకటన చేశారు. ఇప్పుడు బీహార్‌ ఎన్నికల సందర్భంగా కమిషన్‌ నియామకాన్ని ప్రకటించారు. దీని సిఫార్సులు, కేంద్రం పరశీలించి అమలు చేయాల్సిన సమయానికి లోక్‌సభ ఎన్నికలు వస్తాయి. ఈ కమిషన్‌ సిఫార్సులు 2028లోగా అమల్లోకి వచ్చే అవకాశం లేదని సీనియర్‌ అధికారులు చెబుతున్నారంటే దాని అర్ధం అదే.మరొక ప్రమాదం ఏమిటంటే బకాయిలను ఎగవేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఎన్నికల ముందు అమలు చేసి చూశారా మీకు ఎంత మేలు చేశామో, దానికి మాకేమిటి అని అడిగేందుకు ఒక ప్రచార అస్త్రంగా ఉండనుంది. ఏడవ వేతన కమిషన్‌ 2015 నవంబరులో నివేదికను అందచేస్తే 2016 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.ఒక వైపు డిజిటల్‌ రంగంలో ముందున్నాం అంటారు. వివరాలు తెప్పించుకొనేందుకు ఎన్ని సంవత్సరాలు కావాలి ? అసలు విషయం ఏమిటంటే ప్రతి వేతన సంఘం వేసినపుడు వేతనాలు, పెన్షన్లు, బకాయిల చెల్లింపుకు బడ్జెట్‌ కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. ఎన్నికల ముందు అది ప్రభుత్వానికి పెద్ద అగ్ని పరీక్షే. బీహార్‌లో బిజెపి చంకనెక్కిన నితీష్‌ కుమార్‌ దశాబ్దాల పాలనలో కనీసం ఆలోచించని అంశాలను కూడా ఆఘమేఘాల మీద అమలు చేశారు. చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల సమయంలో మహిళలను ఆకట్టుకొనేందుకు పసుపు కుంకుమల పేరుతో చేసిన మాదిరి రెండు కోట్ల మంది మహిళలకు తలా పదివేల చొప్పున వారి ఖాతాలకు బదిలీ చేశారు. సామాజిక పెన్షన్ల పెంపు ప్రకటన చేశారు. ఇవన్నీ సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు కొద్ది రోజుల ముందు జరిగాయి. ఓట్లకోసం మేము ఏదీ చేయం అని నరేంద్రమోడీ చెప్పేదానికి – ఆచరణకు ఇది నిదర్శనం. అయితే కూటికోసం కోటి విద్యలు అన్నట్లుగా వేస్తున్న వేషాలను చూసి జనం ఓట్లేస్తారా ? నిజంగా అలా జరిగి ఉంటే అయోధ్యలో బిజెపి ఎందుకు ఓడిపోయింది, కాశీ విశ్వనాధుని సన్నిధిలో 4.79లక్షల నుంచి 1.52లక్షల ఓట్లకు మోడీ మెజారిటీ ఐదేండ్లలో ఎందుకు తగ్గిపోయింది ? పదేండ్లకు ఒకసారి నియమిస్తున్న వేతన సంఘం ఉద్యోగులు, పెన్షనర్ల మీద ఖర్చు ఎలా తగ్గించాలా అని చూస్తున్నది, అయితే సంఘటితంగా ఉద్యోగులు ఉన్న కారణంగా వాటి అజెండా పూర్తిగా అమలు చేయటం సాధ్యం కావటం లేదు. ఇప్పుడు కూడా అదే జరగనుందా ?

వేతన, పెన్షన్‌ బిల్లుల గురించి గుండెలు బాదుకుంటూ మీడియాలో విశ్లేషణలు రాస్తున్నారు. వంది మాగధులు రాజుగారి మనసెరిగి వ్యవహరిస్తారన్నది తెలిసిందే. ఇదీ అంతే ! వేతనాలకు మించి పెన్షన్‌ బిల్లు పెరిగిపోతోందన్నది వాటిలో ఒకటి. భవిష్యత్‌లో ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్లను వారు అందించిన సేవలు, డిజిటల్‌ పాలన మైలురాళ్లు, పౌరుల సంతృప్తి సూచికల ప్రాతిపదికన ఇవ్వాలని ఆర్థికవేత్తలు సలహా ఇస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగ చరిత్రలో ఎనిమిదవ వేతన సంఘ కసరత్తు పెనుసవాళ్లతో కూడిన వాటిలో ఒకటిగా రూపుదిద్దుకుంటున్నదట. కోటీ ఇరవై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లే కాదు, అంతకంటే ఎక్కువగా ఉండే రాష్ట్రాల సిబ్బంది మీద కూడా ఈ కమిషన్‌ సిఫార్సుల ప్రభావం పడనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50లక్షల మంది వరకు ఉండగా పెన్షనర్లు 69లక్షల మంది ఉన్నారని, రాబడిలో 18శాతం వేతనాలు, పెన్షన్లకే పోతున్నదని, ఒకవైపు పొదుపు మరోవైపు న్యాయమైన వేతన సవరణ డిమాండ్ల మధ్య పోరు జరగనుందని చెబుతున్నారు. ప్రైవేటు రంగానికి నిపుణులైన వారు వెళుతున్నందున ప్రభుత్వ రంగానికి వారిని ఆకర్షించేందుకు 1990దశకం నుంచి ప్రతి వేతన కమిషన్‌ సిఫార్సులలో వేతన వృద్ధి దేశ తలసరి ఆదాయవృద్ధి రేటుకంటే ఎక్కువగా ఉంటున్నదట. వేతన, పెన్షన్‌ ఖర్చు పెరిగిపోవటం వలన మౌలిక సదుపాయాలు, విద్య,ఆరోగ్య రంగాలకు నిధుల కొరత ఏర్పడుతున్నదట. ఒక ఏడాది కాగానే ఇంక్రిమెంట్‌, కరువు భత్యం వాయిదాలు చెల్లించటం కాకుండా సామర్ధ్యం, ఉత్పాదకత ప్రమాణాలు దాటిన తరువాతే ఇవ్వాలని కొందరు సూచిస్తున్నారు.దానికి అనుగుణంగానే జస్టిస్‌ రంజనా దేశారు ఆధ్వర్యంలోని ఎనిమిదవ వేతన కమిషన్‌కు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు ఉన్నాయి. వీటిని చూసిన తరువాత ఇదే చివరి వేతన సంఘం అన్న వారు కూడా ఉన్నారు. పరిహారం చెల్లింపు విషయంలో నూతన నమూనాలను పరిశీలించాలని, జవాబుదారీతనం, సామర్ధ్యం ప్రతిఫలించాలని వాటిలో పేర్కొన్నారు. వీటిని ఎవరూ వ్యతిరేకించటంలేదు, అనుసరించే కొలబద్దలేమిటన్నదే సమస్య. ఉదాహరణకు పశువుల మూతికి చిక్కాలు కట్టి బీళ్లలో మేతకు వదలినట్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ విస్తరణకు అనేక ఆటంకాలను కల్పించి, తీరా ప్రయివేటు సంస్థలు ముందుకు పోయేందుకు అవకాశం కల్పించి అసమర్ధ సంస్థగా చిత్రించిన తీరును మనం చూశాం. అంటే అలాంటి సంస్థలలో పని చేసే సిబ్బందికి సామర్ధ్యం లేదని, తగిన ఉత్పాదకతను చూపటం లేదనే పేరుతో వేతన పెంపుదలను నిరాకరిస్తే అది న్యాయమైనదేనా ?

గతంలో బిజెపి నేత వాజ్‌పాయి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం 2004లో అమల్లోకి తెచ్చిన నూతన పెన్షన్‌ పథకం(ఎన్‌పిఎస్‌) తరువాత కూడా పెన్షన్‌ బిల్లు పెరగటానికి సగటు జీవితకాలం పెరగటం ఒక కారణం. ఈ పెన్షన్‌ విధానం ద్వారా బిల్లు తగ్గాలంటే 2040 వరకు ఆగాల్సిందే,ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ వార్షిక పెన్షన్‌ బిల్లు రు.2.6లక్షల కోట్లు దాటింది. విదేశీ కంపెనీలు, స్వదేశీ కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలు మొత్తం తిరిగి దేశంలో పెట్టుబడులుగా రావటం లేదు, ఇతర దేశాలకు చేరుతున్నాయి. విదేశీ పెట్టుబడుల ముసుగులో మరిన్ని రాయితీలు పొందేందుకు తిరిగి ఇక్కడికే చేరుతున్నాయి లేదా ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడికి వెళుతున్నాయి. కానీ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే మొత్తాలు అలాంటివి కాదే, నల్లధనంగా మారి స్విస్‌ వంటి పన్ను స్వర్గాలకు చేరటం లేదు. ఇక్కడే వస్తు, సేవల వినియోగానికి జీవితకాలంలో ఒక స్వంత ఇంటిని, పరిమితంగా బంగారం, ఇతర ఆస్తులను కూడబెట్టుకొనేందుకు వినియోగపడుతుంది. జిఎస్‌టి రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి చేరుతున్నది.

ప్రకటించిన వివరాల మేరకు పద్దెనిమిది నెలల్లో నివేదిక అంటే సమర్పణకే 2027 ఏప్రిల్‌ వరకు ఆగాల్సిందే. ఇతర కారణాలు చూపి ఆలశ్యం చేస్తే చేయగలిగిందేమీ లేదు. మధ్యంతర నివేదికను కూడా ప్రకటించవచ్చు. నూతన వేతనాలు 2026 జనవరి ఒకటి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. వేతన కమిషన్‌ ఇంతవరకు ఉద్యోగుల ముందు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. అయితే ఫిట్‌మెంట్‌ ఫాక్టర్‌ 2.86ప్రకారం రు.19వేల వరకు వేతనాలు పెరగవచ్చని కొందరు చెబుతున్నారు. గత వేతన కమిషన్‌ 2.57ను తీసుకుంది. దాని ప్రకారం మూల వేతనం రు.7 నుంచి 18వేలకు పెరిగింది. ఇప్పుడు రు.18 నుంచి రు.46,260, పెన్షన్‌ రు.9 నుంచి రు.23,130కి పెరగవచ్చని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే కేంద్ర మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాస్‌ చంద్ర గార్డ్‌ ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ 1.92గా ఉండవచ్చని, కనీస వేతనం రు.34,500 అవుతుందని చెప్పారు. మధ్య స్థాయిలో ఉండే ఉద్యోగివేతనం ప్రస్తుతం రు. ఒక లక్ష ఉన్నదని, వేతన పెంపుదల శాతాన్ని బట్టి దానికి అదనం అవుతుందని భావిస్తున్నారు.ఉదాహరణకు ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ 2.5 అనుకుంటే అది రెండున్నర లక్షలు అవుతుంది. కమిషన్‌ ఎలాంటి సిఫార్సులు చేసినప్పటికీ దాన్ని ప్రభుత్వం సవరించవచ్చు.

దేశంలో తొలి వేతన కమిషన్‌ 1946లో ఏర్పాటు చేశారు. శ్రీనివాస వరదాచారి చైర్మన్‌. కనీస వేతనంగా రు.55, గరిష్టవేతనం రు.2,000 సిఫార్సు చేశారు. ఏడవ వేతన సంఘం కనీస, గరిష్ట వేతనాలు రు.18,000 మరియు రు.2,50,000గా ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా 1957లో ఏర్పాటైన రెండవ కమిషన్‌ కరువు భత్యాన్ని సిఫార్సు చేసింది. 1983ల ఐదవ వేతన కమిషన్‌ ఇంటి అద్దెను సిఫార్సు చేసింది. నాలుగవ వేతన సంఘం అంతకు ముందు ఏడాదికి నాలుగుసార్లు డిఏ ప్రకటించే విధానాన్ని రద్దు చేసి ఏడాదికి రెండు సార్లు ప్రకటించేట్లు సిఫార్సు చేసింది. నూతన వేతన సంఘనియామకానికి ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పదిహేను డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి.వాటిని వేతన సంఘం పరిగణనలోకి తీసుకొని మధ్యంతర సిఫార్సులు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. జీవన వేతన అవగాహనకు అనుగుణంగా కనీస వేతన నిర్ణయం ఉండాలని, ఒకటి నుంచి 4వ స్థాయి వరకు విలీనం చేయాలని, మధ్యంతర భృతి, నూతన పెన్షన్‌ విధాన రద్దు వంటివి వాటిలో ఉన్నాయి. ఎనిమిదవ వేతన సంఘం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే వేతన సంఘం అంటే వేతనాలు, పెన్షన్లు, అలవెన్సులను సిఫార్సు చేయటమే కాదు.ఇప్పుడు దేశంలో అమలు జరుగుతున్న విత్తనమూనా తట్టుకొని నిలుస్తుందా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంటుందని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారంటే ఏదో ముప్పు మూడినట్లే కనిపిస్తోంది. 2026 జనవరిలోగా ఉద్యోగవిరమణ చేసే వారికి నూతన వేతనాలు, పెన్షన్లు వర్తిస్తాయా లేదా అన్నది అనుమానమే. అందువలన ఈ వేతన సంఘం 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి దాని మిత్రపక్షాలకు ఒక అగ్నిపరీక్షగా మారనుందని కూడా చెప్పవచ్చు.