Tags
#Modani, Adani bribery, BJP, crony capitalism, Gautam Adani, Gautam Adani Devised Bribery Scheme, Narendra Modi, US cases on Adani
ఎం కోటేశ్వరరావు
జనం కళ్లుమూసుకొని ఉన్నంత వరకు ఎవరేమనుకుంటే నాకేం అనుకొనే వాళ్లు రెచ్చిపోతూనే ఉంటారు. వివాదాస్పద కార్పొరేట్ అధిపతి అదానీ కంపెనీల అవకతవకల గురించి ఏ సంస్థ లేదా ఎవరైనా వెల్లడిస్తే వెంటనే బిజెపి, దాని అనుచరగణం, అమ్ముడు పోయిన మీడియా పెద్దలు కొందరు దేశ సార్వభౌమత్వం మీద జరుగుతున్న కుట్ర అంటూ గోలగోల చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే మాకు అధికారం రాకముందే అదానీ పెరిగాడు, అతనికీ మాకు సంబంధం ఏమిటి అని అడ్డంగా బిజెపి మాట్లాడుతుంది. అదానీ కంపెనీలు ఎప్పటి నుంచో ఉన్నమాట నిజం, గత పదేండ్లలో అతని కంపెనీల విస్తరణను చూస్తే ‘‘మోదానీ’’ ని విడదీసి చూడలేము. తాజాగా అమెరికా న్యాయశాఖ, సెక్యూరిటీలు మరియు ఎక్సేంజ్ కమిషన్(సెక్) దాఖలు చేసిన కేసుల వెనుక కుట్ర ఉందని బిజెపి అంటోంది. అమెరికాలో కేసులు ఏమౌతాయి ? రాజు తలచుకుంటే దెబ్బలకూ నజరానాలకూ కొదవ ఉండదు. నరేంద్రమోడీ మధ్య ఉన్న స్నేహంతో డోనాల్డ్ ట్రంప్ అక్కడి న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తారా ? ఏం జరుగుతుందో తెలియదు గానీ అలా చేస్తే అమెరికా పరువు గోవిందా ? కేసులు ఏమైనా అక్కడి మదుపుదార్లు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అదానీ కంపెనీ ఇచ్చిన లేదా వాగ్దానం చేసిన 26.5కోట్ల డాలర్లు లేదా 2,200 కోట్ల రూపాయల ముడుపుల గురించి విచారణ జరిపేందుకు సుముఖత కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడలేదు.కొన్ని దేశాలు వెంటనే స్పందించిన తీరు చూస్తే మోడీ సర్కార్ మౌనం ఎందుకో వేరే చెప్పనవసరం లేదు.
నరేంద్రమోడీ విదేశాలలో మనదేశ ప్రతిష్ట పెంచేందుకు పర్యటనలు చేసినట్లు చెప్పినప్పటికీ అవి అదానీ కోసం చేసిన యాత్రల్లా ఉన్నాయి, ఎక్కడికి మోడీ వెళితే అక్కడ అదానీ ప్రత్యక్షం.ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్,గ్రీస్, మయన్మార్, ఇండోనేషియా, ఇజ్రాయెల్, కెన్యా, టాంజానియా, నేపాల్,శ్రీలంక ఇలా అనేక ఉదంతాలు బహిరంగంగా తెలిసినవే ఉన్నాయి. అమెరికా కేసుల గురించి తెలియగానే అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి దర్యాప్తు జరపాలని ఆస్ట్రేలియాకు చెందిన బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ తరఫున అదానీ(పై నిఘా) వాచ్ నిర్వహిస్తున్న సమన్వయకర్త జెఫ్ లా ఆ దేశ ప్రధాని అల్బనీస్‌కు విజ్ఞప్తి చేశాడు. ఆస్ట్రేలియాలో వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తూ పన్నులు ఎగవేసేందుకు లేదా నామమాత్రంగా చెల్లించేందుకు వీలుగా బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ వంటి ‘‘పన్నుల స్వర్గాల’’లో కంపెనీలు ఏర్పాటు చేశారని, ఈ విషయాల్లో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ప్రముఖుడని హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడిరచిందని , అంతకు ముందు 2017లోనే ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఏబిసి సందిగ్దమైన అదానీ కంపెనీల గురించి బయటపెట్టిందని అన్నాడు.గత ప్రభుత్వాలు 2009 నుంచి 2024వరకు కుదుర్చుకున్న వివిధ ఒప్పందాలు, వాటి మీద వచ్చిన ఆవినీతి ఆరోపణల గురించి సమీక్ష, దర్యాప్తు చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం విశ్రాంత హైకోర్టు జడ్జితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.వీటిలో అదానీ కంపెనీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలు కూడా ఉన్నాయి. వీటిలో మనదేశంలో 1,234 మెగావాట్ల గొడ్డా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు కూడా ఉంది. దీని నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన చట్టం ప్రకారం ఎగుమతికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన గొడ్డా విద్యుత్‌ను మన మార్కెట్లో కూడా విక్రయించుకొనేందుకు వీలు కల్పించింది. దీంతో బంగ్లాదేశ్ ఆందోళన వెల్లడిరచింది.ఇలాంటి విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదు. బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్న రaార్కండ్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఉత్పత్తి మొత్తాన్ని బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తారు. చిత్రం ఏమిటంటే దీనికి అవసరమయ్యే బొగ్గును తొమ్మిదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాలోని అదానీ గనుల నుంచి రవాణా చేసి ఒడిషాలోని అదానీ పోర్టుకు చేర్చి ఇక్కడ వినియోగిస్తారు. ఆ కేంద్రాన్ని బంగ్లాదేశ్‌లోనే నిర్మించవచ్చు. మనకు కాలుష్యాన్ని పంచి అదానీకి లాభాలు తెచ్చే ఈ ప్రాజెక్టును మోడీ సర్కార్ ఆమోదించింది. దీని కోసం ప్రత్యేకంగా రైలు మార్గాన్ని విస్తరించి అదానీకి అప్పగించింది. బంగ్లాదేశ్‌తో ఒప్పందం కుదిరిన తరువాత పన్నురాయితీలు ఇచ్చేందుకు ప్రత్యేక ఆర్థిక జోన్‌గా గుర్తింపు ఇచ్చింది. అదానీ కంపెనీకే ఎక్కువ లాభం కలిగే ఆ ప్రాజక్టు వద్దని స్వదేశంలో వ్యతిరేకత వెల్లడైనా నాటి ప్రధాని హసీనా ఒప్పందం చేసుకున్నారు.బంగ్లాలో తయారయ్యే విద్యుత్ ధర కంటే ఐదు రెట్లు ఎక్కువ చెల్లించటంతో పాటు, విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా పాతికేండ్లలో 45కోట్ల డాలర్లను అదానీకి చెల్లించాల్సి ఉంటుంది.కొత్త ప్రభుత్వం దీన్ని సమీక్షిస్తామని ప్రకటించింది.
అదానీ కంపెనీలతో కుదుర్చుకున్న 250 కోట్ల డాలర్ల విలువ గల ఒప్పందాలను రద్దు చేస్తూ కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించాడు. అమెరికా కేసుల వార్త తెలియగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటిలో జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండవ రన్‌వే, విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణం వంటివి ఉన్నాయి. ఈ లావాదేవీల గురించి తనకు దర్యాప్తు సంస్థలు, భాగస్వామ్య దేశాల నుంచి వచ్చిన కొత్త సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూటో చెప్పాడు. ఈ ఒప్పందాలలో పారదర్శకత లేదని, జనం సొమ్ము దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు, మీడియా ధ్వజమెత్తాయి. కెన్యా ఒప్పందాలు ఎలా జరిగాయో చూస్తే అదానీ కోసం నరేంద్రమోడీ తన అధికారాన్ని ఎలా వినియోగించారో అర్ధం చేసుకోవచ్చు. అదానీ కంపెనీల అక్రమాల గురించి హిండెన్‌బర్గ్ పరిశోధనా సంస్థ నివేదిక వెల్లడి తరువాత కూడా అధ్యక్షుడు రూటో ఒప్పందాలను గట్టిగా సమర్థించాడు.చిత్రం ఏమిటంటే అదానీతో ఒప్పందాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించటానికి కొద్ది గంటల ముందు కెన్యా విద్యుత్ శాఖ మంత్రి ఓపియో వాండాయ్ పార్లమెంటు సభ్యులతో మాట్లాడుతూ ఒప్పందంలో ఎలాంటి అవినీతి లేదు గనుక విద్యుత్ లైన్ల నిర్మాణం ముందుకు సాగుతుందని ప్రకటించాడు. కెన్యా అధ్యక్షుడు రూటో 2023 డిసెంబరు ఐదున ఢల్లీిలో ప్రధాని నరేంద్రమోడీని కలుసుకున్నారు.హైదరాబాద్ హౌస్‌లో వారి భేటీ సందర్భంగా అక్కడ గౌతమ్ అదానీ ప్రత్యక్షం. మోడీఅదానీ మధ్య ఎంత సాన్నిహిత్యం లేకపోతే ఇద్దరు దేశాధినేతల మధ్య దూరగలరు ?
డిసెంబరులో మోడీరూటో భేటీ, మూడునెలలు తిరక్కుండానే ఈ ఏడాది మార్చినెలలో నైరోబీ విమానాశ్రయ రెండవ రన్‌వే ఏర్పాటుకు అదానీ కంపెనీ డిపిఆర్ సమర్పించటం వెంటనే ఆమోదం చకచకా జరిగిపోయాయి. అంతిమ ఒప్పందం మినహా ముఫ్సై సంవత్సరాల కౌలు అవగాహన, ఇతర నిబంధనల మీద ఏకీభావం కుదిరింది. దీని మీద దేశంలో గగ్గోలుతో రూటో పరువు పోయింది. దాని వివరాలు బయటకు పొక్కనీయలేదు. జూలైనెలలో ఒక వ్యక్తి సామాజిక మాధ్యమంలో దీని గురించి పోస్టు పెట్టటంతో మరింత రచ్చయింది.సెప్టెంబరు పదకొండున విమానాశ్రయ సిబ్బంది ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సమ్మె చేశారు. ఒప్పందం ప్రకారం ఉద్యోగాలు పోవటంతో పాటు కెన్యా పౌరులకు బదులు ఇతర దేశాల వారిని విమానాశ్రయ సిబ్బందిగా నియమించుకొనేందుకు అవకాశం ఉంది.లాభాలను దేశం వెలుపలకు తరలించవచ్చు. అనేక రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక్కడి నుంచి 54దేశాలకు విమాన రాకపోకలు జరుగుతాయని, ఈ ఒప్పందంతో దేశానికి ఆర్థికంగా నష్టదాయకమని కార్మిక సంఘం పేర్కొన్నది. కౌలు గడువు ముగిసిన తరువాత 18శాతం వాటాను అదానీ కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటివి ఆరు రాయితీలు ఉన్నాయని, ఇతర విమానాశ్రయాల కాంట్రాక్టులు కూడా వచ్చేందుకు వీలు కల్పించే విధంగా ఒప్పందం ఉన్నట్లు బయటపడిరది. విమానాశ్రయ విస్తరణ గురించి ఎలాంటి బహిరంగ ప్రకటన లేదు, అంతా గుట్టుగా జరిగింది. ఈ వ్యవహారం కోర్టుకు ఎక్కటంతో ఇంకా ఎలాంటి ఒప్పందం జరగలేదని ప్రభుత్వం చెప్పుకోవాల్సి వచ్చింది. అక్కడి సుప్రీం కోర్టు ఆ ఒప్పందాలను పక్కనబెట్టటంతో విధిలేక అధ్యక్షుడు రూటో రద్దు చేస్తున్నట్లు ప్రకటించక తప్పలేదు.
తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో బాగామోయో రేవు అభివృద్దికి చైనా కంపెనీతో కుదిరిన అవగాహనను అక్కడి ప్రభుత్వం 2019లో రద్దు చేసుకుంది. ఆ రేవుతో పాటు మరో రెండు రేవులను అభివృద్ధి చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు అదానీ కంపెనీఅబుదాబీ కంపెనీ సంయుక్తంగా ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2023 అక్టోబరులో అధ్యక్షురాలు సమియా సులు హసన్ భారత సందర్శనకు వచ్చినపుడు మనదేశంతో అనేక ఒప్పందాలు కుదిరాయి. ఈ ఏడాది మే నెలలో అదానీ కంపెనీ టాంజానియా దారుసలామ్ రేవులో కంటెయినర్ జెట్టీని అభివృద్ది చేసేందుకు 30 ఏండ్ల రాయితీ ఒప్పందం చేసుకుంది. విద్యుత్ లైన్ నిర్మాణం గురించి కూడా అదానీ కంపెనీ అమెరికా కంపెనీతో కలసి చేపట్టేందుకు టాంజానియా సంప్రదింపులు జరుపుతోంది. మయన్మార్‌లోని యంగూన్ రేవులో ఒక జెట్టీని అభివృద్ధి చేసేందుకు 2019లో కాంట్రాక్టు పొందినట్లు అదానీ కంపెనీ ప్రకటించింది. అంతకు ముందు మయన్మార్ మిలిటరీ జనరల్ మిన్ అంగ్ లైయింగ్‌తో గౌతమ్ అదానీ కుమారుడు కరన్ అదానీ భేటీ అయ్యాడు.సదరు అధికారి గుజరాత్‌లోని ముంద్రా రేవును సందర్శించాడు.ఆ సందర్భంగా మిలిటరీ జనరల్, అతనితో పాటు వచ్చిన అధికారులకు ‘‘బహుమతులు’’ ముట్టచెప్పారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత అంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి లైయింగ్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. నియంతలతో కూడా అదానీ తన కంపెనీల కోసం చేతులు కలిపారన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. మిలిటరీ పాలకులపై అమెరికా ఆంక్షలు విధించినా అదానీ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం కలగలేదు.మిలిటరీ అధికారుల కనుసన్నలలో నడిచే మయన్మార్ ఎకనమిక్ కార్పొరేషన్‌కు అదానీ మూడు కోట్ల డాలర్లు చెల్లించిందని, అవి ముడుపులని ఆరోపణలు వచ్చాయి. తరువాత కాలంలో పశ్చిమ దేశాల ఆంక్షలు తీవ్రం కావటంతో ఆ రేవు ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని, పెట్టిన పెట్టుబడి 19.5 కోట్ల డాలర్లు ఇస్తే ఎవరికైనా విక్రయిస్తామని ప్రకటించింది. ఎవరూ ముందుకు రాకపోవటంతో 2023లో మూడు కోట్ల డాలర్లకే విక్రయించింది.తమకు 15.2కోట్ల డాలర్ల నష్టం వచ్చినట్లు పేర్కొన్నది.
శ్రీలంక ప్రభుత్వంతో గతంలో అదానీ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించనున్నట్లు ఇటీవల ఎన్నికైన అధ్యక్షుడు అనుర కుమార దిశన్నాయకే ప్రకటించాడు.ఈ మేరకు 44 కోట్ల డాలర్లతో తలపెట్టిన గాలిమరల విద్యుత్ ప్రాజెక్టు గురించి పునరాలోచించనున్నట్లు సుప్రీం కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన లంకకు మనదేశం సాయం చేసింది. దానికి ప్రతిగా మోడీ మనదేశానికి ఉపయోగపడే పని చేయాల్సిందిపోయి తాము చెప్పిన అదానీకి ప్రాజెక్టులను అప్పగించాలని కోరటం అధికార దుర్వినియోగం తప్ప మరొకటి కాదు. భారత వత్తిడి కారణంగా గాలి మరల విద్యుత్ ప్రాజెక్టును కట్టబెట్టినట్లు అక్కడి అధికారే స్వయంగా పార్లమెంటరీ కమిటీ ముందు వెల్లడిరచాడు, అతని ప్రాణానికి ముప్పురావటంతో ఆ ప్రకటనను వెనక్కు తీసుకున్నట్లు చెబుతున్నారు. అదానీకి కట్టబెట్టేందుకు పోటీ లేకుండా అక్కడి చట్టాన్నే మార్పించారు. మోడీ సర్కార్ దన్నుతో కొలంబో రేవులో సగం వాటాతో తూర్పు కంటెయినర్ జట్టీ అభివృద్ధి, నిర్వహణకు అదానీ రంగంలోకి దిగాడు. కీలకమైన ఆ ప్రాజెక్టు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని రేవు కార్మికులు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి.దాంతో దాని బదులు పశ్చిమ కంటెయినర్ జెట్టిని అప్పగిస్తామని, సగం బదులు 85శాతం వాటాతో గత ప్రభుత్వంతో అదానీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వీటన్నింటినీ సమీక్షిస్తున్నందున ఏమవుతుందో చూడాలి.
నలభై సంవత్సరాల తరువాత తొలిసారిగా భారత ప్రధానిగా నరేంద్రమోడీ 2023 ఆగస్టులో గ్రీస్ పర్యటనకు వెళ్లారు.పైకి ఏమి చెప్పినా అదానీకి అక్కడి ప్రాజెక్టుల కోసమే అని వార్తలు వచ్చాయి.ఎందుకంటే ఇరుదేశాల నేతల మధ్య రేవుల గురించి చర్చ జరిగింది. ఇండోనేషియాలోని అదానీ గనుల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు ధరను మూడు రెట్లకు పైగా ఎక్కువగా నిర్ణయించారు. నాసిరకాన్ని నాణ్యత కలదిగా పేర్కొన్నారు.ఇది యుపిఏ హయాంలో జరిగినప్పటికీ మోడీ సర్కార్ ఎలాంటి విచారణ జరపలేదు.2023 సెప్టెంబరు ఏడున మోడీ ఇండోనేషియా పర్యటన జరిపారు.నెల రోజులు కూడా తిరగక ముందే అదానీ ప్రత్యక్షమై సబాంగ్ రేవు గురించి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇలా గత పదేండ్లలో అదానీ కంపెనీలు విదేశాల్లో విస్తరణకు మోడీ సహకరించారన్నది స్పష్టం. విచారణ జరిపితే వాస్తవాలన్నీ బయటపడతాయి. అలాంటి చిత్తశుద్ది కేంద్ర ప్రభుత్వానికి ఉందా ?
