Tags
BJP, caste discrimination, caste system, caste-based exclusion, Gangster Chota Rajan, Hindu Council UK, Hinduism, KVPS, RSS, Social Justice, Udupi Pejawar math seer
ఎం కోటేశ్వరరావు
కుల వివక్ష మహమ్మారి కొంతకాలం క్రితం వరకు మన దేశానికే సొంతం, ప్రత్యేకం. ఇప్పుడు ”విద్యావంతులు” దాన్ని అంతర్జాతీయం గావించారు. దాన్ని పాటించేవారు ఎక్కడ అడుగుపెడితే అక్కడ పిచ్చి తుమ్మలా విస్తరిస్తోంది. దాన్ని నిరసించే వారు ఎక్కడ తలెత్తితే అక్కడ ప్రతిఘటన, బెదిరింపులు ఎదురవుతున్నాయి. డిసెంబరు 27న కర్ణాటకలోని సువర్ణ కన్నడ టీవీ కార్యక్రమంలో అయోధ్యలోని రామాలయంలోపల దళితులు పూజలు నిర్వహించవచ్చా అనే చర్చ జరిపారు. జనవరి పన్నెండున బెంగలూరులో ” బిఆర్ అంబేద్కర్ దండు(సేన) ” అనే సంస్థ దానిలో పాల్గన్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ, ఉడిపి పెజావర్ మఠ స్వామీజీ విశ్వప్రసన్న తీర్ధ, టీవీ యాంకర్ అజిత్ హనుమక్కనావర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని మీద ఎఫ్‌ఐఆర్ దాఖలైందీ లేనిదీ తెలియదు. సువర్ణ టీవీ చర్చలో నాగరాజ్ అనే ఒక దళిత సంస్థ ప్రతినిధి అయోధ్య రామాలయం పూజల్లో దళితులను చేర్చలేదని ఆందోళన వెలిబుచ్చారు. దాని మీద స్వామి స్పందిస్తూ ఒక్క కాశీ ఆలయంలో తప్ప ఒక దేవాలయంలో పూజకోసం నియమించిన ఒక్కరు మాత్రమే చేస్తారని ప్రతి ఒక్కరూ చేయరని అన్నారు. ఒక్క దేవాలయమే కాదు, ఉదాహరణకు ఏ కార్యాలయం లేదా సంస్థలో నిర్దేశిత స్థానంలో ఒక్కరే ఉంటారు తప్ప ప్రతి ఒక్కరూ కూర్చోరని, నియమిత వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. అయోధ్యలో వంతుల వారీ పూజలు ఎందుకు చేయకూడదని నాగరాజు ప్రశ్నించారు.” ఇప్పటి వరకు పూజలు నిర్వహిస్తున్న సామాజిక తరగతి మాత్రమే భవిష్యత్‌లో కూడా చేస్తుందని, ఇతరులు చేయకూడదని అన్నారు. సంప్రదాయాలను మార్చకూడదా అన్న దానికి ఈ ప్రశ్న దేవాలయాలు, ధార్మిక సంస్థల గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నారని స్వామి ఎదురు ప్రశ్నించారు.
లౌకిక నిబంధనలు మతప్రదేశాలకు వర్తించరాదని, రెండింటినీ కలగా పులగం చేయరాదని టీవీ యాంకర్ అజిత్ వాదించారు.” మీరు శబరిమల ఆలయానికి వెళ్లాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి, వాటిని పాటించకుండా వెళ్లాలంటే ఎలా ? కొన్ని ఇళ్లలో మీరు బూట్లు వేసుకోవచ్చు, కొన్ని చోట్ల బయట వదలి రావాలన్న నిబంధనలు ఉంటాయి. మీ వంట ఇంట్లో బూట్లు ధరించినట్లుగా ఇతరుల ఇండ్లలో కూడా ధరిస్తామని అంటే అప్పుడు మీరు తర్కబద్దంగా మాట్లాడేవ్యక్తి కానట్లే ” అన్నారు. చర్చలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ” దళితులు పూజ చేయాలని కోరుకుంటే వారు మంత్రాలు నేర్చుకోవాలి, అఖండ పాండిత్యాన్ని సంపాదించాలి, తరువాత పూజలు చేయాలి ” అన్నారు. అప్పుడు పెజావర్ స్వామి మాట్లాడుతూ హిందూయిజంలో దళితులు ప్రత్యేక బృందంగా విడిగా ఉండాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. దళిత సంఘ ప్రతినిధి నాగరాజు మాట్లాడుతూ దళితులకు ఎక్కడా అవకాశాలు లేవని చెప్పారు. దాని మీద స్వామి మాట్లాడుతూ ” ఒక దళిత సంస్థ నేతగా మీరు ఒక బ్రాహ్మణుడిని అంగీకరిస్తారా ” అని ప్రశ్నించగా అదెలా కుదురుతుందని నాగరాజు అన్నారు.
దళిత సంస్థ అంటే కుల సంస్థ కాదు. దళిత సామాజిక తరగతిలో అనేక కులాలు ఉన్నాయి. అవి వేటికవి తమ కులం గురించి ఏర్పాటు చేసుకున్న సంఘాలకు వేరే కులం వారిని అనుమతించరు. కులవివక్షను ఎదుర్కొంటున్న వారిలో గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు కూడా ఉన్నారు. తీవ్ర వివక్షను దళితులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఉన్న దళిత సంస్థలు ఆ సామాజిక తరగతికి చెందిన వారు మొత్తంగా ఎదుర్కొంటున్న కులవివక్ష, అవమానాలకు, ఉద్యోగ, రిజర్వేషన్లలో చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నవి. తమ డిమాండ్లను బలపరిచే ఎవరినైనా తమ నేతలలో ఒకరిగా అంగీకరివచ్చు. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాలకు(కెవిపిఎస్) నాయకత్వం వహిస్తున్నవారిలో దళితులు కాని వారు కూడా ఉన్నారు. అందువలన పెజావర్ స్వామి వేసిన ప్రశ్న సరైందికాదు లేదా తప్పుదారి పట్టించేది కాగా, దానికి సమాధానం చెప్పిన నాగరాజు అవగాహనలో గందరగోళం ఉన్నది. ఇక బిఆర్ అంబేద్కర్ దండు చేసిన ఫిర్యాదును చూద్దాం. మత ప్రదేశాల్లో మత నిబంధనలను పాటించాలని చెప్పటం ద్వారా దేవాలయాల్లో పూజలు చేసేందుకు దళితులను అనుమతించరని పెజావర్ స్వామి, టీవీ యాంకర్ చెప్పినట్లయిందని, తద్వారా వారు అంటరానితనాన్ని పాటించాలని చెప్పటమేనని, అలాంటి ప్రకటనలు రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వ, లౌకికత్వానికి విరుద్దమని, సంప్రదాయం అనే పదాన్ని ఉపయోగించటం దళితులను అణచివేయటం, ఈ చెడు సంప్రదాయాన్ని ప్రశ్నించకుండా అనుసరించాలని చెప్పటమే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. బెంగలూరు హై గ్రౌండ్స్ పోలీసులు తమ ఫిర్యాదు అందినట్లు రసీదు ఇచ్చారని ఇంతవరకు(జనవరి 15) ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయలేదని దండు సలహాదారు ఆదర్శ ఆర్ ఆయ్యర్ చెప్పారు.
గాంగస్టర్ చోటా రాజన్ కుమార్తె అమెరికా విశ్వవిద్యాలయంలో లోపాలతో ఉన్న కులసర్వే నిర్వహించారని, జార్జి సోరస్‌తో సంబంధమున్న సంస్థలకు డబ్బు విరాళంగా ఇస్తామని పేర్కొన్నట్లు కాషాయ దళం నిర్వహించే ఓపిఇండియా పోర్టల్ ఒక కథనాన్ని ప్రచురించింది. గంధపు చెక్కల స్మగ్లర్, ఎన్నో హత్యలు చేసిన వీరప్పన్ కుమార్తె దివ్యకు తమిళనాడు బిజెపి యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా కాషాయ కండువా కప్పారు. తండ్రి నేరాలు అందుకు అడ్డురాలేదు. గాంగస్టర్ చోటా రాజన్ ప్రస్తుతం ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ముంబై జైల్లో ఉన్నాడు. రాజన్ కుమార్తె అంకిత నికాలజి ప్రస్తుతం అమెరికాలోని విస్కాన్సిన్ మిల్‌వాకీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.ఆమె నిర్వహించిన సర్వే వార్త రాసేటపుడు తండ్రి గురించి ప్రస్తావించటం, సర్వేలో పాల్గొన్నవారికి ప్రతి ఒక్కరికి మూడు డాలర్ల వంతున ఇచ్చే సొమ్మును వివాదాస్పాద పాలస్తీనా హక్కుల కోసం, పాలస్తీనా పిలల్ల నిధి, ఇంటర్నేషనల్ దళిత్ సాలిడారిటీ సంస్థకు(ఐడిఎస్‌ఎన్) ఇస్తామని చెప్పారని, ఐడిఎస్‌ఎన్‌కు జార్జి సోరస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నిధులు అందిస్తున్నదని, సోరస్ భారత్‌లో రంగుల విప్లవం పేరుతో తిరుగుబాటు రెచ్చగొట్టేందుకు చూస్తున్నట్లు ఓపి ఇండియా ఆరోపించింది. ఇది బురదజల్లే వ్యవహారం తప్ప మరొకటి కాదు. అమెరికాలో కులపరమైన వివక్షను ఎదుర్కొన్నవారి అభిప్రాయాలను ఆ సర్వేలో సేకరించేందుకు అవసరమైన ప్రశ్నలను రూపొందించారు. కులవివక్ష ఉందని అంగీకరించేందుకు ఇష్టపడని కాషాయ దళాలకు మింగుడుపడలేదు.
హిందూమతం లేదా హిందూయిజానికి సంబంధించి ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు బ్రిటన్‌లోని లండన్ కేంద్రంగా పని చేస్తున్న హిందూ కౌన్సిల్ యుకె(హెచ్‌సియుకె) అనే సంస్థ బెదిరింపులకు దిగింది. డిసెంబరు నెలలో లిసెస్టర్ సెక్యులర్ సొసైటీ(ఎల్‌ఎస్‌ఎస్) ” హిందూయిజం : అనైతిక తుచ్చ ఆవరణము ” అనే పేరుతో ఒక ప్రసంగాన్ని ఏర్పాటు చేసింది.హిందూయిజ వైఫల్యాలను విమర్శనాత్మక దృష్టితో పరిశీలించే అంశమిది. అసలు పేరులోనే హిందువుల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టే అంశం ఉందని, దీని గురించి స్థానిక హిందువులు, అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెసియుకె సంస్థ ఒక ఇమెయిల్ ద్వారా నిర్వాహకులను బెదిరించింది. మతం గురించి లోతుగా, స్వేచ్చగా చర్చించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, వివక్ష పద్దతులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎల్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు నెడ్ న్యూయిట్ ప్రతి లేఖలో స్పష్టం చేశాడు.కుల వ్యవస్థలో వివక్ష అంతర్లీనంగా ఉందని, మతం-వివక్షకు ఉన్న సంబంధాలను తెలుసుకొనేందుకు ఆసక్తితో ఉన్నామని పేర్కొన్నాడు. బ్రిటన్‌లో యాభై నుంచి రెండు లక్షల మంది వరకు తక్కువ కులాలుగా పరిగణించబడేవారు ఉన్నారని, వారంతా వివక్ష, వేధింపులకు గురౌతున్నట్లు ఎల్‌ఎస్‌ఎస్ పేర్కొన్నది. 2017లో బ్రిటన్ ఆమోదించిన సమానత్వ చట్టంలో కులపరమైన వివక్ష వ్యతిరేక అంశాలున్నాయి. దీన్ని హిందూ కౌన్సిల్ తీవ్రంగా వ్యతిరేకించింది.దీని వలన దళితులు ఉన్నత కులాల వారి మీద ప్రతీకారం కోరే అవకాశం ఉందని వాదించింది. డిసెంబరు ఆరవ తేదీన ఆ ప్రసంగ కార్యక్రమం జరిగింది. దానికి నిరసన తెలిపేందుకు ఎవరూ రాలేదు. ప్రశాంతంగా ముగిసింది.
హిందూమతం, దాన్ని అనుసరించే సమాజంలో కొంత మంది పాటించే అంటరానితనానికి దూరంగా ఉండేందుకు అనేక మంది ఇస్లాం, క్రైస్తవ, బౌద్ద మతం పుచ్చుకున్న చరిత్ర తెలిసిందే. తెలుగు ప్రాంతాల్లో క్రైస్తవ మతం పుచ్చుకున్నవారిలో దళితులు, కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ తదితర కులాల వారు ఉన్నారు. మతం ఒక్కటే అయినా సామాజిక వివక్ష కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏ కులంవారు ఆ కులంలోనే సంబంధాలు కలుపుకుంటారు తప్ప మరొక విధంగా లేరు. తమిళనాడులోని క్రైస్తవులలో కూడా వివక్ష కొనసాగుతున్నట్లు జనవరి రెండ వారంలో ఒక పుస్తక విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. నివేదిత లూయీస్ అనే రచయిత క్రీస్తువతిల్ జాతి( క్రైస్తవంలో కులం) అనే పుస్తక విడుదల కార్యక్రమంలో విసికె పార్టీ ఎంపీ తిరుమవలన్ మాట్లాడుతూ భారత్‌లో క్రైస్తవం కుల వేళ్లను పెంచి పోషించింది తప్ప క్రైస్తవ విలువలను కాదని విమర్శించారు. క్రైస్తవులుగా మారినా తమ కుల గుర్తింపును వదులుకొనేందుకు సిద్దంగా లేరని అందుకే క్రైస్తవ నాడార్లు, ముదలియార్లు, రెడ్డియార్లు,యాదవులు కనిపిస్తున్నారని అన్నారు.చర్చి వ్యవస్థలో కూడా దళితులు, ఇతర కులాల వారి మధ్య తేడాలు ఉన్నాయన్నారు. సామాజిక న్యాయ గడ్డగా పిలుస్తున్న తమిళనాడులో కులపరమైన దాడుల పట్ల ప్రభుత్వ స్పందన ఉపేక్షతో కూడి ఉందని, పౌరసమాజం మౌనంగా ఉందని జనవరి ఆరవ తేదీన చెన్నరులో జరిగిన ఒక సభలో వక్తలు పేర్కొన్నారు.దళిత్ ఇంటెలెక్చ్యువల్ కలక్టెవ్(డిఐసి) పేరుతో ఒక రోజు పాటు సాగిన వర్క్‌షాప్‌లో రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆ సామాజిక తరగతికి చెందిన పలువురు పాల్గొన్నారు.అనేక పత్రాలను సమర్పించారు. పద్దెనిమిది డిమాండ్లను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని పార్టీలకు అందచేయాలని నిర్ణయించారు. దళితుల మీద జరిగిన దాడుల మీద తీసుకున్న చర్యలతో శ్వేత పత్రం విడుదల చేయాలని, అన్ని పార్టీలతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు, పేర్లకు ముందు,వెనుక కుల గుర్తింపు లేకుండా చూడాలని, అన్ని స్థాయిల్లో ఉన్న అధికార యంత్రాంగానికి వివక్షకు దూరంగా ఉండాల్సిన పద్దతుల గురించి వివరించాలని, కేరళలో మాదిరి కులాంత వివాహాలు చేసుకున్న వారి పిల్లలకు రిజర్వేషన్లు కల్పించాలని తదితర అంశాలు వాటిలో ఉన్నాయి.
జైళ్లలో ఖైదీల పట్ల కులవివక్ష పాటించటం గురించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జెబి పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జైళ్ల నిబంధనల్లోనే వివక్ష ఉందని, బలవంతంగా చాకిరీ చేయిస్తున్నారని పిటీషనర్ జర్నలిస్టు సుకన్య శాంత పేర్కొన్నారు. తమిళనాడులోని పాలయం కొట్టారు సెంట్రల్ జైలులో థేవర్లు, నాడార్లు, పాలార్లకు ప్రత్యేక బ్లాకులు ఉన్నాయని, పశ్చిమ బెంగాల్లో అగ్ర కులాలకు చెందిన ఖైదీలు వంట విధులకు, పారిశుధ్యం వంటి వాటికి ఫలానా కులం వారనే నిబంధనలు ఉన్నాయని, అదే విధంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న లోపాలు, వివక్ష గురించి కూడా పిటీషన్‌లో పేర్కొన్నారు.
