Tags
anti china, BJP, CHANDRABABU, India arms imports, India GDP, India index, Narendra Modi Failures, RSS
ఎం కోటేశ్వరరావు
చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి. అదే బతికున్నవి ఎదురీదుతాయి. మనుషుల్లో తరతరాలుగా ఈ రెండు రకాలూ ఉంటూనే ఉన్నారు. స్వామి వివేకానందుడితో సహా అనేక మంది మనకు ప్రశ్నించటం నేర్పారు.ప్రశ్న లేకపోతే అసలు కిక్కుండదు. యువకుడిగా ఉన్నపుడు వివేకానందుడు రామకృష్ణ పరమమహంస దగ్గరకు వెళ్లి మీరు దేవుడిని చూశారా అని ప్రశ్నించాడు. దానికి అవును చూశాను అని సమాధానం వచ్చింది, అయితే నాకు దర్శన భాగ్యం కల్పిస్తారా అని అడిగితే, నీకా ధైర్యం ఉందా అని రామకృష్ణుడు ప్రశ్నించాడు. తరువాత వివేకానందుడు దేవుడ్ని చూశాడా, ఏం చేశాడన్నది ఆసక్తి కలిగిన వారు చదువుకోవచ్చు. ఇక్కడ సమస్య ప్రశ్నించటం అనే మహత్తర లక్షణం గురించే. సమాజంలో ఎందరికి ఉంది ? ప్రశ్నించేతత్వం ఉంటే రాజకీయ నేతలు జనాలకు ఇన్ని కబుర్లు చెప్పేవారా, ఆచరించని వాగ్దానాలను వర్షంలా కురిపించేవారా !
పదేండ్లలో జిడిపిని రెట్టింపు చేశామని ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక మంది ఊదరగొడుతున్నారు.దేశాభివృద్ధి అంటే జిడిపి ఒక సూచిక తప్ప అదే సర్వస్వం కాదు, సమగ్రతను సూచించదు. పిల్లో, పిల్లాడో పుట్టిన తరువాత లావు, పొడవు పెరుగుతారు. అవి వయస్సుకు తగ్గట్లు ఉన్నాయా, ఆరోగ్యంతో ఉన్నారా లేదా అన్నది గీటురాయి తప్ప చిన్నప్పటికంటే ఎంతో పెరిగారు కదా అంటే కుదరదు. దేశం, మానవాభివృద్ధి అన్నా అలాంటిదే. జిడిపి గురించి పదే పదే చెబుతున్నవారు మిగతా సూచికల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాలా వద్దా ? వాటి పట్ల నిర్లక్ష్యం వహించారా లేక విఫలమయ్యారా ? ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో మన వాటా 2014లో 2.6శాతం, మోడీ అండ్ కో చెబుతున్నదాని ప్రకారం జిడిపి మాదిరి అది కనీసం 5.2శాతానికి పెరగాలి, కానీ 2024లో 2.9 మాత్రమే నమోదైంది. అంతేనా జిడిపిలో వాటా 15.02 నుంచి 12.84శాతానికి(2023) తగ్గింది.2024 వస్తూత్పత్తి విలువ జోడిరపులో ప్రపంచ బాంకు సమాచారం మేరకు తొలి స్థానంలో చైనా 5.04 లక్షల కోట్ల డాలర్లతో ఉండగా అమెరికా 2.6లక్షల కోట్లతో రెండవ, భారత్ 0.45లక్షల కోట్లతో ఆరవ స్థానంలో ఉంది. తలసరి ఉత్పత్తిని చూస్తే 10,704 డాలర్లతో జర్మనీ, 9,685తో దక్షిణ కొరియా,8,791తో జపాన్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.చైనా 3,569 డాలర్లు, మనదేశం కేవలం 318 డాలర్లు మాత్రమే కలిగి ఉంది. గుజరాత్ నమూనాను అమలు జరుపుతానని చెప్పిన తమ నేత మోడీ నాయకత్వంలో ఈ రంగంలో ఇంత తక్కువ ఎందుకు ఉందో బిజెపి నేతలు, ఆ పార్టీ సమర్ధకులు ఎవరైనా చెప్పగలరా ?
త్వరలో మనం చైనాను అధిగమించబోతున్నాం, మరికొందరైతే డ్రాగన్ను మన కాళ్ల వద్దకు రప్పించుకోబోతున్నాం అన్నట్లుగా మాట్లాడుతుంటారు. కోతలు కోసే స్వేచ్చ ఉంది కాదనలేం. దేని ప్రాతిపదికన అలా చెబుతున్నారో మనలో మనమైనా తర్కించుకోవాలి కదా ! ఐరాస గణాంక విభాగం నుంచి తీసుకొని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా సమాచారం 2024 ఆగస్టులో వెల్లడిరచిన దాని ప్రకారం మీడియా సంస్థలు పారిశ్రామిక ఉత్పత్తి చేస్తున్న పది దేశాల గురించి సమీక్షించాయి. ప్రతి వంద వస్తువులు లేదా వంద కిలోల ఉత్పతిలో చైనా 31.6, అమెరికా 15.9, జపాన్ 6.5, జర్మనీ 4.8, భారత్ 2.9, దక్షిణ కొరియా 2.7, రష్యా 1.8, ఇటలీ 1.8, మెక్సికో 1.7,ఫ్రాన్సు 1.6 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. మన దేశంలోని రాష్ట్రాలంత ఉన్న దేశాలు మనతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంటే దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతున్నామని కబుర్లు చెప్పేవారిని పగటి వేషగాళ్లు, తుపాకి వీరులు అంటే తప్పేముంది ! నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ఆయనకున్న అనుభవం తక్కువేమీ కాదు, అందుకే తనకు ఇతరుల మాదిరి హానీమూన్ అవసరం లేదన్నారు. గుజరాత్ మాదిరి పారిశ్రామికంగా మార్చుతానంటే జనం నిజమే అని నమ్మి ఒకటికి మూడుసార్లు దేశాన్ని అప్పగించారు.కాని జరిగిందేమిటి ? ఇదే కాలంలో చైనా ఉత్పాదకత 20 నుంచి 31.6శాతానికి పెరిగితే, మన దగ్గర 2.6 నుంచి ముక్కుతూ మూలుగుతూ 2.9శాతానికి చేరింది. మన ఉత్పత్తుల విలువ 450 బిలియన్ డాలర్లు కాగా చైనా 5.04లక్షల కోట్లు, అమెరికా 2.6లక్షల కోట్ల డాలర్లతో ఉన్నాయి. పెంచకుండా నరేంద్రమోడీని ఎవరు అడ్డుకున్నారు ?
అంతా మీరే చేశారంటూ కాంగ్రెస్ పాలకుల మీద ఎన్ని రోజులు దుమ్మెత్తి పోస్తారు. ఆటంకాలు మనకే కాదు, చైనా, అమెరికాలకు ఎదురు కాలేదా ? నిజానికి కరోనా ఆంక్షల పేరుతో మరీ కఠినంగా వ్యవహరించి చైనా స్వయంగా ఉత్పత్తిని దెబ్బతీసుకుందని అనేక మంది సంబరపడ్డారు. దాని ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవాలని ఎందరో చెప్పారు.సర్వేజనా సుఖినో భవంతు అని కోరుకునే మనం చైనాను అధిగమించాలనే ఆధిపత్య ధోరణి కంటే దానితో పాటు మనమూ ఎదగాలని ఆశించటం వాంఛనీయం. మన దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి గతంతో పోల్చుకుంటే విలువలో చూస్తే పరిమితంగా పెరిగింది.తలసరి ఉత్పత్తిలో అగాధంలో ఉన్నాం. చిత్రం ఏమిటంటే పదేండ్లుగా నరేంద్రమోడీ కార్మికుల నైపుణ్యాలను పెంచినట్లు చెబితే, చంద్రబాబు నాయుడికి వారెంత మంది ఉన్నారో తెలియక లెక్కలు తీస్తున్నట్లు చెబుతున్నారు. కాలయాపన, కాలక్షేప కబుర్లు తప్పితే ఇంజనీరింగ్ పట్టాలు, పాలిటెక్నిక్ డిప్లోమాలు, ఫార్మసీ పట్టాలు ఎందరికి ఉన్నాయో లెక్కలు తెలియనంత దుస్థితిలో దేశం ఉందా ? దేశం మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 54శాతం కేవలం మహారాష్ట్ర, తమిళనాడు,గుజరాత్,కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ నుంచే జరుగుతోంది.కొత్తగా వచ్చే పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రాలవైపే చూస్తుంటాయి.
ఒక పరిశ్రమ రావాలంటే ఏటిఎం యంత్రంలో కార్డు పెట్టగానే డబ్బులు వచ్చినంత సులభంగా రావని తల మీద మెడ ఉన్నవారందరికీ తెలుసు. పదేండ్లు తక్కువేమీ కాదు, ప్రగతి జాడ ఎక్కడ, రెండిరజన్ల పాలన ప్రభావం ఏమిటి ? చైనాతో పోల్చుకుంటే వేతనాలు మన దగ్గర తక్కువ, అయినప్పటికీ విదేశీ కంపెనీలు ఇక్కడికి ఎందుకు రావటం లేదో పెద్దలు చెప్పాలి. మీడియాలో వెలువడుతున్న అభిప్రాయాల ప్రకారం చైనా మాదిరి తక్కువ ధరలకు ఇక్కడ కూడా ఉత్పత్తి చేయవచ్చు. కానీ జరగటం లేదు. చైనాలో విధానాలను రూపొందించేది అమలు జరిపేదీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ.ఇక్కడ పార్టీలు మారుతుంటాయి కనుక సాధ్యం కావటం లేదన్నది వెంటనే చెప్పే సమాధానం. ఇది తర్కానికి నిలిచేది కాదు. అమెరికా, ఐరోపా, జపాన్, దక్షిణ కొరియాలో కూడా పార్టీలు, పాలకులు మారుతూనే ఉన్నారు. మరి అక్కడ సాధ్యమైంది ఇక్కడెందుకు జరగటం లేదు. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా విధానాలు ఒక్కటే. 1990 నుంచి మన దేశంలో జరుగుతున్నది కూడా అదేగా ! ఎవరు అధికారంలో ఉన్నా నూతన సంస్కరణలను ముందుకు తీసుకుపోవటమేగా. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టవద్దన్నారు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత లేక తెగనమ్మాలన్నారు. వాజ్‌పాయి, మన్మోహన్ సింగ్, నరేంద్రమోడీ ఎవరున్నా చేస్తున్నది అదేగా. మరింత వేగంగా, సమర్దవంతంగా అమలు చేస్తానని మోడీ చెప్పారు, అయినా ఎందుకు ముందుకు పోవటం లేదు ?
ఎంత సేపూ ఐదు లక్షల కోట్ల జిడిపి, కొద్ది వారాలుగా పదేండ్లలో రెట్టింపు కబుర్లు చెబుతున్నారు.మిగతా సూచికల్లో మనం ఎక్కడున్నాం. వాటన్నింటి సమాహారమే దేశం ఎక్కడుందో,ఎలా ఉందో తెలియ చేస్తుంది. 2024, అంతకు ముందు ప్రకటించిన కొన్ని సూచికల్లో భారత స్థానం గురించి చూద్దాం. ఇవన్నీ అంతర్జాతీయ సంస్థలు వెల్లడిరచేవే. మన్మోహన్ సింగ్ ఉన్నపుడూ ఇప్పుడూ అవే ఉన్నాయి తప్ప నరేంద్రమోడీ సర్కార్‌ను బదనాం చేసేందుకు కొత్తగా పుట్టుకురాలేదు.చిత్రాతి చిత్రం ఏమిటంటే తమకు ప్రతికూలంగా ఉన్న వాటిని మేం అంగీకరించం అంటారు. ఫేక్ వార్తలు, ఫేక్ నివేదికలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు.అంతర్జాతీయ సంస్థలు మన దేశం ప్రకటించిన సమాచారం నుంచే వివరాలు తీసుకుంటాయి తప్ప మరొకటి కాదు. ప్రారంభంలో సరిగా మదింపు లేదన్నారు, పదేండ్ల తరువాత పరిస్థితి ఏమిటి ? అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన 55 దేశాల అంతర్జాతీయ మేథోసంపత్తి సూచికలో మనం 42లో ఉన్నాం. ప్రపంచ నవకల్పన సూచికలో 113 దేశాల్లో చైనా పదకొండు, భారత్ 39వదిగా ఉంది. ఐరాస మానవాభివృద్ధి సూచికలో 193 దేశాల్లో 134, గడచిన పదేండ్లలో దేశ ప్రతిష్టను మోడీ పెంచారని చెప్పిన తరువాత వీసాలు లేకుండా మన పౌరులను అనుమతించే దేశాలను సూచించే హానెల్ పాస్‌పోర్టు సూచికలో 80వ స్థానం, ఐరాస లింగసమానత్వంలో 193కు గాను 108,ప్రపంచ సంతోష సూచిక 126, మోడీ సర్కార్ 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లు కరోనా సమయం నుంచి చెప్పుకుంటున్నప్పటికీ 2024లో ఆకలి సూచికలో 126దేశాలకు గాను 105గా ఉన్నాం. ప్రపంచ శాంతి సూచికలో 163కు గాను 116వ స్థానం, అవినీతికి తమ పాలనలో తావు లేదు, మోడీ మీద ఒక్క కుంభకోణమన్నా ఉందేమో చూడండని బిజెపి పెద్దలు సవాళ్లు విసురుతుంటారు. అధికారాంతమందు చూడవలె ఆ ఆయ్య సాభాగ్యముల్ అన్నాడు ఒక కవి. దేశం మొత్తంగా అవినీతి గురించి ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్ సూచికలో 2022లో 85వదిగా ఉంటే 2024లో 96వ స్థానానికి దిగజారింది. ప్రపంచ పత్రికా స్వేచ్చలో 180 దేశాల్లో 159వ స్థానం, పాయింట్ల వారీ చూస్తే అంతకు ముందు సంవత్సరంలో 36.62 కాగా 2024లో 31.28కి పడిపోయాయి. చట్టబద్ద పాలన సూచికలో 142దేశాల్లో 79వ స్థానం. మంచి జీవనానికి అనువైన నగరాలేమిటని 173 నగరాలను ఎంచుకోగా వాటిలో న్యూఢల్లీి, ముంబై నగరాలకు 141వ స్థానం రాగా ఆ తరువాత చెన్నయ్,అహమ్మదాబాద్, బెంగలూరు చోటు దక్కించుకున్నాయి. యుపిఏ పాలనా కాలంలో ప్రపంచ జీడిపిలో 11వదిగా ఉన్న మన దేశాన్ని ఐదవ స్థానానికి తెచ్చామని చెప్పుకుంటున్నవారు పైన పేర్కొన్న సూచికల్లో ఎందుకు విఫలమైనట్లు ?
వైఫల్యాల గురించేచెబుతారా మోడీ సాధించిందేమీ లేదా అని ఎవరైనా అడగవచ్చు. స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్(సిప్రి) సమాచారం ప్రకారం 2020 నుంచి 2024వరకు ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశం ఉక్రెయిన్, తరువాత మనదే. రష్యాతో మూడేండ్లుగా యుద్ధం చేస్తోంది గనుక ఉక్రెయిన్ ఆ పని చేసింది, మనం ఎవరితో యుద్దంలో ఉన్నాం, ఎవరి మేలుకోసం ఆయుధాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు ? వాస్తవం ఇలా ఉంటే మన దేశం కూడా ఆయుధాలను ఎగుమతి చేస్తోందన్న ప్రచారం బిజెపి చేస్తోంది. నిజమే ! గ్లోబల్ ఎకానమీ డాట్ కాం 2022 సమాచారం మేరకు 48దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా 14,515 మిలియన్ల డాలర్ల మేరకు ఎగుమతి చేయగా, నాలుగవ స్థానంలో ఉన్న చైనా 2,017 మిలియన్ డాలర్లు, 40 స్థానంలో ఉన్న భారత్ 11 మిలియన్ డాలర్లు అని పేర్కొన్నది. వెనుకటికెవడో మాది 101 అరకల వ్యవసాయం అని వేరే ఊరిలో గొప్పలు చెప్పాడట, మాది అంటున్నావ్ ఎవరెవరు ఏమిటి అని అడిగితే మా అయ్యగారివి వంద, నాది ఒకటి అన్నాడట. అందుకే,
వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
గనికల్ల నిజము తెలిసిన
మనుజుడేపో నీతిపరుడు మహిలో సుమతీ
దీని అర్ధం బిజెపి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీ ఏం చెప్పినా వెంటనే తొందరపడకూడదు, నిజానిజాలేమిటో బాగా పరిశీలించాలి.అది తెలుసుకున్న మనిషే భూమి మీద నిజాయితీ పరుడు. మనలో ఎందరం దీన్ని పాటిస్తున్నామో ఎవరికి వారే ఆలోచించుకోవాలి,ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి.దేన్నీ గుడ్డిగా నమ్మకు అని పెద్దలు చెబితే ప్రతిదాన్నీ ప్రశ్నించు అని వివేకానందుడు చెబితే అన్నింటినీ సందేహించు అని మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కారల్ మార్క్స్ చెప్పాడు.
