ఎం కోటేశ్వరరావు
చైనాలో ఏం జరుగుతోంది ? చాలా మందికి అర్థంగాని, గందరగోళ పరిచే ప్రశ్న. అక్కడి వ్యవస్థ, ఆర్థికరంగం గురించి గతంలో చెప్పిన, వర్తమానంలో చెబుతున్న జోశ్యాల సంగతేమిటి ? భారత ఉత్పాదక రంగ పిఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) 2023 డిసెంబరుల్లో పద్దెనిమిది నెలల కనిష్టానికి నవంబరులో ఉన్న 56 నుంచి 54.9కి తగ్గిందన్నది వార్త. ఎందుకటా కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి బలహీనంగా పెరగటం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ సూచిక 50 అంతకు మించి ఉంటే ఉత్పాదకరంగం విస్తరిస్తున్నట్లు, తగ్గితే దిగజారుతున్నట్లు లెక్క. గడచిన 30నెలలుగా 50కిపైగా నమోదు అవుతోంది. చైనాలో నవంబరులో ఉన్న 50.7పిఎంఐ డిసెంబరులో 50.8కి పెరిగిందని కాయిక్సిన్ సర్వే వెల్లడించింది.చిత్రం ఏమిటంటే చైనా ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం గడచిన ఆరునెలల్లో డిసెంబరులో ఫ్యాక్టరీ ఉత్పాదకత తగ్గింది. ప్రభుత్వం సర్వేకు ఎంచుకున్న బడా కంపెనీలకు, కాయిక్సిన్ ఎంచుకున్న చిన్న, మధ్య తరహా సంస్థలు కాస్త బాగా పని చేస్తున్నట్లు కొందరు అదీ ఇదీ రెండు సరైనవే అని చెప్పారు. చైనాలో జరుగుతున్న ఆర్థిక మార్పులు కొన్ని సమస్యలను ముందుకు తెచ్చిన మాట వాస్తవం. గతంలో శ్రామికశక్తి ఎక్కువగా ఉన్న పరిశ్రమలు, వ్యాపారాల స్థానంలో ఆధునిక ఉత్పాదక, సాంకేతిక మార్పులు ప్రవేశించాయి. ఈ కారణంగా ఉపాధి రంగం మీద కొన్ని ప్రతికూల ప్రభావాలు పడి సర్దుబాటు సమస్య తలెత్తింది. ఇది ప్రతిదేశంలోనూ జరిగిందే, జరుగుతున్నదే. ఒకనాడు మన దేశంలో సాధారణ డిగ్రీ చదువుకుంటే మెరుగైన ఉపాధి లభించేది, ఇప్పుడు అది కొరగానిదిగా మారింది.దాన్ని చేతపట్టుకొని ఉపాధి పొందలేకపోతున్నారు. అందుకే మన కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాల అభివృద్ధి(స్కిల్ డెవలప్‌మెంట్) పధకాలను అమలు జరుపుతున్నది. అది ఎంతమేరకు పనికి వచ్చేది, దానిలో శిక్షణ లేకుండా సర్టిఫికెట్లు ఇస్తూ ఎంత అవినీతి జరిగేదీ, నైపుణ్యపాలు ఎంత అన్నది వేరే సంగతి. చైనాలో పరిశ్రమల్లో వస్తున్న మార్పులు శిక్షణ సమస్యలనే ముందుకు తెస్తున్నాయి. వాటిని పరిష్కరించేదిశగా ప్రభుత్వం ఉంది అంటే కొందరికి నమ్మకం కలగటం లేదు.చైనా ఏం చెప్పినా, ఏం చేసినా నమ్మనివారు ఎప్పుడూ ఉంటారు.
మార్కెట్లో అనిశ్చితి కారణంగా జపాన్‌లో కూడా ఫ్యాక్టరీ కార్యకలాపాలు తగ్గాయి. పిఎంఐ అంతకు ముందు నెలలో ఉన్న 48.3 నుంచి డిసెంబరులో 47.9కి తగ్గింది. యాభైకంటే తక్కువగా ఉన్నప్పటికీ జపాన్ మాంద్యంలో ఉందని చెప్పరుగానీ అంతకంటే ఎక్కువ ఉన్న చైనాలో మాంద్యం ఉందని చిత్రిస్తారు. గ్లోబల్ ఎకానమీ డాట్‌కామ్ సమాచారం ప్రకారం ఉత్పత్తి, సేవారంగాల సంయుక్త పిఎంఐ వివిధ దేశాల పరిస్థితి దిగువ విధంగా ఉంది.(న అంటే నవంబరు, డి అంటే డిసెంబరు 2023గా గమనించాలి)
దేశం ×××× తాజాపిఎంఐ×× మూడునెలలక్రితం×× ఏడాది క్రితం
భారత్ ××× 57.40న ××× 60.90 ××××××× 56.70
చైనా ××× 51.60న ××× 51.70 ××××××× 47.00
జపాన్ ××× 50.40డి ××× 52.10 ××××××× 49.70
అమెరికా×× 51.00డి ××× 50.20 ××××××× 45.00
యూరో××× 47.00డి ××× 47.20 ××××××× 49.30
ఎగువ వివరాలను చూసినపుడు ఏడాది క్రితం పరిస్థితి పోల్చుకుంటే ఎక్కడ ఎలాంటి సమస్య ఉందో ఎవరికి వారు నిర్ధారణకు రావచ్చు.పిఎంఐలను బట్టే మాంద్యాల్లోకి పోయినట్లు లేదా బయటపడినట్లు పూర్తిగా చెప్పలేము. అది ఒక సూచిక మాత్రమే. చైనా, ఇతర దేశాల కంటే మనదేశ సంయుక్త పిఎంఐ ఎక్కువగా కనిపిస్తోంది. అదే వాస్తవమైతే వస్తు, సేవల ఎగుమతుల్లో అది ప్రతిబింబించాలి.2023 గణాంకాలు ఇంకా ఖరారు కానందున 2022ను ప్రామాణికంగా తీసుకుంటే ప్రపంచంలో తొలి పది వస్తు ఎగుమతి దేశాల జాబితాలో మనకు చోటు లేదు.పోనీ అంతర్గత డిమాండ్ పెరిగితే డిసెంబరు నెలలో వస్తూత్పత్తి పిఎంఐ పద్దెనిమిది నెలల కనిష్టానికి ఎందుకు తగ్గినట్లు ? విజువల్ కాపిటలిస్ట్ డాట్‌కామ్ సేకరించిన సమాచారం ప్రకారం 2022లో వివిధ దేశాల వస్తు ఎగుమతులు ఇలా ఉన్నాయి.1.చైనా 3.6లక్షల కోట్ల డాలర్లు,2.అమెరికా 2.1ల.కో.డా, 3.జర్మనీ 1.7లకోడా,4.నెదర్లాండ్స్ 965.5బిలియన్ డాలర్లు, 5.జపాన్ 746.9 బి.డా,6. దక్షిణ కొరియా 683.6బి.డా,7.ఇటలీ 656.9 బి.డా, 8. బెల్జియం 632.9 బి.డా, 9.ఫ్రాన్స్ 617.8 బి.డా,10.హాంకాంగ్ 609.9బి.డా, 11.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 598.5బి.డాలర్లుగా ఉన్నాయి.మన ఎగుమతులు 453.58బి.డాలర్లు.
ముందే చెప్పుకున్నట్లు పిఎంఐ ఒక దేశ ఆర్థికరంగ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదు. అది ఇతర దేశాల పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది.ఉదాహరణకు 2015 డిసెంబరు రెండున మింట్ పత్రిక విశ్లేషణలో వివిధ దేశాల పిఎంఐల వివరాలను ఇచ్చింది. దాని ప్రకారం జపాన్ 52.6తో అగ్రస్థానంలో ఉండగా భారత్ 50.3, తైవాన్ 49.5, వియత్నాం 49.4, దక్షిణ కొరియా 49.1,చైనా 48.6, మలేషియా 47, ఇండోనేషియా 46.6గా ఉంది. అంటే మనదేశం అప్పుడే చైనా కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్లే. అలాంటిది ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఎగుమతుల్లో ఎందుకు ఎదుగుదల లేదు.మేకిన్, మేడిన్ ఇండియాల జాడ ఎక్కడ ? పిఐబి 2022 జూలై 29న విడుదల చేసిన సమాచారం ప్రకారం 2017-18లో జిడిపిలో వస్తు ఎగుమతుల శాతం 11.4కాగా 2021-22లో 13.3శాతంగా పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల సగటు 11.78శాతం ఉంది. వస్తు, సేవల ఎగుమతులు ఈ కాలంలోనే 18.8 శాతం నుంచి 21.4శాతం మధ్య ఉన్నాయి. సగటు 19.5శాతమే ఉంది. అందువలన వాటిలో కూడా పెద్దగా పెరుగుదల లేదు.మాక్రోట్రెండ్స్ అనే పోర్టల్ నిర్వహిస్తున్న సమాచారం ప్రకారం 2004 నుంచి 2013వరకు ఏటా సగటున మన దేశ జిడిపిలో 22.1శాతం ఎగుమతులు జరిగాయి. ఈలెక్కన మోడీ ఏలుబడిలో దిగుమతులు పడిపోయినట్లా పెరిగినట్లా ?
చైనాలో మాంద్యం… ఒప్పుకొన్న జింపింగ్ అనే శీర్షికలతో పాటు అనేక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.ఆర్థికంగా చైనా ఎంతో ఇబ్బందుల్లో ఉందని వాణిజ్యాలు గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నాయని, జనాలు ఉపాధి పొందలేకపోతున్నారని, కొంత మందికి రోజువారీ అవసరాలు తీరటం లేదని వర్తమాన స్థితి గురించి దేశాధినేత షీ జింపింగ్ నూతన సంవత్సర సందేశంలో చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అసలు చైనా నేత ఏం చెప్పారు ? షీ జింపింగ్ చైనా భాషలో ఇచ్చిన సందేశాన్ని విదేశీ మంత్రిత్వశాఖ ఆంగ్లంలో అనువదించి విడుదల చేసింది. దానిలో అనేక ఆకాంక్షలను వెలిబుచ్చారు. వాటితో పాటు దిగువ మాటలను చెప్పారు.” ప్రయాణంలో మనం కొన్ని ఎదురుగాలులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొన్ని సంస్థలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నాయి.కొంత మంది పౌరులు ఉపాధిని వెతుక్కోవటంలో, మౌలిక అవసరాలను తీర్చుకోవటంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాలు వరదలు, తుపాన్లు, భూ కంపాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నాయి. ఇవన్నీ నా మదిలో అగ్రభాగాన ఉన్నాయి.”. ఈ మాటలను పట్టుకొని చైనా ఆర్థిక స్థితి గురించి చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు చేశారు. జింపింగ్ గడచిన సంవత్సరంలో చైనా ఎదుర్కొన్న అంశాలను ప్రస్తావించారు. సాధించిన విజయాలను కూడా పేర్కొన్నారు.వాటిని విస్మరించి ఇబ్బందుల్లో ఉందన్న ప్రచారం చేస్తున్నారు. దాని వలన కొంత మంది తప్పుదారి పట్టటం తప్ప చైనాకు వచ్చే నష్టమేమీ లేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే చైనా జింపింగ్ దాచేందుకు ప్రయత్నించలేదు.
ఇంతకీ అసలు మాంద్యం అంటే ఏమిటి ? చైనాలో ఆ పరిస్థితి ఉందా ? మందగమనం అంటే మాంద్యమని అర్ధమా ? న్యూయార్క్ టైమ్స్ పత్రికలో 1974లో రాసిన ఒక విశ్లేషణలో అమెరికా కార్మిక గణాంకాల కమిషనర్ జూలియస్ షిష్కిన్ ఒక భాష్యం చెప్పారు. వరుసగా రెండు త్రైమాసిక (ఆరునెలలు) కాలాల్లో వాస్తవ జిఎన్‌పి(జాతీయ మొత్తం ఉత్పత్తి) తగ్గినా, ఆరునెలల్లో పారిశ్రామిక ఉత్పత్తి పతనమైనా దాన్ని మాంద్యం అంటారు. దీని తీవ్రత నిజ జిఎన్‌పి 1.5శాతం తగ్గినపుడు, వ్యవసాయేతర ఉపాధి 15శాతం పతనమైనపుడు, నిరుద్యోగం రెండు శాతం పెరిగి ఆరుశాతం స్థాయికి చేరినపుడు, ఇక వ్యాప్తి గురించి చెప్పాల్సి వస్తే వ్యవసాయేతర రంగంలో 75శాతం పైగా పరిశ్రమల్లో ఆరునెలలు, అంతకు మించి ఉపాధి తగ్గినపుడు మాంద్యంలో ఉన్నట్లు పరిగణించాలని షిష్కిన్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితి చైనాలో ఉందా ? జింపింగ్ నోట మాంద్యం అనే మాట వచ్చిందా ? కరోనా తరువాత చైనా ఆర్థికరంగం మందగమనంలో ఉంది తప్ప మాంద్యంలో కాదు.చైనాలో గడచిన నాలుగున్నర దశాబ్దాల పారిశ్రామిక విధానం వేరు, ఇప్పుడు అనుసరిస్తున్నది వేరు. తన ఉత్పత్తిని పెంచుకొనేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగమతి చేసుకున్న చైనా ఇప్పుడు స్వంతంగా రూపొందించుకున్నదానితో ఆ రంగంలో ముందున్న దేశాలతో పోటీపడేందుకు చూస్తోంది. సాంప్రదాయ పరిశ్రమల స్థానంలో ఆధునికమైనవి వస్తున్నాయి. వాటికి అవసరమైన పరిశోధన-అభివృద్ధి ఖర్చులో మన వంటి దేశాలతో పోలిస్తే ఎంతో ముందున్నా ధనికదేశాలతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉంది. దాన్ని అధిగమించే క్రమంలో ఉంది.అడ్డుకొనేందుకు పశ్చిమ దేశాలు చూస్తున్నాయి.దానిలో భాగమే చిప్ వార్. కృత్రిమ మేథ(ఏఐ)లో పశ్చిమ దేశాలకు సవాలు విసురుతోంది. చైనా అంటే ఇష్టంలేని మీడియా సంస్థలు అక్కడ జరుగుతున్నదాని గురించి జనాలను తప్పుదారి పట్టిస్తున్నాయి. వైఫల్యాలను వారేమీ దాచటం లేదు. చైనా గురించి గతంలో చెప్పినవన్నీ అర్ధసత్యాలుగానూ అవాస్తవాలుగా తేలాయి. కూలిపోతుంది, విఫలమౌతుందని చెప్పిన జోశ్యాలన్నీ తప్పాయి. గతంలో మాదిరి రెండంకెల పెరుగుదల లేదు గానీ ధనిక దేశాల కంటే వృద్ధి రేటు అధికంగా ఉంది. అవి పతనం కానపుడు చైనాకే ఆ దుర్గతి ఎలా పడుతుంది ? ఇంత చిన్న తర్కాన్ని అర్ధం చేసుకోలేని స్థితిలో ఉన్నామా ?



